||సుందరకాండ ||

||పదహారవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 16 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షోడశస్సర్గః

శ్లో|| ప్రశస్య తు ప్రశస్తవ్యాం సీతాం తాం హరిపుంగవ|
గుణాభిరామం రామం చ పునః చింతాపరోఽభవత్ ||1||

స|| హరిపుంగవః ప్రశస్తవ్యం తాం సీతాం ప్రశస్య గుణాభిరామం రామం చ ( ప్రశస్య) పునః చింతాపరః అభవత్ ||

తా|| ఆ హరిపుంగవుడు ప్రశంసింప తగిన ఆ సీతను అలాగే గుణాభిరాముడగు రాముని కూడా ప్రశంసించి మరల చింతాక్రాంతుడయ్యెను.

శ్లో|| స ముహూర్తమివ ధ్యాత్వా భాష్పపర్యాకులేక్షణః|
సీతా మాశ్రిత్య తేజస్వీ హనుమాన్విలలాప హ||2||
మాన్యా గురువీనీతస్య లక్ష్మణస్య గురుప్రియా|
యది సీతాఽపి దుఃఖార్తో కాలోహి దురతతిక్రమః||3||

స|| సః హనుమాన్ భాష్పపర్యాకులేక్షణః ముహూర్తం ఇవ ధ్యాత్వా సీతాం ఆశ్రిత్య విలలాప హ|| గురువినీతస్య లక్ష్మణస్య మాన్యా గురుప్రియా సీతా అపి దుఃఖార్తా యది (తది) కాలః దురతిక్రమః||

తా|| ఆ హనుమంతుడు ఒక క్షణము ఆలోచించి భాష్పములతో నిండిన కళ్ళు కలవాడై సీతను గురించి ఇలా అనుకుంటూ విలపింపసాగెను, 'గురువులను గౌరవించు లక్ష్మణునకు మాన్యురాలు, గురువు వంటి రామునికి ప్రియురాలు అయిన సీతా దుఃఖములలో మునిగి యున్నది అంటే విధి ఎవరికి తప్పదు అన్నమాట'.

శ్లో|| రామస్య వ్యవసాయజ్ఞా లక్ష్మణస్య చ ధీమతః |
నాత్యర్థం క్షుభ్యతే దేవీ గఙ్గేవ జలదాగమే||4||
తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్|
రాఘవోఽర్హతి వైదేహీం తం చేయమసితేక్షణా||5||

స|| రామస్య ధీమతః లక్ష్మణస్య వ్యవసాయజ్ఞా ( జ్ఞాత్వా) అత్యర్థం న క్షుభ్యతే జలదాగమే గంగా ఇవ|| తుల్యశీలవయోవృత్తాం తుల్యాభిజనలక్షణామ్ రాఘవః వైదేహీం అర్హతి | తం చ ఇయం అసితేక్షణా||

తా|| 'రాముని కృతనిశ్చయాన్ని, ధీశాలి అయిన లక్ష్మణుని కర్తవ్యనిష్టను తెలిసిన సీత పొంగిపొరలుతున్న గంగలాగ కలవర పడటము లేదు. శీలములో వయస్సు లో తుల్యులు గుణములలో తుల్యులు అగు వీరిలో రాఘవుడు వైదేహి కి తగినవాడు అలాగే నల్లని కళ్ళు గల ఆమె రామునకు తగినద".

శ్లో|| తాం దృష్ట్వా నవహేమాభాం లోకకాన్తామివ శ్రియమ్|
జగామ మనసా రామం వచనం చ ఇదమబ్రవీత్||6||
అస్యా హేతోర్విశాలాక్ష్యా హతో వాలీ మహాబలః|
రావణ ప్రతిమో వీర్యే కబన్ధశ్చ నిపాతితః||7||
విరాధశ్చ హత స్సంఖ్యే రాక్షసో భీమవిక్రమః|
వనే రామేణ విక్రమ్య మహేన్ద్రేణేవ శంబరః||8||

