||సుందరకాండ ||

||ముప్పదియవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 30 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రింశస్సర్గః

శింశుపా వృక్షములో దాగి వున్న హనుమంతుడు రాక్షసస్త్రీలచేత సీత భయపెట్టబడడము, త్రిజట స్వప్న వృత్తాంతము అన్నీ యథాతథముగా వింటాడు. నందనవనములోని దేవతవలె నున్న ఆ సీతను చూచి ఆ హనుమ అనేక విధములుగా ఆలోచిస్తాడు . ఆ ఆలోచనలే ముప్పదియవ సర్గలో మనము వినేది.

ఇక్కడ వినేదంతా హనుమంతుడు తనలో తాను అనుకునే మాటలు. ఇక ముప్పదియవ సర్గలో హనుమంతుని మాటలు విందాము.

||శ్లోకము 30.01||

హనుమానపి విక్రాంతః సర్వం శుశ్రావ తత్త్వతః|
సీతాయాః త్రిజటాయాశ్చ రాక్షసీనాం తర్జనమ్||30.01||

స||విక్రాంతః హనుమాన్ తత్త్వతః రాక్షసీనాం సీతాయాః తర్జనమ్ త్రిజటాయాశ్చ అపి సర్వం శుశ్రావ||

రామ టీకాలో- విక్రాన్తః అతివిక్రమవాన్ హనుమాన్ సీతాయాః విలాపమ్ త్రిజటాయాః స్వప్నం రాక్షసీనాం తర్జితం చ సర్వం శుశ్రావ॥

||శ్లోకార్థములు||

విక్రాంతః హనుమాన్ -
పరాక్రమవంతుడైన హనుమంతుడు
రాక్షసీనాం సీతాయాః తర్జనమ్ -
రాక్షసస్త్రీలచేత సీత భయపెట్టబడడము
త్రిజటాయాశ్చ అపి -
త్రిజట స్వప్న వృత్తాంతము కూడా
సర్వం తత్త్వతః శుశ్రావ -
అన్నీ యథాతథముగా వినెను

||శ్లోకతాత్పర్యము||

" పరాక్రమవంతుడైన హనుమంతుడు రాక్షసస్త్రీలచేత సీత భయపెట్టబడడము , త్రిజట స్వప్న వృత్తాంతము అన్నీ యథాతథముగా వినెను." ||30.01||

||శ్లోకము 30.02||

అవేక్షమాణః తాం దేవీం దేవతామివ నందనే|
తతో బహువిధాం చింతాం చింతయామాస వానరః||30.02||

స|| నందనే దేవతాం ఇవ తాం దేవీం అవేక్షమాణా వానరః తతః బహువిధాం చింతయామాస ||

||శ్లోకార్థములు||

నందనే దేవతాం ఇవ తాం దేవీం -
నందన వనములోని దేవతవలె నున్న ఆ సీతను
అవేక్షమాణా వానరః -
చూచుచున్న ఆ వానరుడు
తతః బహువిధాం చింతయామాస -
పరిపరివిధములగా ఆలోచించసాగెను

||శ్లోకతాత్పర్యము||

"నందన వనములోని దేవతవలె నున్న ఆ సీతను చూచి ఆ వానరుడు పరిపరివిధములగా ఆలోచించసాగెను." ||30.02||

||శ్లోకము 30.03||

యాం కపీనాం సహస్రాణి సుబహూన్యయుతాని చ|
దిక్షు సర్వాసు మార్గంతే సేయ మాసాదితా మయా||30.03||

స|| కపీనాం సుబహూని సహస్రాణి అయుతాని చ సర్వాసు దిక్షు యాం మార్గంతే సా ఇయం మయా ఆసాదితా||

||శ్లోకార్థములు||

సహస్రాణి అయుతాని సుబహూని కపీనాం-
అనేక వందల వేలకొలదీ వానరులలో
యాం చ సర్వాసు దిక్షు యాం మార్గంతే -
ఎవరిని అన్ని దిశలలో వెదుకుచున్నారో
సా ఇయం మయా ఆసాదితా -
ఆమె ఈ సీత నాకు కనపడినది.

||శ్లోకతాత్పర్యము||

" ఏ సీత కొరకై వందలకొలదీ వేలకొలదీ వానరులు అన్ని దిశలలో వెదుకుతున్నరో అట్టి సీతను నేను చూచితిని." ||30.03||

హనుమ తనకి వచ్చిన అదృష్టము చెప్పుకుంటున్నాడు. భగవద్గీతలో ఒక చోట వింటాము ; "మనుష్యాణాం సహస్రేషు కశ్చిత్ యతతి సిద్ధయే". వేలకొలది మానుష్యులలో ఎవరికో ఒకడికి సిద్ధి కలుగుతుంది అని అది బ్రహ్మసాక్షాత్కారానికి. ఇక్కడ సీతాన్వేషణ కి బయలుదేరిన వెలకొలదీ వానరులలో, సీతమ్మని వెదికిన కీర్తి హనుమకే దక్కింది.

||శ్లోకము 30.04||

చారేణ తు సుయుక్తేన శత్రోశ్శక్తి మవేక్షతా|
గూఢేన చరతా తావత్ అవేక్షిత మిదం మయా||30.04||

