||సుందరకాండ ||
||పదమూడవ సర్గ తెలుగు శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||
|| Sarga 13 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ శ్లోకార్థ తత్త్వదీపికా సహిత
త్రయోదశస్సర్గః ||
జీవన్ భద్రాణి పశ్యతి - జ్ఞానమయకోశము లో హనుమంతుడు-
మహాకవి వాల్మీకి, సుందరకాండలో అద్భుత జీవన రహస్యాలు వెల్లడిచేస్తారు. అవి తెలిసినమాటలే అవవచ్చు. రహస్యము కానే కాకపోవచ్చు. అశ్చర్యపడవలసిన మాటలుకూడా కాకపోవచ్చు. కాని మరుగుపడి పోయిన కారణము వలన అవి రహస్యాలులా అనిపిస్తాయి. జీవిస్తే శుభములను చూడవచ్చు, అంటే మరణము ఏమీ సాధించదు అని. సీతమ్మ కష్టాలలో వుండి, 'యమస్య మూలం గమిష్యామి' అంటే యముడి దగ్గరకి పోదామా అనుకునే సందర్భము వచ్చిన వెంటనే, జీవించడము కోసమా అన్నట్లు శుభ శకునములు కనిపిస్తాయి. అలాగ లంకలో అన్వేషణలో చిక్కుకుపోయి, సీతమ్మ ఎక్కడా కనపడటల్లేదు అని, కనపడకపోతే ఏమి అవుతుందో అని వాపోతున్న సమయములో, సీతమ్మ అయోనిజ, జనకాత్మజ జనకునికి తనకు తానే కనపడినట్లు , ఇక్కడ కూడా ఆమె దర్శనమివ్వాలి అనే అలోచన వచ్చినదా అన్నట్లు, హనుమ సీతమ్మని రామ లక్ష్మణులను ప్రార్థించి అన్వేషణ కొనసాగిస్తూవుంటే , అత్మాన్వేషణలో జ్ఞానకోశములో చేరిన ముముక్షువులాగ కనిపిస్తాడు హనుమ ఈ సర్గలో. ఎన్నో మలుపులు తిరిగే ఈ సర్గ అత్యంతరసవత్తరమైన సర్గ అనుకోవచ్చు
టీకాత్రయములో చాలా క్లుప్తముగా ఈ సర్గ మీద చెప్పిన మాట. - 'పుష్పకవిమానాత్ నిర్గతో హనుమాన్ విద్యుత్వేగేన సర్వతో అన్విష్యాపి అలబ్ధ సీతాదర్శనః తస్యా వినాశమేవాదర్శనే హేతుత్వేనోత్ప్రేక్షతే। జానక్యా అనుపలబ్ధీ రామే నివేదితానివేదితాపి అనేక మహానర్థాన్ ఆది విచిన్త్య ప్రతిప్రయాణాన్నివృత్తః ప్రాయోపవేశనం ప్రాణమోక్షణం రావణ మారణం వా యావత్ విచిన్తయతీ తావత్ ఏకాం వనవాటికాం అనన్వేషితాం నిర్ధార్య తాం అన్వేష్ఠుం ఉపక్రాన్తః స్వోద్యోగసాఫల్యాపాదనార్థం ఋషీం దేవగణం బ్రహ్మాదీన్ ప్రార్థయతే।'
అంటే 'పుష్పక విమానము నుంచి విద్యుత్వేగముతో బయటపడిన హనుమ అంతా అన్వేషించినా సీతమ్మ కనపడలేదు, అందువలన కలిగే వినాశము గురించి అలోచిస్తాడు. జానకి కనపడలేదని రామునికి చెప్పినా, చెప్పకపోయినా కలిగే మహా అనర్థములను సమీక్షించి, తిరుగుప్రయాణము కూడా తిరస్కరించి, ప్రాయోపవేశమా లేక రావణుని చంపడము అలోచిస్తూ వుండగా కనపడిన అన్వేషించబడని అశోకవనము అన్వేషించడానికి నిర్ణయించి, తన ప్రయత్నము సఫలము కావడానికి సీతా రామ లక్ష్మణులను, దేవతలను, ఋషులను, బ్రహ్మను, హనుమ ప్రార్థిస్తాడు' అని.
పదమూడవ సర్గలో జరిగిన కథ అంత క్లుప్తముగా కాకపోయినా ఈ విధముగా చెప్పవచ్చు.
సీత రావణుని భవనము లో వున్నదని సంపాతి చెప్పినా గాని, సీతాదేవి ఎక్కడా కనిపించక పోవడముతో మనోమయకోశమైన రావణ భవనములో తిరుగుతూ వున్న హనుమంతుని మనస్సు పరిపరివిధములుగా పరిగెడుతుంది.
ముందుగా ఆ సీతాదేవి కనపడకపోవడముతో హనుమంతుని మనస్సుచేసే పరుగులు చూస్తాము. ఆ ఆలోచనలు సీతమ్మ భయపడి చనిపోయినదేమో అన్నమాటనుంచి, రావణ స్త్రీలచేత చంపబడినదేమో అన్నమాట దాకా వేళతాయి. అంతటితో ఆగవు. హనుమంతుని మనస్సు ఇంకా పరిగెడుతుంది. 'రాముని ప్రియమైన భార్య చంపబడినను, చిత్రవధ చేయబడినను, మరణించిననూ ఆ విషయము చెప్పుట భావ్యము కాదు. చెప్పుటచే దోషము కలుగును. చెప్పకపోయిననూ కూడా దోషమే. ఈ కార్యములో ఏది శ్రేయస్కరము', అని హనుమంతుడు మళ్ళీ దీర్ఘ విచారణలో పడతాడు.
ఆ ఆలోచనలు తను సీతను చూడకుండా లంకానగరము నుంచి కిష్కింధ వెళ్ళిపోతే జరిగే విషయాలపై పోతాయి. ఆ ఆలోచనలు క్రమముగా సీత కనపడలేదు అనే మాటను విని కాగల ఇక్ష్వాకు వంశనాశనము, అదే కారణముగా వానరుల నాశనము దాకావెళ్ళిపోతాయి. ఆ ఆలోచనలకి అంతముగా, "నేను మైథిలిని చూడకుండా కిష్కింధనగరము వెళ్ల కూడదు. నేను మైథిలి చూడకుండా సుగ్రీవుని చూడను", అనే స్థితికి వస్తాడు. మళ్ళీ ఆ ఆలోచనలు సీతాన్వేషణపై మళ్ళి, దానికి కారకుడైన రావణుని పైకి వెళ్ళుతాయి. ఆ దశగ్రీవుని వధించడమా లేక పశుపతికి ఇవ్వబడు పశువు వలె రావణుని తీసుకొని పోయి రాముని కి సమర్పించడమా అనే విషయముపై మళ్ళుతాయి. చివరికి హనుమంతుడు " రామపత్నీ యశస్వినీ అగు సీతజాడ కనపడువరకు ఈ లంకానగరమును మళ్ళీ మళ్ళీ వెదకెదను" అని అనుకొని, అప్పుడు కనపడుతున్న అశోకవనములో వెదకడానికి నిశ్చయించుకుంటాడు.
ఆ మహాతేజోవంతుడు మారుతాత్మజుడు అగు హనుమంతుడు కాసేపు ధ్యానము చేసి, దుఃఖమనే బంధమును తెంచుకొని నిలబడి ప్రార్థనచేస్తాడు. "లక్ష్మణునితో కూడిన రామునకు నమస్కారము. దేవి అయిన జనకాత్మజకు నమస్కారము. రుద్రుడు ఇంద్రుడు యముడు అనిలుడు, వీరందరికీ నమస్కారములు. చంద్రునకు, సూర్యునకు మరుత్ గణములకు నమస్కారము". ఈ విధముగా అందరికీ ప్రణామములు అర్పించిన ఆ వానరుని మనస్సు, ముందరే అశోకవనము చేరుతుంది. తదనంతర కర్తవ్యము గురించి సీత ఎలాకనపడునో అని ఆలోచనలో పడతాడు హనుమ.
ఇక పద మూడవ సర్గ శ్లోకాలు, అర్థ తాత్పర్యాలతో.
||శ్లోకము 13.01||
విమానుత్తు సుసంక్రమ్య ప్రాకారం హరియూథపః |
హనుమాన్వేగవానాసీత్ యథా విద్యుద్ఘనాంతరే ||13.01||
స|| హరియూథపః విమానాత్ సుసంక్రమ్య ప్రాకారం వేగవాన్ యథా విద్యుత్ ఘనాంతరే ఆసీత్||
||శ్లోకార్థములు||
హరియూథపః విమానాత్ సుసంక్రమ్య -
ఆ వానరోత్తముడు విమానము నుంచి దిగి
ప్రాకారం వేగవాన్ ఆసీత్ -
ప్రాకారము వేగముగా చేరెను
యథా విద్యుత్ ఘనాంతరే -
మెఱుపు మెరిసినట్లు లాగ
||శ్లోకతాత్పర్యము||
ఆ వానరోత్తముడు విమానము నుంచి దిగి ప్రాకారము మీదకి మెఱుపు మెరిసినట్లు దూకెను. ||13.01||
||శ్లోకము 13.02||
సంపరిక్రమ్య హనుమాన్ రావణస్య నివేశనాత్ |
అదృష్ట్వా జానకీం సీతాం అబ్రవీత్ వచనం కపిః ||13.02||
స|| సీతాం జానకీం అదృష్ట్వా హనుమాన్ రావణస్య నివేశనాత్ సంపరిక్రమ్ కపిః (ఇదం) వచనం అబ్రవీత్ ||
తిలక టీకాలో - రావణస్య నివేశనాన్ గృహాన్ సంపరిక్రమ్య పునః పరిక్రమణేన దృష్ట్వా జానకీం చ అదృష్ట్వా అబ్రవీత్| ఆత్మనైవేతి బోధ్యమ్||
||శ్లోకార్థములు||
హనుమాన్ రావణస్య నివేశనాత్ సంపరిక్రమ్య -
హనుమంతుడు రావణ భవనము చుట్టూ తిరిగి
సీతాం జానకీం అదృష్ట్వా -
జానకి అయిన సీతను చూడలేకపోయి
(ఇదం) వచనం అబ్రవీత్ -
ఈ మాటలను చెప్పెను
||శ్లోకతాత్పర్యము||
సీత ఎక్కడా కనిపించకపోవడముతో రావణ భవనము బయట తిరుగుతూ ఇట్లా అనుకొనెను. ||13.02||
||శ్లోకము 13.03||
భూయిష్టం లోళితా లంకా రామస్య చరతా ప్రియమ్ |
న హి పశ్యామి వైదేహీం సీతాం సర్వాంగశోభనామ్ ||13.03||
స|| రామస్య ప్రియం (కర్తుమ్) చరతా లంకా భూయిష్ఠం లోళితా అపి సర్వాంగశోభనామ్ వైదేహీం సీతాం న హి పశ్యామి ||
||శ్లోకార్థములు||
రామస్య ప్రియం (కర్తుమ్) లంకా చరతా -
రాముని కార్యము చేయుటకు లంకలో సంచరిస్తూ
భూయిష్ఠం లోళితా అపి - పూర్తిగా వెదికితినాగాని
సర్వాంగశోభనామ్ వైదేహీం సీతాం న హి పశ్యామి -
సర్వాంగములతో శోభాయమానముగా వుండు సీత మాత్రం కనపడలేదు
||శ్లోకతాత్పర్యము||
'రాముని కార్యము చేయుటకు సంచరిస్తూ లంక అంతా తిరిగితిని. కాని సర్వాంగములు శోభాయమానముగావుండు సీత మాత్రం కనపడలేదు'. ||13.03||
||శ్లోకము 13.04||
ప్లవనాని తటాకాని సరాంసి సరితస్తథా |
నద్యోఽనూపవనాంతాశ్చ దుర్గాశ్చ ధరిణీధరాః ||13.04||
లోళితా వసుధా సర్వా న తు పశ్యామి జానకీమ్ |
స|| ప్లవనాని తటాకాని సరాంసి సరితః తథా నద్యాః అనూపవనాంతాశ్చ దుర్గాః ధరణీ ధరాః వసుధా సర్వాః లోళితా జానకీం న పశ్యామి తు ||
||శ్లోకార్థములు||
ప్లవనాని తటాకాని-
నీటి గుంటలు, తటాకములు
సరాంసి సరితః తథా నద్యాః -
సరస్సులు వాగులు అలాగే నదులూ
అనూపవనాంతాశ్చ - ఉపవనముల చుట్టూ
దుర్గాః ధరణీ ధరాః వసుధా సర్వాః లోళితా -
దుర్గములు కొండలు భూమి అంతా వెదికితిని
జానకీం న పశ్యామి తు -
కాని జానకీమాత కనపడలేదు.
||శ్లోకతాత్పర్యము||
'నీటి గుంటలు తటాకములు సరస్సులు నదులూ అలాగే ఉపవనముల చుట్టూ , దుర్గములు కొండలూ ఇక్కడ వున్న అన్ని ప్రదేశములను వెతికితిని. కాని జానకి కనపడలేదు'. ||13.04||
||శ్లోకము 13.05||
ఇహ సంపాతినా సీతా రావణస్య నివేశనే ||13.05||
ఆఖ్యాతా గృథ రాజేన న చ పశ్యామి తా మహమ్ |
స|| సీతా రావణస్య నివేశనే ఇహ ( అస్తి ఇతి) గృథరాజేన సంపాతినా ఆఖ్యాతా | (పరంతు) తాం (సీతాం) న హి పశ్యామి ||
||శ్లోకార్థములు||
సీతా రావణస్య నివేశనే ఇహ -
సీతా రావణుని భవనములో నున్నది (అని)
గృథరాజేన సంపాతినా ఆఖ్యాతా -
గృథరాజు సంపాతి చెప్పాడు
తాం (సీతాం) న హి పశ్యామి -
కాని ఆ సీత ఇక్కడ కనపడుట లేదు.
