శ్రీమద్వాల్మీకి రామాయణము

బాలకాండ , 18 వ సర్గము

శ్రీరామ జననం ! !

With Sanskrit text in Devanagari, Telugu and Kannada

బాలకాండ
పదునెనిమిదవ సర్గము
( శ్రీరామ జననం )

నిర్వృత్తే తు క్రతౌ తస్మిన్ హయమేధే మహాత్మనః|
ప్రతిగృహ్యా సురా భాగాన్ ప్రతిజగ్ముః యథాగతమ్ ||

తా|| మహాత్ముడైన దశరథ మహారాజు ప్రారంభించిన అశ్వమేథ పుత్త్రకామేష్టి క్రతువులు ముగిసినవి . దేవతలు అందరూ తమతమ హవిర్భాగములు స్వీకరించి స్వస్థానములకు చేరిరి.

సమాప్త దీక్షా నియమః పత్నీగణ సమన్వితః |
ప్రవివేశ పురీం రాజా సభృత్యబలవాహనః ||

తా|| యజ్ఞదీక్షానియమములు పూర్తికాగానే సేవకులు సైనికులు వాహనములు వెంటరాగా రాజు రాణులతో గూడి పురమున ప్రవేశించెను.

యథార్హం పూజితస్తేన రాజ్ఞా వై పృథివీశ్వరాః |
ముదితాః ప్రయయుర్దేశాన్ ప్రణమ్య మునిపుంగవమ్ ||
శ్రీమతాం గచ్ఛతాం తేషాం స్వపురాణి పురాత్తతః |
బలాని రాజ్ఞాం శుభ్రాణి ప్రహృష్టాని చకాశిరే ||

తా|| యజ్ఞమునకు విచ్చేసిన దేశాధిపతులందరినీ వారి వారి యోగ్యతలనుసరించి సమ్మానించెను. వారును మిక్కిలి సంతోషించి మునిపుంగవుడైన వశిష్ఠమహర్షి కి నమస్కరించి తమతమ దేశములకు బయలు దేరిరి. తమ నగరములకు పోవుచున్న ఆ శ్రీమంతులైన రాజులయొక్క సైనికులు దశరథుడు ఇచ్చిన వస్త్రాభరణముల తో సంతసించినవారై చక్కగా భాసిల్లిరి.

గతేషు పృథివీశేషు రాజా దశరథస్తదా |
ప్రవివేశ పురీం శ్రీమాన్ పురస్కృత్య ద్విజోత్తమాన్ ||

తా|| రాజులందరూ వెళ్ళిన పిమ్మట శుభలక్షణసంపన్నుడైన దశరథుడు వశిష్ఠాది మహర్షులు ముందునకు సాగిపోవుచుండగా పురమున ప్రవేశించెను.

శాంతయా ప్రయయౌ సార్థం ఋష్యశృంగస్సుపూజితః |
అన్వీయమానో రాజ్ఞాsథ సానుయాత్రేణ ధీమతా ||

తా|| నగరప్రవేశానంతరము దశరథుడు ఋష్యశృంగుని సాదరముగా పూజించెను. పిమ్మట ఆ మహర్షి తన భార్యయైన శాంతతో గూడి ప్రయాణమయ్యెను . ధీశాలిఅయిన రోమాపాదుడు ఆయనను సపరివారముగా అనుసరించెను. వాఱినందరిని దశరథుడు కొంతదూరము అనుసరించి వీడ్కొలిపెను.

ఏవం విసృజ్య తాన్ సర్వాన్ రాజా సంపూర్ణమానసః |
ఉవాస సుఖితస్తత్ర పుత్రోత్పత్తిం విచింతయన్ ||

తా|| దశరథ మహారాజు వచ్చినవారందరికి వీడ్కొలిపి మిక్కిలి ఆనందించెను.. అనంతరము పుత్త్రప్రాప్తిని గూర్చి ఆలోచించుచూ హాయిగా నివశింపసాగెను.