స|| సుయుక్తేన శత్రోః శక్తిం అవేక్షతా గూఢేన చరతా చారేణ మయా ఇదం అవేక్షితం తావత్ ||

తిలక టీకాలో - సుయుక్తేన సుప్రయుక్తేన స్వామినా నియుక్తేన అతఏవ శత్రోః శక్తిం అవేక్షతా అత ఏవ గూఢేన రూపేణ చరతా చారణం మయా తావత్ప్రథమమ్ ఇదం వృత్తం అవేక్షితం జ్ఞాతమ్ ।

||శ్లోకార్థములు||

చారేణ సుయుక్తేన శత్రోః శక్తిం అవేక్షతా -
చారుని వలె బాగుగా నియోగించబడి శత్రువుల శక్తిని చూచి
గూఢేన చరతా -
గూఢముగా తిరుగుతూ
మయా ఇదం అవేక్షితం తావత్ -
ఇది అంతా అవగాహన చేసుకున్నాను

||శ్లోకతాత్పర్యము||

"చారుని వలె బాగుగా నియోగించబడి శత్రువుల శక్తిని చూచి, గూఢముగా తిరుగుతూ, ఇది అంతా అవగాహన చేసుకున్నాను".

||శ్లోకము 30.05||

రాక్షసానాం విశేషశ్చ పురీచేయమవేక్షితా|
రాక్షసాధిపతేరస్య ప్రభావో రావణస్య చ ||30.05||

స|| రాక్షసానాం విశేషః చ అయం పురీ చ అస్య రాక్షసాధిపతేః రావణస్య ప్రభావః చ అవేక్షితా||

||శ్లోకార్థములు||

రాక్షసానాం అయం పురీ చ -
రాక్షసుల యొక్క ఈ నగరముగురించి
విశేషః అస్య రాక్షసాధిపతేః -
విశేషముగా ఈ రాక్షసాధిపతి అగు
రావణస్య ప్రభావః చ అవేక్షితా -
రావణునియొక్క ప్రభావము కూడా చూచితిని

||శ్లోకతాత్పర్యము||

"'రాక్షసులగురించి, విశేషముగా ఈ నగరముగురించి, ఈ రాక్షసాధిపతి రావణునియొక్క ప్రభావము కూడా చూచితిని." ||30.05||

||శ్లోకము 30.06||

యుక్తం తస్యాఽప్రమేయస్య సర్వ సత్త్వ దయావతః|
సమశ్వాసయితుం భార్యాం పతిదర్శన కాంక్షిణీమ్||30.06||

స|| సర్వసత్త్వ దయావతః అప్రమేయస్య తస్య పతిదర్శన కాంక్షిణీం భార్యాం సమశ్వాసయితుం యుక్తం||

||శ్లోకార్థములు||

సర్వసత్త్వ దయావతః -
అన్ని ప్రాణులపై దయకలవాడు
అప్రమేయస్య తస్య -
అప్రమేయుడు అయిన అయనయొక్క
పతిదర్శన కాంక్షిణీం భార్యాం -
పతి దర్శనము కోరుకొనుచున్న ఈ భార్యను
సమశ్వాసయితుం యుక్తం -
ఊరడించడము యుక్తము

||శ్లోకతాత్పర్యము||

"అన్ని ప్రాణులపై దయకలవాడు , అప్రమేయుడు అయిన అ పతి దర్శనము కోరుకొనుచున్న ఈ భార్యను ఊరడించడము యుక్తము". ||30.06||

||శ్లోకము 30.07||

అహమాశ్వాసయా మ్యేనాం పూర్ణచంద్రనిభాననాం|
అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖస్యాంతమగచ్ఛతీమ్||30.07||

స|| ఏనాం పూర్ణచంద్రనిభాననాం అదృష్టదుఃఖాం దుఃఖార్తాం దుఃఖఃస్య అంతం అగచ్ఛతీం అహం అశ్వాసయామి ||

||శ్లోకార్థములు||

ఏనాం పూర్ణచంద్రనిభాననాం -
ఈ పూర్ణచంద్రుని బోలు ముఖము కల
అదృష్టదుఃఖాం-
ఎప్పుడూ దుఃఖములను ఎరుగని,
దుఃఖఃస్య అంతం అగచ్ఛతీం దుఃఖార్తాం -
దుఃఖముల అంతము కానరాక అతి దుఃఖములో నున్న
(తాం) అహం అశ్వాసయామి -
ఆమెకి నేను ఆశ్వాసమిచ్చెదను.

||శ్లోకతాత్పర్యము||

"ఈ పూర్ణచంద్రుని బోలు ముఖము కల, ఎప్పుడూ దుఃఖములను ఎరుగని , ఇప్పుడు దుఃఖముల అంతము కానరాక అతి దుఃఖములో నున్న ఆమెకి ఆశ్వాసమిచ్చెదను." ||30.07||

||శ్లోకము 30.08||

యద్యప్యహం ఇమాం దేవీం శోకోపహతచేతసాం|
అనాశ్వాస్య గమిష్యామి దోషవత్ గమనం భవేత్||30.08||

స|| యది శోకోపహతచేతసాం ఇమాం దేవీం అనాశ్వాస్య గమిష్యామి (తత్) దోషవత్ గమనం భవేత్||

||శ్లోకార్థములు||

యది శోకోపహతచేతసాం -
ఒకవేళ దుఃఖములో మునిగి ఉన్న
ఇమాం దేవీం అనాశ్వాస్య గమిష్యామి -
ఆ దేవికి ఆశ్వాసమివ్వకుండా వెళ్ళిపోయినచో
(తత్) దోషవత్ గమనం భవేత్ -
అది పొరపాటు అవును

||శ్లోకతాత్పర్యము||

"ఒక వేళ దుఃఖములో మునిగిఉన్న ఆ దేవికి ఆశ్వాసమివ్వకుండా వెళ్ళిపోయినచో అది పొరపాటు అవును." ||30.08||

||శ్లోకము 30.09||

గతేహి మయి తత్రేయం రాజపుత్రీ యశస్వినీ|
పరిత్రాణ మవిందంతీ జానకీ జీవితం త్యజేత్||30.09||

