శ్రీమద్వాల్మీకి రామాయణము

బాలకాండ - డెబ్బదిమూడవ సర్గ

సీతా కల్యాణము !!

||Om tat sat ||

బాలకాండ
త్రిసప్తతితమస్సర్గః
( సీతా రామ కల్యాణము)

యస్మింస్తు దివసే రాజా చక్రే గోదాన ముత్తమమ్|
తస్మింస్తు దివసే శూరో యుధాజిత్ సముపేయవాన్ ||

స|| యస్మిన్ దివసే రాజా ఉత్తమమ్ గోదానం చక్రే తస్మిన్ దివసే శూరః యుధాజిత్ సముపేయవాన్ ||

త|| ఉత్తమమైన గోదానము చేసిన దినమే శూరుడైన యుధాజిత్తు అచటికి వచ్చెను.

పుత్త్రః కేకేయరాజస్య సాక్షాత్ భరతమాతులః|
దృష్ట్వా పృష్ట్వా తు కుశలంరాజానం ఇదమబ్రవీత్||

స|| (సః) కేకేయరాజస్య పుత్త్రః | సాక్షాత్ భరతస్య మాతులః | రాజానం దృష్ట్వా కుశలం పృష్ట్వా తు ఇదం అబ్రవీత్ ||

తా|| అతడు కేకేయరాజపుత్త్రుడు. సాక్షాత్తు భరతుని మేమమామ . రాజుని చూచి కుశలములు అడిగి ఇట్లు పలికెను.

కేకాయాధిపతీ రాజా స్నేహాత్ కుశలమబ్రవీత్ |
యేషాం కుశలకామోs సి తేషాం సంప్రత్యనామయమ్ ||

స|| హే రాజా ! కేకాయాధిపతీ స్నేహాత్ కుశలం అబ్రవీత్ |యేషాం కుశలకామః అసి తేషాం సంప్రత్య నామయమ్ ||

తా|| ఓ రాజా ! కేకాయాధిపతి మీ కుశలములగురించి అడిగెను. ఏవరి కుశలములపై మీకు ప్రేమో వారందరూ కుశలమే ||

స్వస్రీయం మమ రాజేంద్ర ద్రష్టుకామో మహీపతిః |
తదర్థముపయాతో sహమ్ అయోధ్యాం రఘునందన ||

స|| హే రఘునందన ! హే రాజేంద్ర ! మమ స్వస్రీయం ద్రష్టుకామః | అహం తదర్థం అయోధ్యాయాం ఉపయాతః ||

తా|| ఓ రఘునందన ఓ రాజేంద్ర ! నా మేనల్లుడుని చూడకోరితిని .అందుకు అయోధ్యానగరము పంపబడితిని.

శ్రుత్వా త్వహ మయోధ్యాయాం వివాహార్థం తవాత్మజాన్ |
మిథిలాం ఉపయాతాంస్తు త్వయా తవ మహీపతే |
త్వరయాs భ్యుపాయాతోs హం ద్రష్టుకామః స్వస్సుతమ్ ||

స|| మహీపతే త్వం అయోధ్యాయామ్ తవ ఆత్మజాన్ వివాహార్థం మిథిలాం ఉపయాతాంస్తు (ఇతి) శ్రుత్వా హే మహీపతే స్వస్సుతమ్ ద్రష్ఠుకామః అహం త్వరయా అభ్యుపాయాతః ||

తా|| ఓ రాజా మీరు మీపుత్రులవైవాహనిమిత్తమై అయోధ్యానగరము నుంచి మిథిలానగరము వచ్చితిరని విని నామేనల్లుని చూడ కోరికతో నేను త్వరగా ఇచటికి వచ్చితిని.

అథ రాజా దశరథః ప్రియాతిథిముపస్థితమ్ |
దృష్ట్వా పరమ సత్కారైః పూజార్హం సమపూజయత్ ||

స|| అథ రాజా దశరథః ప్రియ అతిథిం ఉపస్థితం దృష్ట్వా పూజార్హం(తం) సమపూజయత్ ||

తా|| అప్పుడు దశరథ మహారాజు ఉపస్థితుడైన ప్రియమైన అతిథిని చూచి పూజార్హుడైన అతనిని చక్కగా పూజించెను.

తతస్తాముషితో రాత్రిం సహపుత్త్రైర్మహాత్మభిః ||

స|| తతః పుత్రైః మహాత్మభిః సః తాం రాత్రిం ఉషితః ||

తా|| పిమ్మట పుత్త్రులు మహాత్ములతో కూడి ఆ రాత్రి సంతోషముతో గడిపెను.

