శ్రీమద్వాల్మీకి రామాయణము
బాలకాండ - డెబ్బది ఏడవ సర్గ
సీతా రాముల సుఖజీవనము !!
||om tat sat ||
బాలకాండ
డెబ్బది ఏడవసర్గ
అంతిమ సర్గ
గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః |
వరుణాయ అప్రమేయాయ దదౌ హస్తే స సాయకమ్ ||
అభివాద్య తతో రామో వసిష్ఠప్రముఖాన్ ఋషీన్ |
పితరం విహ్వలమ్ దృష్ట్వా ప్రోవాచ రఘునందనః ||
స|| రామే గతే ప్రశాంతాత్మా దాశరథి రామః అప్రమేయాయ వరుణాయ ధనుః స సాయకమ్ హస్తే దదౌ || తతః రామః వసిష్ఠ ప్రముఖాన్ ఋషీన్ అభివాద్య పితరం విహ్వలం దృష్ట్వా రఘునందనః ప్రోవాచ ||
తా|| పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథ రాముడు ప్రశాంతమనస్సుగలవాడై బాణములతో కూడిన ఆ ధనస్సును ప్రతిభావంతుడైన వరుణదేవుయొక్క చేతిలో అప్పగించెను. అప్పుడు రాముడు వసిష్ఠునితో కూడి తదితర ఋషులకు అభివాదనమొనర్చి అశ్చర్యపోయిన తండ్రిని చూచి ఇట్లు పలికెను.
జామదగ్న్యో గతో రామః ప్రయాతు చతురంగిణీ |
అయోధ్యాభిముఖీసేనా త్వయానాథేన పాలితా ||
సందిశస్వ మహారాజ సేనాం త్వచ్ఛాసనే స్థితామ్ |
శాసనం కాంక్షతే సేనా చాతకాళిర్జలమ్ యథా ||
స|| జామదగ్న్యః రామః గతః త్వయా నాథేన పాలితా అయోధ్యాభిముఖీ చతురంగిణీ సేనా ప్రయాతు ||హే మహారాజ త్వచ్ఛాసనే స్థితాం సేనాం సందిశస్వ| యథా చాతకాళిః జలమ్ (తథా) సేనా శాసనం కాంక్షతే ||
తా|| "జమదగ్నిపుత్త్రుడగు పరశురాముడు వెళ్ళిపోయెను. మీరు పాలించు అయోధ్యానగరము వేపు చతురంగ సేనలు వెళ్ళవచ్చు. ఓ మహరాజా ! మీ శాసనము కోసము నిలిచియున్న సేనలకి ఆజ్ఞని ఇవ్వుడు. చాతకపక్షులు జలము కొఱకు( వేచియుండునటుల) వలె సేనలు మీ ఆజ్ఞకొఱకు నిరీక్షించుచున్నవి".
రామస్య వచనం శ్రుత్వా రాజా దశరథస్సుతమ్ |
బాహుభ్యాం సంపరిష్వజ్య మూర్థ్నిచాఘ్రాయ రాఘవమ్ ||
గతో రామ ఇతి శ్రుత్వా హృష్టః ప్రముదితో నృపః |
పునర్జాతం తదా మేనే పుత్త్రమాత్మానమేవచ ||
చోదయామాస తాం సేనాం జగామాశు తతః పురీమ్ |
స|| రామస్య వచనం శ్రుత్వా దశరథః సుతం బాహుభ్యాం సంపరిష్వజ్య రాఘవం మూర్ధ్ని చ ఆఘ్రాయ ||రామ గతో ఇతి శ్రుత్వా ప్రముదితః హృష్టః నృపః పుత్త్రం ఆత్మానం ఏవ చ పునః జాతం మేనే ||తతః తాం సేనాం పురీమ్ జగామాశు చోదయామాస ||
తా|| రామునియొక్క ఆ మాటలను విని దశరథుడు తన పుత్రుని బాహువులతో కౌగలించుకొని తలని ఆఘ్రాణించెను. పరశురాముడు వెళ్ళెను అన్న మాటవిని అతి సంతోషముతో అ రాజు తనకు తన పుత్త్రులకు పునర్జన్మ కలిగినట్లు అనుకొనెను. అప్పుడు ఆ సేనలు ( అయోధ్యా) నగరమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను.
పతాకధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్టనినాదితామ్ ||
సిక్త రాజపథాం రమ్యాం ప్రకీర్ణకుసుమోత్కరామ్ |
రాజప్రవేశ సుముఖైః పౌరైర్మంగళవాదిభిః ||
సంపూర్ణామ్ ప్రావిశద్రాజా జనౌఘైః సమలంకృతామ్ |
పౌరైః ప్రత్యుద్గతో దూరం ద్విజైశ్చ పురవాసిభిః ||
స|| పతాక ధ్వజినీం రమ్యాం తూర్యోద్ఘుష్ట నినాదితామ్ ప్రకీర్ణకుసుమోత్కరామ్ రమ్యాం సిక్త రాజపథాం రాజప్రవేశ సుముఖైః పౌరైః మంగళవాదిభిః జనౌఘైః సమలంకృతామ్ సంపూర్ణామ్ రాజా ప్రావిశత్ | పౌరైః పురవాసిభిః ద్విజైః చ దూరం ప్రత్యుద్గతః ||
తా|| ధ్వజపతాకములతో తూర్యవాద్యధ్వనులతో ప్రతిధ్వనించుచున్న కుసుమములచే వెదజల్లబడిన రాజప్రవేశమునకు ఎదురుచూచుచున్న పౌరులతో మంగళవాద్యములతో జన సమ్మూహములతో నిండియున్న రాజమార్గములపై అ మహరాజు ప్రవేశించెను. పౌరులు పురజనులు బ్రాహ్మణులు దూరమునుండి ఏదురుగా వచ్చిరి.
పుత్రైరనుగతః శ్రీమాన్ శ్రీమద్భిశ్చ మహాయశాః |
ప్రవివేశ గృహం రాజా హిమవత్సదృశం పునః ||
ననంద సజనో రాజా గృహే కామై స్సుపూజితః ||
స|| రాజా శ్రీమాన్ మహాయశాః శ్రీమద్భిః పుత్రైః అనుగతః చ హిమవత్సదృశం గృహం పునః ప్రవివేశ | జనః కామే ననంద స రాజా గృహే సుపూజితః ||
తా|| ఆ రాజు మహాయశస్సు గల సకలగుణ సంపన్నులగు పుత్త్రులు అనుసరించుచుండగా హిమవత్సదృశమైన గృహమును ప్రవేశించెను. జనులు కోరికగలవారు సంతసించి ఆరాజును గృహములో పూజించిరి.
కౌశల్యాచ సుమిత్రా చ కైకేయీ చ సుమధ్యమా |
వధూప్రతిగ్రహే యుక్తా యాశ్చాన్యా రాజయోషితః ||
తతస్సీతాం మహాభాగాం ఊర్మిళాచయశస్వినీం |
కుశధ్వజసుతే చోభే జగృహుర్నృపపత్నయః ||
స|| సుమధ్యమా కౌసల్యాచ సుమిత్రా కైకేయీ చ అన్యా రాజయోషితాః చ వధూ ప్రతిగ్రహే యుక్తా || తతః మహాభాగామ్ యశస్వినీమ్ సీతా ఊర్మిళా చ ఉభే కుశధ్వజసుతే నృపత్నయః జగృహుః||
తా|| సౌందర్యవంతులగు కౌసల్య సుమిత్ర కైకేయీ తదితర రాజస్త్రీలు వధువుల ఉపచారములో నిమగ్నులైరి. అప్పుడు రాజపత్నులు మహా భాగ్యవంతులగు సీతా ఊర్మిళ అదేవిధముగా కుశధ్వజుని ఇద్దరు కుమార్తెలను ( అంతః పురములో ) ప్రవేశపెట్టిరి.
