||సుందరకాండ ||

||ఇరువదిమూడవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ఇత్యుక్త్వా మైథిలీం రాజా రావణః శత్రు రావణః|
సందిశ్య చ తతః సర్వా రాక్షసీర్నిర్జగామ హ||1||
స|| మైధిలీం ఇత్యుక్త్వా రావణాః శత్రు రావణః తతః సర్వాన్ రాక్షసీః సందిశ్య చ తతః రాజా నిర్జగామ|
తా|| మైథిలి తో ఇట్లు చెప్పి శత్రువులను భయపెట్టు ఆ రావణుడు ఆ రాక్షసస్త్రీలందరిని ఆ విధముగా అజ్ఞాపించిన పిమ్మట వెళ్ళెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రయోవింశస్సర్గః


మైథిలికి ఇట్లు రెండు నెలల గడువు ఇచ్చి , ఆ రాక్షసస్త్రీలందరిని సీతాదేవి లొంగపరుకొమ్మని అజ్ఞాపించిన పిమ్మట శత్రువులను భయపెట్టు ఆ రావణుడు తన అంతఃపురము వెళ్ళెను. ఆ రాక్షసరాజు అంతఃపురము వెళ్ళిన పిమ్మట భయంకరరూపములు గల రాక్షస స్త్రీలు సీతా దేవి చుట్టూ చేరిరి.

ఆ రాక్షస స్త్రీలు క్రోధమూర్చితులై ఆ వైదేహిని చేరి పరుషమైన వాక్యములతో ఇట్లు పలికిరి. "ఓ సీతా మహాత్ముడు పులస్తుని కుమారుడు వరిష్ఠుడు అయిన దశకంఠుని భార్య అగుట గొప్ప అని తెలియదా " అని. అప్పుడు ఏకజటా అనబడు ఒక రాక్షసి కోపముతో కళ్ళు ఏఱ్ఱజేసి సన్నని నడుముగల సీతతో ఇట్లనెను." అరుగురు ప్రజాపతులలో నాలుగవ ప్రజాపతి పులస్త్యుడనబడువాడు. అతడు బ్రహ్మయొక్క మానసపుత్రుడు. తేజస్వీ అగు పులస్త్య ప్రజాపతి మానసపుత్రుడు మహర్షి విశ్రవసుడు. అతడు కూడా ప్రజాపతితో సమానుడు. ఓ విశాలాక్షీ ! శత్రుభయంకరుడు అగు రావణుడు ఆయన పుత్రుడు. ఆ రాక్షసేంద్రుని భార్య అగుటకు నీవు తగినదానవు. ఓ చారుసర్వాంగీ నేను చెప్పిన మాటలు ఎందుకు వినవు?"

పిమ్మట పిల్లికళ్ళు గల హరిజటా అను పేరుగల రాక్షసి కోపము చూపిస్తున్న కళ్ళతో ఈ మాటలు చెప్పెను. "ఏవరిచేత ముప్పదిమూడుకోట్ల దేవగణములు వారి అధిపతి జయింపబడెనో అట్టి రాక్షసేంద్రుని భార్య అగుటకు నీవు తగిన దానవు."

అప్పుడు క్రోధమూర్చితురాలైన ప్రఘసా అనబడు రాక్షసి సీతను బెదిరిస్తూ ఈ కఠినమైన మాటలను చెప్పెను. "వీర్యమును రేకిత్తంచగల శూరుడు, సంగ్రామములో వెనుతిరగని మహా బలుడు, మహాశక్తిమంతుడు అయిన వాని భార్య అవడానికి నీవు ఎందుకు కోరుకోనుట లేదు? మహభాగు వరిష్ఠురాలు అయిన తన ప్రియమైన భార్యను సైతము వదిలి, మహాబలవంతుడైన ఆ రాజు రావణుడు నిన్ను పొందగోరుచున్నాడు. నానావిధరత్నములతో ప్రకాశిస్తూ వేలాదిమంది ఉన్న తరుణలతో ఉన్న అంతఃపురమును పరిత్యజించి, రావణుడు నిన్ను పొందడానికి కోరుచున్నాడు."

అప్పుడు వికట అనబడు ఇంకో రాక్షసి ఈ మాటలను చెప్పెను. " ఎవరైతే యుద్ధములో దేవ గంధర్వ నాగ దానవులని అలవోకగా ఓడించెనో ఆ రాజు నీ పక్కన ఉండడానికి కోరుకొనుచున్నాడు. ఓ అధమురాలా సకలైశ్వర్యాలతో తులతూగు మహాత్ముడగు రాక్షసాధిపతి రావణుని భార్య అగుటకు ఎందుకు ఇష్టపడవు?"

అప్పుడు దుర్ముఖీ అనబడు రాక్షసి ఈ మాటలు చెప్పెను. "విశాలమైన కళ్ళు గలదానా ఎవరికి భయపడి సూర్యుడు తన తీక్షణమైన కిరణములను ప్రసరింపడో , ఎవరికి భయపడి మారుతము వీచడో, అటువంటి వానికు నీవు ఎందుకు అనుగుణముగా ప్రవర్తింపవు. ఓ మంచి కళ్ళుగల భామినీ, ఎవరికి భయపడి చెట్లు పుష్పవృష్టిని కురిపిస్తాయో ఎవరి కోరికపై పర్వతములు మేఘములు జలములను ఇస్తున్నవో అట్టి రాక్షసరాజు అగు రావణునికి భార్య అగుటకు నీకు ఎందుకు బుద్ధి కలుగుట లేదు? ఓ సుస్మిత భామినీ మంచిగా నీకు చెప్పిన మాటలను వినుము లేకపోయినచో భవిష్యత్తులో నీవు ఉండవు"

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువదిమూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

శ్లో|| సాధుతే తత్త్వతో దేవి కథితం సాధు భామిని||21||
గృహాణ సుస్మితే వాక్యం అన్యథా న భవిష్యసి|
స|| సుస్మితే భామిని దేవి తత్త్వతః సాధు తే కథితం వాక్యం గృహాణ అన్యథా న భవిష్యసి ||
తా|| "ఓ సుస్మిత భామినీ మంచిగా నీకు చెప్పిన మాటలను వినుము లేకపోయినచో భవిష్యత్తులో నీవు ఉండవు"
||ఓమ్ తత్ సత్||