||Sundarakanda ||

|| Sarga 1 || Slokas & meanings in Telugu !

||Om tat sat||

హరిః ఓమ్
ఓమ్ శ్రీరామాయ నమః
శ్రీమద్వాల్మీకి రామాయణే
సుందరకాండే
ప్రథమస్సర్గః

తతో రావణ నీతాయాః సీతాయాః శత్రుకర్షణః |
ఇయేషపదమన్వేష్టుం చారణాచరితే పథే ||1||

స||తతః రావణ నీతాయాః సీతాయాః పదం అన్వేష్టుం (హనుమాన్) శత్రుకర్షణః చారణాచరితే పథి (చరితుం)ఇయేష ||

తా|| అప్పుడు శతృవులను నాశనము చేయగల హనుమంతుడు రావణునిచే తీసుకుపోబడిన సీతను వెదుకుటకై చారణులు పయనించు గగనమార్గమున పోవుటకు నిశ్చయించుకునెను.

దుష్కర్షం నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ కర్మ వానరః |
సముదగ్ర శిరోగ్రీవో గవాంపతిరివాబభౌ|| 2 ||
అథ వైడూర్య వర్ణేషు శాద్వలేషు మహాబలః |
ధీరస్సలిలకల్పేషు విచచార యథాసుఖమ్ ||3||

స|| వానరః దుష్కరం కర్మ నిష్ప్రతిద్వంద్వం చికీర్షన్ సముదగ్ర శిరో గ్రీవః (సః వానరః) గవాంపతి ఇవ బభౌ| అథ హనుమాన్ ధీరః మహాబలః వైడూర్య వర్ణేషు సలిల కల్పేషు శాద్వలేషు యథా సుఖం విచచార ||

తా|| ఆ వానరుడు దుష్కరమైన అనన్యశక్యమైన పనిని సాధించుటకై మెడను చాచి తలను పైకెత్తి గోవులకుపతి అయిన ఆంబోతు వలె విరాజిల్లెను. అప్పుడు మహాబలవంతుడు ధీరుడు అయిన హనుమంతుడు వైఢూర్యమణులలా ఆకుపచ్చని రంగుతో నీటితో పోలిన పచ్చిక బీళ్ళమీద అనాయాసముగా పచార్లు చేశెను.

ద్విజాన్ విత్రాశయన్ ధీమాన్ ఉరసా పాదపాన్ హరన్ |
మృగాంశ్చ సుబహూన్ నిఘ్నన్ ప్రవృద్ధ వ కేశరీ ||4 ||
నీలలోహిత మాంజిష్ట పత్రవర్ణసితాసితైః |
స్వభావ విహితైశ్చితైః ధాతుభిః సమలంకృతమ్ ||5 ||

స|| ధీమాన్ (హనుమతః) ద్విజాన్ సుబహూన్ మృగాంశ్చ విత్రాశయన్ ప్రవృద్ధః పాదపాన్ ఉరసా హరన్ కేశరీ ఇవ (విచచార)||( సః గిరివర్యః ) స్వభావ విహితైః చిత్రైః నీల లోహిత మాంజిష్ట పత్రవర్ణైః సితాసితైః (చ) ధాతుభిః సమలంకృతం ||

తా|| ( ఆ మహేంద్రగిరి పై) ధీమంతుడు అయిన హనుమంతుడు తన వేగముతో పక్షులు మృగములను భయపెట్టుచూ, తన ఛాతితో వృక్షములను కూలగొడుతూ సింహము వలె తిరగసాగెను. సహజమగా నలుపు తెలుపు పసుపు ఎఱుపు రంగులు కల ధాతువులతో వున్న ఆ పర్వతము ( మహేంద్రగిరి), ఆ రంగులతో అలంకరించబడినదా అన్నట్లు ఉండెను.

కామరూపిభిరావిష్టమ్ అభీక్ష్ణం సపరిఛ్ఛదైః |
యక్షకిన్నర గంధర్వైః దేవకల్పైశ్చ పన్నగైః ||6||
స తస్య గిరివరస్య తలే నాగవరాయుతే |
తిష్ఠన్ కపివరః తత్ర హ్రదే నాగ ఇవ బభౌ || 7 ||

స|| (సః గిరివర్యః) కామరూపిభిః యక్ష కిన్నర గంధర్వైః పన్నగైః సపరిచ్ఛదైః అభీక్షణమ్ దైవకల్పైశ్చఆవిష్ఠం || స కపివరః నాగవరాయుతే తస్య గిరివరస్య హృదే తలే తిష్ఠన్ నాగః ఇవ అబభౌ||

తా|| ఆ పర్వతముపై తమ ఇఛ్చానుసారము రూపము ధరించగల యక్ష, కిన్నర, గంధర్వులు, దేవతలతో సమానులైన పన్నగులు, తమపరివార సమేతముగా వసిస్తూ వున్నారు. ఆ వానరోత్తముడు శ్రేష్టమైన ఏనుగులతో సంచరింపబడుచున్న ఆ పర్వతముపై నిలబడి, తనే ఒక మదగజము లాగ ప్రకాశించుచుండెను.

స సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే |
భూతేశ్చాభ్యాంజలిం కృత్వా చకార గమనే మతిమ్ ||8 ||
అంజలిం ప్రాజ్ఞ్ముఖం కృత్వా పవనాయాత్మ యోనయే |
తతో హి వవృధే గంతుం దక్షిణో దక్షిణాం దిశమ్ ||9||

స|| సః సూర్యాయ మహేంద్రాయ పవనాయ స్వయంభువే భూతేభ్యః అంజలిం కృత్వా గమనే మతిం చకార ||ప్రాజ్ఙ్ముఖః ఆత్మయోనయే పవనాయ అంజలిం కృత్వా తతః దక్షిణః హనుమాన్ దక్షిణదిశం గంతుం వవృధేహి||

తా|| అప్పుడు ఆ హనుమంతుడు సూర్యునకు ఇంద్రునకు వాయువునకు, స్వయంభువు అయిన బ్రహ్మకు అంజలిఘటించి వెళ్ళుటకు నిశ్చయించుకొనెను. తూర్పు దిశగా తిరిగి తన తండ్రి అయిన వాయువుకు అంజలిఘటించి , దక్షత గల హనుమంతుడు దక్షిణ దిశగా వెళ్ళుటకు తన దేహమును పెంచెను.

ప్లవంగప్రవరైర్దృష్టః ప్లవనే కృత నిశ్చయః
వవృధే రామవృధ్యర్థం సముద్ర ఇవ పర్వసు || 10 ||
నిష్ప్రమాణశరీరస్సన్ లిలింఘయిషురర్ణవమ్ |
బాహుభ్యాం పీడయామాస చరాణాభ్యాం చ పర్వతమ్ || 11 ||

స|| (యదా) ప్లవంగ ప్రవరైః దృష్టః - (తదా) ప్లవనే కృత నిశ్చయః హనుమాన్ రామవృధ్యర్థమ్ పర్వసు ( పర్వదినేషు) సముద్ర ఇవ వవృధే (యథా) || నిష్ప్రమాణ శరీరః సన్ అర్ణవమ్ (సాగరం) లిలింఘయిషు బాహుభ్యాం చరణాభ్యాం చ పర్వతమ్ పీడయామాస||

తా|| ప్లవంగ ప్రవరులు ( అంటే వానర వీరులు) చూస్తూ వుండగా , రామ అభ్యుదయముకోసము ఎగరడానికి కృతనిశ్చయుడై , పర్వదినములలో సముద్రము పొంగిన రీతిని తన శరీరమును పెంచెను. కొలవడానికి సాధ్యముకానట్లుగా పెంచిన శరీరముతో సముద్రము పై లంఘించుటకై ఆ పర్వతమును తన చేతులతో పాదములతోను నొక్కిపట్టెను.

స చచాలచలశ్చాపి ముహూర్తం కపి పీడితః |
తరూణాం పుష్పితాగ్రాణాం సర్వం పుష్పమశాతయన్ ||12 ||
తేన పాదపముక్తేన పుష్పౌఘేణ సుగంధినా |
పర్వతః సంవృతశ్శైలో బభౌ పుష్పమయో యథా ||13 ||

స|| అచలశ్చాపి కపి పీడితః ముహూర్తమ్ చచాల | (తదా) పుష్పితాగ్రాణాం తరూణాం సర్వం పుష్పం అసాతయన్||శైలః పాదపముక్తేన సుగంధినా పుష్పౌఘేణ సంవృతః పుష్పమయో పర్వతః యథా బభౌ||

తా|| అచలమైనప్పటికి ఆ వానరుని చే నొక్కబడిన ఆ పర్వతము ఒక క్షణము చలించెను. అప్పుడు చెట్లమీద వున్న పూశిన పూలన్ని రాలి పడెను. చెట్లనుంచి ముక్తిపొంది రాలిన సుగంధముగల పూలతో నిండినదై ఆ పర్వతము పూలపర్వతములాగ శోభించెను.

తేన చోత్తమ వీర్యేణ పీడ్యమానస్స పర్వతః |
సలిలం సంప్రసుస్రావ మదం మత్త ఇవ ద్విపః ||14 ||
పీడ్యమానస్తు బలినా మహేంద్రస్తేన పర్వతః |
రీతిః నిర్వవర్తయామాస కాంచనాంజనరాజతీః || 15 ||

స|| తేన ఉత్తమవీర్యేణ పీడితః సః పర్వతః మత్తః ద్విపః మదం ఇవ సలిలం సుశ్రావ||మహేంద్ర పర్వతః తేన బలినా పీడ్యమానః కాంచనాంచన రాజతీః రీతిః నిర్వర్తయామాస||

తా|| ఆ ఉత్తమవీరుడగు హనుమంతునిచే నొక్కబడి ఆ పర్వతము మత్త గజములాగ నీళ్ళని స్రవించెను. ఆ మహేంద్ర పర్వతము ఆ హనుమంతుని బలముతో నొక్కబడి బంగారము వెండి రీతి రేఖలతో మెరిశెను.

ముమోచ చ శిలాశ్శైలో విశాలాసమనశ్శిలాః |
మధ్యమేనార్చిషా జుష్ఠో ధూమరాజీః ఇవానలః|| 16||
గిరిణాపీడ్యమానేన పీడ్యమానాని సర్వతః |
గుహావిష్ఠాని భూతాని వినేదుర్వికృతైః స్వరైః ||17||

స|| శైలః విశాలాః శిలాః సమనః శిలాః ముమోచ (యథా) మధ్యమేన అర్చిషా ధూమరాజీరివ అనలః జుష్టాః||గిరిణా సర్వతః పీడ్యమానాని గుహావిష్టాని భూతాని పీడ్యమానేన వికృతైః స్వరైః వినేదుః ||

తా|| ఆ పర్వతము ధూమ్రవర్ణముగల విశాలమైన శిలలను ధూమ్రవర్ణముగల జ్వాలతో అగ్ని విరజిమ్మినట్లు విరజిమ్మెను. ఆ పర్వతము చేత పీడింపబడిన గుహలలోనున్న జీవ జాలము అంతా భయముతో వికృతమైన స్వరములతో ఆక్రందన చేశెను.

స మహాసత్వ సన్నాదః శైలపీడానిమిత్తజః |
పృథివీం పూరయామాస దిశశ్చోపవనాని చ ||18||
శిరోభిః పృథిభిః సర్పా వ్యక్త స్వస్తికలక్షణైః |
వమంతః పావకం ఘోరం దదంశుః దశనైశ్శిలాః ||19||

స||శైలపీడా నిమిత్తజః సః మహాసత్త్వ సన్నాదః పృథివీన్ దిశశ్చ ఉపవనాని చ పూరయామాస||సర్పాః వ్యక్త స్వస్తిక లక్షణైః పృథుభిః శిరోభిః ఘోరం పావకం వమన్తః దశనైః శిలాః దదంశుః ||

తా|| ఆ నొక్కబడిన పర్వతరాజము చేత నొక్కబడిన పెద్దపెద్ద జంతువులచే చేయబడిన ధ్వనులు భూమిలో అన్ని దిక్కులలో సమీప అరణ్యములలో ప్రతిధ్వనించాయి. సర్పములు స్వస్థిక చిహ్నములు గల పడగలు గల తలలతో భయంకరమైన విషమును కక్కుచూ తమ కోరలతో శిలలను కరిచెను.

తాస్తదా సవిషైః దష్టాః కుపితైః తైః మహాశిలాః |
జజ్వలుః పావకోద్దీప్తా బిభిదుశ్చ సహస్రథా ||20||
యాని చౌషధజాలాని తస్మిన్ జాతాని పర్వతే |
విషఘ్నాన్యపి నాగానాం న శేకుః శమితం విషం||21||

స|| తదా కుపితైః సవిషైః ( సర్పైః) దష్టా మహాశిలాః పావకోదదీప్తాః జజ్వలుః సహస్రధా బిబిధుః చ||తస్మిన్ పర్వతే జాతాని ఔషధజలాని నాగానాం శమితం విషం విషఘ్నాన్యపి న శేకుః ||

తా|| ఆ విధముగా క్రోధముతో విషముగల కోరలతో కొరకబడిన ఆ శిలలు అగ్నిచే జ్వలించి వెయిముక్కలు అయ్యెను. అ పర్వతము పై పెరిగిన , ఆ విషమును శమింపగల ఔషధులు కూడా ఆ సర్పముల విషమును శమింపలేకపోయెను.

భిద్యతేsయం గిరిర్భూ తైరితి మత్వా తపస్వినః |
త్రస్తా విధ్యాధరః తస్మాత్ ఉత్పేతుః స్త్రీగణైసహ||22||
పానభూమిగతం హిత్వా హైమమాసవభాజనమ్|
పాత్రాణి చ మహార్హాణి కరకాంశ్చ హిరణ్మయాన్ ||23||

స|| అయం గిరిః భూతైః భిద్యతే ఇతి మత్వా త్రస్తా తపస్వినః (తథైవ) స్త్రీగణైః సహ విధ్యాధరః తస్మాత్ ఉత్పేతుః||మహార్హాణి పాత్రాణి హైమ మాసవ భాజనం హిరన్మయాన్ కరకాంశ్చ హిత్వా ||

తా|| ఈ పర్వతము భూతములచే ముక్కలు చేయబడుతున్నదని తలచి తపస్వీకులు అదే విధముగా తమ స్త్రీగణములతో విద్యాధరులు కూడ ఆ పర్వతమునుంచి పైకి ఎగిరిపోయిరి. పానభూమిపై మహత్తరమైన భోజన పాత్రలను , బంగారపు మద్య పాత్రలను వదిలి పైకి పోయిరి.

లేహ్యానుచ్చావచాన్ భక్ష్యాన్ మాంసాని వివిధాని చ|
ఆర్షభాణీ చ చర్మాణి ఖడ్గాంశ్చ కనకత్సరూన్ ||24||
కృతకంఠగుణాః క్షీబా రక్తమాల్యానులేపనః|
రక్తాక్షాః పుష్కరాక్షాశ్చ గగనం ప్రతిపేదిరే ||25||

స|| (విధ్యాధరాః) లేహ్యాన్ ఉచ్చావచాన్ భక్ష్యాన్ వివిధాని మాంసాని చ అర్షభాణి చర్మాణి కనకత్సరూన్ ఖడ్గాం చ హిత్వా (ఉత్పేతుః)|| విధ్యాధరాః క్షీబాః కృతకంఠగణాః రక్తాక్షాః పుష్కరాక్షః చ రక్తమాల్యాను లేపనః గగనం ప్రతిపేదిరే||

తా|| (అలా పైకి పోతూ) తినబడుచున్న భక్ష్యాలను, అనేక విధములైన లేహ్యములను, చిన్నవి పెద్దవి అగు పాత్రలను, మాంసమును, ఎద్దు చర్మములను, బంగారుపిడులు కల కత్తులను అక్కడే వదిలి వేయబడినాయి. విద్యాధరులు కంఠములో బంగారు తాళ్ళు, శిరమున ఎఱ్రని పూలతో , మద్యపానముతో మదించిన వారై , ఎఱ్ఱని కళ్ళు కలవారై , ఎఱ్ఱని లేపములతో అలంకరింపబడినవారై ఆకాశములోకి ఎగిరిరి.