స|| మయి తత్ర గతే హి యశస్వినీ రాజపుత్రీ జానకీ పరిత్రాణమ్ అవిందంతీ జీవితం త్యజేత్||

||శ్లోకార్థములు||

మయి తత్ర గతే హి -
నేను అలా వెళ్ళిపోతే
యశస్వినీ రాజపుత్రీ జానకీ -
యశస్వినీ అగు రాజపుత్రి జానకి
పరిత్రాణమ్ అవిందంతీ -
రక్షింపబడు మార్గము కానరాక
జీవితం త్యజేత్ -
జీవితమే త్యజించును

||శ్లోకతాత్పర్యము||

"నేను అలా వెళ్ళిపోతే యశస్వినీ అగు రాజపుత్రి జానకి తనకు రక్షింపబడు మార్గము కానరాక జీవితమే త్యజించును". ॥30.09॥

||శ్లోకము 30.10||

మయా చ స మహాబాహుః పూర్ణచంద్ర నిభాననః|
సమశ్వాసయితుం న్యాయ్యః సీతాదర్శనలాలసః||30.10||

స|| పూర్ణచంద్రనిభాననః మహాబాహుః సీతాదర్శన లాలసః ( రామః) మయా సమశ్వాసయితుం న్యాయ్యః ||

||శ్లోకార్థములు||

పూర్ణచంద్రనిభాననః -
పూర్ణచంద్రునిబోలిన ఆ
సీతాదర్శన లాలసః -
సీతను చూచుటకు తహతహలాడుతున్న
మహాబాహుః ( రామః) -
మహాబాహువుల కల వానికి (రామునకు)
మయా సమశ్వాసయితుం న్యాయ్యః -
నాచే ఉపశమనము కలిగించుట న్యాయము

||శ్లోకతాత్పర్యము||'

"పూర్ణచంద్రుని బోలిన సీతను చూచుటకు తహతహలాడుతున్న మహాబాహువులు కల రామునకు ఉపశమనము కలిగించుట న్యాయము."||30.10||

||శ్లోకము 30.11||

నిశాచరీణాం ప్రత్యక్షం అనర్హం చాపి భాషణమ్|
కథం ను ఖలు కర్త్వవ్యం ఇదం కృచ్ఛగతో హ్యహమ్||30.11||

స|| నిశాచరీణాం ప్రత్యక్షం భాషణం చ అనర్హం అపి | కథం ను కర్తవ్యం ను | అహం కృఛ్ఛగతో హి ||

||శ్లోకార్థములు||

నిశాచరీణాం ప్రత్యక్షం భాషణం చ -
ఈ నిశాచరుల ముందర సంభాషణ
అనర్హం అపి -
మంచిదికాదు
కథం ను కర్తవ్యం ను -
ఏమిటి నా కర్తవ్యము
అహం కృఛ్ఛగతో హి -
నాకు ఏమీ తోచకున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఈ నిశాచరుల ముందర సంభాషణ మంచిదికాదు. ఏమిటి నా కర్తవ్యము?. నాకు ఏమీ తోచకున్నది."

||శ్లోకము 30.12||

అనేన రాత్రి శేషేణ యది నాశ్వాస్యతే మయా|
సర్వథా నాస్తి సందేహః పరిత్యక్షతి జీవితమ్||30.12||

స|| యది అనేన రాత్రిశేషేణ న ఆశ్వాస్యతే సా సర్వథా జీవితం పరితక్ష్యతి | సందేహః న అస్తి||

||శ్లోకార్థములు||

అనేన రాత్రిశేషేణ -
ఈ రాత్రి అంతమయ్యే లోపల
యది న ఆశ్వాస్యతే -
ఆశ్వాసన ఇవ్వకపోతే
సా సర్వథా జీవితం పరితక్ష్యతి -
ఆమె తప్పక జీవితమును పరిత్యజించును
సందేహః న అస్తి -
ఇందులో సందేహము లేదు.

||శ్లోకతాత్పర్యము||

"ఈ రాత్రి ఆమెకు ఆశ్వాసన ఇవ్వకపోతే ఆమె జీవితమును పరిత్యజించును. ఇందులో సందేహము లేదు."||30.12||

||శ్లోకము 30.13||

'రామశ్చ యది పృచ్ఛేన్మాం కిం మాం సీతాఽబ్రవీత్ వచః|
కిం అహం తం ప్రతిబ్రూయాం అసంభాష్య సుమధ్యమామ్||30.13||