||శ్లోకతాత్పర్యము||
'సీతా రావణుని భవనములో నున్నది అని గృథరాజు సంపాతి చెప్పాడు. కాని ఆ సీత ఇక్కడ కనపడుట లేదు'. ||13.05||
||శ్లోకము 13.06||
కిం ను సీతాఽథ వైదేహీ మైథిలీ జనకాత్మజా||6||
ఉపతిష్టేత వివశా రావణం దుష్టచారిణమ్|
స|| జనకాత్మజా వైదేహీ మైథిలీ దుష్టచారిణం వివశం రావణం కిం ను ఉపతిష్ఠేత ?
||శ్లోకార్థములు||
జనకాత్మజా వైదేహీ మైథిలీ -
జనకాత్మజ వైదేహి అయిన మైథిలి
దుష్టచారిణం రావణం -
దుష్టకర్మలు చేయు రావణునికి
వివశం రావణం కిం ను ఉపతిష్ఠేత -
వివశురాలై రావణునికి వశమయ్యనా ఏమి?
||శ్లోకతాత్పర్యము||
'జనకాత్మజ వైదేహి అయిన మైథిలి దుష్టకర్మలు చేయు రావణునికి వశమయ్యనా ఏమి?' ||13.06||
||శ్లోకము 13.07||
క్షిప్ర ముత్పతతో మన్యే సీతామాదాయ రక్షసః ||13.07||
బిభ్యతో రామబాణానాం అంతరా పతితా భవేత్ |
స|| సీతామ్ ఆదాయ రామబాణానాం బిభ్యతః క్షిప్రం ఉత్పతతః రక్షసః అంతరః (సీతా) పతితా భవేత్ మన్యే ||
||శ్లోకార్థములు||
సీతామ్ ఆదాయ - సీతను తీసుకువస్తూ
రామబాణానాం బిభ్యతః - రామబాణములకు భయపడి
క్షిప్రం ఉత్పతతః - తోందరగా ఎగిరిపోతున్న
రక్షసః అంతరః (సీతా) పతితా భవేత్ మన్యే-
రాక్షసుని నుంచి సీత పడిపోయి ఉండవచ్చు అనుకుంటాను.
||శ్లోకతాత్పర్యము||
'సీతను తీసుకువస్తూ రామబాణములకు భయపడి తోందరగా ఎగిరిపోతున్న రాక్షసుని నుంచి సీత పడిపోయి ఉండవచ్చు అనుకుంటాను'. ||13.07||
||శ్లోకము 13.08||
అథవా హ్రియమాణాయాః పథి సిద్ధనిషేవితే ||13.08||
మన్యే పతితా మార్యాయా హృదయం ప్రేక్ష్య సాగరమ్ |
స|| అథవా సిద్ధనిషేవితే పథి హ్రియమాణః ఆర్యాయాః హృదయం సాగరం ప్రేక్ష్య పతితా (ఇతి) మన్యే ||
||శ్లోకార్థములు||
అథవా సిద్ధనిషేవితే పథి -
లేక లేక సిద్ధులు సేవించు మార్గములో
హ్రియమాణః ఆర్యాయాః హృదయం -
తీసుకుపోబడుతున్న ఆ ఆర్యురాలైన సీత హృదయము
సాగరం ప్రేక్ష్య పతితా (ఇతి) మన్యే -
సాగరము చూచి పతించినదేమో అనుకుంటాను
||శ్లోకతాత్పర్యము||
"లేక సిద్ధులు సేవించు మార్గములో తీసుకుపోబడుతున్న, ఆ ఆర్యురాలైన సీత హృదయము సాగరమును చూచి పతించినదా ?" ||13.08||
||శ్లోకము 13.09||
రావణస్యోరువేగేన భుజాభ్యాం పీడితేన చ ||13.09||
తయా మన్యే విశాలాక్ష్యా త్యక్తం జీవిత మార్యయా |
స|| రావణస్య ఉరువేగేన భుజాభ్యాం పీడితేన చ విశాలాక్షీ తయా జీవితా త్యక్తం మన్యే ||
||శ్లోకార్థములు||
రావణస్యోరువేగేన - రావణుని వేగమునకు
భుజాభ్యాం పీడితేన - అతడి భుజముల ఒత్తిడికి
విశాలాక్షీ తయా జీవితా త్యక్తం మన్యే -
ఆ విశాలాక్షి జీవితము త్యజించినదేమో అనుకుంటాను ?
||శ్లోకతాత్పర్యము||
రావణుని వేగమునకు, అతడి భుజముల ఒత్తిడికి తట్టుకోలేక ఆ విశాలాక్షి జీవితము త్యజించినదా ?' ||13.09||
||శ్లోకము 13.10||
ఉపర్యుపరి వా నూనం సాగరం క్రమతస్తదా ||13.10||
వివేష్టమానా పతితా సముద్రే జనకాత్మజా |
స|| తదా సాగరం ఉపరి ఉపరి క్రమతః వివేష్టమానా జనకాత్మజా సముద్రే నూనం పతితా (ఏవ) ||
||శ్లోకార్థములు||
సాగరం ఉపరి ఉపరి క్రమతః -
సాగరము పైకి పైకి పోవుచున్న
వివేష్టమానా జనకాత్మజా -
(రావణుని నించి) విడివడానికి యత్నిస్తున్న సీత
నూనం పతితా (ఏవ)-
(సముద్రములో) బహుశ పడిపోయి ఉండవచ్చు
||శ్లోకతాత్పర్యము||
'అలా సాగరము పైకి పైకి పోవుచున్న రావణుని నించి విడివడానికి యత్నిస్తున్న సీత సముద్రములో బహుశ పడిపోయి ఉండవచ్చు.' ||13.10||
||శ్లోకము 13.11||
అహోక్షుద్రేణ వాఽనేన రంక్షన్తీ శీలమాత్మనః ||13.11||
అబంధుర్భక్షితా సీతా రావణేన తపస్వినీ |
స|| అహో ఆత్మనః శీలం రక్షన్తీ తపస్వినీ సీతా అబంధుః అనేన క్షుద్రేణ రావణేన భక్షితా ? ||
||శ్లోకార్థములు||
అహో ఆత్మనః శీలం రక్షన్తీ -
అయ్యో ! తన శీలము రక్షించుకుంటూ
తపస్వినీ సీతా అబంధుః -
తన బంధువులనుంచి దూరమైన ఆ తపస్విని సీత
క్షుద్రేణ రావణేన భక్షితా -
దుష్టుడైన రావణుని చేత తినబడినదా
||శ్లోకతాత్పర్యము||
అయ్యో ! తన శీలము రక్షించుకుంటూ తన బంధువులనుంచి దూరమైన ఆ తపస్విని దుష్టుడైన ఆ రావణుని చేత తినబడినదా?' ||13.11||
||శ్లోకము 13.12||
అథవా రాక్షసేంద్రస్య పత్నీభి రసితేక్షణా ||13.12||
అదుష్టా దుష్టభావాభిః భక్షితా సా భవిష్యతి |
స|| అథవా అదుష్టా అసితేక్షణా సా (సీతా) రాక్షసేంద్రస్య పత్నీభిః దుష్టభావాభిః భక్షితా భవిష్యతి ||
||శ్లోకార్థములు||
అథవా అదుష్టా అసితేక్షణా సా (సీతా) -
ఆ సజ్జనురాలైన అసితేక్షణ సీత
రాక్షసేంద్రస్య పత్నీభిః దుష్టభావాభిః -
దుష్టభావములు కల రాక్షసేంద్రుని పత్నులచేత
భక్షితా భవిష్యతి -
తినబడి ఉండవచ్చు.
||శ్లోకతాత్పర్యము||
'లేక ఆ అసితేక్షణ సజ్జనురాలైన సీత, దుష్టభావములు కల రాక్షసేంద్రుని పత్నులచేత తినబడి ఉండవచ్చు'. ||13.12||
||శ్లోకము 13.13||
సంపూర్ణచంద్ర ప్రతిమం పద్మపత్రనిభేక్షణమ్ ||13.13||
రామస్య ధ్యాయతీ వక్త్రం పంచత్వం కృపణా గతా |
స|| కృపణా వక్త్రం సంపూర్ణచంద్ర ప్రతిమం పద్మపత్రనిభేక్షణం రామస్య ధ్యాయతీ పంచత్వం గతా ||
||శ్లోకార్థములు||
కృపణా వక్త్రం సంపూర్ణచంద్ర ప్రతిమం -
దీనురాలు పూర్ణచంద్రుని వంటి వదనము కల
పద్మపత్రనిభేక్షణం -
పద్మపత్రములవంటి కనురేకులు గల సీత
రామస్య ధ్యాయతీ పంచత్వం గతా -
రాముని ధ్యానిస్తూ పంచత్వము పొందినదేమో
||శ్లోకతాత్పర్యము||
'దీనురాలు పూర్ణచంద్రుని వంటి వదనము కల పద్మపత్రముల వంటి కనురేకులు గల సీత, రాముని ధ్యానిస్తూ పంచత్వము పొందినదేమో'. ||13.13||
||శ్లోకము 13.14||
హా రామ లక్ష్మణేత్యేవం హాఽయోధ్యే చేతి మైథిలీ ||13.14||
విలప్య బహు వైదేహీ న్యస్త దేహా భవిష్యతి |
స|| వైదేహీ మైథిలీ హా రామ హా లక్ష్మణా హా అయోధ్యా చ ఇతి ఏవం బహు విలప్య న్యస్త దేహా భవిష్యతి ||
||శ్లోకార్థములు||
వైదేహీ మైథిలీ - వైదేహి అగు మైథిలి
హా రామ హా లక్ష్మణా హా అయోధ్యా చ -
ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ అయోధ్యా
ఇతి ఏవం బహు విలప్య -
అని బహువిధములుగా విలపిస్తూ'
న్యస్త దేహా భవిష్యతి - దేహమును త్యజించెనేమో
||శ్లోకతాత్పర్యము||
'వైదేహి అగు మైథిలి, "ఓ రామా ఓ లక్ష్మణా ఓ అయోధ్యా", అని బహువిధములుగా విలపిస్తూ దేహమును త్యజించెనేమో'. ||13.14||
||శ్లోకము 13.15,16||
అథవా నిహితా మన్యే రావణస్య నివేశనే ||13.15||
నూనం లాలప్యతే సీతా పంజరస్థేన శారికా |
స|| అథవా రావణస్య నివేశనే నిహితా సీతా పంజరస్థా శారికా ఇవ నూనం లాలప్యతే మన్యే||
||శ్లోకార్థములు||
అథవా రావణస్య నివేశనే -
లేక రావణుని భవనములో
నిహితా సీతా - బంధించబడిన సీతా
పంజరస్థా శారికా ఇవ -
పంజరములోని శారీకము వలె
నూనం లాలప్యతే మన్యే -
తప్పక విలపిస్తున్నదేమో అనుకుంటాను ||13.15||
||శ్లోకతాత్పర్యము||
'లేక రావణుని భవనములో బంధించబడిన సీతా పంజరములోని శారీకము వలె విలపిస్తున్నదేమో అనుకుంటాను.' ||13.15||
||శ్లోకము 13.16||
జనకస్య సుతా సీతా రామపత్నీ సుమధ్యమా ||13.16||
కథముత్పల పత్రాక్షీ రావణస్య వశం వ్రజేత్ |
స|| జనకస్య సుతా రామపత్నీ సుమధ్యమా ఉత్పలపత్రాక్షీ సీతా రావణస్య వశం కథం వ్రజేత్? ||
||శ్లోకార్థములు||
జనకస్య సుతా రామపత్నీ-
జనకుని సుత రామపత్ని
సుమధ్యమా ఉత్పలపత్రాక్షీ సీతా -
సన్నని నడుముకల కమలరేకులవంటి కన్నులు గల సీత
రావణస్య వశం కథం వ్రజేత్ -
రావణుని వశము ఎట్లు అగును
||శ్లోకతాత్పర్యము||
'జనకుని సుత రామపత్ని సన్నని నడుముకల కమలరేకులవంటి కన్నుకుగల సీతా రావణుని వశము ఎట్లు అగును?' ||13.16||
||శ్లోకము 13.17||
వినష్టా వా ప్రణష్టా వా మృతా వా జనకాత్మజా ||13.17||
రామస్య ప్రియ భార్యస్య న నివేదయితుం క్షమమ్ |
స|| రామస్య ప్రియభార్యస్య జనకాత్మజా వినష్టా వా ప్రణష్టా వా మృతా వా నివేదయితుం న క్షమమ్ ||
రామటీకాలో - నను శీఘ్రం గత్వా యథా వృత్తం రామసన్నిధావుచ్యతాం ఇత్య ఆహ - వినష్టేతి। నవినష్టా అత్రైవ క్వచిత్ గోపితాత్వేన అదృష్ఠా ప్రణష్టా వా ఇతో అన్యత్ర విద్యమానాత్వేన అదృష్టా వా మృతా లోకాన్తరమ్ ప్రాప్తా వా ప్రియ భార్యస్య రామస్య అగ్రే నివేదయితుం కథయితుమ్ న క్షమమ్ , త్రయాణామపి అనిశ్చితత్వాత్ కించిత్ ఉక్తం న శక్యతే ఇత్యర్థః ।
తిలక టికాలో చెప్పిన మాట - ఇక్కడ సీత రహస్యముగా దాచబడడము వలన కనబడలేదా, లేక ఎక్కడో పడిపోయి చనిపోయినదా, చంపబడడము వలన కనపడుటలేదా అని సందేహము. అందుకని బతికి వున్నదా లేదా అన్నది మూడు విధములుగా సందేహాస్పదముగా వుండడము వలన రామునికి తన భార్యను గురించి చెప్పడము భావ్యము కాదు అని అంటారు.
||శ్లోకార్థములు||
రామస్య ప్రియభార్యస్య జనకాత్మజా -
జనకుని కూతురు రాముని ప్రియమైన భార్య
వినష్టా వా ప్రణష్టా వా మృతా -
చంపబడినను, చిత్రవధ చేయబడినను , మరణించిననూ
నివేదయితుం న క్షమమ్ -
ఆ విషయము చెప్పుట భావ్యము కాదు
||శ్లోకతాత్పర్యము||
'రాముని ప్రియమైన భార్య చంపబడినను, చిత్రవధ చేయబడినను , మరణించిననూ ఆ విషయము చెప్పుట భావ్యము కాదు.' ||13.17||
సీత ఎక్కడా కనిపించకపోవడముతో రావణ భవనము బయట తిరుగుతున్న హనౌమ మనస్సు అనేక విధములుగా పరిగెడుతుంది. అలా పరిగెడడములో తనను తానే చిత్రహింస చేశుకుంటున్నాదా అని అనిపించే విధముగా ఆలోచన అన్ని కోణాలలోకి పోతుంది.