హారనూపూర కేయూర పారిహార్యధరాః స్త్రియః |
విస్మితాః సస్మితాస్తస్థురాకాశే రమణైః సహ ||26||
దర్శయన్తో మహావిద్యాం విద్యాధరమహర్షయః |
సహితాస్తస్థురాకాశే వీక్షాంచక్రుశ్చ పర్వతమ్ ||27||

స|| విస్మితాః సస్మితాః హారనూపూర కేయూర పారిహార్య ధరాః స్త్రియః రమణైః సహ ఆకాశే తస్థుః|| విధ్యాధర మహర్షయః సహితాః మహావిద్యాం దర్శయన్తః ఆకాశే తస్థుః వీక్షాంచక్రుశ్చ పర్వతమ్||

తా|| విస్మితులు సస్మితులు అయిన విద్యాధరస్త్రీలు హారాలు అందియలు బాహుపురులు కంకణాలు ధరించి ఆకాశములో నిలబడిరి. అ విద్యాధరులలో మహర్షులు , అన్నివిద్యలలో ప్రవీణులు అగు వారు కూడా ఆకాశములో నుంచుని ఆ పర్వతమును చూచుచుండిరి.

శుశ్రువుశ్చ తదాశబ్దం ఋషీణాం భావితాత్మనాం|
చారణానాంశ్చ సిద్ధానాం స్థితానాం విమలేంబరే||28||
ఏషపర్వత సంకాశో హనుమాన్ మారుతాత్మజః|
తితీర్షతి మహావేగః సముద్రం మకరాలయమ్ ||29||
రామార్థం వానరార్థం చ చికీర్షన్ కర్మ దుష్కరమ్|
సముద్రస్య పరం పారం దుష్ప్రాపం ప్రాప్తుమిచ్ఛతి ||30||

స|| తదా ఋషీణాం భావితాత్మనాం చారణానాం సిద్ధానాం చ విమలే అమ్బరే స్థితానాం శబ్దం శుశ్రువుః|| ఏషః పర్వత సంకాశః మారుతాత్మజః మహావేగః హనుమాన్ మకరాలయం సముద్రం తితీర్షతి || రామార్థం వానరార్థం చ దుష్కరం కర్మ చికీర్షన్ సముద్రస్య దుష్ప్రాపం పరం పారం ప్రాప్తుం ఇచ్ఛతి||

తా|| అప్పుడు ఆ ఆకాశములో నిలబడిన చారణులకు సిద్ధులకు పరిశుద్ధమనస్సు కల ఋషుల మాటలు వినపడ్డాయి. "ఈ పర్వతముతో సమానమైన వాడు మహావేగము కలవాడు వాయుపుత్రుడు అయిన హనుమంతుడు మకరాలయమైన సముద్రమును దాటగోరుచున్నాడు. రామకార్యముకొఱకు, వానరుల కోసము అన్యులకు శక్యము కాని దుష్కరమైన కార్యమును సాధించుటకు సముద్రమునకు ఆవలి వడ్దు చేరగోరచున్నాడు"అని.

ఇతి విద్యాధరాః శ్రుత్వా వచస్తేషాం తపస్వినామ్|
తమప్రమేయం దద్రుశుః పర్వతే వానరర్షభమ్||31||
దుధువేచ స రోమాణి చకంపే చాచ లోపమః|
ననాద సు మహానాదంసు మహానివ తోయదః||32||
ఆనుపూర్వేణ వృత్తస్య లాంగూలం లోమభిశ్చితమ్|
ఉత్పతిష్యన్ విచిక్షేప పక్షిరాజ ఇవోరగమ్ ||33||

స||తేషాం విధ్యాధరః తపస్వినాం వచః శ్రుత్వా పర్వతే అప్రమేయం తం వానరరర్షభం దద్రుశుః|| సుమహాన్ సః అచలోపమః రోమాణి దుధువే (తతః) తోయదః ఇవ సుమహానాదం ననాద || పక్షిరాజః ఉరగం ఇవ లోమభిః వృతం చితం లాంగూలం ఆనుపూర్యేణ ఉత్పతిష్యన్ విచిక్షేప||

తా|| ఆ తపస్వీకుల మాటలు విన్న విద్యాధరులు అప్పుడు వానరులలో వృషభరాజమైన అప్రమేయుడగు హనుమంతుని ఆ పర్వతము పై చూచిరి. పర్వతము వంటి శరీరము కల ఆ హనుమంతుడు పర్వతముపై తన రోమములను విదిల్చెను. మేఘములవలె గర్జించెను. పక్షిరాజు పన్నగమును తిప్పినట్లు వెంట్రుకలతో నిండిన పొడవైన తన తోకను గిరగిరా తిప్పెను.

తస్య లాంగూలమావిద్ధ మాత్త వేగస్య పృష్ఠతః|
దదృశే గరుడే నేవ హ్రియమాణో మహోరగః ||34||
బాహూసంస్తంభయామాస మహా పరిఘ సన్నిభౌ |
ససాద చ కపిః కట్యాం చరణౌ సంచుకోచ చ||35||

స|| ఆత్తవేగస్య తస్య పృష్ఠతః గరుడేన హ్రియమాణః మహోరగః ఇవ లాంగూలం అవిద్ధం|| కపిః మహాపరిఘసన్నిభౌ బాహుః సంస్తంభయామాస కట్యాం ససాద చరణౌ సంచుకోచ చ ||

తా|| మహావేగముతో పోబోతున్న ఆ హనుమంతుడి వెనకభాగమున నిట్టనిటారుగానున్న ఆ హనుమంతుని లాంగూలము, గరుత్మంతుని చే తీసుకుపోబడుతున మహాసర్పము వలె నుండెను. ఆ వానరుడు పరిఘలాగా వున్న బాహువులను బిగబట్టి, నడుమును సన్నముగా చేసి, పాదములను ఎగరడానికి సిద్ధము చేశెను.

సంహృత్య చ భుజౌ శ్రీమాన్ తథైవ చ శిరోధరామ్|
తేజః సత్త్వం తథా వీర్య మావివేశ స వీర్యవాన్ ||36||
మార్గమాలోకయన్ దూరా దూర్ధ్వం ప్రణిహితేక్షణః|
రురోద హృదయే ప్రాణాన్ ఆకాశమవలోకయన్ ||37||

స|| వీర్యవాన్ శ్రీమాన్ హనుమాన్ భుజౌ తథైవ శిరోధరామ్ సంహృత్య సత్త్వం తథా తేజః ఆవివేశ|| ఊర్ధ్వం ప్రణిహితేక్షణః దూరాత్ ఆకాశం మార్గం అవలోకయన్ ప్రాణాన్ హృదయే రురోద||

తా|| అతి పరాక్రమవంతుడైన హనుమంతుడు తన భుజములను శిరస్సును వంచి తనలోనున్న తేజస్సును బలాన్ని పెంపొందించుకునెను. తన కళ్ళను పైకెత్తి తను పయనించవలసిన ఆకాశమార్గము వైపు చూస్తూ తన ఊపిరిని బిగబట్టెను.

పద్భ్యాం దృఢమవస్థానం కృత్వా స కపికుంజరః|
నికుంచ్య కర్ణౌ హనుమాన్ ఉత్పతిష్యన్ మహాబలః|
వానరాన్ వానరశ్రేష్ఠ ఇదం వచన మబ్రవీత్ |||38||

స|| కపికుంజరః మహాబలః పద్భ్యాం దృఢం అవస్థానమ్ కర్ణౌ నికుంచ్య ఉత్పతిష్యన్ (కిం కరోతి?) వానరాన్ వానరశ్రేష్ఠం ఇదం వచనం అబ్రవీత్ ||

తా|| వానరులలో ఏనుగు వంటి వాడూ, మహాబలుడూ అయిన హనుమంతుడు పాదములతో ధృడముగా తనువున్నస్థానమును అదిమిపెట్టి , చెవులను వంచి, ఎగురుటకు సిద్ధముగావుండి అచట వున్న వానరులతో ఆ వానర శ్రేష్టుడు ఈ వచనములను వచించెను.

యథా రాఘవ నిర్ముక్తః శ్శరశ్శ్వసన విక్రమః |
గచ్ఛేత్తద్వద్గమిష్యామి లంకాం రావణపాలితామ్||39||
న హి ద్రక్ష్యామి యది తాం లంకాయాం జనకాత్మజామ్||
అనేనైవ హి వేగేన గమిష్యామి సురాలయమ్ ||40||

స|| యథా రాఘవ నిర్ముక్తః శరః గచ్ఛేత్ తద్వత్ శ్వసన విక్రమః రావణపాలితామ్ లంకాం గమిష్యామి||(యది) లంకాయాం తాం జనకాత్మజం న ద్రక్ష్యామి అనేన వేగేనైవ హి సురాలయం గమిష్యామి ||

తా|| " ఏవిధముగా రామునిచే వదిలినబాణము పోవునో, ఆవిధముగా వాయు వేగముతో రావణునిచే పాలించబడు లంకకు వెళ్ళెదను. లంకలో జనకాత్మజ కనిపించనిచో, అదే వేగముతో సురాలయమునకు వెళ్ళెదను".

యది వా త్రిదివే సీతాం న ద్రక్ష్యా మ్యకృత శ్రమః|
బద్ద్వా రాక్షస రాజానం ఆనయిష్యామి సరావణమ్||41||
సర్వథా కృతకార్యోsహం ఏష్యామి సహ సీతయా |
ఆనయిష్యామి వా లంకాం సముత్పాట్య స రావణమ్||42||

స|| యది త్రిదివే సీతాం నద్రక్ష్యామి (తదా) అకృత శ్రమః రాక్షస రాజానం స రాక్షసం బద్ధ్వా ఆనయిష్యామి|| సర్వథా కృత కార్యః సహ సీతయా అహం ఏష్యామి | వా లంకాం స రావణమ్ సముత్పాట్య ఆనయిష్యామి ||

తా|| "ఒకవేళ దేవలోకములో సీతను చూడలేకపోతే శ్రమలేకుండా రాక్షస రాజుని బంధించి తీసుకు వచ్చెదను. అన్నివిధములుగా కృతకార్యుడనై సీతాదేవితో సహా నేను వచ్చెదను. లేక లంకను రావణునితో సహా పెకిలించి తీసుకువచ్చెదను".

ఏవముక్త్వాతు హనుమాన్ వానరాన్ వానరోత్తమః |
ఉత్పపాథ వేగేన వేగవాన్ అవిచారయన్ ||43||
సుపర్ణమివ చ ఆత్మానం మేనే స కపికుంజరః ||44||

స|| ఏవం ఉక్త్వా వానరాన్ వానరోత్తమః హనుమాన్ వేగవాన్ వేగేన అవిచారయన్ ఉత్పపాథ|| సః కపికుంజరః ఆత్మానం సుపర్ణమివ మేనే||

తా|| వానరోత్తముడైన హనుమంతుడు వానరులతో ఈ విధముగా చెప్పి , మంచి వేగముకల ఆ హనుమంతుడు వేగముతో మరి ఒక ఆలోచన లేకుండా ఆకాశములోకి ఎగిరెను. ఆ కపికుంజరుడు అగు హనుమానుడు తనను తానే గరుత్మంతునిగా భావించుకొనెను.

సముత్పతి తస్మింస్తు వేగాత్తే నగ రోహిణః|
సంహృత్య విటపాన్ సర్వాన్ సముత్పేతుః సమంతతః||45||
స మత్తకోయష్టిమకాన్ పాదపాన్ పుష్పశాలినః |
ఉద్వహన్నూరువేగేన జగామ విమలేంబరే ||46||

స|| (యదా) తస్మిన్ వేగాత్ సముత్పతతి (తదా) సర్వాన్ నగరోహిణః విటపాన్ సంహృత్య సమంతతః సముత్పేతుః|| పుష్పశాలినః పాదపాన్ ఊరు వేగేన మత్తకోయష్టిమకాన్ ఉద్వహన్ సః విమలే అంబరే జగామ||

తా|| ( హనుమంతుడు) అలా వేగముతో ఎగరగా ఆపర్వతము పై నున్న వృక్షములు తమ కొమ్మలను ముడుచుకొని అన్ని చోటలనుంచి పైకి ఎగిరెను. పుష్పములతో విరబూచియున్న మదించిన పక్షులు వసిస్తున్నఆ వృక్షములు ఆ హనుమంతుని తొడలవేగముతో పెకలింపబడి నిర్మలాకాశములో్కి పయనించినవి.

ఊరు వేగోద్ధతా వృక్షా ముహూర్తం కపి మన్వయుః|
ప్రస్థితం దీర్ఘమధ్వానం స్వబంధుమివ బాంధవః||47||
త మూరు వేగోన్మథితా స్సాలాశ్చాన్యే నగోత్తమాః|
అనుజగ్ముర్హనూమంతం సైన్యా ఇవ మహీపతిమ్||48||

స|| ఊరువేగోథ్థితాః వృక్షాః స్వబంధుం దీర్ఘమధ్వానం ప్రస్థితం బాంధవః ఇవ ముహూర్తమ్ అన్వయుః||ఊరువేగోన్మథితాః సాలాః అన్యే నగోత్తమాః మహీపతిం సైన్యా ఇవ తం హనూమంతం అనుజగ్ముః||

తా|| ఆ తోడలవేగముతో పెకలించబడిన వృక్షములు , దూరదేశయాత్రకు పోవుటకు బయలుదేరిన దగ్గిర బంధువును అనుసరించినట్లు , హనుమంతుని అనుసరించెను. ఆ తొడలవేగముతో పెకలింపబడిన మద్ది ఇంకా ఉతమమైన చెట్లు, రాజుని సైన్యము అనుసరించినట్లు, హనుమంతుని అనుసరించినవి.

సుపుషితాగ్రైర్భహుభిః పాదపైరన్వితః కపిః |
హనుమాన్ పర్వతాకారో భభూవాద్భుత దర్శనః||49||
సారవన్తోsధయే వృక్షాన్యమజ్జన్ లవణాంభసి|
భయాదివ మహేంద్రస్య పర్వతా వరుణాలయే ||50||

స||బహుభిః సుపుష్పితాగ్రైః పాదపైః అన్వితః కపిః హనుమాన్ పర్వతాకారః అద్భుత దర్శనః బభూవ||అథ సారవన్తః యే వృక్షాః వరుణాలయే పర్వతాః మహేన్ద్రస్య భయాత్ ఇవ లవణాంభసి న్యమజ్జన్||

తా|| పర్వతాకారములో నున్న హనుమంతుడు, అనేక పుష్పములతో నిండిన వృక్షములచేత ాఅకాశములో అనుసరింపబడుతూ అద్భుతమైన రూపములో కనపడెను. పెద్దపెద్దవృక్షములు మహేంద్రునికి భయపడి సాగరములో మునిగిన పర్వతములవలే ఆ సాగరములో పడి మునిగిపోయెను.

స నానా కుసుమైః కీర్ణః కపిః సాంకుర కోరకైః|
శుశుభే మేఘ సంకాశః ఖద్యోతైరివ పర్వతః ||51||
విముక్తాః తస్య వేగేన ముక్త్వా పుష్పాణి తే ద్రుమాః |
అవశీర్యంత సలిలే నివృత్తాః సుహృదో యథా ||52||

స|| నానా కుసుమైః సాంకుర కోరకైః కీర్ణః సః మేఘ సంకాశః కపిః ఖద్యోతైః పర్వతః ఇవ శుశుభే|| తస్య వేగేన విముక్తాః తే ద్రుమాః పుష్పాణి చ ముక్త్వా సలిలే అవశీర్యన్త యథా నివృత్తాః సుహృదా (ఇవ)||

తా|| అనేకరకములైన పుష్పములు మొగ్గలచేత కప్పబడినట్టి, మేఘమువలెనున్న హనుమంతుడు మిణుగురు పురుగులు చే ఆవరింపబడిన పర్వతము వలే శోభించెను. ఆ హనుమంతుని వేగము నుంచి విముక్తులైన వృక్షములు కూడా పుష్పములను వదులుచూ తమ స్నేహితులను వదిలి వెనకి తిరిగిన వారివలె, ఆ సాగరములో పడినవి.

