||సుందరకాండ ||

|| రెండవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||

శ్లో|| స సాగర మనాధృష్య మతిక్రమ్య మహాబలః|
త్రికూట శిఖరే లంకాం స్థితాం స్వస్థో దదర్శ హ||1||

తా||ఆ మహాబలవంతుడైన హనుమంతుడు దాటుటకు కష్టమైన ఆ సాగరమును అతి సులభముగా దాటి త్రికూట పర్వత శిఖరముపై నున్న లంకానగరము చూచెను.

||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ద్వితీయ సర్గః

ఆ మహాబలవంతుడైన హనుమంతుడు దాటుటకు కష్టమైన ఆ సాగరమును అతి సులభముగా దాటి లంకను చేరి అప్పుడు త్రికూట పర్వత శిఖరముపై నున్న లంకానగరము చూచెను.

ఆక్కడ నుంచుని చెట్లనుంచిపడిన పుష్పవర్షముచే పూర్తిగా కప్పబడిన వాడై ఆ వీరుడైన హనుమంతుడు ఒక పుష్పముల కుప్ప వలె కనబడెను. వంద యోజనములు గల ఆ సాగరము దాటినప్పటికీ, ఆ పరాక్రమవంతుడైన హనుమంతుడు ఏమాత్రము అలసట పొందలేదు

"నేను అనేక వందల యోజనములు దాటగలను. అలాంటప్పుడు ఈ వందయోజనముల సాగరము గురించి ఏమి చెప్పాలి ?" అని హనుమంతుడు తనలో తాను అనుకొనెను.

వీరులలో శ్రేష్ఠుడు, పైకి ఎగురగలవారిలో ఉత్తముడు , వానరులలో ఉత్తముడు అగు ఆ హనుమంతుడు వేగముకలవాడై, ఆ మహాసాగరము దాటి లంకలో దిగిన పిమ్మట సుగంధములుగల నల్లని పచ్చిక బీళ్ళ వనములు, రాళ్లతో నిండిన పర్వతముల మధ్యలో ఆ హనుమంతుడు ముందుకు వెళ్ళెను. ఆ తేజశ్వీ వానరోత్తముడు అగు హనుమంతుడు, చెట్లతో నిండిన పర్వతములను , పుష్పించుచున్న వృక్ష శ్రేణులను దాటి ముందుకు పోయెను. ఆ పవనాత్మజుడు ఆ కొండమీద నుంచుని వనములు, ఉపవనములను, ఆ పర్వత శిఖరముపై నున్న లంకానగరమును చూచెను.

ఆ పర్వతము మీద సరళ వృక్షములు కర్ణికారములు పుష్పించుచున్న ఖర్జూరవృక్షములను అలాగే ప్రియాళా ముచిళిందా కుటజ కేతకా వృక్షములను హనుమంతుడు చూచెను. అలాగే నీపా ప్రియంగు సప్తచ్చదా వృక్షములను , అసనా , పుష్పించుచున్న కరవీర వృక్షములను చూచెను. అలాగే హనుమంతుడు పుష్పముల భారముతో వంగిన, మొగ్గలతో నిండిన , పక్షులతో నిండిన, గాలిచేత ఊగింపబడుతున్నకొమ్మలు గల వృక్షములను చూచెను. హంసలూ కారండములతో నిండియున్నజలాశయములను, తామర కలువ పువ్వులతో నిండియున్నమనోహరమైన జలాశయములనుచూచెను. అన్ని ఋతువులలోను పుష్పించు అనేకరకములైన వృక్షములతో కూడిన రమ్యమైన ఉద్యానవనములను ఆ కపికుంజరుడు చూచెను.

లక్ష్మితో శోభించుచున్నఆ హనుమంతుడు రావణునిచే పాలింపబడు లంకను చేరి పద్మములుతో కలువలతో నిండియున్న తటాకములతో చుట్టబడియున్న ఆ లంకా నగరమును చూచెను. సీతను అపహరించడమువలన కలిగిన భయముతో బాగుగా రక్షింపబడుచున్న, భయంకరమైన ధనస్సులతో కాపలాకాయుచూ తిరుగుచున్న రాక్షసులతో నిండినది ఆ లంకా నగరము.

బంగారపు ప్రాకారములతో నున్న, రమ్యమైన గ్రహములతో సమానమైన, నీటితో నిండిన మేఘములతో సమానమైన గృహములతో నిండియున్న లంకానగరమును చూచెను. తెల్లగానున్న ఎత్తైన , పతాకములతో నిండిన ప్రధాన వీధులతో, వందలకొలది కోట బురుజులతో లంక నిండి ఉండెను. బంగారుమయమైన లతల పంక్తులతో అలరారుతున్న, తోరణములతో నిండియున్న దేవపురియగు అమరావతిలా అలరారుచున్న లంకానగరమును హనుమంతుడు చూచెను.

