||సుందరకాండ ||

|| ఇరువది ఒకటవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 21 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకవింశస్సర్గః
( శ్లోకార్థతాత్పర్య తత్త్వదీపికతో)

సీతమ్మవారి ఉపదేశము

రావణుని ప్రగల్భాలతో కూడిన భాషణకి సీత సమాధానమే ఇరవై ఒకటవ సర్గలో విషయము. ఇక్కడ సీతమ్మ సమాధానములో సీతమ్మ యొక్క మాతృస్వభావము కనపడుతుంది. వాల్మీకి శ్లోకాలలో, సత్పురుషులు లేని లేని సత్పురుషుల మాట వినని రావణుని స్వభావము గ్రహించిన సీతకనపడుతుంది. వినాశముకు తగినట్టి, శరణాగతి తప్ప ఇంకో మార్గములేని రావణుని యొక్క దుర్మతి కూడా గ్రహించిన సీతమ్మ , రావణునికి మాతృవాత్సల్యముతో, తనని రామునికి సమర్పించి రామునితో మైత్రి కోరుకోమని చెపుతుంది. చివరిమాటగా మాత్రమే, చేయతగిన కార్యము చేయకపోతే రాముని బాణములు తప్పించుకోలేవు అన్నమాట సీత రావణునికి చెప్పుతుంది.

ఇక అర్థ తాత్పర్య తత్త్వార్థములతో శ్లోకాలు.

||శ్లోకము 21.01||

తస్య తద్వచనం శ్రుత్వా సీతా రౌద్రస్య రక్షసః|
అర్తా దీనస్వరా దీనం ప్రత్యువాచ శనైర్వచః ||21.01||

స|| తస్య రౌద్రస్య రక్షసః వచనం శృత్వా ఆర్తా దీనం దీనస్వరా సీతా శనైః ప్రత్యువాచ||

||శ్లోకార్థములు||

తస్య రౌద్రస్య రక్షసః వచనం శృత్వా -
అలా రౌద్రుడైన రాక్షసుని యొక్క వచనములను విని
ఆర్తా దీనం దీనస్వరా సీతా - దీనముగా విలపించుచూ దీనస్వరముతో
సీతా శనైః ప్రత్యువాచ - సీత మెల్లగా ప్రత్యుత్తరము ఇచ్చెను

||శ్లోకతాత్పర్యము||

"అలా రౌద్రుడైన రాక్షసుని యొక్క వచనములను విని దీనముగా విలపించుచూ దీనస్వరముతో మెల్లగా సీత ప్రత్యుత్తరము ఇచ్చెను." ||21.01||

||శ్లోకము 21.02||

దుఃఖార్తా రుదతీ సీతా వేపమానా తపస్వినీ|
చిన్తయన్తీ వరారోహా పతిం ఏవ పతివ్రతః||21.02||
తృణమన్తరః కృత్వా ప్రత్యువాచ శుచిస్మితా|

స|| సీతా వేపమానా తపశ్వినీ పతివ్రతః పతిం ఏవ చిన్తయన్తీ దుఃఖార్తా రుదతీ సుచిస్మితా సీతా వేపమానా తృణం అన్తరః కృత్వా ప్రత్యువాచ||

తిలక టీకాలో - తృణమన్తరః కృత్వా పరపురుషస్య సాక్షాత్ సంభాషణానర్హత్వాత్ భూమ్యాం కించిదన్తర్థాయ తస్య ముఖే ప్రత్యుత్తరదానమ్| కథం అస్య దురాత్మనో రజః తమోభిభూతస్య మయి దురాశేతి సుచిస్మితా|ప్రత్యువాచేఽతి పునరభిదానం ప్రకార వింశపకథనార్థమ్ | ఏతేన తృణీకృతప్రాణతయా తృణతుల్యతయా రావణస్య గ్రహణాచ్చ నిభయ ప్రత్యుత్తరదానమితి బోధ్యమ్| తదేవ ఆహ నివర్తయేతి|

||శ్లోకార్థములు||

తపశ్వినీ దుఃఖార్తా సుచిస్మితా -
పతివ్రత, తపస్విని, సుచిస్మిత
పతివ్రతః పతిం ఏవ చిన్తయన్తీ -
భర్తనుగురించే అలోచనలో ఉన్న పతివ్రత
రుదతీ వేపమానా సీతా -
కోపముతో వణికి పోతూ సీత
తృణం అన్తరః కృత్వా ప్రత్యువాచ -
ఒక గడ్డిపోచను మధ్యలోపెట్టి ప్రత్యుత్తరమిచ్చెను.

||శ్లోకతాత్పర్యము||

"పతివ్రత, తపస్విని, భర్తనుగురించే అలోచనలో ఉన్న, దుఃఖములలో మునిగి విలపిస్తున్న సీత కోపముతో వణికి పోతూ ఒక గడ్డిపోచను మధ్యలోపెట్టి ప్రత్యుత్తరమిచ్చెను." ||21.02||

వాల్మీకి సీత "తృణమంతరః కృత్వా" అంటే, గడ్డిపోచ మధ్యలో పెట్టి, రావణుడికి సమాధానము చెప్పినది అంటాడు.

తృణము అంటే గడ్డిపోచ.

గడ్డిపోచ మధ్య లో పెట్టడములో, రావణుడు గడ్డిపోచ తో సమానము అని ఒక ధ్వని వినిపిస్తుంది. గడ్డిపోచకైనా తనతో మాట్లాడే అర్హతకలదు, కాని రావణునికి ఆ అర్హతకూడాలేదు అని ఇంకోధ్వని

గడ్డిపోచచే వెంటాడిబడిన వాయసము , మూడులోకములు తిరిగి రాముని శరణాగతి కోరడము వలననే తన ప్రాణము కాపాడుకోగలిగింది . అంటే రావణుడి గతి కూడా అదే అవుతుంది అని మరింకో ధ్వని వినిపిస్తుంది.

ఆ కాలానుసారముగా ఒక పతివ్రత పరపురుషులతో మాట్లాడదు. దానికి అనుగుణముగా గడ్డిపోచ మధ్యలో ఉంచి మాట్లాడినది అనడము సామాన్య న్యాయము. అది కూడా ఒక ధ్వని.

సీత కోపముతో "వేపమానా", అంటే వణికి పోతూ, ఒక గడ్డిపోచను మధ్యలోపెట్టి ప్రత్యుత్తరమిస్తుంది. మాట్లాడిన సీత "శుచిస్మిత". అంటే మందహాసముతో సీత మాట్లాడినది అన్నమాట. అంతదుఃఖములోనూ, "తృణమంతరః కృత్వా", గడ్డి పోచను మధ్యలో నిలిపి, మాట్లాడిన సీత, సాక్షాత్తు జగన్మాత.

కుమారుడు అనరాని మాటలాడిననూ , వాత్సల్యముచే తల్లి ఎలాగ కోపము రాదో,
అలాగే సీతమ్మకు కూడా కోపము రాలేదు. మోయలేని బరువును, తినలేని పదార్థమును పసివాడు కోరినపుడు తల్లి ఎట్లుచిరువ్వు నవ్వునో అలాగే, రావణునిపై పాపము తెలివి తక్కువవాడు కోరకూడనది కోరుచున్నాడని జాలితో మందహాసము చేసిన తల్లి సీత.