ఆ ఆలోచనలు మరొకసారి అవలోకనము చేయవచ్చు.
'జనకాత్మజ వైదేహి అయిన మైథిలి దుష్టకర్మలు చేయు రావణునికి వశమయ్యనా ఏమి? సీతను తీసుకువస్తూ రామబాణములకు భయపడి తోందరగా ఎగిరిపోతున్న రాక్షసుని నుంచి సీత పడిపోయి ఉండవచ్చు. లేక సిద్ధులు సేవించి మార్గములో తీసుకుపోబడుతున్న ఆ ఆర్యురాలైన సీత హృదయము సాగరమును చూచి పతించినదా ?
రావణుని వేగమునకు, అతడి భుజముల ఒత్తిడికి తట్టుకోలేక ఆ విశాలాక్షి జీవితము త్యజించినదా ? అలా సాగరము పైకి పైకి పోవుచున్న రావణుని నించి విడివడానికి యత్నిస్తున్న సీత సముద్రములో బహుశ పడిపోయి ఉండవచ్చు. అయ్యో ! తన శీలము రక్షించుకుంటూ తనబంధువులనుంచి దూరమైన ఆ తపస్విని ఆ దుష్టుని చేత తినబడినదా? లేక ఆ అసితేక్షణ సజ్జనురాలైన సీత, దుష్టభావములు కల రాక్షసేంద్రుని పత్నులచేత తినబడి ఉండవచ్చు. దీనురాలు పూర్ణచంద్రుని వంటి వదనము కల పద్మపత్రములవంటి కనురేకులు గల సీత రాముని ధ్యానిస్తూ పంచత్వము పొందినదేమో. వైదేహి అగు మైథిలి, 'ఓ రామా ఓ లక్ష్మణా ఓ అయోధ్యా', అని బహువిధములుగా విలపిస్తూ దేహమును త్యజించనేమో. లేక రావణుని భవనములో బంధించబడిన సీతా పంజరములోని శారీకము వలె విలపిస్తున్నదేమో. జనకుని సుత రామపత్నిసన్నని నడుముకల కమలరేకులవంటి కన్నుకుగల సీతా రావణుని వశము ఏట్లు అగును? '
ఈ అలోచనలతో హనుమకి ఇంకో సందిగ్ధము వస్తుంది. సీతమ్మ వుందో లేదో అనేసమయములో రాముడికి చెప్పలా ? చెప్పకూడదా ?, చెప్పవలసివస్తే ఏమి చెప్పాలి? చెపితే ఏమిటి అవుతుంది? వానరుల గతి ఏమిటి ? అని అనేకప్రశ్నలతో సతమతమౌతాడు హనుమ.
||శ్లోకము 13.18||
నివేద్యమానే దోషః స్యాత్ దోష స్స్యా దనివేదనే ||13.18||
కథం ఖలు కర్తవ్యం విషమం ప్రతిభాతి మే |
స|| నివేద్యమానే దోషః స్యాత్| అనివేదనే దోషః స్యాత్ | కథం కర్తవ్యం ను ఖలు మే విషమం ప్రతిభాతి ||
తిలకటీకాలో - న దృష్టేతి నివేద్యమానే దోషః వక్ష్యమాణ రామ ప్రాణత్యాగరూపః । అనివేదనే స్వామి వఞ్చనరూపో దోషః। తస్మాత్ నివేదన అనివేదన రూపమ్ ఉభయమపి విషమమ్ దురనుష్ఠేయం ప్రతిభాతి ।
||శ్లోకార్థములు||
నివేద్యమానే దోషః స్యాత్ -
చెప్పుటచే దోషము కలుగును
అనివేదనే దోషః స్యాత్ -
చెప్పకపోయిననూ కూడా దోషమే
కథం కర్తవ్యం ను ఖలు మే విషమం ప్రతిభాతి -
ఏమి చేయ వలెను ? పరిస్థితి విషమముగా తోచుచున్నది
||శ్లోకతాత్పర్యము||
'చెప్పుటచే దోషము కలుగును. చెప్పకపోయిననూ కూడా దోషమే. పరిస్థితి విషమముగా తోచుచున్నది'. ||13.18||
సీత కనపడలేదు అని చెపితే రాముని ప్రాణసంకటము వలన దోషము. చెప్పకపోతే స్వామిని వంచించిన దోషము. అందుకని రెండు కూడా దోషములతో కూడినవి.
||శ్లోకము 13.19||
అస్మిన్నేవం గతే కార్యే ప్రాప్తకాలం క్షమం చ కిమ్ ||13.19||
భవేదితి మతం భూయో హనుమాన్ ప్రవిచారయత్ |
స|| అస్మిన్ కార్యే ఏవం గతే ప్రాప్తకాలం క్షమమ్ కిం భవేత్ ఇతి మతం భూయః హనుమాన్ ప్రవిచారయత్ ||
రామ టీకాలో - అస్మిన్నితి। కార్యే కర్తవ్యే ఏవం గతే అశక్యం ప్రాప్తే సతి కిమపి క్షమం ఉచిత కృత్యం ప్రాప్తకాలం భవేద్ ఇత్ నిశ్చయం ప్రవిచారయన్ కుర్వన్నాస్తేతి శేషః।
గోవిన్దరాజ టీకాలో - అస్మిన్నితి। హనుమాన్ అస్మిన్ కార్యే ఏవం గతే ఏవం విషమత్వం ప్రాప్తే సతి కిం ప్రాపత్కాలమ్ కాలోచితమ్ క్షమం సమర్థం చ భవేత్ ఇతి మతం పక్షం భూయః ప్రవిచారయత॥
||శ్లోకార్థములు||
అస్మిన్ కార్యే - ఈ విషయములో
ఏవం గతే - ఈ పరిస్థితిలో
ప్రాప్తకాలం క్షమమ్ కిం భవేత్ -
కాలోచితమైనది తగినది ఏమిటి అగును
ఇతి మతం భూయః హనుమాన్ ప్రవిచారయత్ -
అని చేయవలసిన పని మీద హనుమ విచారించ సాగెను
||శ్లోకతాత్పర్యము||
'ఈ విషయములో ఈ విషమ పరిస్థితిలో ఇప్పుడు కాలోచితమైనది తగినది ఏమిటి అగును. కర్తవ్యము ఏమిటో నాకు విషమము గా కానవస్తున్నది. ఈ కార్యములో ఏది శ్రేయస్కరము', అని మళ్ళీ హనుమంతుడు విచారణలో పడెను.' ||13.19||
||శ్లోకము 13.20||
యది సీతా మదృష్ట్వాఽహం వానరేంద్రపురీ మితః ||13.20||
గమిష్యామి తతః కోమే పురుషార్థో భవిష్యతి |
స|| అహమ్ సీతామ్ అదృష్ట్వా వానరేంద్రపురీం ఇతః యది గమిష్యామి తతః మే కో పురుషార్థః భవిష్యతి ||
||శ్లోకార్థములు||
అహమ్ సీతామ్ అదృష్ట్వా -
నేను సీతను చూడకుండా
వానరేంద్రపురీం ఇతః యది గమిష్యామి -
ఇక్కడనుంచి వానరేంద్ర పురికి పోయినచో
తతః మే కో పురుషార్థః భవిష్యతి -
అప్పుడు నేను చేసిన పురుషకార్యము ఏమిటి?
||శ్లోకతాత్పర్యము||
'నేను సీతను చూడకుండా ఇక్కడనుంచి వానరేంద్ర పురికి పోయినచో అప్పుడు నేను చేసిన పురుషకార్యము ఏమిటి?' ||13.20||
అంటే, సీతను చూడకుండా తను వెనక్కి వెళ్ళితే, అప్పుడు తను గణించ తగినది ఏమీ చేయలేదు, అని హనుమంతుని భావము.
||శ్లోకము 13.21||
మమేదం లంఘనం వ్యర్థం సాగరస్య భవిష్యతి ||13.21||
ప్రవేశశ్చైవ లంకాయా రాక్షసానాం చ దర్శనమ్ |
స|| మమ ఇదం సాగరస్య లంఘనం లంకాయా ప్రవేశనం రాక్షసానాం చ దర్శనం వ్యర్థం భవిష్యతి||
||శ్లోకార్థములు||
మమ ఇదం సాగరస్య లంఘనం -
నా యొక్క సాగరలంఘనము
లంకాయా ప్రవేశనం - లంకాప్రవేశము
రాక్షసానాం చ దర్శనం - రాక్షసులను చూడడము కూడా
వ్యర్థం భవిష్యతి - ఇవన్నీ వృధా అవుతాయి
||శ్లోకతాత్పర్యము||
నా సాగరలంఘనము , లంకాప్రవేశము రాక్షసులను చూడడము కూడా, ఇవన్నీ వృధా అవుతాయి.' ||13.21||
||శ్లోకము 13.22||
కిం మాం వక్ష్యతి సుగ్రీవో హరయో వా సమాగతాః ||13.22||
కిష్కింధాం సమనుప్రాప్తం తౌ వా దశరథాత్మజౌ |
స|| కిష్కింధం సమనుప్రాప్తం మాం సుగ్రీవః వా సమాగతాః హరయః వా దశరథాత్మజౌ కిం మాం వక్ష్యతి ||
||శ్లోకార్థములు||
కిష్కింధం సమనుప్రాప్తం - కిష్కింధ చేరగానే
మాం సుగ్రీవః వా సమాగతాః హరయః -
నన్ను సుగ్రీవుడు గాని , తోడ వున్న వానరులు గాని
వా దశరథాత్మజౌ - దశరధాత్మజులు గాని
మాం కిం వక్ష్యతి - నన్ను ఏమి అంటారు
||శ్లోకతాత్పర్యము||
'కిష్కింధ చేరగానే నన్ను సుగ్రీవుడు , తోడ వున్న వానరులు , దశరధాత్మజులు నన్ను ఏమి అంటారు?' ||13.22||
||శ్లోకము 13.23||
గత్వాతు యది కాకుత్థ్సం వక్ష్యామి పరమప్రియమ్ ||13.23||
న దృష్టేతి మయా సీతా తతస్తక్ష్యతి జీవితమ్ |
స|| గత్వా కాకుత్‍స్థం సీతా మయా నదృష్టా ఇతి పరం అప్రియం వక్ష్యామి యది తతః (సః రామః) జీవితం త్యక్ష్యతి ||
||శ్లోకార్థములు||
గత్వా - అక్కడికి వెళ్ళి
కాకుత్‍స్థం సీతా మయా నదృష్టా ఇతి -
కాకుస్థునకు సీత కనపడలేదు అన్న
పరం అప్రియం వక్ష్యామి యది -
అప్రియమైన మాట చెప్పినచో అప్పుడు
తతః (సః రామః) జీవితం త్యక్ష్యతి -
అప్పుడు తప్పక ( ఆ రాముడు) జీవితము త్యజించును.
||శ్లోకతాత్పర్యము||
అక్కడికి వెళ్ళి కాకుస్థునకు సీత కనపడలేదు అన్న అప్రియమైన మాట చెప్పినచో అప్పుడు తప్పక ( ఆ రాముడు) జీవితము త్యజించును.' ||13.23||
||శ్లోకము 13.24||
పరుషం దారుణం క్రూరం తీక్ష్ణ మింద్రియతాపనమ్ ||13.24||
సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా స న భవిష్యతి |
స|| పరుషం దారుణం కౄరం ఇంద్రియతాపనం సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా సః రామః న భవిష్యతి ||
గోవిన్దరాజా టీకాలో - పరుషం శ్రవణ కటుకమ్, దారుణమ్ భయంకరమ్, క్రూరమ్ ఉగ్రమ్ , తీక్ష్ణమ్ అసహ్యమ్, ఇన్ద్రియతాపనమ్ ఇన్ద్రియ క్షోభకమ్, సీతానిమిత్తమ్ సీతావిషయమ్ ।
||శ్లోకార్థములు||
పరుషం దారుణం కౄరం -
పరుషమైన దారుణమైన కౄరమైన
ఇంద్రియతాపనం - ఇంద్రియములను తపించు
సీతానిమిత్తం దుర్వాక్యం శ్రుత్వా -
సీతను గురించి ఈ దుర్వాక్యములను విని
సః రామః న భవిష్యతి -
ఆ రాముడు ఇక బ్రతికి ఉండడు
||శ్లోకతాత్పర్యము||
'పరుషమైన దారుణమైన కౄరమైన ఇంద్రియములను తపించు ఈ దుర్వాక్యములను విని ఆ రాముడు ఇక బ్రతికి ఉండడు.' ||13.24||
||శ్లోకము 13.25||
తం తు కృచ్ఛగతం దృష్ట్వా పంచత్వగతమానసమ్ ||13.25||
భృశాను రక్తో మేధావీ న భవిష్యతి లక్ష్మణః |
స|| పంచత్వగతమానసం తం దృష్ట్వా కృచ్ఛగతం భృశానురక్తః మేధావీ లక్ష్మణః తు న భవిష్యతి||
రామ టీకాలో - కృచ్ఛగతం కష్టం ప్రాప్తం అత ఏవ పంచత్వే మరణ సదృశే గతం మానసం యస్య తం రామం దృష్ట్వా భృశానురక్తః తద్విషయకాత్యనురాగవాన్ లక్ష్మణః న భవిష్యతి।
||శ్లోకార్థములు||
కృచ్ఛగతం పంచత్వగతమానసం తం దృష్ట్వా-
కష్టములో వున్న పంచత్వము పొందిన ఆయనను చూచి
భృశానురక్తః - భ్రాతానురక్తుడైన
మేధావీ లక్ష్మణః తు న భవిష్యతి -
మేధావి లక్ష్మణుడు కూడా ఉండడు.