ఆ పర్వతశిఖరముపైనున్న , శోభాయమానమైన తెల్లని భవనములతో నిండిన లంకానగరము, ఆకాశములోనున్నదా అన్నట్లు ఉండెను.

విశ్వకర్మచేత నిర్మింపబడిన, రాక్షసేంద్రుడు అగు రావణునిచేత పాలింపబడిన, ఆ లంకానగరము ఆకాశములో ఊగుతున్నదా అన్నట్లు ఉండెను. విశ్వకర్మ ప్రాకారాలే జఘనముగాను, తటాకములలోని నీరే వస్త్రముగను, శతఘ్నులు శూలాలు కేశపాశములగనూ, కోటఋజులు కర్ణభూషణములుగనూ ఒప్పారే స్త్రీ వలే, ఈ లంకానగరము నిర్మించెనా అని ఉత్తరద్వారమువద్దకు వచ్చిన హనుమంతుడు తలపోసెను.

కైలాస పర్వతశిఖరములా ఆకాశాన్ని అంటుతూ వున్నట్లు వున్న, అకాశములో ఎగురుతున్నట్లు ఉన్న, అత్యున్నతభవనములతో ఉన్న, పాతాళలోకములోని భోఘవతీ నగరము లాగా భయంకరమైన రాక్షసులతో నిండివున్న, పూర్వకాలంలో కుబేరుని ఆవాసమై ఒప్పిన, ఊహాతీతముగా అలంకరింపబడిన, శూలములు ఖడ్గములు చేతిలో ధరించిన అనేకమంది శూరులచేత విషకోరలతో వున్నపాములచేత గుహ రక్షింపబడినట్లు రక్షింపబడుతున్న ఆ లంకను హనుమంతుడు చూచెను.

ఆ లంకయొక్క ఆరక్షణ విధానమును, చుట్టూ వున్న సముద్రమును, శత్రువు అగు రావణుని చూచి హనుమంతుడు ఇట్లు అనుకొనెను.

'వానరులు ఇక్కడికి వచ్చినప్పటికీ ఏమి లాభము లేదు. సురులు కూడా లంకను యుద్ధములో జయించలేరు. మహాబాహువులు కల రాఘవుడు కూడా ఈ రావణునిచే పాలింపబడు దుష్కరమైన లంకానగరమునకు వచ్చి ఏమి చేయ గలడు? రాక్షసులతో రాజీపడుటకు అవకాశము లేదు. దాన భేద ములకు అస్కారములేదు. యుద్ధము కూడా సులభము కాదు. మహాత్ములగు వాలిపుత్రుడు, నీలుడు , ధీమంతుడైన రాజు సుగ్రీవుడు, మేము నలుగురమే ఇక్కడికి రాగలము'.

మళ్ళీ హనుమంతుడు ఈ ఆలోచనలు ఆపి, 'ఇన్ని ఆలోచనలు ఎందుకు. వైదేహి జీవించియునదో లేదో తెలిసికొని , జనకాత్మజను చూచి అప్పుడే అలోచించెదను', అనుకొని పరిపరివిధములుగా ఆలోచనాపరుడయ్యెను.

అప్పుడు ఆ కపికుంజరుడు ఆ పర్వతశిఖరములలో నిలబడి, రామాభ్యుదయము కోరుతూ ముహూర్తకాలము పాటు మరల ఆలోచించసాగెను.

'క్రూరులు బలవంతులు అగు రాక్షసులచే రక్షింపబడు ఈ నగరమును ఈ రూపముతో ప్రవేశించ లేను. జానకిని వెదుకుతూ ఉగ్రమైన తేజస్సు కల, మహావీరులు బలవంతులు అగు రాక్షసులను అందరినీ మోసగించవలసినదే. మహత్తరమైన లక్ష్యము సాధించుటకు కనీకనపడని రూపము ధరించి లంకానగరము ప్రవేశించుటకు రాత్రికాలమే మంచిది'.

సురాసురులకు కూడా దుర్భేద్యమైన ఆ నగరమును చూచి ,ఆ హనుమంతుడు మళ్ళీ మళ్ళీ ఆలోచించసాగెను.

'దురాత్ముడైన రావణునికి కనపడకుండా ఏ ఉపాయముతో జనకాత్మజ అగు మైథిలిని చూడగలను? ఆత్మస్వరూపమెరిగిన రామునియొక్క కార్యము ఏవిధముగాను భంగముకాకుండు నట్లుగా ఎలా చేయవలెను? ఏకాంతముగా వున్న జనకాత్మజను ఒంటరిగా ఎట్లు చూడగలను?' అని అనుకొనెను.

హనుమంతుడు తన ఆలోచన కొనసాగించెను.