స|| నవహేమాభాం శ్రియమివ తాం ( సీతాం ) దృష్ట్వా మనసా రామం జగామ చ | (తతః ఇదం వచనం అబ్రవీత్|| అస్యాః విశాలాక్ష్యాః హేతోః మహాబలః వాలీ హతః| వీర్యే రావణ ప్రతిమః కబన్ధః చ నిపాతితః||వనే సంఖ్యే భీమవిక్రమః రాక్షసః విరాధః రామేణ హతః|యథా మహేన్ద్రేణ శమ్బరః ఇవ||

తా|| ఆ హనుమంతుడు కొత్త బంగారములాగా లక్ష్మీదేవిలా వున్నాఅమెను చూచి మనస్సులో రాముని చేరి ఈ వచనములను అనుకొనెను. 'ఈ విశాలాక్షి కోసము వాలి వధింపబడెను. రావణునితో పరాక్రమములో సామానులైన కబంధుడు చంపబడెను. వనములో జరిగిన యుద్ధములో భీమవిక్రముడైన రాక్షసుడు విరాధుడు రామునిచేత మహేంద్రునిచే చంపబడిన శంబరుని వలె చంపబడెను'.

శ్లో|| చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణామ్|
నిహతాని జనస్థానే శరై రగ్నిశిఖోపమైః||9||
ఖరశ్చ నిహత స్సంఖ్యే త్రిశిరాశ్చ నిపాతితః|
దూషణశ్చ మహాతేజా రామేణ విదితాత్మనా||10||
ఐశ్వర్యం వానరాణాం చ దుర్లభం వాలిపాలితమ్|
అస్యా నిమిత్తే సుగ్రీవః ప్రాప్తవాన్ లోక సత్కృతమ్||11||

స|| జనస్థానే అగ్నిశిఖోపమైః శరైః చతుర్దశ సహస్రాణి రక్షసాం భీమకర్మణాం నిహతాని|| మహాతేజా విదితాత్మనా రామేణ సంఖ్యే ఖరః చ నిహతః త్రిశిరాః చ నిపాతితః (తదైవ) దూషణః చ|| అస్యాః నిమిత్తే సుగ్రీవః వాలిపాలితం దుర్లభం లోక సత్కృతం ప్రాప్తవాన్ | వానరాణాం ఐశ్వర్యం అపి ప్రాప్తవాన్||

తా|| 'జనస్థానములో అగ్నిశిఖలతో సమానమైన బాణములతో పదునాలుగువేల భీమపరాక్రమము గల రాక్షసులు చంపబడిరి. మహాతేజోమయుడైన ఆత్మను తెలిసికొనిన రామునిచేత ఖరుడు అలాగే దూషణుడు చంపబడిరి. ఈమె కారణమువలననే సుగ్రీవునకు వాలిచే పాలింపబడిన దుర్లభమైన వానరరాజ్యము పొందబడినది. వానరులకు ఇశ్వర్యము కూడా కలిగిన'ది.

శ్లో|| సాగరశ్చ మయా క్రాన్తః శ్శ్రీమాన్ నదనదీ పతిః |
అస్యాహేతోర్విశాలాక్ష్యాః పురీ చేయం నిరీక్షితా||12||
యది రామః సముద్రాంతాం మేదినీం పరివర్తయేత్ |
అస్యాః కృతే జగత్ చాపి యుక్తం ఇత్యేవ మే మతిః||13||
రాజ్యం వా త్రిషు లోకేషు సీతా వా జనకాత్మజా|
త్రైలోక్య రాజ్యం సకలం సీతాయా నాప్నుయత్కలామ్||14||

స|| అస్యాః విశాలక్ష్యాః హేతోః మయా నదనదీపతిః శ్రీమాన్ సాగరస్య క్రాంతః| ఇయం పురీ చ నిరీక్షితా||అస్యాః కృతే యది రామః సముద్రాంతం మేదినీం జగత్ చ అపి పరివర్తయేత్ (తత్) యుక్తం ఇతి ఏవం మే మతిః|| త్రిషు లోకేషు రాజ్యం వా జనకాత్మజా సీతా వా సకలం త్రైలోక్యరాజ్యం సీతాయాః కలాం న ఆప్నుయాత్||

తా|| 'ఈ విశాలాక్షి కొఱకే నేను నదినదములకు పతి అయిన సాగరుని దాటి వచ్చితిని. ఈ నగరము కూడా నిరీక్షించితిని. ఈమె కోసము ఒకవేళ రాముడు సముద్రములతో పర్వతములతో కూడిన ఈ జగత్తుని తలక్రిందులు చేసినప్పటికీ తప్పు లేదు అని నాకు తోచుచున్నది. ముల్లోకములరాజ్యమా సీతా అని తూచితే ముల్లోకములరాజ్యము సీతకు దీటుకాదు'.

