||సుందరకాండ ||

|| పదునెనిమిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 18 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ అష్టాదశస్సర్గః

తథా విప్రేక్షమానస్య వనం పుష్పిత పాదపం|
విచిన్వతశ్చ వైదేహీం కించిచ్చేషా నిశాsభవత్||1||

స|| పుష్పిత పాదపం విప్రేక్షమానస్య వైదేహీం విచిన్వతః చ తథా నిశా కించిత్ శేషా అభవత్ |

విరబూసిన పుష్పములు కల వనములో సీతకోసము అన్వేషణలో ఉండగా రాత్రిలో చాలా కొంచమే మిగిలియుండెను.

షడంగవేదవిదుషాం క్రతుప్రవరయాజినాం|
శుశ్రావ బ్రహ్మఘోషాంశ్చ విరాత్రే బ్రహ్మరక్షసామ్||2||
అథమంగళవాదిత్రైః శబ్దైః శ్రోత్రమనోహరైః|
ప్రాబుధ్యత మహాబాహుః దశగ్రీవో మహాబలః||3||

స|| విరాత్రే సః షడంగవేదవిదుషాం క్రతుప్రవరయాజినాం బ్రహ్మ రక్షసామ్ బ్రహ్మఘోషాం చ శుశ్రావ|| అథ మహాబాహుః మహాబలః దశగ్రీవః శ్రుతిమనోహరః మంగళవాదిత్ర శబ్దైః ప్రాబుధ్యత ||

(అప్పుడు హనుమంతుడు) రాత్రి చివరి భాగములో షడంగవేదములలో పండితులైన , క్రతువులు చేయుటలో నిష్ణాతులైన బ్రహ్మరాక్షసుల బ్రహ్మ ఘోషణలను వినెను. అప్పుడు మహాబాహువులు కల మహా బలవంతుడైన పది తలలు కల రావణుడు వినుటకు మనోహరమైన మంగళవాద్యములతో మేల్కొనపడెను.

విబుధ్యతు యథాకాలం రాక్షసేంద్రః ప్రతాపవాన్|
స్రస్తమాల్యాంబరధరో వైదేహీమ్ అన్వచింతయత్||4||
భృశం నియుక్తస్తస్యాం చ మదనేన మదోత్కటాః|
న స తం రాక్షసం కామం శశాకాత్మని గూహితమ్||5||

స|| ప్రతాపవాన్ రాక్షసేంద్రః యథాకాలం విబుధ్య స్రస్తమాల్యాంబరధరః వైదేహీం అన్వచింతయత్ || తస్యాం మదనేన భృశమ్ నియుక్తః మదోత్కటః సః రాక్షసః తం కామంఆత్మని గుహితుం న శశాక||

పరాక్రమవంతుడైన రాక్షసాధిపతి సమయానుసారముగా మేల్కొని, జారిన వస్త్రములు మాలలు గల వాడై వైదేహి గురించి ఆలోచించ సాగెను. ఆమె పై మదనకామముతో నిండిన ఆ రావణుడు తన కామమును అదుపులో నుంచుకొనలేకపోయెను.

స సర్వాభరణైర్యుక్తో బిభ్రత్ శ్రియమనుత్తమాం|
తాం నగైర్బహుభి ర్జుష్టాం సర్వపుష్పఫలోపగైః||6||
వృతాం పుష్కరిణీభిశ్చనానాపుష్పోపశోభితామ్|
సదామదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతమ్||7||

స||సః సర్వాభరణయుక్తః అనుత్తమామ్ శ్రియం బిభ్రత్ సర్వపుష్పఫలోపభైః బహుభిః నగైః జుష్టామ్ తాం||పుష్కరణీభిః వృత్తాం నానాపుష్పోపశోభితామ్ సదా మదైశ్చ విహగైః విచిత్రాం పరమాద్భుతమ్||

అతడు అన్ని ఆభరణములతో సాటిలేని శోభతో విలసిల్లుతూ అన్నిరకములపుష్పములు ఫలములు కల చెట్లతో నిండిన ఆ వనమును ప్రవేశించెను. ఆ వనము పుష్కరిణిలతోనిండి , అనేక పుష్పముఅతో శోభించుచున్న , మదించిన పక్షులతో నిండి పరమాద్భుతము గా ఉంది.

