||సుందరకాండ ||

||ఇరువది ఏడవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ సప్తవింశస్సర్గః

ఈ విధముగా సీత చేత దుఃఖములో రాబోవు ఘటనలను సూచిస్తూ శాపపూర్వకముగా చెప్పబడిన మాటలు వినిన రాక్షసులు కొందరు ఆ విషయము చెప్పుటకు రావణుని వద్దకు పరుగిడిరి.

అప్పుడు సీతను చేరి ఘోరరూపముకల రాక్షసులు ఒకే అర్థముగల అనర్థమైన మాటలు మరల చెప్పసాగిరి." ఓ అనార్యా! పాపములో నిశ్చయముగా వున్న నీ మాంసము ఈ దినమే రాక్షసులందరూ సుఖముగా తినెదరు."

దుష్టులైన వారిచేత భయపెట్టబడుచున్న సీతను చూచి వృద్ధురాలైన రాక్షసి త్రిజట అప్పుడు ఈ వాక్యములను పలికెను. "జనకుని కూతురు దశరథుని కోడలు అయిన సీతను తినకుడు. మిమ్మలిని మీరే తినుడు. ఇవాళ నేను ఒక స్వప్నము చూసితిని. అది దారుణము రోమహర్షణము అయినది. అది అమె భర్త జయమును రాక్షసుల వినాశనమును సూచించుచున్నది".

త్రిజట చెప్పిన ఆ మాటలు వినిన రాక్షస్త్రీలందరూ భయముతో క్రోధమూర్చితులై ఈ మాటలను చెప్పిరి. "రాత్రి నీవు చూసిన స్వప్నము ఏలాంటిదో చెప్పుము"అని. రాక్షసస్త్రీల ముఖమునుంచి వచ్చిన ఆ మాటలు వినిన త్రిజట వారికి తనకి వచ్చిన స్వప్నము గురించి చెప్పసాగెను.

" రాఘవుడు తెల్లని వస్త్రములు ధరించినవాడై లక్ష్మణుని తో సహా అంతరిక్షములో గజదంతములతో కూడిన వేయిహంసలు మోస్తున్న పల్లకీమీద వచ్చెను. అప్పుడు స్వప్నములో తెల్లని బట్టలతో సాగరమధ్యములో నున్న పర్వతముపై కూర్చుని ఉన్న సీతాదేవిని చూచితిని".

"కాంతి భాస్కరునుతో కూడినట్లు సీత రామునితో చెరినది. నాలుగు దంతములుకల పర్వతములతో సమానమైన మహాగజముల పై లక్ష్మణునితో కూడా వున్న రాముని కూడా చూచితిని. అప్పుడు తెల్లని వస్త్రములు ధరించిన నరశార్దూలురు వారిద్దరూ తమ తేజస్సుతో వెలుగుతూ సీతవద్దకు వచ్చిరి. అప్పుడు పర్వతాగ్రముపై నున్న ఆ జానకి ఆకాశములో నిలబడిన ఆ ఏనుగు పైకి ఎక్కి భర్తచేత చేరెను. అప్పుడు కమలలోచనుడగు ఆ భర్త అంగములనుంచి లేచి చంద్ర సూర్యులను స్పృశించినట్లు చూసితిని. అప్పుడు విశాలాక్షి అయిన సీత, ఆలాగే కుమారులు ఇద్దరూ కూర్చుని ఉన్న ఆ గజము లంకా నగరముపైన నిలబడెను".

"ఆ కాకుత్‍స్థుడు భార్య సీతతో సహా ఎనిమిది వృషభములు కల రథముపై స్వయముగా ఇక్కడికి వచ్చెను. ఆ వీరుడు సీతా లక్ష్మణులతో కలిసి దివ్యమైన సూర్యునితో సమానమైనకాంతిగల దివ్యమైన పుష్పక విమానమెక్కి ఉత్తరదిశలో సాగిపోయెను. ఈ విధముగా విష్ణు పరాక్రమము గల రాముడు, భార్య అయిన సీతతో అలాగే తమ్ముడు లక్ష్మణునితో కలిసి ఉండడము స్వప్నములో నేను చూచితిని. పాపులకు స్వర్గము పొందుట ఎలా శక్యము కాదో అలా రాక్షసుల చేత గాని ఇతర సురాసురుల చేత గాని మహాతేజోవంతుడు అగు రాముడు జయింపబడుట శక్యముకాని పని".

" రక్తపు రంగు వస్త్రములతో తాగి మత్తులో కరవీర పుష్పముల మాల ధరించి, తైలము తో పూయబడి భూమి మీద పడియున్న రావణుని కూడా చూచితిని. శిరో ముండనము చేయబడిన నల్లని వస్త్రములు ధరించియున్న రావణుని ఒక స్త్రీ ఈడ్చుకు పోతూవున్నట్లు , మళ్ళీ రావణుడు విమానము నుంచి భూమిపై పడుతున్నట్లు చూచితిని. రావణుడు ఎఱ్ఱని పూలమాలతో మైపూతలతో నూనె తాగి పిచ్చిగా నవ్వుతూ నృత్యము చేస్తూ గాడిదలు పూన్చిన రథముపై దక్షిణ దిశలో వెళ్ళెను. రాక్షసేశ్వరుడగు రావణుడు భయమోహితుడై గాడిదమీదనుంచి కింద పడినట్లు మళ్ళీ నాకు కనపడెను. రావణుడు వెంటనే లేచి భ్రాంత చిత్తుడై, భయముతో మదముతో వివశుడై, బట్టలు లేని వాడై పిచ్చివాని వలె సహించలేని దుర్వాక్యములను ప్రేలాపించుచూ ఘోరము నరకముతో సమానమైన అంధకారమయమైన మలపంకములో పడి మునిగి పోయెను".

