శ్రీమద్వాల్మీకి రామాయణము
బాలకాండ - డెబ్బది ఏడవ సర్గ
సీతా రాముల సుఖజీవనము !!
||om tat sat ||
గతే రామే ప్రశాంతాత్మా రామో దాశరథిర్ధనుః |
వరుణాయ అప్రమేయాయ దదౌ హస్తే స సాయకమ్ ||
”
'పరశురాముడు వెళ్ళిన పిమ్మట దశరథ రాముడు ప్రశాంతమనస్సుగలవాడై బాణములతో కూడిన ఆ ధనస్సును ప్రతిభావంతుడైన వరుణదేవుయొక్క చేతిలో అప్పగించెను.'
బాలకాండ
అంతిమ సర్గ
పరశురాముడు మహేంద్రగిరికి వెళ్ళిన పిమ్మట దశరథ రాముడు ప్రశాంతమనస్సుగలవాడై బాణములతో కూడిన ఆ ధనస్సును ప్రతిభావంతుడైన వరుణదేవుయొక్క చేతిలో అప్పగించెను. పిమ్మట రాముడు వసిష్ఠునితో కూడి తదితర ఋషులకు అభివాదనమొనర్చి అశ్చర్యపోయిన తండ్రిని చూచి ఇట్లు పలికెను. "జమదగ్నిపుత్త్రుడగు పరశురాముడు వెళ్ళిపోయెను. మీరు పాలించు అయోధ్యానగరము వేపు చతురంగ సేనలు వెళ్ళవచ్చు. ఓ మహరాజ ! మీ శాసనము కోసము నిలిచియున్న సేనలకి ఆజ్ఞని ఇవ్వుడు. చాతకపక్షులు జలము కొఱకు వలె సేనలు మీ ఆజ్ఞకొఱకు నిరీక్షించుచున్నవి".
రామునియొక్క ఆ మాటలను విని దశరథుడు ప్రేమతో తన పుత్రుని బాహువులతో కౌగలించుకొని తలని ఆఘ్రాణించెను. "పరశురాముడు వెళ్ళెను" అన్న మాటవిని అతి సంతోషముతో అ రాజు తనకు తనపుత్త్రులకు పునర్జన్మ కలిగినట్లు అనుకొనెను. అప్పుడు ఆ సేనలను అయోధ్య నగరమునకు వెళ్ళుటకు ఆజ్ఞాపించెను.
దశరథ మహారాజు ధ్వజపతాకములతో తూర్యవాద్యధ్వనులతో ప్రతిధ్వనించుచున్న కుసుమములచే వెదజల్లబడిన రాజమార్గములపై అయోధ్యానగరము ప్రవేశించెను. రాజమార్గములు రాజప్రవేశమునకు ఎదురుచూచుచున్న పౌరులతో మంగళవాద్యములతో జనసమూహములతో నిండియుండెను . కొందరు పౌరులు పురజనులు బ్రాహ్మణులు దూరమునుండి ఏదురుగా గౌరవపూర్వకముగా వచ్చిరి.
ఆ రాజు మహాయశస్సు గల సకలగుణ సంపన్నులగు పుత్త్రులు అనుసరించుచుండగా హిమవత్ పర్వతములతో సమానమైన గృహమును ప్రవేశించెను. జనులు బంధువులు అందరూ సంతసించి ఆరాజును గృహములో పూజించిరి. సౌందర్యవంతులగు కౌసల్య సుమిత్ర కైకేయీ తదితర రాజస్త్రీలు వధువుల ఉపచారములో నిమగ్నులైరి. అప్పుడు రాజపత్నులు మహా భాగ్యవంతులగు సీతా ఊర్మిళా అదేవిధముగా కుశాధ్వజుని ఇద్దరు కుమార్తెలను అంతః పురములో ప్రవేశపెట్టిరి. సుగంధద్రవ్యములతో పట్టువస్త్రములు ధరించిన ఆ నవవధువులు పూజాగృహములలో అన్ని దేవతలను పూజించిరి. అప్పుడు అభివాదనము చేయతగినవారికి అందరికి అభివాదనము చేసి ఆ రాజకుమార్తెలు కుబేరభవనముతో సమానమైన తమ తమ భవనములకు చేరిరి. ఆ నవవధువులు బ్రాహ్మణులను గోవులతో ధాన్యములతో తృప్తి పరచి, సంతోషముతో తమభర్తలతో ఏకాంతముగా ఆనందించిరి.
లోకములో సాటిలేని మహాత్ములైన కుమారులు అస్త్రవిద్యనేర్చుకొనిన వారు, సంపదలతో బంధుమిత్రులతోకలవారు భార్యలు కల సంసారులు అయిరి. ఆ నరశ్రేష్ఠులు తల్లితండ్రులకు శుశ్రూషచేయుచూ గడుపుచుండిరి. ఎల్లవేళలా ఆ నీతిజ్ఞులు గురువులను తమగుణములతో సంతోషపరుచుచుండిరి.