ఈహామృగైశ్చ వివిధైర్జుష్టాం దృష్టిమనోహరైః|
వీథీః సంప్రేక్షమాణశ్చ మణికాంచనతోరణాః||8||
నానామృగ గణాకీర్ణమ్ ఫలైః ప్రపతితైర్వృతామ్|
అశోకవనికామేవ ప్రావిశత్ సంతతద్రుమామ్||9||

స|| మణికాంచన తోరణాః దృష్టిమనోహరైః వీథీః సంప్రేక్షమాణః చ వివిధైః ఇహామృగైః చ జుష్టాం నానామృగగణాకీర్ణం ప్రపితైః ఫలైః వృతాం సంతతద్రుమామ్ అశోకవనికాం ఏవ ప్రావిశత్ ||

మణికాంచన తోరణములతో, చూచుటకు మనోహరముగా వున్న వీధులను చూస్తూ , ఈహామృగములతో తదితర కృత్తిమ మృగసంఘములతో, చేట్టునుంచి రాలిన ఫలములతో చుట్టబడియున్న చెట్లతో నిండిన అశోకవనికలొ ప్రవేశించెను.

అంగనాశతమాత్రంతు తం వ్రజంత మనువ్రజత్|
మహేంద్రమివ పౌలస్త్యం దేవగంధర్వయోషితః||10||
దీపికాః కాంచనీః జ్జగృహు స్తత్ర యోషితః|
వాలవ్యజనహస్తాశ్చ తాలవృంతాని చాపరాః||11||
కాంచనైరపి భృంగారైః జహ్రుః సలిలమగ్రతః||
మండలాగ్రాన్ బృసీంచైవ గృహ్యాsన్యాః పృష్ఠతో యయుః||12||
కాచిత్ రత్నమయీం స్థాలీం పూర్ణాం పానస్య భామినీ|
దక్షిణా దక్షిణేనైవ తదా జగ్రాహ పాణినా||13||

స||వ్రజన్తం తం పౌలస్త్యం శతమాత్రం అంగనాః మహేంద్రం దేవగంధర్వయోషితాః ఇవ అనువ్రజత్|| తత్ర కాశ్చిత్ యోషితః కాంచనీః దీపికాః జగృహు| అపరాః తాలవృంతాని జగృహు| (అపరాః) వ్యాలవ్యజన హస్తాః చ||అగ్రతః కాంచనైః భృంగారైః సలిలం జహృః |అన్యాః మండలాగ్రాః బృసీః చ అపి గృహ్య పృష్టతః యయుః || కాచిత్ దక్షిణా భామినీ రత్నమయీం పూర్ణం పానస్య స్థలీం దక్షిణేనైవ పాణినా జగ్రాహ||

అలా వెడుతున్న పౌలస్త్యుని వందమంది అంగనలు ఇంద్రును దేవ గంధర్వ వనితలు అనుసరించినట్లు అనుసరించిరి. అక్కడ కొందరు వనితలు దీపములను పట్టుకొని వెళ్ళుచుండిరి. ఇంకొందరు చామరములను పట్టుకోని, మరింకొందరు విసనకర్రలతోనూ అనుసరించిరి. ముందర కొందరు బంగారుపాత్రలతో నీరు నింపుకొని నడవసాగారు. కొందరు కత్తులు పట్టుకొని, తివాచీలను పట్టుకొని వెనుక వస్తున్నారు. ఒక దక్షతకల భామిని తన దక్షిణ హస్తములో మణి మయమైన పాత్రలో మద్యమును తీసుకొని అనుసరించెను.