శ్లో|| ఇయం సా ధర్మశీలస్య మైథిలస్య మహాత్మనః|
సుతా జనకరాజస్య సీతా భర్తృదృఢవ్రతా ||15||
ఉత్థితా మేదినీం భిత్వా క్షేత్రే హలముఖక్షతే |
పద్మరేణునిభైః కీర్ణా శుభైః కేదారపాంసుభిః||16||
విక్రాన్తస్యార్య శీలస్య సంయుగే ష్వనివర్తినః|
స్నుషా దశరథస్యైషా జ్యేష్ఠా రాజ్ఞో యశస్వినీ||17||

స|| సా మైథిలస్య మహాత్మనః ధర్మశీలస్య జనకరాజస్య సుతా ఇయం సీతా భర్తృ దృఢవ్రతా || క్షేత్రే హలముఖక్షతే పద్మరేణు నిభైః శుభైః కేదారాపాంశుభిః కీర్ణా మేదినీం భిత్వా ఉత్థితా || ఏషా యశస్వినీ విక్రాంతస్య ఆర్యశీలస్య సంయుగేషు అనివర్తినః రాజ్ఞః దశరథస్య జ్యేష్ఠా స్నుషా||

తా|| 'వరిపండించు క్షేత్రములో హలము ద్వారా శుభకరమైన పద్మరేణువుల తో భూమిని చేదించి పైకి వచ్చిన, ఆ మిథిలానగరపు మహాత్ముడు, ధర్మశీలుడు అగు జనకమహారాజు యొక్క పుత్రీ, అగు ఈ సీత భర్తపై నిలబడిన పతివ్రత. ఈమె యశస్విని విక్రాంతుడు ఆర్యశీలుడు యుద్ధములో తిరుగులేనివాడు అగు దశరథుని పెద్ద కోడలు'.

శ్లో|| ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య రామస్య విదితాత్మనః|
ఇయం సా దయితా భార్యా రాక్షసీవశమాగతా||18||
సర్వాన్భోగాన్ పరిత్యజ్య భర్తృ స్నేహబలాత్కృతా|
అచిన్తయిత్వా దుఃఖాని ప్రవిష్ఠా నిర్జనం వనమ్||19||
సంతుష్టా ఫలమూలేన భర్తృ శుశ్రూషణే రతా|

స|| ధర్మజ్ఞస్య కృతజ్ఞస్య విదితాత్మనః రామస్య దయితా భార్యా సా ఇయం రాక్షసీ వశం ఆగతా||సర్వాన్ భోగాన్ పరిత్యజ్య భర్తృస్నేహాత్ కృతా దుఃఖాని అచిన్తయిత్వా నిర్జనం వనం ప్రవిష్ఠా||ఫలమూలేన సంతుష్ఠా భర్తృ శుశ్రూషేణ రతా |

తా|| 'ధర్మజ్ఞుడు కృతజ్ఞుడు ఆత్మను తెలిసికొనినవాడు అగు రామునియొక్క ప్రియమైన పత్ని అగు సీతా రాక్షసుల వశము లో ఉన్నది. ఈమె అన్ని భోగములను త్యజించి భర్త సేవలోనే మునిగి కష్టములగురించి ఆలోచించక నిర్జనమైన వనమును ప్రవేశించెను. ఈమె ఫలమూలములతో సంతుష్టురాలై భర్తృసేవలో అత్యంత ఆసక్తికలది'.