స|| యది రామః మాం పృచ్ఛే కిం మాం సీతా అబ్రవీత్ వచః తదా సుమధ్యమామ్ అసంభాష్య అహమ్ తం కిం ప్రతిబ్రూయామ్||

||శ్లోకార్థములు||

యది రామః మాం పృచ్ఛే-
ఒకవేళ రాముడు నన్నుఅడిగినచో
కిం మాం సీతా అబ్రవీత్ వచః -
నాకు సీతా ఏమి మాటలు చెప్పినది
తదా సుమధ్యమామ్ అసంభాష్య-
ఆ సుందరాంగితో మాట్లాడకూండా
అహమ్ తం కిం ప్రతిబ్రూయామ్ -
నేను ఏమి సమాధానమిచ్చెదను

||శ్లోకతాత్పర్యము||

"ఒకవేళ రాముడు నన్ను 'నాకు సీతా ఏమి చెప్పినది', అని అడిగినచో ఆ సుందరాంగితో మాట్లాడ కుండా ఏమి సమాధానమిచ్చెదను." ||30.12||

||శ్లోకము 30.14||

సీతా సందేశరహితం మాం ఇతః త్వరయా గతమ్|
నిర్దహే దపి కాకుత్‍స్థః క్రుద్ధః తీవ్రేణ చక్షుషా ||30.14||

స|| సీతా సందేశరహితం ఇతః త్వరయా గతం మాం కాకుత్‍స్థః క్రుద్ధః తీవ్రేణ చక్షుషా నిర్దహేత్ అపి||

||శ్లోకార్థములు||

సీతా సందేశరహితం -
సీతాసందేశము లేకుండా
ఇతః త్వరయా గతం మాం -
ఇక్కడనుంచి త్వరగా వెళ్ళిన నన్ను
కాకుత్‍స్థః క్రుద్ధః తీవ్రేణ చక్షుషా -
ఆ కాకుత్‍స్థుడు తీవ్రమైన కన్నులతో
నిర్దహేత్ అపి - దహించివేయును

||శ్లోకతాత్పర్యము||

"సీతాసందేశము లేకుండా ఇక్కడ నుంచి త్వరగా వెళ్ళిన నన్ను ఆ కాకుత్‍స్థుడు తీవ్రమైన కన్నులతో దహించివేయును."

||శ్లోకము 30.15||

యది చో ద్యోజయిష్యామి భర్తారం రామ కారణాత్|
వ్యర్థమాగమనం తస్య ససైన్యస్య భవిష్యతి||30.15||

స|| రామకారణాత్ భర్తారం యది చ ఉద్యోజయిష్యామి ససైన్యస్య తస్య ఆగమనం వ్యర్థం భవిష్యతి ||

గోవిన్దరాజులవారి టీకాలో- యది చేత్। భర్తారం సుగ్రీవమ్। వ్యర్థం అనాశ్వస్య గమనే తదాగమన పర్యన్తం దేవ్యాః ప్రాణానవస్థానాదితి భావః।

||శ్లోకార్థములు||

రామకారణాత్ భర్తారం -
రాముని కార్యము నెరవేర్చుటకు సుగ్రీవుని
యది చ ఉద్యోజయిష్యామి -
నేను ప్రొత్సహించినచో
ససైన్యస్య తస్య ఆగమనం -
సైన్యముతో కూడా ఆయన రావడము
వ్యర్థం భవిష్యతి -
వ్యర్థము అగును

||శ్లోకతాత్పర్యము||

"రాముని కార్యము నెరవేర్చుటకు వానరాధిపతి సుగ్రీవుని నేను ప్రోత్సహించినచో
సైన్యముతో కూడా ఆయన రావడము వ్యర్థము అగును."||30.15||

గోవిన్దరాజుల వారు తమ టీకాలో - భర్తారం అన్న మాట విశదీకరిస్తూ సీతకి ఆశ్వాసన ఇవ్వనిచో, భర్తారం అంటే వానరాధిపతి, తనసైన్యముతో రావడము వ్యర్థము అగును అని హనుమంతుని ఆలోచన. దానికి హేతువు సీతాప్రాణత్యాగము చేస్తుందేమో అనే శంక, అని వ్యాఖ్యానిస్తారు.

||శ్లోకము 30.16||

అంతరం త్వహమాసాద్య రాక్షసీనామిహ స్థితః|
శనైరాశ్వాసయిష్యామి సంతాప బహుళామిమామ్||30.16||

స|| అహం ఇహ స్థితః రాక్షసీనామ్ అంతరం అసాద్య సంతాపబహుళాం ఇమాం శనైః ఆశ్వాసయిష్యామి || |

||శ్లోకార్థములు||

అహం ఇహ స్థితః -
నేను ఇక్కడ కూర్చుని
రాక్షసీనామ్ అంతరం అసాద్య -
రాక్షసుల అంతరాయములేకుండా
సంతాపబహుళాం ఇమాం -
సంతాపములో మునిగియున్న
శనైః ఆశ్వాసయిష్యామి -
మెల్లిగా ఆశ్వాసమిచ్చెదను

||శ్లోకతాత్పర్యము||

"నేను ఇక్కడ కూర్చుని రాక్షసుల అంతరాయములేకుండా సంతాపములో మునిగి యున్న ఈమెకు మెల్లిగా ఆశ్వాసమిచ్చెదను." ||30.16||

||శ్లోకము 30.17||

అహం త్వతితనుశ్చైవ వానరశ్చ విశేషతః|
వాచం చో దాహరిష్యామి మానుషీ మిహ సంస్కృతామ్||30.17||

స|| అహం తు అతితనుశ్చ | విశేషతః వానరః చ | ఇహ సంస్కృతాం మానుషీం వాచం చ ఉదాహిరిష్యామి |

తిలక టీకాలో- వానరః వానరరూపోఽహమ్, అతి తనుః అతి సూక్ష్మ శరీరః సన్ సంస్కృతాం, వ్యాకరణ సంస్కారయుతాం తాం సీతాం వాచం ఉదాహరిష్యామి।
సంస్కృతాం అన్నమాటకి ఇక్కడ చెప్పినది, వ్యాకరణ సంస్కారయుతాం అని.