మంగళాలాపనైశ్చైవ శోభితాః క్షౌమవాసనః |
దేవతాయతనాన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్ ||
అభివాద్యభివాద్యాంశ్చ సర్వా రాజసుతాస్తదా |
స్వం స్వంగృహమథాసాద్య కుబేరభవనోపమం ||
గోభిర్ధనైశ్చ ధాన్యైశ్చ తర్పయిత్వా ద్విజోత్తమాన్ |
రేమిరే ముదితాః సర్వా భర్తృభిస్సహితా రహః ||
స|| (సా నృపత్నయః) మంగళాలాపనైశ్చైవ క్షౌమవాసనః దేవతాయతన అన్యాశు సర్వాస్తాః ప్రత్యపూజయన్ ||అథ అభివాద్యాంశ్చ అభివాద్య సర్వా రాజసుతా కుబేరభవన ఉపమం స్వం స్వం గృహం ఆసాద్య || ద్విజో త్తమాన్ గోభిః ధాన్యైః చ తర్పయిత్వా ముదితాః సర్వా భర్తృభిః సహితా రహః రేమిరే ||
తా|| సుగంధద్రవ్యములతో పట్టువస్త్రములు ధరించి ( ఆ నవవధువులు ) పూజాగృహములలో అన్ని దేవతలను పూజించిరి. అప్పుడు అభివందనము చేయతగినవారందరికి అభివాదనము చేసి ఆ రాజకుమార్తెలు కుబేరభవనముతో సమానమైన తమ తమ భవనములకు చేరిరి. బ్రాహ్మణులను గోవులతో ధాన్యములతో తృప్తి పరచి, సంతోషముతో తమభర్తలతో ఏకాంతముగా ఆనందించిరి.
కుమారాశ్చ మహాత్మానో వీర్యేణాప్రతిమా భువి |
కృతదారాః కృతాస్త్రాశ్చ సధనాస్ససుహృజ్జనాః ||
శుశ్రూషమాణాః పితరం వర్తయంతి నరర్షభాః |
కాలే కాలేతు నీతిజ్ఞాః తోషయంతో గురుం గుణైః ||
స|| మహాత్మానః కుమారాః చ భువి వీర్యేణ ప్రతిమా కృతాస్త్రాః చ స ధనా స సుహృజ్జనః కృతదారాః|| నరర్షభాః పితరం శుష్రూషమాణాః వర్తయంతి కాలే కాలేతు నీతిజ్ఞాః గురుం గుణైః తోషయంతః ||
తా|| లోకములో సాటిలేని మహాత్ములైన కుమారులు అస్త్రవిద్యనేర్చుకొనిన వారు, సంపదలతో బంధుమిత్రులతో భార్యలు కలవారు అయిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లితండ్రులకు శుశ్రూషచేయుచూ గడుపుచుండిరి. ఎల్లవేళలా ఆ నీతిజ్ఞులు గురువులను తమగుణములతో సంతోషపరుచుచుండిరి.
కస్యచిత్వథ కాలస్య రాజా దశరథస్సుతమ్ |
భరతం కైకయీపుత్త్రం అబ్రవీద్రఘునందనః ||
అయం కేకయరాజస్య పుత్త్రోవసతి పుత్త్రకః |
త్వాం నేతుమాగతో వీర యుథాజిన్మాతులస్తవ ||
ప్రార్థితస్తేన ధర్మజ్ఞ మిథిలాయామహం తథా |
ఋషిమధ్యేతు తస్య త్వం ప్రీతిం కర్తుమిహార్హసి ||
స|| అథ కస్యచ్త్ కాలస్య రాజా దశరథ సుతం కైకయాపుత్రం భరతం రఘునందనః అబ్రవీత్ || హే వీర అయం కేకయరాజస్య పుత్త్రః తవ మాతులః యుథాజిత్ త్వామ్ నేతుం ఆగతః || మిథిలాయామ్ అహం ఋషిమధ్యే ధర్మజ్ఞః తేన ప్రార్థితః తస్య త్వం ఇహ ప్రీతిం కర్తుమ్ అర్హసి ||
తా|| పిమ్మట కొంత కాలము తరువాత రాజా దశరథుడు కైకేయీపుత్రుడు భరతునితో ఇట్లు చెప్పెను. "ఓ వీర ! ఈ కేకయరాజపుత్రుడు నీ మేనమామ యుధాజిత్ నిన్ను తీసుకోనుటకు వచ్చెను. మిథిలానగరములో నేను ఋషులమధ్యలో ధర్మజ్ఞుడైన ఆయనచే ప్రార్థింపబడితిని. ఆయనకు ప్రీతిని కలిగించుటకు నీవు తగినవాడవు".
