బాలకాండము

ప్రథమ సర్గము

 

బాలకాండలో ప్రథమ సర్గ
మహర్షి వాల్మీకి నారదమహామునిని ముల్లొకములలో శ్రేష్ఠుడైన నరుడు ఎవడు అని ప్రశ్నించుట దానికి సమాధానముగా నారద మహాముని ఇక్ష్వాకు వంశములోని శ్రీరాముని కథ వివరించుట . ఆ కథ వివరించి దానికి ఫలశ్రుతి కూడా చెపుతాడు .

ఈ సంక్షిప్త రామాయణము వంద శ్లోకములలో చెప్పబదినది. ఆ సంక్షిప్త రామాయణము సంపూర్ణముగా ఈ సంచికలో అందిస్తున్నాము

సంస్కృత శ్లోకాలమీద ఆశక్తి లేని వారకోసము ప్రథమ సర్గ అనగా నారదమహమునిచే చెప్పబడిన సంక్షిప్త రామాయణము గద్య స్వరూపములో కూడా సమర్పించబదినది

For telugu Home page

click here

 

ఓమ్
శ్రీరామాయనమః
శ్రీమద్వాల్మీకి రామాయణము
బాలకాండము
ప్రథమ సర్గము
సంక్షిప్త రామాణము

ఓమ్ తపస్స్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాం వరమ్ |
నారదం పరిపృచ్ఛ వాల్మీకిర్మునిపుంగవమ్ ||

తా|| తపస్వీ మరియు వాగ్విదులలో శ్రేష్ఠుడు , వేదాధ్యయననిరతుడు ముని శేఖరుడు అయిన నారదుని తపస్వి అయిన వాల్మీకి మహర్షి ఇట్లు ప్రశ్నించెను.

కోన్ అస్మిన్ సాంప్రతం లోకే గుణవాన్ కశ్చ వీర్యవాన్ |
ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ సత్యవాక్యో దృఢవ్రతః ||
చారిత్రేణ చ కో యుక్తః సర్వభూతేషు కో హితః |
విద్వాన్ కః కః సమర్థశ్చ కః ఏక ప్రియదర్శనః ||
ఆత్మవాన్ కో జితక్రోధో ద్యుతిమాన్ కోనసూయకః |
కస్య బిభ్యతి దేవాశ్చ జాతరోషస్య సంయుగే ||
ఏతదిచ్ఛామ్యహం శ్రోతుం పరం కౌతూహలం హి మే |
మహర్షే త్వం సమర్థోసి జ్ఞాతుమేవం విధం నరమ్ ||

తా|| ఈ సమస్త లోకములలో సకల సద్గుణ సంపన్నుడు ధర్మజ్ఞుడు , సత్యవాక్యుడు , దృఢసంకల్పము గలవాడు ఎవడు ?సర్వభూతములకు హితము కోరువాడు , విద్వాంసుడు , సమర్థుడు , ప్రియదర్శనుడు, ధైర్యశాలియు, క్రోధమును జయించినవాడు ఏవడు ? శోభలతో విలసిల్లువాడు , అసూయలేనివాడు కుపితుడైనచో దేవాసురలను సైతము భయకంపితులను జేయగలవాడు ఎవడు ? ఓ మహర్షీ ! ఆట్టి మహపురుషుని గురించి తెలిసికొనుటకు మిక్కిలి కుతూహలముతో నున్నాను. ఓ మహర్షీ ! మీరు సర్వజ్ఞులు అట్టి మహపురుషుని గురించి తెలుపుటకు సమర్థులు !'

శ్రుత్వా చైతత్ త్రిలోకజ్ఞో వాల్మికేర్నారదో వచః |
శ్రూయతామితి చామంత్ర్య ప్రహృష్టో వాక్యమబ్రవీత్ ||

తా|| త్రిలోకజ్ఞుడైన నారదుడు వాల్మికి చెప్పిన మాటలను విని సంతసించి ఇట్లు పలికెను .

బహవో దుర్లభాశ్చైవ యే త్వయా కీర్తితా గుణాః |
మునే వక్ష్యామ్యహం బుధ్వా తైర్యుక్తః శ్రూయతామ్ నరః ||

ఇక్ష్వాకువంశప్రభవో రామో నామ జనైః శ్రుతః |
నియతాత్మా మహోవీర్యో ద్యుతిమాన్ ధృతిమాన్ వశీ ||

బుద్ధిమాన్ నీతిమాన్ వాగ్మీ శ్రీమాన్ శత్రు నిబర్హణః |
విపులాంసో్ మహాబాహుః కంబుగ్రీవో మహా హనుః ||

మహోరస్కో మహే ష్వాసో గూఢజత్రుః అరిందమః |
ఆజానుబాహుః సుశిరాః సులలాటః సువిక్రమః ||

సమః సమవిభక్తాంగః స్నిగ్ధవర్ణః ప్రతాపవాన్ |
సీనవక్షా విశాలాక్షో లక్ష్మీవాన్ శుభలక్షణః ||

తా|| ఓ మునివర్యా ! నీ చేత కీర్తింపబడిన బహువిధములైన గుణములు ఒకరియందే యుండట సాధారణముగా దుర్లభము. అయిననూ నాకు తెలిసినంత వరకు అట్టి గుణములుగల ఉత్తమపురుషుని గురించి తెలిపెదను వినుము. ఇక్ష్వాకువంశము మిక్కిలి ప్రసిద్ధిగాంచినది. ఆ వంశములోని శ్రీరాముడు మనోనిగ్రహము కలవాడు, మహావీరుడు, మహాతేజస్వి, ధైర్యశాలి, జితేంద్రియుడు, బుద్ధిమంతుడు, నీతిశాస్త్రము తెలిసినవాడు, వాక్చాతుర్యము గలవాడు , శ్రీమంతుడు, శత్రువులను సంహరించువాడు ఎత్తైన భుజములు గలవాడు, బలిష్ఠమైన బాహువులు కలవాడు, శంఖములాంటి కంఠము కలవాడు, ఉన్నతమైన హనువులు కలవాడు , విశాలమైన వక్షస్థలము గలవాడు , అద్భుతమైన ధనస్సు కలవాడు , గూఢముగా నున్న జత్రువులు కలవాడు , అంతఃశత్రువులను అదుపుచేయగలవాడు , ఆజానుబాహువు, సుశిరము గలవాడు , సులలాటము గలవాడు, సువిక్రముడు, సమముగా అంగసౌష్ఠవము గలవాడు, స్నిగ్ధవర్ణుడు, పరాక్రమవంతుడు , సీనవక్షుడు, విశాలాక్షుడు , శుభలక్షణములు గలవాడు ".