తతో యజ్ఞే సమాప్తేతు ఋతూనాం షట్ సమత్యయుః |
తతశ్చ ద్వాదశే మాసే చైత్రే నావమికే తిథౌ |
నక్షత్రేsదితి దైవత్యే స్వోచ్ఛసంస్థేషు పంచసు |
గ్రహేషు కర్కటే లగ్నే వాక్పతివిందునా సహ ||
ప్రోద్యమానే జగన్నాథం సర్వలోక నమస్కృతమ్ |
కౌసల్యాsజనయద్రామం సర్వలక్షణ సంయుతమ్ ||

తా|| యజ్ఞము ముగిసిన పిమ్మట ఆరు ఋతువులు గడిచెను. పిమ్మట పండ్రెండవ మాసమున చైత్రశుద్ధ నవమి నాడు పునర్వసు నాలుగవ పాదమున కర్కాటక లగ్నమున కౌసల్యాదేవిగర్భములో శ్రీరామచంద్ర ప్రభువు జన్మించెను. సూర్యుడు ,అంగారకుడు, గురుడు, శుక్రుడు, శని ఐదు గ్రహములు తమ ఉచ్ఛస్థానములోఅనగా మేష, మకర, కర్కాటక, మీన, తులా రాసులయందు ఉండిరి. కర్కాటక రాశియందు గురుచంద్రులు కలిసి ఉండిరి. బుధాదిత్యులు మేషమునందు ఉండిరి. కౌసల్యాదేవి కి శ్రీరామచంద్రుడు జన్మించెను .ఆయన జగన్నాధుడును అన్ని లోకములచే నమస్కరింపబడువాడును, సర్వశుభలక్ష సంపన్నుడును మహాభాగ్యశాలియూ విష్ణ్వంశసంభూతుడును ఇక్ష్వాకువంశవర్ధనుడు .

విష్ణోరర్థమ్ మహాభాగం పుత్త్రం ఇక్ష్వాకు వర్ధనమ్ |
లోహితాక్షం మహాబాహుం రక్తోష్ఠం దుందుభిస్వనమ్||
కౌశల్యా శుశుభే తేన పుత్త్రేణామిత తేజసా |
యథా వరేన దేవానాం అదితిర్వజ్రపాణీనా ||

ఇక్ష్వాకు కుల నందనుడు, విష్ణువులో సగ భాగమైనవాడు, లోహితాక్షుడు మహాబాహువులు గలవాడు, ఎఱ్ఱని కళ్ళు గలవాడు దుందుభివంటి స్వరము గలవాడు. ఆ అమిత తేజస్సుగల పుత్త్రునితో కౌసల్యదేవి, దేవతలలో శ్రేష్ఠుడు వజ్రాయుధము ధరించువాడైన ఇంద్రుని పుత్త్రునిగా పొందిన అదితి వలే ఏంతో శోభించెను.

భరతోనామ కైకేయ్యాం జజ్ఞే సత్యపరాక్రమః |
సాక్షా ద్విష్ణోశ్చతుర్థాంశః సర్వైః సముదితో గుణైః ||
అథ లక్ష్మణశతృఘ్నౌ సుమిత్రాsజనయత్ సుతౌ |
వీరౌ సర్వాస్త్రకుశలౌ విష్ణోరర్థసమన్వితౌ ||

తా|| సత్యపరాక్రమములు గలవాడు , సాక్షాత్ విష్ణువుయొక్క చతుర్థాంశముఅయిన వాడు సర్వగుణ సంపన్నుడు అగు భరతుడనువాడు కైకేయికి జన్మించెను. అప్పుడు వీరులు అన్ని శస్త్రాస్త్రములలో కుశలురు విష్ణ్వంశలతో కూడినవారు అగు లక్ష్మణ శతృఘ్నులు సుమిత్రాదేవి కి జన్మించిరి.

