||సుందరకాండ ||

|| రెండవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 2 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ద్వితీయ సర్గః

శ్లో|| స సాగర మనాధృష్య మతిక్రమ్య మహాబలః|
త్రికూట శిఖరే లఙ్కాం స్థితాం స్వస్థో దదర్శ హ||1||

స||సః మహాబలః అనాధృష్యం సాగరం స్వస్థః అతిక్రమ్య త్రికూట శిఖరే స్థితామ్ లంకామ్ దదర్శ హ||

తా||ఆ మహాబలవంతుడైన హనుమంతుడు దాటుటకు కష్టమైన ఆ సాగరమును అతి సులభముగా దాటి త్రికూట పర్వత శిఖరముపై నున్న లంకానగరము చూచెను.

శ్లో|| తతః పాదపముక్తేన పుష్పవర్షేణ వీర్యవాన్ |
అభివృష్టః స్థితస్తత్ర బభౌ పుష్పమయౌ యథా||2||

స|| తతః తత్ర స్థితః వీర్యవాన్ పాదపముక్తేన పుష్పవర్షేణ అభివృష్టః పుష్పమయౌ యథా బభౌ||

తా||ఆక్కడ నుంచుని చెట్లనుంచిపడిన పుష్పవర్షముచే పూర్తిగా కప్పబడిన వాడై ఆ వీరుడైన హనుమంతుడు ఒక పుష్పముల కుప్ప వలె కనబడెను.

శ్లో|| యోజనానాం శతం శ్రీమాం స్తీర్త్యాఽప్యుత్తమవిక్రమః|
అనిశ్వృసన్ కపిస్తత్ర న గ్లానిం అధిగచ్ఛతి||3||

స|| శతం యోజనానామ్ తీర్త్వా అపి ఉత్తమ విక్రమః శ్రీమాన్ కపిః తత్ర గ్లానిం న అధిగచ్ఛతి||

తా|| వంద యోజనములు గల ఆ సాగరము దాటినప్పటికీ, ఆ పరాక్రమవంతుడైన హనుమంతుడు ఏమాత్రము అలసట పొందలేదు

శ్లో|| శతాన్యహం యోజనానాం క్రమేయం సుబహూన్యపి|
కి పునస్సాగరస్యాంతం సంఖ్యాతం శతయోజనమ్||4||

స|| అహం బహూని శతాన్యపి యోజనానాం క్రమేయం | కిం పునః శతయోజన సంఖ్యాతం సాగరస్య అంతం (ఇతి మన్యతామ్)||

తా|| "నేను అనేక వందల యోజనములు దాటగలను. అలాంటప్పుడు ఈ వందయోజనముల సాగరము గురించి ఏమి చెప్పాలి ?" ( అని హనుమంతుడు తనలో తాను అనుకొనెను)

శ్లో|| స తు వీర్యవతాంశ్రేష్ఠః ప్లవతామపి చోత్తమః|
జగామ వేగవాన్ లఙ్కాం లఙ్ఘయిత్వా మహోదధిమ్|| 5||

స||వీర్యవతాం శ్రేష్ఠః ప్లవతాం అపి ఉత్తమః సః తు వేగవాన్ మహోదధిం లఙ్ఘాయిత్వా లఙ్కా జగామ||

తా|| వీరులలో శ్రేష్ఠుడు, పైకి ఎగురగలవారిలో ఉత్తముడు , వానరరులలో ఉత్తముడు అగు ఆ హనుమంతుడు వేగముకలవాడై ఆ మహాసాగరము దాటి లంకను చేరెను.

శ్లో|| శాద్వలాని చ నీలాని గన్ధవన్తి వనాని చ|
గండవంతి చ మధ్యేన జగామ నగవంతి చ ||6||

స||(సః) నీలాని శాద్వలాని గన్ధవన్తి వనాని చ నగవన్తి గన్డవన్తి మధ్యేన జగామ||

తా|| అప్పుడు సుగంధములుగల నల్లని పచ్చిక బీళ్ళ వనములు రాళ్లతో నిండిన పర్వతముల మధ్యలో ఆ హనుమంతుడు వెళ్ళెను.

శ్లో|| శైలాంశ్చ తరుసంఛన్నాన్ వనరాజీశ్చ పుష్పితాః|
అభిచక్రామ తేజస్వీ హనుమాన్ ప్లవగర్షభః||7||

స|| ప్లవగర్షభః తేజస్వీ హనుమాన్ తరుసంఛన్నాన్ శైలాం చ పుష్పితాః వనరాజీశ్చ అభిచక్రామ||

తా|| ఆ తేజశ్వీ వానరోత్తముడు అగు హనుమంతుడు, చెట్లతో నిండిన పర్వతములను , పుష్పించుచున్న వృక్ష శ్రేణులను దాటి ముందుకు పోయెను.