ధర్మజ్ఞః సత్యసంధశ్చ ప్రజానాంచ హితే రతః |
యశస్వీ జ్ఞానసంపన్నః శుచి ర్వస్యః సమాధిమాన్ ||

ప్రజాపతిసమః శ్రీమాన్ ధాతా రిపునిషూదనః |
రక్షితా జీవలోకస్య ధర్మస్య పరిరక్షితా ||

రక్షితా స్వస్య ధర్మస్య స్వజనస్య చ రక్షితా |
వేద వేదాంగ తత్వజ్ఞో ధనుర్వేదే చ నిష్ఠితః ||

సర్వ శాస్త్రార్థతత్వజ్ఞః స్మృతిమాన్ ప్రతిభానవాన్ |
సర్వలోకప్రియః సాధుః అదీనాత్మా విచక్షణః ||

తా|| ధర్మజ్ఞుడు , సత్యసంధుడు , ప్రజలయొక్క హితము కోరువాడు , యశస్వీ , జ్ఞానసంపన్నుడు, శుచిమంతుడు, ప్రజాపతితో సమానమైనవాడు , విష్ణువుతో సమానమైనవాడు , శత్రువులను హరించువాడు , జీవ లోకములను రక్షించువాడు, ధర్మమును ఆచరించుచూ ధర్మమును రక్షించువాడు, స్వధర్మమును పాటించువాడు, తనను ఆశ్రయించినవారిని రక్షించువాడు, వేద వేదాంగముల తత్వము తెలిసినవాడు , ధనుర్వేదములో ఘనుడు , సర్వశాస్త్రముల అర్థము తత్వము తెలిసినవాడు , స్మృతిమంతుడు, ప్రతిభావంతుడు, సమస్తలోకమునకు ప్రీతిపాత్రుడు , విచక్షణ గలవాడు ,

సర్వదాభిగతః సద్భిః సముద్ర ఇవ సిందుభిః |
ఆర్యః సర్వసమశ్చైవ సదైవ ప్రియదర్శనః ||

స చ సర్వ గుణోపేతః కౌసల్యా నంద వర్ధనః |
సముద్ర ఇవ గాంభీర్యే ధైర్యేన హిమవానివ ||

విష్ణూనా సదృశో వీర్యే సోమవత్ ప్రియదర్శనః |
కాలాగ్ని సదృశః క్రోధే క్షమయా పృథివీ సమః ||
ధనదేన సమస్త్యాగ్రే సత్యే ధర్మ ఇవాపరః ||

తా|| నిరంతరము నదులు సముద్రములో కలిసినటుల సత్పురుషులు శ్రీరాముని చేరుచుందురు . అతడు ఆర్యుడు. ఆందరి ఎడల సమభావముతో నుండువాడు. ఏల్లవేళలో ప్రియమైన దర్శనము ఇచ్చువాడు. కౌసల్యానందుడైన శ్రీరాముడు అన్ని గుణములతో విలసించుచున్నవాడు. సముద్రమువలె గంభీరమైనవాడు. ధైర్యములో హిమవంతుడు. పరాక్రమములో విష్ణునితో సమానమైనవాడు. చంద్రునివలె ప్రియమైన దర్శనమిచ్చువాడు . క్రోధములో కాలాగ్నితో సమానమైనవాడు. సహనమున భూదేవితో సమానమైనవాడు. కుబేరునివలె త్యాగబుద్ధి కలవాడు. సత్యపాలనమున ధర్మదేవత వంటి వాడు.

తమేవం గుణసంపన్నం రామం సత్య పరాక్రమం |
జ్యేష్ఠః శ్రేష్ఠగుణైర్యుక్తం ప్రియం దశరథస్సుతమ్ ||

ప్రకృతీనాం హితైర్యుక్తం ప్రకృతి ప్రియకామ్యయా |
యౌవరాజ్యేన సంయోక్తుం ఇచ్చత్ ప్రీత్యా మహీపతిః ||

తా|| సత్యపరాక్రమవంతుడైన శ్రీరాముడు ఈ విధముగా అనేక గుణములతో సంపన్నుడు. జ్యేష్ఠుడు , శ్రేష్ఠ గుణములతో సంపన్నుడు. ఆతడు దశరథుని యొక్క ప్రియపుత్రుడు. దశరథుడు ప్రకృతి ( మంత్రివర్గము) చే చెప్పబడిన హితము ననుసరించి ప్రకృతి ( ప్రజల) హితము కొరకై శ్రీరాముని యువరాజ పట్తభిషిక్తునిగా చేయుటకు సిద్ధపడెను.

తస్యాభిషేక సంభారాన్ దృష్ట్వా భార్యాsధ కైకేయీ |
పూర్వం దత్తవరా దేవీ వరం ఏనమ్ అయాచత |
వివాసనంచ రామస్య భరతస్యాభిషేచనమ్ ||

తా|| ఆ అభిషేక సన్నాహములను దశరథుని భార్య కైకేయి తెలిసికొనెను. పూర్వము దశరథుడు కైకేయికి వరములను ఇచ్చెను. ఆమె శ్రీరాముని వనము పంపమని , భరతుని పట్టాభిషేకము చేయమని, రెండు వరములను కోరెను.

