||సుందరకాండ ||

|| పదునెనిమిదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

|| ఓమ్ తత్ సత్ ||
శ్లో||తథా విప్రేక్షమానస్య వనం పుష్పిత పాదపం|
విచిన్వతశ్చ వైదేహీం కించిత్ శేషా నిశాఽభవత్||1||
స|| పుష్పిత పాదపం విప్రేక్షమానస్య వైదేహీం విచిన్వతః చ తథా నిశా కించిత్ శేషా అభవత్ |
తా|| విరబూసిన పుష్పములు కల వనములో సీతకోసము అన్వేషణలో ఉండగా రాత్రిలో చాలా కొంచమే మిగిలియుండెను.
|| ఓమ్ తత్ సత్ ||

సుందరకాండ.
అథ అష్టాదశస్సర్గః

విరబూసిన పుష్పములు కల వనములో సీత కోసము అన్వేషణలో ఉండగా రాత్రిలో చాలా కొంచమే మిగిలి తెల్లవారుచుండెను.

అప్పుడు హనుమంతుడు రాత్రి చివరి భాగములో షడంగవేదములలో పండితులైన , క్రతువులు చేయుటలో నిష్ణాతులైన బ్రహ్మరాక్షసుల బ్రహ్మ ఘోషణలను వినెను. మహాబాహువులు కల మహా బలవంతుడైన పది తలలు కల రావణుడు ఆ బ్రహ్మఘోషలతో వినుటకు మనోహరమైన మంగళవాద్యములతో మేల్కొనపడెను.

పరాక్రమవంతుడైన రాక్షసాధిపతి సమయానుసారముగా మేల్కొని, జారిన వస్త్రములు మాలలు గల వాడై వైదేహి గురించి ఆలోచించ సాగెను. ఆమె పై మదనకామముతో నిండిన ఆ రావణుడు తన కామమును అదుపులో నుంచుకొనలేకపోయెను. అతడు అన్ని ఆభరణములతో సాటిలేని శోభతో విలసిల్లుతూ అన్నిరకములపుష్పములు ఫలములు కల చెట్లతో నిండిన ఆ వనమును ప్రవేశించెను.

ఆ వనము పుష్కరిణిలతోనిండి , అనేక పుష్పములతో శోభించుచున్న , మదించిన పక్షులతో నిండి పరమాద్భుతము గా ఉంది. మణికాంచన తోరణములతో, చూచుటకు మనోహరముగా వున్న వీధులతో, ఈహామృగములతో తదితర కృత్తిమ మృగసంఘములతో, చేట్టునుంచి రాలిన ఫలములతో చుట్టబడియున్న చెట్లతో నిండిన అశోకవనిక పరమాద్భుతముగా నుండెను.

అలా అశొకవనముకు వెడుతున్న పౌలస్త్యుని వందమంది అంగనలు ఇంద్రును దేవ గంధర్వ వనితలు అనుసరించినట్లు అనుసరించిరి. అక్కడ కొందరు వనితలు దీపములను పట్టుకొని వెళ్ళుచుండిరి. ఇంకొందరు చామరములను పట్టుకోని, మరింకొందరు విసనకర్రలతోనూ అనుసరించిరి. ముందర కొందరు బంగారుపాత్రలతో నీరు నింపుకొని నడవసాగారు. కొందరు కత్తులు పట్టుకొని, తివాచీలను పట్టుకొని వెనుక వస్తున్నారు. ఒక దక్షతకల భామిని తన దక్షిణ హస్తములో మణి మయమైన పాత్రలో మద్యమును తీసుకొని అనుసరించెను. ఇంకొక ఆమె రాజహంసలా వుండు పూర్ణచంద్రుని కాంతులు గల బంగారుదండము కల చత్రము పట్టుకొని వెనుక రాసాగెను.

నిద్రామదముతో నిండిన కళ్ళతో రావణుని ఉత్తమ స్త్రీలు మెరపు తీగెలు మేఘమును అనుసరించినట్లు అనుసరిస్తున్నారు. వారి కేయురహారములు పక్కకిజరిగి వున్నాయి.అంగరాగములు చెరిగిపోయివున్నాయి. శిరోజాలముడులు జారిపోయివున్నాయి. చెమటపట్టిన బిందువులు కానవస్తున్నాయి. ఆ వనితలు మద్యపాన మత్తువలన నిద్రచేత తూలిపోతున్నారు, చెమటచే వాడిపోయిన పూలమాలలతో వున్నారు. వారు అందమైన కళ్ళుగలవారు. మత్తుతోవున్న కళ్ళుగల ప్రియ భార్యలు ఆ ఆర్యుని పై గౌరవముతో , కామముతో ఆ రావణుని అనుసరిస్తున్నారు.