"ఎఱ్ఱని వస్త్రములు ధరించియున్న అంగములపై బురదపూసుకొనిన ఒక నల్లని స్త్రీ దశగ్రీవుని కంఠములో తాడుకట్టి దక్షిణ దిశగా ఈడ్చుకుపోసాగినది. అక్కడ నిశాచరుడు అగు కుంభకర్ణుడు అలాగే రావణుని పుత్రులందరూ శరీరమునకు తైలము పూసికొని నట్లు కనబడిరి. దశగ్రీవుడు వరాహముపై, ఇంద్రజిత్తుమొసలిపై, కుంభకర్ణుడు ఒంటె పై ఎక్కి దక్షిణ దిశగా పోవుట కనపడినది".

ఆ స్వప్నములో విభీషణుడు ఒక తెల్లని చత్రముతో తెల్లని బట్టలు ధరించి గంధములు పూసికొని కనపడెను. విభీషణుడు శంఖదుందుభి ఘోషలతో నృత్య గీతములతో పర్వతమువలె నున్న మేఘ గర్జనలతో సమానమైన గర్జనలు చేయుచున్న నాలుగు దంతములు కల దివ్యమైన గజములపై ఏక్కి వుండెను. నలుగురు సచివులతో కూడి ఆకాశములో నిలపడియుండెను".

" తాగివున్న ఎఱ్ఱని పూలమాలలు వస్త్రములు ధరించియున్న రాక్షసులను, పాటలుపాడుతూ వున్న సమాజములను కూడా నేను చూచితిని. పడిపోయిన గోపురములు తోరణములతో కూడియున్న లంకానగరము గుర్రములు ఏనుగులతో సహా సాగరములో మునిగిపోవుట నేను చూచితిని . రావణునిచేత రక్షింపబడిన లంక రాముని దూత వాయువేగముకల వానరుని చేత దగ్ధము చేయబడినట్లు చూచితిని. భస్మరాసులతో నిండిన లంకలో రాక్షస స్త్రీలు నూనెతాగి పిచ్చిగా పెద్దగా ధ్వనిచేస్తూ నవ్వుతూ వున్నట్లు కనపడిరి. కుంభకర్ణాదులు అలాగే అందరూ రాక్షసపుంగవులు వస్త్రములు లేకుండా గోవుపేడగుంటలలో ప్రవేశించిరి ".

"ఓ రాక్షస స్త్రీలారా మీరు నశించిపోయెదరు. రాఘవుడు సీతను పొందును. అమితమైన కోపము కల రాఘవుడు మీ అందరినీ చంపివేయును. రామునికి ప్రియమైన వనవాస దీక్షతీసుకున్న భార్యను భయపెట్టిన దుర్భాషలాడిన వారిని వధించును".

" అందుకని ఈ క్రూర వాక్యములు చాలు. ఆమెతో శాంతముగా ప్రవర్తించుడు. వైదేహిని బ్రతిమాలుటయే మంచిది. నాకు అదే మంచిది అనిపించుచున్నది. దుఃఖములో నున్న ఎవరికి ఇట్టి స్వప్నము వచ్చునో వారు అనేక రకములైన దుఃఖములనుంచి విముక్తులగుదురు. అసమానమైన ప్రియమును పొందుదురు. రాక్షసులారా భయపెట్టినప్పటికీ ఆమెను యాచించుడు. ఇంకాచెప్పుట అనవసరము. రాక్షసులకు ఘోరమైన ఆపద సంభవించనున్నది".

"రాక్షసులారా జనకాత్మజ అయిన ఈ మైథిలి నమస్కరించబడి ప్రసన్నురాలై మహత్తరమైన భయమునుంచి మనలను రక్షింపగలదు. ఈ విశాలాక్షి అంగములలో అశుభకరమైన సూచనలు కనపడుటలేదు. ఆకాశమార్గములో ఉన్న ఆమెలో ఒక్క ఛాయమాత్రముగా తేడా వున్నది. దుఃఖము అనుభవించతగని ఆమెకు అమిత దుఃఖము సంభవించినది".

"నేను వైదేహి కోరికలు నెరవేరు సూచనలు చూచుచున్నాను. అలాగే రాక్షస వినాశనము రాఘవుని జయము కూడా చూచుచున్నాను. . ఈమెకు మహత్తరమైన ప్రియము వినిపించుటకు శకునములు కనపడుచున్నవి. అమె పద్మపత్రములాంటి ఎడమ కన్ను అదురుచున్నది".

"శుభ సూచకములను సూచిస్తూ దక్షత కల ఈ వైదేహి ఎడమ భజము కంపిస్తున్నది. ఏనుగు తొండము లాంటి ఏడమ తొడ అదురుతూ రాముని చూచుట సూచించుచున్నది".

ఆ శాఖల మీద నున్న కోకిలలు మధురమైన కూతలు పదే పదే కూయుచూ అత్యంత ఆప్తునికి స్వాగతము చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి. అవి సంతోషముతో పదే పదే చెపుతూ ఉన్నట్లు ఉన్నాయి.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయనములో సుందరకాండలో ఇరువది ఏడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||