' సూర్యోదయము చీటిని పారదోచినట్లు, ఆలోచనారహితులగు దూతల ద్వారా సాధ్యమగు పనులు అసాధ్యము అవుతాయి. బుద్ధి తో ఆలోచించి నిశ్చయించిన పని కూడా తామే పండితులమనుకొనే దూతల ద్వారా నాశనమౌతుంది. కార్యము ఎట్లు భంగము కాకూడదు? అవివేకము ఎట్లు దూరము చేయవలెను? సముద్రలంఘనము వృధా కాకూండా ఎట్లు పని చేయవలెను? నేను రాక్షసులచేత చూడబడినచో, రావణుని అనర్ధము కోరు, ఆత్మతత్వము ఎరిగిన రాముని యొక్క ఈ కార్యము వ్యర్ధము అగును'.
'ఇక్కడ రాక్షసరూపములో కూడా రాక్షసులకు తెలియకుండా వుండలేము. అటువంటి సందర్భములో ఈ రూపము గురించి చెప్పనేల? ఇక్కడ వాయువు కూడ ఆజ్ఞలేకుండా వీచదు అని నా అభిప్రాయము. బలవంతులగు రాక్షసులకు తెలియని విషయము ఏమీ లేదు. నేను నాస్వరూపముతో ఇక్కడ వుంటే నాశనము తప్పదు. రాజకార్యము చెడిపోవును. అందువలన రాముని కార్యము సిద్ధించుటకు నా స్వరూపము చిన్నది చేసి రాత్రి లంకానగరములో ప్రవేశించెదను. దుష్కరమైన ఈ లంకానగరమును రాత్రిలో ప్రవేశించి అన్ని భవనములు వెదికి జనకాత్మజను చూచెదను'.

హనుమంతుడు ఈ విధముగా ఆలోచించి జానకిని దర్శించాలన్న ఉత్సాహముతో సూర్యాస్తమయము కొఱకు వేచియుండెను. ఆ మారుతి సుర్యాస్తమయము అయినపుడు తన దేహమును చూచుటకు ఆశ్చర్యము కొలుపు నట్లు పిల్లి అంత ప్రమాణముగా చేసికొనెను. ఆ వీరుడైన హనుమంతుడు ప్రదోషకాలములో క్షణములో దూకి ప్రధాన మార్గములతో చక్కగా విభజించ బడిన ఆ లంకానగరము ప్రవేశించెను.

అప్పుడు హనుమంతుడు ప్రాసాదాల శ్రేణులతో నిండిన, బంగారు వెండి స్తంభములతో కూడిన, బంగారు జాలలతోకూడిన గంధర్వనగరములా వున్న నగరము చూచెను. ఆ నగరము స్ఫటికములు మాణిక్యములతో బంగారముతో అలంకరింపబడిన ఏడు ఎనిమిది అంతస్తులు కల భవనములతో నిండియున్నది. ఆ రాక్షసుల భవనములు వైఢూర్యములు మాణిక్యములతో చిత్రించబడిన అంతస్తులతో శోభించుచున్నవి. రాక్షసుల భవనములు బంగారముతో రంగురంగుల తోరణాలతో అలంకరింపబడి లంకానగరమును అన్నిచోటలా ప్రకాశింపచేస్తున్నాయి.

ఆ మహాకపి ఉహాతీతమైన అద్భుతాకారములు గల లంకను చూచి, ఒకవైపు దీనిని జయించగలమా అని ఒక దిగులు, వైదేహి ని చూడాలనే ఉత్సాహముతో ఇంకొకవైపు సంతోషముపడెను.

హనుమంతుడు తెల్లని మహోన్నతమైన భవనములతో కూడిన , బంగారు ద్వారాలు తోరణాలుగల , యశోవంతులైన మహాబలవంతులైన రాక్షసులచే రక్షింపబడి రావణునిచే పాలింపబడుచున్నఆ లంకా నగరము చూచెను.

అప్పుడు చంద్రుడు వేయి కిరణాలతో తారాగణముల మధ్య విరాజిల్లిచూ తన వెన్నెలతో హనుమంతునికి సహయము చేస్తున్నాడా అన్నట్లు లోకాన్ని నింపెను. అప్పుడు శంఖము పాలు తామరపూవు వంటి తెల్లని కాంతితో , సరోవరములో పయనిస్తున్న హంసలాగ ఆకాశములో పైపైకి వస్తూవున్న చంద్రుని హనుమంతుడు చూచెను.

ఈ విధముగా ఆదికావ్యమైన వాల్మీకి రామాయణములో సుందరకాండలో రెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

శంఖప్రభం క్షీరమృణాళవర్ణం ఉద్గచ్ఛమానం వ్యవభాసమానమ్|
దదర్శ చన్ద్రం స హరిప్రవీర పోప్లూయమానం సరసీవ హంసమ్||57||

తా|| అప్పుడు శంఖము పాలు తామరపూవు వంటి తెల్లని కాంతితో , సరోవరములో పయనిస్తున్న హంసలాగ ఆకాశములో పైపైకి వస్తూవున్న చంద్రుని హనుమంతుడు చూచెను.

||ఓమ్ తత్ సత్||