Srimad Valmiki Ramayanam

Balakanda Chapter 13

Aswamedha Yaga-2.

With Sanskrit text in Devanagari , Telugu and Kannada

పునః ప్రాప్తే వసంతేతు పూర్ణః సంవత్సరోsభవత్ |
ప్రసవార్థం గతో యష్టుం హయమేధేన వీర్యవాన్ ||

'ఆ మహావీరుడు వంశాభివృద్ధికి కొఱకు అశ్వమేధయజ్ఞము మొదలుపెట్టిన తరువాత మళ్ళీ సంవత్సరము పూర్తి అయి వసంతఋతువు ప్రారంభమాయెను'

బాలకాండ
పదమూడవ సర్గము

ఆ మహావీరుడు వంశాభివృద్ధికి కొఱకు అశ్వమేధయజ్ఞము మొదలుపెట్టిన తరువాత మళ్ళీ సంవత్సరము పూర్తి అయి వసంతఋతువు ప్రారంభమాయెను.

వసిష్ఠునికి అభివాదమొనరించి యథావిధముగా పూజించి ఆ ద్విజోత్తమునితో ఇట్లు పలికెను. ' ఓ ముని పుంగవ యజ్ఞమును విఘ్నములు కలుగకుండా దోషములులేకుండా యథోక్తముగా జరిపించుడు. పూజ్యులైన మీరు మాకు అప్తమిత్రులు. శ్రేయోభిలాషులు, పరమ గురువులు . కావున ఈ యజ్ఞ నిర్వహణ భారమంతయూ మీదే' .

అటులనే అని ఆ ద్విజసత్తముడు " మీరు కోరిన రీతిగానే చేయుదము" అని పలికెను. పిమ్మట యజ్ఞకర్మలో నియుక్తులైన పెద్దలను, ధార్మికోత్తములను , కార్యనిర్వహణలో నిమగ్నులైనవారినీ, శిల్పకారులనూ, ఇటుకలుమున్నగువి సిద్ధపరచువారినీ, లేఖకులను అదేవిధముగా నటినటులను నర్తకులను , సచ్ఛరిత్ర గలవారి్ని , వేదాధ్యయనము చేసిన వారినీ, సమస్తము తెలిచినవారిని పిలిచి వారితో ఇట్లనెను. " మీరు అందరునూ రాజాజ్ఞ వహించి యజ్ఞ కార్యములో నిమగ్నులు కండు. వేలకొలది ఇటుకలను తెప్పింపుడు. యజ్ఞమున కు వచ్చు రాజులకు వసతులను నిర్మింపుడు. బ్రాహ్మణులకు వందలకొలదీ వసతులను ఏర్పరచుడు,అందు వివిధములైన భక్ష్యాన్నపానములను సమకూర్చుడు "

అదేవిధముగా పురజనులకు నివాస స్థలములను అనేక విధములైన భక్ష్యములను , అన్నిరకములైన్ సౌకర్యములను విస్తారముగా సమకూర్పవలెను . అలాగే జానపదవాసులకూ కూడా ఏవిధముగా అనాదరము చూపక అత్యంత శోభతో భక్ష్యాన్నములను సత్కరించి ఈయవలెను .

అన్ని వర్ణములవారికీ యథావిధిగా పూజించి సత్కారము చేయవలెను. కామక్రోధములకు లోనై ఎవరినీ అవమానము చేయరాదు. యజ్ఞమునకు సంబంధించిన పనులలో నియమించబడిన శిల్పులను తదితరులను వారి వయస్సును అర్హతనూ పాటించుచూ గౌరవింపవలెను. వారందరినీ ధనముతోనూ భోజనములతోనూ తృప్తి పరచవలయును. అన్ని కార్యములూ చక్కగా చేయ వలెను ఏట్టి లోపములేకుండా సంతోషముగా ప్రేమతో చేయవలెను".అని

వారందరునూ కలిసి వశిష్ఠునితో ఇట్లు చెప్పిరి. " ఏట్టిలోటును రానీయక మీ ఆదేశములప్రకారమే చేసితిమి. ఇక మీదట కూడా మీ ఆజ్ఞలను ఏలోపము వాటిల్లకుండా పాటించెదము "

పిమ్మట వసిష్ఠ మహర్షి సుమంత్రుని పిలిచి ఇట్లు చెప్పెను. " వేలకొలదీ బ్రాహ్మణులనూ , క్షత్రియులనూ, వైశ్యులనూ , శూద్రులనూ ఆన్ని దేశములనుంచి ప్రజలను ఆహ్వానింపుము.

