||సుందరకాండ ||

||ఇరువది తొమ్మిదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకోనత్రింశస్సర్గః

అనుకోకుండా ఇశ్వర్యము లభించినవాని దగ్గరకు ఆశ్రితులు చేరినట్లు దుఃఖముతో బాధలో నున్న, నిందింపబడలేని, కించిత్తు కూడా హర్షములేని, ఆ సీతాదేవిని శుభసూచనలు చుట్టు ముట్టినవి. అందమైన కేశములు గల ఆ సీత యొక్క నడుమ నల్లగా చుట్టూ తెల్లగా వున్నవిశాలమైన ఎడమ కన్ను, కొలనులో చేపచేత కొట్టబడి కదిలిన పద్మము వలె, స్పందించెను. గుండ్రముగా పుష్ఠముగా వున్న ఆమె ఎడమ భుజము, అగరు చందనములకు తగినట్టి చాలాకాలము ప్రియునికి తలగడలాగ ఒప్పారిన ఆమె ఎడమభుజము కూడా అప్పుడు కంపించినది. ఏనుగు తోండములా లావైన పరిపుష్ఠమైన అందమైన ఒకదానికొకటి దగ్గరగా ఉన్న ఆమె తొడలలో ఎడమ తొడ చలించి రాముడు ముందు నిలచినట్లు సూచించెను.

మళ్ళీ అమలమైన కళ్ళు , మంచిదంతముల వరుస, అందమైన అవయములు కల, బంగారముతో సమానమైన వర్ణముకల ఆ సీత నిలబడగా ధూళిచే కప్పబడిన ఆమె వస్త్రము శుభసూచకముగా కొంచెము పక్కకి జారెను.

ముందుకూడా సాధువులు సిద్ధులచే చెప్పబడి ఇదివరకు అనుభవపూర్వకముగా ఫలములను ఇచ్చిన ఈ శుభసూచనములచేత చక్కని కనుబొమ్మలు కల సీత, ఎండిపోయిన విత్తనము వర్షము పడగానే అంకురించిన రీతిలో, ఆనందపడెను.

అప్పుడు బింబాఫలములాంటి పెదవులు కల, అందమైన దంతములు, వంకర తిరిగిన కనురెప్పల తో విశాలమైన కళ్ళు కల ముఖముతో , రాహు ముఖము నుండి విడివడిన చంద్రుని వలె సీత ప్రకాశించెను. పూజ్యురాలైన , శోకమునుండి విడివడినట్టున్న, అలసత్వము పోయి హర్షముతో నిండి శుద్ధమైన మనస్సుతో ఉన్న ఆ సీత శుక్లపక్షము నాటి చల్లని చంద్రుని వలె శోభించెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఇరువది తొమ్మిదవ సర్గ సమాప్తము.

||ఓం తత్ సత్||