శ్లో|| స తస్మిన్ అచలే తిష్ఠన్ వనాన్ ఉపవనాని చ|
స నగాగ్రే చ తాం లఙ్కాం దదర్శ పవనాత్మజః|| 8||

స|| సః పవనాత్మజః తస్మిన్ అచలే తిష్ఠన్ వనాని ఉపవనాని చ నగాగ్రే తాం లఙ్కాం దదర్శ||

తా|| ఆ పవనాత్మజుడు ఆ కొండమీద నుంచుని వనములు, ఉపవనములను, ఆ పర్వత శిఖరముపై నున్న లంకానగరమును చూచెను.

శ్లో|| సరళాన్ కర్ణికారాంశ్చ ఖర్జురాంశ్చ సుపుష్పితాన్|
ప్రియాళాన్ ముచిళిందాంశ్చ కుటజాన్కేతకానపి||9||
ప్రియాంగూన్ గంధపూర్ణాంశ్చనీపాన్ సప్తచ్ఛదాం స్తథా|
ఆసనాన్ కోవిదారాంశ్చ కరవీరాంశ్చ పుష్పితాన్ ||10||
పుష్పభార నిబద్ధాంశ్చ తథా ముకుళితా నపి |
పాదపాన్ విహాగకీర్ణాన్ పవనాధూత మస్తకాన్ || 11||
హంసకారండవాకీర్ణా వాపీః పద్మోత్పలాయుతాః|
అక్రీడాన్ వివిధాన్ రమ్యాన్ వివిధాంశ్చ జలాశయాన్ ||12||
సంతతాన్ వివిధై ర్వృక్షైః సర్వర్తు ఫలపుష్పితైః|
ఉద్యానాని చ రమ్యాణి దదర్శ కపికుంజరః||13||

స|| (సః) సరళాన్ కర్ణికారాం చ సుపుష్పితాన్ ఖర్జూరాంశ్చప్రియాళాన్ ముచిళిందాంశ్చ (దదర్శ)|| (సః)కుటజాన్ కేతకాన్ అపి గన్ధపూర్ణాన్ నీపాన్ ప్రియాంగూంశ్చ తథా సప్తచ్ఛదాం ఆసనాన్ పుష్పితాన్ కరవీరాంశ్చ (దదర్శ) || పుష్పాభార నిబద్ధాంశ్చ తథా ముకుళితానపి విహాగ కీర్ణాన్ పవనాధూత మస్తకాన్ పాదపాన్ (దదర్శ)|| హంసకారండవాకీర్ణా వాపిః పద్మోత్పలాయుతాః వివిధాన్ రమ్యాన్ అక్రీడాన్ జలాశయాన్ ( దదర్శ)|| సర్వ ఋతు ఫలపుష్పితైఃవివిధైః వృక్షైః సంతతాన్ రమ్యాణి ఉద్యానాని చ కపికుంజరః దదర్శ||

తా|| (ఆ పర్వతము మీద) సరళ వృక్షములు కర్ణికారములు పుష్పించుచున్న ఖర్జూరవృక్షములను అలాగే ప్రియాళా ముచిళిందా కుటజ కేతకా వృక్షములను హనుమంతుడు చూచెను. అలాగే నీపా ప్రియంగు సప్తచ్చదా వృక్షములను , అసనా , పుష్పించుచున్న కరవీర వృక్షములను చూచెను. అలాగే హనుమంతుడు పుష్పముల భారముతో వంగిన, మొగ్గలతో నిండిన , పక్షులతో నిండిన, గాలిచేత ఊగింపబడుతున్నకొమ్మలు గల వృక్షములను చూచెను. హంసలూ కారండములతో నిండియున్నజలాశయములను, తామర కలువ పువ్వులతో నిండియున్నమనోహరమైన జలాశయములనుచూచెను. అన్ని ఋతువులలోను పుష్పించు అనేకరకములైన వృక్షములతో కూడిన రమ్యమైన ఉద్యానవనములను ఆ కపికుంజరుడు చూచెను.