ఆ నవ్వులో పవిత్రతయే గాని, కాలుష్యము లేదు. క్రోధము లేదు. ద్వేషము లేదు.

||శ్లోకము 21.03||

నివర్తయ మనో మత్తః స్వజనే క్రియతాం మనః||21.03||
నమాం ప్రార్థయితుం యుక్తం సుసిద్ధమివ పాపకృత్|

స|| మత్తః మనో నివర్తయ | స్వజనే మనః క్రియతాం | మాం ప్రార్థయితుం న యుక్తం పాపకృత్ సుసిద్ధమ్ ఇవ||

||శ్లోకార్థములు||

మత్తః మనో నివర్తయ -
నా నుంచి మనస్సును నివర్తించుకో
స్వజనే మనః క్రియతాం -
మనస్సును పరివారముపై ఉంచుకో
పాపకృత్ సుసిద్ధమ్ ఇవ -
పాపాత్ముడు సుసిద్ధిని కోరుచున్నట్లు
మాం ప్రార్థ యితుం న యుక్తం -
నువ్వు నన్ను కోరడము యుక్తముకాదు

||శ్లోకతాత్పర్యము||

" నా నుంచి మనస్సును నివర్తించుకో. నీ మనస్సును నీ పరివారముపై ఉంచుకో. నువ్వు నన్ను కోరడము, పాపాత్ముడు సుసిద్ధిని కోరడమే." ||21.03||

అప్పుడు సీత చెప్పిన మాట. "నివర్తయమనో మత్తః స్వజనే క్రియతాం మనః|"
" నా మీద నుంచి నీ మనస్సు మళ్ళించికో . నీ వారిపై మనస్సు మళ్ళించుకో"

"సాధుధర్మం అవేక్షస్మ సాధు సాధు వ్రతం చర|"
"రావణా ! సాధు ధర్మముల ను పాటించుము "

ఇది ఒక ఉపదేశము. సీత రావణునికి ఇచ్చిన ఉపదేశము. పరస్త్రీలను కాక్షించే పురుషులకి ఇది మహోపదేశము. పరమాత్మకు చెందిన ఆత్మని, తనదిగా భావించెడి జీవులకు చేయబడు జ్ఞానోపదేశము ఇది.

భగవంతునికి చెందిన సీతమ్మయే ఆత్మ. ఆ సీతమ్మను తనది గా చేసుకొనవలెనని రావణుని ప్రయత్నము. అది కాదు అని సీతమ్మ ఉపదేశము.

ఈ విధమైన తప్పుడు ఆలోచనలకు కారణము మనస్సు. ఆలా బంధము కలిగించేది మనస్సు. ఇది ( అంటే ఆత్మ) భగవానునిది. అనుభవింపచేయువాడు, అనిభవించువాడు భగవంతుడే. అటువంటి భావముతో వెళ్ళువారికి మనస్సు బంధముకాదు. అందుకే సీత రావణుని "నివర్తయ మనో బుద్ధి" అంటుంది. 'నీ మనస్సును నివర్తించుకో', అని.

||శ్లోకము 21.04||

అకార్యం న మయా కార్యం ఏకపత్న్యా విగర్హితమ్||21.04||
కులం సంప్రాప్తయా పుణ్యం కులే మహతి జాతయా|

స|| మహతి కులే జాతయా కులం సంప్రాప్తయా ఏకపత్న్యా మయా విగర్హితం అకార్యం న కార్యం ||

రామ టీకాలో- మహతి కులే జాతాయా అత ఏవ పుణ్యం కులం సంప్రాప్తయా వివాహిత విధినా, సంగతయా ఏకపత్న్యా పతివ్రతయేత్యర్థః , మయా విగర్హితమ్ పతివిరోధ్ల కర్తుకత్వేన నిన్దితం కార్యం కుత్సిత స్త్రీభిః కర్తవ్యం పూజనం , మయా అకార్యం న కారయితవ్యం|

||శ్లోకార్థములు||

మహతి కులే జాతయా -
మహత్తరమైన కులములో జన్మించి
కులం సంప్రాప్తయా -
మహత్తరమైన కులమును పొందిన
ఏకపత్న్యా మయా -
పతివ్రతనైన నాచేత
విగర్హితం అకార్యం న కార్యం -
విగర్హితమైన చేయతగని కార్యము చేయబడదు.

||శ్లోకతాత్పర్యము||

"మహత్తరమైన కులములో జన్మించి మహత్తరమైన కులమును పొందిన పతివ్రతను. నిందనీయమైన అకృత్యమైన కార్యము నాకు చేయబడని కార్యము".

||శ్లోకము 21.05||

ఏవముక్త్వా తు వైదేహీ రావణం తం యశస్వినీ||21.05||
రాక్షసం పృష్ఠతః కృత్వా భూయో వచనమబ్రవీత్|

స|| యశస్వినీ వైదేహీ తం రావణం ఏవం ఉక్త్వా రాక్షసం పృష్టతః కృత్వా భూయః వచనమ్ అబ్రవీత్||

||శ్లోకార్థములు||

యశస్వినీ వైదేహీ - యశస్వినీ అగు వైదేహి
తం రావణం ఏవం ఉక్త్వా -
ఆ రావణుని ఈ విధముగా చెప్పి
రాక్షసం పృష్టతః కృత్వా -
రాక్షసుని వేపునుంచి మరలి తిరుగుముఖముతో
భూయః వచనమ్ అబ్రవీత్ -
మరల ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"యశస్వినీ అగు వైదేహి ఆ రావణుని ఈ విధముగా చెప్పి తిరుగుముఖముతో మరల ఇట్లు పలికెను." ||21.05||

||శ్లోకము 21.06||

నాహ మౌపయికీ భార్యా పరభార్యా సతీ తవ||21.06||
సాధు ధర్మమవేక్షస్వ సాధు సాధు వ్రతం చర|

స|| పరభార్యా సతీ అహం ఔపయికీ భార్యా న |తవ ధర్మం సాధు అవేక్షస్వ|సాధువ్రతం సాధు చర||

||శ్లోకార్థములు||

పరభార్యా సతీ - నేను పరభార్యను. పతివ్రతను
అహం ఔపయికీ భార్యా న - నేను సాధకుడైన తత్త్వజ్ఞానికి తగినదానను. నీకు కాదు
తవ ధర్మం సాధు అవేక్షస్వ - నీ ధర్మమును పాటించుము
సాధువ్రతం సాధు చర - సాధువుల వ్రతము ఆచరింపుము.

||శ్లోకతాత్పర్యము||

"నేను పరభార్యను. పతివ్రతను. నేను సాధకుడైన తత్త్వజ్ఞానికి తగినదానను. నీకు కాదు. నీ ధర్మమును పాటించుము. సాధువుల వ్రతము ఆచరింపుము".||21.06||

||శ్లోకము 21.07||

యథా తవ తథాఽన్యేషాం దారా రక్ష్యా నిశాచర||21.07||
ఆత్మానముపమాం కృత్వా స్వేషుదారేషు రమ్యతాం|

స|| నిశాచర యథా తవ దారాః రక్ష్యాః తథా అన్యేషాం | ఆత్మానం ఉపమా కృత్వా స్వేషు దారేషు రమ్యతామ్||

