||సుందరకాండ ||

||ఇరువదిమూడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 23 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రయోవింశస్సర్గః

శ్లో|| ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రు రావణః|
సందిశ్య చ తతః సర్వా రాక్షసీర్నిర్జగామ హ||1||
నిష్క్రాన్తే రాక్షసేన్ద్రే తు పునరన్తఃపురం గతే|
రాక్షస్యో భీమరూపాః తాః సీతాం సమభిదుద్రువుః||2||

స|| మైధిలీం ఇత్యుక్త్వా రావణాః శత్రు రావణః తతః సర్వాన్ రాక్షసీః సందిశ్య చ తతః రాజా నిర్జగామ|| రాక్షసేంద్రే పునః అంతఃపురం గతే నిష్క్రాన్తే తు భీమరూపాః రాక్షస్యః తాం సీతాం సమభిదుద్రువుః||

తా|| మైథిలి తో ఇట్లు చెప్పి శత్రువులను భయపెట్టు ఆ రావణుడు ఆ రాక్షసస్త్రీలందరిని ఆ విధముగా అజ్ఞాపించిన పిమ్మట వెళ్ళెను. ఆ రాక్షసరాజు అంతఃపురము వెళ్ళిన పిమ్మట అ భయంకరరూపములు గల రాక్షస స్త్రీలు సీతా దేవి చుట్టూ చేరిరి.

శ్లో|| తతస్సీతాం ఉపాగమ్య రక్షస్యః క్రోథమూర్చితాః|
పరం పరుషయా వాచా వైదేహీం ఇదమబ్రువన్ ||3||
పౌలస్తస్య వరిష్ఠస్య రావణస్య మహాత్మనః|
దశగ్రీవస్య భార్యా త్వం సీతే న బహుమన్యసే||4||

స|| తతః రక్షస్యః క్రోధమూర్ఛితాః సీతాం వైదేహీం ఉపాగమ్య పరం పరుషయా వాచా ఇదం అబ్రువన్ || సీతే మహాత్మనః పౌలస్తస్య వరిష్ఠస్య దశగ్రీవస్య భార్యా త్వం న బహుమన్యసే ||

తా|| పిమ్మట ఆ రాక్షస స్త్రీలు క్రోధమూర్చితులై ఆ వైదేహిని చేరి పరుషమైన వాక్యములతో ఇట్లు పలికిరి. "ఓ సీతా మహాత్ముడు పులస్తుని కుమారుడు వరిష్ఠుడు అయిన దశకంఠుని భార్య అగుట గొప్ప అని తెలియదా "

శ్లో|| తతస్త్వేకజటా నామ రాక్షసీ వాక్యమ బ్రవీత్|
ఆమన్త్ర్య క్రోధతామ్రాక్షీ సీతాం కరతలోదరీమ్||5||
ప్రజాపతీనాం షణ్ణాం తు చతుర్థో యః ప్రజాపతిః|
మానసో బ్రహ్మణః పుత్త్రః పులస్త్య ఇతి విశ్రుతః||6||
పులస్తస్య తు తేజస్వీ మహర్షిర్మానసః సుతః|
నామ్నా స విశ్రవా నామ ప్రజాపతి సమప్రభః||7||
తస్య పుత్త్రో విశాలాక్షీ రావణశ్శత్రు రావణః|
తస్య త్వం రాక్షసేన్ద్రస్య భార్యా భవితుమర్హసి||8||
మయోక్తం చారు సర్వాఙ్గి వాక్యం కిం నానుమన్యసే|

స|| తతః ఏకజటా నామ రాక్షసీ ఆమన్త్ర్య క్రోధతామ్రాక్షీ కరతలోదరీం సీతాం (ఇదం) వాక్యం అబ్రవీత్ | షణ్ణాం ప్రజాపతీనాం చతుర్థో ప్రజాపతి పులస్త్యః యః బ్రహ్మణః మానసపుత్రః ఇతి విశ్రుతః తు || తేజస్వీ పులస్తస్య మానసః సుతః మహర్షిః విశ్రవాః నామః సః ప్రజాపతి సమప్రభః || విశాలాక్షీ రావణః శత్రు రావణః తస్య పుత్త్రః | తస్య రాక్షసేంద్రస్య భార్యా భవితు త్వం అర్హసి||చారు సర్వాఙ్గి మయోక్తం వాక్యం కిం న అనుమన్యసె?||