||శ్లోకార్థములు||

అహం తు అతితనుశ్చ-
నేను సూక్ష్మరూపములో ఉన్నవాడిని
విశేషతః వానరః చ -
అందులోనూ వానరుడను
ఇహ సంస్కృతాం మానుషీం వాచం చ -
ఇప్పుడు సంస్కారముకల మనుష్యుల భాష
ఉదాహిరిష్యామి -
ఉపయోగించెదను

||శ్లోకతాత్పర్యము||

"నేను సూక్ష్మరూపములో ఉన్నవాడిని. అందులోనూ వానరుడను. ఇప్పుడు సంస్కారముకల మనుష్యుల భాష ఉపయోగించెదను." ||30.17||

||శ్లోకము 30.18||

యది వాచం ప్రదాస్యామి ద్విజాతిరివ సంస్కృతామ్|
రావణం మన్యమానా మాం సీతా భీతా భవిష్యతి||30.18||

స|| యది ద్విజాతిః ఇవ సంస్కృతాం వాచం ప్రదాశ్యామి మాం రావణం మన్యమానా సీతా భీతా భవిష్యతి ||

||శ్లోకార్థములు||

యది ద్విజాతిః ఇవ -
నేను ద్విజుల వలె
సంస్కృతాం వాచం ప్రదాశ్యామి -
సంస్కృత వచనములలో మాట్లాడినచో
మాం రావణం మన్యమానా -
నన్ను రావణుడా అనే శంకతో
సీతా భీతా భవిష్యతి -
సీత భయపడును

||శ్లోకతాత్పర్యము||

" నేను ద్విజులుమాట్లాడే సంస్కృతములో మాట్లాడినచో నన్ను రావణుడా అనే శంకతో సీత భయపడును ||30.18||

||శ్లోకము 30.19||

వానరస్య విశేషేణ కథం స్యాదభిభాషణమ్|
అవశ్యమేవ వక్తవ్యం మానుషం వాక్య మర్థవత్||30.19||
మయా సాంత్వయితుం శక్యా నాన్యథేయ మనిందితా|

స|| విశేషేణ వానరస్య అభిభాషణం కథం ను || ఏవం అవశ్యమ్ అర్థవత్ మానుషం వాక్యం వక్తవ్యం|అన్యథా ఇయం అనిందితా సాంత్వయితుం మయా న శక్యా ||

||శ్లోకార్థములు||

విశేషేణ వానరస్య -
ప్రత్యేకముగా వానరుడు
అభిభాషణం కథం ను -
ఇట్లు ఎలామాట్లాడును అని.
ఏవం అవశ్యమ్ మానుషం వాక్యం -
అందువలన అవశ్యముగా మనుష్యుల భాషలో
అర్థవత్ వక్తవ్యం -
అర్థవంతముగా మాట్లాడవలెను
అన్యథా ఇయం అనిందితా -
లేకపోతే దోషరహితమైన ఈమెను
సాంత్వయితుం మయా న శక్యా -
శాంతపరచుట సంభవము కాదు

||శ్లోకతాత్పర్యము||

"ప్రత్యేకముగా వానరుడు ఇట్లు ఎలామాట్లాడును అని. అందువలన అవశ్యముగా మనుష్యులభాషలో అర్థవంతముగా మాట్లాడవలెను. లేకపోతే దోషరహితమైన ఈమెను శాంతపరచుట సంభవము కాదు". ||30.19||

ఇక్కడ హనుమంతుడు సీతతో ఎలా సంభాషణ చెయ్యాలి అన్న విషయముపై తర్జన భర్జనలు చేస్తున్నాడు.

గోవిన్దరాజులవారు తమ టీకాలో - అత్ర వాక్యస్య మానుషత్వం కోసలదేశవర్తిమనుష్య సంబంధిత్వం వివక్షితమ్। తాదృగ్ వాక్యస్య ఏవం దేవి పరిచితత్వాత్॥

||శ్లోకము 30.20||

సేయ మాలోక్య మే రూపం జానకీ భాషితం తథా||30.20||
రక్షోభి స్త్రాసితా పూర్వం భూయ స్త్రాసం గమిష్యతి|

స||పూర్వం రక్షోభిః త్రాసితా సా ఇయం జానకి మే రూపం ఆలోక్య భాషితమ్ తథా భూయః త్రాసం గమిష్యతి ||

||శ్లోకార్థములు||

పూర్వం రక్షోభిః త్రాసితా -
ముందే రాక్షసులతో భయపడిన
సా ఇయం జానకి - ఈ సీత
మే రూపం ఆలోక్య భాషితమ్ -
నా రూపము భాష చూచి
తథా భూయః త్రాసం గమిష్యతి -
మళ్ళీ భయపడును

||శ్లోకతాత్పర్యము||

"ముందే రాక్షసులతో భయపడిన ఈ సీత నా రూపము భాష చూచి మళ్ళీ భయ పడును ||30.20||

||శ్లోకము 30.21||

తతో జాత పరిత్రాసా శబ్దం కుర్యాన్ మనస్వినీ||30.21||
జానమానా విశాలాక్షీ రావణం కామరూపిణమ్|

స|| తతః మనస్వినీ విశాలాక్షీ మాం కామరూపిణం రావణం జానమానా జాతపరిత్రాసా శబ్దం కుర్వన్ ||

||శ్లోకార్థములు||

తతః మనస్వినీ విశాలాక్షీ -
అప్పుడు ఆ మనస్విని విశాలాక్షి
మాం కామరూపిణం రావణం జానమానా -
నన్ను కామరూపుడగు రావణుడు అని భావించి
జాతపరిత్రాసా శబ్దం కుర్వన్ -
భయపడి పెద్ద శబ్దము చేయును".

