Srimad Valmiki Ramayanam
Balakanda Chapter 12
Aswamedha Yaga .
With Sanskrit text in Devanagari , Telugu and Kannada
తతః కాలే బహుతిథే కస్మింశ్చిత్ సుమనోహరే |
వసంతే సమనుప్రాప్తే రాజ్ఞోయష్టుం మనోsభవత్ ||
తా|| చాలాకాలము తరువాత మనోహరమైన వసంత ఋతుప్రారంభమున ఒకానొక శుభ తిథిన దశరథమహారాజు అశ్వమేధయాగము చేయుటకు సంకల్పించెను.
బాలకాండ
పన్నెండవ సర్గము
చాలాకాలము తరువాత మనోహరమైన వసంత ఋతుప్రారంభమున ఒకానొక శుభ తిథిన దశరథమహారాజు అశ్వమేధయాగము చేయుటకు సంకల్పించెను.
పిమ్మట దివ్యతేజశ్శాలి అయిన ఆ ద్విజోత్తమునికి ప్రణమిల్లి ఆయన అనుగ్రహముపొంది పుత్త్ర సంతానప్రాప్తి ద్వారా వంశాభివృద్ధి కొఱకై చేయబడు యజ్ఞమునకు ఋత్విజునిగా వుండుటకు ఆయనను అభ్యర్థించెను.
అటులనే అని సమ్మతించి రాజుతో 'యజ్ఞద్రవ్యములను సిద్ధముచేయుడు. యజ్ఞాశ్వమును విడువుడు ' అని పలికెను.
అంతట మంత్రిసత్తముడైన సుమంత్రునితో ఇట్లు పలికెను." ఓ సుమంత్రా! వేదపండితులూ ఋత్విజులూ అయిన సుయజ్ఞుని , వామదేవుని, జాబాలినీ, కాశ్యపుని, పురోహితుడైన వసిష్ఠుని అట్లే తదితర బ్రాహ్మణోత్తములనూ శీఘ్రముగా తేసుకొని రమ్ము" అని.
అప్పుడు త్వరగా పోగల సుమంత్రుడు త్వరగాపోయి వేదపండితులైన బ్రాహమణోత్తములందరినీ తీసుకు వచ్చెను. దశరథ మహారాజు వారిని అందరినీ సత్కరించి ధర్మముతో కూడిన వచనములతో ఇట్లు పలికెను.
'పుత్రులకొఱకై లాలసపడుచున్ననాకు సుఖములేకున్నది. అందుకై అశ్వమేధయజ్ఞము చేయటకు సంకల్పించితిని. ఆ యజ్ఞమును యథావిథముగా చేయ గోరుచున్నాను. ఈ ఋషిపుత్త్రుని ప్రభావమువలన నా కోరికలు సిద్దించును'
పిమ్మట వసిష్ఠుడు మొదలగు ప్రముఖ బ్రాహ్మణోత్తములందరు "బాగు బాగు" అని అభినందించిరి. ఋష్యశృంగుడు మొదలగు విప్రులు ఆ రాజుతో, ' యాగమునకు కావలసిన వస్తువులను తెప్పించుడు , యజ్ఞాశ్వమును విడువుడు . పుత్త్రప్రాప్తికై అశ్వమేధయజ్ఞము చేయవలనని కలిగిన సత్సంకల్పము వలన అమిత పరాక్రమశాలురైన నలుగురు కుమారులను పొందెదవు '
ఆ బ్రాహ్మణోత్తముల చెప్పిన మాటలతో సంతోషపడి ఆనందముతో అమాత్యులతో ఈ శుభవచనములను పలికెను. ' గురువుల ఆదేశము ప్రకారము శీఘ్రముగా కావలసిన సస్తువులను తెప్పించుడు. ఋత్విజులు ముందు పోవుచుండగా సమర్థులైన యోధులతో యజ్ఞాశ్వమును విడువుడు.'
'సరయూనది ఉత్తరభాగమున యజ్ఞభూమిని సిద్ధపరచుడు. క్రమము తప్పకుండా శాస్త్రోక్తముగా విఘ్న నివారకములైన శాంతి కర్మలను జరిపించుడు. కష్టములు అపచారములు లేనిచో మహీపతులందరూ ఈ యజ్ఞము ను అచరించెడివారే. విద్వాంసులైన బ్రహ్మరాక్షసులు యజ్ఞకార్యములోని దోషములు వెదుకుచూ యజ్ఞము భంగపరచుటకు యత్నించుచుందురు. యజ్ఞములో దోషములున్నచో యజ్ఞకర్త నశింఛును. అందువలన ఈ యజ్ఞము యథావిధిగా సమాప్తమగునట్లు చూడుడు. కార్యనిర్వహణలో మీరు మిక్కిలి సమర్థులు'.
అటులనే అని ఆ మంత్రులందరూ రాజాజ్ఞలను సక్రమముగా నిర్వర్తించిరి. పిమ్మట ఆ బ్రాహ్మణోత్తములందరూ రాజును కొనియాడి ఆ రాజుయొక్క అనుజ్ఞ తీసుకొని తమ తమ నివాసములకేగిరి .
అ విప్రులందరూ వెళ్ళిన పిమ్మట ఆ రాజు మంత్రులనందరిని పంపివేచి తాను తన ప్రాసాదమునకు ఏగెను.
ఇంతటితో బాలకాండ పన్నెండవ సర్గ సమాప్తము
||ఓమ్ తత్ సత్||
గతేష్వథ ద్విజాగ్ర్యేషు మంత్రిణస్తాన్ నరాధిపః |
విసర్జయిత్వా స్వం వేశ్మ ప్రవివేశ మహాద్యుతిః ||
తా|| అ విప్రులందరూ వెళ్ళిన పిమ్మట ఆ రాజు మంత్రులనందరిని పంపివేచి తాను తన ప్రాసాదమునకు ఏగెను.
||ఓమ్ తత్ సత్ ||
|| om tat sat ||