పుష్యే జాతస్తు భరతో మీనలగ్బే ప్రసన్నధీః |
సార్పే జాతౌ తు సౌమిత్రీ కుళీరేsభ్యుదితే రవౌ |
రాజ్ఞః పుత్త్రా మహాత్మనః చత్వారో జజ్ఞిరే పృథక్ ||
గుణవంతో అనురూపాశ్చ రుచ్యా ప్రోష్ఠపదోపమాః |
జగుః కలం చ గంధర్వా ననృతుశ్చాస్సరోగణాః |
దేవ దుందుభయో నేదుః పుష్పవృష్టిశ్చ ఖాచ్చ్యుతా ||

తా|| భరతుడు పుష్యమి నక్షత్రయుక్త మీనలగ్నమందు అన్మించుటవలన ప్రసన్న మనస్సు గలవాడయ్యెను. లక్ష్మణ శతృఘ్నులు ఆశ్లేషా నక్షత్రయుక్త కర్కాటక లగ్నమందు రవి ఉచ్ఛరాశిలో ఉన్నప్పుడు జన్మించిరి. ఆ రాజుకి గుణవంతులు తగినరూపముగలవారు అగు మహాత్ములగు నలుగురుపుత్రుల జననము విడివిడిగా ఆయెను. అప్పుడు గంధర్వులు మధురముగా గానము చేసిరి. అప్సరస గణములు నాట్యము చేసిరి. దేవ దుందుభులు మ్రోగెను. ఆకాశమునుండి పుష్పవృష్టి కురిసెను.

ఉత్సవశ్చ మహానాసీత్ అయోధ్యాయాం జనాకులః |
రథ్యాశ్చ జనసంబాధా నటనర్తక సంకులాః |
గాయనైశ్చ విరావిణ్యో నాదనైశ్చ తథా అపరైః ||
ప్రదేయాంశ్చ దదౌ రాజా సూతమాగధవందినామ్ |
బ్రాహ్మణేభ్యో దదౌ విత్తం గోధనాని సహస్రశః ||

తా|| అయోధ్యానగరములో జనులందరితో మహోత్సవములు జరిగినవి. రాజవీధులన్నియూ కోలాహలముతో నటనర్తకుల సంకులముతో గానవాద్య గోష్ఠులతో వందిమాగధుల స్తోత్రపాఠములతో ప్రతిధ్వనించెను. ఆ (దశరథ) మహారాజు వందిమాగధులకు పౌరాణికులకు పారితోషకములనిచ్చెను. బ్రాహ్మణులకు వేలకొలదీ గోధనములను దానము చేసెను.

అతీత్యైకాదశాహం తు నామకర్మ తథా అకరోత్ |
జ్యేష్ఠం రామం మహాత్మానం భరతం కైకయీసుతమ్ ||
సౌమిత్రిం లక్ష్మణమితి శతృఘ్నం అపరం తథా |
వసిష్ఠః పరమప్రీతో నామాని కృతవాంస్తదా ||

తా||పుత్త్రులుజన్మించిన పదనొకండు దినముల పిమ్మట దశరథుడు వారికి నామకరణ కర్మ చేసెను. వశిష్ఠ మహాముని పరమ ప్రీతితో మహాత్ముడగు జ్యేష్ఠకుమారునకు 'రాముడు' అనియూ , కైకేయీ పుత్త్రునకు భరతుడనియూ, సుమిత్రానందనులకు లక్ష్మణుడు శతృఘ్నుడు అనియూ నామకరణము చేసెను.

బ్రాహ్మణాన్ భోజయామాస పౌరాన్ జానపదానపి |
అదదాత్ బ్రాహ్మణానాం చ రత్నౌఘమ్ అమితం బహు |
తేషాం జన్మక్రియాదీని సర్వకర్మాణ్యకారయత్ ||

తా|| రాజు బ్రాహ్మణులకూ, పురజనులకూ , గ్రామవాసులకూ భోజనములు పెట్టెను. బ్రాహ్మణులకు బహువిధములగు రత్నములను బహుకరించెను. పిమ్మట ఆ కుమారులకు జన్మక్రియకు సంబంధించిన సర్వకార్యములను జరిపించెను.