లఘుత్వే నోపపన్నం తద్విచిత్రం సాగరే అపతత్ |
ద్రుమాణాం వివిథమ్ పుష్పం కపివాయు సమీరితమ్||53||
తారాశత మివాకాశం ప్రభభౌ స మహార్ణవః|

స|| కపివాయుసమీరితం ద్రుమాణాం వివిధం విచిత్రం పుష్పం లఘుత్వే తత్ సాగరే అపతత్ || లఘుత్వేన ఉపపన్నం (పుష్పేణ) తత్ మహర్ణవః తారాచితం ఆకాశమివ ప్రభబౌ||

తా|| హనుమంతుని వేగము వలన పైకి లేచిన అనేకరకములైన విచిత్రమైన పుష్పములు భారములేనివై సాగరములో పడినవి. భారములేని కారణము వలన సముద్రములో పైకి తేరిన ఆ పుష్పములతో, ఆ సముద్రము నక్షత్రములతో నిండిన ఆకాశము వలె శోభించెను.

పుష్పౌఘే నానుబద్ధేన నానావర్ణేన వానరః |
బభౌ మేఘ ఇవాకాశే విద్యుద్గణ విభూషితః|||54||
తస్య వేగ సమధూతైః పుష్పైః తోయమదృశ్యత ||55||
తారాభి రభిరామాభి రుదితాభి రివాంబరమ్|

స|| నానావర్ణేన (పుష్పేణ) పుష్పౌఘేణ అనుబద్ధేన సః వానరః ఆకాశే విద్యుత్‍గణ విభూషితః మేఘ ఇవ బభౌ||తస్య వేగ సమాధూతైః పుష్పైః తోయః అదృశ్యత (యథా..) ఉదితాభిః అభిరామాభిః తారాభిః అంబరం ఇవ||

తా|| అనేక మైన వర్ణములు గల పుష్పములతో కప్పివేయబడిన ఆ కపి, ఆకాశములో మెరుపులతో ఒప్పారే మేఘము వలె ప్రకాశించెను. హనుమంతుని వేగము వలన పైకి ఎగిసిన పుష్పములు సముద్రములో పడి ఆ సముద్రము సుందరమైన నక్షత్రములతో కూడి ఉదయించిన ఆకాశమువలె శోభించెను.

తస్యాంబర గతౌ బాహూ దదృశాతే ప్రసారితౌ ||56||
పర్వతాగ్రాత్ విష్క్రాంతౌ పంచాస్యావివ పన్నగౌ|
పిబన్నివ బభౌ చాపి సోర్మిమాలం మహార్ణవమ్||57||
పిపాసు రివ చాకాశం దదృశే స మహాకపిః |

స|| సోర్మిమాలం మహార్ణవం ఆకాశం చ పిపాశుః పిబన్నివ సః మహాకపిః దదృశే|| తస్య ప్రశారితౌ అంబర గతౌ బాహుః పర్వతాగ్రాత్ వినిష్క్రాన్తౌ పంచాస్యః పన్నగః ఇవ దద్రుశాతే ||

తా|| ఆకాశములోకి చాచబడిన ( హనుమంతుని) ఆ రెండు బాహువులు పర్వతమునుంచి బయటకు వస్తున్న రెండు ఇదుతలల సర్పములవలె ఉండెను. తరంగములతో కూడిన సాగరమును అలాగే ఆకాశమును త్రాగుచున్నాడా అన్నట్లు ఆ మహాకపి కనపడెను.

తస్య విద్యుత్ప్రభాకారే వాయు మార్గాను సారిణః ||58||
నయనే విప్రకాశేతే పర్వతస్థావివానలౌ|
పింగే పింగాక్షముఖ్యస్య బృహతీ పరిమండలే ||59||
చక్షుషీ సంప్రకాశేతే చంద్రసూర్యావివోదితౌ |

స|| వాయుమార్గానుసారిణః తస్య విద్యుత్ప్రభాకారే నయనే పర్వతస్థౌ అనలౌ ఇవ విప్రకాశేతే|| పింగాక్షముఖ్యస్య పింగే బృహతీ పరిమండలే చక్షుషీ ఉదితౌ చంద్ర సూర్యావివ సంప్రకాశేతే||

తా|| వాయుమార్గమును అనుసరించుచున్న ఆ వానరుని కళ్ళు మెఱుపులవిద్యుత్కాంతితో ఒప్పారుచూ పర్వతముమీద వున్న రెండు నిప్పుమంటలలాగ ప్రకాశించుచుండెను. పింగాక్షములుకలవారి లో ముఖ్యుడగు హనుమంతుని పింగాక్షములు ( కళ్ళు) ఉదయిస్తున్న సూర్య చంద్రునివలె ప్రకాశించుచుండెను.

ముఖం నాసికయా తస్య తామ్రయా తామ్ర మాబభౌ ||60||
సంధ్యయా సమభిస్పృష్టం యథా తత్సూర్యమండలమ్ |
లాంగూలం చ సమావిద్ధమ్ ప్లవమానస్య శోభతే ||61||
అంబరే వాయుపుత్రస్య శక్రధ్వజ ఇవోచ్ఛ్రితమ్|

స|| తస్య తామ్రం ముఖం తామ్రయా నాశికయా సంధ్యయా సమభిస్పృష్టం తత్ సూర్యమండలం యథా ఆబభౌ ||అంబరే వాయుపుత్రస్య ప్లవమానస్య లాంగూలమ్ ఉచ్ఛ్రితం శక్రధ్వజ ఇవశోభతే||

తా|| ఏఱ్ఱని ముక్కు, కాంతిచే ఎఱ్ఱబారిన ముఖము సంధ్యాసమయములో ని సూర్యమండలము లాగా ప్రకాశించెను. ఆకాశములో ఎగురుతున్న హనుమంతుని మహోన్నతముగా నిలచిన లాంగులము ఇంద్రధ్వజము లాగ శోభించెను.

లాంగూల చక్రేణ మహాన్ శుక్లదంష్ట్రోsనిలాత్మజః||62||
వ్యరోచత మహాప్రాజ్ఞః పరివేషీవ భాస్కరః|
స్ఫిగ్దేశే నాభితామ్రేణ రరాజ స మహాకపిః||63||
మహతా దారితేనేవ గిరిర్గైరిక ధాతునా |

స|| శుక్లదంష్ట్రః మహాప్రాజ్ఞః మహాన్ అనిలాత్మజః లాంగూల చక్రేణా పరివేషీవ భాస్కరః ఇవ వ్యరోచత|| సః మహాకపి అభితామ్రేణ స్ఫిగ్దేశేన దారితేన ఇవమహతా గైరిక ధాతునా గిరిః ఇవ రరాజ||

తా|| తెల్లని దంతములతో , మహా బలవంతుడు, బుద్ధిమంతుడు , వాయు పుత్రుడు అయిన హనుమంతుని తోక చక్రాకారముతో వుండి ఆ హనుమంతుడు గూడుకట్టిన సూర్యునిలా శోభిల్లుచుండెను. ఆ మహాకపి ఎఱ్ఱని పిరుదులతో రెండుభాగముల కల గైరికధాతువుతో కూడిన గిరివర్యునిలాగ శోభించెను.

తస్య వానరసింహస్య ప్లవమానస్య సాగరమ్||64||
కక్షాంతరగతో వాయుర్జీమూత ఇవ గర్జతి|
ఖే యథా నిపతుంత్యుల్కా హ్యుత్తరాన్తాత్ వినిస్సృతాః||65||
దృశ్యతే సానుబన్ధాధా చ తథా స కపికుంజరః |

స|| సాగరమ్ ప్లవమానస్య వానరసింహస్య కక్షాంతరగతః వాయుః జీమూతః ఇవ గర్జతి||ఉత్తరాన్తాత్ వినిఃస్రుతా సానుబన్ధాచ ఉల్కా ఖే యథా దృశ్యతే తథా నిపతతి||

తా|| సాగరము దాటుతున్న ఆ వానరసింహము యొక్క చంకల మధ్యలోనుంచి పోవుచున్న వాయువు, జీమూతము వలె గర్జించుచుండెను. ఆ వానరముఖ్యుడు ఉత్తరదిశలో ఉదయించి ఆకాశమార్గములో పయినించి క్రింద పడుతున్న ఉల్కలాగ కనిపించెను.

పతత్పతంగ సంకాశో వ్యాయత శ్శుశుభే కపిః||66||
ప్రవృద్ధ ఇవ మాతంగః కక్ష్యయా బధ్యమానయా|
ఉపరిస్టాత్ శరీరేణ ఛాయయా చావ గాఢయా ||67||
సాగరే మారుతావిష్టౌ నౌ రివాసీత్తదా కపిః |

స||పతత్పతంగ సంకాశః వ్యాయతః కపిః బధ్యమానయా కక్ష్యయా ప్రవృద్ధః మాతంగః ఇవ శుశుభే||తదా కపిః ఉపరిష్టాత్ శరీరేణ సాగరే అవగాఢయా ఛాయయా చ మారుతావిష్ట నౌరి ఇవ ఆసీత్||

తా|| అకాశములో సూర్యునిలా పయనించుచున్న హనుమంతుడు ,తననడుముచుట్టూకట్టబడి అలాగే కట్టబడిన మాతుంగమువలే కనపడెను. ఆ వానరుని శరీరము ఆకాశములో పోతూవుండగా, సాగరములో అతని ఛాయ గాలికి కదిలిపోతున్న నౌక వలె కనిపించెను

యం యం దేశం సముద్రస్య జగామ స మహాకపిః ||68||
స స తస్యోరువేగేన సోన్మాద ఇవ లక్ష్యతే|
సాగర స్యోర్మిజాలానా మురసా శైలవర్ష్మణామ్||69||
అభిఘ్నంస్తు మహావేగః పుప్లువే స మహాకపిః|

స|| సః మహాకపిః సముద్రస్య యం యం దేశం జగామ సః సః తస్య ఊరువేగేన సోన్మాదః ఇవ లక్ష్యతే||(యదా) సః మహావేగః కపిః పుప్లువే (తదా) సాగరస్య ఊర్మిజాలనాం శైలవర్షణామ్ ఉరసా అభిఘ్నన్||

తా|| ఆ మహాకపి ఏ ఏ ప్రదేశములపై ఎగురుచుండెనో ఆప్రదేశములు అతని వేగముతో చలిస్తూ ఉన్మాదం చెందినట్లు కనపడుచున్నవి. ఆ వానరుడు మహావేగముతో ఎగురుచుండగా సాగరములో తరంగములు కోడంత ఎత్తు లేచి అతని వక్షస్థలముతో ఢీకొనుచున్నవా అనునట్లుండెను.

కపివాతశ్చ బలవాన్ మేఘవాతశ్చ నిస్సృతః||70||
సాగరం భీమ నిర్ఘోషం కమ్పయామాసతు ర్భృశమ్|
వికర్షన్నూర్మి జాలాని బృహంతి లవణాంభసి||71||
పుప్లువే కపిశార్దూలో వికరన్నివ రోదసీ|

స||బలవాన్ కపివాతస్య నిఃస్రుతః మేఘవాతః చ భీమ నిర్ఘోషం (చ) సాగరం భృశం కమ్పయామాసతుః ||(యదా) కపిశార్దూలః పుప్లువే (తదా) లవణాంభసి ఊర్మిజాలాని వికర్షన్ వికరన్నివ రోదసీ||

తా|| బలవంతుడగు హనుమంతుని వలన జనించిన గాలి , మేఘముల గాలి కలిసి భయంకరమైన ఘోష తో సాగరమును కంపింపసాగెను. ఆమహాకపి సాగరముపై ఎగురుచుండగా భూమి ఆకాశముల మద్య స్థానమును విరజిమ్ముచున్నట్లుండెను.

మేరుమందర సంకాశా నుద్ధతాన్ స మహార్ణవే||72||
అతిక్రామన్ మహావేగః తరంగాన్ గణయన్నివ |
తస్యవేగ సముద్ధూతం జలం సజలం యథా ||73||
అంబరస్థం విబభ్రాజ శారదాభ్ర మివాతతమ్ |

స||మహావేగః మహార్ణవే ఉద్ధతాన్ మేరుమందర సంకాశాన్ తరంగాన్ గణయన్ ఇవ సః అత్యక్రామత్ || తదా తస్య వేగ సముద్ధతమ్ సజలదమ్ జలం అంబరస్థమ్ ఆతతమ్ శారదాభ్రమివ విబభ్రాజ ||

తా|| మహావేగముతో ఎగురుచున్న ఆ హనుమంతుడు ఆ మహాసాగరములో లేచిన మేరు మందర పర్వతములతో సమానమైన తరంగములను లెక్కించుచున్నాడా అన్నట్లు ఉండెను. ఆ మహాకపి వేగమువలన పైకి లేచిన తుంపర మేఘములతో కలిసి శరత్కాలపు మేఘములా భాసిల్లెను.

తిమినక్ర ఝుషాః కూర్మా దృశ్యంతే వివృతాస్తదా ||74||
వస్త్రాపకర్షణే నేవ శరీరాణి శరీరిణామ్ |
ప్లవమానం సమీక్ష్యాథ భుజంగా స్సాగరాలయాః ||75||
వ్యోమ్నితం కపిశార్దూలం సుపర్ణ ఇతి మేనిరే |

స|| తదా తిమినక్రఝుషాః కూర్మాః వస్త్రాపకర్షణేన శరీరిణాం శరీరాణీవ వివృతాః దృశ్యన్తే|| అథ వ్యోమ్ని ప్లవమానం తం సమీక్ష్య సాగరాలయాః భుజంగాః (తం) కపిశార్దూలం సుపర్ణః ఇతి మేనిరే ||

తా|| అప్పుడు ( సముద్రజలము పైకి లేవడము వలన ) సముద్రములోని తిమింగలములు మొసళ్ళు తాబేళ్ళు వస్త్రములు తోలగించబడిన శరీరముల అవయవములవలె కనిపించెను. ఆ ఆకాశములో ఎగురుచున్న హనుమంతుని చూచి సాగరములో ని భుజంగములు ఆ హనుమతుని గరుత్మంతుడేనని భ్రమించాయి.

దశయోజన విస్తీర్ణా త్రింశత్ యోజనమాయతా||76||
ఛాయా వానరసింహస్య జలే చారుతరాsభవత్|
శ్వేతాభ్ర ఘనరాజీవ వాయుపుత్త్రానుగామినీ||77||
తస్య సా శుశుభే ఛాయా వితతా లవణాంభసి|

స|| దశయోజన విస్తీర్ణా త్రింశత్ యోజనమ్ ఆయతా వానరసింహస్య ఛాయా జలే చారుతరా అభవత్||వాయుపుత్రానుగామినీ లవణాంభసి వితతా తస్య సా ఛాయా శ్వేతాభ్రఘనరాజీవ శుశుభే ||

తా|| పది యోజనములు పొడవూ ముప్పది యోజనముల వెడల్పూ గల ఆ వానరసింహుని నీడ జలములో మనోహరముగా కనపడెను. ఆ వాయుపుత్రుని అనుసరించి సాగరములో పోవుచున్న ఛాయ దట్టమైన తెల్లని మేఘసముదాయము వలే ప్రకాశించుచుండెను.

శుశుభే స మహాతేజా మహాకాయో మహాకపిః||78||
వాయుమార్గే నిరాలంబే పక్షవానివ పర్వతః|
యే నాసౌ యాతి బలవాన్ వేగేన స కపికుంజరః||79||
తేన మార్గేణ సహసా ద్రోణీకృత ఇవార్ణవః|

స||మహాతేజః మహాకాయః సః మహాకపిః నిరాలంబే వాయుమార్గే పక్షవాన్ పర్వత ఇవ శుశుభే|| బలవాన్ అసౌ కపికుంజరః వేగేన యేన మార్గేణ యాతి తేన సహసా అర్ణవః ద్రోణీకృత ఇవ ( అదృశ్యత్)

తా|| మహాతేజోవంతుడు మహాకాయముగలవాడు అగు హనుమంతుడు ఆకాశములో ఏ అధారము లేకుండా ఎగురుతూ ఉంటే, అతడు రెక్కలు ఉన్న పర్వతము లాగ భాసించెను. బలవంతుడగు ఆ కపికుంజరుడు వేగముతో ఏ మార్గములో పోవుచుండెనో అచట సముద్రము లోయలాగ ఏర్పడెను.