||శ్లోకతాత్పర్యము||
'పంచత్వము పొందిన ఆయనను చూచి భ్రాతానురక్తుడైన మేధావి లక్ష్మణుడు కూడా ఉండడు.' ||13.25||
||శ్లోకము 13.26||
వినష్టౌ భ్రాతరౌ శ్రుత్వా భరతోఽపి మరిష్యతి ||26||
భరతం చ మృతం దృష్ట్వా శతృఘ్నో న భవిష్యతి |
స|| భ్రాతరౌ వినష్టౌ (ఇతి) శ్రుత్వా భరతః అపి న భవిష్యతి | భరతం చ మృతం దృష్ట్వా శతృఘ్నో న భవిష్యతి ||
||శ్లోకార్థములు||
భ్రాతరౌ వినష్టౌ (ఇతి) శ్రుత్వా -
అన్నదమ్ములిద్దరూ పోయిరి అన్నమాట విన్న
భరతః అపి న భవిష్యతి -
భరతుడు కూడా ఉండడు
భరతం చ మృతం దృష్ట్వా -
భరతుడు మరణించుట చూసిన
శతృఘ్నో న భవిష్యతి -
శతృఘ్నుడు ఉండడు
||శ్లోకతాత్పర్యము||
'అన్నదమ్ములిద్దరూ పోయిరి అన్నమాట విన్న భరతుడు కూడా ఉండడు. భరతుడు మరణించుట చూసిన శతృఘ్నుడు ఉండడు.' ||13.26||
||శ్లోకము 13.27 ||
పుత్రాన్ మృతాన్ సమీక్ష్యాథ న భవిష్యతి మాతరః ||13.27||
కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ చ న సంశయః |
స|| అథ మృతాన్ పుత్రాన్ సమీక్ష్య మాతరః కౌసల్యా చ సుమిత్రా చ కైకేయీ తథా న భవిష్యతి | న సంశయః ||
||శ్లోకార్థములు||
అథ మృతాన్ పుత్రాన్ సమీక్ష్య -
ఆ విధముగా మరణించిన పుత్రుల స్థితిని చూచి
మాతరః కౌసల్యా చ సుమిత్రా చ -
తల్లులు కౌసల్య అలాగే సుమిత్ర
కైకేయీ తథా న భవిష్యతి - కైకేయి కూడా ఉండరు
న సంశయః - ఇందులో సందేహము లేదు
||శ్లోకతాత్పర్యము||
'ఆ విధముగా మరణించిన పుత్రుల స్థితిని చూచి తల్లులు కౌసల్య సుమిత్ర కైకేయి కూడా ఉండరు. ఇందులో సందేహము లేదు.' ||13.27||
||శ్లోకము 13.28||
కృతజ్ఞః సత్యసంధశ్చ సుగ్రీవః ప్లవగాధిపః ||13.28||
రామం తథా గతం దృష్ట్వా తతస్త్య క్ష్యతి జీవితమ్ |
స|| సుగ్రీవః కృతజ్ఞః సత్యసంధః ప్లవగాధిపః తథా గతం రామం దృష్ట్వా తతః జీవితం త్యక్ష్యతి ||
||శ్లోకార్థములు||
కృతజ్ఞః సత్యసంధః ప్లవగాధిపః సుగ్రీవః -
కృతజ్ఞుడు సత్యసంధుడు వానరుల రాజు అయిన సుగ్రీవుడు
తథా గతం రామం దృష్ట్వా -
ఆ విధముగా పోయిన రాముని చూచి
తతః జీవితం త్యక్ష్యతి -
తన జీవితము వదులును
||శ్లోకతాత్పర్యము||
'కృతజ్ఞుడు సత్యసంధుడు వానరులరాజు అయిన సుగ్రీవుడు, ఆ విధముగా పోయిన రాముని చూచి తన జీవితము వదులును'. ||13.28||
||శ్లోకము 13.29||
దుర్మనా వ్యథితా దీనా నిరానందా తపస్వినీ ||13.29||
పీడితా భర్తృశోకేన రుమా త్యక్ష్యతి జీవితమ్ |
స|| భర్తృశోకేన పీడితా నిరానందా తపస్వినీ వ్యథితా దుర్మనా రుమా జీవితం త్యక్ష్యతి ||
||శ్లోకార్థములు||
భర్తృశోకేన పీడితా - భర్త పోయిన శోకము చే పీడింపబడు
నిరానందా తపస్వినీ - అనందములేని తపస్విని
వ్యథితా దుర్మనా - వ్యథలో వున్న మనస్సు విరిగిపోయిన
రుమా జీవితం త్యక్ష్యతి - రుమ తన జీవితము త్యజించును
||శ్లోకతాత్పర్యము||
'భర్త పోయిన శోకము చే పీడింపబడు , అనందములేని తపస్విని, వ్యథలో వున్న మనస్సు విరిగిపోయిన, రుమ తన జీవితము త్యజించును'. ||13.29||
||శ్లోకము 13.30||
వాలిజేన తు దుఃఖేన పీడితా శోకకర్శితా ||13.30||
పంచత్వం గతే రాజ్ఞే తారాఽపి న భవిష్యతి |
స|| వాలిజేన దుఃఖేన పీడితా శోకకర్శితా తారా అపి రాజ్ఞి పంచత్వం గతే న భవిష్యతి ||
||శ్లోకార్థములు||
వాలిజేన దుఃఖేన పీడితా -
వాలిమరణము పైన దుఃఖము భరించుచున్న
శోకకర్శితా తారా అపి -
శోకముతో కృశించిపోయిన తార కూడా
రాజ్ఞి పంచత్వం గతే -
రాజు పంచత్వము పొందగా
న భవిష్యతి - నిస్సందేహముగా ప్రాణములు త్యజించును.
||శ్లోకతాత్పర్యము||
'వాలిశోకముతో కృశించిపోయిన తార, వానర రాజు పంచత్వము పొందగా నిస్సందేహముగా ప్రాణములు త్యజించును.' ||13.30||
||శ్లోకము 13.31||
మాతాపిత్రోర్వినాశేన సుగ్రీవవ్యసనేన చ ||13.31||
కుమారోఽప్యంగదః కస్మాద్ధారయిష్యతి జీవితమ్ |
స|| కుమారః అంగదః అపి మాతాపిత్రోః వినాశేన సుగ్రీవస్య వ్యసనేన జీవితం కస్మాత్ ధరిష్యతి? ||
||శ్లోకార్థములు||
కుమారః అంగదః అపి - అంగద కుమారుడు కూడా
మాతాపిత్రోః వినాశేన - తన తల్లితండ్రుల మరణాలతో
సుగ్రీవస్య వ్యసనేన - సుగ్రీవుని మరణముతో
జీవితం కస్మాత్ ధరిష్యతి? - ఎట్లు జీవించును ?
||శ్లోకతాత్పర్యము||
'అంగద కుమారుడు తన తల్లితండ్రుల మరణాలతో, సుగ్రీవుని మరణముతో ఎట్లు జీవించును '?' ||13.31||
||శ్లోకము 13.32||
భర్తృజేన తు దుఃఖేన హ్యభిభూతా వనౌకసః ||13.32||
శిరాం స్యభిహనిష్యంతి తలైర్ముష్టిభిరేవ చ |
స|| వనౌకసః భర్తృజేన దుఃఖేన అభిభూతాః తలైః ముష్టిభిరేవచ సిరాంసి అభిహనిష్యన్తి ||
||శ్లోకార్థములు||
వనౌకసః భర్తృజేన దుఃఖేన అభిభూతాః -
వానరులు రాజుయొక్క మరణముతో దుఃఖితులై
తలైః ముష్టిభిరేవచ - అరచేతులతో పిడికలతో
సిరాంసి అభిహనిష్యన్తి - తలలను కొట్టుకొనెదరు
||శ్లోకతాత్పర్యము||
వానరులు రాజుయొక్క మరణముతో దుఃఖితులై తలలను అరచేతులతో పిడికలతో కొట్టుకొనెదరు'. ||13.32||
||శ్లోకము 13.33||
సాంత్వే నానుప్రదానేన మానేన చ యశస్వినా ||13.33||
లాలితాః కపిరాజేన ప్రాణాం స్తక్ష్యంతి వానరాః |
స|| యశస్వినా కపిరాజేన మానేన సాంత్వేన అనుప్రదానేన లాలితాః వానరాః ప్రాణాన్ త్యక్ష్యన్తి ||
||శ్లోకార్థములు||
యశస్వినా కపిరాజేన మానేన -
యశోవంతుడు అగు కపిరాజుచే గౌరవముతో
సాంత్వేన అనుప్రదానేన లాలితాః -
సాంత్వముతో కానుకలతో లాలింపబడిన
వానరాః ప్రాణాన్ త్యక్ష్యన్తి -
వానరులు ప్రాణములను త్యజించెదరు
||శ్లోకతాత్పర్యము||
'యశోవంతుడు అగు కపిరాజుచే గౌరవముతో సాంత్వముతో కానుకలతో లాలింపబడిన వానరులు, ప్రాణములను త్యజించెదరు.' ||13.33||
||శ్లోకము 13.34||
న వనేషు న శైలేషు న నిరోధేషు వా పునః ||13.34||
క్రీడామనుభవిష్యంతి సమేత్య కపికుంజరాః |
స||కపికుంజరాం సమేత్య వనేషు శైలేషు న నిరోధేషు వా పునః క్రీడాం న అనుభవిష్యన్తి||
||శ్లోకార్థములు||
కపికుంజరాం సమేత్య - కపికుంజరులు కలిసి
వనేషు శైలేషు న నిరోధేషు - వనములలో, కోండలలో , గుహలలో
పునః క్రీడాం న అనుభవిష్యన్తి - మళ్ళీ క్రీడలు అనుభవించలేరు
||శ్లోకతాత్పర్యము||
'కపికుంజరులు కలిసి వనములలో, కోండలలో , గుహలలో మళ్ళీ క్రీడలు అనుభవించలేరు'. ||13.34||
||శ్లోకము 13.35||
సపుత్త్ర దారాస్సామత్యా భర్తృవ్యసనపీడితాః ||13.35||
శైలాగ్రేభ్యః పతిష్యంతి సమేషు విషమేషు చ |
స|| సపుత్రదారాః స అమాత్యాః భర్తృర్వ్యసన పీడితాః శైలాగ్రేభ్యః సమేషు విషమేషు చ పతిష్యన్తి ||
||శ్లోకార్థములు||
సపుత్రదారాః స అమాత్యాః -
పుత్రులతో భార్యలతో అమాత్యులతో
భర్తృర్వ్యసన పీడితాః -
రాజుపోయిన శోకముతో పీడింపబడి
శైలాగ్రేభ్యః సమేషు విషమేషు చ -
శైలాగ్రములనుంచి సమప్రదేశములలో మిట్టపల్లములలో పడి
పతిష్యన్తి - మరణించెదరు
||శ్లోకతాత్పర్యము||
'పుత్రులతో భార్యలతో అమాత్యులు రాజుపోయిన శోకముతో పీడింపబడి శైలాగ్రములనుంచి సమప్రదేశములలో మిట్టపల్లములలో పడి మరణించెదరు.' ||13.35||
||శ్లోకము 13.36||
విషముద్బంధనం వాపి ప్రవేశం జ్వలనస్య వా||13.36||
ఉపవాస మధో శస్త్రం ప్రచరిష్యంతి వానరాః|
స|| విషం ఉద్బన్ధనం వాపి జ్వలనస్య ప్రవేశం వా ఉపవాసం అథో శస్త్రం వానరాః ప్రచరిష్యన్తి||
రామటీకాలో - భతృవ్యసన పీడితాః వానరాః శైలాగ్రేభ్యః పతిష్యన్తి విషం వా ప్రచరిష్యన్తి భక్షయిష్యన్తి, ఉద్భన్ధనాది వా ప్రచరిషన్తి కరిష్యన్తి, శస్త్రం వా ప్రచరిష్యన్తి స్వస్వ శరీరే ప్రవేషయిష్యన్తి । శ్లోకాద్వయం ఏకాన్వయి।
||శ్లోకార్థములు||
విషం ఉద్బన్ధనం వాపి -
విషము తాగి లేక వురిపోసుకొని గాని
జ్వలనస్య ప్రవేశం వా -
అగ్నిలో ప్రవేశించి గాని
ఉపవాసం అథో శస్త్రం -
ఉపవాసముతో కాని లేక శస్త్రములతో కాని
వానరాః ప్రచరిష్యన్తి -
వానరులు ప్రాణములు విడిచెదరు
||శ్లోకతాత్పర్యము||
'విషము తాగి లేక వురిపోసుకొని గాని, అగ్నిలో ప్రవేశించి గాని,ఉపవాసముతో కాని, లేక శస్త్రములతో కాని వానరులు ప్రాణములు విడిచెదరు.' ||13.36||
||శ్లోకము 13.37||
ఘోరమారోదనం మన్యే గతే మయి భవిష్యతి ||13.37||
ఇక్ష్వాకుకులనాశశ్చ నాశశ్చైవ వనౌకసామ్ |
స|| మయి గతే ఇక్ష్వాకుకులనాశస్చ వనౌకసాం నాశశ్చ ఏవ ఘోరం ఆరోదనమ్ భవిష్యతి (ఇతి) మన్యే ||
||శ్లోకార్థములు||
మయి గతే ఇక్ష్వాకుకులనాశశ్చ -
నేను వెళ్ళితే ఇక్ష్వాకుకులనాశనము
వనౌకసాం నాశశ్చ ఏవ ఘోరం -
వానరులనాశము అయి
ఘోరం ఆరోదనమ్ భవిష్యతి (ఇతి) మన్యే -
భయంకరమైన రోదనములు అగును అని అనుకుంటాను
||శ్లోకతాత్పర్యము||
'నేను వెళ్ళితే ఇక్ష్వాకుకులనాశనము వానరులనాశము అయి భయంకరమైన రోదనములు అగును.' ||13.37||
||శ్లోకము 13.38||
సోఽహం నైవ గమిష్యామి కిష్కింధాం నగరీ మితః ||13.38||
న చ శక్ష్యామ్యహం ద్రష్టుం సుగ్రీవం మైథిలీం వినా |
స|| అహం కిష్కింధాం నగరీం న గమిష్యామి ఏవ | అహం మైథిలీ వినా సుగ్రీవం న చ ద్రక్ష్యామి ||
||శ్లోకార్థములు||
అహం కిష్కింధాం నగరీం న గమిష్యామి ఏవ -
నేను కిష్కింధనగరము వెళ్లను
అహం మైథిలీ వినా - నేను మైథిలి చూడకుండా
సుగ్రీవం న చ ద్రక్ష్యామి - సుగ్రీవుని కూడా చూడను.