తేషాం కేతు రివ జ్యేష్ఠో రామో రతికరః పితుః |
బభూవ భూయో భూతానాం స్వయంభూరివ సమ్మతః ||
సర్వే వేదవిదః శూరాః సర్వే లోకహితే రతాః |
సర్వే జ్ఞానోపసంపన్నాః సర్వే సముదితా గుణైః ||

తా|| వారిలో జ్యేష్ఠుడైన ధ్వజపతాకమువంటి రాముడు తండ్రికి మిక్కిలి సంతోషముగూర్చుచుండెను. సమస్త ప్రాణులకూ స్వయంభూవలె ఎంతయూ ప్రేమపాత్రుడయ్యెను. ఆ రాజకుమారులందరూ అన్ని వేదములనూ అభ్యశించిరి. వారు శూరులు . ఎల్లప్పుడు ప్రజలహితమునందే ఆశక్తి గలవారు. జ్ఞాన సంపన్నులు. సకల సద్గుణ సంపన్నులు.

తేషామపి మహాతేజా రామస్సత్యపరాక్రమః |
ఇష్టః సర్వస్య లోకస్య శశాంక ఇవ నిర్మలః ||
గజస్కంధే అశ్వపృష్టే చ రథ చర్యాసు సమ్మతః |
ధనుర్వేదేచ నిరతః పితృశుశ్రూషేణ రతః ||

తా|| వారిలో గూడా రాముడు సత్యపరాక్రమములు గలవాడు. లోకములో వున్న అందరికి ప్రియపాత్రుడు. చంద్రునివలె నిర్మలము గా ఉండువాడు. గజారోహణ అశ్వారోహణ రధారోహణ చర్యలలో కుశలుడు. ధనుర్విద్యలో కుశలుడు . పితృసేవలో నిమగ్నుడైయుండెడివాడు.

బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధో లక్ష్మణో లక్ష్మివర్ధనః |
రామస్య లోకరామస్య భ్రాతుర్జ్యేష్ఠస్య నిత్యశః ||
సర్వప్రియకర్తస్య రామస్యాపి శరీరతః |
లక్ష్మణో లక్ష్మిసంపన్నో బహిః ప్రాణ ఇవాపరః ||

తా|| బాల్యమునుంచియూ లోకాభిరాముడైన పెద్ద అన్నగారగు రామునియందు భక్తి తత్పరుడు. తనసుఖములను మరచి రామునకు అన్నివిధములుగా ప్రియముగూర్చువాడు. అతడు రామునకు బహిః ప్రాణము.

న చ తేన వినా నిద్రాం లభతే పురుషోత్తమః |
మృష్టమన్న ముపానీతమ్ అశ్నాతి న చ తం వినా ||
యదా హి హయమారూఢో మృగయాం యాతి రాఘవః |
తదైనం పృష్టతోsన్వేతి స ధనుః పరిపాలయన్ ||
భరతస్యాపి శతృఘ్నో లక్ష్మణావరజో హి సః |
ప్రాణైః ప్రియతరో నిత్యం తస్య చాసీత్ తథా ప్రియః ||

తా|| పురుషోత్తముడైన ఆ రాముడు లక్ష్మణుడు తనచెంత లేనిచో నిద్రపోయెడివాడివాడు కాడు, వచ్చిన మృష్టాన్నములను తీసుకొనెడివాడు కాడు. రాముడు అశ్వమునెక్కి వేటాడు నపుడు లక్ష్మణుడు ధనస్సు చేబూని వెంట నడిచెడివాడు. లక్ష్మణునకు తమ్ముడైన శతృఘ్నుడు అతని వలే సేవాస్వభావము కలవాడు అతడు భరతునకు ప్రాణముకన్న ప్రియమైనవాడు. అట్లే శతృఘ్నుడును భరతునిపై ప్రేమకలవాడు.