శ్లో|| సమాసాద్య లక్ష్మీవాన్ లఙ్కాం రావణపాలితామ్|
పరిఘాభిః సపద్మాభిః ఉత్పలాభిరలంకృతామ్||14||
సీతాపహరాణార్థేన రావణేన సురక్షితామ్|
సమంతా ద్విచరద్భిశ్చ రాక్షసైః ఉగ్రధన్విభిః||15||
కాంచనేనావృతాం రమ్యాం ప్రాకారేణ మహాపురీమ్|
గృహైశ్చ గ్రహసంకాశైః శారదాంబుదసన్నిభైః||16||
పాడురాభిః ప్రతోళీభి రుచ్చాభి రభిసంవృతామ్|
అట్టాలశతాకీర్ణాం పతాకాధ్వజమాలినీమ్||17||
తోరణైః కాంచనైర్దివ్యైః లతాపఙ్క్తివిచిత్రితైః|
దదర్శ హనుమాన్ లఙ్కా దివి దేవ పురీమ్ యథా||18||

స||లక్ష్మీవాన్ (హనుమాన్) రావణపాలితాం లఙ్కాం సమాసద్య పరిఘాభిః సపద్మాభిః ఉత్ప్లాభి అలంకృతామ్ (దదర్శ) || సీతాపహరణార్థేన సురక్షితామ్ ఉగ్రధన్విభిః విచరద్భిః రాక్షసైః సమంతాత్ (లంకాం దదర్శ) || కాంచనేన ప్రాకారేణ ఆవృతాం రమ్యాం మహాపురీం గ్రహసంకాశైః శారదాంబుదసన్నిభైః గృహైశ్చ (లఙ్కాం దదర్శ) || పాణ్దురాభిః ఉచ్ఛాభిః పతాకధ్వజమాలినీమ్ అట్టాలశతాకీర్ణామ్ అభిసంవృతామ్ ప్రతోలీభిః (లఙ్కాం దదర్శ) || దివ్యైః కాంచనైః లతాపఙ్క్తివిచిత్రితైః తోరణైః దివి దేవపురీమ్ యథా లఙ్కాం దదర్శ||

తా|| లక్ష్మితో శోభించుచున్నఆ హనుమంతుడు రావణునిచే పాలింపబడు లంకను చేరి పద్మములుతో కలువలతో నిండియున్న తటాకములతో చుట్టబడియున్న ఆ లంకా నగరమును చూచెను. సీతను అపహరించడమువలన కలిగిన భయముతో బాగుగా రక్షింపబడుచున్న, భయంకరమైన ధనస్సులతో చరించుచున్న రాక్షసులతో నిండినది ఆ లంకా నగరము. బంగారపు ప్రాకారములతో నున్న రమ్యమైన గ్రహములతో సమానమైన, నీటితో నిండిన మేఘములతో సమానమైన గృహములతో నిండియున్న లంకానగరమును చూచెను. తెల్లగానున్న ఎత్తైన , పతాకములతో నిండిన ప్రధాన వీధులతో , వందలకొలది కోట బురుజులతో లంక నిండి ఉండెను. బంగారుమయమైన లతల పంక్తులతో అలరారుతున్న, తోరణములతో నిండియున్న దేవపురియగు అమరావతిలా అలరారుచున్న లంకానగరమును హనుమంతుడు చూచెను.

శ్లో|| గిరిమూర్ధ్ని స్థితాం లఙ్కాం పాండురైర్భవనై శ్శుభైః|
దదర్శ కపిశ్రేష్ఠః పురం ఆకాశగం యథా||19||

స|| సః కపిశ్రేష్ఠః పాణ్డురైః శుభైః భవనైః గిరిమూర్ధ్ని స్థితాం ఆకాశగం యథా పురీం లఙ్కాం దదర్శ||

తా|| ఆ వానరోత్తముడు ఆపర్వతశిఖరముపైనున్న , శోభాయమానమైన తెల్లని భవనములతో నిండిన, ఆకాశములోనున్నదా అన్నట్లు ఉన్న ఆ లంకానగరమును చూచెను.

శ్లో|| పాలితాం రాక్షసేంద్రేణ నిర్మితాం విశ్వకర్మణా|
ప్లవమానా మివాకాశే దదర్శ హనుమాన్ పురీమ్||20||
వప్రప్రాకార జఘానాం విపులామ్బునవామ్బురామ్|
శతఘ్నీశూలకేశాన్తా మట్టాలకవతంసకామ్||21||
మనసేవ కృతాం లంకాం నిర్మితాం విశ్వకర్మణా|
ద్వార ముత్తర మాసాద్య చిన్తయామాస వానరః||22||

స|| హనుమాన్ విశ్వకర్మణా నిర్మితం రాక్షసేంద్రేణ పాలితాం అకాశే ప్లవమానివ పురీం దదర్శ|| వానరః ఉత్తర ద్వారమ్ ఆసాద్య విశ్వకర్మణా నిర్మితాం లంకామ్ వప్రప్రాకార జఘనాం విపులామ్బునవామ్బురామ్ శతఘ్నీ శూలకేశాన్తామ్ అట్టాలకవతంశకామ్ ఇవ మనః కృతామ్ ఇతి చిన్తయామాస ||

తా||హనుమంతుడు విశ్వకర్మచేత నిర్మింపబడిన, రాక్షసేంద్రుడు అగు రావణునిచేత పాలింపబడిన, ఆకాశములో ఊగుతున్నదా అన్నట్లు వున్న లంకానగరమును చూచెను. విశ్వకర్మ ప్రాకారాలే జఘనముగాను, తటాకములలోని నీరే వస్త్రముగను, శతఘ్నులు శూలాలు కేశపాశములగనూ, కోటఋజులు కర్ణభూషణములుగనూ ఒప్పారే స్త్రీ వలే లంకానగరము నిర్మించెనా అని, ఉత్తరద్వారమువద్దకు వచ్చిన హనుమంతుడు తలపోసెను.