ప్రభాతే పునరుత్థాయ కృత్వా కర్మాణి కర్మవిత్ |
ఋషీం స్తదా పురస్కృత్య యజ్ఞవాటముపాగమత్ ||

స|| (సః) ప్రభాతే పునః ఉత్థాయ కర్మాణి కర్మవిత్ కృత్వా తదా ఋశ్ఃఈం పురస్కృత్య యజ్ఞవాటం ఉపాగమత్ ||

తా|| ప్రభాత సమయమున మళ్ళీ లేచి చేయవలసిన కర్మలను చేసి అప్పుడు ఋషులను తో కలిసి యజ్ఞవాటికకు చేరెను.

యుక్తే ముహూర్తే విజయే సర్వాభరణ భూషితైః |
భాతృభిః సహితో రామః కృతకౌతుక మంగళః ||
వసిష్ఠం పురతః కృత్వా మహర్షీనపరానపి |
పితుః సమీప మాశ్రిత్య తస్థౌ భ్రాతృభిరావృతః|
వసిష్ఠో భగవానేత్య వైదేహీమిదమబ్రవీత్ ||

స|| యుక్తే విజయే ముహూర్తే సర్వాభరణ భూషితైః భాతృభిః సహితః రామః కృతకౌతుక మంగళః వసిష్ఠం అపరాన్ మహర్షీన్ అపి పురతః కృత్వా భ్రాతుభిః ఆవృత్తః పితుః సమీపం ఆశ్రిత్య తస్థౌ | భగవాన్ వసిష్ఠః వైదేహీం ఏత్య ఇదం అబ్రవీత్ ||

తా|| అప్పుడు తగిన శుభమైన ముహూర్తములో సర్వాభరణభూషితుడైన రాముడు సోదరులతో కూడి చేయవలసి మంగళకార్యక్రమములను చేసి వసిష్ఠుడు తదితర ఋషులతో కలిసి తండ్రిని సమీపించి నిలబడెను. అప్పుడు భగవాన్ వసిష్ఠ మహాముని జనకునితో ఇట్లనెను.

రాజా దశరథో రాజన్ కృత కౌతుక మంగళైః |
పుత్త్రైః నరవరశ్రేష్ఠ దాతారమ్ అభికాంక్షతే ||

స|| హే రాజన్ ! రాజాదశరథః నరవరశ్రేష్ఠ పుత్రైః కృతకౌతుక మంగళైః దాతారం అభికాంక్షతే ||

తా|| "ఓ రాజన్ ! దశరథ మహారాజు నరవరులలో శ్రేష్ఠుడైన తనపుత్రులతో చేయవలిసిన కౌతుక కర్మలను కావించి దాతవైన నీ కొరకు ఎదురుచూచున్నాడు".

దాతృప్రతిగ్రహీతృభ్యాం సర్వార్థాః ప్రభవంతి హి |
స్వధర్మం ప్రతిపద్యస్వ కృత్వా వైవాహ్యముత్తమమ్ ||

స|| దాతృప్రతిగ్రహీతుభ్యాం సర్వ అర్థాః ప్రభవంతి హి | ఉత్తమం వైవాహ్యమ్ కృత్వా స్వధర్మం ప్రతిపద్యస్వ ||

తా|| "దానము ఇఛ్చువాడు దానిని పరిగ్రహించువాడు ద్వారానే అన్నికార్యక్రమములు అగును కదా ! ఉత్తమమైన వివాహము జరిపించి నీ ధర్మమును అనుసరించుము".

ఇత్యుక్తః పరమోదారో వసిష్ఠేన మహాత్మనా |
ప్రత్యువాచ మహాతేజా వాక్యం పరమధర్మవిత్ ||

స|| ఇతి పరమ ఉదారః మహాత్మనా వసిష్ఠేన ఉక్తః మహాతేజా ( జనకః) పరమధర్మవిత్ వాక్యం ప్రత్యువాచ ||

తా|| అని పరమ ఉదారుడైన మహాత్ముడగు వసిష్ఠుని చే చెప్పబడిన మహాతేజోవంతుడు పరమ ధర్మజ్ఞుడు అయిన జనకుడు ఇట్లు ప్రత్యుత్తరము ఇచ్చెను.