తిలక టీకాలో కొంచెము విస్తృతముగా చెప్పబడినది - హే నిశాచర తవ దారాః యథా రక్ష్యాః తథా అన్యేషామపి రక్ష్యాః అతః అత్మానమ్ ఉపమా ఉపమానం కృత్వా
స్వేషు దారేష్యేవ రమ్యతాం అన్యదారానిరోధే మనో న కుర్విత్యర్థః|

||శ్లోకార్థములు||

నిశాచర - ఓ నిశాచర
యథా తవ దారాః రక్ష్యాః -
ఎలాగా నీ భార్యలు రక్షింపతగుదురో
తథా అన్యేషాం -
అలాగే ఇతరులభార్యలు కూడా (రక్షింపతగుదురు)
ఆత్మానం ఉపమా కృత్వా -
నిన్నే ఉదాహరణగా తీసుకొని
స్వేషు దారేషు రమ్యతామ్ -
నీ భార్యలతో రమింపుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ నిశాచర ! ఎలాగా నీ భార్యలు రక్షింపతగుదురో అలాగే ఇతరులభార్యలు కూడా రక్షింపతగుదురు. నిన్నే ఉదాహరణగా తీసుకొని నీ భార్యలతో రమింపుము." ||21.07||

అదే ఉపదేశ ధోరణిలో ఇంకో మాటచెపుతుంది. పరుని భార్యను అనుభవింపకోరిక కలిగినపుడు, "నాభార్యను ను వేరొకడు బలాత్కరించినచో ఏట్లువుండును" అని ఆలోచించుకొనవలెను. "తన భార్యను ఇతరుల వశముకాకుండా రక్షించు కొనవలెనని తాను ఎట్లు ప్రయత్నించునో , అట్లే ఇతరుల భార్యలు కూడా రక్షింపతగుదురు అని తలచి, నీవు నీ భార్యలతో రమించుము" ఆని. అదే సీతచెప్పిన మాట.

||శ్లోకము 21.08||

అతుష్టం స్వేషు దారేషు చపలం చలితేన్ద్రియః||21.08||
నయన్తి నికృతి ప్రజ్ఞం పరదారాః పరాభవమ్|

స|| స్వేషు దారేషు అతుష్టం చపలం చలితేన్ద్రియం నికృతిప్రజ్ఞం పరదారాః పరాభవం నయన్తి ||

||శ్లోకార్థములు||

స్వేషు దారేషు అతుష్టం -
తన భార్యలతో అసంతుష్టుడైన
చపలం చలితేన్ద్రియం -
చపలమైన ఇంద్రియములు కల
నికృతిప్రజ్ఞం పరదారాః -
దుష్టుడు ఇతరులభార్యలు ద్వారా
పరాభవం నయన్తి -
పరాభవింపబడతాడు

||శ్లోకతాత్పర్యము||

" తన భార్యలతో అసంతుష్టుడైన చపలమైన ఇంద్రియములు కలవాడు దుష్టుడు ఇతరులభార్యలు ద్వారా పరాభవింపబడతాడు". ||21.08||

"పరదారాః పరాభవం" అంటూ , పరస్త్రీలను కాక్షించువాడు ఆ పరస్త్రీలచే తప్పక పరాభవము పొందును అని కూడా, సీత ఉపదేశము.

ఇక్కడ మాతృమూర్తివలె ఎంత ఉదారముగా సీత ప్రవర్తించుచున్నదో చూడతగిన విషయము.

||శ్లోకము 21.09||

ఇహా సన్తో న వా సన్తి సతో వా నానువర్తసే||21.09||
తథా హి విపరీతా బుద్ధి రాచారవర్జితా|

స||ఇహ సంతః న వా సంతి |సతః అనువర్తసే న| తథా హి ఆచారవర్జితా తే బుద్ధిః విపరీతా ||

||శ్లోకార్థములు||

ఇహ సంతః న వా సంతి -
ఇక్కడ సద్బుద్ధి కలవారు లేరా
సతః అనువర్తసే న -
సత్పురుషులున్నా వారిని నీవు అనుసరించవేమో
తథా హి ఆచారవర్జితా -
అందువలనే శిష్టాచారములను వదిలి
తే బుద్ధిః విపరీతా -
నీ బుద్ధి విపరీతముగా వ్యవహరిస్తున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఇక్కడ సద్బుద్ధి కలవారు లేరా ? సత్పురుషులున్నా వారిని నీవు అనుసరించవేమో. అందువలనే నీ బుద్ధి శిష్టాచారములను వదిలి విపరీతముగా వ్యవహరిస్తున్నది ||21.09||

||శ్లోకము 21.10||

వచో మిథ్యా ప్రణీతాత్మా పథ్య ముక్తం విచక్షణైః||21.10||
రాక్షసానామభావాయ త్వం వా న ప్రతిపద్యసే|

స|| మిథ్యాప్రణీతాత్మా రాక్షసానాం అభవాయ త్వం విచక్షణైః ఉక్తం పథ్యం వచః న ప్రతిపద్యసే||

||శ్లోకార్థములు||

మిథ్యాప్రణీతాత్మా -
మిధ్యాప్రవచనములకొదిగిన
రాక్షసానాం అభవాయ -
రాక్షసుల వినాశముకొఱకు
త్వం విచక్షణైః ఉక్తం -
నీవు విచక్షణజ్ఞానము కలవారిచేత చెప్పబడిన మాటలు
పథ్యం వచః న ప్రతిపద్యసే -
మంచి మాటలను తిరస్కరిస్తున్నావు

||శ్లోకతాత్పర్యము||

"మిధ్యాప్రవచనములకొదిగిన నీకు రాక్షసుల వినాశముకొఱకు విచక్షణాపూర్వకమైన మాటలు నచ్చుటలేదు". ||21.10||

||శ్లోకము 21.11||

అకృతాత్మాన మాసాద్య రాజానమనయేరతమ్||21.11||
సమృద్ధాని వినశ్యన్తి రాష్ట్రాణి నగరాణి చ|

స|| అకృతాత్మానం అనయే రతం రాజానం ఆసాద్య సమృద్ధాని రాష్ట్రాని నగరాణి చ వినశ్యంతి||

||శ్లోకార్థములు||

అకృతాత్మానం అనయే రతం - చేయకూడని పనులపై ఆసక్తికల
రాజానం ఆసాద్య - రాజుని పొందిన పరిపాలనలో
సమృద్ధాని రాష్ట్రాని - సమృద్ధమైన రాష్ట్రములు
నగరాణి చ వినశ్యంతి - నగరములు కూడా నశించిపోతాయి

||శ్లోకతాత్పర్యము||

"చేయకూడని పనులపై ఆసక్తికల రాజుల పరిపాలనలో సమృద్ధమైన రాష్ట్రములు నగరములు కూడా నశించిపోతాయి." ||21.11||

సీత చెప్పిన మాట. "ఇక్కడ సద్బుద్ధి కలవారు లేరా ?. సత్పురుషులున్నా వారిని నీవు అనుసరించవేమో.అందువలనే నీ బుద్ధి శిష్టాచారములను వదిలి విపరీతముగా వ్యవహరిస్తున్నది."

