||సుందరకాండ ||

||ఇరువది ఎనిమిదవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 28 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ అష్టావింశస్సర్గః

శ్లో|| సా రాక్షసేంద్రస్య వచో నిశమ్య
తద్రావణ స్యా ప్రియ మప్రియార్తా|
సీతా వితత్రాస యథా వనాంతే
సింహాభిపన్నా గజరాజకన్యా||1||

స|| సా సీతా రాక్షసేంద్రస్య అప్రియం తత్ వచః నిశమ్య అప్రియార్తా వనాంతే సింహాభిపన్న గజరాజకన్యా ఇవ వితత్రాస||

తా|| ఆ సీత, రాక్షసేంద్రుని అప్రియ వచనములను వినుట వలన కలిగిన దుఃఖము వలన, సింహము ముందు వున్న గజరాజ కన్య వలె విలవిలలాడెను.

శ్లో|| సా రాక్షసీ మధ్యగతాచ భీరు
ర్వాగ్భిర్భృశం రావణ తర్జితా చ|
కాంతారమధ్యే విజనే విసృష్టా
బాలేవ కన్యా విలలాప సీతా||2||

స|| భీరుః భృశం వాగ్భిః రావణ తర్జితా చ రాక్షసీమధ్యగతా చ సా సీతా విజనే కాంతారమధ్యే విశృజ్య బాలా కన్యా ఇవ విలలాప||

తా|| అలాగ భయపడిన , రావణుని మాటలచే భయపెట్టబడిన, రాక్ష స్త్రీలమధ్యనున్న ఆ సీత జనులులేని అరణ్యమధ్యంలో వదిలివేయబడిన బాలకన్యలాగ విలపించెను.

శ్లో|| సత్యం బతేదం ప్రవదంతి లోకే
నాకాలమృత్యుర్బవతీతిసంతః|
యత్రాహమేవం పరిభర్త్స్య మానా
జీవామి కించిత్ క్షణమప్యపుణ్యా|| 3||
సుఖాద్విహీనం బహుదుఃఖపూర్ణం
ఇదం తు నూనం హృదయంస్థిరం మే|
విశీర్యతే యన్న సహస్రధాఽద్య
వజ్రాహతం శృంగ మివాsచలస్య||4||

స|| లోకే అకాలమృత్యుః న భవతి ఇతి ఇదం సత్యం సన్తః ప్రవదంతి| యత్ర ఏవం పరిభర్త్స్యమానా అపుణ్యా అహం దీనా క్షణం అపి జీవతి బత||సుఖాత్ విహీనం బహుదుఃఖపూర్ణం ఇదం మే హృదయం నూనం స్థిరం యత్ వజ్రాహతం అచలస్య శృంగమివ సహస్రథా అద్య నవిశీర్యతే||

తా|| 'ఎంతో భయపెట్టబడినా పుణ్యములేని నేను ఒక క్షణము కూడా జీవిస్తున్నాను అంటే, లోకములో అకాలమృత్యువు సంభవము కాదని సంతులు చెప్పిన మాట సత్యము. సుఖము లేక అనేక దుఃఖముల తో నిండియున్న నా హృదయము, వజ్రాయుధముతో కొట్టబడి వేయ్యముక్కలుగా విరిగిన పర్వత శిఖరములలా కాకుండా, స్థిరముగా వున్నది'.

శ్లో|| నైవాస్తి దోషం మమనూన మత్ర
వధ్యాహ మస్యాsప్రియదర్శనస్య|
భావం న చాస్యాహ మను ప్రదాతు
మలం ద్విజో మంత్రమివాఽద్విజాయ||5||
నూనం మమాంగా న్యచిరా దనార్య
శ్శస్త్రై శ్శితై శ్చేత్స్యతి రాక్షసేంద్రః|
తస్మిన్నాగచ్ఛతి లోకనాథే
గర్భస్థజంతోరివ శల్య కృన్తః||6||
దుఃఖం బతేదం మమదుఃఖితాయా
మాసౌ చిరాయాధిగమిష్యతౌ ద్వౌ|
బద్దస్య వధ్యస్య తథా నిశాంతే
రాజాపరాధాదివ తస్కరస్య||7||