కః స్థితః ప్రతిహారో మే కస్యాజ్ఞా సంప్రతిష్ఠతే |
స్వగృహే క్వ విచారోs స్తి యథారాజ్యమిదం తవ ||

స|| మే ప్రతిహారః కః స్థితః | కస్య ఆజ్ఞా సంప్రతిష్ఠతే | స్వగృహే క్వ విచారః యథా ఇదం రాజ్యం తవ అస్తి ||

తా|| ఇది మీ రాజ్యమేనని భావింపుడు . మిమ్ములను అడ్డగించువారు ఏక్కడ ? ఎవరి ఆజ్ఞకు ఎదురు చూచుచున్నారు? స్వగృహమున సంకోచమెందుకు?

కృతకౌతుక సర్వస్వా వేదిమూలముపాగతః |
మమ కన్యా మునిశ్రేష్ఠ దీప్తా వహ్నిరివార్చిషః ||

స|| హే మునిశ్రేష్ఠ ! మమకన్యా దీప్తా వహ్నిః ఇవఅర్చిషః కృతకౌతుకసర్వస్వాం వేదిమూలం ఉపాగతః |

తా|| ఓ మునిశ్రేష్ఠ ! నా పుత్రికలు చేయవలసిన కౌతుక కర్మలను చేసి వెలుగుచున్న అగ్నిజ్వాలలవలె తేజరిల్లుచూ వేదిక కడ ఉన్నారు.

సజ్జో హం త్వత్ప్రతీక్షో స్మి వేద్యామస్యాం ప్రతిష్ఠితః |
అవిఘ్నం కురుతాం రాజా కిమర్థ మవలంబతే ||

స|| అహం సజ్జః అస్యాం వేద్యాం ప్రతిష్ఠితః త్వత్ ప్రతీక్షః అస్మి | రాజా అవిఘ్నం కురుతాం కిమర్థమ్ అవలంబతే ||

తా|| నేను సర్వసన్నధుడనై ఆ వేదిక వద్ద మీ కొఅకు ప్రతీంక్షుచున్నాను. ఓ రాజా విఘ్నము లేకుండా చేయుదురుగాక. జాప్యము చేయవలదు.

తద్వాక్యం జనకేనోక్తం శ్రుత్వా దశరథస్తదా |
ప్రవేశయామాస సుతాన్ సర్వాన్ ఋషిగణానపి ||

స|| తదా దశరథః జనకేన ఉక్తం తత్ వాక్యం శ్రుత్వా సర్వాన్ సుతాన్ ఋషిగణాన్ అపి ప్రవేశయామాస ||

తా|| అప్పుడు దశరథుడు జనకునిచే చెప్పబడిన ఆ మాటలను విని తన పుత్రులందరితో ఋషిగణములతో ప్రవేశించెను.

తతో రాజా విదేహానాం వసిష్ఠమిదమబ్రవీత్ |
కారయస్వ ఋషేసర్వం ఋషిభిః సహ ధార్మిక |
రామస్య లోకరామస్య క్రియాం వైవాహికీం విభో ||

స|| తతః విదేహానాం రాజా వసిష్ఠం ఇదమ్ అబ్రవీత్ | హే ధార్మిక ఋషిభిః సహ లోకరామస్య సర్వం కారయస్వ ! హే విభో రామస్య వైవాహికీం క్రియాం (కారయస్వ!) ||

తా|| అప్పుడు విదేహ రాజు వసిష్ఠునితో ఇట్లనెను. "ఓ ధార్మిక ! ఋషులతో కూడి లోకరాముని సర్వకార్యములు చేయుడు. ఓ విభో ! రామునియొక్క వైవాహిక క్రియను జరిపింపుడు.

తథేత్యుక్త్వాతు జనకం వసిష్ఠో భగవాన్ ఋషిః |
విశ్వామిత్రం పురస్కృత్య శతానందం చ ధార్మికమ్ ||
ప్రపామధ్యేతు విధివత్ వేదిం కృత్వా మహాతపాః |
అలం చకార తాం వేదిమ్ గంధపుష్పైస్సమంతతః ||

స|| జనకం తథాస్తు ఇతి ఉక్త్వాఋషిః భగవాన్ వసిష్ఠః ధార్మికం విశ్వామిత్రం శతానందం పురస్కృత్య ప్రపామధ్యే విధివత్ వేదిం కృత్వా తాం వేదిం గంధపుష్పైః సమంతతః అలం చకార ||

తా|| జనకునితో అట్లేనని చెప్పి ఋషి భగవాన్ వసిష్ఠుడు ధార్మికుడైన విశ్వామిత్రుని తో శతానందునితో కలిసి యథావిథిగా వేదికను మండపు మధ్యలో చేసి ఆ వేదికను గంధపుష్పములతో అలంకరించెను.