శ్లో|| యా పరాం భజతే ప్రీతిం వనేఽపి భవనే యథా||20||
సేయం కనకవర్ణాఙ్గీ నిత్యం సుస్మిత భాషిణీ|
సహతే యాతనామేతాం అనర్థానాం అభాగినీ||21||
ఇమాం తు శీలసంపన్నాం ద్రష్టుమర్హతి రాఘవః|
రావణేన ప్రమథితాం ప్రపామివ పిపాసితః||22||

స|| యా వనే అపి భవనం యథా పరం ప్రీతిం భజతే సా ఇయం కనకవర్ణాంగీ నిత్యం సుస్మిత భాషిణీ యేతాం అనర్థానాం యాతనాం సహతే అభాగినీ ||రాఘవః శీలసంపన్నాం రావణేన ప్రమథితామ్ ఇమామ్ పిపాసితః ప్రపామివ ద్రష్టుం అర్హతి||

తా|| 'వనములో కూడా రాజభవనములో ఉన్నట్లు ప్రీతి పొందినది. ఈ కనకవర్ణాంగి ఎల్లప్పుడు స్మితవదనముతో భాషించు ఈమె ఆనర్థమైన యాతనలను సహించుచున్నది. రాఘవుడు రావణునిచే పీడింపబడుతున్న ఈమెను పిపాసుడు చలివేంద్రమును చూచుటకు తహతహలాడునట్లు చూచుటకు అర్హుడు'.

శ్లో|| అస్యానూనం పునర్లాభాత్ రాఘవః ప్రీతిమేష్యతి|
రాజా రాజ్యపరిభ్రష్టః పునః ప్రాప్యేవ మేదినీమ్||23||
కామభోగైః పరిత్యక్తా హీనా బంధుజనేన చ|
ధారయత్యాత్మనో దేహం తత్ సమాగమకాక్షిణీ||24||
నైషా పశ్యతి రాక్షస్యో నేమాన్ పుష్పఫలద్రుమాన్|
ఏకస్థ హృదయా నూనం రామమేవానుపశ్యతి||25||

స|| రాఘవః పునః అస్యాః లాభాత్ నూనం రాజ్యపరిభ్రష్టః రాజా మేదినీం పునః ప్రాప్యేవ ప్రీతిం ఏష్యతి ||కామభోగైః పరిత్యక్తా బంధుజనేన హీనా చ తత్ సమాగమ ఆకాంక్షిణీ దేహం ధారయతి|| ఏషా రాక్షస్యో న పశ్యతి| ఇమాన్ పుష్ప ఫలద్రుమాన్ న| ఏకస్థః హృదయా రామం ఏవ అనుపశ్యతి నూనం||

తా|| 'రాఘవుడు ఈమెను మరల పొందినప్పుడు రాజ్యముకోలుపోయి తిరిగి సంపాదించినప్పుడు పొందు సంతోషమును పొందును. కామభోగములను పరిత్యజించి బందుజనములకు దూరమై ఈమె మరల భర్తతో సమాగముకోసము జీవితము ధరించియున్నది. ఈమె కి రాక్షసులు కానరారు. ఫలపుష్పములు కల వృక్షములు కూడా కానరావు. హృదయములో యున్న రాముడొక్కడే కనపించును'.

శ్లో|| భర్తా నామ పరం నార్యా భూషణం భూషణాదపి|
ఏషాతు రహితా తేన భూషణార్హా నశోభతే ||26||
దుష్కరం కురుతే రామో హీనో యదనయా ప్రభుః|
ధారయత్యాత్మనో దేహం న దుఃఖే నావసీదతి||27||
ఇమాం అసితకేశాన్తాం శతపత్ర నిభేక్షణా|
సుఖార్హాం దుఃఖితాం దృష్ట్వా మమాపి వ్యథితం మనః||28||

స|| భర్తా నామ నార్యాః భూషణాత్ అపి భూషణం| ఏషా తు రహితా తేన భూషణార్హా అపి న శోభతే||రామః అనయా హీనః ఆత్మనః దేహం ధారయతి యత్ దుఃఖేన నావసీదతి యత్ ప్రభుః దుష్కరం కురుతే||అసితకేశాంతామ్ శతపత్రనిబేక్షణాం సుఖార్హాం ఇమామ్ దుఃఖితాం దృష్ట్వా మమ మనః అపి వ్యథితం||

తా|| 'భర్త అనే భూషణము భూషణములలో అన్నింటికన్న దీటైన భూషణము. ఆ భూషణము లేకపోతే భూషణముకు అర్హురాలైనప్పటికి ఆమె శోభించదు. రాముడు దుఃఖమును సహిస్తూ ఈమె లేకుండా దేహమును ధరించుచున్నాడు అంటే ఎవరికి సాధ్యము కాని పని చేస్తున్నాడన్నమాట. నల్లని కేశములు కలది, పద్మములవలె నున్నకనులు కలది, సుఖజీవనమునకు అర్హురాలైనప్పటికీ దుఃఖములో నున్న ఈమెను చూచి నా మనస్సుకూడా క్షోభిస్తున్నది'.