అపాతే పక్షిసంఘానాం పక్షిరాజ ఇవ వ్రజన్ ||80||
హనుమాన్ మేఘజాలాని ప్రకర్షన్ మారుతో యథా|
పాండురారుణ వర్ణాని నీలమాజిష్ఠకాని చ||81||
కపినా కృష్యమాణాని మహాభ్రాణి చకాశిరే |

స|| హనుమాన్ మారుతో యథా మేఘజాలాని ప్రకర్షన్ పక్షి సంఘానామ్ ఆపాతే వ్రజన్ పక్షిరాజ ఇవ|| కపినా అకృష్యమాణాని పాణ్డురారుణ వర్ణాని నీలమాంజిష్ఠకాని మహాభ్రాణి చకాశిరే||

తా||హనుమంతుడు వాయువులాగ మేఘములను తనతో లాక్కొని పోతూ, పక్షి సంఘములను కొనిపోతున్న పక్షిరాజు వలే శోభించెను. హనుమంతునిచే లాక్కొని పోతున్న తెలుపు ఎరుపు నలుపు ఆకుపచ్చరంగుల మేఘములు అతి సుందరముగా శోభించుచున్నవి.

ప్రవిశన్నభ్రజాలాని నిష్పతంశ్చ పునః పునః||82||
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమా ఇవ లక్ష్యతే|
ప్లవమానం తు తం దృష్ట్వా ప్లవంగం త్వతితం తదా ||83||
వవర్షుః పుష్పవర్షాణి దేవ గంధర్వ దానవాః |

స|| అభ్రజాలాని పునః పునః ప్రవిశన్ నిష్పతంశ్చ ప్రచ్ఛన్నశ్చప్రకాశశ్చ చన్ద్రమాఇవ లక్ష్యతే||తదా త్వరితం ప్లవమానం తం ప్లవంగం దృష్ట్వా దేవగంధర్వ దానవాః పుష్పవర్షాణి వవర్షుః||

తా||ఆ మేఘములలోకి పోతూ బయటకి వస్తూ వున్న ఆ హనుమంతుడు, మేఘములలో దాగి బయటకువచ్చు చంద్రునివలె కనిపించెను. అప్పుడు త్వరగా ఎగురుచున్న ఆ హనుమంతుని చూచి దేవ గంధర్వ దానవులు పుష్పవర్షములు కురుపించిరి.

తతాప న హి తం సూర్యం ప్లవంతం వానరోత్తమమ్||84||
సిషేవే చ తదా వాయూ రామకార్యర్థ సిద్ధయే|
ఋషయః తుష్టువుశ్చైనం ప్లవమానం విహాయసా ||85||
జగుశ్చ దేవ గంధర్వాః ప్రశంసంతో మహోజసమ్ |

స||తదా రామకార్యార్థం ప్లవంతం తం వానరోత్తమం సూర్యః న తతాప వాయుః చ శిషేవే || విహాయసా ప్లవమానం మహౌజసం ఋషయః ఏనం తుష్టువుః చ దేవ గంధర్వాః ప్రశంసంతో జగుః చ||

తా|| అప్పుడు రామకార్యము సాధించుటకు ఎగురుచున్న ఆ వానరోత్తముని సూర్యుడు తపింపచేయలేదు. వాయువు అతనిని సేవించెను. ఆకాశములో పయనించుచున్న మహాతేజస్సుగల హనుమంతుని ఋషులు స్తుతించిరి. దేవతలు గంధర్వులు ప్రశంసిస్తూ గానము చేసిరి.

నాగాశ్చ తుష్టువు ర్యక్షా రక్షాంసి విబుధాః ఖగాః||86||
ప్రేక్ష్య సర్వే కపివరం సహసా విగత క్లమమ్|
తస్మిన్ ప్లవగ శార్దూలే ప్లవమానే హనూమతి||87||
ఇక్ష్వాకుకుల మానార్థీ చిన్తయామాస సాగరః|

స|| విగతక్లమమ్ కపివరమ్ ప్రేక్ష్య సహసా సర్వే నాగాః యక్షాః రక్షాంసి విబుధాః ఖగాః చ తుష్టువుః||ప్లవగశార్దూలే తస్మిన్ హనూమతి ప్లవమానే సాగరః ఇక్ష్వాకుకులమానార్థీ చిన్తయామాస||

తా|| శ్రమలేకుండా పయనించుచున్న కపివరుని చూచి నాగులూ యక్షులూ రాక్షసులు దేవతలూ పక్షులూ కొనయాడసాగారు. ఆ ప్లవంగములలో శార్దూలము లాంటి హనుమంతుడు అలా ఎగురుతూ పోవుచుండగా ఇక్ష్వాకుకులమును గౌరవించు సాగరుడు చింతించ సాగెను.

సాహాయ్యం వానరేంద్రస్య యది నాహం హనూమతః||88||
కరిష్యామి భవిష్యామి సర్వ వాచ్యో వివక్షతామ్|
అహమిక్ష్వాకు నాథేన సగరేణ వివర్థితః||89||
ఇక్ష్వాకు సచివశ్చాయం నావసీదితు మర్హతి |
తథా మయా విధాతవ్యం విశ్రమేత యథా కపిః||90||
శేషం చ మయి విశ్రాంత స్సుఖేనాతి పతిష్యతి |

స|| యది అహం వానరేన్ద్రస్య హనూమతః సహాయ్యం న కరిష్యామి (తది) వివక్షతామ్ సర్వవాచ్యః భవిష్యామి||అహం ఇక్ష్వాకునాథేన సగరేణ వివర్ధితః | అయం ఇక్ష్వాకు సచివః చ అవసీదితుం న అర్హతి||యథా కపిః విశ్రమేత తథా మయా విధాతవ్యమ్| మయి విశ్రాన్తః సుఖేన అతిపతిష్యతి||

తా|| ఇప్పుడు నేను వానరేంద్రుడు అయిన హనుమంతునికి సహాయము చేయకపోనిచో అప్పుడు తెలిసినవారి దృష్టి లో నేను నిందింప తగినవాడను అగుదును. నేను ఇక్ష్వాకునాధుడగు సగరునిచే పెంపోదింపబడితిని. ఈ హనుమంతుడు ఇక్ష్వాకు సచివుడు, అలసట పొందకూడదు. ఎలాగైతే ఈ వానరుడు విశ్రమించునో అలాగ చేయవలెను. నామీద విశ్రమించి సుఖముగా దాటగలడు.

ఇతి కృత్వా మతిం సాధ్వీం సముద్రశ్చన్నమంభసి ||91||
హిరణ్య నాభం మైనాకం ఉవాచ గిరిసత్తమమ్ |
త్వమిహాసురసంఘానాం పాతాళతలవాసినామ్ ||92||
దేవరాజ్ఞా గిరిశ్రేష్ఠ పరిఘస్సన్నివేశితః |

స|| సముద్రః ఇతి సాధ్వీం మతిం కృత్వా అంభసి చ్ఛన్నం హిరణ్యనాభం గిరిసత్తమమ్ మైనాకం ఉవాచ||గిరిశ్రేష్ఠ త్వం ఇహ పాతాళతలవాసినాం అసుర సంఘానామ్ పరిఘః ఇవ దేవరాజ్ఞా సన్నివేశితః||

తా|| సముద్రుడు ఈవిధముగా అలోచించి సాగరములో దాగివున్న బంగారముతో నిండిన గిరిసత్తముడైన మైనాకుని తో ఇట్లు పలికెను. "ఓ గిరి శ్రేష్ఠుడా! నీవు ఇచట పాతాళములో వున్న అసుర సంఘములకు అడ్డుగా దేవేంద్రుని ఆజ్ఞతో వున్నావు".

త్వ మేషాం జాత వీర్యాణాం పునరేవోత్పతిష్యతామ్ ||93||
పాతాళ స్యాప్రమేయస్య ద్వారమావృత్య తిష్ఠసి |
తిర్యగ్ ఊర్ధ్వం అధశ్చైవ శక్తిః తే శైలవర్థితుమ్||94||
తస్మాత్ సంచోదయామి త్వాం ఉత్తిష్ఠ గిరిసత్తమ|

స||జాత వీర్యాణాం ఏషామ్ పునరేవ ఉత్పతిష్యతాం త్వం అప్రమేయస్య పాతాళస్య ద్వారం ఆవృత్య తిష్ఠసి||శైల తే తిర్యక్ ఊర్ధ్వం అధశ్చైవ వర్ధితుం శక్తిః (అస్తి) | తస్మాత్ గిరిసత్తమ త్వాం సంచోదయామి ఉత్తిష్ఠ ||

తా|| "పరాక్రమము పెంచుకొని మళ్ళీ పైకి రాగల అసురులు పైకి రాకుండా అప్రమేయమైన పాతాళ ద్వారమును మూసి నిలబడ్డావు. ఓ గిరిసత్తమా నీకి పైకి కిందకి అడ్డముగాను పెరిగే శక్తి వుంది. అందువలన ఓ గిరిసత్తమ నిన్ను ప్రొత్సహిస్తున్నాను. పైకి నిలబడు".

స ఏష కపిశార్దూలః త్వాముపర్యేతి వీర్యవాన్ ||95||
హనుమాన్ రామకార్యార్థం భీమకర్మా ఖమాప్లుతః|
అస్య సాహ్యం మయా కార్యం ఇక్ష్వాకుకులవర్తినః||96||
మమ హీక్ష్వాకవః పూజ్యాః పరం పూజ్యతమాస్తవ |

స|| కపిశార్దూలః వీర్యవాన్ భీమకర్మా స ఏషః హనుమాన్ రామకార్యార్థం త్వాం ఉపరి ఏతి ఖమ్ ఆప్లుతః ||ఇక్ష్వాకుకులవర్తినః అస్య సాహ్యం మయా కార్యం | ఇక్ష్వాకవః మమపూజ్యాః హి | తవ పూజ్యతమాః||

తా|| "వానరులలో శార్దూలము , వీరుడు , దుష్కరమైన కర్మలను చేయగలవాడు అగు ఈ హనుమంతుడు రామకార్యము సాధించుటకు నీ మీదుగా ఆకాశములో ఎగిరి పోవుచున్నాడు. ఇక్ష్వాకుకులమును సేవించు ఇతనికి సహాయము చేయుట నా ధర్మము. ఇక్ష్వాకులు నాకు పూజ్యులు. నీకు కూడా పూజించతగినవారు".

కురుసాచివ్య మస్మాకం న నః కార్య మతిక్రమేత్ ||97||
కర్తవ్యం అకృతం కార్యం సతాం మన్యుముదీరయేత్ |
సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ఠ తిష్ఠత్వేష కపిస్త్వయి ||98||
అస్మాకం అతిథిశ్చైవ పూజ్యశ్చ ప్లవతాం వరః|

స|| అస్మాకం సాచివ్యం కురు | నః కార్యం కర్తవ్యం న అతిక్రమేత్| అకృతం కార్యం సతామ్ మన్యుమ్ ఉదీరయేత్||సలిలాత్ ఊర్ధ్వం ఉత్తిష్ఠ | అస్మాకమ్ అతిథిశ్చైవ ప్లవతామ్ వరః పూజ్యశ్చ| ఏషః కపిః త్వయి తిష్ఠన్తు||

తా||"వారికి సహాయము చేయవలెను. వారికి సహాయము చేయతగిన అవకాశము కోలుపోరాదు. చేయని కార్యము ఎప్పుడూ మనస్సును విధించును. సలిలముల నుండి పైకి రమ్ము.ఈ అకాశములో ఎగురువారిలో శ్రేష్ఠుడు మన అతిథి మరియు పూజించ తగినవాడు. ఈ వానరుడు నీ మీద విశ్రమించు గాక".

చామీకర మహానాభ దేవ గంధర్వ సేవిత||99||
హనుమాంస్త్వయి విశ్రాంతః తతః శేషం గమిష్యతి |
స ఏష కపిశార్దూల స్త్వాముపర్యేతి వీర్యవాన్ ||
కాకుత్స్థస్యానృశంస్యం చ మైథిల్యాశ్చ వివాసనమ్||100||
శ్రమం చ ప్లవగేంద్రస్య సమీక్షోత్థాతుమర్హసి |

స|| చామీకర మహానాభ (త్వం) దేవగన్ధర్వ సేవితః | హనుమాన్ త్వయి విశ్రాన్తః తతః శేషం గమిష్యతి||కాకుత్స్థస్య అనృశంస్యం చ మైథిల్యాః వివాసనం చ ప్లవగేన్ద్రస్య శ్రమం చ సమీక్ష్య ఉత్థాతుం అర్హసి||

తా|| " ఓ బంగారు శిఖరములు కలవాడా ! నీవు దేవ గంధర్వులచే సేవింపబడినవాడవు. హనుమంతుడు నీపై విశ్రమించి పిమ్మట మిగిలిన సముద్రము దాటగలడు. కాకుత్‍స్థుల సత్యపరాయణము, మైథిలీ అపహరణము, వానరేంద్రుని శ్రమ చూసి నీవు పైకి వచ్చుట సబబు".

హిరణ్యనాభో మైనాకో నిశమ్య లవణాంభసః ||101||
ఉత్పపాత జలాత్తూర్ణం మహాద్రుమ లతా యుతః|
ససాగరజలం భిత్వా బభూవాభ్యుత్థితః తదా ||102||
యథా జలధరం భిత్వా దీప్తరశ్మిర్దివాకరః |

స|| హిరణ్యనాభః మహాద్రుమలతాయుతః లవణాంభసః మైనాకః (ఏతత్) నిశమ్య జలాత్ తూర్ణమ్ ఉత్పపాత||తదా సః సాగర జలం భిత్వా యథా దీప్తరశ్మిః దివాకరః జలధరం భిత్వా (ఇవ) అభ్యుద్ధితః బభూవ||

తా|| లవణాంభసి లో దాగి వున్న, మహా వృక్షములతో కూడిన ఆ హిరణ్యనాభుడు ఈ మాటలు విని జలములనుండి పైకి వచ్చెను. అలా పైకి వచ్చిన మైనాకుడు సాగర జలములనుండి జలధరమైన మేఘములలోనుంచి వచ్చిన సూర్యుని వలె ఉండెను.

స మహాత్మ ముహూర్తేన పర్వతః సలిలావృతః ||103||
దర్శయామాస శృంగాణి సాగరేణ నియోజితః |
ఆదిత్యోదియ సంకాశైరాలిఖిద్భిరివాంబరమ్|
శాతకుంభమయైః శృంగైః సకిన్నరమహోరగైః ||104||

స|| ముహూర్తేన సాగరేణ నియోజితః సలిలావృతః సః మహాత్మ పర్వతః శృంగాణి దర్శయామాస||సః కిన్నరమహోరగైః అదిత్యోదయ సంకాశైః శాతకుంభమయైః శృంగైః అమ్బరం ఆలిఖద్భిః (దర్శయామాస)||

తా|| అప్పుడు ముహూర్తములో సాగరములో నియోజింపబడిన ఆ పర్వతము యొక్క శిఖరములను అ మహాత్ముడగు హనుమంతుడు చూచెను.

తప్తజాంబూనదైః శృంగైః పర్వతస్య సముత్థితైః ||105||
ఆకాశం శస్త్ర సంకాశం అభవత్కాంచనప్రభమ్|
జాతరూపమయై శ్శృంగైర్భ్రాజమానైః స్వయం ప్రభైః ||106||
ఆదిత్య శత సంకాశ స్సోsభవత్ గిరిసత్తమః|

స|| పర్వతస్య సముత్థితైః శృంగైః తప్తజామ్బూనదైః ఆకాశమ్ శస్త్ర సంకాశం కాంచన ప్రభం అభవత్|| స్వయంప్రభైః భ్రాజమానైః జాతరూపమయైః శృంగైః సః గిరిసత్తమః శత ఆదిత్య సంకాశః అభవత్||

తా|| ఆ పర్వతము యొక్క పైకివచ్చిన శిఖరములు కరిగించిన బంగారములా ఉండడము వలన శస్త్రముల రంగు కల ఆకాశము అంతా బంగారు కాంతిని పొందినది. సహజమైన కాంతితో విరాజిల్లు బంగారు శిఖరములు కల ఆ గిరిసత్తముడు వంద సూర్యులకాంతితో విరాజిల్లెను.