||శ్లోకతాత్పర్యము||
'నేను కిష్కింధనగరము వెళ్ల కూడదు. నేను మైథిలి చూడకుండా సుగ్రీవుని కూడా చూడను.' ||13.38||
||శ్లోకము 13.39||
మయ్యగచ్ఛతి చేహస్థే ధర్మాత్మానౌ మహారథౌ ||13.39||
ఆశయా తౌ ధరిష్యేతే వానరాశ్చ మనస్వినః |
స|| మయి అగచ్ఛతి ఇహస్థే తౌ ధర్మాత్మానౌ మహారథౌ ఆశయా ధరిష్యేతే | మనస్వినః వానరాః చ ||
||శ్లోకార్థములు||
మయి అగచ్ఛతి ఇహస్థే -
నేను వెళ్ళక ఇక్కడే ఉంటే
తౌ ధర్మాత్మానౌ మహారథౌ -
ధర్మాత్ములు మహారథులగు రామలక్ష్మణులు
ఆశయా ధరిష్యేతే -
ఆశతో ఉండెదరు
మనస్వినః వానరాః చ -
మానవంతులు అగు వానరులు (ఆశతో ఉండెదరు)
||శ్లోకతాత్పర్యము||
'నేను వెళ్ళక ఇక్కడే ఉంటే ధర్మాత్ములు మహారథులగు రామలక్ష్మణులు మానవంతులు అగు వానరులు ఆశతో ఉండెదరు.' ||13.39||
||శ్లోకము 13.40,41||
హస్తాదానో ముఖాదానో నియతో వృక్షమూలికః ||13.40||
వానప్రస్థో భవిష్యామి హ్యదృష్ట్వా జనకాత్మజామ్ |
సాగరానూపజే దేశే బహుమూలఫలోదకే ||13.41||
స|| జనకాత్మజామ్ అదృష్ట్వా హస్తదానః ముఖదానః నియతా బహుమూలఫలోదకే సాగరానూపజే దేశే వృక్షమూలికః వానప్రస్థః భవిష్యామి ||
తిలక టీకాలో - హస్తదానో హస్త పతిత ఫలాదిక గ్రాహకః తత్ భోజీతి యావత్ ముఖదానో ముఖపతిత భోజో, నియతో నియతేన్ద్రియః, వృక్షమూలికో వృక్షమూలనివాసీ ।
||శ్లోకార్థములు||
జనకాత్మజామ్ అదృష్ట్వా -
జనకాత్మజను చూడక
హస్తదానః ముఖదానః -
చేతికి దొరికినది నోటికి దొరికినది
నియతా బహుమూలఫలోదకే -
నియమముతో అనేక కందమూలములు ఫలములతో
సాగరానూపజే దేశే -
సముద్ర తీరప్రాంతములో
వృక్షమూలికః -
వృక్షమూలములో నివసిస్తూ
వానప్రస్థః భవిష్యామి -
వానప్రస్థ జీవితము గడిపెదను
||శ్లోకతాత్పర్యము||
'జనకాత్మజను చూడక చేతికి దొరికినది నోటికి దొరికినది అనేక మూలఫలములతో చెట్లకింద నివసిస్తూ వానప్రస్థ జీవనము గడిపెదను.' ||13.41,42||
||శ్లోకము 13.42||
చితాం కృత్వా ప్రవేక్ష్యామి సమిద్ద మరణీసుతమ్ |
ఉపవిష్టస్య వా సమ్యగ్లింగినీం సాధయిష్యతః ||13.42||
శరీరం భక్షయిష్యంతి వాయసా శ్శ్వాపదాని చ |
స|| సమిద్ధమ్ అరణీసుతం చితాం కృత్వా ప్రవేక్ష్యామి శరీరం వాయసాః శ్వపదాని చ భక్షయిష్యన్తి వా ఉపవిష్టస్య లింగినీం సాధయిష్యతః ||
రామ టీకాలో - లిఙ్గినం - ఊర్ధ్వగతి సాధక చిహ్నమ్ సమ్యక్ సాధయిష్యతః అత ఏవ ఉపవిష్టస్య చితాం ప్రవిష్టస్య మమ శరీరం వాయసాః శ్వపదానిచ భక్షయిష్యన్తి ।
||శ్లోకార్థములు||
సమిద్ధమ్ అరణీసుతం -
అరణిలచేత మండింపబడిన చితిని చేసి
చితాం కృత్వా ప్రవేక్ష్యామి -
చితిని చేసి ప్రవేశించెదను
శరీరం వాయసాః శ్వపదాని -
శరీరమును వాయసములు కుక్కలు
చ భక్షయిష్యన్తి - భక్షించుగాక
వా ఉపవిష్టస్య లింగినీం సాధయిష్యతః -
లేక ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేసెదను
||శ్లోకతాత్పర్యము||
'అరణిలచేత మండింపబడిన చితిని చేసి ప్రవేశించెదను. నా శరీరము వాయసములు కుక్కలు భక్షించుగాక. లేక ఇక్కడే కూర్చుని నిరాహార దీక్ష చేసెదను.' ||13.42||
||శ్లోకము 13.43||
ఇదం మహర్షిభి ర్దృష్టం నిర్యాణ మితి మే మతిః ||13.43||
సమ్యగాపః ప్రవేక్ష్యామి న చే త్పశ్యామి జానకీమ్ |
స|| జానకీం న పశ్యామి చేత్ ఆపః ప్రవేక్ష్యామి | ఇదం మహర్షిభిః దృష్టం సమ్యక్ నిర్యాణం ఇతి మే మతిః ||
రామ టీకాలో - జానకీం నపశ్యామి చేత్ ఆపః ప్రవిశ్యామి। తత్ర హేతుః ఇదం జలప్రవేశేన మయి నిర్యాణమ్, ఋషిభిః దృష్టమ్ ఉత్తమత్వేన నిర్దిష్టమ్ ।
గోవిన్దరాజా టీకాలో - ఋషిభిః దృష్టమ్ న చ ఏవం ఆత్మత్యాగో దోషః
||శ్లోకార్థములు||
జానకీం న పశ్యామి చేత్ -
నేను జానకిని చూడకపోయినచో
ఆపః ప్రవేక్ష్యామి - నీటిలో ప్రవేశించెదను
ఇదం మహర్షిభిః దృష్టం -
మహర్షులు చెప్పిన నిర్యాణ మార్గము
ఇతి మే మతిః -
ఇదే అని నాకు అనిపిస్తుంది.
||శ్లోకతాత్పర్యము||
'నేను జానకిని చూడకపోయినచో, నీటిలో ప్రవేశించెదను. మహర్షులు చెప్పిన నిర్యాణ మార్గము ఇదే అని నాకు అనిపిస్తుంది.' ||13.43||
నీళ్లలో ప్రవేశించెదను అనడములో ఆత్మహత్య వినిపిస్తుంది. కనుక అది దోషముగా అనిపిస్తుంది. ఇక్కడ కవి చెప్పినది, ఈ నిర్యాణ మార్గము ఋషులచేత అంగీకరింపబడినది అని, ఈ ఆత్మ త్యాగములో దోషము లేదు అని గోవిన్దరాజులవారి వ్యాఖ్య.
||శ్లోకము 13.44||
సుజాతమూలా సుభగా కీర్తిమాలా యశస్వినీ ||13.44||
ప్రభగ్నా చిరరాత్రీయం మమ సీతామపశ్యతః |
స|| సుభగా యశస్వినీ కీర్తిమాలా సీతామ్ అపశ్యతః మమ చిరరాత్రీయం సుజాతమూలా ప్రభగ్నా ||
గోవిదరాజులవారు తమ టీకాలో - సుజాత మూలా ఆదౌ లంకాధిదేవతా జయేన శోభనప్రారంభా, సుభగా చన్ద్రోదయేన రమ్యా, కీర్తిమాలా మమ కీర్తిమయమాలా యశస్వినీ హనుమతో లంకాప్రవేశ రాత్రీ ఇతి విఖ్యాతా। చిర రాత్రీ జాగరణేన దీర్ఘభూతారాత్రిః ప్రభగ్నా సమాప్తా ఏవం కల్యాణీయం రాత్రిః సీతాం అపశ్యతో వ్యర్థః జాతేత్యర్థః।
రామటీకాలో - సుభగా శోభనైశ్వర్య దాత్రీ, యశస్వినీ ముద్రికాదానోపలక్షిత రామప్రీతిపాత్రత్వహేతుక అతిశయవిశిష్ఠా కీర్తిమాలా ప్రభగ్నా అతః తాపసో భవిష్యామి తాం సీతాం అదృష్ట్వాఇతో న ప్రతిగఛ్చామి|
||శ్లోకార్థములు||
సుభగా యశస్వినీ కీర్తిమాలా సీతామ్ అపశ్యతః -
శుభమైన యశస్విని కీర్తివంతురాలు సీతను చూడక
మమ చిరరాత్రీయం సుజాతమూలా -
నా సానుకూల ఘటనలతో మొదలైన ఈ దీర్ఘమైన రాత్రి l
ప్రభగ్నా - నిరర్థకముగా పరిణమిస్తున్నది
||శ్లోకతాత్పర్యము||
'శుభమైన యశస్విని కీర్తివంతురాలు అగు సీతను చూడకపోవడముతో ఈ దీర్ఘమైన రాత్రి శుభముగా సానుకూల ఘటనలతో మొదలై, చివరకు నిరర్థకముగా పరిణమిస్తున్నది'. ||13.44||
లంకిణిని జయించడమువలన, సుజాతమూలా శుభముతో మొదలైనది అని; సుభగా అంటే చంద్రోదయమువలన శుభముగా మొదలైనది అని; కీర్తిమాలా అంటే యశస్విని అగు సీతాన్వేషణకు హనుమంతుడు ప్రవేశించిన రాత్రి గనుక కీర్తిమాలా అని గోవిన్దరాజులవారి టీకాలో.