తా|| అప్పుడు ఏకజటా అనబడు ఒక రాక్షసి కోపముతో కళ్ళు ఏఱ్ఱజేసి సన్నని నడుముగల సీతతో ఇట్లనెను." అరుగురు ప్రజాపతులలో నాలుగవ ప్రజాపతి పులస్త్యుడనబడువాడు, బ్రహ్మయొక్క మానసపుత్రుడు. తేజస్వీ అగు పులస్త్యుని మానసపుత్రుడు మహర్షి విశ్రవసుడు. అతడు ప్రజాపతితో సమానుడు. ఓ విశాలాక్షీ ! శత్రుభయంకరుడు అగు రావణుడు ఆయన పుత్రుడు. ఆ రాక్షసేంద్రుని భార్య అగుటకు నీవు తగినదానవు. ఓ చారుసర్వాంగీ నేను చెప్పిన మాటలు ఎందుకు వినవు?"

శ్లో|| తతో హరిజటా నామ రాక్షసీ వాక్యమబ్రవీత్||9||
వివర్త్య నయనే కోపాత్ మార్జార సదృశేక్షణా|
యేన దేవాః త్రయస్త్రింశత్ దేవరాజశ్చ నిర్జితాః||10||
తస్య త్వం రాక్షసేన్ద్రస్య భార్యా భవితు మర్హసి|

స|| తతః మార్జార సదృసేక్షణా హరిజటా నామ రాక్షసీ వివృత్య నయనః కోపాత్ (ఇదం) వచనం అబ్రవీత్ || యేన త్రయత్రింశత్ దేవాః దేవరాజశ్చ నిర్జితాః తస్య రాక్షసేన్ద్రస్య భార్యా భవితుం అర్హసి||

తా|| పిమ్మట పిల్లికళ్ళు గల హరిజటా అను పేరుగల రాక్షసి కోపము చూపిస్తున్న కళ్ళతో ఈ మాటలు చెప్పెను. " ఏవరిచేత ముప్పదిమూడుకోట్ల దేవగణములు, వారి అధిపతి, జయింపబడెనో ఆ రాక్షసేంద్రుని భార్య అగుటకు నీవు తగిన దానవు."

శ్లో|| తతస్తు ప్రఘసా నామ రాక్షసీ క్రోధమూర్చితా||11||
భర్త్యయన్తీ తదా ఘోరమ్ ఇదం వచనమబ్రవీత్ |
వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేష్వనివర్తినః||12||
బలినో వీర్యయుక్తస్య భార్యా కిం త్వం న లప్స్యసే|
ప్రియాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా మహాబలః||13||
సర్వాసాం చ మహాభాగాం త్వాముపైష్యతి రావణః|
సముద్ధం స్త్రీ సహస్రేణ నానారత్నోపశోభితమ్||14||
అంతః పురం సముత్సృజ్య త్వాముపైష్యతి రావణః|

స|| తతః క్రోధమూర్ఛితా ఘోరం భర్త్సయంతీ ప్రఘసా నామ రాక్షసీ ఇదం ఘోరం వచనం అబ్రవీత్|| వీర్యోత్సిక్తస్య శూరస్య సంగ్రామేషు అనివర్తినః బలినః వీర్యయుక్తస్య భార్యా త్వం కిం న లప్స్యసే||రావణః మహాబలః సర్వాసాం చ మహాభాగాం బహుమతాం భార్యాం త్యక్త్వా రాజా త్వాం ఉపైష్యతి || రావణః స్త్రీసహస్రేణ సమృద్ధం నానారత్నోపశోభితం అంతః పురం సమాసాద్య త్వాం ఉపైష్యతి ||

తా|| అప్పుడు క్రోధమూర్చితురాలైన ప్రఘసా అనబడు రాక్షసి సీతను బెదిరిస్తూ ఈ కఠినమైన మాటలను చెప్పెను. "వీర్యమును రేకిత్తంచగల శూరుడు, సంగ్రామములో వెనుతిరగని మహా బలుడు, మహాశక్తిమంతుడు అయిన వాని భార్య అవడానికి నీవు ఎందుకు కోరుకోనుట లేదు? మహాబలవంతుడైన రావణుడు మహభాగులు వరిష్ఠురాలు అయిన తన ప్రియమైన భార్యను సైతము వదిలి ఆ రాజు నిన్ను పొందగోరుచున్నాడు. నానావిధరత్నములతో ప్రకాశిస్తూ వేలాదిమంది ఉన్న తరుణలతో ఉన్న అంతఃపురమును పరిత్యజించి రావణుడు నిన్ను పొందడానికి కోరుచున్నాడు."