శ్లో|| కైలాసశిఖర ప్రఖ్యాం ఆలిఖన్తీ మివామ్బురామ్|
డీయమానా మివాకాశం ఉచ్ఛ్రితైర్భవనోత్తమైః||23||
సమ్పూర్ణాం రాక్షసై ర్ఘోరైర్నాగై భోగవతీమివ |
అచిన్త్యాం సుకృతాం స్పష్టాం కుబేరాధ్యుషితాం పురా||24||
దంష్ట్రిభిః బహుభి శ్శూరై శ్శూలపట్టసపాణిభిః|
రక్షితాం రాక్షసైర్ఘోరై ర్గుహా మాశీవిషై రివ|| 25||
తస్యాశ్చ మహతీం గుప్తిం సాగరం నిరీక్ష్య సః|
రావణం చ రిపుం ఘోరం చింతయామాస వానరః||26||

స||కైలాస శిఖర ప్రఖ్యాం అమ్బరం ఆలిఖన్తీం ఇవ ఉచ్ఛ్రితైః ఆకాశం డియమనాఇవ భవనోత్తమైః ( నిరీక్ష్య చ ), నాగైః భోగవతీంఇవ ఘోరైః రాక్షసైః సంపూర్ణామ్ పురా కుబేరాధ్యుషితాం సుకృతమ్ అచిన్త్యాం ( నిరీక్ష్య చ), దంష్ట్రభిః ఆశీవిషైః గుహామ్ ఇవ బహుభిః శూలపట్టస పాణిభిః వీరైః రక్షితామ్ ( లంకాం నిరీక్ష్య చ ), తస్యాః మహతీం గుప్తిం సాగరం చ రిపుం రావణం చ నిరీక్ష్య సః వానరః చిన్తయామాస||

తా|| కైలాస పర్వతశిఖరములా ఆకాశాన్ని అంటుతూ వున్నట్లు వున్న, అకాశములో ఎగురుతున్నట్లు ఉన్న అత్యున్నతభవనములతో , (పాతాళలోకములోని) భోఘవతీ నగరము లాగా భయంకరమైన రాక్షసులతో నిండివున్న, పూర్వకాలంలో కుబేరుని ఆవాసమై ఒప్పిన, ఊహాతీతముగా అలంకరింపబడిన, శూలములు ఖడ్గములు చేతిలో ధరించి విషకోరలతో వున్నపాములచేత గుహ రక్షింపబడినట్లు, అనేకమంది శూరులచేత రక్షింపబడుతున్న లంకను చూచెను. ఆ లంకయొక్క ఆరక్షణ విధానమును, సముద్రమును, శత్రువు అగు రావణుని చూచి హనుమంతుడు ఇట్లు అనుకొనెను.

శ్లో|| ఆగత్యాపీహ హరయో భవిష్యంతి నిరర్థకాః|
న హి యుద్ధేన వై లంకా శక్యా జేతుం సురైరపి||27||
ఇమాం విషమాం దుర్గాం లఙ్కాం రావణపాలితాం|
ప్రాప్యాపి స మహాబాహుః కిం కరిష్యతి రాఘవః||28||

స|| హరయః ఇహ ఆగత్యా అపి నిరర్థకాః భవిష్యన్తి| సురైరపి లఙ్కా యుద్ధేన జేతుం న శక్యా హి|| ఇమాం రావణ పాలితాం విషమాం దుర్గామ్ ప్రాప్యాపి స మహాబాహుః రాఘవః (రామః ) కిం కరిష్యతి ||

తా|| 'వానరులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమి లాభము లేదు. సురులు కూడా లంకను యుద్ధములో జయించలేరు. మహాబాహువుడగు రాఘవుడు కూడా ఈ రావణునిచే పాలింపబడు దుష్కరమైన లంకానగరమునకు వచ్చి ఏమి చేయ గలడు?'