రామ టీకాలో సుభగా యశస్వినీ కీర్తిమాలా అన్నమూడు పదములు సీతకి కూడా వర్తించేట్టుగా వివరించబడినది. అందువలన ఇక్కడ తాత్పర్యములో ఆ మూడు పదములు సీతమ్మకి పర్యాయ పదములుగా చెప్పబడినవి.
||శ్లోకము 13.45||
తాపసో వా భవిష్యామి నియతో వృక్షమూలికా ||13.45||
నేతః ప్రతి గమిష్యామి తామదృష్ట్వాఽసితేక్షణామ్ |
స|| నియతః వృక్షమూలికః తాపసో వా భవిష్యామి | తాం అసితేక్షణామ్ అదృష్ట్వా ఇతః న ప్రతి గమిష్యామి ||
||శ్లోకార్థములు||
నియతః వృక్షమూలికః -
వృక్ష మూలములో కూర్చుని
తాపసో వా భవిష్యామి -
తాపసికుడనగుదును గాక
తాం అసితేక్షణామ్ అదృష్ట్వా -
ఆ సీతను కను గొనకుండా
ఇతః న ప్రతి గమిష్యామి -
ఇక్కడనుంచి నేను వెళ్ళను
||శ్లోకతాత్పర్యము||
'వృక్ష మూలములో కూర్చుని తాపసికుడనగుదును గాక. ఆ సీతను కను గొనకుండా ఇక్కడనుంచి నేను వెళ్ళను'. ||13.45||
||శ్లోకము 13.46||
యదీతః ప్రతిగచ్ఛామి సీతా మనధిగమ్యతామ్ ||13.46||
అంగదః సహ తైః సర్వైః వానరైః నభవిష్యతి |
స|| తాం సీతాం అనధిగమ్య ఇతః యది ప్రతిగచ్ఛామి తే సర్వైః వానరైః అంగదైఃసహ న భవిష్యతి||
||శ్లోకార్థములు||
తాం సీతాం అనధిగమ్య ఇతః -
ఆ సీతను కనుగొనకుండా ఇక్కడనుంచి
యది ప్రతిగచ్ఛామి - వెళ్ళిపోయినచో
తే సర్వైః వానరైః అంగదైః సహ -
అంగదునితో కూడి వానరులందరూ
న భవిష్యతి - మరణించెదరు
||శ్లోకతాత్పర్యము||
'ఆ సీతను కనుగొనకుండా ఇక్కడనుంచి వెళ్ళినచో అంగదునితో కూడి వానరులందరూ మరణించెదరు'. ||13.46||
||శ్లోకము 13.47||
వినాశే బహవో దోషా జీవన్ భద్రాణి పశ్యతి||13.47||
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి ధ్రువో జీవితసంగమః|
స|| వినాశే బహవః దోషాః | జీవన్ భద్రాణి పశ్యతి | తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి జీవిత సంగమః ధృవః ||
రామటీకాలో - వినాశే మద్ విధ్వంసే బహవో దోషాః ఉభయకుల విధ్వంసో భవిష్యతి ఇత్యర్థః। తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి।నను తవ ప్రాణ ధారణోపి జానకీ వృత్తాన్త అలాభే వానరైః సుగ్రీవ సమీప గమనే తత్ ప్రాణ విధాతః గమన్ అభావే వృత్తాన్తలాభానాపత్యా ఉభకులవినాశో భవిష్యత్యేవేతి కిం తవ ప్రాణధారణేనేత్యత ఆహ- జీవతి సతి। సంగమః సుఖప్రాప్తిః ధ్రువో నిశ్చితః అతః జీవన్ మమాత్మా భద్రకం కల్యాణం ప్రాప్నోతి ప్రాప్స్యతి ।
||శ్లోకార్థములు||
వినాశే బహవః దోషాః -
మరణము అనేక దోషములకు కారణము
జీవన్ భద్రాణి పశ్యతి -
బ్రతికి జీవి అనేక శుభములు చూడవచ్చు
తస్మాత్ ప్రాణాన్ ధరిష్యామి -
అందువలన ప్రాణములను తప్పక ధరించెదను
జీవిత సంగమః ధృవః -
జీవిస్తే కలవడము అవవచ్చు
||శ్లోకతాత్పర్యము||
'మరణము అనేక దోషములకు కారణము. బ్రతికి జీవి అనేక శుభములు చూడవచ్చు. అందువలన ప్రాణములను తప్పక ధరించెదను. జీవిస్తే కలవడము అవవచ్చు కూడా'. ||13.47||
గోవిన్దరాజులులవారు తమ టీకాలో, అలాగే రామ టీకాలో కూడా ఈ మాట మీద కొంచెము విశదీకరింపబడినది. ఇంతకు ముందు సీతను చూడలేకపోవడముతో ఉభయకులనాశనము గురించి అలోచించడమైనది కాబట్టి, ఇక్కడ బ్రతికి వుంటాను అనడములో, మార్పు ఏమిటి అన్నపశ్నకి సమాధానముగా హనుమ - జీవిస్తే శుభకార్యములు అవవచ్చుఅని. అంటే సీతాదర్శనము, రామునితో సమాగమము కూడా అవవచ్చు అని అర్థము.
జీవిస్తే అనేక శుభములను చూడవచ్చు, మరణించి లాభము లేదు అన్నది ఒక జీవిత పరమ సత్యము. అదే కవి మన అందరికీ చెప్పుచున్నాడు.
అన్వేషణలో అత్యంత దుఃఖము పోంది, మరణిద్దామా అని అలోచన వచ్చిన , హనుమకి ఈ పరమ సత్యము గుర్తువస్తుంది. అప్పుడప్పుడు అతి దుఃఖమే జ్ఞానోదయానికి అంకురము అవుతుంది. కష్టతరమైన ఆత్మాన్వేషణలో పోతూ, తను సరి అయినమార్గములో వున్నాడో లేడో అని భయపడిన ముముక్షువుకి, గురువు ఆశ్వాసన ఇచ్చినట్లు హనుమకు ఈ సత్యము గుర్తుకు వస్తుంది.
||శ్లోకము 13.48||
ఏవం బహువిధం దుఃఖం మనసా ధారయన్ ముహుః ||13.48||
నాధ్యగచ్చత్ తదా పారం శోకస్య కపికుంజరః |
స|| కపికుంజరః ఏవం బహువిథం దుఃఖం ముహుః మనసా ధారయన్ తదా శోకస్య పారం నాధ్యగచ్ఛత్ ||
||శ్లోకార్థములు||
ఏవం బహువిధం దుఃఖం -
ఇలాగ అనేక విధములను
ముహుః మనసా ధారయన్ -
మళ్ళీ మళ్ళీ మనస్సులో అలోచించి
తదా శోకస్య పారం నాధ్యగచ్ఛత్ -
శోకసముద్రానికి అవతలి తీరము చేరలేక పోయెను
||శ్లోకతాత్పర్యము||
ఆ కపికుంజరుడు ఇలాగ అనేక విధములుగా ఆలోచించి మనస్సులో దుఃఖపడిన వాడై శోకసముద్రానికి అవతలి తీరము చేరలేక పోయెను. ||13.48||
||శ్లోకము 13.49||
రావణం వా వధిష్యామి దశగ్రీవం మహాబలమ్ ||13.49||
కామ మస్తు హృతా సీతా ప్రత్యాచీర్ణం భవిష్యతి |
స|| దశగ్రీవం మహాబలం రావణం వధిష్యామి | హృతా సీతా కామమ్ అస్తు| ప్రత్యాచీర్ణమ్ భవిష్యతి అపి||
రామటీకాలో - తతః శోకకాలే ధైర్వవాన్ కపికుఞ్జరః విక్రమం యుద్ధోత్సాహం ఆసాద్య ప్రాప్య వా అథవా రావణం వధిష్యామి । నను రావణ వధోఽపి సీతాప్రాప్యభావే తవ కిం ప్రయోజనం ఇతి ఆహ - సీతా హృతాఽస్తు ప్రత్యాచీర్ణమ్ వైర నిర్యాతనం తు కామం భవిష్యతి ఇతి చిన్తయామాసేతి శేషః । సార్థ శ్లోక ఏకాన్వయీ॥
||శ్లోకార్థములు||
దశగ్రీవం మహాబలం రావణం వధిష్యామి -
దశగ్రీవుడైన మహాబలుడు అగు రావణుని వధించెదను
హృతా సీతా కామమ్ అస్తు - చనిపోయిన సీత కోరిక తీరును
ప్రత్యాచీర్ణమ్ భవిష్యతి అపి - ప్రతిక్రియకూడా అగును.
||శ్లోకతాత్పర్యము||
'దశగ్రీవుడైన మహాబలుడు అగు రావణుని వధించెదను. చనిపోయిన సీత కోరిక తీరును. ప్రతిక్రియకూడా అగును'. ||13.49||
రావణుని వధతో సీతమ్మ కనపడదు కదా అన్నమాటకి, రావణ వధతో ఆ దుష్టుడికి ప్రతిక్రియ అవుతుంది అని హనుమ మాటలలో సమాధానము వినిపిస్తుంది. అదే టీకా త్రయములో చెప్పబడినది.
||శ్లోకము 13.50||
అథ వైనం సముత్‍క్షిప్య ఉపర్యుపరి సాగరమ్ ||13.50||
రామాయోపహరిష్యామి పశుం పశుపతేరివ |
స|| అథవా ఏనం సాగరం ఉపర్యుపరి సముత్‍క్షిప్య పశుపతేః పశుం ఇవ రామాయ ఉపహరిష్యామి||
||శ్లోకార్థములు||
అథవా ఏనం సాగరం ఉపర్యుపరి సముత్‍క్షిప్య -
లేక వీనిని ఈ సాగరముపై తీసుకొని పోయి
పశుపతేః పశుం ఇవ -
పశుపతికి ఇవ్వబడు పశువు వలె
రామాయ ఉపహరిష్యామి -
రాముని కి సమర్పించెదను
||శ్లోకతాత్పర్యము||
'లేక పశుపతికి ఇవ్వబడు పశువు వలె రావణుని సాగరముపై తీసుకొని పోయి రాముని కి సమర్పించెదను'. ||13.50||
||శ్లోకము 13.51||
ఇతి చింతాం సమాపన్నః సీతామనధిగమ్యతామ్ ||13.51||
ధ్యానశోకపరీతాత్మా చింతయామాస వానరః |
స|| వానరః తాం సీతాం అనధిగమ్య ఇతి చింతాం సమాపన్నః ధ్యానశోకపరీతాత్మా చింతయామాస ||
||శ్లోకార్థములు||
వానరః తాం సీతాం అనధిగమ్య -
వానరుడు సీతజాడను కనుగొనలేక
ఇతి చింతాం సమాపన్నః - చింతా పరాయణుడై
ధ్యానశోకపరీతాత్మా చింతయామాస-
చింతవలన వచ్చిన శోకము తో కూడిన మనస్సుతో ఆలోచించసాగెను
||శ్లోకతాత్పర్యము||
'వానరుడు సీతజాడను కనుగొనలేక చింతా పరాయణుడై, చింతవలన వచ్చిన శోకము తో కూడిన మనస్సుతో ఆలోచించసాగెను'. ||13.51||
||శ్లోకము 13.52||
యావత్సీతాం హి పశ్యామి రామపత్నీం యశస్వినీమ్ ||13.52||
తావ దేతాం పురీం లంకాం విచినోమి పునః పునః |
స|| రామపత్నీం యశస్వినీం సీతాం యావత్ పశ్యామి తావత్ ఏతాం లంకాం పునః పునః విచినోమి హి ||
||శ్లోకార్థములు||
రామపత్నీం యశస్వినీం సీతాం -
రామపత్నీ యశస్వినీ అగు సీత
యావత్ పశ్యామి తావత్ -
కనపడే వరకు
ఏతాం లంకాం పునః పునః విచినోమి -
ఈ లంకానగరమును మళ్ళీ మళ్ళీ వెదకెదను.
||శ్లోకతాత్పర్యము||
'రామపత్నీ యసస్వినీ అగు సీతజాడ కనపడువరకు ఈ లంకానగరమును మళ్ళీ మళ్ళీ వెదకెదను'. ||13.52||
సీతాన్వేషణలో కష్టాలు వస్తున్నా, సఫలము కాకపోయినా - హనుమ తన కార్యము వదలడు. ఇప్పుడు మళ్ళీ వెదకెదను అని అలోచిస్తాడు.
||శ్లోకము 13.53||
సంపాతి వచనాచ్చాపి రామం యద్యానయా మహ్యమ్ ||13.53||
అపశ్యన్ రాఘవో భార్యాం నిర్దహేత్ సర్వ వానరాన్ |
స|| సంపాతి వచనాత్ అహం రామం ఆనయామి యది రాఘవః భార్యాం అపశ్యన్ సర్వ వానరాన్ నిర్దహేత్ ||
||శ్లోకార్థములు||
సంపాతి వచనాత్ -
సంపాతి వచనములతో
అహం రామం ఆనయామి యది -
రాముని ఇక్కడకు తీసుకు వచ్చినచో
రాఘవః భార్యాం అపశ్యన్ -
రాఘవుడు తన భార్య కనపడక
సర్వ వానరాన్ నిర్దహేత్ -
వానరులందరినీ దహించివేసెడివాడు
||శ్లోకతాత్పర్యము||
'సంపాతి వచనములతో రాముని ఇక్కడకు తీసుకు వచ్చినచో రాఘవుడు తన భార్య కనపడక వానరులందరినీ దహించివేసెడివాడు'. ||13.53||
||శ్లోకము 13.54||
ఇహైవ నియతాహారో వత్స్యామి నియతేంద్రియః ||13.54||
న మత్కృతే వినశ్యేయుః సర్వేతే నరవానరాః |
స|| నియత ఆహరః నియత ఇంద్రియః ఇహైవ వత్స్యామి | మత్కృతే తే నరవానరాః న వినశ్యేయుః ||
||శ్లోకార్థములు||
నియత ఆహరః నియత ఇంద్రియః -
నియమిత ఆహారముతో ఇంద్రియ నిగ్రహముతో
ఇహైవ వత్స్యామి -
ఇక్కడే ఉండిపోయెదను
మత్కృతే తే నరవానరాః -
నా కారణముగా నరవానరులు
న వినశ్యేయుః - నశింపబడ రాదు
||శ్లోకతాత్పర్యము||
'ఇక్కడే నియమిత ఆహారముతో ఇంద్రియ నిగ్రహముతో ఉండిపోయెదను. నా కారణముగా నరవానరులు నశింపరాదు'.||13.54||
||శ్లోకము 13.55||
అశోక వనికాచేయం దృశ్యతే యా మహాద్రుమా ||13.55||
ఇమాం అధిగమిష్యామి నహీయం విచితా మయా |
స|| ఇయం మహాద్రుమా అశోకవనికా దృశ్యతే ఇమాం మయా న విచితాహి |ఇమాం అధిగమిష్యామి ||
||శ్లోకార్థములు||
ఇయం మహాద్రుమా అశోకవనికా దృశ్యతే -
ఈ మహావృక్షములతో నున్న అశోకవనము కనపడు చున్నది
ఇమాం మయా న విచితాహి -
ఇంతవరకు ఈ వనము లో వెదకలేదు
ఇమాం అధిగమిష్యామి - దానిలోకి వెళ్ళెదను
||శ్లోకతాత్పర్యము||
'ఈ మహావృక్షములతో నున్న అశోకవనము కనపడు చున్నది. ఇంతవరకు ఈ వనము లో వెదకలేదు. దానిలోకి వెళ్ళెదను'. ||13.55||
ఇంత శోకములోను కనపడినది అశోకవనము. శోకము నిర్మూలించే వనము అన్నమాట. దానిలో వెదుకవలెనని హనుమ నిశ్చయము. ఆశోకవనము కాబట్టి సీతమ్మ కనపడలేదనే శోకము నిర్వర్తింపబడుతుంది అని ఒక ధ్వని.
