Srimad Valmiki Ramayanam
Balakanda Sarga 38
Story of Sagara !
With Sanskrit text in Telugu , Kannada and Devanagari,
బాలకాండ
ముప్పది ఎనిమిదవ సర్గము
( సగరుని కథ )
తాం కథాం కౌశికో రామే నివేద్య కుశికాత్మజః |
పునరేవాపరం వాక్యం కాకుత్ స్థమ్ ఇదమబ్రవీత్ ||
స || కౌసికో రామే తాం కథాం నివేద్య , పునరేవ (సః) కుశికాత్మజః ఇదం వాక్యం కాకుత్ స్థమ్ అబ్రవీత్ |
తా|| ఆ కౌశికుడు రామునకు ఆ కథను నివేదించి , మళ్ళీ ఈ వాక్యములను ఆ కుశికాత్మజుడు ఆ కాకుత్థ్సునకు చెప్పెను.
అయోధ్యాపతిః శూరః పూర్వమాసీన్నరాధిపః |
సగరో నామ ధర్మాత్మా ప్రజాకామస్సచాప్రజః ||
స|| పూర్వం సగరో నామ ధర్మాత్మా శూరః నరాధిపః అయోధ్యాపతిః అసీత్ . (సః) ప్రజా కామః అప్రజా ( ఆసీత్)
తా|| పూర్వము సగరుడు అనుపేరుగల ధర్మాత్ముడు, శూరుడు , నరులకు అధిపతి అయోధ్యకి రాజుగా ఉండెను. అతడు సంతానముమీద కోరికగలవాడు. సంతానము లేనివాడు.
వైదర్భదుహితా రామ కేశినీ నామ నామతః |
జ్యేష్ఠా సగరపత్నీ సా ధర్మిష్ఠా సత్యవాదినీ ||
స|| (హే) రామ ! కేశినీ నామ నామతః వైదర్భ దుహితా జ్యేష్ఠా సగర పత్నీ ( ఆసీత్) . సా ధర్మిష్ఠా సత్యవాదినీ ( అపి)
తా|| ఓ రామా ! కేశినీ అను పేరుగల వైదర్భి కన్య సగరునియొక్క జ్యేష్ఠ పత్నిగా ఉండెను. ఆమె ధర్మములలో నిష్ఠ కలది. సత్యవాదిని కూడా .
అరిష్టనేమి దుహితా రూపేణాప్రతిమా భువి|
ద్వితీయా సగరస్యాసీత్ పత్నీ సుమతి సంజ్ఞితా ||
స|| సుమతి సంజ్ఞితా రూపేణా ప్రతిమాభువి అరిష్ఠనేమి దుహితా సగరస్య ద్వితీయ పత్నీఆసీత్ ||
తా|| సుమతి , అన్ని విషయములను ఎరిగినది , రూపములో భువిలో సాటిలేనిది , అరిష్టనేమీ అనబడు ఆవిడ సగరుని ద్వితీయ భార్య.
తాభ్యాం సహ తతో రాజా పత్నీభ్యాం తప్తవాం స్తపః |
హిమవంతం సమాసాద్య్ భృగుప్రస్రవణే గిరౌ ||
స|| తతో రాజా పత్నీభ్యాం సహ హిమవంతమ్ సమసాద్య భృగుప్రస్రవణే గిరౌ సః తాభ్యాం తపః తప్తవాం ||
తా|| అప్పుడు ఆ రాజు పత్నులతో కలిసి హిమలయములలో భృగు ప్రస్రవణమునకు వచ్చి అ కొండపై తపస్సును ఆచరించెను.
అథ వర్ష శతే పూర్ణే తపసారాధితో మునిః |
సగరాయ వరం ప్రాదాత్ భృగు స్సత్యవతాం వరః ||
స|| అథ వర్ష శతే పూర్ణే భృగుః ఆరాధితో ( సః) మునిః స్సత్యవతాం వరః, సగరాయ వరం ప్రాదాత్ |
తా|| అప్పుడు వంద సంవత్సరములు భృగు మహర్షిని ఆరాధించిరి. సత్యవంతులలో శ్రేష్ఠుడైన ఆ ముని ఆ సగరునికి వరము ఇచ్చెను.
