||సుందరకాండ ||

||ఇరువది ఇదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచవింశస్సర్గః

బహు దారుణమైన పరుషవాక్యములను మాట్లాడుతున్న ఆ అసౌమ్యులగు రాక్ష స్త్రీల మాటలను విని జనకాత్మజ విలపింపసాగెను. ఆ విధముగా రాక్షసస్త్రీలచే బెదిరింప బడిన మనస్వినీ వైదేహీ అతి భయముతో భాష్పములతో నిండిన గద్గద కంఠముతో ఇట్లు పలికెను. " మనుష్య స్త్రీ రాక్షసునియొక్క భార్య కాలేదు. నన్ను మీరందరూ చంపుకు తినండి. మీ వచనములను నేను పాటించను".

రాక్షస స్త్రీల మధ్యలో రావణునిచేత భయపెట్టబడిన సురలతో సమానమైన ఆ సీత దుఖమునుంచి బయటకు రాలేకపోయెను. వనములో తన సమూహమునుంచి విడివడి నక్కలచేత చుట్టబడిన లేడివలె సీత తన అంగములను తనలోనే ఇమడ్చుకొని వణుకుచుండెను. శోకముతో భఘ్నమైన మనస్సు కలదై ఆ అశోకవనములో పుష్పించిన చెట్ల శాఖలను పట్టుకొని తన భర్త గురించి ఆలోఛింపసాగెను. కన్నీటి ధారలతో స్తనములు తడిసిపోయి చింతించుచున్న ఆమెకు శోకసముద్రముయొక్క అంతు కనపడలేదు. ఆమె పెనుగాలిలో వీగుతున్న అరటిచెట్టు వలె రాక్షస్త్రీలవలన భయపడుతూ వివర్ణ వదనముతో నుండెను. అలా వణుకుతున్న ఆ సీత పొడుగాటి జడ కూడా అటూ ఇటూ కదులుతూ వున్న పాము వలె నుండేను.

దుఃఖముతో శోకముచే బాధింపబడుతున్న ఆ మైథిలీ నిట్టూర్పులు విడుస్తూ కన్నీళ్ళు కారిస్తూ విలపించెను. దుఃఖముతో "హా రామా" అని మళ్ళీ "హా లక్ష్మణా" అని అలాగే " హా అత్త అయిన కౌసల్యా" " ఓ సుమిత్రా" అని విలపించెను. " ఇక్కడ ఈ క్రూరమైన రాక్షసులచేత పీడింపబడుతూ , రాముని ఏడబాసి దుఃఖములో ఒక క్షణమైన జీవించుచున్నాను అంటే స్త్రీ కి గాని పురుషునుకి గాని అకాలమృత్యువు దుర్లభము అన్న పండితుల వచనములో ఎంతో సత్యము కలదు. ఈ కొంచమే పుణ్యముకల దీనురాలను అయిన నేను సముద్రమధ్యములో వాయువేగములచేత కోట్టబడిన పూర్తిగా భరింపబడిన నావ వలె నశించెదను. భర్త కానరాక రాక్షసులవశములో నున్న నేను నీటిచే కొట్టబడి కూలిపోయిన ఏటి గట్టులా వున్నాను. తామరరేకుల వంటి నేత్రములు గల సింహగమనము కల కృతజ్ఞత కల ప్రియమైన మాటలు పలుకు నా నాథుని చూచు వారు నిజముగా ధన్యులు."

" తీక్షణమైన విషము తాగితే జీవనము ఏలా అసాధ్యమో అలాగ విదితాత్ముడగు ఆ రాముని ఎడబాటుతో నాకు జీవితము అసాధ్యము. ఇట్టి ఘోరము దారుణమైన దుఃఖము పొందిన నాచేత ఏటువంటి పాపము పూర్వ జన్మములో చేయబడెనో? ఈ మహత్తరమైన శోకముతో జీవితము వదులటకు కోరికగా నున్నది. ఈ రాక్షసుల చేత రక్షింపబడుతున్న నన్ను రాముడు పొందలేడు. ఈ మానవ జీవితము హేయము. పరులవశములో నుండుట హేయము. జీవితము వదులుదామనిపించిననూ అది చేయలేని స్థిలో ఉన్న దానను".

ఈ విధముగా శ్రీమద్వాల్మీకిరామాయణములో సుందరకాండలో ఇరువది ఇదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||