శ్లో|| అవకాశో న సాన్త్వస్య రాక్షసేష్వభిగమ్యతే|
న దానస్య న భేదస్య నైవ యుద్ధస్య దృశ్యతే||29||
చతుర్ణామేవ హి గతిః వానరాణాం మహాత్మనామ్|
వాలిపుత్రస్య నీలస్య మమ రాజ్ఞశ్చ ధీమతః||30||
యావజ్జానామివైదేహీం యది జీవతివా నవా|
తత్రైవ చింతయిష్యామి దృష్ట్వా తాం జనకాత్మజమ్||31||

స|| రాక్షషేషు సాన్త్వస్య అవకాశః న అభిగమ్యతే | దానస్య న| భేదస్య న| యుద్ధస్య నైవ దృశ్యతే|| వాలిపుత్రస్య నీలస్య మమ ధీమతః రాజ్ఞశ్చ మాహాత్మనాం చతుర్ణాం వానరాణాం ఏవ గతిః హి ||వైదేహీం యది జీవతి వా న వా యావత్ జానామి తాం జనకాత్మజం దృష్ట్వా తత్రైవ చిన్తయిష్యామి||

తా|| 'రాక్షసులతో రాజీపడుటకు అవకాశము లేదు. దాన భేద ములకు అస్కారములేదు. యుద్ధము కూడా సులభము కాదు. మహాత్ములగు వాలిపుత్రుడు, నీలుడు , ధీమంతుడైన రాజు( సుగ్రీవుడు), మేము నలుగురమే ఇక్కడికి రాగలము. వైదేహి జీవించియునదో లేదో తెలిసికొని , జనకాత్మజను చూచి అప్పుడే ఆలోచించెదను'.

శ్లో|| తతస్సచింతయామాస ముహూర్తం కపికుంజరః|
గ్రిరిశృఙ్గే స్థితః తస్మిన్ రామస్యాభ్యుదయే రతః||32||

స|| తతః సః కపికుంజరః తస్మిన్ గిరిశృఙ్గే స్థితః రామస్య అభ్యుదయే రతః ముహూర్తం చిన్తయామాస||

తా|| అప్పుడు ఆ కపికుంజరుడు ఆ పర్వతశిఖరములలో నిలబడి, రామాభ్యుదయము కోరుతూ ముహూర్తకాలము పాటు ఆలోచించసాగెను.

శ్లో|| అనేన రూపేణ మయా న శక్యా రక్షసాం పురీ|
ప్రవేష్ఠుం రాక్షసైర్గుప్తా క్రూరైర్బలసమన్వితైః||33||
ఉగ్రౌజసో మహావీర్యా బలవంతశ్చ రాక్షసాః|
వంచనీయా మయా సర్వే జానకీం పరిమార్గతా||34||
లక్ష్యాలక్ష్యేణ రూపేణ రాత్రౌ లఙ్కాపురీ మయా|
ప్రవేష్టుం ప్రాప్తకాలం మే కృత్యం సాధయితుమ్ మహత్||35||

స|| క్రూరైః బలసమన్వితైః రాక్షసైః గుప్తా రక్షసాం పురీ అనేన రూపేణ ప్రవేష్టుం న శక్యా || జానకీం పరిమార్గితా మయా ఉగ్రౌజసః మహావీర్యాః బలవన్తశ్చ రాక్షసాః సర్వే వంచ నీయాః || మహత్ కృత్యం సాధయితుం మయా లక్ష్యా లక్ష్యేణ రూపేణ రాత్రౌ లఙ్కాపురీం ప్రవేష్టుం ప్రాప్తకాలమ్ రాత్రౌ (హి)||

తా|| 'క్రూరులు బలవంతులు అగు రాక్షసులచే రక్షింపబడు ఈ నగరమును ఈ రూపముతో ప్రవేశించ లేను. జానకిని వెదుకుతూ ఉగ్రమైన తేజస్సు కల, మహావీరులు బలవంతులు అగు రాక్షసులను అందరినీ మోసగించవలసినదే. మహత్తరమైన లక్ష్యము సాధించుటకు కనీకనపడని రూపము ధరించి లంకానగరము ప్రవేశించుటకు రాత్రికాలమే మంచిది'.

శ్లో|| తాం పురీం తాదృశీం దృష్ట్వా దురాధర్షాం సురాసురైః|
హనుమాన్ చింతయామాస వినిశ్చిత్య ముహుర్ముహుః|| 36||

స||సురాసురైః దురాదర్షం తాం పురీం దృష్ట్వా ముహుర్ముహుః హనుమాన్ చిన్తయామాస||

తా|| సురాసురులకు కూడా దుర్భేద్యమైన ఆ నగరమును చూచి ,ఆ హనుమంతుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించసాగెను.