తముత్థిత మసంగేన హనుమానగ్రతస్థితమ్ ||107||
మధ్యే లవణతోయస్య విఘ్నోయమితి నిశ్చితః|
స తముచ్ఛ్రిత మత్యర్థం మహావేగో మహాకపిః ||108||
ఉరసా పాతయామాస జీమూత మివ మారుతః

స|| లవణతోయస్య మధ్యే అసంగేణ ఉత్థితం అగ్రః స్థితం తం అయం విఘ్నః ఇతి నిశ్చితః ||సః కపిః మహావేగః అత్యర్థమ్ ఉచ్ఛ్రితం తం ఉరసా మారుతః జీమూతమివ పాతయామాస||

తా|| ఆ లవణాంభసి మధ్యలో అసంగతముగా పైకి లేచి, ముందు నిలబడిన ఆ పర్వతమును చూచి, ఇది ఒక విఘ్నము అని తలచి, ఆ మహావేగము కల కపిసత్తముడు పైకి పెరిగిన పర్వతమును, మారుతము మేఘములను చెదరకొట్టినట్లు, తన వక్షస్థలముతో ఢీకొని పడవేసెను.

స తథా పాతితః తేన కపినా పర్వతోత్తమః||109||
బుద్ధ్వా తస్య కపేర్వేగం జహర్ష చ ననంద చ |
త మాకాశగతం వీరం ఆకాశే సముపస్థితః ||110||
ప్రీతో హృష్ఠమనా వాక్యం అబ్రవీత్ పర్వతః కపిమ్|
మానుషం ధారయన్ రూపం ఆత్మనః శిఖరే స్థితః||111||

స||తేన కపినా తథా పాతితః స పర్వతోత్తమః తస్య కపేః వేగం బుద్ధ్వా జహర్ష చ ననంద చ||పర్వతః ప్రీతః హృష్టమానః మానుషం రూపం ధారయన్ ఆత్మనః శిఖరే సముపస్థితః ఆకాశే ఆకాశగతం తం వీరం కపింవాక్యం అబ్రవీత్||

తా|| ఆవిధముగా వానరునిచేత పడగొట్టబడి, ఆ పర్వతోత్తముడు వానరుని వేగము తెలిసికొని సంతోషపడెను. సంతోషపడిన ఆ పర్వతము, సంతోషపడిన మనస్సు కలవాడై మానుషరూపము ధరించి , అ శిఖరములలో నిలబడినవాడై ఆ వీరుడైన వానరునితో ఇట్లు పలికెను.

దుష్కరం కృతవాన్కర్మ త్వమిదం వానరోత్తమః|
నిపత్య మమ శృంగేషు విశ్రమస్వ యథాసుఖం||112||
రాఘవస్య కులే జాతే రుదధిః పరివర్తితః |
స త్వాం రామహితే యుక్తం ప్రత్యర్చయతి సాగరః ||113||

స|| వానరోత్తమః త్వం దుష్కరం కర్మ కృతవాన్ | మమశృంగేషు నిపత్య విశ్రమస్వ యథాసుఖమ్|| ఉదధిః రాఘవస్య కులే జాతైః పరివర్థితః | సః సాగరః రామహితే యుక్తం త్వాం ప్రత్యయర్చతి||

తా||"ఓ వానరోత్తమా ! నీవు దుష్కరమైన కర్మ చేయుచున్నావు. నా శిఖరములలో దిగి సుఖముగా విశ్రమించుము. ఈ సాగరము రాఘవుని కులములో పుట్టిన వారిచేత ప్రవర్థింపబడినది. ఆ సాగరుడు రామహితముకోరి నిన్ను పూజచేయకోరుతున్నాడు".

కృతే చ ప్రతికర్తవ్యం ఏష ధర్మః సనాతనః|
సోsయం త్వత్ప్రతీకారార్థీ త్వత్తస్సమ్మాన మర్హతి ||114||
త్వన్నిమిత్తమనేనాహం బహుమానాత్ ప్రచోదితః|
తిష్ఠత్వం కపిశార్దూల మయి విశ్రమ్య గమ్యతామ్||115||

స|| కృతే ప్రతి కర్తవ్యం(ఇతి) ఏషః సనాతనః ధర్మః| తత్ ప్రతికారార్థీ సః ( సాగరః) అయం త్వత్తః సమ్మానం అర్హతి|| అనేన ( సాగరేణ) త్వత్ నిమిత్తం బహుమానాత్ అహం ప్రచోదితః | కపిశార్దూల త్వం తిష్ఠ | మయి (శృంగేషు) విశ్రమ్య గమ్యతామ్||

తా|| " ఉపకారము చేసినవారికి ప్రత్యుపకారము చేయుట సనాతన ధర్మము. ఆ విధముగా ప్రత్యుపకారము చేయదలిచిన ఆ సాగరుడు నీకు సమ్మానము చేయుటకు అర్హుడు. ఆ సాగరునిచేత నీకోసము గౌరవముతో నేను ప్రేరేపింపబడితిని. ఓ కపిశార్దూలమా! నీవు కూర్చొనుము. నా శిఖరములలో విశ్రమించి వెళ్ళుదువు గాక ".

యోజనానాం శతం చాపి కపిరేష సమాప్లుతః |
తవ సానుషు విశ్రాంతః శేషం ప్రక్రమతాం ఇతి||116||
తదిదం గంధవత్ స్వాదు కందమూలఫలమ్ బహు|
తదాస్వాద్య హరిశ్రేష్ఠ విశ్రాంతోsనుగమిష్యసి ||117||

స|| శతం యోజనానాం సమాప్లుతః ఏష కపిః తవ సానుషు విశ్రాన్తః ప్రక్రమతామ్ ఇతి (సాగరేణ ప్రచోదితః)||హరిశ్రేష్ఠ తత్ ఇదం గంధవత్ స్వాదు బహు కందమూలం ఆసాద్య విశ్రాన్తః అనుగమిష్యసి ||

తా||"నూరు యోజనములను లంఘించుచున్న ఈ వానరుడు నీ శిఖరములలో విశ్రమించి వేళ్ళును అని సాగరుడు నన్ను ప్రేరేపించెను. ఓ వానరోత్తమ అందువలన ఈ మంచిరుచీ వాసనలు గల కందమూలఫలాదులు ఆరగించి విశ్రమించి ప్రయాణము కొనసాగించుము".

అస్మాకమపి సంబంధః కపిముఖ్య త్వయాsస్తివై |
ప్రఖ్యాతః త్రిషు లోకేషు మహాగుణ పరిగ్రహః ||118||
వేగవంతః ప్లవంతో యే ప్లవగామారుతాత్మజః|
తేషాం ముఖ్యతమః మన్యే త్వామహం కపికుంజర||119||

స|| కపిముఖ్య త్రిషు లోకేషు ప్రఖ్యాతః మహాగుణపరిగ్రహః సంబంధః త్వయా అస్మాకమపి అస్తివై||మారుతాత్మజ కపికుంజరః వేగవన్తః ప్లవన్తః యే ప్లవగాః తేషామ్ ముఖ్యతమం త్వామ్ అహం మన్యే||

తా|| "ఓ కపిముఖ్యుడా !మూడు లోకములలో ప్రఖ్యాతికెక్కిన సద్గుణాల కారణముగా మాకు కూడా నీతో సంబంధము ఉన్నది. ఓ మారుతాత్మజా! వేగముతో ఎగర గలవారిలో నీవు ముఖ్యుడవు అని నాకు తెలుసు".

అతిథిః కిల పూజార్హః ప్రాకృతోsపి విజానత|
ధర్మం జిజ్ఞాసమానేన కిం పునస్త్వాదృశో మహాన్ ||120||
త్వం హి దేవ వరిష్ఠస్య మారుతస్య మహాత్మనః|
పుత్రః తస్యైవ వేగేన సదృశః కపికుంజరః||121||

స|| ధర్మం జిజ్ఞాసమానేన విజానతా ప్రాకృతః అపి అతిథిః పూజార్హః | త్వాదృశః మహాన్ కిం పునః కిల|| కపికుంజర త్వం దేవవరిష్ఠస్య మహాత్మనః మారుతస్య పుత్రః హి | వేగేన తస్యైవ సాదృశః||

తా|| " సామాన్యుడైననూ అతిథి పూజార్హుడు అని ధర్మము తెలిసినవారికి తెలిసిన మాట, . అటువంటప్పుడు నీ లాంటి మహాపురుషుని గురించి చెప్పనవసరము లేదు. ఓ కపికుంజరా! దేవతలలో శ్రేష్ఠుడు అయిన వాయుదేవుని కుమారుడవు. వేగములో ఆ వాయుదేవునతో సమానుడవు".

పూజితే త్వయి ధర్మజ్ఞ పూజాం ప్రాప్నోతి మారుతః|
తస్మాత్ త్వం పూజనీయో మే శృణుచాప్యత్ర కారణమ్||122||
పూర్వం కృత యుగే తాత పర్వతాః పక్షిణోsభవన్|
తే హి జగ్ముర్దిశస్సర్వా గరుడానిల వేగినః||123||

స||ధర్మజ్ఞ త్వయి పూజితే మారుతః పూజాం ప్రాప్నోతి | తస్మాత్ త్వం అపి మే పూజనీయః | అత్రకారణం చ శృణు||తాత ! పూర్వం కృతయుగే పర్వతాః పక్షిణః అభవన్ | తే గరుడానిలవేగః సర్వాః దిశాః జగ్ముః||

తా|| " ఓ ధర్మము తెలిసిన వాడా ! నిన్ను పూజించినచో వాయుదేవుడు ఆ పూజలను పొందును. అందువలన నీవు కూడా నాకు పూజనీయుడవు. దానికి కారణము వినుము. నాయనా ! పూర్వము కృతయుగములో పర్వతములు పక్షులవలే రెక్కలతో ఉండెడివి. అవి గరుత్మంతుని వేగముతో అన్ని దిక్కులలో వెళ్ళుచుండెడివి".

తతస్తేషు ప్రయాతేషు దేవసంఘాస్సహర్షిభిః |
భూతాని చ భయం జగ్ముః తేషాం పతనశంకయా ||124||
తతః క్రుద్ధః సహస్రాక్షః పర్వతానాం శతక్రతుః|
పక్షాన్ చిచ్ఛేద వజ్రేణ తత్ర తత్ర సహస్రశః||125||

స||తతః తేషు ప్రయాతేషు సహర్షిభిః దేవ సంఘాః భూతాని చ తేషాం పతన శంకయా భయం జగ్ముః|| తతః క్రుద్ధః శతక్రతుః సహస్రాక్షః తత్ర తత్ర సహశ్రసః పర్వతానాం పక్షాన్ చిచ్ఛేద||

తా|| " అప్పుడు ఆ పర్వతముల ప్రయాణములవలన దేవసంఘములు ఋషులతో సహా అన్ని భూతములు అవి పడునని భయముతో ఉండెడివారు. అప్పుడు శతక్రతువులు చేసిన వేయి కళ్ళుకల ఇంద్రుడు కోపముతో పర్వతములయొక్క రెక్కలను చేదింపసాగెను".

సమాముపాగతః క్రుద్ధో వజ్రముద్యమ దేవరాట్|
తతోsహం సహసా క్షిప్త శ్వసనేన మహాత్మనా||126||
అస్మిన్ లవణతోయే చ ప్రక్షిప్తః ప్లవగోత్తమః|
గుప్తపక్ష సమగ్రశ్చ తవపిత్రాsభి రక్షితః||127||

స|| సః దేవరాట్ క్రుద్ధః వజ్రం ఉద్యమ్య మామ్ ఉపాగతః| తతః అహం మహాత్మనా శ్వసనేన సహసా క్షిప్తః|| ప్లవగోత్తమ గుప్తపక్షసమగ్రశ్చ అస్మిన్ లవణతోయే ప్రక్షిప్తః తవపిత్రా అభిరక్షితః||

తా|| " ఆ దేవతల రాజు కోపము కలవాడై వజ్రాయుధముతో నా పైకి వచ్చెను. అప్పుడు నేను మహాత్ముడైన వాయుదేవునిచే వేగముగా పడవేయబడితిని. ఓ ప్లవంగములలో ఉత్తముడా ! రెక్కలతో సహా ఈ సాగరములో పడవేయబడి నీ తండ్రి చేత రక్షింప బడితిని".

తతోsహం మానయామి త్వాం మాన్యోహి మమ మారుతః |
త్వయా మే హ్యేష సంబంధః కపిముఖ్య మహాగుణః||128||
అస్మిన్నేవం గతే కార్యే సాగరస్య మమైవ చ|
ప్రీతిం ప్రీతమనాః కర్తుం త్వమర్హసి మహాకపే ||129||
శ్రమం మోక్షయ పూజాం చ గృహాణ కపిసత్తమ |
ప్రీతిం చ బహు మన్యస్వ ప్రీతోsస్మి తవ దర్శనాత్ ||131||

స|| కపిముఖ్య తతః మారుతః మమ మాన్యః హి | తతః అహం మానయామి | మే త్వయా సంబంధః మహాగుణః || మహాకపిః అస్మిన్ కార్యే ఏవం గతే త్వం ప్రీతమనాః సాగరస్యచ మమైవ చ ప్రీతిం కర్తుం అర్హసి||కపిసత్తమ శ్రమం మోక్ష్య పూజాం చ గృహాణ ప్రీతిం బహుమన్యస్వ| తవ దర్శనాత్ ప్రీతః అస్మి||

తా|| "ఓ కపిముఖ్యుడా ! అందువలన వాయుదేవుడు నాకు గౌరవనీయుడు. అందువలన నేను నిన్ను గౌరవించుచున్నాను. నీతో నా సంబంధము ఉత్తమైన గుణముల వలన కలిగినది. ఓ మహాకపి ! ఈ కార్యములో ఈ విధముగా పోవుచూ సంతోషమైన మనస్సుతో నా యొక్క, సాగరునియొక్క ప్రీతిని పొందతగిన వాడివి. ఓ కపిసత్తమ! శ్రమతీర్చుకొని, పూజలను అందుకొని , మా ప్రేమని గౌరవించు. నీ దర్శనముతో నేను ప్రీతి పొందినవాడను".

ఏవముక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమమ్ అబ్రవీత్ |
ప్రీతోsస్మి కృతామాతిథ్యం మన్యురేషోsపనీయతామ్||131||

స|| ఏవం ఉక్తః కపిశ్రేష్ఠః తం నగోత్తమం అబ్రవీత్ | ప్రీతః అస్మి| ఆతిథ్యం కృతం| ఏషః మన్యుః అపనీయతామ్||

తా|| ఈ విధముగా చెప్పబడిన ఆ వానరోత్తముడు ఆ మైనాకునితో ఇట్లనెను. "ఆతిధ్యము తీసికొనినట్లే ప్రీతి పొందితిని. ఆతిధ్యము తీసుకొనలేదు అని అనుకొనవద్దు".

త్వరతే కార్యకాలోమే అహశ్చాప్యతివర్తతే |
ప్రతిజ్ఞా చ మయాదత్తా న స్థాతవ్య మిహాంతరే ||132||
ఇత్యుక్త్వా పాణినా శైలం ఆలభ్య హరిపుంగవః|
జగామాకాశమావిశ్య వీర్యవాన్ ప్రహసన్నివ ||133||

స|| మే కార్యకాలః త్వరతే | అహః చ అతివర్తతే | అన్తరే ఇహ న స్థాతవ్యం (ఇతి) మయా ప్రతిజ్ఞా దత్తాచ||వీర్యవాన్ హరిపుంగవః ఇతి ఉక్త్వా శైలం పాణీనా ఆలభ్య ఆకాశమ్ ఆవిశ్య ప్రహసన్నివ జగామ||

తా|| " నా కార్యకాలము సమీపించుచున్నది. పగలు గడిచిపోతున్నది. మధ్యలో ఆగకూడదని నేను ప్రతిజ్ఞ తీసుకున్నాను కూడా" అని. వీరుడైన హనుమంతుడు ఈ విధముగా చెప్పి ఆ పర్వతమును చేతి తో తాకి ఆకాశము లో ప్రవేశించి చిరునవ్వుతో వెళ్ళెను.