శ్లో|| అన్యాతు వికటానామ రాక్షసీ వాక్యమబ్రవీత్||15||
అసకృద్దేవతా యుద్దే నాగగన్ధర్వ దానవాః|
నిర్జితాః సమరే యేన స తే పార్శ్వముపాగతః||16||
తస్య సర్వసమృద్ధస్య రావణస్య మహాత్మనః|
కిమద్య రాక్షసేన్ద్రస్య భార్యా త్వం నేచ్ఛసేఽధమే ||17||

స|| వికటా నామ అన్యా రాక్షసీ (ఇదం) వాక్యం అబ్రవీత్ | యేన అసకృత్ యుద్ధే దేవతాః నాగ గంధర్వ దానవాః యుద్ధే సమరే నిర్జితాః సః తే పార్శ్వం ఉపాగతః|| అథమే తస్య సర్వసమృద్ధస్య మహాత్మనః రావణస్య రాక్ష్సేంద్రస్య భార్యా కిం న ఇచ్ఛసే|

తా|| అప్పుడు వికట అనబడు ఇంకో రాక్షసి ఈ మాటలను చెప్పెను. " ఎవరైతే యుద్ధములో దేవ గంధర్వ నాగ దానవులని అలవోకగా ఓడించెనో ఆ రాజు నీ పక్కన ఉండడానికి కోరుకొనుచున్నాడు. ఓ అధమురాలా సకలైశ్వర్యాలతో తులతూగు మహాత్ముడగు రాక్షసాధిపతి రావణుని భార్య అగుటకు ఎందుకు ఇష్టపడవు?"

శ్లో|| తతస్తు దుర్ముఖీ నామ రాక్షసీ వాక్యమబ్రవీత్|
యస్య సూర్యో న తపతి భీతో యస్య చ మారుతః||18||
న వాతి స్మాయతాపాఙ్గే కిం త్వం తస్య న తిష్ఠసి|

స|| తతః దుర్ముఖీ నామ రాక్షసీ (ఇదం) వాక్యం అబ్రవీత్ | ఆయతాపాఙ్గే యస్య భీతః సూర్యః న తపతి యస్య చ మారుతః న వాతి స్మ తస్య త్వం కిం న తిష్ఠసి ||

తా|| అప్పుడు దుర్ముఖీ అనబడు రాక్షసి ఈ మాటలు చెప్పెను. "విశాలమైన కళ్ళు గలదానా ఎవరికి భయపడి సూర్యుడు తన తీక్షణమైన కిరణములను ప్రసరింపడో , ఎవరికి భయపడి మారుతము వీచడో, అటువంటి వానికు నీవు ఎందుకు అనుగుణముగా ప్రవర్తింపవు".

శ్లో|| పుష్పవృష్టిం చ తరవో ముముచురస్య వై భయాత్||19||
తతస్తు సుభ్రు పానీయం జలాదాశ్చ యదేచ్ఛతి|
తస్య నైరృతరాజస్య రాజరాజస్య భామినీ||20||
కిం త్వం న కురుషే బుద్ధిం భార్యార్థే రావణస్య హి|

స|| సుభ్రు భామిని యస్య భయాత్ తరవః పుష్పవృష్ఠిం ముముచుః యదా ఇచ్ఛతి శైలాశ్చ జలదాశ్చ పానీయం నైర్రుతరాజస్య రాజరాజస్య తస్య రావణస్య భార్యార్థే బుద్ధిం త్వం న కురుషే?||

తా|| " ఓ మంచి కళ్ళుగల భామినీ ! ఎవరికి భయపడి చెట్లు పుష్పవృష్టిని కురిపిస్తాయో, ఎవరి కోరికపై పర్వతములు మేఘములు జలములను ఇస్తున్నవో, అట్టి రాక్షసరాజు అగు రావణునికి భార్య అగుటకు నీకు ఎందుకు బుద్ధి కలుగుట లేదు?"

శ్లో|| సాధుతే తత్త్వతో దేవి కథితం సాధు భామిని||21||
గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి|

స|| సుస్మితే భామిని దేవి తత్త్వతః సాధు తే కథితం వాక్యం గృహాణ అన్యథా న భవిష్యసి ||

తా|| "ఓ సుస్మిత భామినీ మంచిగా నీకు చెప్పిన మాటలను వినుము లేకపోయినచో భవిష్యత్తులో నీవు ఉండవు"

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రయోవింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువదిమూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||