స సత్యవచానాద్రాజా ధర్మ పాశేన సంయుతః |
వివాసయామాస సుతం రామం దశరథః ప్రియమ్ ||

స జగామ వనం వీరః ప్రతిజ్ఞాం అనుపాలయన్ |
పితుర్వచన నిర్దేశాత్ కైకేయ్యాః ప్రియకారణాత్ ||

తా|| సత్యసంధుడైన ఆ దశరథ మహారాజు ధర్మపాశములచేత బంధింపబడి ప్రియ సుతుడైన రాముని వనములకు పంపవలసివచ్చెను. పితృవాక్యపరిపాలనకు తాను చేసిన ప్రతిజ్ఞను అనుసరించి కైకేయికి ప్రియముగూర్చుటకై అ వీరుడు వనవాసమునకు బయలుదేరెను,

తం వ్రజంతం ప్రియో భ్రాతా లక్ష్మణోనుజగామ హ|
స్నేహాద్వియసంపన్నః సుమిత్రానందవర్ధనః ||
భ్రాతరం దయితో భ్రాతుః సౌభ్రాత్ర మనుదర్శయన్ |||

తా|| ఆవిధముగా వనములకు పోవుచున్న అ రాముని సోదరుడగు లక్ష్మణుడు అనుసరించెను. సుమిత్ర సుతుడైన ఆ లక్ష్మణుడు మిక్కిలి వినయసంపన్నుడు. రామునికి ప్రియ సోదరుడు. రామునియందు భక్తి తత్పరుడు.

రామస్య దయితా భార్యా నిత్యం ప్రాణ సమాహితా |
జనకస్య కులే జాతా దేవమాయేవ నిర్మితా ||
సర్వ లక్షణ సంపన్నా నారీణాం ఉత్తమావధుః |
సీతా అపి అనుగతా రామం శశినం రోహిణీ యథా ||

తా|| శ్రీరామునకు ధర్మపత్ని , నిత్యము ప్రాణముతో సమానురాలు , జనకుని పుత్రిక అయిన సీతాదేవి దేవమాయ వలె పుట్టింపబడినది. సర్వలక్షణములతో సంపన్నురాలు , స్త్రీలలో ఉత్తమమైన వధువు . అట్టి ఆమె చంద్రుని అనుసరించిన రోహిణివలె శ్రీరాముని అనుసరించెను.

పౌరై రనుగతో దూరం పిత్రా దశరథేన చ ||
శృంగిబేరపురే సూతం గంగాకూలే వ్యసర్జయత్ |
గుహా మాసాద్య ధర్మాత్మా నిషాదాదిపతిం ప్రియమ్||

గుహేన సహితో రామో లక్ష్మనేన చ సీతయా |
తే వనేన వనం గత్వా నదీ స్తీర్త్వా బహూదకాః ||

తా|| అయోధ్యపుర పౌరులు అదే విధముగా దశరథ మహారాజు శ్రీరాముని చాలా దూరము అనుగమించిరి. శ్రీరాముడు గంగాతీరమున గల శ్రుంగిబేరపురమున తన భక్తుడు, నిషాదులకు రాజు అయిన గుహుని కలిసికొనిన పిమ్మట రథ సారథిని వెనుకకు పంపివేసెను. శ్రీరాముడు సీతాలక్ష్మణులతో గుహుని తో కలిసి వనములలో పోవుచూ జలసమృద్ధమైన గంగానదిని దాటెను.

చిత్రకూట మనుప్రాప్య భరధ్వాజస్య శాసనాత్ |
రమ్య మావసథం కృత్వా రమమాణా వనే త్రయః ||
దేవ గంధర్వ సంకాశాః తత్ర తే న్యవసన్ సుఖమ్ |||

చిత్రకూటం గతే రామే పుత్రశోకాతురస్తదా |
రాజా దశరథః స్వర్గం జగామ విలపన్ సుతమ్ ||

తా|| పిమ్మట భరద్వాజ మహర్షి ఆదేశానుసారము సీతా రామలక్ష్మణులు మందాకినీ నదీ తీరమున గల చిత్రకూటమునకు చేరిరి. అచట రమ్యమైన పర్ణశాలను నిర్మించికొని అ ముగ్గురు దేవ గంధర్వ సదృశులై ప్రశాంతముగా నివశింపసాగిరి. సీతారామలక్ష్మణులు చిత్రకూటమునకు చేరగా దశరథ మహారాజు పుత్రశోకముతో విలపించుచూ స్వర్గస్థుడాయెను.

మృతేతు తస్మిన్ భరతో వసిష్ఠప్రముఖై ర్ద్విజైః |
నియుజ్యమానో రాజ్యాయ నైచ్ఛద్రాజ్యం మహాబలః ||

స జగామ వనం వీరో రామపాద ప్రసాదకః |

గత్వా తు సుమహాత్మానం రామం సత్య పరాక్రమమ్ |
అయాచత్ భ్రాత్రం రామం ఆర్య భావ పురస్కృతః ||
త్వమేవ రాజా ధర్మజ్ఞ ఇతి రామం వచో అబ్రవీత్ |||

తా|| దశరథుని మరణానంతరము వశిష్ఠుడు తదితర బ్రాహ్మణోత్తములు భరతుని రాజ్యాధికారము స్వీకరింపమని కోరిరి. అందులకు ఆ మహావీరుడు సమ్మతించలేదు. రాజ్యకాంక్షలేని ఆ భరతుడు పూజ్యుడైన శ్రీరాముని అనుగ్రహము కోరుటకు వనములకు బయలు దేరెను. ప్రసన్నహృదయుడు సత్యసంధుడు అయిన శ్రీరాముని చేరి భరతుడు మిక్కిలి పూజ్యభావముతో " ఓ ధర్మజ్ఞా , జ్యేష్ఠుడవు , శ్రేష్ఠుడవు అయిన నీవే అయోధ్యకు రాజు కాదగిన వాడవు " అని పలుకుచూ శ్రీరాముని వేడుకొనెను.