అపత్యలాభ స్సుమహాన్ భవిష్యతి తవానఘ |
కీర్తిం చాప్రతిమం లోకే ప్రాప్యసే పురుషర్షభ ||
స|| (హే) అనఘ ! తవ సుమహాన్ అపత్యలాభః భవిష్యతి |(హే) పురుషర్షభ (త్వం) అప్రతిమంచాపి కీర్తిం ప్రాప్యసే ||
తా|| ఓ అనఘా ! నీకు చాలామంది పుత్రులు జన్మించెదరు. | ఓ ఫురుషర్షభా ! అప్రతిమైన కీర్తిని గూడా పొందెదవు |
ఏకా జనయితా తాత పుత్త్రం వంశకరం తవ |
షష్టిం పుత్త్ర సహస్రాణి అపరా జనయిష్యతి ||
స|| (హే) తాత ! ఏకా జనయిష్యతి తవ వంశకరం పుత్రం | అపరా షష్ఠిం సహస్ర పుత్రాణి జనయిష్యతి ||
తా|| నాయనా ! ఒక భార్య వంశకరుడగు పుత్రునికి జన్మమిచ్చును. రెందవది అరువదివేల పుత్రులకు జన్మమిచ్చును.
భాషమాణం మహాత్మానం రాజపుత్ర్యౌ ప్రసాద్య తమ్ |
ఊచతుః పరమప్రీతే కృతాంజలిపుటే తదా ||
స|| తమ్ భాషమాణం మహాత్మానం ప్రసాద్య , పరమప్రీతే కృతాంజలి పుటే రాజపుత్ర్యౌ ఊచతుః ||
తా|| ఆ విధముగా చెప్పిన అ మహాత్ముని ప్రసన్నునిచేసుకొని, పరమప్రీతితో అంజలిఘటించి ఆ రాజపుత్రికలు ఇట్లు చెప్పిరి |
ఏకః కస్యాస్సుతో బ్రహ్మన్ కా బహూన్ జనయిష్యతి |
శ్రోతుమిచ్ఛావహే బ్రహ్మన్ సత్యమస్తు వచస్తవ ||
స|| (హే)బ్రహ్మన్ ! కః ఏకః సుతో స్యాత్ , కా బహూన్ జనయిష్యతి శ్రోతుం ఇచ్ఛావహే (వయం) | తవ వచనం సత్యమస్తు ||
తా|| ఓ బ్రహ్మన్ ! ఎవరికి ఒకడే పుత్రుడు కలుగును ? ఎవరికి చాలామంది పుత్రులు కలుగుదురు . అది వినుటకు కోరిక గలవారము . మీ వచనములు సత్యమగుగాక |
తయోస్తద్వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః |
ఉవాచ పరమాం వాణీం స్వచ్ఛందోs త్ర విధీయతామ్ ||
స||తయోః తత్ వచనం శ్రుత్వా భృగుః పరమధార్మికః ఉవాచ , అత్ర పరమాం వాణీం స్వచ్చందో విధీయతాం ||
తా|| వారిద్దరి ఆ వచనములను విని పరమధార్మికుడైన భృగు ఇట్లు చెప్పెను. " ఇప్పుడు మీ కోరికను వివరించుదురుగాక" |
ఏకో వంశకరో వాస్తు బహవో వా మహాబలాః |
కీర్తిమంతో మహోత్సాహా కా వా కం వరమిచ్ఛతి ||
స|| ఏకో కీర్తిమంతో వంశకరో వాస్తు వా బహవో మహోత్సాహో కీర్తిమంతో వా (అస్తు) కం వరమిచ్ఛతి ||
తా|| ఒకడు కీర్తిమంతుడు వంశోద్ధారకుడు అగును . లేక చాలామంది కీర్తిమంతులగు పుత్రులు కలుగుదురు , ఏవరికి కావలెనో కోరికొనుడు?