స చతుర్భిర్మహభాగైః పుత్రైః దశరథః ప్రియైః |
బభూవ పరమప్రీతో దేవైరివపితామహః ||
తే యదా జ్ఞానసంపన్నాః సర్వే సముదితాగుణైః |
హ్రీమంతః కీర్తిమంతశ్చ సర్వజ్ఞా దీర్ఘదర్శినః ||
తేషామేవం ప్రభవాణామ్ సర్వేషాం దీప్తతేజసామ్ |
పితా దశరథో హృష్టో బ్రహ్మలోకాధిపో యథా ||

తా|| ఆ సర్వలక్షణసంపన్నులగు ఆ నలుగురు ప్రియమైన పుత్త్రులతో దశరథమహారాజు దేవలతో గూడిన బ్రహ్మదేవునివలె పరమానంద భరితుడాయెను. ఆ నలుగురూ జ్ఞానసంపన్నులు, సద్గుణసంపన్నులూ , లౌకిక ప్రజ్ఞానిథులు, కీర్తిమంతులు , సర్వజ్ఞులు, దూరదృష్టిగలవారు. ఇట్లు ప్రతిభాశాలురూ తేజోమూర్తులైన తనకుమారులను జూచి లోకాధిపతియగు బ్రహ్మవలే ఆనందించెను.

తే చాపి మనుజవ్యాఘ్రా వైదికాధ్యయనే రతాః |
పితృశుశ్రూషణరతా ధనుర్వేదేచ నిష్ఠితాః ||
అథ రాజా దశరథః తేషాం దారక్రియాం ప్రతి |
చింతయామాస ధర్మాత్మా సోపాధ్యాయః సబాంధవః ||
తస్య చింతయమానస్య మంత్రిమధ్యే మహాత్మనః |
అభ్యాగచ్ఛన్ మహాతేజా విశ్వామిత్రోమహామునిః ||

తా|| ఆ పురుషశ్రేష్ఠులైన ( మనుజవ్యాఘ్రులైన) రాజకుమారులు వేదవేదాంగముల ఆధ్యయనములో నిరతులు. పితృ సేవలో నిరతులు. ధనుర్విద్యలో నిష్ఠగలవారు. అప్పుడు ఆ రాజు కుమారుల వివాహ ప్రయత్నములతో గురువులతో బాంధవులతో అలోచించసాగెను. అ మహాత్ముడగు దశరథమహారాజు మంత్రులతో ఆలోచించుచుండగా మహాతేజోమయుడైన విశ్వామిత్రమహర్షి అచటికి వచ్చెను.

స రాజ్ఞా దర్శనాకాంక్షీ ద్వారాధ్యక్షాన్ ఉవాచ హ |
శీఘ్రమాఖ్యాత మాం ప్రాప్తం కౌశికం గాధినస్సుతమ్ ||
తత్ శ్రుత్వా వచనం త్రాసాత్ రాజ్ఞో వేశ్మ ప్రదుద్రువుః |
సంభ్రాంత మనసః సర్వే తేన వాక్యేన చోదితాః ||
తే గత్వా రాజభవనం విశ్వామిత్రం ఋషిం తదా |
ప్రాప్తమావేదయామాసుః నృపాయైక్ష్వాకవే తదా ||

తా|| రాజదర్శనాకాంక్షతో ఆ ముని ద్వారపాలకులతో ఇట్లు చెప్పెను. ' నేను గాధిరాజు కుమారుడను. కుశికుని వంశమువాడను. నాపేరు విశ్వామిత్రుడు. శీఘ్రముగా నారాకను తెలుపుడు' అని. ఆ మాటలను విని సంభ్రాంత మనస్సులతో కలవరపడి ద్వారపాలకులు రాజభవనము వద్దకు వెళ్ళిరి. వారు రాజభవనము చేరి విశ్వామిత్రుని రాకగురించి ఆ మహరాజుకి నివేదించిరి.

