||సుందరకాండ ||
||పదకొండవ సర్గ తెలుగులో||
|| Om tat sat ||
||ఓమ్ తత్ సత్||
శ్లో||అవధూతాయ చ తాం బుద్ధిం బభూవాస్థిత తదా|
జగామ చాపరాం చింతాం సీతాం ప్రతి మహాకపిః||1||
స|| మహాకపిః తాం బుద్ధిం అవధూయ అవస్థితః బభూవ| సీతాం ప్రతి అపరం చింతాం జగామ||
తా|| ఆ మహాకపి అ అలోచన తిరస్కరించి అక్కడ ఆగిపోయెను. సీత గురించి ఇంకొక విధముగా అలోచనలో పడెను
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ ఏకాదశస్సర్గః
మండోదరిని చూచి మహదానందము పొందిన హనుమంతుడు , ఒక క్షణము ఆగి తను చూచినది సీత కాదని ఆ అలోచన తిరస్కరించి అక్కడ ఆగిపోయెను.
సీత గురించి ఇంకొక విధముగా అలోచనలో పడెను.
" సీతా దేవి రాముని విరహముతో ఆ దేవి నిద్రపోలేదు. భుజింపలేదు. అలంకరించుకొనలేదు. పానములు గైకొనలేదు. సురలలోని ఈశ్వరుడైన గాని ఇంకొక నరుని సమీపించదు. రాముని తో సమానులు దేవులలో కూడా లేరు".
అలా చూడబడిన ఆమె ఇంకెవరో అని నిశ్చయించుకొని ఆ హనుమంతుడు పానభూమిలో మరల తిరగసాగెను. అక్కడ కొందరు స్త్రీలు కామక్రీడలతో అలిసిపోయిరి. కోందరు నృత్యముతో అలిసిపోయిరి. కొందరు మద్యపానముతో మత్తిల్లిపడిరి. ఇంకోందరు మురజముల మీద మృదంగముల మీద పీఠములమీద నిద్రించుచున్నారు. కొందరు మెత్తని పరుపులపై నిద్రిస్తున్నారు. ఆ వానరోత్తముడు అందమైన ఆభరణములతో అలంకరింపబడి రూపసల్లాపములతో తగిన భాషగల పాటలతో, దేశకాలానుగుణముగా ఉన్నవారు , రతిని అనుభవించి నిద్రిస్తున్నవారు అలాగ వేలకొలదీ స్త్రీలను చూచెను.
వారిమధ్యలో మహాబాహువులు కల రాక్షస రాజు గోశాలలో గోవుల మద్య విరాజిల్లుచున్న ఆంబోతు వలె శోభిస్తున్నాడు. వారిచే చుట్టబడి ఆ రాక్షసేంద్రుడు మహారణ్యములో ఆడ ఏనుగుల మధ్యలో నున్న మదపుటేనుగు వలె శోభిస్తున్నాడు.
ఆ వానరులలో శార్దూలము వంటి ఆ మహాత్ముడు అన్నికోరికలకి తగు పానములున్న పానభూమిని ఆ రాక్షసరాజు గృహములో చూచెను.
ఆ పానభూమిలో విడివిడిగా అమర్చబడిన లేళ్ళ మాంసము, దున్నలమాంసము , వరాహముల మాంసము చూచెను. ఆ వానరోత్తముడు పెద్దపెద్ద బంగారు పాత్రలలో సగము తిని విడిచిపెట్టిన నెనలి మాంసము, కోడిమాంసము చూచెను. పెరుగు సౌవర్చమనే లవణముతో ఊరిపోసిన ఎముకలను, వరాహము వార్ద్రాణసకాలనే పక్షుల లేళ్ళ నెమళ్ళ మాంసాలను కూడా చూచెను. అక్కడ సిద్ధముగానున్న కొక్కెర మరియు చకోర పక్షుల , దున్నపోతుల, ఒకే ఎముక గల మత్స్యముల, మేకల మాంసమును, లేహ్యములను , పేయములను, భోజింపతగిన అనేక రకముల పదార్థములను చూచెను. అలాగే ఆమ్ల లవణములు ముఖ్యముగా గల వివిధరకముల రసములతో చేసిన భక్ష్యములతో, అమూల్యమైన హరములతో కేయూరములతో, పెద్ద పానపాత్రలలో ఉంచబడిన అనేకరకములైన ఫలములతో, పుష్పములతో వెదజల్లబడిన ఆ పానశాల భూమి ఎంతో శోభను సంతరించుకున్నది.
ఆ పాన శాల అక్కడక్కడ అందముగా అమర్చబడియున్న శయనాసనములతో అగ్నిలేకుండా ప్రజ్వలిస్తున్నట్లుగా వున్నది. అనేకప్రకారములైన విధముగా కుశలులైన వంటవారు చేసిన భక్ష్యములతో మాంసములతో అ పానశాల అమర్చబడియున్నది. దివ్యమైన ప్రసన్నాత్మకమైన అనేకరకముల పానీయములు చక్కెర తేనెపువ్వులు ఫలముల తో చేయబడిన పానీయములు అనేక రకములైన వాసనగల చూర్ణములతో కలపబడినవి. ఆ పానభూమి మాలలతోనూ, బంగారు స్ఫటికములతో చేయబడిన పాత్రలతోనూ, బంగారుమయమైన ఇతర పాత్రలతో నిండి శోభించుచుండెను.