సువర్ణపాలికాభిశ్చ ఛిద్రకుంభైశ్చ సాంకురైః |
అంకురాడ్యైశ్శరావై శ్చ ధూపపాత్రై స్సధూపకైః ||
శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః పాత్రైరర్ఘ్యాభిపూరితైః |
లాజపూర్ణైశ్చ పాత్రీభిః అక్షతైరభిసంస్కృతైః ||

స|| సువర్ణపాలికాభిః స అంకురైః చిద్రకుంభైః అంకురాఢ్యైః శరావైః చ స ధూపక ధూపపాత్రైః చ || శంఖపాత్రైః స్రువైః స్రుగ్భిః అర్ఘ్యాభిపూరితైః పాత్రైః లాజ పూర్ణైశ్చ పాత్రైః అక్షతైః అభిసంస్కృతైః ||

తా|| ఆ వేదిక సువర్ణ పాత్రలతో , అంకురములతో కూడిన చిల్లులు కల కడవలతోనూ, మొలకులతో ఒప్పుచున్న మూకుళ్ళతో , ధూపముతో కూడిన ధూపపాత్రలతో ( నిండియున్నది). శంఖపాత్రలతో స్రుక్సువములతోనూ , అర్ఘ్యజలముతో నిండిన పాత్రలతోనూ పేలాలతో కూడిన పాత్రలతో, అక్షతలతో కూడిన పాత్రలతో (వేదికను సిద్ధము చేసిరి).

దర్భైస్సమైస్సమాస్తీర్య విధివన్మంత్రపూర్వకమ్ ||
అగ్నిమాదాయ వేద్యాం తు విధిమంత్ర పురస్కృతమ్ |
జుహావాగ్నౌ మహాతేజా వసిష్ఠో భగవాన్ ఋషిః ||

స|| మంత్రపూర్వకం సమైః ధర్భైః విధివత్ సమాస్తీర్య వేద్యాం తు విధిమంత్ర పురస్కృతం అగ్నిం ఆదాయ మహాతేజః భగవాన్ వసిష్ఠః ఋషిః అగ్నౌ జుహావ ||

స|| మంత్రపూర్వకమైన సమానమైన దర్భలతో విధివశముగా వేదికను అలంకరించి, మంత్రపూర్వకముగా అగ్నిని తీసుకు వచ్చి, మహాతేజోవంతుడైన భగవాన్ వసిష్ఠుడు అగ్నిని వెలిగించెను.

శ్రీ సీతాకల్యాణ మహోత్సవ ఘట్టః

తతస్సీతాం సమానీయ సర్వా భరణ భూషితాం |
సమక్షేమగ్నే సంస్థాప్య రాఘవాభిముఖే తదా |
అబ్రవీజ్జనకో రాజా కౌసల్యా నందవర్ధనమ్ ||

స|| తతః సర్వ ఆభరణ భూషితాం సీతామ్ సమానీయ అగ్నే సమక్షే రాఘవ అభిముఖే సంస్థాప్య తదా రాజా జనకః కౌసల్యా నంద వర్థనం అబ్రవీత్ ||

తా|| అప్పుడు ఆని ఆభరణములతో అలంకరింపబడిన సీతను తీసుకు వచ్చి అగ్నికి ఏదురుగా , రాముని ఎదురుకుండా కూర్చునబెట్టి ఆ జనక మహారాజు కౌసల్యా నందవర్ధనునితో ఇట్లు పలికెను.

ఇయం సీతా మమసుతా సహధర్మచరీ తవ |
ప్రతీచ్ఛ చైనాం భద్రం తే పాణిం గృహ్ణీష్వ పాణీనా ||

స|| ఇయం మమసుతా సీతా తవ సహధర్మచారీ చ ఏనాం ప్రతీచ్ఛ | భద్రం తే | పాణిం పాణినా గృహ్ణీష్వ ||

తా|| నా కుమార్తె యగు ఈ సీత నీ సహధర్మచారిణిగా స్వీకరింపుము . నీకు శుభమగుగాక .(ఆమే) చేతిని (నీ) చేతిలో తీసుకొనుము.