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ మనస్విని నన్ను కామరూపుడగు రావణుడు అని భయపడి భావించి పెద్ద శబ్దము చేయును". ||30.21||

||శ్లోకము 30.22||

సీతాయా చ కృతే శబ్దే సహసా రాక్షసీ గణాః||30.22||
నానాప్రహరణో ఘోరః సమేయాదంతకోపమః|

స|| సీతయాః కృతే శబ్దే రాక్షసీ గణాః నానాప్రహరణః ఘోరః అంతకోపమః సమేయాత్ ||

||శ్లోకార్థములు||

సీతయాః కృతే శబ్దే -
సీత చేత చేయబడిన శబ్దముతో
సహసా నానాప్రహరణః-
వెంటనే అనేకరకములైన ఆయుధములతో
అంతకోపమః ఘోరః -
యమునితో సమానమైన ఘోరమైన
రాక్షసీ గణాః సమేయాత్ -
రాక్షసీ గణములు గుమిగూడెదరు

||శ్లోకతాత్పర్యము||

"సీత చేత చేయబడిన శబ్దముతో యమునిలా భయంకరముగా వున్న రాక్షసీ గణములు గుమిగూడెదరు." ||30.22||

||శ్లోకము 30.23||

తతో మాం సంపరిక్షిప్య సర్వతో వికృతాననాః||30.23||
వధే చ గ్రహణే చైవ కుర్యుర్యత్నం యథాబలమ్|

స|| తతః వికృతాననః మాం సర్వతః సంపరిక్షిప్య వధే చ గ్రహణే చ యథాబలం యత్నం కుర్యుః||

||శ్లోకార్థములు||

తతః వికృతాననః -
అప్పుడు ఆ వికృతాననలు
మాం సర్వతః సంపరిక్షిప్య -
నన్ను అన్నివేపులా చుట్టుముట్టి
వధే చ గ్రహణే చ -
బంధించుటకు కాని వధించుటకు గాని
యథాబలం యత్నం కుర్యుః -
యథా శక్తి ప్రయత్నము చేసెదరు

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ వికృతాననలు చుట్టుముట్టి నన్ను బంధించుటకు కాని వధించుటకు గాని ప్రయత్నము చేసెదరు". ||30.23||

||శ్లోకము 30.24||

గృహ్య శాఖాః ప్రశాఖాశ్చ స్కంధాం శ్చోత్తమశాఖినామ్||30.24||
దృష్ట్వా విపరిధావంతం భవేయుర్భయశంకితాః|

స|| ఉత్తమశాఖినాం శాఖాః ప్రశాఖస్య స్కంధశ్చ గృహ్య విపరిధావంతం దృష్ట్వా భయశంకితాః భవేయుః||

||శ్లోకార్థములు||

ఉత్తమశాఖినాం శాఖాః -
మహావృక్షముల కొమ్మలనూ
ప్రశాఖస్య స్కంధశ్చ గృహ్య -
చెట్ల కొమ్మలనూ బోదెలను పట్టుకొని
విపరిధావంతం దృష్ట్వా -
పరుగెడుతున్న నన్నుచూసి
భయశంకితాః భవేయుః -
వారు భయ సందేహములు కలవారగుదురు

||శ్లోకతాత్పర్యము||

"మంచి కొమ్మలను మహావృక్షముల కొమ్మలనూ పట్టుకొని , చెట్లకొమ్మలమీద ఎగబ్రాకుతూ పరుగిడుతున్న నన్నుచూసి వారు భయ సందేహములు కలవారగుదురు."||30.24||

||శ్లోకము 30.25||

మమ రూపం చ సంప్రేక్ష్య వనే విచరతో మహత్||30.25||
రాక్షస్యో భయవిత్రస్తా భవేయుర్వికృతాననః|

స|| వికృతాననః రాక్షస్యః వనే విచరతః మాం మహత్ రూపం సంప్రేక్ష్య భయవిత్రస్తాః భవేత్ ||

||శ్లోకార్థములు||

వికృతాననః రాక్షస్యః -
వికృతాననలు అగు రాక్షసులు
వనే విచరతః మాం -
వనములో విచరించు నా
మహత్ రూపం సంప్రేక్ష్య -
మహత్ రూపము చూచి
భయవిత్రస్తాః భవేత్ -
భయపడిపోయెదరు.

||శ్లోకతాత్పర్యము||

"వికృతాననలు అగు రాక్షసులు వనములో విచరించు నా మహత్ రూపము చూచి భయపడిపోయెదరు." ||30.25||

||శ్లోకము 30.26||

తతః కుర్యుస్సమాహ్వానం రాక్షస్యో రక్షసామపి||30.26||
రాక్షసేంద్ర నియుక్తానాం రాక్షసేంద్ర నివేశనే |