పిమ్మట కొంత కాలము తరువాత రాజా దశరథుడు కైకేయీపుత్రుడు భరతునితో ఇట్లు చెప్పెను. "ఓ వీర ! ఈ కేకయరాజపుత్రుడు నీ మేనమామ యుధాజిత్ నిన్ను తీసుకోనుటకు వచ్చెను. మిథిలానగరములో నేను ఋషులమధ్యలో ధర్మజ్ఞుడైన ఆయనచే ప్రార్థింపబడితిని. ఆయనకు ప్రీతిని కలిగించుటకు నీవు తగినవాడవు". ఆ మాటలను విని దశరథకుమారుడు కైకేయీపుత్త్రుడు అగు భరతుడు గురువులకు అభివాదనమొనర్చి రామలక్ష్మణులను అలింగనముచేసికొని తన మేనమామతో అప్పుడు వెళ్ళుటకు సిద్ధమయ్యెను. ఆ నరశ్రేష్ఠుడు అగు భరతుడు తండ్రిని క్లిష్ఠమైన కార్యములు చేయగల రాముని , అలాగే అందరు తల్లుల అనుమతి గైకొని శతృఘ్నునితో కలిసి ప్రయాణమయ్యెను.
భరతుడు వెళ్ళిన తరువాత మహాబలుడైన రాముడు లక్ష్మణునితో కూడి దైవసమానులైన తల్లితండ్రులను పూజింపసాగెను. తండ్రి ఆజ్ఞప్రకారము ధర్మాత్ముడైన రాముడు ఏల్లప్పుడు అందరుకూ హితము ప్రియముకూర్చునట్లు పౌరకార్యములు చేయుచుండెను. తల్లులకు చేయతగిన కార్యములు చేసి గురువులకు చేయతగిన గురుకార్యములు నియమములతో ఎల్లప్పుడూ నిర్వర్తించుచుండెను. రామునియొక్క సౌశీల్యముతో దశరథుడు సంతోషపడెను. అదేవిధముగా బ్రాహ్మణులు తదితర విషయములు గలవారు కూడా రామునితో సౌశీల్యముతో సంతోషపడిరి. సత్యపరాక్రముడైన రాముడు తనగుణములతో అన్ని భూతములకూ బ్రహ్మదేవునివలె ప్రీతిపాత్రుడయ్యెను.
రాముడు సీతా యొక్క మనస్వీ అయ్యెను. అయనకు ఆమె హృదయము నిత్యము సమర్పితమాయెను. ఈవిథముగా పలుఋతువులు వారిద్దరూ విహరించిరి. తండ్రిచే భాగస్వామిని చేయబడిన సీత రామునియొక్క ప్రీతిపాత్రురాలయ్యెను. సద్గుణములతో రూపసౌందర్యములతో సీత రాముని ప్రేమపాత్రురాలై ఉండెను. ఆమెకు భర్తపై ప్రేమ రెండు రెట్లాయెను. సీతా రాములు ఒకరి హృదయము మరియొకరు ఎఱిగినవారై తదనుగుణముగా వారిద్దరూ మలుగుచుండిరి. విశేషముగా జనకాత్మజ రూపములో దేవతలతో సమానమైన మైథిలీ రూపములో లక్ష్మీదేవి వలెనున్న సీత రాముని దాయెను.
లక్ష్మీదేవి అమరేశ్వరుడు అగు మహావిష్ణువుతో కలిసినట్లు రాజర్షి కుమారుడు అయిన రాముడు ఉత్తమరాజపుత్రికయు అగు సీతతో కలిసి సకల సౌభాగ్యములతో శోబిల్లుచుండెను.
||ఈవిథముగా వాల్మీకి రామాయణములోని బాలకాండలో దెబ్బది ఏడవసర్గ సమాప్తము.||
||ఇంతటితో బాలకాండ సమాప్తము||
||ఓమ్ తత్ సత్ ||
తయా స రాజర్షిసుతోs భిరామయా
సమేయివానుత్తమరాజకన్యయా |
అతీవ రామః శుశుభేతి కామయా
విభుశ్శ్రియా విష్ణురివామరేశ్వరః ||
తా|| లక్ష్మీదేవి అమరేశ్వరుడు అగు మహావిష్ణువు తోకలిసినట్లు రాజర్షి కుమారుడు అయిన రాముడు ఉత్తమరాజపుత్రికయు అగు సీతతో కలిసి సకల సౌభాగ్యములతో శోబిల్లుచుండెను.
||ఓమ్ తత్ సత్ ||
||Om tat sat ||