స|| అత్ర మమ దోషః న ఇవ అస్తి (యది) అహం అప్రియదర్శనస్య అస్య వధ్యా|అహం అస్య భావం ద్విజః అద్విజాయ మంత్రమివ అనుప్రదాతుం న అలమ్ ||లోకనాథే తస్మిన్ ఆనాగచ్ఛతి అనార్యః రాక్షసేంద్రః శల్యకృంతః గర్భస్థ జంతోరివ మమ అంగాని నూనం శత్రైః ఛేత్స్యతి|| రాజాపరాధాత్ బద్ధస్య నిశాంతే వధ్యస్య తస్కరస్య ఇవ దుఃఖితాయాః మమ ద్వౌ మాసౌ చిరాయాధిగమిష్యతః ఇదం దుఃఖం బత ||

తా|| 'నేను దుష్టస్వరూపుడగు ఈ రావణుని చే వధింపబడెడిదానిని. నేను చనిపోయినచో దోషములేదు. బ్రాహ్మణుడు ఇతరులకు మంత్రములు ఎట్లు ప్రదానము చేయడో, అట్లే ఆ రాక్షసుని భావమునకు అనుగుణముగా నేను ఉండలేను. లోకనాధుడు ఇక్కడి కి రాకపోతే ఆ రాక్షసేంద్రుడు, గర్భస్థములో నున్న పిండమును ఛేదించినట్లు, నన్ను ముక్కలు ముక్కలుగా చేయును. రాజాపరాధము వలన బంధింపబడి రాత్రిదాటిన తరువాత చంపబడు దొంగకు ఆ రాత్రి గడచుట కష్టము అయినట్లు, ఈ దుఃఖములోనున్న నాకు ఈ రెండుమాసముముల గడువు కూడా చాలా కష్టము'.

శ్లో|| హా రామ హా లక్ష్మణ హా సుమిత్రే
హా రామమాతాః సహ మే జనన్యా|
ఏషా విపద్యా మ్యహ మల్పభాగ్యా
మహార్ణవే నౌరివ మూఢవాతా||8||
తరస్వినౌ ధారయతా మృగస్య
సత్వేన రూపం మనుజేంద్ర పుత్రౌ|
నూనం విశస్తౌ మమ కారణాత్తౌ
సింహర్షభౌ ద్వావివ వైద్యుతేన||9||
నూనం స కాలో మృగరూపధారీ
మా మల్పభాగ్యాం లులుభే తదానీమ్|
యత్రార్యపుత్రం విససర్జ మూఢా
రామానుజం లక్ష్మణపూర్వజం చ||10||

స||హారామ హా లక్ష్మణ హా సుమిత్రే హా రామమాతాః మే జనన్యా సహ అల్పభాగ్యా ఏషా అహం మహాణవే మూఢవాతా నౌరివ విపద్యామి|| మృగస్య రూపం ధారయతా సత్వేన తరస్వినౌ తౌ మనుజేంద్రపుత్రౌ వైద్యుతేన ద్వౌ సింహర్షభౌ ఇవ మమ కారణాత్ నూనమ్ విశస్తౌ||నూనం స కాలః మృగరూపధారీ తదానీం అల్పభాగ్యాం మాం లులుభే యత్ర మూఢా రామానుజం లక్ష్మణపూర్వజమ్ ఆర్యపుత్రం చ విససర్జ||

తా|| 'ఓ రామా, ఓ లక్ష్మణా, ఓ సుమిత్రాదేవి, ఓ రామమాతవైన కౌసల్యా దేవీ, ఓ జననీ భూమాతా ! అల్పభాగ్యముకల నేను, సముద్రము మధ్యలో సుడిగాలికి గురి అయిన ఓడ వలె, విపత్కర పరిస్థితిలో ఉన్నాను. మృగరూపములో వచ్చిన ఆ రాక్షసునిచే మోసగించబడి, ఆ మానవేంద్రులిద్దరూ పిడుగుపడి నశించిన రెండు సింహములు లాగా నా కారణమువలన మరణించిరేమో. తప్పక ఆ కాలపురుషుడే మృగరూపముధరించి అల్పభాగ్యముకల నన్ను మభ్యపెట్టి లక్ష్మణాగ్రజుడగు అర్యపుత్రుని, రామానుజుని కూడా కోల్పోవునట్లు చేసెను'.