శ్రుత్వాదశరథస్యైతత్ భరతః కైకయాసుతః |
అభివాద్య గురుం రామం పరిష్వజ్య చ లక్ష్మణమ్|
గమనాయాభిచక్రామ శత్రుఘ్నసహితస్తదా ||
అపృచ్ఛ్య పితరం శూరో రామం చ క్లిష్టకారిణమ్ |
మాతౄశ్చాపి నరశ్రేష్ఠః శతృఘ్నసహితౌ యయౌ ||
స|| ఏతత్ శ్రుత్వా భరతః దశరథస్య కైకయాసుతః గురుం అభివాద్య రామం లక్ష్మణం పరిష్వజ్య శత్రుఘ్నసహితః తదా గమనాయ అభిచక్రామ|| నరశ్రేష్ఠః పితరం క్లిష్ఠకారిణమ్ రామం మాతౄశ్చాపి అపృచ్ఛ శతృఘ్నసహితౌ యయౌ |
తా|| ఆ మాటలను విని దశరథకుమారుడు కైకేయీపుత్త్రుడు అగు భరతుడు అప్పుడు గురువులకు అభివాదనమొనర్చి రామలక్ష్మణులను అలింగనముచేసికొని వెళ్ళుటకు సిద్ధమయ్యెను. ఆ నరశ్రేష్ఠుడు తండ్రి, తల్లుల ఇంకా క్లిష్ఠమైన కార్యములు చేయగల రాముని అనుమతి గైకొని శతృఘ్నునితో కలిసి ప్రయాణమయ్యెను.
గతేతు భరతే రామో లక్ష్మణశ్చ మహాబలః |
పితరం దేవసంకాశం పూజమాసతుస్తదా ||
పితురాజ్ఞాం పురస్కృత్య పౌరకార్యాణి సర్వశః |
చకార రామో ధర్మాత్మా ప్రియాణి చ హితాని చ ||
మాతృభ్యో మాతృకార్యాణి కృత్వా పరమయంత్రితః|
గురూణాం గురుకార్యాణి కాలే కాలేsన్వవైక్షత||
స|| భరతే గతేతు రామః మహాబలః లక్ష్మణశ్చ దేవసంకాశం పితరం తదా పూజయామాస ||పితుః ఆజ్ఞాం పురస్కృత్య రామః ధర్మాత్మా సర్వశః ప్రియాణి చ హితాని చ పౌరకార్యాణి చకార ||మాతృభ్యో మాతృకార్యాణి గురూణాం గురుకార్యాణి పరమ యంత్రితః కృత్వా కాలే కాలే అన్వవైక్షత ||
తా|| భరతుడు వెళ్ళిన తరువాత మహాబలుడైన రాముడు లక్ష్మణునితో కూడి దైవసమానులైన తల్లితండ్రులను పూజింపసాగెను. తండ్రి ఆజ్ఞప్రకారము ధర్మాత్ముడైన రాముడు ఏల్లప్పుడు అందరకూ హితము ప్రియముకూర్చునట్లు పౌరకార్యములు చేయుచుండెను. (రామ లక్ష్మణులు ) తల్లులకు చేయతగిన కార్యములు చేసి గురువులకు చేయతగిన గురుకార్యములు నియమములతో ఎల్లప్పుడూ నిర్వర్తించుచుండిరి.