శ్లో|| కేనోపాయేన పశ్యేయం మైథిలీం జనకాత్మజామ్|
అదృష్ఠో రాక్షసేంద్రేణ రావణేన దురాత్మనా||37||
న వినశ్యేత్ కథం కార్యం రామస్య విదితాత్మనః|
ఏకామేకశ్చ పశ్యేయం రహితే జనకాత్మజామ్||38||

స|| దురాత్మనా రావణేన అదృష్టో కేనోపాయేన మైథిలీం జనకాత్మజాం పశ్యేయం||విదితాత్మనః రామస్య కార్యం కథం న వినశ్యేత్ | ఏకశ్చ రహితే జనకాత్మజామ్ ఏకామ్ పశ్యేయం ||

తా|| 'దురాత్ముడైన రావణునికి కనపడకుండా ఏ ఉపాయముతో జనకాత్మజ అగు మైథిలిని చూడగలను? ఆత్మస్వరూపమెరిగిన రామునియొక్క కార్యము ఏవిధముగాను భంగముకాకుండు నట్లుగా ఏలా చేయవలెను? ఏకాంతముగా వున్న జనకాత్మజను ఒంటరిగా ఎట్లు చూడగలను"

శ్లో|| భూతశ్చార్థా విపద్యంతే దేశకాలవిరోధితాః|
విక్లబం దూతమాసాద్య తమ సూర్యోదయే యథా||39||
అర్థానర్థాంతరే బుద్ధిర్నిశ్చితాఽపి నశోభతే |
ఘాతయంతి హి కార్యాణి దూతాః పండితమానినః||40||

స|| సూర్యోదయే తమః యథా విపద్యన్తే ( తథైవ) దేశకాలావిరోధితాః భూతశ్చార్థాః విక్లబం దూతం ఆసాద్య (విపద్యన్తే)|| అర్థానర్థాన్తరే నిశ్చితాపి బుద్ధిః నశోభతే దూతాః పండితమానితాః కార్యాణి ఘాతయంతి ||

తా|| 'సూర్యోదయము చీటిని పారదోచినట్లు , అలోచనారహితులగు దూతల ద్వారా సాధ్యమగు పనులు అసాధ్యము అవుతాయి. బుద్ధి తో ఆలోచించి నిశ్చయించిన పని కూడా తామే పండితులమనుకొనే దూతల ద్వారా నాశనమౌతుంది'.

శ్లో|| న వినశ్యేత్ కథం కార్యం వైక్లబ్యం న కథం భవేత్|
లంఘనం చ సముద్రస్య కథం ను న వృథాభవేత్||41||
మయి దృష్టే తు రక్షోభి రామస్య విదితాత్మనః|
భవేద్వర్థమిదం కార్యం రావణానర్థ మిచ్ఛతః||42||

స|| కార్యం కథం వినశ్యేత్ | వైక్లబ్యం కథమ్ నభవేత్ | సముద్రస్య లంఘనం కథం ను న వృథాభవేత్|| యది మయి రక్షోభి దృష్టే తు విదితాత్మనః రావణానర్థం ఇచ్ఛతః రామస్య ఇదం కార్యం వ్యర్థం భవేత్ ||

తా|| 'కార్యము ఎట్లు భంగము కాకూడదు? అవివేకము ఎట్లు దూరము చేయవలెను? సముద్రలంఘనము వృధా కాకూండా ఎట్లు పని చేయవలెను? నేను (రాక్షసులచేత) చూడబడినచో రావణుని అనర్ధము కోరు ఆత్మతత్వము ఎరిగిన రాముని యొక్క ఈ కార్యము వ్యర్ధము అగును'.

శ్లో|| న హి శక్యం క్వచిత్ స్థాతుం అవిజ్ఞాతేన రాక్షసైః|
అపి రాక్షస రూపేణ కిముతాన్యేన కేన చిత్||43||
వాయురప్యత్ర నాజ్ఞాతః చరేత్ ఇతి మతిర్మమ|
న హ్యస్త విదితం కించిత్ రాక్షసానాం బలీయసామ్||44||

స|| రాక్షస రూపేణాపి రాక్షసైః అవిజ్ఞాతేన స్థాతుం న హి శక్యం | అన్యేన కేనచిత్ ( రూపేణ) కిముత|| అత్ర వాయుః అపి న ఆజ్ఞాతః చరేత్ ఇతి మమ మతిః| బలీయసాం రాక్షసానాం కించిత్ (అపి) అవిదితం నాస్తి హి ||

తా|| (ఇక్కడ) రాక్షసరూపములో కూడా రాక్షసులకు తెలియకుండా వుండలేము. అటువంటి సందర్భములో ఈ రూపము గురించి చెప్పనేల? ఇక్కడ వాయువు కూడ ఆజ్ఞలేకుండా వీచదు అని నా అభిప్రాయము. బలవంతులగు రాక్షసులకు తెలియని విషయము ఏమీ లేదు.'