||శ్లోకము 13.56||
వసూన్ రుద్రాం స్తథాఽఽదిత్యాన్ అశ్వినౌ మరుతోఽపి చ ||13.56||
నమస్కృత్వా గమిష్యామి రక్షసాం శోకవర్థనః |
స|| వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్ అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా రక్షసాం శోకవర్ధనః గమిష్యామి ||
||శ్లోకార్థములు||
వసూన్ రుద్రాన్ తథా ఆదిత్యాన్ -
వసువులకు రుద్రులకు అలాగే అదిత్యులకు
అశ్వినౌ మరుతోపి చ నమస్కృత్వా -
అశ్వినీ దేవతలకు మరుత్తులకు నమస్కరించి
రక్షసాం శోకవర్ధనః గమిష్యామి -
రాక్షసుల శోకము అధికము చేయుటకు వెళ్ళెదను
||శ్లోకతాత్పర్యము||
'వసువులకు రుద్రులకు అలాగే అదిత్యులకు అశ్వినీ దేవతలకు నమస్కరించి రాక్షసుల శోకము అధికము చేయుటకు వెళ్ళెదను'. ||13.56||
||శ్లోకము 13.57||
జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ ఇక్ష్వాకుకులనందినీమ్ ||13.57||
సంప్రదాస్యామి రామాయ యథా సిద్ధిం తపస్వినే |
స|| సర్వాన్ రాక్షసాన్ జిత్వా తు తపస్వినే సిద్ధిం యథా ఇక్ష్వాకుకులనన్దినీం రామాయ సంప్రదాస్యామి ||
||శ్లోకార్థములు||
జిత్వాతు రాక్షసాన్ సర్వాన్ -
రాక్షసులందరినీ జయించి
తపస్వినే సిద్ధిం యథా -
తపస్వికి సిద్ధి చేరినట్లు
ఇక్ష్వాకుకులనన్దినీం రామాయ సంప్రదాస్యామి -
ఇక్ష్వాకుకులనందినీ ని రామునికి చేర్చెదను
||శ్లోకతాత్పర్యము||
రాక్షసులందరినీ జయించి, తపస్వికి సిద్ధి చేరినట్లు ఇక్ష్వాకు కులనందినిని రామునికి చేర్చెదను. ||13.57||
||శ్లోకము 13.58||
స ముహూర్తమివ ధ్యాత్వా చింతావగ్రథితేంద్రియః |
ఉదతిష్టన్ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః ||13.58||
స|| మహాతేజాః మారుతాత్మజః సః హనుమాన్ చింతావగ్రథితేంద్రియః ముహూర్తమివ ధ్యాత్వా ఉదతిష్ఠన్ ||
||శ్లోకార్థములు||
మహాతేజాః మారుతాత్మజః సః హనుమాన్ -
మహాతేజోవంతుడు మారుతాత్మజుడు అగు హనుమంతుడు
చింతావగ్రథితేంద్రియః -
చింతతో కూడిన ఇన్ద్రియములు కలవాడై
ముహూర్తమివ ధ్యాత్వా ఉదతిష్ఠన్ -
క్షణకాలము ధ్యానమగ్నుడై పైకి లేచెను
||శ్లోకతాత్పర్యము||
మహాతేజోవంతుడు మారుతాత్మజుడు అగు హనుమంతుడు కాసేపు ధ్యానము చేసి దుఃఖమనే బంధమును తెంచుకొని నిలబడెను. ||13.58||
ఇక్కడ, 'వుదతిష్ఠన్ మహాతేజా', అన్న మాటలో గమనించవలసిన విషయము వుంది.
సీతాన్వేషణ ఫలించకపోవడముతో , సీత జీవించివున్నదా లేదా అన్న సందేహముతో పాటు , సీతకనపడలేదని చెప్పడమువలన కలిగే హాని అంతా ఆలోచించి , హనుమంతుడు వెనకాడలేదు. రావణుని సంహరించడమో లేక ఆ రావణుని పశువు లాగా తీసుకుపోయి రామునికే సమర్పిద్దాము అన్న ఆలోచనతో , 'వుదతిష్ఠన్ మహాతేజా', ధృఢ నిశ్చయముతో లేచి నుంచుని, ఆ తేజోవంతుడు అన్వేషణలో ముందుకు వెళ్ళాడు. అంటే ఆ సందేహాలకి బానిస అయి, అన్వేషణ చాలించలేదు. అది ముఖ్యమైన విషయము. ఆత్మాన్వేషణలో సాధకుడు కూడా అలాగే ముందుకు పోవాలి అని ఇంకో ధ్వని.
||శ్లోకము 13.59||
నమోఽస్తు రామాయ సలక్ష్మణాయై
దేవ్యై చ తస్యై జనకాత్మజాయై |
నమోsస్తు రుద్రేంద్రయమానిలేభ్యో
నమోsస్తు చంద్రార్క మరుద్గణేభ్యః ||13.59||
స|| స లక్ష్మణాయ రామాయ నమః అస్తు| దేవ్యై తస్యై జనకాత్మజాయై చ | రుద్ర ఇంద్ర యమ అనిలః ఏతేభ్యో నమః అస్తు| చన్ద్రార్కమరుత్ గణేభ్యః నమః అస్తు ||
||శ్లోకార్థములు||
స లక్ష్మణాయ రామాయ నమః అస్తు -
లక్ష్మణునితో కూడిన రామునికి నమస్కారము
దేవ్యై తస్యై జనకాత్మజాయై చ -
జనకుని కూతురైన దేవీ స్వరూపమైన ఆమెకి నమస్కారము
రుద్ర ఇంద్ర యమ అనిలః ఏతేభ్యో నమః అస్తు-
రుద్రుడు యముడు వాయుదేవులకు వీరందరికి నమస్కారము
చన్ద్రార్కమరుత్ గణేభ్యః నమః అస్తు - సూర్య వంద్రులకు మరుత్తులకు నమస్కాకారములు
||శ్లోకతాత్పర్యము||
'లక్ష్మణునితో కూడిన రామునకు నమస్కారము. దేవి అయిన జనకాత్మజకు నమస్కారము. రుద్రుడు ఇంద్రుడుయముడు అనిలిడు వీరందరికీ నమస్కారములు. చంద్రుడుసూర్యునకు మరుత్ గణములకు నమస్కారము'. ||13.59||
మూడు సార్లు నమః అంటూ చెప్పిన ఈ శ్లోకము, ఒక మంత్ర రూపమైన శ్లోకము.
నమః అంటే,
న = కాదు; మః =నాది ;
నమః అంటే నాది కానిది.
ఆ నమః అనడములో అన్వేషించుటలో, 'నేను కర్తను కాను. నేను సీతారాముల పని ముట్టును' , అనుభావన మనోవాక్కాయకర్మలచే ప్రదర్శించడము. అ నమః తోనే భగవంతుని శరణాగతి అన్నమాట. సీతాన్వేషణ సఫలము కాలేదు. ఇప్పుడు భగవంతుని శరణుకావాలి అపుడు కాని సీతమ్మ దర్శనము కాదు.
సుందరకాండ భక్తులకు ఈ ప్రార్థనా శ్లోకము నిత్యము చదువుకొనతగిన శ్లోకము. రామాయణ పారాయణలో అనేకమంది ఈ శ్లోకమును ప్రార్థనా శ్లోకముగా ఉపయోగిస్తారు.
ఇంకొక మాట
మొదటిలో మహేంద్ర పర్వతము నుండి సీతాన్వేషణమునకు బయలు దేరునపుడు హనుమంతుడు నమస్కారము చేసి బయలు దేరెను. అపుడు సూర్యునకు, ఇంద్రునకు, బ్రహ్మకు, వాయువునకు నమస్కరించెను.
కాని ఇపుడు సీతకు రామునకు, లక్ష్మణునకు ముందు నమస్కరించి, తరువాత ఇతర దేవతలకు నమస్కరించెను. అంటే భగవదనుగ్రహము, భగవద్భక్తుల అనుగ్రహము, దేవి అనుగ్రహము కలిగిన వాడు ఆత్మదర్శనము తద్వారా భగవద్దర్శనము పొందును.
ఇతర దేవతలను నమస్కరించుట వారి అనుగ్రహము పొందుట, అంతః కరణ శుద్ధికి అవశ్యము.
భగవంతుని నమస్కరించునపుడు, భగవద్బక్తులద్వారా దేవి ద్వారానే ఆశ్రయింపవలెను అను నియమమును ఇక్కడ హనుమంతుడు పాటించెను.
మహేంద్ర పర్వతము నుండి బయలుదేరుతూ సూర్య మహేంద్రాదులకు అంజలి ఘటించినపుడు,
'నమః' అన్న శబ్దము వాచ్యముగా ప్రయోగింపలేదు. ఇక్కడ నమః శబ్దమును మూడు సార్లు ప్రయోగించెను.
సీత సాక్షాత్తు 'లక్ష్మీ స్వరూపిణి'. ఆమె ఎన్నడూ స్వామిని వీడియుండునది కాదు. జీవస్వరూపమును శిక్షించుటకై, ఆమె ఇక్కడ బంధములలో ఉన్నట్లు జీవభావమున నటించుచుండెను. ఆట్టి ఆమెని తాను వెతుకుట ఏమి? ఇది కేవలము లోకవిడంబనమని హనుమ తెలిసికొనెను. వెంటనే తాను అన్వేషించు చున్నాను అన్న స్వాతంత్ర్య భావముము విడిచి, పారతంత్ర్యమును అంటే తల్లిమీద భారమును ఇందు ప్రకటించెను అంటారు అప్పలాచార్యులవారు.
సీతమ్మ సాక్షాత్తు 'లక్ష్మీ స్వరూపిణి కనుక, ఆమె అనుగ్రహమున్ననే ఆమె దర్శనమిచ్చునని హనుమ గుర్తించి, 'నమోస్తు దేవ్యై జనకాత్మజాయై', అని నమస్కరించెను.
దేవి అను పదమునకు క్రీడించునది , ప్రకాశించునది అని అర్థము. ఇది అంతయూ ఆమె క్రీడయే.
అంతే గాక ఆమె ప్రకాశ స్వరూపిణీ. ప్రకాశము ఇతరులను ప్రకాశింపచేయును. తానును ప్రకాశించును. అందుచే తన సంబోధనలో జనకాత్మజ అనెను. అంటే జనకుని కూతురనికాదు. 'జనకునకు తనను కనిపింపచేసికొనినది' అని అర్థము. 'అమ్మా ఆనాడు జనకుడు నిన్ను పొందవలనని యజ్ఞక్షేత్రము దున్న లేదు. జనకుడు దున్నుచుండగా నీవు అనుగ్రహించి, నీవే అతనికి కనపడితివి. అట్లే నీవు అనుగ్రహించి నాకు కనపడవలెను గాని నేను నిన్ను వెతుకుటయా?' అను భావము స్ఫురించునట్లు పై వాక్యము- 'నమోస్తు దేవ్యై జనకాత్మజాయై' - పలికెను.
అలాగ హనుమంతుడు సీతమ్మను ప్రార్థించి , సీతారాములపై భారము వేసి, ముందుకేగెను. ఇది ముముక్షువుకు జ్ఞానోదయము అయిన సమయములాంటి సమయము
||శ్లోకము 13.60||
సతేభ్యస్తు నమస్కృత్య సుగ్రీవాయచ మారుతిః ||13.60||
దిశస్సర్వా స్సమాలోక్య హ్యశోకవనికాం ప్రతి |
స|| సః మారుతిః తేభ్యః నమస్కృత్య సుగ్రీవాయ చ సర్వాః దిశాః సమాలోఖ్య అశోకవనికామ్ ప్రతి ||
||శ్లోకార్థములు||
సః మారుతిః తేభ్యః నమస్కృత్య -
ఆ మారుతి వారందరికీ ప్రణమములు అర్పించి
సుగ్రీవాయ చ - సుగ్రీవునకు కూడా నమస్కరించి
సర్వాః దిశాః సమాలోఖ్య - నలువంకలా చూచి
అశోకవనికామ్ ప్రతి -
అశోకవనముపై తన దృష్టి సారించెను
||శ్లోకతాత్పర్యము||
ఆ మారుతి వారందరికీ ప్రణామములు అర్పించి సుగ్రీవునకు కూడా నమస్కరించి, నలువంకలా చూచి అశోకవనముపై తన దృష్టి సారించెను. ||13.60||
||శ్లోకము 13.61||
స గత్వా మనసా పూర్వ మశోకవనికాం శుభామ్ ||13.61||
ఉత్తరం చింతయామాస వానరో మారుతాత్మజః |
స|| మారుతాత్మజః సః వానరః మనసా పూర్వం శుభాం అశోకవనికామ్ గత్వా ఉత్తరం చిన్తయామాస ||
||శ్లోకార్థములు||
మారుతాత్మజః సః వానరః -
మారుతాత్మజుడగు ఆ వానరుడు
మనసా పూర్వం శుభాం అశోకవనికామ్ గత్వా -
మనస్సులో ముందరే అశోకవనిక చేరి
ఉత్తరం చిన్తయామాస -
తదనంతర కర్తవ్యము గురించి ఆలోచింపసాగెను
||శ్లోకతాత్పర్యము||
మారుతాత్మజుడగు ఆ వానరుని మనస్సు ముందరే అశోకవనిక చేరి, తదనంతర కర్తవ్యము గురించి ఆలోచింపసాగెను. ||13.61||
మనస్సులోనే ముందర చేరాడు అనడములో హనుమంతుని ఆతురత ఉత్సాహము చెప్పబడుతున్నాయి.