రాజు శిష్టాచారము పాలించకపోతే కలిగే నష్టముకూడా సీత చెపుతుంది. "చేయకూడని పనులపై ఆసక్తి కల రాజుల పరిపాలనలో, సమృద్ధమైన రాష్ట్రములు, నగరములు కూడా నశించిపోతాయి. అలాగే రత్న సంకులములతో వున్నఈ లంక, నీ అపరాధము వలన త్వరలో నే నశించిపోవును. ఈ విధముగా పాపకర్మలు చేసిన నీవు నశించినప్పుడు, నీ వలన కష్టపడినవారందరూ 'ఈ రౌద్రుడి వినాశము కలిగినది' అని సంతోషిస్తారు".

||శ్లోకము 21.12||

తథేయం త్వాం సమాసాద్య లఙ్కారత్నౌఘ సంకులా||21.12||
అపరాధాత్తవైకస్య న చిరా ద్వినశిష్యతి|

స|| తథా త్వాం సమసాద్య రత్నౌఘసంకులా ఇయం లంకా ఏకస్య తవ అపరాధాత్ న చిరాత్ వినశిష్యతి||

||శ్లోకార్థములు||

తథా త్వాం సమసాద్య - అలాగే నిన్ను పొందిన
రత్నౌఘసంకులా ఇయం లంకా - రత్న సంకులములతో వున్నఈ లంక
ఏకస్య తవ అపరాధాత్ - నీ ఒక అపరాధము వలన
న చిరాత్ వినశిష్యతి - త్వరలో నే నశించిపోవును

||శ్లోకతాత్పర్యము||

"అలాగే నీ వలన రత్న సంకులములతో వున్నఈ లంక నీ ఒక అపరాధము వలన త్వరలో నే నశించిపోవును." ||21.12||

||శ్లోకము 21.13||

స్వకృతైర్హన్యమానస్య రావణా దీర్ఘదర్శినః||21.13||
అభినన్దన్తి భూతాని వినాశే పాపకర్మణః|

స|| రావణ అదీర్ఘదర్శనః స్వకృతైః హన్యమానస్య పాపకర్మణః వినాసే భూతాని అభినందంతి ||

||శ్లోకార్థములు||

రావణ - ఓ రావణా
అదీర్ఘదర్శనః - దూరదృష్ఠిలేని
స్వకృతైః హన్యమానస్య - తను చేసిన కర్మలవలనే చనిపోయిన
పాపకర్మణః వినాశే - పాపాత్ముడు నాశనము పొందినప్పుడు
భూతాని అభినందంతి - సమస్త ప్రాణులు సంతోషపడెదరు

||శ్లోకతాత్పర్యము||

"ఓ రావణా, తను చేసిన కర్మలవలనే నాశనమైన దూరదృష్ఠిలేని పాపాత్ముడు నాశనము పొందినప్పుడు సమస్త ప్రాణులు సంతోషపడెదరు." ||21.13||

||శ్లోకము 21.14||

ఏవం త్వాం పాపకర్మాణం వక్ష్యన్తి నికృతా జనాః||21.14||
దిష్ట్యైతత్ వ్యసనం ప్రాప్తో రౌద్ర ఇత్యేవ హర్షితాః |

స|| నికృతాః జనాః ఏవం రౌద్రః పాపకర్మాణం త్వాం హర్షితాః | దిష్ట్యాఏతత్ వ్యసనం ప్రాప్తః ఇత్యేవ వక్ష్యంతి||

||శ్లోకార్థములు||

ఏవం పాపకర్మాణం త్వాం -
ఈ విధముగా పాపకర్మలు చేసిన నిన్ను
రౌద్రః దిష్ట్యాఏతత్ వ్యసనం ప్రాప్తః -
అదృష్టవశాత్తు ఈ రౌద్రుడి వినాశము కలిగినది
ఇత్యేవ నికృతాః జనాః -
ఈ విధముగా కష్టపడిన జనులు
హర్షితాః వక్ష్యంతి -
సంతోషముతో చెప్పుకొనెదరు

||శ్లోకతాత్పర్యము||

" ఈ విధముగా పాపకర్మలు చేసిన నీవు నశించినప్పుడు, 'అదృష్టవశాత్తు ఈ రౌద్రుడి వినాశము కలిగినది' అని నీ వలన కష్టపడినవారందరూ 'అని సంతోషముతో చెప్పుకొనెదరు ". ||21.14||

||శ్లోకము 21.15||

శక్యా లోభయితుం నాహమ్ ఐశ్వర్యేణ ధనేన వా||21.15||
అనన్యా రాఘవేణాహం భాస్కరేణ ప్రభా యథా|

స|| అహం ఐశ్వర్యేణ ధనేన వా లోభయితుం న శక్యా | ప్రభా భాస్కరేణ యథా అహం రాఘవేణ అనన్యా||

||శ్లోకార్థములు||

అహం ఐశ్వర్యేణ ధనేన వా -
నేను ఐశ్వర్యముతో కాని ధనముతో కాని
లోభయితుం న శక్యా -
లోభములో పడుదాననుకాను
ప్రభా భాస్కరేణ యథా -
సూర్యునికాంతి సూర్యునినుంచి వేరుకాని రీతిలో
అహం రాఘవేణ అనన్యా -
నేను రాఘవును నుండి వేరుకాను

||శ్లోకతాత్పర్యము||

" నేను ఐశ్వర్యముతో కాని ధనముతో కాని లోభములో పడను. సూర్యునికాంతి సూర్యునినుంచి వేరుకాని రీతిలో నేను రాఘవును నుండి వేరుకాను." ||21.15||

"శక్యా లోభయితుం నాహం ఐశ్వర్యేణ ధనేన వా"అంటూ "ధనము ఐశ్వర్యములతో నన్ను ప్రలోభము చేయడానికి శక్యముకాదు" అని చెపుతున్నప్పుడు, అలాగే "భాస్కరేణ ప్రభా యథా" అంటే "సూర్యుని తో కాంతి లాగా", తను రాఘవునితో వుండునని చెపుతున్నప్పుడు,తాను భగవంతునితో కలిసిఉండే లక్ష్మిని అని ధ్వని వినిపిస్తుంది.

రాముడే పరమాత్మ, తను (సీత) ఆయనతో కలిసివుండే లక్ష్మి అని ధ్వని.

ఇలాగ ఉపదేశ ధోరణిలో సీత రావణుడికి చెపుతున్న మాటలలో, మనకి వినిపించేది ఇంకోమాట.

భగవత్ ప్రాప్తిని కాంక్షించు జీవుడు, విషయభోగములు లాంటి లాటరీలు ఎదురుగా వచ్చి లోభ పెట్టుచున్నప్పుడు వాటికి వశపడక, తలచదగిన భావనలను ఇక్కడ సీత ఉపదేశించుచున్నది అన్నమాట.