స|| తతః రాక్షస్యః రాక్షసేంద్రనివేశనే రాక్షసేంద్రనియుక్తానాం రాక్షసానాం అపి సమాహ్వానం కుర్యుః||

||శ్లోకార్థములు||

తతః రాక్షస్యః రాక్షసేంద్రనివేశనే -
అప్పుడు రాక్షసులు రాక్షసేంద్రుని వాసములో
రాక్షసేంద్రనియుక్తానాం రాక్షసానాం -
రాక్షసేంద్రుని చే నియుక్తులైన రాక్షసులను
అపి సమాహ్వానం కుర్యుః -
కూడా ఆహ్వానించెదరు

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాక్షసులు రాక్షసేంద్రుని వాసములో రాక్షసేంద్రుని చే నియుక్తులైన రాక్షసులను కూడా ఆహ్వానించెదరు."||30.26||

||శ్లోకము 30.27||

తే శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధపాణయః||30.27||
అపతేయుర్విమర్దేsస్మిన్ వేగేనోద్విగ్నకారిణః|

స|| తే తస్మిన్ విమర్దే శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధపాణయః ఉద్వేగకారణాత్ వేగేన ఆపతేయుః||

||శ్లోకార్థములు||

తే తస్మిన్ విమర్దే -
అప్పుడు ఆ యుద్ధములో
శూలశక్తి నిస్త్రింశ వివిధాయుధపాణయః -
శూలములు శక్తులూ ఖడ్గములూ అనేక ఆయుధములు చేతిలో పట్టుకొని
ఉద్వేగకారణాత్ వేగేన ఆపతేయుః -
ఉద్వేగముతో వేగముగా వచ్చెదరు

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ రాక్షసులు శూలములు శక్తులూ ఖడ్గములూ అనేక ఆయుధములు చేతిలో పట్టుకొని ఉద్వేగముతో వేగముగా వచ్చెదరు".||30.27||

||శ్లోకము 30.28||

సంరుద్ధస్తైస్తు పరితో విధమన్ రక్షసాం బలమ్||30.28||
శక్నుయాం నతు సంప్రాప్తం పరం పారం మహోదధేః|

స|| తే పరితః సమృద్ధః రాక్షసానాం బలం విధమన్ మహోదధేః పరం పారంసంప్రాప్తుం న శక్నుయామ్||

||శ్లోకార్థములు||

తే పరితః - వారిచే చుట్టబడి
సమృద్ధః రాక్షసానాం బలం విధమన్ -
వారి బలమును విరోధిస్తూ
మహోదధేః పరం పారం సంప్రాప్తుం -
ఆ మహాసాగరము అవతలి తీరము
సంప్రాప్తుం న శక్నుయామ్ -
చేరలేకపోవచ్చు

||శ్లోకతాత్పర్యము||

"వారిచే చుట్టబడి వారి బలమును విరోధిస్తూ ఆ మహాసాగరము అవతలి తీరము చేరలేకపోవచ్చు." ||30.28||

||శ్లోకము 30.29||

మాం వా గృహ్ణీయురాప్లుత్య బహవ శ్శీఘ్రకారిణః||30.29||
స్యాదియం చా గృహీతార్థా మమ చ గ్రహణం భవేత్ |

స|| శ్శీఘ్రకారిణః బహవః ఆప్లుత్య మాం గృహ్ణీయుః వా । ఇయం చ అగృహీతార్థా స్యాత్ । మమ చ గ్రహణం భవేత్ ||

||శ్లోకార్థములు||

శ్శీఘ్రకారిణః బహవః -
శీఘ్రముగా వెళ్ళు చాలామంది రాక్షసులు
ఆప్లుత్య మాం గృహ్ణీయుః వా -
ఆకాశములోకి ఎగిరి నన్ను బంధించవచ్చు
ఇయం చ అగృహీతార్థా స్యాత్ -
ఈమెకు సందేశము అందకపోవును కూడా
మమ చ గ్రహణం భవేత్ -
నేను కూడా బంధింపబడిన వాడగుదును

||శ్లోకతాత్పర్యము||

"శీఘ్రముగా వెళ్ళు చాలామంది రాక్షసులు నన్ను బంధించవచ్చు. ఈమెకు సందేశము అందకపోవును. నేను కూడా బంధింపబడిన వాడగుదును." ||30.29||

||శ్లోకము 30.30||

హించాభిరుచయో హింస్యురిమాం వా జనకాత్మజామ్||30.30||
విపన్నం స్యాత్తతః కార్యం రామసుగ్రీవయోరిదమ్|

స|| వా హింసాభిరుచయః ఇమాం జనకాత్మజాం హింస్త్యః | తతః రామసుగ్రీవయోః ఇదం కార్యం విపన్నం స్యాత్||

||శ్లోకార్థములు||

వా హింసాభిరుచయః -
హింసలో రుచిగల వారు
ఇమాం జనకాత్మజాం హింస్త్యః -
ఈ జనకాత్మజను హింసించెదరు.
తతః రామసుగ్రీవయోః -
అప్పుడు రామ సుగ్రీవుల
ఇదం కార్యం విపన్నం స్యాత్ -
ఈ కార్యము విఫలము అగును

||శ్లోకతాత్పర్యము||

"హింసలో రుచిగల వారు ఈ జనకాత్మజను హింసించెదరు. అప్పుడు రామ సుగ్రీవుల కార్యము విఫలము అగును" . ||30.30||

||శ్లోకము 30.31||

ఉద్దేశే నష్టమార్గేఽస్మిన్ రాక్షసైః పరివారితే||30.31||
సాగరేణ పరిక్షిప్తే గుప్తే వసతి జానకీ|