పతివ్రతా మహాభాగా ఛాయేవానుగతా సదా |
ఇత్యుక్త్వా ప్రాక్షిపద్రాజా మంత్రపూతం జలం తదా ||

స|| మహాభాగా పతివ్రతా సదా ఛాయా ఇవ అనుగతా | ఇతి ఉక్త్వా రాజా మంత్రపూతం జలం తదా ప్రాక్షిపత్ |

తా|| "సర్వసౌభాగ్యవతి అయిన పతివ్రత ఎల్లప్పుడు నీకు నీడవలె అనుసరించును" అని పలికి మంత్రపూరితమైన జలమును ప్రక్షాలించెను.

సాధు సాధ్వితి దేవానాం ఋషీణాం వదతాం తదా |
దేవదుందుభి నిర్ఘోషః పుష్పవర్షో మహానభూత్ ||

స|| దేవానాం ఋషీణాం తదా సాధు సాధు ఇతి వదతాం | తదా దేవదుంధుభి నిర్ఘోషః మహాన్ పుష్పవర్షః అభూత్ |

తా|| దేవతలూ ఋషులు అప్పుడు "బాగు బాగు" అని పలికిరి. అప్పుడు దేవదుందుభులు మ్రోగెను. మహత్తరమైన పుష్పవృష్ఠి కురిశెను.

ఏవం దత్వా తదా సీతాం మంత్రోదకపురస్కృతామ్ |
అబ్రవీజ్జనకో రాజా హర్షేణాభి పరిప్లుతః ||

స|| తదా మంత్రోదక పురస్కృతాం సీతాం దత్వా రాజా జనకః హర్షేణ అభిపరిప్లుతః అబ్రవీత్ ||

తా|| అప్పుడు మంత్రోదకములతో సీతను ఇచ్చి జనక మహారాజు హర్షముతో పొంగిపోవుచూ ఇట్లు పలికెను.

లక్ష్మణాగచ్ఛ భద్రంతే ఊర్మిళాం ఉద్యతాం మయా |
ప్రతీచ్ఛ పాణిం గృహ్ణీష్వ మాభూత్ కాలస్య పర్యయః ||

స|| లక్ష్మణా ఆగచ్ఛ | భద్రంతే | మయా ఊర్మిళామ్ ఉద్యతాం ప్రతీచ్చ | పాణీం గృహ్ణీష్వ | కాలస్య పర్యయః మాభూత్ |

తా|| "లక్ష్మణా రమ్ము. నీకు శుభమగుగాక. నేను ఊర్మిళను ఇచ్చెదను. స్వీకరించుము . పాణిగ్రహణము చేయుము. ముహూర్తకాలము దాటకుండుగాక".

తమేవ ముక్త్వా జనకో భరతం చాభ్యభాషత |
గృహాణ పాణిం మాండవ్యాః పాణీన రఘునందన ||

స|| తం ఏవం ఉక్త్వా జనకః భరతం చ అభ్యభాషత |హే రఘునందన మాండవ్యాః పాణిం పాణీనా గృహాణ ||

తా||ఇట్లు పలికిన జనకుడు భరతునితో ఇట్లు పలికెను. "ఓ రఘునందన మాండవియొక్క చేయిని పాణిగ్రహణము చేయుము".

శతృఘ్నం చాపి ధర్మాత్మా అబ్రవీజ్జనకేశ్వరః |
శ్రుతకీర్త్యా మహాబాహో పాణిం గృహ్ణీష్వ పాణినా ||

స|| ధర్మాత్మా జనకేశ్వరః శతృఘ్నం చ అపి అబ్రవీత్ | హే మహాబాహో శ్రుతకీర్త్యా పాణిం పాణినా గృహ్ణీష్వ ||

స| ధర్మాత్ముడైన జనకుడు శతృఘ్నునితో ఇట్లు పలికెను. "ఓ మహాబాహో ! శ్రుతకీర్తి చేతిని పాణిగ్రహణము చేయుము ".

సర్వే భవంతః సౌమ్యాశ్చ సర్వే సుచరితవ్రతాః |
పత్నీభిస్సంతు కాకుత్ స్థ మాభూత్ కాలస్య పర్యయః ||

స|| హే కాకు‍త్‍స్థ ! భవంతః సర్వే సౌమ్యాః చ సర్వే సుచరితవ్రతాః పత్నీభిః సంతు| కాలయ పర్యయం మాభూత్ ||

తా|| "ఓ కకుత్‍‍స్థులారా ! మీరు అందరూ సౌమ్యులు. మీరందరూ మంచి చరిత్రకలవారు. మీభార్యలతో ( సుఖముగా) ఉందురుగాక. కాలము అతిక్రమించకూడదు".