రామోపి పరమోదారః సుముఖః సుమహాయశాః |
న చైఛ్చత్ పితురాదేశాత్ రాజ్యం రామో మహాబలః ||

పాదుకే చాస్య రాజ్యాయ న్యాసం దత్వా పునః పునః |
నివర్తయామాస తతో భరతం భరతాగ్రజః ||

తా|| మిక్కిలి ఔదార్యముగలవాడు సుముఖుడు , మహాయశస్సు గలవాడు అయిన శ్రీరాముడు ప్రార్థనలను మన్నించువాడైనప్పటికీ పిత్రాదేశము అనుసరించి రాజ్యాధికారము చేపట్టుటకు ఇష్టపడలేదు. ఆప్పుడు శ్రీరాముడు తనకు ప్రతినిథిగా తనపాదుకలను భరతునికి ఇచ్చి పలువిధములుగా నచ్చజెప్పి అతనిని అయోధ్యకు పంపెను.

స కామం ఆనవాప్యైవ రామపాదవుపస్పృశన్ |
నందిగ్రామే కరోత్ రాజ్యం రామాగమన కాంక్షయా ||

గతేతు భరతే శ్రీమాన్ సత్యసంధో జితేంద్రియః |

రామస్తు పునరాలక్ష్య నాగరస్య జనస్య చ |
తత్రాగమన మేకాగ్రో దండకాన్ ప్రవివేశ హ ||

తా|| తన లక్ష్యమునెరవేరకున్నను భరతుడు రామ పాదుకలను సేవించుచూ నందిగ్రామమునందు ఉండి రామ ఆగమన ఆకాంక్షతో రాజ్యపాలన చేయసాగెను. భరతుడు తిరిగి వెళ్ళిన తరువాత జితేంద్రియుడు సత్యసంధుడైన శ్రీరాముడు తన దర్శనమునకు పౌరులు జనులు అచటికి వచ్చుచుండుట గమనించి, అది మునివర్యుల ఏకాగ్రతకు భంగము అని తలచి దండకారణ్యము ప్రవేశించెను.

ప్రవిశ్య తు మహారణ్యం రామో రాజీవ లోచనః |
విరాథం రాక్షసం హత్వా శరభంగం దదర్స హ ||
సు తీక్ష్ణం చాప్యగస్త్యంచ ఆగస్త్య భ్రాతరమ్ తథా |||

అగస్త్యవచనాచ్చైవ జగ్రాహ ఐంద్రం శరాసనమ్ |
ఖడ్గం చ పరమ ప్రీతః తూణీచాక్షయసాయకౌ ||

తా|| ఆ మహారణ్యము ప్రవేశించి రాజీవలోచనుడైన శ్రీరాముడు విరాధుడను రాక్షసుని సంహరించెను. పిమ్మట శరభంగ మహర్షిని దర్శించెను. అట్లే సుతీక్ష్ణుని, అగస్త్యమునిని, మరియు ఆయన సోదరుని దర్శించెను. ఆగస్త్యమహాముని ఆదేశానుసారము ఇంద్ర చాపమును, ఖడ్గమును , అక్షయములైన బాణములుగల తూణీరములను గ్రహించి శ్రీరాముడు పరమప్రీతుడాయెను.

వసతస్తస్య రామస్య వనే వనచరైః సహ |
ఋషయో అభ్యాగమన్ సర్వే వధాయ సు రరక్షసామ్ ||

స తేషాం ప్రతిశుశ్రావ రాక్షసానాం తథా వనే |

ప్రతిజ్ఞాతశ్చ రామేణ వధః సంయతి రక్షసాం |
ఋషిణామగ్నికల్పానాం దండకారణ్య వాసినామ్ ||

తా|| వనవాసులతో గూడి శ్రీరాముడు ఆ వనములో నివశించుచుండగా అచటి ఋషులందరూ రాక్షసులను వధింపమని కోరుటకై విచ్చేసిరి. శ్రీరాముడు వారి ప్రార్థనలను ఆలకించెను. దండకారణ్యములో వశించుచున్న అగ్నితుల్యులైన ఆ ఋషీశ్వరులకి ఆరాక్షసులను వధించుటకు ప్రతిజ్ఞచేసెను.

తేన తత్రైవ వసతా జనస్థాన నివాసినీ |
విరూపితా శూర్పణఖా రాక్షసీ కామరూపిణీ ||

తతః శూర్పణఖావాక్యాదుద్యుక్తాన్ సర్వ రాక్షసాన్ |
ఖరం త్రిశిరసం చైవ దూషణం చైవ రాక్షసమ్ ||
నిజఘాన రణే రామః తేషాం చైవ పదానుగాన్ |||

వనే తస్మిన్ నివసతా జనస్థాననివాసినామ్ |
రక్షసామ్ నిహతాన్యాసన్ సహస్రాణి చతుర్దశ ||

తా|| అచటనే జనస్థాననివాసిని అయిన శూర్పణఖ అనబడు రాక్షసి కామరూపిణి. ఆమెను వికృత రూపిణిని గావించెను ( రాముడు) . పిమ్మట శూర్పణఖ వాక్యములతో రెచ్చ గొట్ట బడిన ఖరుడు , త్రిశిరుడు , మరియు దూషణుడు కలిసి అనేకమైన రాక్షసులతో గూడి యుద్ధసన్నద్ధులై వచ్చిరి. అంతట శ్రీరాముడు ఖర త్రిశిర దూషణాదులతో సహా జనస్థాన నివాసులైన పదునాలుగువేలమంది రాక్షసులను హతమొనర్చెను.