శ్లో|| హారామ సత్యవ్రత దీర్ఘబాహో
హా పూర్ణ చంద్ర ప్రతిమానవక్త్ర|
హా జీవలోకశ్చ హితః ప్రియశ్చ
వధ్యాం న మాం వేత్సి హి రాక్షసానామ్||11||
అనన్య దైవత్వ మియం క్షమా చ
భూమౌ చ శయ్యా నియమశ్చ ధర్మే|
పతివ్రతా త్వం విఫలం మమేదం
కృతం కృతఘ్నేష్వివ మానుషాణామ్||12||

స||సత్యవ్రత దీర్ఘబాహో హా రామ హా పూర్ణచంద్ర ప్రతిమాన వక్త్రహా జీవలోకస్య హితః ప్రియశ్చ మామ్ రక్షసానాం వధ్యాం న వేత్సి|| అనన్యదైవత్వం ఇయం క్షమా చ భూమౌ శయ్య ధర్మే నియమశ్చ పతివ్రతాత్వం మమ ఇదం కృతఘ్నేషు మానుషాణాం కృతమివ విఫలమ్ ||

తా|| 'సత్యవ్రతుడు దీర్ఘబాహువులు కలవాడు అయిన ఓ రామా ! పూర్ణచంద్రుని బోలి ముఖము కలవాడా సమస్త ప్రాణులకు హితుడవు ప్రియుడవు నీకు రాక్షసులు నన్ను చంపుతారని తెలియదా ? నీవే తప్ప ఇంకో దేముడు లేడు. ఎంతో ఓర్పుతో భూమిపై నిద్రిస్తూ, ధర్మములను నియమములను పాటిస్తూ పాతివ్రత్యము పాటిస్తున్నాను. అవి అన్నీ కృతఘ్నులకు చేసిన ఉపకారములవలే విఫలమౌతున్నాయి'.

శ్లో|| మోఘో హి ధర్మశ్చరితో మయాsయమ్
తథైకపత్నీత్వ మిదం నిరర్థమ్|
యా త్వాం న పశ్యామి కృశా వివర్ణా
హీనా త్వయా సంగమనే నిరాశా||13||
పితుర్నిదేశమ్ నియమేన కృత్వా
వనాన్ నివృత్తశ్చరితవ్రతశ్చ|
స్త్రీభిస్తు మన్యే విపిలేక్షణాభి
స్త్వం రంస్యసే వీతభయః కృతార్థః||14||

స|| యా త్వాం నపశ్యామి త్వయా హీనా సంగమానే నిరాశా కృశా వివర్ణా మయా చరితః అయం ధర్మః మోఘః హి | తథా ఇదం ఏకపత్నీత్వాం నిరర్థమ్||త్వం పితుః నిర్దేశం నియమేన కృత్వా చరితవ్రతస్య వనాత్ నివృతః వీత భయః కృతార్థః విపులేక్షణాభిః స్త్రీభిః రంస్యసే మన్యే||

తా|| 'నిన్ను చూడలేక, నీతో కలయుట అనే ఆశలేనప్పుడు కృశించి కళాకాంతులు నశిస్తూ చేసిన పాతివ్రత్యధర్మము అంతా నిరర్థకమే. నువ్వు పితృవాక్యపరిపాలన నియమముగా చేసి వనమునుంచి కృతకృత్యుడవై వెనకకి వెళ్ళి భయములేనివాడవై కృతార్థుడవై అందమైన స్త్రీలతో రమించెదవని తలచెదను'.

శ్లో|| అహం తు రామా త్వయి జాత కామా
చిరం వినాశాయ నిబద్ధభావా|
మోఘం చరిత్వాఽథ తపోవ్రతం చ
త్యక్ష్యామి ధిక్ జీవిత మల్పభాగ్యా||15||
సా జీవితం క్షిప్ర మహం త్యజేయం
విషేణ శస్త్రేణ శితేన వాపి|
విషస్య దాతా న హి మేఽస్తి కశ్చిత్
శస్త్రస్య వా వేశ్మని రాక్షసస్య||16||