జనకస్య వచః శ్రుత్వా పాణీన్ పాణిభిరస్పృశన్ |
చతారస్తే చతసౄణామ్ వసిష్ఠస్య మతే స్థితాః ||

స|| జనకస్య వచః శ్రుత్వా తే వసిష్ఠస్య మతే చతారః పాణీన్ చతసౄణాం పాణిభిః అస్పృసన్ స్థితాః ||

తా|| వసిష్ఠుని మదిలో నున్న అ జనకుని మాటలను విని నలుగురూ నలుగురు పాణిగ్రహణము చేసిరి.

అగ్నిం ప్రదక్షిణీకృత్యా వేదిం రాజానమేవ చ |
ఋషీంశ్చైవ మహాత్మానః స భార్యా రఘుసత్తమాః ||
యథోక్తేన తదా చక్రుర్వివాహమ్ విధిపూర్వకమ్ |

స|| రఘుసత్తమాః స భార్యా అగ్నిం వేదిం రాజానం ఋషీం చ ఏవ ప్రదక్షిణీ కృత్యా తదా విధిపూర్వకమ్ యథోక్తేన వివాహం చక్రుః ||

తా|| ఆ రఘుసత్తములు భార్యలతో కలిసి అగ్నివేదికనూ రాజులనూ ఋషులని ప్రదక్షిణము చేసి విధి పూర్వకముగా వేదములలో చెప్పిన విథముగా వివాహము చేసికొనిరి.

పుష్పవృష్టిర్మహత్యాసీత్ అంతరిక్షాత్ సుభాస్వరా |
దివ్య దుందుభి నిర్ఘోషైః గీతవాదిత్రనిస్వనైః ||
ననృతు శ్చాప్సరస్సంఘా గంధర్వాశ్చ జగుః కలమ్ |
వివాహే రఘుముఖ్యానాం తదద్భుత మదృశ్యత ||

స|| అంతరిక్షాత్ దివ్యదుందుభి నిర్ఘోషైః గీతవాదిత్ర నిస్వనైః సుభాస్వరా మహత్ పుష్పవృష్ఠిః ఆసీత్ | అప్సర సంఘాః చ ననృతు గంధర్వాః చ కలమ్ జగుః | రఘుముఖ్యానాం వివాహే తత్ అద్భుతం అదృశ్యత ||

తా|| అంతరిక్షమునుండి దివ్యదుందుభులు , గీత వాద్యములు మోగుచుండగా వెలుగుచున్న పుషవృష్ఠి కురిశెను. అప్సరసంఘములు నృత్యము చేసిరి. గాంధర్వులు గానము చేసిరి. రఘుముఖ్యుల వివాహము అత్యంత అద్భుతముగా జరిగెను.

ఈదృశే వర్తమానే తు తూర్యోద్ఘుష్టనినాదితే |
త్రిరగ్నిం పరిక్రమ్య ఊహూర్భార్యా మహౌజసః ||

స|| ఈదృశే తూర్యోద్ఘుష్టనినాదితే వర్తమానే తు మహౌజసః ఊహుః భార్యా త్రిరగ్నిం పరిక్రమ్య |

తా|| ఈ విథముగా తూర్యాది వాద్యములు మోగుచుండ తేజోమూర్తులైన ఆ దంపతులు మూడు సార్లు అగ్నికి ప్రదక్షిణము చేసిరి.

అథోపకార్యాం జగ్ముస్తే స భార్యా రఘునందనాః |
రాజాప్యనుయయౌ పశ్యన్ సర్షిసంఘస్సబాంధవః ||

స|| అథ ఉపకార్యం స భార్యా తే రఘునందనాః జగ్ముః | స ఋషిసంఘః స బాంధవః రాజా అపి పశ్యన్ అనుయయౌ |

తా|| పిమ్మట భార్యలతో కలిసి ఆ రఘునందనులు విడిదికి వెళ్ళిరి. ఋషిసంఘములతో బంధువులతో కూడి ఆ రాజు వారిని ఆనందముతో చూచుచూ వారిని అనుసరించెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే వాల్మీకీయే ఆదికావ్యే త్రిసప్తతితమస్సర్గః ||
సమాప్తం ||

||ఓమ్ తత్ సత్ ||

||Om tat sat ||