రాజహంస ప్రతీకాశం ఛత్రం పూర్ణశశిప్రభమ్|
సౌవర్ణదండమపరా గృహీత్వా పృష్ఠతో యయౌ||14||

స|| అపరా రాజహంస ప్రతీకాశం పూర్ణశశిప్రభం సౌవర్ణదండం ఛత్రం గృహీత్వా పృష్టతః యయౌ||

ఇంకొక ఆమె రాజహంసలా వుండు పూర్ణచంద్రుని కాంతులు గల బంగారుదండము కల చత్రము పట్టుకొని వెనుక రాసాగెను.

నిద్రామద పరీతాక్ష్యో రావణస్యోత్తమాః స్త్రియః|
అనుజగ్ముః పతిం వీరం ఘనం విద్యుల్లతాఇవ||15||
వ్యావిద్ధహారకేయూరాః సమా మృదితవర్ణకాః|
సమాగళిత కేశాంతాః సస్వేద వదనాస్తథా||16||

స|| నిద్రా మద పరీతాక్ష్యః రావణస్య ఉత్తమాః స్త్రియః విద్యుల్లతాః ఘనమివ వీరం పతిం అనుజగ్ముః|| వ్యావిద్ధహారకేయూరాః సమామృదితవర్ణికాః సమాగలిత కేశాంతాః తథా సస్వేద వదనాః (తం రావణం అనుజగ్ముః)

నిద్రామదముతో నిండిన కళ్ళతో రావణుని ఉత్తమ స్త్రీలు మెరపు తీగెలు మేఘమును అనుసరించినట్లు అనుసరిస్తున్నారు. వారి కేయురహారములు పక్కకిజరిగి వున్నాయి.అంగరాగములు చెరిగిపోయివున్నాయి. శిరోజాలముడులు జారిపోయివున్నాయి. చెమటపట్టిన బిందువులు కానవస్తున్నాయి.

ఘూర్ణంత్యో మదశేషేణ నిద్రయా చ శుభాననాః|
స్వేదక్లిష్టాంగకుసుమాః సుమాల్యాకులమూర్థజాః||17||
ప్రయాంతం నైరృతపతిం నార్యో మదిరలోచనాః|
బహుమానాచ్చ కామాచ్చ ప్రియా భార్యా స్తమన్వయుః||18||

స|| మదశేషేణ నిద్రయా చ ఘూర్ణన్త్యః స్వేదక్లిష్టాంగ కుసుమాః సుమాల్యాకులమూర్ధజాః శుభాననాః (తం తావణం అనుజగ్ముః)||మదిరలోచనాః ప్రియాః భార్యాః నార్యాః బహుమానాచ్చ కామాచ్చ ప్యాంతం తం నైఋతపతిం అన్వయుః||

ఆ వనితలు మద్యపాన మత్తువలన నిద్రచేత తూలిపోతున్నారు, చెమటచే వాడిపోయిన పూలమాలలతో వున్నారు. వారు అందమైన కళ్ళుగలవారు. మత్తుతోవున్న కళ్ళుగల ప్రియ భార్యలు ఆ ఆర్యుని పై గౌరవముతో , కామముతో ఆ రావణుని అనుసరిస్తున్నారు.

స చ కామపరాధీనః పతి స్తాసాం మహాబలః|
సీతాసక్త మనా మందో మదాంచితగతి ర్బభౌ||19||
తతః కాంచీనినాదం చ నూపురాణాం నిస్స్వనమ్|
శుశ్రావ పరమస్త్రీణాం స కపిర్మారుతాత్మజః||20||

స|| తాసాం పతిః మహాబలః కామపరాధీనః సీతాసక్తమనాః సః చ మందః మదాంచితగతిః బభౌ|| తతః మారుతాత్మజః సః కపిః పరమస్త్రీణాం కాంచీనినాదం నూపురాణాం చ నిఃస్వనం శుశ్రావ||

వారి పతి, మహాబలవంతుడు కామముయొక్క అధీనములో వున్నవాడు, సీతపై మనస్సుకలవాడు అగు రావణుడు మందముగా మదముతోవున్న గతితో వెళ్ళెను. అప్పుడు ఆ మారుతాత్మజుడు ఆ ఉత్తమస్త్రీల వడ్డాణాల గజ్జెల అందెలధ్వని వినెను.