మునేస్తు వచనం శ్రుత్వా కేశినీ రఘునందన |
పుత్త్రం వంశకరం రామ జగ్రాహ నృప సన్నిధౌ ||
స|| రఘునందనా ! కేశినీ మునేః వచనం శ్రుత్వా నృప సన్నిధౌ పుత్త్రం వంశకరం జగ్రాహ |
తా|| ఓ రఘునందనా ! కేశినీ ఆ ముని వచనములను విని , ఆ రాజ సమక్షమములో వంశకరుడైన పుత్రుని కోరెను>
షష్టిం పుత్త్ర సహస్రాణి సుపర్ణభగినీ తదా |
మహోత్సాహాన్ కీర్తిమతో జగ్రాహ సుమతిః సుతాన్ ||
స|| తదా సుపర్ణ భగినీ సుమతిః మహోత్సాహాన్ కీర్తిమతో షష్టిం పుత్త్ర సహస్రాణి సుతాన్ జగ్రాహ ||
తా|| అప్పుడు సుపర్ణ భగినీ అయిన సుమతి మహోత్సాహము కలవారు కీర్తిమంతులు అయిన అరవై వేలపుత్రులను కోరుకొనెను.
ప్రదక్షిణం ఋషీం కృత్వా శిరసా భి ప్రణమ్య చ |
జగామ స్వపురం రాజా సభార్యో రఘునందన ||
స|| రఘునందన ! రాజా సభార్యో ఋషీం శిరసాభి ప్రణమ్య ప్రదక్షిణం కృత్వా స్వపురం జగామ ||
తా|| ఓ రఘునందనా ! ఆ రాజు భార్యలతోసహా శిరస్సుతో ప్రణామము చేసి , పిమ్మట ప్రదక్షిణము చేసి స్వపురమునకు వెళ్ళెను.
అథ కాలే గతే తస్మిన్ జ్యేష్ఠాపుత్రం వ్యజాయత |
అసమంజ ఇతి ఖ్యాతం కేశినీ సగరాత్మజం ||
స|| అథ కాలే గతే కేశినీ జ్యేష్ఠా అసమంజ ఇతి ఖ్యాతం సగరాత్మజం పుత్రం వ్యజాయత ||
తా ||పిమ్మట కొంతకాలముతర్వాత జ్యేష్ఠా కేశినీ అసమంజ అను పేరుగల సగరాత్మజుడగు పుత్రుని కనెను.
సుమతిస్తు నరవ్యాఘ్ర గర్భతుంబం వ్యజాయత |
షష్టిః పుత్త్రా సహస్రాణి తుంబభేధాద్వినిస్సృతః ||
స|| (హే) నరవ్యాఘ్ర ! సుమతిస్తు గర్భతుంభం వ్యజాయత | తుంభ భేదాత్ షష్ఠిః సహస్ర పుత్రాణి వినిశ్రుతః |
తా|| ఓ నరవ్యాఘ్రా ! సుమతికూడా సొరకాయవంటి గర్భపిండమును ప్రసవించెను | ఆ గర్భపిండమును భేదించిన పిమ్మట అరవై వేల పుత్రులు కలిగిరి అని వినడమైనది |
ఘృతపూర్ణేషు కుంభేషు ధాత్ర్యస్తాన్ సమవర్ధయన్ |
కాలేన మహతా సర్వే యౌవనం ప్రతిపేదిరే ||
స|| ధాత్ర్యః తాన్ ఘృతపూర్ణేషు కుంభేషు సమవర్థయన్ | సర్వే కాలేన మహతా యౌవనం ప్రతిపేదిరే |
తా|| ఆ దాదులు వారిని నేతితో నిండిన కుందలలో పెంచిరి. ఆందరూ కాలముతో వృద్ధిల్లి యౌవనము చేరిరి.
అథ దీర్ఘేణ కాలేన రూపయౌవనశాలినః |
షష్టిః పుత్త్ర సహస్రాణి సగరస్యాభవం స్తదా ||
స|| అథ దీర్ఘేణ కాలేన సగరస్య షష్ఠిః పుత్ర సహస్రాణి రూపయౌవనశాలినః అభవం తదా |
తా|| అప్పుడు చాలాకాలముతర్వాత సగరునియొక్క అరవై వేలపుత్రులు రూపముతో కూడి యౌవ్వనము పొందిరి.