శ్లో|| ఇహాహం యది తిష్టామి స్వేన రూపేణ సంవృతః|
వినాశముపయాస్యామి భర్తురర్థశ్చ హీయతే||45||
తదహం స్వేన రూపేణ రజన్యాం హ్రస్వతాం గతః|
లఙ్కాం అభిపతిష్యామి రాఘవస్యార్థ సిద్ధయే||46||

స|| యది స్వేన రూపేణ సంవృతః అహం ఇహ తిష్ఠామి వినాశం ఉపయాస్యామి| భర్తుః అర్థశ్చ హీయతే|| తతః రాఘవస్య అర్థ సిద్ధయే అహం స్వేన రూపేణ హ్రస్వతాం గతః రజన్యాం లఙ్కాం అభిపతిష్యామి||

తా|| 'నేను నాస్వరూపముతో ఇక్కడ వుంటే నాశనము తప్పదు. రాజకార్యము చెడిపోవును. అందువలన రాముని కార్యము సిద్ధించుటకు నా స్వరూపము చిన్నది చేసి రాత్రి లంకానగరములో ప్రవేశించెదను.'

శ్లో|| రావణస్య పురీమ్ రాత్రౌ ప్రవిశ్య సుదురాసదామ్|
విచిన్వన్ భవనం సర్వం ద్రక్ష్యామి జనకాత్మజామ్||47||
ఇతి సంచిత్య హనుమాన్ సూర్యస్యాస్తమయం కపిః|
ఆచకాంక్షే తదా వీరో వైదేహ్యా దర్శనోత్సుకః||48||

స|| సుదురాసదం రావణస్య పురీం రాత్రౌ ప్రవిశ్య సర్వం భవనం విచిన్వన్ జనకాత్మజాం ద్రక్ష్యామి|| హనుమాన్ వీరః ఇతి సంచిత్య తదా కపిః వైదేహ్యా దర్శనోత్సుకః సూర్యస్య అస్తమయం ఆచకాంక్షే||

తా|| 'దుష్కరమైన ఈ లంకానగరమును రాత్రిలో ప్రవేశించి అన్ని భవనములు వెదికి జనకాత్మజను చూచెదను. హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి జానకిని దర్శించాలన్న ఉత్సాహముతో సూర్యాస్తమయము కొఱకు వేచియుండెను.'

శ్లో|| సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతిః|
వృషదంశకమాత్రస్సన్ బభూవాద్భుత దర్శనః||49||
ప్రదోషకాలే హనుమాంస్తూర్ణ ముత్ప్లుత్య వీర్యవాన్|
ప్రవివేశ పురీం రమ్యాం సువిభక్త మహాపథామ్||50||

స|| మారుతిః సూర్యే చ అస్తం గతే వృషదంశకమాత్రః సన్ దేహం సంక్షిప్య అద్భుత దర్శనః బభూవ|| వీర్యవాన్ హనుమాన్ ప్రదోషకాలే తూర్ణం ఉత్ప్లుత్య సువిభక్తమహాపథాం రమ్యాం పురీం ప్రవివేశ||

తా|| 'ఆ మారుతి సుర్యాస్తమయమైనపుడు తన దేహమును చూచుటకు ఆశ్చర్యము కొలుపు నట్లు పిల్లి అంత ప్రమాణముగా చేసికొనెను. ఆ వీరుడైన హనుమంతుడు ప్రదోషకాలములో క్షణములో దూకి ప్రధాన మార్గములతో చక్కగా విభజించ బడిన ఆ లంకానగరము ప్రవేశించెను.'

శ్లో|| ప్రాసాదమాలావితతమ్ స్తంభైః కాంచన రాజతైః|
శాతకుంభమయై ర్జాలైః గంధర్వనగరోపమామ్|| 51||
సప్తభౌమాష్టభౌమైశ్చ ముక్తాజాల విభూషితైః|
తలైః స్ఫాటిక సంకీర్ణైః కార్తస్వరవిభూషితైః||52||
వైడూర్యమణిచిత్రైశ్చ ముక్తాజాల విభూషితైః|
తలైః శుశ్శుభిరే తాని భవనాన్యత్ర రక్షసామ్||53||

స|| సః ప్రాసాదమాలావితతామ్ కాంచన రాజతైః స్తంభైః శాతకుంభమయైః జాలైః గంధర్వ నగరోపమమ్ ( మహాపురీమ్ దదర్శ) || సప్తభౌమాష్టభౌమైశ్చ ముక్తాజాలవిభూషితైః స్ఫాటిక సంకీర్ణైః తలైః కార్తస్వర విభూషితైః (మహాపురీం దదర్శ) || అత్ర రక్షసాం భవనాని వైఢూర్యమణి చిత్రైశ్చ ముక్తాజాలవిభూషితైః తలైః శుశుభిరే||