తేషాం తద్వచనం శ్రుత్వా స పురోధాః సమాహితః |
ప్రత్యుజ్జగామ తం హృష్టో బ్రహ్మణమివ వాసవః ||
తం దృష్ట్వా జ్వలితం దీప్యా తాపసం సంశితవ్రతమ్ |
ప్రహృష్టవదనో రాజా తతోsర్ఘ్యం ఉపహారయత్ ||
స రాజ్ఞః ప్రతిగృహ్యార్ఘ్యం శాస్త్ర దృష్టేన కర్మణా |
కుశలం చావ్యయం చైవ పర్య పృఛ్ఛన్ నరాధిపమ్ ||

తా|| ఆ వచనములను విని సంతోషముతో పురోహితులను వెంట తీసుకొని బ్రహ్మకడకు ఇంద్రునివలె వెళ్ళెను. అమితమైన తేజస్సుతో వెలుగుచున్న ఆ మహర్షిని చూచి దశరథ మహారాజు మిక్కిలి సంతోషించెను. ఆ రాజు అప్పుడు అర్ఘ్యపాద్యములను సమర్పించెను.ఆ మహర్షి రాజు సమర్పించిన అర్గ్యపాద్యములను ప్రతిగ్రహంచి పిమ్మట అ రాజుతో కుశలప్రశ్నలు గావించెను.

పురేకోశే జనపదే బాంధవేషు సుహృత్సు చ |
కుశలం కౌశికో రాజ్ఞః పర్యపృఛ్ఛత్ సుధార్మికః ||
అపి తే సన్నతాః సర్వే సామంతా రిపవో జితాః |
దైవం చ మానుషం చాపి కర్మ తే సాధ్వనుష్టితమ్ ||

తా|| 'ఓ రాజా నీ ధనాగారము , దేశము , బంధుమిత్రులు కుశలమేగదా' అని ధార్మికోత్తముడైన ఆ మహర్షి రాజుని అడిగెను.' ఇంకనూ 'సామంతరాజులు అదుపులో ఉన్నారా? శతృవులందరినీ జయించితివా? యజ్ఞాదిదైవకార్యములు , అతిథి సత్కారములు చక్కగా సాగుచున్నవి కదా?' అని అడిగెను.

వసిష్ఠం చ సమాగమ్య కుశలం మునిపుంగవః |
ఋషీంశ్చాన్యాన్ యథా న్యాయం మహాభాగానువాచ హ ||
తే సర్వే హృష్టమనసః తస్య రాజ్ఞో నివేశనమ్ |
వివిశుః పూజితాస్తత్ర నిషేదుశ్చ యథార్హతః ||

తా|| పిమ్మట ఆ మునీశ్వరుడు వశిష్ఠుని సమీపించి ఆయనతో కుశలప్రశ్నలు గావించెను. అదే విథముగా ఇతర ఋషులతో యథావిథిగా యథోచితముగా అ మహాముని పరామర్శించెను. ఆ విథముగా గౌరవింపబడినవారై వారందరూ మిక్కిలి సంతసించిరి. పిమ్మట తమతమ యోగ్యతల ప్రకారము అశీనులైరి.