స చ జ్యేష్ఠో నరశ్రేష్ఠః సగరస్యాత్మసంభవః |
బాలాన్ గృహీత్వా తు జలే సరయ్వా రఘునందన |
ప్రక్షిప్య ప్రహసన్ నిత్యం మజ్జతస్తాన్ నిరీక్ష్యవై ||
స|| (హే) రఘునందనా ! నరశ్రేష్ఠా ! సగరస్య ఆత్మసంభవః జ్యేష్ఠః బాలాన్ గృహీత్వా సరయ్వా జలే ప్రక్షిప్య , మజ్జతః తాన్ నిరీక్ష్య వై ప్రహసన్ |
తా|| హే రఘునందనా ! నరశ్రేష్ఠా ! సగరునియొక్క జ్యేష్ఠ పుత్రుడు బాలులను తీసుకొని సరయూ నదీ జలములలో ముంచి , మునకలువేస్తున్న వారిని చూచి నవ్వుతో ఆనందించెడివాడు.
ఏవం పాపసమాచారః సజ్జనప్రతిభాధకః |
పౌరాణామహితే యుక్తః పుత్త్రో నిర్వాసితః పురాత్ ||
స|| ఏవం పౌరాణామ్ అహితే యుక్తః పాప సమాచారః సజ్జనప్రతిభాధకః పుత్రో పురాత్ నిర్వాసితః |
తా|| ఈ విధముగా పౌరులకు హితము కాని పాపకర్మలను చేయుచున్న, సజ్జనులను బాధించుచున్న అ పుత్రుని పురమునుండి వేడలగొట్టబడెను.
తస్య పుత్త్రోంశుమాన్ నామ అసమంజస్య వీర్యవాన్ |
సమ్మతః సర్వలోకస్య సర్వస్యాపి ప్రియం వదః ||
స|| తస్య అసమంజస్య పుత్రః అంశుమాన్ నామః వీర్యవాన్ సర్వలోకస్య సమ్మతః | సర్వస్యాపి ప్రియం వదః ||
తా|| ఆ అసమంజసుని పుత్రుడు అంశుమాన్ అను పేరుగలవాడు , వీరుడు, లోకములలో అందరికీ సమ్మతమైన వాడు. అందరితో ప్రియముగా మాట్లాడువాడు.
తతః కాలేన మహతా మతి స్సమభిజాయత |
సగరస్య నరశ్రేష్ఠ యజేయమితి నిశ్చితా ||
స|| (హే) నరశ్రేష్ఠా ! తతః మహతా కాలేన యజేయమితి సగరస్య మతి సమభిజాయత నిశ్చితా |
తా|| ఓ నరశ్రేష్ఠా ! పిమ్మట కొంతకాలము తర్వాత సగరునియొక్క మతిలో యజ్ఞము చేయవలెనని కొరికకలిగెను. అట్లే నిశ్చయించుకొనెను.
సకృత్వా నిశ్చయం రామ సోపాధ్యాయగణ స్తదా |
యజ్ఞకర్మణి వేదజ్ఞో యష్టుం సముపచక్రమే ||
స|| హే రామ ! స: నిశ్చయం కృత్వా సోపధ్యాగణో తదా వేదజ్ఞో యజ్ఞకర్మణి యష్ఠుం సముపచక్రమే ||
తా|| ఓ రామా ! అతడు అట్లు నిశ్చయించుకొని , గురువులతో అలాగే వేదజ్ఞులతో యజ్ఞకర్మచేయుటకు తయారు పడెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే
బాలకాండే అష్టత్రింశస్సర్గః ||
సమాప్తం ||
||ఈ విధముగా శ్రీమద్రామాయణములోని బాలకాండలో ముప్పది ఎనిమిదవ సర్గ సమాప్తము ||
|| ఓమ్ తత్ సత్ ||
|| Om tat sat ||