తతో జ్ఞాతివధం శ్రుత్వా రావణః క్రోధమూర్చితః |
సహాయం వరయామాస మారీచం నామ రాక్షసమ్ ||

వార్యమాణ స్సుబహుశో మారీచేన స రావణః |
న విరోథో బలవతా క్షమో రావణ తేన తే ||

అనాదృత్య తు తద్వాక్యం రావణః కాలచోదితః |
జగామ సహ మారీచః తస్య ఆశ్రమపదం తదా ||

తా|| రావణుడు తన జ్ఞాతుల వధను గురించి విని క్రోధమూర్ఛితుడై మారీచుడను రాక్షసుని సహాయమును అర్థించెను. అప్పుడా మారీచుడు పెక్కువిధముల రావణుని శ్రీరాముడు శక్తిమంతుడు ఆయనతో విరోధము తగదని చెప్పెను. అతని వాక్యములను ఆదరించక కాలము సమీపించిన రావణుడు మారీచునితో కూడి శ్రీరాముని ఆశ్రమ సమీపమునకు చేరెను.

తేన మాయావినా దూరం అపవాహ్య నృపాత్మజౌ |
జహార భార్యాం రామస్య గృధ్రం హత్వా జటాయుషమ్ ||

గృధ్రం చ నిహతం దృష్ట్వా హృతాం శ్రుత్వా చ మైథిలీమ్ |
రాఘవః శోక సంతప్తో విలలాపాకులేంద్రియః ||

తత స్తేనైవ శోకేన గృధ్రం దగ్ధ్వా జటాయుషమ్ |

తా|| పిమ్మట మాయావి అయిన మారీచుని సహాయముతో రాజకుమారులు ఇద్దరినీ ఆశ్రమమునుండి దూరముగా పంపి రామునియొక్క భార్యను అపహిరించెను. దారిలో తనను అడ్డగించిన జటాయువుని హతమొనర్చెను. అవసాన దశలోనున్న జటాయువు రావణుడు సీతను అపహరించిన వార్తనను తెలిపి ఆ జటాయువు కన్నుమూసెను . జటాయువు మరణముతో శ్రీరాముడు శోకసంతుప్తుడై జటాయువునకు అంత్య సంస్కారములను నిర్వహించెను .

మార్గమాణో వనే సీతాం రాక్షసం సందదర్శ హ |
కబంధం నామ రూపేణ వికృతం ఘోర దర్శనమ్ ||
తం నిహత్య మహాబాహుః దదాహ స్వర్గతశ్చ సః |||

స చాస్య కథయామాస శబరీం ధర్మ చారిణీమ్ |
శ్రమణీం ధర్మనిఫుణాం అభిగచ్ఛేతి రాఘవ ||

సో భ్యగచ్ఛన్మహాతేజాః శబరీమ్ శత్రుసూదనః |
శబర్యా పూజితః సమ్యగ్రామో దశరథాత్మజః ||

తా|| సీతాదేవిని అన్వేషించుచూ మార్గములో కబంధుడను రాక్షసుని చూచెను. ఆతడు వికృతరూపముతో చూచుటకు భయంకరుడై ఉండెను. శ్రీరాముడు ఆ దానవుని హతమొనర్చి , అతని కళేబరమును దహింపజేసెను. తత్ఫలితముగా అతనికి స్వర్గప్రాప్తి కలిగెను. శాపవిముక్తుడైన కబంధుడు శ్రీరామునితో 'సమిపములో ధర్మచారిణి మరియూ భక్తురాలు అయిన శబరి కలదు . ఆమె అతిధి సత్కారములందు నిరతురాలు . అ శబరి వద్దకు వెళ్ళుము' అని పలికెను. శత్రుసూదనుడైన శ్రీరాముడు శబరి కడకు వెళ్ళెను. శబరి భక్తి శ్రద్ధలతో ఫలములను అర్పించి ఆయనను పూజించెను

పంపాతీరే హనుమతా సంగతో వానరేణ హ |
హనుమాద్వచనాచ్చైవ సుగ్రివేణ సమాగతః ||

సుగ్రీవాయ చ తత్సర్వం శంస ద్రామో మహాబలః |
ఆదితస్తద్ యథావృత్తం సీతాశ్చ విశేషతః ||

సుగ్రీవశ్చాపి తత్సర్వం శ్రుత్వా రామస్య వానరః |
చకార సఖ్యం రామేణ ప్రీతశ్చైవాగ్ని సాక్షికమ్ ||

తా|| పంపాసరస్సు తీరమున శ్రీరాముడు వానరుడైన హనుమంతుని కలిసికొనెను . ఆ వానరోత్తముని వచనములను అనుసరించి శ్రీరాముడు సుగ్రీవుని కడకు వెళ్ళెను. మహావీరుడైన శ్రీరాముడు సుగ్రీవునకు తనవృత్తాంతము అంతయును తెలిపెను. సీతా అపహరణగాధను కూడా తెలిపెను. సుగ్రీవుడు కూడా అది అంతావిని శ్రీరామునకు తోడ్పడుటవలన తనకు ప్రయోజనము కలుగునని భావించి శ్రీరామునితో అగ్ని సాక్షిగా మైత్రికి అంగీకరించెను

తతో వానర రాజేన వైరామ కథనం ప్రతి |
రామాయావేదితం సర్వం ప్రణయాద్దుఃఖితేన చ ||

ప్రతిజ్ఞాతం చ రామేణ తథా వాలి వథం ప్రతి|
వాలినశ్చ బలం తత్ర కథయామాస వానరః ||
సుగ్రీవ శ్శంకిత శ్చాసీ న్నిత్యం వీర్యేణ రాఘవే |

తా || పిమ్మట ఆ వానర రాజు దుఃఖితుడై ఉండుట గమనించి ఆ దుఃఖకారణమేమని అతనిని శ్రీరాముడు అడిగెను. అప్పుడు సుగ్రీవుడుశ్రీరామునకు తన పై వాలిక గల ప్రేమ భావములు భేదభావములు సర్వము మిక్కిలి దుఃఖము తో నివేదించెను. అనంతరము శ్రీరాముడు వాలిని వధించుటకు ప్రతిజ్ఞచేసెను. అప్పుడు సుగ్రీవుడు వాలి యొక్క అసాధారణ బలపరాక్రమములను గురించి శ్రీరామునకు నివేదించెను.