పరమాత్మకే చెంది , పరమాత్మచేతనే రక్షింపబడి, పరమాత్మచేతనే అనుభవింపబడ తగిన ఆత్మ , ఐశ్వర్యమునకు ధనమునకు వశపడి, భగవానునికి దూరమై మనస్సుకి వశము అగుటకన్నా అవివేకము లేదు అని వినిపించేది ఇంకొమాట.

||శ్లోకము 21.16||

ఉపధాయ భుజం తస్య లోకనాథస్య సత్కృతమ్||21.16||
కథం నామోపధాస్యామి భుజమన్యస్య కస్యచిత్||

స|| లోకనాథస్య తస్య సత్కృతం భుజం ఉపధాయ అన్యస్య కస్య చిత్ భుజం కథం నామ ఉపధాస్యామి ||

||శ్లోకార్థములు||

లోకనాథస్య తస్య -
లోకనాథుడైన ఆయన యొక్క
సత్కృతం భుజం ఉపధాయ -
సత్కర్మలు ఒనరించిన భుజమును ఆశ్రయించిన
అన్యస్య కస్య చిత్ భుజం -
ఇంకొకరి భుజమును ఏట్లు
కథం నామ ఉపధాస్యామి -
ఎట్లు ఆశ్రయించగలను

||శ్లోకతాత్పర్యము||

"లోకనాథుడైన ఆయన యొక్క సత్కర్మలు ఒనరించిన భుజమును ఆశ్రయించిన నేను ఇంకొకరి భుజమును ఏట్లు ఆశ్రయించగలను? ||21.16||

||శ్లోకము 21.17||

అహ మౌపయికీ భార్యా తస్యైవ వసుధాపతేః||21.17||
వ్రతస్నాతస్య ధీరస్య విద్యేవ విదితాత్మనః|

స|| వ్రతస్నాతస్య విదితాత్మనః విప్రస్య విద్యా ఇవ అహం వసుధాపతేః తస్యైవ ఔపయికీ భార్యా ||

||శ్లోకార్థములు||

వ్రతస్నాతస్య విదితాత్మనః -
వ్రతస్నాతములు చేసిన ఆత్మనెరిగిన
విప్రస్య విద్యా ఇవ -
విప్రుని విద్యా సంపద వలే
అహం వసుధాపతేః -
నేను ఆ వసుధాధిపతి యొక్క
తస్యైవ ఔపయికీ భార్యా -
ఆయనకే తగిన భార్యను

||శ్లోకతాత్పర్యము||

"వ్రతస్నాతములు చేసిన ఆత్మనెరిగిన విప్రుని విద్యా సంపదవలే నేను ఆ వసుధాధిపతికి మాత్రమే తగిన భార్యను". ||21.17||

తిలక టీకాలో - ఔపయికీ భార్యా - అన్నమాటకి విస్తృతం గా వివరించారు ఇలాగ - ఔపయికీ యోగ్యా| వ్రతస్నాతస్య బ్రహ్మచర్య వ్రతపూర్వకం కృతసమావర్తనస్య మత్పాణిగ్రహణం కృతవతో విదితాత్మనో జ్ఞాతః తత్త్వస్య జ్ఞాత పురుషార్థ సాధనస్య అ తస్యైవ అహం యోగ్యా| విప్రస్య విద్యేవ బ్రహ్మ విద్యా యథా బ్రహ్మణస్యైవ అసాధారణం స్వం న్యాయప్రాప్తం తద్వత్ సన్యాసే తస్యైవ అధికారాత్ బ్రహ్మ విద్యాయాం బ్రాహ్మణస్యైవ అధికారః ఇతి భావః|

ఔపయికీ భార్యా అంటే వ్రతస్నానములు చేసి, బ్రహ్మచర్యము పాటించిన తరువాత పాణిగ్రహణము చేసిన, తత్త్వము యొక్క జ్ఞానము తెలిసిన , పురుషార్థములు అన్నింటిని సాధన చేయుచున్న అతనికే తగిన దానను అని. ఇక్కడ ఉపమానము బ్రహ్మవిద్య అసాధారణ సాధనచేసిన బ్రాహ్మణునికే తగినట్లు సీతమ్మ ఆత్మనెరిగిన, పురుషార్థములు అన్నింటిని సాధన చేయుచున్న రామునికే తగును అని

||శ్లోకము 21.18||

సాధు రావణ రామేణ మాం సమానయ దుఃఖితామ్||21.18||
వనే వాశితయా సార్థం కరేణ్వేవ గజాధిపమ్|

స|| రావణ దుఃఖితాం మామ్ గజాధిపం వనే వాశితయా కరేణ్వేవ రామేణ సార్ధం సాధు సమానయ||

||శ్లోకార్థములు||

రావణ - ఓ రావణా
దుఃఖితాం మామ్ -
దుఃఖములో నున్న నన్ను
గజాధిపం వనే వాశితయా కరేణ్వేవ -
దారికోల్పోయిన ఆడ ఏనుగును గజాధిపుని తో
రామేణ సార్ధం సాధు సమానయ -
రామునితో కలుపుట సాధు కార్యము

||శ్లోకతాత్పర్యము||

" ఓ రావణా వనములో నున్న దారికోల్పోయిన ఆడ ఏనుగును గజాధిపుని తో కలిపిన రీతిగా దుఃఖములో నున్న నన్ను రామునితో కలుపుట సాధు కార్యము. ||21.18||

||శ్లోకము 21.19||

మిత్రమౌపయికం కర్తుం రామః స్థానం పరీప్సతా||21.19||
వధం చానిచ్ఛతా ఘోరం త్వయాఽసౌ పురుషర్షభః|

స|| స్థానం పరీప్సితా ఘోరం వధం అనిచ్ఛతా త్వయా అసౌ పురుషర్షభః రామః మిత్రం కర్తుం ఔపయికం||

||శ్లోకార్థములు||

స్థానం పరీప్సితా -
స్థానమును రక్షింపకొన గోరితే
ఘోరం వధం అనిచ్ఛతా -
ఘోరమైన వధను కోరని
అసౌ పురుషర్షభః రామః -
పురుషోత్తముడగు రామునితో
త్వయా మిత్రం కర్తుం ఔపయికం -
నీ చేత మిత్రత్వమే చేయుటయే యుక్తము

||శ్లోకతాత్పర్యము||

"స్థానమును రక్షింపకొన గోరితే ఘోరమైన వధను తప్పించుకొన గోరితే పురుషోత్తముడగు రామునితో మిత్రత్వమే నీకు యుక్తము". ||21.19||

||శ్లోకము 21.20||

విదితః స హి ధర్మజ్ఞః శరణాగతవత్సలమ్||21.20||
తేన మైత్రీ భవతు తే యది జీవితు మిచ్ఛసి|

స|| ధర్మజ్ఞః సః శరణాగతవత్సలః (ఇతి) విదితః హి| యది తే జీవితుం ఇచ్ఛసి తేన మైత్రీ భవతు||

||శ్లోకార్థములు||

ధర్మజ్ఞః సః శరణాగతవత్సలః -
ధర్మజ్ఞుడగు ఆయన శరణాగతులపై వాత్సల్యము కలవాడు
(ఇతి) విదితః హి - అది తెలిసినదే
యది తే జీవితుం ఇచ్ఛసి -
జీవించకోరిక ఉంటే
తేన మైత్రీ భవతు -
అట్టి రామునితో మైత్రి చేయుము

||శ్లోకతాత్పర్యము||

" ధర్మజ్ఞుడగు రాముడు శరణాగతులపై వాత్సల్యము కలవాడు. జీవించకోరిక ఉంటే అట్టి రామునితో మైత్రి చేయుము." ||21.20||

నిజానికి ఆ గడ్డిపోచచే పరుగెత్తించబడి చివరికి రామునే శరణు కోరిన వాయసము వలె, రావణుడు కూడా రాముని శరణాగతి కోర వలసిన వాడు.