స పర్వత సముద్రాభ్యాం బహుమానాదవేక్షితః |
పూజితశ్చోపపనాభి రాశీర్భి రవినిలాత్మజః ||134||
అథోర్థ్వం దూరముత్ప్లుత్య హిత్వా శైలమహార్ణవౌ |
పితుః పంథాన మాస్థాయ జగామ విమలేంబరే||135||

స|| సః అనిలాత్మజః పర్వత సముద్రాభ్యాం బహుమానాత్ ఆవేక్షితః ఉపపన్నాభిః ఆశీర్భిః పూజితః చ||అథ శైలమహార్ణవౌ హిత్వా ( హనూమతః) ఊర్ధ్వం దూరం ఉత్ప్లుత్య విమలే అమ్బరే పితుః పన్థానం అస్థాయ జగామ||

తా|| ఆ అనిలాత్మజుడు ఆవిధముగా అ మైనాకునిచేత సాగరునిచేత గౌరవింపబడి కార్యము సిద్దిపోందుటకు ఆశీర్వాదములతో ప్రస్తుతింపబడెను. ఆ సాగరమును మైనాకుని వదిలి హనుమంతుడు దూరముగా ఆకాశములోకి ఎగిరి వాయు మార్గమును అనుసరిస్తూ వెళ్ళెను.

భూయశ్చోర్ధ్వగతిం ప్రాప్య గిరిం తం అవలోకయన్ |
వాయుసూనునిరాలంబే జగామ విమలేంబరే||136||
తద్వితీయం హనుమతో దృష్ట్వా కర్మసుదుష్కరమ్|
ప్రశశంసు స్సురాస్సర్వే సిద్ధాశ్చ పరమర్షయః||137||

స|| వాయుసూనుః భూయశ్చ ఊర్ధ్వం గతిం ప్రాప్య తం గిరిం అవలోకయన్ నిరాలమ్బే విమలఏ అమ్బరే జగామ||హనుమతః తత్ ద్వితీయం సుదుష్కరం కర్మ దృష్ట్వా సర్వే సురాః సిద్ధాశ్చ పరమర్షయః ప్రశంసుః||

తా|| ఆ వాయుసూనుడు మళ్ళీ ఏత్తైన మార్గము చేరి, ఆ పర్వతమును చూస్తూ అధారము లేకుండా నిర్మలాకాశములో వెళ్ళెను. హనుమంతుడు ఆవిధముగా చేసిన రెండవ అద్భుత కార్యముచూచి సురలు సిద్ధులు ఋషులు అందరూ హనుమంతుని ప్రశంసించిరి.

దేవతాశ్చాభవన్ హృష్టాః తత్రస్థాస్తస్య కర్మణా|
కాంచనస్య సునాభస్య సహస్రాక్షశ్చ వాసవః||138||
ఉవాచ వచనం ధీమాన్ పరితోషాత్ సగద్గదమ్|
సునాభం పర్వత శ్రేష్ఠం స్వయమేవ శచీపతిః ||139||

స|| తత్రస్థాః దేవతాశ్చ సహస్రాక్షః వాసవస్చ కాంచనస్య తస్య సునాభస్య కర్మణా హృష్ఠాః అభవన్ ||ధీమాన్ శచీపతిః పర్వతశ్రేష్ఠం సునాభం పరితోషాత్ సగద్గదమ్ స్వయమేవ వచనమ్ ఉవాచ||

తా|| అక్కడవున్న దేవతలు అలాగే సహస్రాక్షుడైన వాసవుడు కూడా బంగారు శిఖరములు గల మైనాకుని పనితో సంతోషపడిరి. ధీమంతుడైన శచీపతి సంతోషముతో పర్వతములలో శ్రేష్ఠుడైన మైనాకునితో గద్గదమైన స్వరముతో స్వయముగా ఇట్లు పలికెను.

హిరణ్యనాభ! శైలేంద్ర! పరితుష్టోsస్మి తే భృశమ్|
అభయం తే ప్రయచ్ఛామి తిష్ఠ సౌమ్య యథా సుఖమ్||140||
సాహ్యం కృతం తే సుమహద్విక్రాంతస్య హనూమతః|
క్రమతో యోజనశతం నిర్భయస్య భయే సతి||141||

స|| హిరణ్యనాభ శైలేంద్ర తే భృశమ్ పరితుష్ఠః అస్మి | సౌమ్య తే అభయం ప్రయచ్ఛామి| యథాసుఖం తిష్ఠ||శతయోజనమ్ క్రమతః భయే సతి నిర్భయస్య విక్రాన్తస్య తే హనుమతః సుమహత్ సాహ్యం కృతం||

తా|| " ఓ బంగారు శిఖరములు కల శైలేంద్రా! నీవు చేసిన పనికి నేను సంతోషపడిన వాడను. ఓ సౌమ్యుడా ! నీకు అభయము ఇచ్చుచున్నాను. నీవు సుఖముగా వుండుము. శతయోజనముల లంఘనము చేయుట భయపడ తగిన దైననూ భయములేని విక్రాంతుడగు హనుమంతునికి నీచేత గొప్ప సహాయము చేయబడినది ".

రామస్యైష హి దూత్యేన యాతి దాశరథేర్హరిః |
సత్ క్రియాం కుర్వతా తస్య తోషితోsస్మి దృఢం త్వయా||142||
తతః ప్రహర్షమగమ ద్విపులం పర్వతోత్తమః |
దేవతానాం పతిం దృష్ట్వా పరితుష్ఠం శతక్రతుమ్||143||
సవై దత్తవరశైలో బభూవాస్థితః తదా |
హనుమాంశ్చ ముహుర్తేన వ్యతిచక్రామ సాగరమ్||144||

స|| ఏష హరిః దాశరథేః రామస్య పితాయైవ యాతి తస్యత్వయా కుర్వతా సత్ క్రియామ్ దృఢః తోషితః అస్మి||తతః పర్వతోత్తమః దేవతానాం పతిం శతక్రతుం పరితుష్ఠం దృష్ట్వా విపులం ప్రహర్షం ఆగమత్||తదా దత్తవరః సః శైలః అస్థితః బభూవ| హనుమాంశ్చ ముహూర్తేన సాగరం వ్యతిచక్రామ||

తా|| ఈ వానరుడు రాముని హితము కోఱకే పోవుచున్నాడు. అట్టివానికి సత్కారము చేసిన నీతో ధృఢముగా సంతోషపడితిని'. అప్పుడు దేవతల అధిపతి అయిన శతక్రతుని సంతోషము చూచి ఆ పర్వతోత్తముడు అగు మైనాకుడు ఎంతో సంతోషపడెను. అప్పుడు వరములు ఇవ్వబడినవాడై ఆ మైనక పర్వతము అచటే నిలబడి పోయెను. హనుమంతుడు కూడా క్షణకాలములో సాగరముపై పోవుచుండెను.

తతో దేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః|
అబ్రువన్ సూర్యసంకాశాం సురసాం నాగమాతరమ్||145||
అయం వాతాత్మజ శ్శ్రీమాన్ ప్లవతే సాగరోపరి|
హనుమాన్నామ తస్య త్వం ముహూర్తం విఘ్నమాచర||146||

స|| తతః దేవాః గంధర్వాః సహ సిద్ధాః పరమర్ష్యయః చ సూర్యసంకాశం నాగమాతరం సురసాం అబ్రువన్ ||అయం శ్రీమాన్ హనుమాన్ నామ వాతాత్మజః సాగరోపరి ప్లవతే | తస్య త్వం ముహూర్తం విఘ్నం ఆచర ||

తా|| అప్పుడు దేవతలు గంధర్వులు సిద్ధులు ఋషులతో కూడి సూర్యునితో సమానమైన ప్రకాశము కల నాగమాతయగు సురసతో ఇట్లు పలికిరి. "ఈ శ్రీమంతుడైన హనుమంతుడు సాగరముపై ఎగురుచున్నాడు. అతనికి నీవు విఘ్నము కల్పించుము" అని.

రాక్షసం రూపమాస్థాయ సుఘోరం పర్వతోపమమ్|
దంష్ట్రా కరాళం పింగాక్షం వక్త్రం కృత్వా నభస్సమమ్||147||
బలమిచ్చామహే జ్ఞాతుం భూయశ్చాస్య పరాక్రమమ్|
త్వాం విజేష్యత్ ఉపాయేన విషాదం వా గమిష్యతి ||148||

స|| సుఘోరం పర్వత ఉపమమ్ రాక్షస రూపం ఆస్థాయ దంష్త్రాకరాళం పింగాక్షం వక్త్రం నభః సమం కృత్వా ( విఘ్నం ఆచర) || అస్య బలం భూయః పరాక్రమః చ జ్ఞాతుం ఇచ్ఛామహే | ఉపాయేన త్వాం విజేష్యతి వా విషాదం గమిష్యతి (జ్ఞాతుం ఇచ్ఛామహే)||

తా|| "ఘోరమైనరూపముతో, పర్వతముతో సమానమైన రూపముతో, కోరలతో, గోరోచనవర్ణము కల కళ్ళతో ఆకాశమంతటి నోటిని తెఱిచి విఘ్నము కల్పించుము. అతని బలము పరాక్రమము తెలిసికొన కోరుచున్నాము. ఉపాయముతో నిన్ను జయించునా లేక విషాదము పొందునా అని."

ఏవముక్తా తు సా దేవీ దైవతైరభిసత్కృతా |
సముద్ర మధ్యే సురసా భిభ్రతీ రాక్షసం వపుః||149||
వికృతం చ విరూపం చ సర్వస్య చ భయావహమ్|
ప్లవమానం హనూమంతం ఆవృత్యేదమువాచహ||150||

స|| ఏవం దైవతైః అభిసత్కృతా ఉక్తా తు సా దేవీ సముద్ర మధ్యే రాక్షసం వపుః భిభ్రతీ || (తదా) ప్లవమానం హనూమంతం ఆవృత్య (తత్) సర్వస్య చ భయావహం వికృతం చ విరూపం ఇదం ఆహ||

తా|| ఈవిధముగా దేవతలచేత చెప్పబడిన గౌరవింపబడిన ఆ సురసా దేవి సముద్రము మధ్యలో రాక్షస రూపము ధరించెను. అప్పుడు అసహజము వికృతము భయంకరము అయిన రూపముతో ఆకాశములో ఎగురుచున్న హనుమంతుని అడ్డగించి సురస ఇట్లు పలికెను.

మమభక్షః ప్రదిష్టస్త్వం ఈశ్వరైర్వానరర్షభ |
అహం త్వాం భక్షయిష్యామి ప్రవిశేదం మమాననమ్||151||
ఏవముక్తః సురసయా ప్రాంజలిర్వానరర్షభ|
ప్రహృష్టవదనః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ||152||

స|| (హే) వానరర్షభ ఈశ్వరైః త్వం మమభక్షః ప్రదిష్టః | అహం త్వాం భక్షయిష్యామి | ఇదం మమ ఆననమ్ ప్రవిశ || సురసయా ఏవం ఉక్తః వానరర్షభః ప్రహృష్టవదనః ప్రాంజలిః శ్రీమాన్ ఇదం వచనం అబ్రవీత్||

తా|| "ఓ వానరోత్తమ ! ఈశ్వరుడు నిన్ను నా ఆహారముగా ఒసగినాడు. నేను నిన్ను భక్షించెదను. నా నోటిలో ప్రవేశించుము". సురసచేత ఈ విధముగా చెప్పబడినవాడైన ఆ వానరుడు , సంతోషముగల వదనముతో అంజలి ఘటించి ఇట్లు పలికెను.

రామోదాశరథిర్నామ ప్రవిష్టో దండకావనమ్|
లక్ష్మణేన సహ భ్రాతా వైదేహ్యాచాపి భార్యయా||153||
అన్యకార్యవిషక్తస్య బద్ధవైరస్య రాక్షసైః |
తస్య సీతా హృతా భార్యా రావణేన యశస్వినీ||154||

స|| రామః నామ దాశరథిః భ్రాతా లక్ష్మణేన సహ భార్యయా వైదేహ్యా చాపి దండకావనమ్ ప్రవిష్ఠః ||రాక్షసైః బద్ధవైరస్య తస్య అన్యకార్యవిషక్తస్య భార్యా యశస్వినీ సీతా రావణేన అపహృతా||

తా||'' రాముడు అని పేరుగలవాడు , దశరథుని పుత్రుడు, భార్య సీత మరియు తమ్ముడు లక్ష్మణుని తో కలిసి దండకావనము ప్రవేశించెను. రాక్షసులకి బద్ధవైరుడు అగు రాముడు , అన్యకార్యములలో నిమగ్నుడై వుండగా , ఆయన భార్య యశస్విని అగు సీత రావణునిచే అపహరింపబడినది'.

తస్యాః సకాసం దూతోsహం గమిష్యే రామ శాసనాత్ |
కర్తుమర్హసి రామస్య సాహ్యం విషయవాసిని||155||
అథవా మైథిలీం దృష్ట్వా రామం చాక్లిష్ఠకారిణమ్|
ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశ్రుణోమి తే||156||

స|| అహం దూతః తస్యాః (సీతాయాః) సకాశమ్ రామశాసనాత్ గమిష్యే | (హే) విషయవాసిని రామస్య సాహ్యం కర్తుం అర్హసి||అథవా మైథిలీం దృష్ట్వాఅక్లిష్టకారిణం రామం చ తే వక్త్రం ఆగమిష్యామి | సత్యం తే ప్రతిశ్రుణోమి ||

తా|| "నేను ఆయన దూతను. సీతాదేవి దగ్గరకు రామ శాసనము తో పోవుచున్నవాడను. ఓ రామరాజ్యములో వశించు దేవి ! నువ్వు రామునకు సహయము చేయుట ధర్మము. లేనిచో మైథిలిని చూచి క్లిష్టమైన కార్యములు సాధింపగల రామునిని చూచి నీ నోటిలోకి వచ్చెదను. నీకు సత్యముగా చెప్పుచున్నాను".

ఏవముక్తా హనుమతా సురసా కామరూపిణీ|
అబ్రవీన్నాతివర్తేన్మాం కశ్చిదేషవరో మమ||157||
తం ప్రయాంతం సముద్వీక్ష్య సురసా వాక్య మబ్రవీత్|
బలం జిజ్ఞాసమానా వై నాగమాతా హనూమతః||157-1||

స|| హనుమతా ఏవం ఉక్తా కామరూపిణి సురసా అబ్రవీత్ కశ్చిత్ నాతివర్తేత ఏషః మమ వరః ||నాగమాతా సురసా హనూమతః బలం జిజ్ఞాసమానా వై నాగమాతా సురసా ప్రయాన్తం తం సముద్వీక్ష్య (ఇదమ్) వాక్యం అబ్రవీత్ ||

తా|| ఈ విధముగా హనుమంతుని చేత చెప్పబడిన, ఇచ్ఛానుసారము రూపము ధరించగల సురస ఇట్లు చెప్పెను."ఎవరు నన్ను దాటి పోలేరు. ఇది నాకు ఇవ్వబడిన వరము" అని. తనమాటను లక్ష్యము చేయక పోగోరుచున్న హనుమంతుని తో హనుమంతుని బలము తెలిసికొనగోరి ఆ నాగమాత సురస ఈ మాటలను చెప్పెను.