మిథిలాపతి అయిన జనకుడు శూరుడు సత్యసంధుడు సర్వాశాస్త్రములయందును వేదములలోనూ నిష్ఠ గలవాడు, మహాపురుషుడు కనుక ఆయనను స్వయముగా వెళ్ళితీసుకురామ్ము. పూర్వము గల అనుబంధము బట్టి ఆయన గూర్చి చెప్పుచున్నాను.

అదేవిధముగా ఎల్లప్పుడూ మధుర భాషి , రాజుగారి ఆప్తమిత్రుడు అయిన కాశీరాజుని స్వ్యముగా పిలువుము. రాజుగారి మామయు పరమధార్మికుడు పెద్దవాడునూ అయిన కేకయరాజుని అయన పుత్రునితో సహా ఆహ్వానింపుము. అంగదేశాధిపతియూ సత్పురుషుడూ పూజ్యుడు గొప్ప కీర్తి ప్రతిష్ఠలు కలవాడగు రోమపాదుని సాదరముగా ఆహ్వనింపుము. ప్రాచీనులైన సింధు సౌవీర , సౌరాష్ట్ర దేశాధిపతులను దక్షిణ దేశముల ప్రభువులనూ అందరినీ ఆహ్వానింపుము. ఇంకనూ ఈ భూమండలమున దశరథ మహారాజుకి మిత్రులైన రాజులనందరినీ సపరివార సమేతముగా వచ్చునట్లు త్వరగా ఆహ్వానింపుము.

వసిష్ఠుని ఆదేశము అనుసరించి సుమంత్రుడు రాజులను ఆహ్వానించుటకై ఆంతరంగికులైన పురుషులను వెంటనే ఆయా దేశములకు పంపెను. బుద్ధిశాలి అయిన సుమంత్రుడు వసిష్ఠమహర్షి ప్రత్యేకముగా పేర్కొనిన మహీపాలురను స్వయముగా తీసుకొనివచ్చుటకై వెంటనే బయలు దేరెను.

యజ్ఞ క్కార్యములలో నియమించబడిన వారందరూ వారు చేసిన పనులను ధీశాలిఅయిన వసిష్ఠునకు నివేదించిరి. సంతుష్ఠుడై అ విప్రోత్తముడు ఇట్లు పలికెను. " ఎవరికైననూ ఎదైననూ ఇచ్చునప్పుడు అనాదరము చూపరాదు. పరిహాసము చేయరాదు . చులకన భావము తో చేసిన దానము వలన దాతకు హాని కలుగును . ఇందులకు సందేహములేదు."

అంతట కొన్ని దినముల పిమ్మట రాజులందరూ శ్రేష్ఠములైన రత్నములను మణులను కానుకలుగా ఇచ్చుటకు తీసుకొనివచ్చిరి

అంతట వశిష్ఠమహాముని సంతుష్ఠుడై దశరథునితో ఇట్లు పలికెను." ఓ రాజా మీ ఆహ్వనముననుసరించి రాజులందరూ విచ్చేసిరి. వారందరికి తగినరీతిగా సత్కారము జరిపితిని. యజ్ఞమునకు నియుక్తులైన వారదరూ యజ్ఞమునకు అవసరమైన వస్తువులను సమకూర్చిరి. తీసుకురాబడిన ఉపకరనములు తగిన ప్రదేశములో ఉంచబడినవి.సమీపముననే యున్న ఈ శాలకు యజ్ఞము ఆచరించ్చుటకై విచ్చేయుడు.ఓ రాజా సంకల్పమాత్రముననే అతిశీఘ్రముగా నిర్మింపబడిన ఈ శాలను తిలకింపుడు "

అంతట వసిష్ఠ ఋష్యశౄంగుల ఇద్దరి వచనముల ప్రకారము ఒక శుభ దినమున శుభ నక్షత్రమున దశరథమహారాజు యజ్ఞశాలకు బయలుదేరెను . యజ్ఞవాటికకు శ్రీమతులతో సహా ఆ చేరి శాస్త్రానుసారము యథావిథిగా ఆ మహరాజు దీక్షగైకొనెను

|| ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే త్రయోదశ స్సర్గః ||
|| సమాప్తం ||

శ్రీమాంశ్చ సహపత్నీభీ రాజా దీక్షాముపావిశత్ ||
తా|| యజ్ఞవాటికకు శ్రీమతులతో సహా ఆ చేరి శాస్త్రానుసారము యథావిథిగా ఆ మహరాజు దీక్షగైకొనెను

|| om tat sat ||