అట్టి దురభిమాని "శరణాగతి" కోరమంటే అహంకరించి తిరస్కరించునేమో అని ,
ఒక మాతృమూర్తి భావనతో తల్లి పిల్లవానికి నచ్చచెప్పినట్లు , "తేన మైత్రీ భవతు" అంటూ రామునితో మైత్రి చేసికొనమని సీత రావణునితో చెప్పును.

గోవిన్దరాజులవారు ఇదేమాట తమ టీకాలో చెపుతారు.- ఏవం రావణే జననీత్వప్రతిపత్తిం విహాయ కానిచిదసఙ్గతాని జల్పతి దేవీ ఖిన్నాసతీ కోఽయమస్య స్వభావః కథం అస్యకోపి ఉపదేష్టాసేత్ అస్య ఇతి ఇహ సన్తాం న వా సన్తీత్యాదినా విచిన్త్య దయావతీ స్వయమ్ ఉపదేశతి మాతృవత్ ప్రయుక్తవాత్సల్యేన మిత్రం ఇతి| రామం శరణం గచ్ఛేత్ ఇతి యుక్తే తత్ రావణః న సహేత్ దుర్మానితయా , ఆత్మానం సద్బుధ్యనుసారేణ మిత్రం ఇతి ఆహ|

మైత్రి అంటే ఇద్దరూ సమానులే అన్నభావన వచ్చును. కనక రావణునికి అంగీకారముగా వుండునని సీతమ్మభావన. కాని అది కూడా కుదరని మాట రావణునికి.

"తేన మైత్రీ భవతు తే యది జీవితుమిచ్చసి" అంటే జీవించాలనే కోరిక ఉంటే రామునితో మైత్రి చేసుకొనుము" అని.

ఆ మాటలో ఇంకో విషయము వుంది.

మనము శరీరముతో ఉండి కదలుట మాత్రమే జీవించుట అనుకుంటాము.
అది జీవించడము కాదు.

శరీరము ఆత్మను వీడకుండా ఉండుట జీవనము.ఈ బాహ్యశరీరము ఆత్మను వీడకుండా ఉండుట జీవనము.శరీరమునకు ఆత్మ ఎట్లో, ఆత్మకు పరమాత్మ అట్లే ఆత్మయై వుండును. ఆ పరమాత్మతో దూరముకాకుండా కలిసియుండుట యదార్థముగా జీవించుట. అట్టి జీవనము కోరినచో పరమాత్మతో మైత్రితో యుండవలెనని సీత ఉపదేశము.

మరి ఇంతద్రోహము చేసిన వానితో మైత్రికి రాముడు అంగీకరించునా అన్న విషయము కూడా సీత చెపుతుంది. రాముడు "విదితః ధర్మజ్ఞః శరణాగత వత్సలః" అంటూ, "ప్రసాదయస్వ త్వం చైనం శరణాగతవత్సలమ్" అంటుంది
అంటే దోషములున్నాకాని "శరణు కోరినవారిని అనుగ్రహించే రాముని ప్రసన్నుని చేసికో" అని.

||శ్లోకము 21.21||

ప్రసాదయస్వ త్వం చైనం శరణాగతవత్సలమ్||21.21||
మాం చాస్మై ప్రయతో భూత్వా నిర్యాతయితుమర్హసి|

స|| త్వం శరణాగతవత్సలం ఏనం ప్రసాదయస్వ చ| నియతః భూత్వా మామ్ అస్మై నిర్యాతయితుం అర్హసి ||

||శ్లోకార్థములు||

త్వం శరణాగతవత్సలం -
నీవు శరణాగత వత్సలుడైన
ఏనం ప్రసాదయస్వ చ -
ఆయనను (రాముని) ప్రసన్నుడిగా చేసికొనుము
నియతః భూత్వా -
నియతమైన కర్మలను చేస్తూ
మామ్ అస్మై నిర్యాతయితుం అర్హసి -
నన్ను ఆయనకు అప్పగించుట తగును

||శ్లోకతాత్పర్యము||

" శరణాగత వత్సలుడైన రాముని ప్రసన్నుడిగా చేసికొనుము. నియతమైన కర్మలను చేస్తూ నన్ను ఆయనకు అప్పగించుము". ||21.21||

||శ్లోకము 21.22||

ఏవం హి తే భవేత్స్వస్తి సంప్రదాయ రఘూత్తమే||21.22||
అన్యథా త్వం హి కుర్వాణో వధం ప్రాప్స్యసి రావణ|

స|| ఏవం రఘూత్తమే సంప్రదాయ తే స్వస్తిః భవేత్ | అన్యథా కుర్వాణః రావణ త్వం వధం ప్రాప్స్యసి||

||శ్లోకార్థములు||

ఏవం రఘూత్తమే సంప్రదాయ -
ఈ విధముగా రఘోత్తమునికి నన్ను అప్పగిస్తే
తే స్వస్తిః భవేత్ -
నీకు శుభము కలుగును
అన్యథా కుర్వాణః -
అలాగ ప్రవర్తించక పోతే
రావణ త్వం వధం ప్రాప్స్యసి -
నీవు మరణము తప్పక పొందెదవు

||శ్లోకతాత్పర్యము||

" ఈ విధముగా రఘోత్తమునికి నన్ను అప్పగిస్తే నీకు శుభము కలుగును. అలాగ ప్రవర్తించక పోతే నీవు మరణము తప్పక పొందెదవు ||21.22||

||శ్లోకము 21.23||

వర్జయేత్ వజ్ర ముత్సృష్టం వర్జయే దన్తకశ్చిరమ్||21.23||
తద్విధం తు న సంక్రుద్ధో లోకనాథః స రాఘవః|

స|| తద్విధం ఉత్సృష్టం వజ్రం వర్జయేత్ చిరం అంతకః వర్జయేత్ | సమ్కృద్ధః లోకనాథః సః రాఘవః న ( వర్జయేత్)||

||శ్లోకార్థములు||

ఉత్సృష్టం వజ్రం వర్జయేత్ -
ఎత్తిన వజ్రాయుధమును తప్పించుకొనగలవేమో
చిరం అంతకః వర్జయేత్ -
యముడు నిన్ను చరకాలము విడువవచ్చునేమో
సమ్కృద్ధః లోకనాథః -
లోకనాధుడైన క్రుద్ధుడైన
తద్విధం సః రాఘవః న ( వర్జయేత్) -
రాఘవుడు మాత్రము నిన్నుఆ విధముగా వదలడు.

||శ్లోకతాత్పర్యము||

"ఎత్తిన వజ్రాయుధమును తప్పించుకొనగలవేమో , యముడు నిన్ను చరకాలము విడువవచ్చునేమో, కాని లోకనాధుడైన క్రుద్ధుడైన రాఘవుడు మాత్రము నిన్ను వదలడు. ||21.23||

||శ్లోకము 21.24||

రామస్య ధనుషశ్శబ్దం శ్రోష్యసి త్వం మహాస్వనమ్||21.24||
శతక్రతువిసృష్టస్య నిర్ఘోషమశనేరివ|