తా|| (అప్పుడు హనుమంతుడు) ప్రాసాదాల శ్రేణులతో నిండిన, బంగారు వెండి స్తంభములతో కూడిన, బంగారు జాలలతోకూడిన గంధర్వనగరములా వున్న నగరము చూచెను. స్ఫటికములు మాణిక్యములతో బంగారముతో అలంకరింపబడిన ఏడు ఎనిమిది అంతస్తులు కల భవనములతో నిండియున్న నగరము చూచెను. ఆ రాక్షసుల భవనములు వైఢూర్యములు మాణిక్యములతో చిత్రించబడిన అంతస్తులతో శోభించుచున్నవి.

శ్లో|| కాంచనాని చ చిత్రాణి తోరణాని చ రక్షసామ్|
లంకాముద్యోతయామాసుః సర్వతః సమలంకృతామ్||54||
అచింత్యా మద్భుతాకారం దృష్ట్వా లఙ్కాం మహాకపిః|
ఆసీద్విషణ్ణో హృష్టశ్చ వైదేహ్యా దర్శనోత్సుకః||55||

స|| రక్షసామ్ కాంచనాని చిత్రాణి తోరణాని సమలంకృతామ్ లంకాం సర్వతః ఉద్యోతయామాసుః|| మహాకపిః అచిన్త్యాం అద్భుతాకారం లంకాం దృష్ట్వా వైదేహ్యా దర్శనోత్సుకః హృష్టశ్చ విషణ్ణః ఆసీత్ ||

తా|| రాక్షసుల భవనములు బంగారముతో రంగురంగుల తోరణాలతో అలంకరింపబడి లంకానగరమును అన్నిచోటలా ప్రకాశింపచేస్తున్నాయి. ఆ మహాకపి ఉహాతీతమైన అద్భుతాకారములు గల లంకను చూచి ఒకవైపు దిగులు, వైదేహిని చూడాలనే ఉత్సాహముతో ఇంకొకవైపు సంతోషముపడెను.

శ్లో|| స పాణ్డురావిద్ధ విమానమాలినీమ్ మహార్హజాంబూనద జాలతోరణామ్|
యశస్వినీం రావణబాహుపాలితామ్ క్షపాచరై ర్భీమబలైః సమావృతామ్|| 56||

స|| సః పాణ్డురావిద్ధవిమానమాలినీమ్ మహార్హజాంబూనదజాల తోరణామ్ యశస్వినీం భీమబలైః క్షపాచారైః సమావృతాం రావణ బాహు పాలితామ్ (లంకాం దదర్శ)

తా|| హనుమంతుడు తెల్లని మహోన్నతమైన భవనములతో కూడిన , బంగారు ద్వారాలు తోరణాలుగల , యశోవంతులైన మహాబలవంతులైన రాక్షసులచే రక్షింపబడి రావణునిచే పాలింపబడుచున్నఆ లంకా నగరము చూచెను.

శ్లో|| చంద్రోఽపి సాచివ్య మివాస్య కుర్వన్ తారాగణైర్మధ్యగతో విరాజన్|
జ్యోత్స్నావితానేన వితత్యలోకం ఉత్తిష్టతేనైకసహస్రరశ్మిః||57||
శంఖప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్ఛమానం వ్యవభాసమానమ్|
దదర్శ చన్ద్రం స హరిప్రవీర పోప్లూయమానం సరసీవ హంసమ్||57||

స|| నైక సహస్ర రస్మిభిః చన్ద్రోsపితారాగణైః మధ్యగతః విరాజన్ లోకమ్ జ్యోత్స్నావితానేన వితత్య అస్య సాచివ్యం కుర్వన్నివ ఉత్తిష్ఠతే|| సః హరిప్రవీరః ఉద్గచ్ఛమానం శంఖప్రభమ్ వ్యవభాసమానమ్ క్షీరమృణాలవర్ణమ్ సరసి పోప్లూయమానమ్ హంసం ఇవ చన్ద్రం దదర్శ||

తా|| అప్పుడు చంద్రుడు వేయి కిరణాలతో తారాగణముల మధ్య విరాజిల్లిచూ తన వెన్నెలతో హనుమంతునికి సహయము చేస్తున్నాడా అన్నట్లు లోకాన్ని నింపాడు. అప్పుడు శంఖము పాలు తామరపూవు వంటి తెల్లని కాంతితో , సరోవరములో పయనిస్తున్న హంసలాగ ఆకాశములో పైపైకి వస్తూవున్న చంద్రుని హనుమంతుడు చూచెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్వితీయ స్సర్గః||

ఈ విధముగా ఆదికావ్యమైన వాల్మీకి రామాయణములో రెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||