శ్లో|| క్షితిక్షమా పుష్కరసన్నిభాక్షీ
యా రక్షితారాఘవ లక్ష్మణాభ్యామ్|
సా రాక్షసీభి ర్వికృతేక్షణాభిః
సంరక్ష్యతే సంప్రతి వృక్షమూలే||29||
హిమహతనళినీవ నష్టశోభా
వ్యసన పరమ్పరయా నిపీడ్యమానా|
సహ చర రహితేవ చక్రవాకీ
జనకసుతా కృపణాం దశాం ప్రపన్నా||30||

స|| క్షితిక్షమా పుష్కరసన్నిభాక్షీ రాఘవా లక్ష్మణాభ్యామ్ రక్షితా సా వికృతేక్షణాభిః రాక్షస్సీభిః వృక్షమూలే సంరక్ష్యతే సంప్రతి|| హిమమహత నళిని ఇవ నష్టశోభా వ్యసనపరంపరయా నిపీడ్యమానా జనకసుతా రహితా చక్రవాకీ ఇవ కృపణాం దశాం ప్రపన్నా||

తా|| సహనములో భూదేవి వంటి , పద్మములవంటి కన్నులు గల, రామలక్ష్మణులచే రక్షింపబడిన ఈమె ఇప్పుడు వికృతమైన కళ్ళు గల రాక్షసస్త్రీలచేత చుట్టబడి చెట్టుకింద ఉన్నది. మంచుదెబ్బతగిలన తామరపూవు వలె శోభనుకోలుపోయిన , కష్టపరంపరలతో పీడింపబడుచున్నజనకుని కూతురు మగచక్రవాకమును కోలుపోయిన ఆడ చక్రవాకమువలె దీనమైన స్థితిలో ఉన్నది.

శ్లో|| అస్యా హి పుష్పావనతాగ్ర శాఖాః
శోకం దృఢం వై జనయన్త్యశోకాః|
హిమవ్యపాయే చ శీతరశ్మి
రభ్యుథితో నైక సహస్ర రశ్మిః||31||

స|| హిమవ్యపాయేన పుష్పావనతాగ్రశాఖః అశోకాః అభ్యుత్థితః నేకసహస్రరశ్మిః శీతరశ్మి చ అస్యాః దృఢం శోకం జనయంతి ||

తా|| పుష్పభారముచే వంగిన అశోక వృక్షములు, మంచుతొలగి పోవడముతో వేలాది కిరణములతో వెన్నెలకురుపిస్తున్న చంద్రుడు, భర్త ఏడబాటులో నున్న ఈమెలో దుఃఖమును పెంపొందిస్తున్నాయి.

శ్లో|| ఇత్యేవ మర్థం కపిరన్వవేక్ష్య
సీతేయ మిత్యేవవినిష్ట బుద్ధిః|
సంశ్రిత్య తస్మిన్ నిషసాద వృక్షే
బలీ హరీణాం వృషభస్తరస్వీ||32||

స|| ఇతి ఏవం బలీ హరీణాం వృషభః కపిః అర్థం ( సీతాం) అన్వేక్ష్య ఇయం సీతా ఇతి ఏవ వినిష్టబుద్ధిః తస్మిన్ వృక్షే సంశ్రిత్య నిషసాద||

తా|| ఈవిధముగా బలశాలి , వానరులలో శ్రేష్టుడు అయిన హనుమంతుడు అన్ని విషయములను పరిశీలించి ఈమె సీతయే అని నిశ్చయించుకొని ఆ వృక్షములో తనను తాను మరుగుపరుచుకొని కూర్చునియుండెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షొడశస్సర్గః||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో పదహారవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||