తం చా ప్రతిమకర్మాణం అచింత్యబలపౌరుషమ్|
ద్వారదేశమనుప్రాప్తం దదర్శ హనుమాన్ కపిః||21||
దీపికాభిరనేకాభిః సమంతాదవభాసితమ్|
గంధతైలావసిక్తాభిః ధ్రియమాణాభిరగ్రతః||22||
కామదర్పమదైర్యుతం జిహ్మతామ్రాయతేక్షణమ్|
సమక్షమివ కందర్పం అపవిద్ధశరాసనమ్||23||
మథితామృతఫేనాభ మరజో వస్త్రముత్తమమ్|
సలీల మనుకర్షంతం విముక్తం సక్త మంగదే ||24||

స|| కపిః హనుమాన్ అప్రతిమకర్మణాం ద్వారదేశం అనుప్రాప్తం తం అచిన్త్యబలపౌరుషమ్ ( రావణం) చ దదర్శ|| గన్ధతైలావసిక్తాభిః అగ్రతః ధ్రియమాణాభిః అనేకాభిః దీపికాభిః సమన్తాత్ అవభాసితమ్|| కామదర్పమదైః యుక్తం జిహ్మతామ్రాయతేక్షణమ్ అపవిద్ఢశరాసనమ్ సమక్షం కందర్పం ఇవ||మథితామృతఫేనాభం అరజః విముక్తం అంగదే సక్తం ఉత్తమం వస్త్రం సలీలం అనుకర్షంతం (తం దదర్శ)||

ఆ అప్రతిమకర్మలను సాధించ కల హనుమంతుడు ఆ ప్రదేశము యొక్క ద్వారము చేరిన అలోచింపనలివికాని బలపౌరుషములు కల ఆ రావణుని చూచెను. ఆ ముందు తీసుకోబడుతున్న సువాసనలు కల అనేక దీపముల కాంతిలో భాసిస్తున్న రావణుడు, కామ దర్పము మదముతో ఎఱ్ఱని కళ్ళుగల శరచాపములు వదిలిన సాక్షాత్తు మన్మథునివలె నుండెను. అలాగ పైన భుజకీర్తులలో చిక్కుకున్న మథించిన అమృతమువంటి తెల్లనైన ఉత్తరీయమును విలాసముగా లాగుకొంటూ వస్తున్న రావణుని హనుమంతుడు చూచెను.

తం పత్రవిటపే లీనః పత్త్రపుష్పఘనావృతః|
సమీపమివ సంక్రాంతం నిధ్యాతు ముపచక్రమే||25||
అవేక్షమాణస్తు తతో దదర్శ కపికుంజరః |
రూపయౌవనసంపన్నా రావణస్య వరస్త్రియః||26||

స||పత్రవిటపే లీనః పత్రపుష్పఘనావృతః సమీపం సక్రాంతం మివ తం నిధ్యాతుం ఉపచక్రమే|| తతః కపికుంజరః అవేక్షమాణః రావణస్య రూపయౌవనసంపన్నాః రావణస్య వరస్త్రియః దదర్శ||

ఫలపుష్పములతో చుట్టపడి చెట్టుకొమ్మల అకులలో లీనమైన హనుమంతుడు దగ్గరగావస్తున్న అతనిని నిదానించి చూడసాగెను. ఆలా పరికిస్తున్న కపికుంజరుడు రూపయౌవ్వన సంపదలు కల రావణుని ఉత్తమస్త్రీలను కూడా చూచెను.