సుగ్రీవ శ్శంకిత శ్చాసీ న్నిత్యం వీర్యేణ రాఘవే |
రాఘవప్రత్యయార్ధం తు దుందుభేః కాయ ముత్తమమ్ |
దర్శయామస సుగ్రీవో మహాపర్వత సన్నిభమ్ ||

ఉత్స్మయిత్వా మహాబాహుః ప్రేక్ష్య చాస్థి మహాబలః |
పాదాంగుష్ఠేన చిక్షేప సంపూర్ణం దశ యోజనమ్ ||

బిభేద చ పునస్తాలాన్ సప్తైకేన మహేషుణా |
గిరిం రసాతలం చైవ జనయన్ ప్రత్యయం తదా ||

తా|| వాలిని హతమర్చుటకు శ్రీరామునకు గలపరాక్రమము విషయమున సుగ్రీవుని మదిలో సందేహము మెదలుచుండెను. రాఘవునకు వాలిపరాక్రమము గురించి చెప్పుటకు , దుందుభి అను రాక్షసుని కలేబరము చూపెను. మహాపర్వత సదృశమైన ఆ కళేబరము చూచి శ్రీరాముడు పాదాంగుష్ఠములతో దానిని దశయోజనముల దూరము చిమ్మెను. తన బాణముతో వరుసగనున్న ఏడు మద్దిచెట్లను సమీపమునున్న ఒక పర్వతమును రసాతలము భేదించెను. ఆ బాణము తిరిగి అదేవేగముతో తూణీరములో చేరెను.

తతః ప్రీతిమనాస్తేన విశ్వస్తః స మహాకపిః |
కిష్కింధాం రామసహితో జగామ చ గుహాం తథా ||

తతో గర్జత్ హరివరం సుగ్రీవో హేమ పింగళః |
తేన నాదేన మహతా నిర్జగామ హరీశ్వరః ||

అనుమాన్య తదా తారాం సుగ్రీవేణ సమాగతః |
నిజఘాన చ తత్రైనం శరేణైకేన రాఘవః ||

తతః సుగ్రీవ వచనాత్ హత్వా వాలినమాహవే |
సుగ్రీవమేవ తద్రాజ్యే రాఘవః ప్రత్య పాదయత్ ||

తా|| అప్పుడు ఆ సుగ్రీవుడు ప్రీతిపొందినమనస్సుతో విశ్వాసముతో శ్రీరామునితో సహా గుహవలెనున్న కిష్కింధకు వెడలెను. అప్పుడు సువర్ణ పింగళములుగల ఆ వానర శ్రేష్ఠుడు బిగ్గరగా గర్జించెను. అ మహా నాదముతో వానరరాజైన వాలి బయటికివచ్చెను. తారచేత నివారింపబడినప్పటికీ వాలి సుగ్రీవునితో తలపడెను. అప్పుడు ఒకే ఒక బాణముతో రాఘవుడు వాలిని సంహరించెను. సుగ్రీవుని ప్రార్థనను అనుసరించి సుగ్రీవుని కిష్కింధకు రాజుగా చేసెను.

స చ సర్వాన్ సమానీయ వానరాన్ వానరర్షభః |
దిశః ప్రస్థాపయామాస దిదృక్షుర్ జనకాత్మజామ్||

తతో గృధ్రస్య వచనాత్ సంపాతేర్హనుమాన్ బలీ |
శతయోజన విస్తీర్ణం పుప్లువే లవణార్ణవమ్ ||

తత్ర లంకాం సమాసాద్య పురీం రావణపాలితామ్ |
దదర్శ సీతాం ధ్యాయంతీం అశోకవనికాం గతామ్ ||

తా|| పిమ్మట ఆ వానరరాజు వానరులందరిని పిలచి వారిని సీతాన్వేషణకై అన్ని దిశలకు పంపెను. అప్పుడు మహాబలవంతుడైన హనుమంతుడు గృధ్రరాజైన సంపాతి మాటలను అనుసరించి శతయోజనముల విస్తీర్ణముగల లవణసముద్రమును దాటెను. ఆ రామబంటు రావణునిచే పాలింపబడుచున్న లంకకు చేరెను. అచట అశోకవనములో రామ ధ్యానములో నున్న సీతాదేవిని కనుగొనెను.

నివేదయిత్వా అభిజ్ఞానం ప్రవృతిం చ నివేద్య చ |
సమాశ్వాస్య చ వైదేహీం మర్దయామాస తోరణమ్ ||

తా|| శ్రీరాముడిచ్చిన ఆనవాలును సమర్పించి , రామసుగ్రీవుల మైత్రిని మరియూ రామశోకమును వివరించి ఆమెకి విశ్వాసము కలిగించి పిమ్మట అశోకవన తోరణమును ధ్వంసము చేయసాగెను.