ఆ వానరుడు వెండి బంగారు పాత్రలలో నింపబడిన శ్రేష్ఠమైన మద్యమును చూసెను. ఆ మహాకపి మద్యముతో నింపబడిన బంగారు పాత్రలను, మణిమయమైన వెండి పాత్రలను చూచెను. మద్యముతో కొన్ని సగమే నింపబడి వున్నవి. కొన్ని పూర్తిగా తాగివేయబడివున్నవి, కొన్ని ముట్టుకోబడినట్లు లేనివి. అట్టివాటిని అక్కడ హనుమంతుడు చూచెను. ఒకచోట అనేకరకములైన భక్ష్యములను, ఒక చోట విడిగా ఉంచబడిన పానీయములను, ఒకచోట మిగిలిపోయిన వాటినీ చూస్తూ ఆ వానరుడు తిరుగసాగెను. ఒక చోట పగిలన పాత్రలను, ఒక చోట దొర్లుతున్నపాత్రలను, ఒకచోట తడిసిన పుష్ప మాలలను, ఫలములను చూచెను.
అక్కడ కొన్ని నారీమణుల శయనములు శుభ్రముగా వున్నాయి. కొందరు నారీమణులు ఒకరినొకరు కౌగలించుకొని నిద్రపోతున్నారు. కోందరు నిద్రావశులై పక్కనే నిద్రిస్తున్న ఇతర స్త్రీల వస్త్రములను లాగుకొని గాఢనిద్రలో ఉన్నారు. వాళ్ళ శరీరము మీద వున్న వస్త్రములు పూలమాలలు వారి ఉచ్ఛ్వాస నిశ్వాసముల పిల్ల మారుతముతో కొంచెము కదులుతూ వున్న దృశ్యము స్పందించుచున్నది.
అప్పుడు చల్లని చందనము , మధురమై న పానీయములు వివిధ రకముల పూలమాలల ధూపముల సువాసనలతో కూడిన వాయువు అన్ని చోట్ల వీచ సాగెను. అప్పుడు పుష్పక విమానములో స్నాన యోగ్యమైన చందనము ధూపముల సుగంధవాసనలు మూర్ఛింప చేస్తూ వీచ సాగాయి.
ఆ రాక్షసాలయములో ఇంకొందరు శ్యామ వర్ణపువారు , కొంతమంది కృష్ణ వర్ణమువారు , కొందరు సువర్ణవర్ణము కలవారు కలరు. నిద్రావశులై కామక్రీడలవల మూర్ఛితులైన నిద్రపోతున్న వారిరూపములు చూస్తే వారు ముకుళించిన పద్మములు వలే ఉన్నారు.
ఆ మహాతేజోవంతుడైన వానరుడు ఇదంతా రావణాంతఃపురములో శేషములేకుండా చూచెను.
కాని రామపత్ని అగు సతీ జానకి మాత్రము కనపడలేదు.
అలాగ స్త్రీలను నిరీక్షించిన ఆ మహాకపి ధర్మలోపము జరిగెనా అని శంకతో గొప్ప ఆలోచనలో పడెను. 'నిద్రించుచున్న పరులభార్యలు ఈ విధముగా చూచుట వలన ధర్మలోపము కలిగినది .ఇప్పుడు నా చేత పరులభార్యలు చూడబడిరి. కాని నా దృష్టి విషయాను రూపము కాదు".
మనోబలసంపన్నుడు , నిశ్చయముగా ఏకాగ్ర చిత్తము కలవాడు కార్యనిర్ణయము చక్కగా తెలినవాడు అయిన హనుమంతుడు ఇంకొవిధముగా అలోచించ సాగెను.
' రావణుని పై విశ్వాసము గల రావణ స్త్రీలు నాచేత తప్పక చూడబడిరి. కాని నా మనస్సులో ఏవిధమైన వికారము కలగలేదు. శుభ అశుభ అవస్థలలో అన్ని ఇంద్రియముల ప్రవర్తనకి మనసే కారణము. అక్కడ నా మనస్సు స్థిరముగా నున్నది. వైదేహి ని ఇంకొకచోట వెదుకుట నాకు శక్యము కాదు ఎందుకనగా స్త్రీలను స్త్రీలమధ్య వెదుకుట సమంజసము. ఏ జాతి యొక్క ప్రాణిని ఆ జాతి వారలో వెదకవలసినదే. వెదకబడ వలసిన స్త్రీని లేళ్ల మధ్యలో వెదుకుట కుదరదు. ఆ రావణ అంతః పురము శుద్ధమైన మనస్సుతో నాచే వెదకబడినది. కాని జానకి కనపడలేదు' అని.
దేవగంధర్వ కన్యలు నాగకన్యలు చూస్తున్న హనుమంతునికి జానకి కనపడలేదు.
వీరుడైన ఆ వానరుడు సీతను చూడక వరస్త్రీలను చూచి అప్పుడు అన్వేషణ చాలించి మళ్ళీ అలోచనాపరుడయ్యెను.
ఆ శ్రీమంతుడైన హనుమంతుడు పానశాలనుంచి బయటకు వచ్చి మళ్ళీ యత్నపూర్వకముగా సీతను వెదుకుటకు మొదలుపెట్టెను.
||ఓమ్ తత్ సత్||
శ్లో||సభూయ స్తాం పరం శ్రీమాన్ మారుతిర్యత్న మాస్థితః|
అపానభూమి ముత్సృజ్య తద్విచేతుం ప్రచక్రమే||47||
స|| శ్రీమాన్ సః మారుతిః ఆపానభూమిం ఉత్సృజ్య భూయః పరం యత్నం ఆస్థితః తత్ విచేతుం ఉపచక్రమే||
తా|| ఆ శ్రీమంతుడైన హనుమంతుడు పానశాలనుంచి బయటకు వచ్చి మళ్ళీ యత్నపూర్వకముగా సీతను వెదుకుటకు మొదలుపెట్టెను.
||ఓమ్ తత్ సత్||
||ఓమ్ తత్ సత్||