తాభిః పరివృతో రాజా సురూపాభిర్మహాయశాః|
తన్మృగద్విజసంఘుష్టం ప్రవిష్టః ప్రమదావనమ్||27||
క్షీబో విచిత్రాభరణః శంకుకర్ణో మహాబలః|
తేన విశ్రవసః పుత్త్రః సదృష్టో రాక్షసాధిపః||28||
వృతః పరమనారీభిః తారాభిరివ చంద్రమాః|
తం దదర్శ మహాతేజాః తేజోవంతం మహాకపిః||29||

స|| మహాయశాః రాజా సురూపాభిః తాభిః పరివృతః మృగాద్విజసంఘుష్టం తత్ ప్రమదావనం ప్రవిష్టః|| విశ్రవసః పుత్రః క్షీబః విచిత్రాభరణః శంకుకర్ణః మహాబలః రాక్షసాధిపః సః తేన దృష్టః|| పరమనారీభిః వృతః తారాభిః (వృతః) చంద్రమా ఇవ తేజోవంతం తం మహాతేజాః మహాకపిః తం తేజోవంతం దదర్శ||

మహాయశస్సుకల ఆ రాజు అందమైన ఆ స్త్రీలతో కలిసి మృగముల పక్షుల ధ్వనులతో నిండి యున్న ఆ ప్రమదావనము ప్రవేశించెను. విశ్రవసుని పుత్రుడు, మత్తులోనున్న, విచిత్రమైన ఆభరణములు ధరించిన, శంకువు వంటి చెవులుకల రాక్షసాధిపుడు అప్పుడు హనుమంతుని చేత చూడబడెను. అనేక స్త్రీలతో కలిసి తారలతో పరివేష్టితుడైన చంద్రునివలె నున్న తేజస్వి అయిన రావణుని మహాతేజముకల హనుమంతుడు చూచెను.

రావణోsయం మహాబాహుః ఇతి సంచిత్య వానరః|
అవప్లుతో మహాతేజా హనుమాన్ మారుతాత్మజః||30||
స తథాsప్యుగ్రతేజాః సన్నిర్ధూతస్తస్య తేజసా|
పత్రగుహ్యాంతరే సక్తో హానుమాన్ సంవృతోsభవత్||31||

స|| మారుతాత్మజఃవానరః మహాతేజాః హనుమాన్ అయం మహాబాహుః రావణ ఇతి సంచిత్య అవప్లుతః ||తథా ఉగ్రతేజాః సః హనుమాన్ తస్య తేజసా నిర్ధూతః పత్రగుహ్యాంతరే సక్తః సంవృతః అభవత్||

ఆ మహాతేజముకల వానరుడు మారుతాత్మజుడు ' ఈ మహాబాహువుకలవాడు రావణుడే' అని తలచి కొంచెము దగ్గరగావచ్చెను. అప్పుడు ఉగ్రతేజముకల హనుమంతుడు ఆ రావణుని తేజస్సుచూచి నిర్ఘాంతపడి చెట్టుకొమ్మల పత్రములమధ్యలో దాగి యుండెను.

స తాం అసితకేశాంతాం సుశ్రోణీం సంహతస్తనీమ్|
దిదృక్షు రసితాపాంగాం ఉపావర్తత రావణః||32||

స|| తం అసితకేశాంతం సుశ్రోణిం సంహతరత్నీం అసితాపాంగాం దిద్రుక్షుః సః రావణః ఉపావర్తత||

ఆ నల్లని కేశములు కల , మంచి పిరుదులు కల, పరస్పరము ఒరుసుకుంటున్న స్తనములు కల , నల్లని కళ్ళుకల అ సీతాదేవిని చూచుటకు రావణుడు తిరిగి అశోకవనముకు వచ్చెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టాదశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాందలో పదునెనిమిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||