పంచ సేనాగ్రగాన్ హత్వా సప్తమంత్రి సుతానపి |
శూరమక్షం చ నిష్పిప్య గ్రహణం సముపాగమత్ ||

అస్త్రేణోన్ముక్తం ఆత్మానం జ్ఞాత్వా పైతామహాద్వరాత్ |
మర్షయన్ రాక్షసాన్ వీరో యంత్రిణస్తాన్ యదృచ్చయా ||

తతో దగ్ధ్వా పురీం లంకాం ఋతే సీతాం చ మైథిలీమ్ |
రామాయ ప్రియమాఖ్యాతుం పునరాయాన్మహాకపిః ||
సో భిగమ్య మహాత్మానం కృత్వా రామం ప్రదక్షిణంమ్ |
న్యవేదయదమేయాత్మా దృష్ఠా సీతేతి తత్వతః ||

తా|| వాయుసుతుడు పంచ సేనాపతులను, సప్త మంత్రిసుతులను హతమార్చి శూరుడైన అక్షయకుమారుని హతమొనర్చెను. ఇంద్రజిత్తుని బ్రహ్మాస్త్రముకు లోబడెను. పిత్ర మహావరముచేత ఆ అస్త్రమునుండి విముక్తుడై నప్పటికీ ఆ ఆస్త్రమునకు బద్ధుడైయుండి రాక్షసులు పెట్టుబాధలను భరించెను. పిమ్మట సీతాదేవి వున్నస్థలము తప్ప మిగతా లంకాపురిని దగ్ధమొనరించి , సీతాదేవి కుశలవార్తను శ్రీరాముని తెలుపుటకై ఆ మహాకపి తిరిగి వచ్చెను. తిరిగి వచ్చి మహత్ముడైన శ్రీరామునికి ప్రదక్షిణ మొనర్చి సీతాదేవిని చూచితిని అని శ్రీరామునికి నివేదించెను.

తతః సుగ్రీవసహితో గత్వా తీరం మహదధేః |
సముద్రం క్షోభయామాస శరైరాదిత్యసన్నిభైః ||

దర్శయామాస చ ఆత్మానం సముద్రః సరితాం పతిః |
సముద్రవచనాచ్ఛైవ నళం సేతుమకారయత్ ||

తా|| పిమ్మట సుగ్రీవునితో సహా సముద్ర తీరమునకు చేరి సూర్యకిరణములతో సమానమైన బాణములతో సముద్రమును అల్లకల్లోలమొనర్చెను. అంతట సముద్రుడు తన నిజస్వరూపము ప్రకటించెను. పిమ్మట సముద్రుని వచనములప్రకారము నలుని ద్వారా సేతువును నిర్మించెను.

తేన గత్వా పురీం లంకాం హత్వా రావణ మాహవే |
రామస్సీతామనుప్రాప్య పరాం వ్రీడాముపాగమత్ ||

తామువాచ తతో రామః పరుషం జనసంసది |
అమృష్యమాణా సా సీతా వివేశ జ్వలనం సతీ ||

తతో అగ్నివచనాత్ సీతాం జ్ఞాత్వా విగత కల్మషామ్ |
బభౌ రామః సంప్రహృష్టః పూజితః సర్వ దైవతైః ||

తా|| ఆ సేతువు ద్వారా లంకను చేరి శ్రీరాముడు రావణుని హతమార్చెను. తదనంతరము శ్రీరాముడు సీతను సమీపించి ఆమెను స్వీకరించుటకు వెనకాడెను. అప్పుడు ఆమెతో జనసంసదిలో పరుషవచనములను పలికెను. ఆ సీతాదేవి ఆ కఠినోక్తులను భరింపజాలక అగ్నిలో ప్రవేశించెను. పిమ్మట అగ్నిదేవుని వచనములతో సీత విగతకల్మష అని తెలిసుకొని శ్రీరాముడు పరమ సంతుష్ఠుడాయెను. దేవతలందరునూ శ్రీరాముని కొనియాడిరి.

కర్మణా తేన మహతా త్రైలోక్యం స చరాచరమ్ |
స దేవర్షిగణం తుష్టం రాఘవస్య మహాత్మనః ||

అభిషిచ్య చ లంకాయాం రాక్షసేంద్రమ్ విభీషణమ్ |
కృతకృత్యస్తదా రామో విజ్వరః ప్రముమోద హ ||

దేవతాభ్యో వరం ప్రాప్య సముత్థాప్య చ వానరాన్ |
అయోధ్యాం ప్రస్థితో రామః పుష్పకేణ సుహృద్వృతః ||

తా|| మహాత్ముడైన శ్రీరాముడు చేసిన పనితో ముల్లోకముల లోని చరాచరములు దేవ ఋషిగణములు సంతోషపడిరి. పిదప శ్రీరాముడు విభీషణుని లంకారాజ్యమునకు పట్టాభిషిక్తుని గావించెను. కృతకృత్యుడైన శ్రీరాముడు ప్రసన్న మనస్సు గలవాడాయెను. దేవతలనుంచి వరముపొంది ఆ వరముతో వానరులను పునర్జీవితులను గావించెను. పిమ్మట శ్రీరాముడు పుష్పకవిమానములో అందరితో కలిసి అయోధ్యకు బయలుదేరెను.

భరద్వాజాశ్రమం గత్వా రామః సత్య పరాక్రమః |
భరతస్యాంతికం రామో హనూమంతం వ్యసర్జయత్ ||

పునరాఖ్యాయికాం జల్పన్ సుగ్రీవసహితశ్చ సః |
పుష్పకం తత్ సమారుహ్య నందిగ్రామం యయౌ తథా ||

నందిగ్రామే జటాం హిత్వా భ్రాతృభిః సహితో అనఘః |
రామః సీతా మనుప్రాప్య రాజ్యం పునరవాస్తవాన్ ||

తా|| సత్యపరాక్రమవంతుడగు శ్రీరాముడు భరద్వాజాశ్రమము చేరి హనుమంతుని భరతుని కడకు పంపెను. శ్రీరాముడు ప్రయాణ సమయమున పుష్పక విమానమును అధిరోహించి సుగ్రీవాదులకు విశేషగాధలను వారికి తెలుపుచూ నందిగ్రామము చేరెను. నందిగ్రామములో జటాదీక్షను పరిత్యజించి , తనసోదరులని కలిసికొని , సీతాదేవితో సహా పట్టభిషిక్తుడై రాజ్యాధికారమును మళ్ళీపొందెను.