||శ్లోకము 13.62||
ధ్రువం తు రక్షోబహుళా భవిష్యతి వనాకులా ||13.62||
అశోకవనికా పుణ్యా సర్వసంస్కారసంస్కృతా |
స|| వనాకులా సర్వసంస్కారసంస్కృతా పుణ్యా అశోకవనికా ధృవం రక్షో బహుళా భవిష్యతి ||
గోవిన్దరాజా టీకాలో- ధ్రువమ్ ఇతి। రక్షో బహుళా వనాకులా జలావృతా ద్రుమషణ్డమణ్డితా వా సర్వ సంస్కారైః కర్షణ తృణనిరసనాదిభిః సంస్కృతా కృత అతిశయాధానా అశోకవనికా ధృవం చిన్త్యా భవిష్యతి అవశ్యం అన్వేషణీయమ్ భవేత్ ఇత్యర్థః।
||శ్లోకార్థములు||
వనాకులా సర్వసంస్కారసంస్కృతా -
అనేకమైన వృక్షములతో సర్వసంస్కారములతో గల
పుణ్యా అశోకవనికా -
పూజింపతగిన అశోకవాటిక
ధృవం రక్షో బహుళా భవిష్యతి -
తప్పక రాక్షసుల రక్షణలో వుండును
||శ్లోకతాత్పర్యము||
'అనేకమైన వృక్షములతో సర్వసంస్కారములతో పూజింపతగిన ఆ అశోకవనిక తప్పక రాక్షసుల రక్షణలో వుండును'. ||13.62||
||శ్లోకము 13.63, 64||
రక్షిణ శ్చాత్ర విహితా నూనం రక్షంతి పాదపాన్ ||13.63||
భగవానపి సర్వాత్మా నాతిక్షోభం ప్రవాతి వై |
సంక్షిప్తోఽయమ్ మయాఽఽత్మా చ రామార్థే రావణస్య చ ||13.64||
స|| అత్ర విహితాః రక్షిణశ్చ పాదపాన్ నూనం రక్షన్తి సర్వాత్మా భగవానపి నాతిక్షోభం ప్రావాతివై మయా రామార్థే రావణస్య చ అయం అత్మా సంక్షిప్తః ||
||శ్లోకార్థములు||
అత్ర విహితాః రక్షిణశ్చ -
ఇక్కడ నియమించబడిన రక్షకులు
పాదపాన్ నూనం రక్షన్తి -
వృక్షములను తప్పక రక్షించుచుందురు
సర్వాత్మా భగవానపి నాతిక్షోభం ప్రావాతివై -
సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మెల్లగా వీచుచున్నాడు
మయా రామార్థే రావణస్య చ -
నా చేత రాముని కొఱకు రావణుని కొఱకు
అయం అత్మా సంక్షిప్తః -
నా శరీరము చిన్నదిగా చేసుకొనబడినది
||శ్లోకతాత్పర్యము||
'ఇక్కడ నియమించబడిన రక్షకులు వృక్షములను తప్పక రక్షించుచుందురు. సర్వాత్ముడైన వాయుదేవుడు కూడా మెల్లగా వీచుచున్నాడు. నేను కూడా రామకార్యముకొఱకు రావణునికి కనపడకుండా ఉండుటకు నా రూపము చిన్నదిగా చేసుకొంటిని'. ||13.63,64||
||శ్లోకము 13.65,66,67||
సిద్ధిం మే సంవిధాస్యంతి దేవాస్సర్షిగణాస్త్విహ |
బ్రహ్మా స్వయంభూర్భగవాన్ దేవాశ్చైవ దిశంతుమే ||13.65||
సిద్ధిమగ్నిశ్చ వాయుశ్చ పురుహూతశ్చ వజ్రభృత్ |
వరుణః పాశహస్తశ్చ సోమాదిత్యౌ తథైవ చ ||13.66||
అశ్వినౌ చ మహాత్మానౌ మరుతః శర్వ ఏవచ |
సిద్ధిం సర్వాణి భూతాని భూతానాం చైవ యః ప్రభుః |
దాస్యంతి మమయే చాన్యే హ్యదృష్టాః పథి గోచరాః ||13.67||
స|| స ఋషిగణాః దేవాః ఇహ మే సిద్ధిం సంవిధాస్యన్తి |స్వయంభూః భగవాన్ బ్రహ్మా దేవాశ్చైవ అగ్నిశ్చ వాయుశ్చ వజ్రభూత్ పురుహూతశ్చ పాశహస్తః వరుణశ్చ సోమాదిత్యౌ మహాత్మానౌ అశ్వినౌ మరుతః సర్వఏవ చ మే సిద్ధిం దిశన్తు | సర్వాణి భూతాన్ యః భూతానామ్ ప్రభుః అన్యే యే అదృష్టాః పథి గోచరాః మమ సిద్ధిం దాస్యన్తి||
||శ్లోకార్థములు||
స ఋషిగణాః దేవాః ఇహ -
ఇక్కడ ఋషిగణములతో కూడిన దేవులు
మే సిద్ధిం సంవిధాస్యన్తి -
నాకు సిద్ధి కలిగించుగాక
స్వయంభూః భగవాన్ బ్రహ్మా దేవాశ్చైవ -
స్వయంభు బ్రహ్మ దేవతలందరూ కూడా
అగ్నిశ్చ వాయుశ్చ వజ్రభూత్ పురుహూతశ్చ-
అగ్ని వాయువు ఇంద్రుడు
పాశహస్తః వరుణశ్చ-
పాశము చేతులో కలవాడు, వరుణుడు
సోమాదిత్యౌ మహాత్మానౌ అశ్వినౌ -
సూర్య చంద్రులు, మహాత్ములగు అశ్వినులు
మరుతః సర్వఏవ చ -
మరుత్తులు అందరూ
మే సిద్ధిం దిశన్తు-
నాకు సిద్ధిని కలుగించుదురు గాక
సర్వాణి భూతాన్ యః భూతానామ్ ప్రభుః -
సమస్త భూతములు, ఆ భూతముల ప్రభువు
అన్యే యే అదృష్టాః పథి గోచరాః -
ఇంకా కనపడని దేవతలూ కూడా
మమ సిద్ధిం దాస్యన్తి - నాకు సిద్ధి కలిగించుగాక
||శ్లోకతాత్పర్యము||
'ఇక్కడ ఋషిగణములతో కూడిన దేవులు నాకు సిద్ధి కలిగించుగాక. స్వయంభు బ్రహ్మ దేవతలందరూ అగ్ని వాయువు ఇంద్రుడు , పాశము చేతులో కలవాడు, వరుణుడు, చంద్రుడు , సూర్యుడు,అశ్వినులు , మరుత్గణములు అందరూ నాకు సిద్ధిని కలుగించుదురు గాక. సమస్త భూతములు , ఆ భూతముల ప్రభువు , ఇంకా కనపడని దేవతలూ కూడా నాకు సిద్ధి కలిగించుగాక'. ||13.65-67||
తిలక టీకాలో - సర్వాత్మనా కార్యసిద్ధయే స్మరతి - అంటారు; ఇక్కడ హనుమంతుడు సిద్ధి కోసము భగవంతుని ఆశ్రయించడము నిరూపించడమైనది.
||శ్లోకము 13.68||
తదున్నసం పాండురదంతమవ్రణమ్
శుచిస్మితం పద్మపలాశ లోచనమ్ |
ద్రక్షే తదార్యావదనం కదాన్వహం
ప్రసన్న తారాధిపతుల్య దర్శనమ్ ||13.68||
స|| ఉన్నసం పాణ్డురదంతం అవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం ప్రసన్నతారాధిపతుల్య దర్శనం తత్ తదార్యావదనం అహం కదా ద్రక్ష్యేను ||
||శ్లోకార్థములు||
ఉన్నసం పాణ్డురదంతం -
ఉన్నత వంశములో జనించిన, తెల్లని దంతములు కల
అవ్రణం శుచిస్మితం పద్మపలాసలోచనం -
శుచిస్మితయు, పద్మరేకుల వంటి కళ్ళు గల,
ప్రసన్నతారాధిపతుల్య దర్శనం -
ప్రసన్న చంద్రుని తో సమానమైన దర్శనము కలది అగు
తత్ తదార్యావదనం -
ఆ పూజ్యురాలి వదనమును
అహం కదా ద్రక్ష్యే ను -
ఎప్పుడు చూచెదనో కదా
||శ్లోకతాత్పర్యము||
'ఉన్నత వంశములో జనించిన, తెల్లని దంతములు కల, శుచిస్మితయు, పద్మరేకుల వంటి కళ్ళు గల, ప్రసన్న చంద్రుని తో సమానమైన దర్శనము కలది, ఆ పూజ్యురాలు అగు సీతవదనమును ఎప్పుడు చూచెదనో?' ||13.68||
||శ్లోకము 13.69||
క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా
సుదారుణాలంకృత వేషధారిణా |
బలాభిభూతా హ్యబలా తపస్వినీ
కథం ను మే దృష్టిపథేఽద్య సా భవేత్ ||13.69||
స|| క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా సుదారుణాలంకృత వేషధారిణా బలాభిభూతా తపస్వినీ సా అబలా అద్య మే దృష్టిపథే కథం భవేత్ ను||
||శ్లోకార్థములు||
క్షుద్రేణ పాపేన నృశంసకర్మణా -
క్షుద్రుడు పాపి దుష్టకర్మలు చేయు
సుదారుణాలంకృత వేషధారిణా -
దారుణమైన అలంకారముగల వేషము ధరించు
బలాభిభూతా సా అబలా తపస్వినీ -
బలాత్కారముగా ఎత్తుకుపోబడిన ఆ అబల తపస్విని
అద్య మే దృష్టిపథే -
ఈ దినమున నా దృష్టి పథములో
కథం భవేత్ ను -
ఎట్లు వచ్చును?
||శ్లోకతాత్పర్యము|||
'క్షుద్రుడు పాపి దుష్టకర్మలు చేయు, అలంకారములచే ప్రసన్న వేషధారణలో ఉండెడి రావణుని చేత, బలాత్కారముగా ఎత్తుకుపోబడిన అబలా తపస్విని, నా దృష్టిపథములో ఎప్పుడు ఎలా వచ్చునో'. || ||13.69||
ఈ శ్లోకముతో పదమూడవ సర్గ ముగుస్తుంది.
ఇక్కడ ఇంకో మాట కూడా వున్నది.
ఇంత శోకములో కనపడినది అశోకవనము.
ఆ అశోకవనములో వెళ్ళబోతూ చేసిన హనుమంతుని ప్రార్థనలతో , ఈ సీతాన్వేషణ లో సిద్ధి కలగాలి అంటే తన సామర్థ్యముతోనే కాక పరమాత్ముని కటాక్షము కావాలి అన్నమాట హనుమంతునికి స్ఫురించినట్లు మనకి స్ఫురిస్తుంది. అలాగే అత్మాన్వేషణలో కూడా మన సామర్థ్యమే కాక , భగవంతుని కటాక్షము కూడా ఉండాలి అన్నమాట కూడా మనకు విదితమౌతుంది.
అలాగ హనుమంతుడు సీతమ్మను ప్రార్థించి ముందుకేగెను.
ఇంకోమాట.
జాంబవంతుని ప్రేరణతో సముద్రలంఘనము చేయబోతూ తనని రామబాణముతో పోల్చుకొని, గమ్యము చేరతాను , కార్యము సాధిస్తాను , లేకపోతే రావణుని బంధించి తీసుకు వస్తాను, అని ప్రతిజ్ఞచేసిన హనుమంతుడు సీతాదేవి కనపడపోవడముతో మనోవ్యధలో పడి, మళ్ళీ ఆ నిర్వేదము వదిలి, ఆ మనోవ్యథలోనుంచి బయటపడి, 'ఉదతిష్ఠన్ మహాతేజా' ఆ తేజోవంతుడు తనని తాను పైకి లాక్కున్నాడు. అలా నిర్వేదము వదిలిన హనుమంతుడు అనిర్వేదముతో అశోకవనములో ప్రవేశిస్తూ, తన సామర్థ్యముమీదే కాక భగవత్కతాక్షము కూడా కావాలని భగవంతులందరికీ ప్రార్థన చేస్తాడు.
ఈ ప్రార్థనలలో మనకి స్ఫురించేది, 'తన సామర్థ్యమే కాదు దేవి కటాక్షము కావాలి' అని హనుమంతునికి జ్ఞానోదయము అయినది అని.
అంటే ఇదే జ్ఞానమయకోశమా అని కూడా స్ఫురిస్తుంది.
జ్ఞానస్వరూపుడైన హనుమంతునికి భగవంతుని కటాక్షము కావాలి, అని జ్ఞానోదయము అయింది అనడము అసమంజసముగా అనిపించవచ్చు. హనుమంతుడు లంక చేరడానికి సముద్రలంఘనము చేయగల శక్తి తనలో ఉన్నాగాని, ఆ శక్తి తనలో వున్నదని జాంబవంతుని ప్రేరణవలననే , హనుమంతుడు ముందుకు వెళ్ళాడు. అదే విధముగా ఆ జ్ఞానము తనలో ఉన్నాగాని, సీత కనపడక పోయి మనో వ్యధ చెందిన హనుమ, మనస్సును జయించి ముందుకు పోతూ, ఈ అన్వేషణలో భగవంతుని కటాక్షము కావాలి అనే మాట మళ్ళీ తనంతట తానే గ్రహించడమైనది అన్నమాట.
అలా గ్రహించడమే జ్ఞానోదయము. ఆ జ్ఞానోదయము తోనే ఆ ప్రార్థనలు.
అదే జ్ఞానమయకోశములోని హనుమంతుని కథ '
ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదమూడవ సర్గ సమాప్తము
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రయోదశస్సర్గః||
||ఓమ్ తత్ సత్||