స||శతక్రతువిసృష్టస్య అశనేః నిర్ఘోషం ఇవ రామస్య ధనుషః మహాస్వనమ్ శబ్దం త్వం శ్రోష్యసి||

||శ్లోకార్థములు||

శతక్రతువిసృష్టస్య -
శతక్రతువులు చేసిన దేవేంద్రునిచే ప్రయోగించిన
అశనేః నిర్ఘోషం ఇవ -
వజ్రాయుధము యొక్క శబ్దములాగా
రామస్య ధనుషః మహాస్వనమ్ -
రాముని ధనస్సు యొక్క ధనుష్టాంకార
శబ్దం త్వం శ్రోష్యసి -
శబ్దము నీవు త్వరలోనే వినగలవు

||శ్లోకతాత్పర్యము||

"శతక్రతువులు చేసిన దేవేంద్రునిచే ప్రయోగించిన వజ్రాయుధము యొక్క శబ్దములాగా రాముని ధనస్సు యొక్క మహాధ్వనిని త్వరలోనే వినగలవు". ||21.24||

||శ్లోకము 21.25||

ఇహ శీఘ్రం సుపర్వాణో జ్వలితాస్య ఇవోరగాః||21.25||
ఇషవో నిపతిష్యన్తి రామలక్ష్మణ లక్షణాః|

స|| సుపర్వాణః శీఘ్రం జ్వలితస్యాః ఉరగాః ఇవ రామలక్ష్మణలక్షణాః ఇషవః ఇహ నిపతిష్యంతి||

||శ్లోకార్థములు||

సుపర్వాణః జ్వలితస్యాః ఉరగాః ఇవ -
మంటలు కక్కుతున్న మహాసర్పములవలెఉన్న
శీఘ్రం రామలక్ష్మణ లక్షణాః -
త్వరలో రామలక్ష్మణుల నామాంకితములైన
ఇషవః ఇహ నిపతిష్యంతి -
బాణములు ఇక్కడ పడగలవు

||శ్లోకతాత్పర్యము||

"మంటలు కక్కుతున్న మహాసర్పములవలెఉన్న రామలక్ష్మణుల నామాంకితములైన బాణములు ఇక్కడ పడగలవు." ||21.25||

||శ్లోకము 21.26||

రక్షాంసి పరినిఘ్నన్తః పుర్యామస్యాం సమన్తతః||21.26||
అసంపాతం కరిష్యన్తి పతన్తః కఙ్కవాససః|

స|| కంకవాససః పతంతః అస్యాం పుర్యాం సమంతతః రక్షాంసి పరినిఘ్నంతః అసంపతాం కరిష్యంతి ||

||శ్లోకార్థములు||

కంకవాససః పతంతః -
గ్రద్ద రెక్కలు కలిగిన బాణములు
అస్యాం పుర్యాం సమంతతః -
ఈ నగరము మీద అంతా పడుచూ
రక్షాంసి పరినిఘ్నంతః -
రాక్షసులను చంపి
అసంపతాం కరిష్యంతి -
నగరమును ధ్వంసము చేయును

||శ్లోకతాత్పర్యము||

"గ్రద్ద రెక్కలు కలిగిన బాణములు ఈ నగరము మీద అంతా పడుచూ రాక్షసులను చంపి నగరమును ధ్వంసము చేయును." ||21.26||

||శ్లోకము 21.27||

రాక్షసేంద్ర మహాసర్పాన్ స రామగరుడో యథా||21.27||
ఉద్ధరిష్యతి వేగేన వైనతేయ ఇవోరగాన్|

స|| మహాన్ సః రామగరుడః రాక్షసేంద్ర మహాసర్పాన్ వైనతేయః ఉరగాన్ ఇవ వేగేన ఉద్ధరిష్యతి||

||శ్లోకార్థములు||

మహాన్ సః రామగరుడః -
మహాత్ముడైన రాముడనే గరుత్మంతుడు
రాక్షసేంద్ర మహాసర్పాన్ -
రాక్షసులనే మహాసర్పములను
వైనతేయః ఉరగాన్-
వైనతేయుడు సర్పములను
ఇవ వేగేన ఉద్ధరిష్యతి -
హరించిన విధముగా హరించును

||శ్లోకతాత్పర్యము||

"మహాత్ముడైన రాముడనే గరుత్మంతుడు రాక్షసులనే మహాసర్పములను వైనతేయుడు సర్పములను హరించిన విధముగా హరించును. ||21.27||

||శ్లోకము 21.28||

అపనేష్వతి మాం భర్తా త్వత్తః శీఘ్రమరిన్దమః||21.28||
అసురేభ్యః శ్రియం దీప్తాం విష్ణుస్త్రిభిరివ క్రమైః|

స|| శీఘ్రం అరిందమః భర్తా మామ్ త్వత్తః విష్ణుః త్రిభీ క్రమైః దీప్తం శ్రియం అసురేభ్యః ఇవ అపనేష్యతి||

||శ్లోకార్థములు||

శీఘ్రం అరిందమః -
త్వరలో శత్రువినాశకుడైన
భర్తా మామ్ త్వత్తః -
నా భర్త నన్ను నీ దగ్గరనుంచి
విష్ణుః త్రిభీ క్రమైః -
విష్ణువు మూడడుగులు వేసి
దీప్తం శ్రియం అసురేభ్యః ఇవ -
వెలుగుతున్న లక్ష్మిని అసురలనుంచి తీసుకుపోయినట్లు
అపనేష్యతి - తీసుకుపోగలడు

||శ్లోకతాత్పర్యము||

"వెలుగుతున్న లక్ష్మిని అసురలనుంచి తీసుకుపోయినట్లు త్వరలో శత్రువినాశకుడైన నా భర్త నన్ను నీ దగ్గరనుంచి తీసుకుపోగలడు". ||21.28||

||శ్లోకము 21.29||

జనస్థానే హతస్థానే నిహతే రక్షసాం బలే||21.29||
అశక్తేన త్వయా రక్షః కృత మేతదసాధు వై |

స|| రక్షసాం బలే నిహతే జనస్థానే హతస్థానే రక్షః అశక్తేన త్వయా ఏతత్ అసాధు కృతం వై||

||శ్లోకార్థములు||

రక్షసాం బలే జనస్థానే నిహతే -
రాక్షసుల బలము జనస్థానములో హతమార్చబడగా ంతకాలంహతస్థానే అశక్తేన - హతమార్చబడిన స్థలములో అశక్తుడవై
రక్షః త్వయా - ఓ రాక్షసా నీ చేత
ఏతత్ అసాధు కృతం వై -
ఈ దుష్ట కర్మ చేయబడినది

||శ్లోకతాత్పర్యము||

" రాక్షసుల బలము జనస్థానములో హతమార్చబడగా అశక్తుడవై నీవు ఈ అసాధు కర్మకి పాలుపడ్డావు. ||21.29||

||శ్లోకము 21.30||

ఆశ్రమం తు తయోః శూన్యం ప్రవిశ్య నరసింహయోః||21.30||
గోచరం గతయోర్భ్రాత్రోః అపనీతా త్వయాఽధమా|