వారి పతి, మహాబలవంతుడు కామముయొక్క అధీనములో వున్నవాడు, సీతపై మనస్సుకలవాడు అగు రావణుడు మందముగా మదముతోవున్న గతితో వెళ్ళెను.

వారు అలా వస్తూవుంటే ఆ మారుతాత్మజుడు ఆ ఉత్తమస్త్రీల వడ్డాణాల గజ్జెల అందెలధ్వని వినెను.

ఆ అప్రతిమకర్మలను సాధించ కల హనుమంతుడు ఆ ప్రదేశము యొక్క ద్వారము చేరిన అలోచింపనలివికాని బలపౌరుషములు కల ఆ రావణుని చూచెను. ఆ ముందు తీసుకోబడుతున్న సువాసనలు కల అనేక దీపముల కాంతిలో భాసిస్తున్న రావణుడు, కామ దర్పము మదముతో ఎఱ్ఱని కళ్ళుగల శరచాపములు వదిలిన సాక్షాత్తు మన్మథునివలె నుండెను. అలాగ పైన భుజకీర్తులలో చిక్కుకున్న మథించిన అమృతమువంటి తెల్లనైన ఉత్తరీయమును విలాసముగా లాగుకొంటూ వస్తున్న రావణుని హనుమంతుడు చూచెను.

ఫలపుష్పములతో చుట్టపడి చెట్టుకొమ్మల అకులలో లీనమైన హనుమంతుడు దగ్గరగావస్తున్న అతనిని నిదానించి చూడసాగెను. ఆలా పరికిస్తున్న కపికుంజరుడు రూపయౌవ్వన సంపదలు కల రావణుని ఉత్తమస్త్రీలను కూడా చూచెను.

మహాయశస్సుకల ఆ రాజు అందమైన ఆ స్త్రీలతో కలిసి మృగముల పక్షుల ధ్వనులతో నిండి యున్న ఆ ప్రమదావనము ప్రవేశించెను. విశ్రవసుని పుత్రుడు, మత్తులోనున్న, విచిత్రమైన ఆభరణములు ధరించిన, శంకువు వంటి చెవులుకల రాక్షసాధిపుడు అప్పుడు హనుమంతుని చేత చూడబడెను. అనేక స్త్రీలతో కలిసి తారలతో పరివేష్టితుడైన చంద్రునివలె నున్న తేజస్వి అయిన రావణుని మహాతేజముకల హనుమంతుడు చూచెను.

ఆ మహాతేజముకల వానరుడు మారుతాత్మజుడు ' ఈ మహాబాహువుకలవాడు రావణుడే' అని తలచి కొంచెము దగ్గరగావచ్చెను. అప్పుడు ఉగ్రతేజముకల హనుమంతుడు ఆ రావణుని తేజస్సుచూచి నిర్ఘాంతపడి చెట్టుకొమ్మల పత్రములమధ్యలో దాగి యుండెను.

ఆ నల్లని కేశములు కల , మంచి పిరుదులు కల, పరస్పరము ఒరుసుకుంటున్న స్తనములు కల , నల్లని కళ్ళుకల అ సీతాదేవిని చూచుటకు రావణుడు తిరిగి అశోకవనముకు వచ్చెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాందలో పదునెనిమిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||
శ్లో|| స తాం అసితకేశాంతాం సుశ్రోణీం సంహతస్తనీమ్|
దిదృక్షు రసితాపాంగాం ఉపావర్తత రావణః||32||
స|| తం అసితకేశాంతం సుశ్రోణిం సంహతరత్నీం అసితాపాంగాం దిద్రుక్షుః సః రావణః ఉపావర్తత||
తా|| ఆ నల్లని కేశములు కల , మంచి పిరుదులు కల, పరస్పరము ఒరుసుకుంటున్న స్తనములు కల , నల్లని కళ్ళుకల అ సీతాదేవిని చూచుటకు రావణుడు తిరిగి అశోకవనముకు వచ్చెను.
|| ఓమ్ తత్ సత్ ||