ఏవం దశరథః ప్రీతో బ్రాహ్మణా నైగమాస్తదా |
రామస్య శీలవృత్తేన సర్వే విషయవాసినః ||
తేషామతియశా లోకే రామస్సత్యపరాక్రమః |
స్వయంభూరివ భూతానాం బభూవ గుణవత్తరః ||
స|| రామస్య శీలవృత్తేన దశరథః ప్రీతః | ఏవం బ్రాహ్మణాః నైగమాః తదా సర్వే విషయవాసినః || రామః సత్యపరాక్రమః అతిశయా లోకే భూతానాం స్వయంభూః ఇవ గుణవత్తరః బభూవ ||
తా|| రామునియొక్క సౌశీల్యముతో దశరథుడు సంతోషపడెను. అదేవిధముగా బ్రాహ్మణులు తదితర విషయములు గలవారు కూడా (రామునితో సంతోషపడిరి). సత్యపరాక్రముడైన రాముడు తనగుణములతో అన్ని భూతములకూ బ్రహ్మదేవునివలె ప్రీతిపాత్రుడయ్యెను.
రామస్తు సీతయా సార్థం విజహార బహూన్ ఋతూన్ |
మనస్వీ తద్గతస్తస్య నిత్యం హృది సమర్పితః ||
ప్రియాతు సీతా రామస్య దారాః పితృకృతా ఇతి|
గుణాద్రూపగుణచ్ఛాపి ప్రీతిర్భూయోsభ్యవర్ధత ||
స|| రామః తు సీతాయా మనస్వీ తద్గతః తస్య హృది నిత్యం సమర్పితః సార్థం బహూన్ ఋతూన్ విజహార ||రామస్య పితృకృతా దారాః ప్రియాతు ఇతి | గుణాత్ రూపగుణాశ్చాపి సీతా ప్రీతిర్భూయో అభ్యవర్తత ||
తా|| రాముడు సీతా యొక్క మనస్వీ అయ్యెను. అయనకు ఆమే హృదయము నిత్యము సమర్పితమాయెను. ఈవిథముగా పలు ఋతువులు విహరించిరి. తండ్రిచే భాగస్వామిని చేయబడిన ఆమె రామునియొక్క ప్రీతిపాత్రురాలయ్యెను. సద్గుణములతో రూపసౌందర్యములతో సీత ప్రేమపాత్రురాలై ఉండెను.
తస్యాశ్చ భర్తా ద్విగుణమ్ హృదయే పరివర్తతే |
అంతర్జాతమపి వ్యక్తం అఖ్యాతి హృదయం హృదా ||
తస్యభూయో విశేషేణ మైథిలీ జనకాత్మజా |
దేవతాభిస్సమా రూపే సీతా శ్రీరివ రూపిణః ||
స|| తస్యాశ్చ అంతర్జాతమపి అఖ్యాతి హృదయం హృదా భర్తాత్ ద్విగుణం హృదయే పరివర్తతే ||విశేషేణ మైథిలీ జనకాత్మజా సీతా రూపే దేవతాభిః సమా రూపిణః శ్రీః ఇవ తస్య భూయో ||
తా|| ఆమెకు భర్తపై ప్రేమ రెండు రెట్లాయెను. ఒకరిహృదయము మరియొకరు ఎఱిగినవారై తదనుగుణముగా మలుగుచుండిరి. విశేషముగా జనకాత్మజ రూపములో దేవతలతో సమానమైన మైథిలీ రూపములో లక్ష్మీదేవి వలెనున్న సీత రాముని దాయెను.
తయా స రాజర్షిసుతోs భిరామయా
సమేయివానుత్తమరాజకన్యయా |
అతీవ రామః శుశుభేతి కామయా
విభుశ్శ్రియా విష్ణురివామరేశ్వరః ||
స|| రాజర్షి సుతః రామః ఉత్తమరాజకన్యయా శ్రియా అమరేశ్వరః విభుః విష్ణుః ఇవ శుశుభేతి అతీవ కామయా సమేయివా ||
తా|| లక్ష్మీదేవి అమరేశ్వరుడు అగు మహావిష్ణువు తోకలిసినట్లు రాజర్షి కుమారుడు అయిన రాముడు ఉత్తమరాజపుత్రికయు అగు సీతతో కలిసి సకల సౌభాగ్యములతో శోబిల్లుచుండెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణేవాల్మీకీయే ఆదికావ్యే బాలకాండే సప్తసప్తతిమస్సర్గః||
ఈ విథముగా వాల్మీకి రామాయణములో బాలకాండ సమాప్తము
||ఓమ్ తత్ సత్ ||