ప్రహృష్టోముదితో లోకః తుష్టః పుష్టః సుధార్మికః |
నిరామయో హ్యరోగిశ్చ దుర్భిక్షభయవర్జితః ||

న పుత్రమరణం కించిత్ ద్రక్ష్యంతి పురుషాః క్వచిత్ |
నార్యశ్చా అవిధవా నిత్యం భవిష్యంతి పతివ్రతాః ||

న చాగ్నిజం భయం కించిత్ నాప్సు మజ్జంతి జంతవః |
న వాతజం భయం కించిత్ నాపి జ్వరకృతం తథా ||
న చాపి క్షుద్భయం తత్ర న తస్కర భయమ్ తథా |||
నగరాణీ చ రాష్ట్రాణి ధన ధాన్య యుతానిచ |
నిత్యం ప్రముదితాః సర్వే యథా కృతయుగే తథా ||

తా|| ప్రజలందరూ సంతోషముతో సుఖసౌభాగ్యములతో ధర్మమార్గముననే ప్రవర్తించెదరు. భయవర్జితులై దుర్బిక్షములేకుండా ఆరోగ్య భాగ్యములతో జీవించుచుందురు. ఆ రామరాజ్యములో పుత్రమరణము లేకుండును. స్త్రీలు పాతివత్రధర్మములను పాటించుచూ నిత్యసుమంగుళులై వర్ధిల్లుచుందెదరు. అగ్నిప్రమాదములు జలప్రమాదములుగాని వాయు భయములుగాని లేకుండును. అట్లే క్షుద్బాధ గాని చోరభయగాని లేకుండును. రాజ్యములోని నగరములు ఇతరప్రదేశములు ధన ధాన్యములతో తులతూగుచూ జనులు కృతయుగములో వలె ఎల్లప్పుడునూ సుఖశాంతులతో వర్ధిల్లుచుందురు.

అశ్వమేధశతైరిష్ట్వా తథా బహు సువర్ణకైః |
గవాం కోట్యయుతం దత్వా విద్వభ్యో విధిపుర్వకమ్ |
అసంఖ్యేయం ధనం దత్వా బ్రాహ్మణేభ్యో మహాయశాః ||

రాజవంశాన్ శతగుణాన్ స్థాపయిష్యతి రాఘవః |
చాతుర్వర్ణ్యం చ లోకే అస్మిన్ స్వే స్వే ధర్మే నియోక్ష్యతి ||

దశవర్ష సహస్రాణి దశవర్ష శతాని చ |
రామోరాజ్యముపాసిత్వా బ్రహ్మలోకం ప్రయాస్యతి ||

తా|| శ్రీరాముడు అనేకమైన అశ్వమేధ యజ్ఞములను సువర్ణక యాగములను చేయును. బ్రాహ్మణోత్తములకు పండితులకూ కోట్లకొలదీ గోవులను దానము చేయును. అపరితమైన దానములతో మహా యశస్సు పొందును. ఆరాఘవుడు క్షత్రియవంశమును శతగుణముల వృద్ధిపరచును . నాలుగు వర్ణములవారిని తమతమ వర్ణధర్మముల ప్రకారము నడిపించును. శ్రీరాముడు పదివేల సంవత్సరములు తరువాత పదివందల సంవత్సరములు ప్రజానురంజకముగా పాలించి అనంతరము బ్రహ్మలోకమును చేరును.

ఇదం పవిత్రం పాపఘ్నం పుణ్యం వేదైశ్చ సమ్మితమ్ |
యః పఠేద్రామచరితం సర్వపాపైః ప్రముచ్యతే ||

ఏతదాఖ్యాన సమాయుష్యం పఠన్ రామాయణం నరః |
సపుత్రపౌత్రః సగణః ప్రేత్య స్వర్గే మహీయతే ||

తా|| ఈ రామచరితము పవిత్రమైనది పాపములను రూపుమాపును మరియు పుణ్యసాధనము. వేదసారముతో సమ్మితమైనది. ఈ రామ చరితము ప్రతిదినము పఠించువారు సర్వపాపములనుంచి విముక్తులగుదురు. ఈ రామాయణము పఠించువారికి ఆయుష్యాభివృద్ధి కలుగును. వారి పుత్ర పౌత్రులకు పరివారములకు క్షేమలాభములు ప్రాప్తించును. అంత్యకాలమున మోక్షప్రాప్తి కలుగును.

పఠన్ ద్విజో వాగృషభత్వ మీయాత్
స్యాత్ క్షత్రియో భూమిపతిత్వ మీయాత్ |
వణిగ్జనః పణ్యఫలత్వ మీయాత్
జనశ్చ శూద్రో అపి మహత్వమీయాత్ ||

తా|| ఈ రామాయణము పఠించిన ద్విజులు వేదవేదాంగములలో శాస్త్రముల లో పండితులగుదురు . క్షత్రియులు రాజ్యాధికారముపొందుదురు. వణిజులు వ్యాపార లాభములను పొందుదురు. శూద్రులు తోడివారిలో శ్రేష్ఠులగుదురు .

ఇత్యార్షే శ్రీమద్రామాయణే
వాల్మీకియే ఆది కావ్యే బాల కాండే
ప్రధమసర్గః
సమాప్తము ||

వాల్మీకి విరచిత శ్రీమద్రామాయణములోని బాలకాండలో ప్రథమ సర్గము సమాప్తము ||

|| ఒమ్ తత్ సత్ ||


om tat sat