స|| రామా త్వయి జాతకామా అహమ్ తు చిరం నిబద్ధభావా తపః వ్రతం చ మోఘం వినాశాయ చరిత్వాథ జివితం తక్ష్యామి | అల్పభాగ్యాం ధిక్||సా అహం క్షిప్రం జీవితం విషేణ శితేన శస్త్రేణ వా అపి త్యజేయం | రాక్షసస్య వేశ్మని మే విషస్య శస్త్రస్య వా దాతా కశ్చిత్ నాస్తి||

తా|| 'ఓ రామా నీపై అనురాగముతో చిరకాలము బద్ధురాలనైనదానిని. నా తపము వ్రతములు నిరర్థకము. ఇప్పుడు నా జీవితము త్యజించెదను. నేను దుర్భాగ్యురాలను. అట్టి నేను విషము తాగి కాని వాడి ఆయుధముతో కాని జీవితము త్యజించవలెను. కాని ఈ రాక్షస గృహములో విషముకాని ఆయుధముకాని ఇచ్చే దాతకూడా లేడు'.

శ్లో|| ఇతీవ దేవీ బహుధా విలప్య
సర్వాత్మనా రామ మనుస్మరంతీ|
ప్రవేపమానా పరిశుష్కవక్త్రా
నగోత్తమం పుష్పిత మాస సాద||17||
శోకాభితప్తా బహుధా విచింత్యా
సీతాsథ వేణ్యుద్గ్రథనం గృహీత్వా|
ఉద్బధ్య వేణ్యుద్గ్రథనేన శీఘ్రం
అహం గమిష్యామి యమస్య మూలమ్||18||

స|| దేవీ ఇతీవ బహుధా విలప్య సర్వాత్మనా రామం అనుస్మరంతీ ప్రవేపమానా పరిషుష్కవక్త్రా పుష్పితం నగోత్తమమ్ అససాద ||శోకాభితప్తా సీతా బహుధా విచిన్త్య అథ వేణ్యుద్‍గ్రధనం గృహీత్వా అహం వేణ్యుద్‍గ్రధనేన ఉద్‍బుధ్య శీఘ్రం యమస్య మూలం గమిష్యామి||

తా|| ఆ దేవి ఈ విధముగా విలపిస్తూ, అన్నివిధములుగా రామునే స్మరిస్తూ, దుఃఖముతో వణుకుతూ, నోరు ఎండిపోయి, మంచి పుష్పములు కల ఆ వృక్షసమీపమునకు వెళ్ళెను. శోకములో మునిగి పోయి ఉన్న ఆ సీత అనేక విధములుగా ఆలోచించి తన జడను పట్టుకోని " నేను ఈ జడతో ఉరిపోసుకొని యముని స్థానమునకు వెళ్ళెదను" అని అనుకొనెను.

శ్లో|| ఉపస్థితా సా మృదుసర్వగాత్రీ
శాఖాంగృహీత్వాఽథ నగస్య తస్య |
తస్యాస్తు రామం ప్రవిచింతయంత్యా
రామానుజం స్వం చ కులం శుభాంగ్యాః||19||
శోకానిమిత్తాని తథా బహూని
ధైర్యార్జితాని ప్రవరాణి లోకే|
ప్రాదుర్నిమిత్తాని తదా బభూవుః
పురాపి సిద్ధా న్యుపలక్షితాని||20||

స|| అథ మృదుసర్వగాత్రీ సా తస్య నగస్య శాఖాం గృహీత్వా (ఉపస్థితా)| రామం రామానుజం స్వం కులం చ ప్రవిచింతయంత్యా శుభాంగ్యాః తస్యాః తు శోకానిమిత్తాని ధైర్యార్జితాని లోకే ప్రవరాణి తథా పురాపి సిద్ధాని ఉపలక్షితాని బహూని నిమిత్తాని ప్రాదుర్భభూవుః||

తా|| అప్పుడు మృదువైన శరీరము కల ఆ సీత, ఆ వృక్షముయొక్క శాఖలను పట్టుకొని నిలబడెను. రాముని రామానుజుని తన వంశమును తలచుకొనెను. అప్పుడు ఆమెకు శోకమును తొలగించు, ధైర్యమును కలిగించు, లోకములో ప్రసిద్ధమైనవి పూర్వము సత్ఫలితములను ఇచ్చినవి అయిన శుభ సూచకములు కనపడెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టావింశస్సర్గః||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయనములో సుందరకాండలో ఇరువది ఎనిమిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||