స|| అథమ నరసింహయోః తయోః భ్రాత్రోః గోచరం గతయోః శూన్యం ఆశ్రమం ప్రవిశ్య త్వయా అపనీతాః ||

||శ్లోకార్థములు||

అథమ నరసింహయోః తయోః భ్రాత్రోః -
ఓ అధముడా! నరసింహులగు ఆ అన్నదమ్ములు
గోచరం గతయోః -
ఇద్దరూ లేనప్పుడు
శూన్యం ఆశ్రమం ప్రవిశ్య-
శూన్యముగా వున్న ఆశ్రమములో ప్రవేశించి
త్వయా అపనీతాః -
నీ చేత అపహరింపబడినాను

||శ్లోకతాత్పర్యము||

"ఓ అధముడా! నరసింహులగు ఆ అన్నదమ్ములు ఇద్దరూ లేనపుడు, శూన్యముగా వున్న ఆశ్రమములో ప్రవేశించిన నీ చేత అపహరింపబడినాను". ||21.30||

||శ్లోకము 21.31||

నహి గ్రన్ధముపాఘ్రాయ రామలక్ష్మణయోస్త్వయా||21.31||
శక్యం సందర్శనే స్థాతుమ్ శునా శార్దూలయోరివ|

స|| శునా శార్దూలయోరివ రామలక్ష్మణయోః గంధం ఉపఘ్రాయ త్వయా సందర్శనే స్థాతుం న శక్యం హి ||

||శ్లోకార్థములు||

శునా శార్దూలయోరివ -
కుక్క పెద్దపులుల లాగ
రామలక్ష్మణయోః గంధం ఉపఘ్రాయ - రామలక్ష్మణుల వాసనలు గ్రహించి
త్వయా సందర్శనే స్థాతుం - వారి ముందరనిలబడడానికి నీకు
న శక్యం హి - శక్తి లేని వాడవు

||శ్లోకతాత్పర్యము||

"కుక్క పెద్దపులుల లాగ రామలక్ష్మణుల వాసనలు గ్రహించి వారి ముందర నిలబడడానికి శక్తి లేని వాడవు. ||21.31||

||శ్లోకము 21.32||

తస్య తే విగ్రహే తాభ్యాం యుగ గ్రహణ మస్థిరమ్||21.32||
వృత్రస్యేవేన్ద్రబాహూభ్యాం బాహోరేకస్య నిగ్రహః|

స|| తస్య తాభ్యాం విగ్రహే ఇంద్రబాహుభ్యాం వృత్రస్య ఏకస్య బాహోః విగ్రహే ఇవ యుగగ్రహణం అస్థిరం||

||శ్లోకార్థములు||

ఇంద్రబాహుభ్యాం -
ఇంద్రుని రెండు బాహువులతో
అస్థిరం ఏకస్య బాహోః -
నిలబడలేని ఒక బాహువు కల
వృత్రస్య విగ్రహే ఇవ -
వృత్తాసురుని విగ్రహము వలె
తస్య తాభ్యాం విగ్రహే -
వారిద్దరితో యుద్ధములో
యుగగ్రహణం -
నిలబడ లేవు

||శ్లోకతాత్పర్యము||

"ఒకే బాహువుకల వృత్తాసురుడు ఇంద్రుని బాహువులకు పోరులో ఎదురాడ లేక పోయినట్లు, వారిద్దరి ముందూ నువ్వు నిలబడలేవు. ||21.32||

||శ్లోకము 21.33||

క్షిప్రం తవ సనాథో మే రామ స్సౌమిత్రిణా సహ|
తోయమల్పమివాదిత్యః ప్రాణానాదాస్యతే శరైః||21.33||

స|| మే నాథః సః రామః సౌమిత్రిణా సహ ఆదిత్యః అల్పం తోయమివ శరైః తవ ప్రాణాన్ క్షిప్రం దాస్యతే||

||శ్లోకార్థములు||

మే నాథః - నా నాధుడు
సః రామః సౌమిత్రిణా సహ -
శ్రీరాముడు సౌమిత్రి తో
ఆదిత్యః అల్పం తోయమివ -
సూర్యుడు చిన్న తటాకములోని నీరు హరించినట్లు
శరైః తవ ప్రాణాన్ -
బాణములతో నీ శక్తిని
క్షిప్రం దాస్యతే -
క్షణములో హరించివేయును

||శ్లోకతాత్పర్యము||

"సూర్యుడు చిన్న తటాకములోని నీరు హరించినట్లు నా నాధుడు ఆగు శ్రీరాముడు సౌమిత్రి తో సహా నీ శక్తిని క్షణములో హరించివేయును".||21.33||

||శ్లోకము 21.34||

గిరిం కుబేరస్య గతోఽపధాయ వా
సభాం గతో వా వరుణస్య రాజ్ఞః |
అసంశయం దాశరథేర్నమోక్ష్యసే
మహాద్రుమః కాలహతోఽశనేరివ||21.34||

స|| కాలహతః కుబేరస్య గిరిం వా ఆలయం గతః రాజ్ఞః వరుణస్య సభామ్ గతః మహాద్రుమః అశనైరివ దాశరథేః న మోక్ష్యసే||

||శ్లోకార్థములు||

కాలహతః కుబేరస్య -
కాలహతుడవై కుబేరుని
గిరిం వా ఆలయం గతః -
పర్వతముకు గాని ఆలయమునకు పోయినా
రాజ్ఞః వరుణస్య సభామ్ గతః -
రాజు వరుణుని సభలో దాగినా
మహాద్రుమః అశనైరివ -
పిడుగు పడిన మహావృక్షము వలె
దాశరథేః న మోక్ష్యసే -
రాముని బాణములనుండి తప్పించుకొనలేవు

||శ్లోకతాత్పర్యము||

"కాలహతుడవై కుబేరుని ఆలయమునకు పోయినా వరుణుని సభలో దాగినా, కైలాస పర్వతము పోయినా పిడుగు పడిన మహావృక్షము వలె రాముని బాణములనుండి తప్పించుకొనలేవు".||21.34||

ఈ శ్లోకముతో సీతమ్మ వారి ఉపదేశముతో కూడిన ప్రత్యుత్తరము సమాప్తము అవుతుంది.

ఈ సర్గలో సీతమ్మయొక్క వాత్సల్య పూరిత మాతృస్వభావము చూస్తాము.

దోషములను భోగ్యముగా అనుభవింపతగినవి అని తీసుకొనుటయే వాత్సల్యము.
కాస్త నలిగిన గడ్డిని కూడా విడిచిపెట్టే ఆవు, తాను ఈనిన దూడ ఒడలిఅందలి మాలిన్యమును రుచ్యముగా భుజించును. అదే వాత్సల్యము. తల్లి బిడ్డల దోషములను పక్కకి తీసి బిడ్డలను చేరదీయటమే వాత్సల్యము.

మనము కూడా రావణుని వలే భగవంతునికి ఆగ్రహము కలిగించు అపరాధములను ఎన్నో చేస్తాము. వాటికి ప్రాయశ్చిత్తము లేదు. ఆ భగవంతుడే ఉపాయమని భగవంతునినే ప్రేమించుట మనకర్తవ్యము. అప్పుడు మనకి దొరికేది భగవత్ వాత్సల్యము.

రావణునికి సీతమ్మచేసిన ఈ ఉపదేశము సంసారులందరికి కూడా ఉపదేశమే. భగవంతుని వస్తువును మనది గా చేసికొని అహంకరించు సంసారులు చేయవలసినది, భగవంతుని వస్తువు భగవంతునికి సమర్పించుటయే.

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది ఒకటవ సర్గ సమాప్తము

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకవింశస్సర్గః||

||ఓమ్ తత్ సత్||