ప్రవిశ్య వదనం మేsద్య గంతవ్యమ్ వానరోత్తమ|
వర ఏషా పురా దత్తో మమధాత్రేతి సత్వరా||157-2||
వ్యాదాయ విపులం వక్త్రం స్థితా సా మారుతేః పురః|
ఏవముక్తః సురసయా క్రుద్ధో వానరపుంగవః||157-3||

స|| వానరోత్తమ అద్య మే వదనం సత్వరా ప్రవిశ్య గంతవ్యమ్ | ఏషః వరః పురా మే ధాత్రే దత్తః ఇతి||సా విపులం వక్త్రం వ్యాదాయ మారుతేః పురః స్థితః| సురసయా ఏవం ఉక్తః వానరః క్రుద్ధః (అభవత్)||

తా||"ఓ వానరోత్తమ ఇప్పుడు నా నోటిలో సత్వరముగా ప్రవేశించి వెళ్ళుము. పూర్వము ఈ విధముగా బ్రహ్మదేవుడు వరము ఇచ్చెను". అప్పుడు ఆమే తన నోటిని బాగా తెఱిచి మారుతి ఎదురుగా నిలబడెను. సురస చేత ఈవిధముగా చెప్పబడిన హనుమంతుడు కృద్ధుడయ్యెను.

అబ్రవీత్కురువై వక్త్రం యేన మాం విషహిష్యసే|
ఇత్యుక్త్వా సురసా క్రుద్ధా దశయోజనమాయతా ||157-4||
దశయోజనవిస్తారో బభూవ హనుమాంస్తదా |
తం దృష్ట్వా మేఘసంకాశం దశయోజనమాయతమ్||157-5||
చకార సురసా చాస్యం వింశద్యోజన మాయతమ్|

స|| (సః వానరః) వై వక్త్రం యేన మామ్ విషహిష్యసే (తత్) కురు (ఇతి) అబ్రవీత్|| ఇతి ఉక్త్వా క్రుద్ధా హనుమాన్ దశయోజనమ్ ఆయతా దశయోజన విస్తారః బభూవ || మేఘసంకాశం దశయోజనమాయతం తం దృష్ట్వా సురసా చ ఆస్యం వింశద్యోజనం ఆయతమ్ చకార ||

తా|| ఆ వానరుడు " నీ నోరు నన్నుఎలా భరించగలదో అలాగ చేయి ". అని చెప్పి హనుమంతుడు క్రోధముతో తను పది యోజనములు పొడుగు పది యోజనములు వెడల్పుగా అయ్యెను. మేఘములతో సమానముగా పది యోజనములు పెరిగిన ఆ హనుమంతుని చూచి సురస తన నోటిని ఇరవై యోజనముల విస్తీర్ణము చేసెను.

హనుమాంస్తు తదా క్రుద్ధః త్రింశద్యోజన మాయతః||157-6||
చకార సురసా వక్త్రం చత్వారింశత్తథోచ్ఛ్రితమ్ |
బభూవ హనుమాన్వీరః పంచాశద్యోజనోచ్ఛ్రితః||157-7||
చకార సురసా వక్త్రం షష్టియోజన మాయతమ్|
తథైవ హనుమాన్వీరః సప్తతీ యోజనోచ్ఛ్రితః||157-8||
చకార సురసా వక్త్రం అశీతీ యోజనాయతమ్ |
హనుమాన్ అచలప్రఖ్యో నవతీ యోజనోచ్ఛ్రితః ||157-9||
చకార సురసా వక్త్రం శతయోజన మాయతమ్|

స|| తతః హనుమాంస్తు ( హనుమాన్ అపి) క్రుద్ధః త్రింశద్యోజనం ఆయతః(అభవత్)| సురసా తథావక్త్రం చత్వారింశం ఉచ్ఛ్రితమ్ చకార||హనుమాన్ వీరః పంచాసద్యోజన ఉచ్ఛ్రితః బభూవ | (తదా) సురసా వక్త్రం షష్టియోజనం ఆయతం చకార||తథైవ వీరః హనుమాన్ తథైవ సప్తతీ యోజనమ్ ఉచ్ఛ్రితః| సురసా వక్త్రం అశీతీ యోజనం ఆయతమ్||అచలప్రఖ్యో హనుమాన్ నవతీ యోజనం ఉఛ్ఛ్రితః| (తదా) సురసా వక్త్రం శతయోజనం ఆయతమ్||

అప్పుడు హనుమంతుడు కూడా కోపముతో ముప్పది యోజనములు విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని నలభై యోజనముల విస్తీర్ణముగా చేసెను. అప్పుడు హనుమంతుడు ఏభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని అరవై యోజనముల విస్తీర్ణముగా పెంచెను. అలాగే హనుమంతుడు డెబ్బై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని ఎనభై యొజనముల విస్తీర్ణము చేసెను. అప్పుడు పర్వతాకారముగల హనుమంతుడు తొంభై యోజనముల విస్తీర్ణముగా పెరిగెను. అప్పుడు సురస తన నోటిని నూరు యోజనముల విస్తీర్ణము చేసెను.

తం దృష్ట్వా వ్యాదితం త్వాస్యం వాయుపుత్త్రః సుబుద్ధిమాన్||157-10||
దీర్ఘజిహ్వం సురసయా సుఘోరం నరకోపమమ్|
సుసంక్షిప్యాత్మనః కాయం బభూవాంగుష్టమాత్రకః||158||
సోsభిపత్యాశు తద్వక్త్రం నిష్పత్య చ మహాబలః|
అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్ ||159||

స|| సుబుద్ధిమాన్ వాయుపుత్త్రః సురసయా వ్యాదితం దీర్ఘజిహ్వం సుఘోరం తం ఆస్యం దృష్ట్వా ఆత్మనః కాయం అంగుష్టమాత్రకః బభూవ ||శ్రీమాన్ మహాబలః సః ఆశు తద్వక్రం అభిపత్య నిపత్య చ అన్తరిక్షే స్థితః ఇదం వచనమ్ అబ్రవీత్||

తా|| అప్పుడు బుద్ధిమంరుడు అయిన హనుమంతుడు సుదీర్ఘమైన నాలుక గలది ఘోరమైన ఆ సురస తెరిచిన నోటిని చూచి, తన కాయమును చిటికిన వేలు మాత్రము చేసెను. అ మహాబలవంతుడు ఆమె నోటిలో ప్రవేశించి మళ్ళీ బయటకు వచ్చి ఆకాశములో నిలబడి ఇట్లు పలికెను.

ప్రవిష్టోsస్మి హి తే వక్త్రం దాక్షాయనీ నమోస్తుతే|
గమిష్యే యత్ర వైదేహీ సత్యం చాసీద్వరస్తవ ||160||
తం దృష్ట్వా వదానాన్ముక్తం చంద్రం రాహుముఖాదివ|
అబ్రవీత్సురసా దేవీ స్వేన రూపేణ వానరమ్||161||

స|| దాక్షాయణి తే వక్త్రం ప్రవిష్టః అస్మి హి | తే వరః సత్యం ఆసీత్ | తే నమః అస్తు | (అహం) యత్రవైదేహీ (తత్ర) గమిష్యే||రాహుముఖాత్ చంద్రం ఇవ వదనాత్ ముక్తం తం వానరం దృష్ట్వా సురసా దేవీ స్వేన రూపేణ అబ్రవీత్||

"ఓ దాక్షాయణి ! నీ నోటిలో ప్రవేశించితిని. నీ వరము సత్యము అయినది. నీకు నమస్కారము. ఇక వైదేహి ఎచటవున్నదో అచటికి వెళ్ళెదను". రాహుముఖములోనుంచి వెలువడిన చంద్రునివలె నున్న నోతినుంచి బయటపడిన హనుమంతుని చూచి సురస తన నిజమైన రూపముతో ఇట్లు పలికెను.

అర్థసిధ్యై హరిశ్రేష్ఠ గచ్ఛసౌమ్య యథాసుఖమ్|
సమానయస్వ వైదేహీం రాఘవేణ మహాత్మనా ||162||
తతృతీయం హనుమతో దృష్ట్వా కర్మ సుదుష్కరమ్|
సాధు సాధ్వితి భూతాని ప్రశశంసుః తదా హరిమ్ ||163||

స|| హరిశ్రేష్ఠ సౌమ్య యథాసుఖం అర్థ్యసిద్ధ్యై గచ్ఛ |వైదేహీం రాఘవేణ సమానయ||తత్ హనుమతః ( హనుమతస్య) తృతీయం సుదుష్కరమ్ కర్మ దృష్ట్వా తదా సాధు సాధు ఇతి ( సర్వాణి) భూతాని హనుమతః ప్రశశంసుః||

తా|| "ఓ సౌమ్యుడా ! వానరులలో శ్రేష్టుడా ! సుఖముగా నీ కార్యసిద్ధికి పొమ్ము. వైదేహిని రామునితో చేర్చుము"అని. అప్పుడు హనుమంతుచేత చేయబడిన మూడవ దుష్కర కార్యమును చూచి "సాధు సాధు" అని అన్ని భూతములు ప్రశంసించినవి.

స సాగర మనాధృష్య మభ్యేత్య వరుణాలయమ్|
జగామాకాశమావిశ్య వేగేన గరుడోపమః||164||
సేవితే వారిదారాభిః పతగైశ్చ నిషేవితే |
చరితే కైశికాచార్యైః ఇరావతనిషేవితే||165||

స|| వేగేన గరుడోపమః సః అనాధృష్యమ్ వరుణాలయం సాగరం అభ్యేత్య ఆకాశం ఆవిశ్య జగామ||వారిదారాభిః సేవితే పతగైశ్చ నిషేవితే కైశికాచార్యైః చరితే ఇరావత నిషేవితే (వాయుమార్గే హనుమాన్ జగామ)||

తా|| వేగములో గరుత్మంతుని తో సమానమైన ఆ హనుమంతుడు ప్రతిఘటింపకాని ఆ వరుణాలయము అగు సాగరము మీద దూసుకుంటూ ఆకాశముమార్గములో ఎగరసాగెను. ఆ ఆకాశమార్గము ధారళమైన వర్షములు కురిపించెడి మేఘముల మార్గము. పక్షులు ఎగురు మార్గము. కైశికాచార్యులు వెళ్ళు మార్గము. అదే ఇరావతము పయనించు మార్గము.

సింహకుంజర శార్దూల పతగోరగవాహనైః|
విమానైః సంపతద్భిశ్చ విమలైః సమలంకృతే||166||
వజ్రాశనిసమహాఘాతైః పావకైరుపశోభితే |
కృతపుణ్యై ర్మహాభాగైః స్వర్గజిద్భిరలంకృతే||167||

స|| సింహకుంజర శార్దూల పతగ ఉరగ వాహనైః సంపత్భిః విమలైః సమలంకృతే విమానైః (చరితే మార్గే హనుమాన్ జగామ)||వజ్రాశనిసమాఘాతైః పావకైః కృతపుణ్యైః స్వర్గజిద్భిః మహాభాగైః ఉపశోభితే (చరితే మార్గే హనుమాన్ జగామ)|| ||

తా|| ఆ ఆకాశమార్గము సింహములు, ఏనుగులు, పులులు, పక్షులు, సర్పములు గల అందముగా అలంకరించబడిన వాహనములు వెళ్ళుమార్గము. హవ్యముతీసుకుపోవు అగ్నుల , వజ్రాయుధముతో సమానమైన శస్త్రములుకల దేవతల మార్గము, పుణ్యకర్మలు చేసి స్వర్గముపొందిన మహానుభావులు ఏతెంచే మార్గము.

వహతా హవ్య మత్యర్థం సేవితే చిత్రభానునా |
గ్రహనక్షత్ర చంద్రార్క తారాగణ విభూషితే||168||
మహర్షి గణ గంధర్వ నాగయక్ష సమాకులే
వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే ||169||

స|| అత్యర్థం అలంకృతే హవ్యం వహతా చిత్రభానునా సేవితే గ్రహనక్షత్ర చన్ద్రార్కతారాగణవిభూషితే ( ఆకాశ మార్గే హనుమాన్ జగామ)||మహర్షి గణ గన్ధర్వ నాగ యక్ష సమాకులే వివిక్తే విమలే విశ్వే విశ్వావసు నిషేవితే (మార్గే హనుమాన్ జగామ)

తా|| ఇది చాలా బాగా అలంకరింపబడిన హవ్యము తీసుకొని చిత్రభానుడు పోవు మార్గము. గ్రహములు నక్షత్రములు తారాగణములు సేవించు మార్గము. మహర్షి గంధర్వ నాగ యక్ష గణములు విహరించు మార్గము, గంధర్వరాజగు విశ్వావసుడు సేవించుమార్గము.

దేవరాజ గజాక్రాంతే చంద్రసూర్య పథే శివే|
వితానే జీవలోకస్య వితతే బ్రహ్మనిర్మితే ||170||
బహుశస్సేవితే వీరై ర్విద్యాధరగణైర్వరైః|
జగామ వాయు మార్గేతు గరుత్మానివ మారుతః||171||

స|| దేవరాజ గజాక్రాన్తే చంద్రసూర్యపథే శివే జీవలోకస్య బ్రహ్మ నిర్మితే వితతే వితానే (మార్గే హనుమాన్ జగామ) || వరైః వీరైః విద్యాధరగణైః బహుశః సేవితే వాయుమార్గే మారుతిః గరుత్మానివ జగామ||

తా|| ఆ మార్గము దేవేంద్రుని గజము పోవు మార్గము. చంద్రుడు సూర్యుడు పయనించు మార్గము. జీవలోకము పైన విశాలముగా బ్రహ్మచేత నిర్మింపబడిన మార్గము. శ్రేష్ఠులు వీరులు అగు విద్యధరులు సేవించు మార్గము. ఆ మర్గములో గరుత్మంతుని లాగా హనుమంతుడు ఎగురుచూ వెళ్ళసాగెను.

ప్రదృశ్యమాన సర్వత్ర హనుమాన్ మారుతాత్మజః|
భేజేsమ్‍బరమ్ నిరాలంబం లంబపక్ష ఇవాద్రిరాట్||172||
ప్లవమానం తు తం దృష్ట్వా సింహికా నామ రాక్షసీ|
మనసా చింతయామాస ప్రవృద్ధా కామరూపిణీ ||173||

స|| హనుమాన్ మారుతాత్మజః సర్వత్ర ప్రదృశ్యమానః నిరాలంబం లంబపక్షః అద్రిరాట్ ఇవ భేజే|| ప్లవమానం తం దృష్ట్వా సింహికా నామా రాక్షసీ ప్రవృద్ధా కామరూపిణీ చిన్తయామాస||

తా|| మారుతాత్మజుడగు హనుమంతుడు అన్నివైపుల కనపడుతూ పెద్దరెక్కలు వున్నపర్వతములాగా ఆకాశములో నిరాధారముగా ఎగురుచూ కనపడెను. అలా ఎగురుచున్న హనుమంతుని చూచి సింహిక అను కామరూపిణీ అగు రాక్షసి , తన శరీరము పెంచుకొనుచూ ఇట్లు అనుకొనెను.

అద్య దీర్ఘస్య కాలస్య భవిష్యామ్యహమాశితా |
ఇదం హి మే మహత్ సత్వం చిరస్య వశమాగతమ్||174||
ఇతి సంచిత్య మనసా ఛాయమస్య సమాక్షిపత్ |
ఛాయాయాం గృహ్యమాణాయాం చింతయామాస వానరః||175||

స|| చిరస్య ఇదం మహత్ సత్త్వమ్ మే వశమ్ ఆగతమ్ | దీర్ఘస్య కాలస్య అద్య అహమ్ ఆశితా భవిష్యామి||(సింహికా) ఇతి మనసా సంచిత్య అస్య (కపిస్య) ఛాయామ్ సమాక్షిపత్ | ఛాయాయామ్ గృహ్యమాణాయామ్ వానరః చింతయామాస||

తా|| "చాలాకాలము తరువాత ఒక పెద్ద జంతువు ఆహారముగా నా వశములోకి వచ్చినది. ఈ వేళ దీర్ఘకాలము తరువాత నాకు తినుటకు దొరికినది". ఈవిధముగా మనస్సులో అలోచించి ఆ సింహిక వానరుని నీడ పట్టు కొనెను. ఆ నీడ పట్టుకోనబడగానే హనుమంతుడు ఆలోచించ సాగెను.