అథ హృష్టమనా రాజా విశ్వామిత్రం మహామునిమ్ |
ఉవాచ పరమోదారో హృష్టస్తమభిపూజయన్ ||
యథా అమృతస్య సంప్రాప్తిః యథా వర్షమనూదకే |
యథా సదృశదారేషు పుత్త్రజన్మాsప్రజస్య చ ||
ప్రణష్టస్య యథా లాభో యథా హర్షో మహోదయే |
తథైవాగమనం మన్యే స్వాగతం తే మహామునే ||

తా|| అప్పుడు ఉదారస్వభావముగల దశరథమహారాజు సంతోషముతో పూజించుచూ విశ్వామిత్రునితో ఇట్లనెను. 'ఓ మహర్షీ అమృతము లభించినటులనూ , నీళ్ళు లేని చోట వర్షము కురిసినట్లునూ, సంతానములేనివానికి ధర్మపత్నియందు పుత్త్రులు కలిగినట్లునూ, నష్టపోయినవానికి నిథులు లభించినట్లునూ , మహోత్సవములతో సంతోషము కలిగినటుల మీ రాక మాకు మహదానందము కలిగించినది మీకు స్వాగతము'.

కం చ తే పరమం కామం కరోమి కిము హర్షితః |
పాత్రభూతోsసి మే బ్రహ్మన్ దిష్ట్యా ప్రాప్తోsసి కౌశిక ||
అద్య మే సఫలం జన్మ జీవితంచ సుజీవితమ్ |
పూర్వం రాజర్షి శబ్దేన తపసా ద్యోతిత ప్రభః ||
బ్రహ్మర్షిత్వ మనుప్రాప్తః పూజ్యోsసి బహుధా మయా |
త దద్భుత మిదం బ్రహ్మన్ పవిత్రం పరమం మమ ||
శుభక్షేత్రగతశ్చాహం తవ సందర్శనాత్ ప్రభో |
బ్రూహి యత్ ప్రార్థితం తుభ్యం కార్యమాగమనం ప్రతి ||
ఇచ్ఛామ్యనుగృహీతోsహం త్వదర్థపరివృద్ధయే |

తా|| 'ఓ ధర్మాత్మా మీ అభీష్ఠమేమి ?మేము ఏమి చేయవలెను ? మీరు అన్నివిధములుగా పాత్రులు. మీ రాక మా అదృష్ఠము. ఈ దినము నా జన్మ సఫలమైనది, నా జీవితము చరితార్థమైనది. పూర్వము రాజర్షి గా వాసిగాంచితిరి. అనంతరము బ్రహ్మర్షిత్వము పొందిరి. కనుక మీరు మాకు చాలాపూజ్యులు. ఓ బ్రహ్మర్షీ మీరాక అద్భుతమైనది. మీరాక వలన మాగృహము పావకమైనది. మీరు ఏ కార్యనిమిత్తము వచ్చిరో తెలుపుడు. మీకార్యము నెరవేర్చుటకు సిద్ధముగా ఉన్నాను' అని.

కార్యస్య న విమర్శం చ గంతుమర్హసి కౌశిక |
కర్తాచాహమశేషేణ దైవతం హి భవాన్ హి మమ ||
మమచాయమనుప్రాప్తో మహానభ్యుదయో ద్విజ |
తవాగమనజః కృత్శ్నో ధర్మశ్చానుత్తమో మమ ||

తా||' ఓ కౌశికా! కార్యవిషయమున సందేహము వలదు. మీరు దైవ సమానులు. శేషములేకుండా కార్యము చేసెదను. ఓ బ్రహ్మర్షీ! మీ రాకవలన నేను ఆచరించిన సమస్త ధర్మములూ ఫలించినవి'.

ఇతి హృదయసుఖం నిశమ్య వాక్యం
శ్రుతిసుఖమాత్మవతా వినీతముక్తమ్ |
ప్రధితగుణయశా గుణైర్విశిష్టః
పరమఋషిః పరమం జగామ హర్షమ్ ||

తా|| అట్లు హృదయమునకు సంతోషమిచ్చు వాక్యములను విని ఉత్తమోత్తమమైన గుణములతో ప్రఖ్యాతికెక్కినవాడును శమదమాది విశిష్ఠగుణ సంపన్నుడును అయిన విశ్వామిత్రమహర్షి పరమానంద భరితుడాయెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే అష్టాదశస్సర్గః ||
సమాప్తం ||


|| om tat sat ||