సమాక్షిప్తోsస్మి సహసా పంగూకృత పరాక్రమః|
ప్రతిలోమేన వాతేన మహానౌరివ సాగరే||176||
తిర్యగూర్ధ్వమథశ్చైవ వీక్షమాణస్తతః కపిః|
దదర్శ స మహత్ సత్త్వం ఉత్థితం లవణాంభసి||177||

స||సాగరే మహానౌరివ ప్రతిలోమేన వాతేన సహసా పంగూకృత మానః సమాక్షిప్తః అస్మి||తతః (హనుమాన్) తిర్యక్ ఊర్ధ్వమ్ అథశ్చైవ వీక్షమాణః లవణాంభసి ఉత్థితమ్ మహత్ సత్త్వం దదర్శ||

" సాగరములో ఎదురుగాలివలన నిరోధింపబడిన నౌక లాగా నేను నిరోధింపబడి ఉన్నాను". అప్పుడు కింద, పైన, పక్కన చూచి సముద్రము నుంచి పైకి లేచిన పెద్ద జంతువును చూచెను.

తదృష్ట్వా చింతయామాస మారుతిర్వికృతాననః|
కపిరాజేన కథితం సత్త్వమద్భుత దర్శనమ్||178||
ఛాయాగ్రాహీ మహావీర్యం తదిదం నాత్ర సంశయః|
స తాం బుద్వార్థతత్వేన సింహికాం మతిమాన్కపిః||179||
వ్యవర్థత మహాకాయః పావృషీవ వలాహకః|

స||మారుతిః తత్ వికృతాననమ్ దృష్ట్వా చింతయామాస | కపిరాజేన కథితమ్ అద్భుతదర్శనం మహావీర్యం ఛాయాగ్రాహీ మహావీర్యం తత్ సత్త్వం ఇదం అత్ర న సంశయః న ||మతిమాన్ స కపిః తామ్ అర్థతత్త్వేన సింహికామ్ బుద్ధ్వా మహాకాయః ప్రావృషి వలాహకః ఇవ వ్యవర్థత ||

తా|| అప్పుడు మారుతి ఆ వికృతరూపమైన జంతువు చూచి అలోచించసాగెను. "కపిరాజగు సుగ్రీవునిచేత చెప్పబడిన చూచుటకు అద్భుతముగాగల అత్యంత బలమైన జంతువు ఇదే. దానికి సందేహము లేదు" అని. బుద్ధిమంతుడైన హనుమంతుడు ఆ జంతువును సింహిక అని అర్థముచేసి కొని, వర్షకాలపు మేఘములా తన శరీరమును పెంచెను.

తస్య సా కాయముద్వీక్ష్య వర్ధమానం మహాకపేః|
వక్త్రం ప్రసారమాయాస పాతాళాంతర సన్నిభమ్|
ఘనరాజీవ గర్జంతీ వానరం సమభిద్రవత్||181||
స దదర్శ తతస్తస్యా వివృతం సుమహాన్ముఖమ్|
కాయమాత్రం చ మేధావీ మర్మాణి చ మహాకపిః||182||

స|| (సా సింహికా) పాతాళాంతర సన్నిభం వక్త్రం ప్రసారయామాస | ఘనరాజీవ గర్జన్తీ వానరం సమభిద్రవత్ ||తతః మేధావీ మహాకపిః తస్యాః వివృతమ్ కాయమాత్రం సుమహత్ ముఖమ్ మర్మాణి చ సః దదర్శ||

అలాగ పెరుగుతున్నవానరుని చూచి ఆ సింహిక పాతాళబిలం లాంటి తన నోటిని తెరచి, మేఘములవలె గర్జిస్తూ వానరుని వెంటబడెను. అప్పుడు మేధావి అయిన హనుమంతుడు తన శరీరమంత ప్రమాణములో తెరవబడిన నోటి ద్వారా లోపలి అవయములను చూచెను

స తస్యా వివృతే వక్త్రే వజ్రసంహననః కపిః|
సంక్షిప్త్య ముహురాత్మానం నిష్పపాత మహాబలః||183||
అస్యే తస్యా నిమజ్జంతం దదృశు సిద్ధచారణాః|
గ్రస్యమానం యథా చంద్రం పూర్ణం పర్వణి రాహుణా||184||

స|| మహాబలః వజ్రసంహననః సః కపిః ఆత్మానమ్ ముహుః సంక్షిప్త్య తస్యాః వివృతే వక్త్రే నిష్పపాత||సిద్ధ చారణాః తస్యాః ఆస్యే నిమజ్జంతం పర్వణి రాహునా గ్రస్యమానం పూర్ణం చంద్ర యథా దదృశు||

తా|| మహాబలుడు వజ్రము వంటి దేహము కలవాడు అగు ఆ వానరుడు, మళ్ళీ తన దేహము చిన్నదిగా చేసి ఆ సింహిక నోటిలో దూకెను. సిద్ధులు చారణులు రాహువుచే పూర్ణమి నాటి చంద్రుడు మింగబడినట్లు, హనుమంతుడు ఆ నోటిలో మునుగుట చూచిరి.

తతస్తస్యా నఖైస్తీక్ష్ణైర్మర్మాణ్యుత్కృత్య వానరః|
ఉత్పపాథ వేగేన మనః సంపాతవిక్రమః||185||
తాం తు దృష్ట్యా చ ధృత్యాచ దాక్షిణ్యేన నిపాత్య చ|
స కపిప్రవరో వేగాద్వవృధే పునరాత్మవాన్ |186||

స||తతః వానరః తీక్ష్ణైః నఖైః తస్యాః మర్మాణి ఉత్కృత్య మనః సంపాతవిక్రమః వేగేన ఉత్పపాత|| సః కపి ప్రవరః తామ్ దృష్ట్వా చ ధృత్యా చ దాక్షిణ్యేన నిపాత్య పునః వేగాత్ ఆత్మవాన్ వవృధే||

తా|| అప్పుడు ( సింహిక నోటిలోకి దూకిన) ఆ వానరుడు తీక్షణమైన తన గోళ్ళతో ఆ సింహిక ఆయువుపట్టుని చీల్చి మనో వేగముతో పైకి వచ్చెను. ఆ కపి ప్రవరుడు ధైర్యముతో దక్షతో ఆ సింహికను చూచి పడగొట్టి తన శరీరమును పెంచెను.

హృతహృత్సా హనుమాత పపాత విధురాంభసి|
తాం హతాం వానరేణాశు పతితాం వీక్ష్య సింహికామ్||187||
భూతాన్యాకాశచారీణి తమూచుః ప్లవగోత్తమమ్|
భీమమద్యకృతం కర్మ మహత్ సత్వం త్వయా హతమ్||188||
సాధయార్థమభిప్రేతం అరిష్టంప్లవతాం వర|

స|| సా హనుమతా హ్రుహ్రుత్ విధురా వానరేణ ఆసు హతాం అమ్బసి పపాత|పతితామ్ తాం వీక్ష్య ఆకాశచారీణి భూతాని ప్లవగోత్తమమ్ ఊచుః||ప్లవతాం వరఃఅద్య త్వయా మహత్ సత్త్వం హతమ్| భీమమ్ కర్మ కృతమ్| (తవ) అభిప్రేతమ్ అర్థమ్ అరిష్టమ్ సాధయ |

తా|| ఆ హనుమంతునిచేత అమె గుండె చీల్చబడగా ఆ సింహిక విహిత జీవి అయి నీళ్ళలో పడెను. అలా పడిన సింహికను చూచి ఆకాశములో చరించు భూతములు హనుమంతుని తో ఇట్లు పలికిరి. " ఓ వానరశ్రేష్ఠా! ఇప్పుడు నీచేత గొప్ప జంతువు చంపబడినది. అసాధ్యమైన పని చేయబడినది. నీ అభీష్ఠ కార్యమును సాధించుకొనుము"

యస్యత్వేతాని చత్వారి వానరేంద్ర యథా తవ||189||
ధృతిర్దృష్టిర్మతి దాక్ష్యం స్వకర్మసు సీదతి|
సతైః సంభావితః పూజ్యః ప్రతిపన్న ప్రయోజనః||190||
జగామాకాసమావిశ్య పన్నగాశనవత్కపిః|

స|| వానరేంద్ర యస్య ధృతిః దృష్టిః మతిః దాక్ష్యం ఏతాని చత్వారి తవ యథా సః కర్మసు న సీదతి||పూజ్యః సః కపిః తైః సమ్భావితః ప్రతిపన్నప్రయోజనః ఆకాశం ఆవిశ్య పన్నగాశనవత్ జగామ||

"ఓ వానరేంద్ర ! ఎవరిలో ధైర్యము, సూక్ష్మ దృష్టి, సునిశితబుద్ధి, దక్షత ఈ నాలుగూ కలవో అట్టివారు కర్మాచరణములో సిద్ధిపొందెదరు". వారిచేత స్తుతింపబడి పూజనీయుడైన హనుమంతుడు తన కార్యము నిశ్చయించుకొని గరుత్మంతునిలాగా ఆకాశమార్గమున ఎగురుతూ పోయెను.

ప్రాప్తభూయిష్ట పారస్తు పర్వతః ప్రతిలోకయన్ ||191||
యోజనానాం శతస్యాంతే వనరాజిం దదర్శ సః|
దదర్శ చ పతన్నేవ వివిధ ద్రుమభూషితమ్||192||
ద్వీపం శాఖామృగశ్రేష్ఠో మలయోపవనాని చ|

స|| ( హనుమాన్) శతస్య యోజనానామ్ అన్తే ప్రాపభూయిష్ఠ పారః సర్వతః ప్రతిలోకయన్ వనరాజిమ్ దదర్శ||శాఖామృగ శ్రేష్ఠః పతన్నేవ వివిధద్రుమభూషితం ద్వీపం మలయోపవనాని చ దదర్శ||

తా|| వంద యోజనముల తరువాత సముద్రముయొక్క అవతల తీరము చెరుతూ, అన్ని వేపుల పరికింపగా వృక్షములతో రాజించు వనము కనబడెను. శాఖామృగశ్రేష్ఠుడగు హనుమంతుడు దిగుతూనే నానా విధమైన వృక్షములతో వున్న ద్వీపాన్నిమలయ పర్వత ప్రాంతములను చూచెను.

సాగరం సాగరానూపం సాగరా నూపజాన్ద్రుమాన్ ||193||
సాగరస్య చ పత్నీనాం ముఖాన్యపి విలోకయన్|
స మహామేఘసంకాశం సమీక్ష్యాత్మాన మాత్మవాన్||194||
నిరుంధత మివాకాశం చకార మతిమాన్మతిమ్|

స|| సాగరం సాగరానూపం సాగరానూపజాన్ ద్రుమాన్ సాగరస్య పత్నీనాం (నదీనాం) ముఖాన్యపి విలోకయన్ సః మహామేఘసంకాశం ఆకాశం నిరుంధత మివ ఆత్మవాన్ సమీక్ష్య (హనుమాన్) మతిం చకార||

తా|| సముద్రమును, సముద్ర తీర ప్రాంతములను, సముద్రప్రాంతములోని వృక్షములను, సాగరతో కలియు నదీ ముఖములను చూచి, ఆకాశమును అడ్డగించునటుల వున్న మేఘములతో సమానమైన తన శరీరము చూచి అలోచించ సాగెను.

కాయవృద్ధిం ప్రవేగం చ మమదృష్ట్వైవ రాక్షసాః||195||
మయి కౌతూహలం కుర్యురితి మేనే మహాకపిః|
తతః శరీరం సంక్షిప్య తన్మహీధరసన్నిభమ్||196||
పునః ప్రకృతి మాపేదే వీతమోహా ఇవాత్మవాన్|

స|| మమ కాయవృద్ధిం ప్రవేగం చ దృష్ట్వైవ రాక్షసాః మయి కౌతూహలమ్ కుర్యుః ఇతి మహాకపిః మేనే||తతః తత్ మహీధర సన్నిభమ్ తత్ శరీరం సంక్షిప్య వీతమోహః ఆత్మవానివ పునః ప్రకృతిం ఆపేదే||

తా|| " నా పెరిగిన శరీరమును , వేగమును చూచి రాక్షసులకు నాపై కుతూహలము ఎక్కువ అగును" అని ఆ మహావానరుడు అనుకొనెను. పిమ్మట మహీధరముతో సమానమైన తన శరీరమును చిన్నదిగా చేసి, అజ్ఞానము పోయినఆత్మజ్ఞాని స్వరూపము పొందినట్లు, తన స్వరూపమును సంతరించుకొనెను.

తద్రూప మతి సంక్షిప్య హనుమాన్ ప్రకృతౌ స్థితః||
త్రీన్క్రమానివ విక్రమ్య బలివీర్యహరో హరిః||197||

స|| హనుమాన్ తత్ రూపం అతిసంక్షిప్య బలివీర్యహరః హరిః త్రీన్ క్రమాన్ విక్రమ్య ఇవ ప్రకృతౌ స్థితః ||

తా|| త్రివిక్రముడై బలిని హరించి తన స్వాభావికరూపము ధరించిన విష్ణువు లాగ హనుమంతుడు తన మహారూపమును చిన్నదిగాచేసి సహజ రూపమును ధరించెను.

స చారునానావిధరూపధారీ
పరం సమాసాద్య సముద్ర తీరమ్|
పరైరశక్యః ప్రతిపన్నరూపః
సమీక్షితాత్మా సమవేక్షితార్థః||198||

స|| చారునానావిధరూపధారీ పరైః అశక్యః సః పరం సముద్రతీరమ్ సమాసాద్య సమీక్షితాత్మా ప్రతిపన్నరూపః సమవేక్షితార్థః||

తా|| సుందరమైన నానావిధములైన రూపము ధరించగలవాడు, శత్రువులకు అశక్య మైనవాడు అగు హనుమంతుడు సముద్రము యొక్క అవతలి తీరము చేరి, తన శరీరమును చూచుకొని, సూక్ష్మ రూపము ధరించి తన కార్యము గురించి సమీక్షించెను.

తతస్సలంబస్య గిరేః సమృద్ధే
విచిత్ర కూటే నిపపాత కూటే|
సకేత కోద్దాలకనాళికేరే
మహాద్రికూట ప్రతిమో మహాత్మా||199||

స|| తతః మహాత్రికూటప్రతిమః సః మహాత్మా లమ్బస్య గిరేః విచిత్రకూటే సమృద్ధే సకేతకోద్దాలకనాలికేరే ప్రతిమౌ నిపపాత కూటే||

తా|| అప్పుడు మహాపర్వత శిఖరములా ఒప్పారు హనుమంతుడు కేతక ఉద్దాలక నారికేళ వృక్షములతో నిండినది, అనేక శిఖరములతో కూడినది, విచిత్రకూటమగు లంబపర్వత శిఖరముపై దిగెను.

తతస్తు సంప్రాప్య సముద్ర తీరం
సమీక్ష్య లంకాం గిరివర్యమూర్ధ్ని|
కపిస్తు తస్మిన్ నిపపాత పర్వతే
విధూయ రూపం వ్యధయన్ మృగద్విజాన్||200||

స||తతః సముద్రతీరం సంప్రాప్య కపిః తు తస్మిన్ పర్వతే నిపపాత మృగద్విజాన్ వ్యధయన్ రూపం విధూయ గిరివర్యమూర్ధ్ని (సః) లంకాం సమీక్ష్య ||

తా|| అప్పుడు సముద్ర తీరమును చేరి, పర్వత శిఖరముపై నున్న లంకానగరము చూచి మృగములను పక్షులకు భయము కలుగు రీతిగా ఆ పర్వతము మీద దిగెను.

స సాగరం దానవపన్నగాయుతమ్
బలేన విక్రమ్య మహోర్మిమాలినమ్|
నిపత్య తీరే చ మహోదధే స్తదా
దదర్శ లంకాం అమరావతీమ్ ఇవ|| 201||

తా|| దానవులకు పన్నగములకు స్థానమై యున్న ఆ సాగరమును తన బలముతో జయించి, అ మహ సాగరము యొక్క అవతల తీరము చేరి, హనుమంతుడు అమరావతిలా వున్న లంకను చూచెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ప్రథమస్సర్గః||

ఈ విధముగా వాల్మీకియొక్క ఆదికావ్యమైన రామాయణములో సుందరకాండలో ప్రథమసర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||