స|| జానకీ నష్టమార్గే రాక్షసైః పరివారితే సాగరేణ పరిక్షిప్తే గుప్తే అస్మిన్ ఉద్దేశే వసతి||

||శ్లోకార్థములు||

నష్టమార్గే రాక్షసైః పరివారితే -
ఎవరికి కనపడని ప్రదేశములో రాక్షసుల కాపలాలో
సాగరేణ పరిక్షిప్తే -
సాగరముతో చుట్టబడిన
గుప్తే అస్మిన్ ఉద్దేశే -
రహస్యమైన ప్రదేశములో
జానకీ వసతి - జానకి వున్నది

||శ్లోకతాత్పర్యము||

"జానకి బందీగా రాక్షసుల కాపలాలో సాగరముతో చుట్టబడి రహస్యమైన ప్రదేశములో ఉన్నది".||30.31||

||శ్లోకము 30.32||

విశస్తే నిగృహీతే వా రక్షోభిర్మయి సంయుగే ||30.32||
నాన్యం పశ్యామి రామస్య సాహాయ్యం కార్యసాధనే|

స||మయి సంయుగే రక్షోభిః విశస్తే వా గృహీతే వా రామస్య కార్యసాధనే అన్యం సహాయం న పశ్యామి ||

||శ్లోకార్థములు||

మయి సంయుగే రక్షోభిః -
నేను రాక్షసులతో జరిగిన యుద్ధములో
విశస్తే వా గృహీతే వా -
మరణించినా పట్టుకో బడినా
రామస్య కార్యసాధనే -
రాముని కార్యము సాధించుటకు
అన్యం సహాయం న పశ్యామి-
సహాయము చేయగల వారు ఎవరూ కనపడుటలేదు

||శ్లోకతాత్పర్యము||

"నేను రాక్షసులతో జరిగిన యుద్ధములో మరణించినా పట్టుకోబడినా రామునికి సహాయము చేయగల వారు ఎవరూ లేరు."||30.32||

||శ్లోకము 30.33||

విమృశంశ్చ న పశ్యామి యో హతే మయి వానరః||30.33||
శతయోజనవిస్తీర్ణం లంఘయేత మహోదధిమ్|

స||మయి హతే యః వానరః శతయోజనవిస్తీర్ణం మహోదధిం లంఘయేత్ విమృశన్ చ న పశ్యామి ||

||శ్లోకార్థములు||

మయి హతే -
నేను చనిపోతే
శతయోజనవిస్తీర్ణం -
ఈ శతయోజన విస్తీర్ణము గల
యః వానరః మహోదధిం లంఘయేత్ -
మహా సాగరము దాటగల వానరుడు
విమృశన్ చ న పశ్యామి -
ఆలోచించిననూ నాకు కనపడుట లేదు

||శ్లోకతాత్పర్యము||

"నేను చనిపోతే ఈ శతయోజన విస్తీర్ణము గల మహా సాగరము దాటగల వానరుడు నాకు కనపడుట లేదు." ||30.33||

||శ్లోకము 30.34||

కాంమం హంతుం సమర్థోఽస్మి సహస్రాణ్యపి రక్షసామ్||30.34||
న తు శక్ష్యామి సంప్రాప్తుం పరం పారం మహోదధేః|

స|| రాక్షసాం సహస్రాణి అపి హంతుం సమర్థః అస్మి | కామం తు మహోదధేః పరం పారం సంప్రాప్తుం న శక్ష్యామి ||

||శ్లోకార్థములు||

రాక్షసాం సహస్రాణి అపి -
వేయిమంది రాక్షసులను
హంతుం సమర్థః అస్మి-
హతమార్చుటకు నాకు సమర్థత ఉన్నది
కామం తు మహోదధేః పరం పారం -
కాని తరువాత అ మహాసాగరపు అవతలి తీరము
సంప్రాప్తుం న శక్ష్యామి - చేరగల శక్తి ఉండకపోవచ్చు."

||శ్లోకతాత్పర్యము||

"వేయిమంది రాక్షసులను హతమార్చుటకు నాకు సమర్థత ఉన్నది. కాని తరువాత అ మహాసాగరపు అవతలి తీరము చేరగల శక్తి ఉండకపోవచ్చు." ||30.34||

||శ్లోకము 30.35||

అసత్యాని చ యుద్ధాని సంశయో మే న రోచతే ||30.35||
కశ్చ నిస్సంశయం కార్యం కుర్యాత్ ప్రాజ్ఞః ససంశయమ్

స||యుద్ధాని అసత్యాని చ సంశయః మే న రోచతే | కః ప్రజ్ఞః నిఃసంశయం కార్యం ససంశయం కుర్యాత్ |

తిలక టీకా లో- కిం చ యుద్ధే జయోఽపి సందిగ్ధ ఇత్యాహ అసత్యానితి। అనిశ్చిత జయాని।సంశయః సంశయితజయఫలక యుద్ధవ్యాపారః।అరుచిహేతు ప్రాజ్ఞత్వమేవ దర్శయతి।

యుద్ధములో జయము సందిగ్ధము. అదే ధ్వనిస్తూ యుద్ధము అసత్యము అన్నమాట వాడబడినది అని వ్యాఖ్య.

రామ టీకాలో - నిఃసంశయం సంశయరహితం కార్యం కః ప్రాజ్ఞః కుర్యాత్ నకోఽపి ఇత్యర్థః। సంశయముతో కూడిన కార్యమును ఎవరు సంశయము లేకుండా తీసుకోగలరు అని, అంటే ఎవరు ఆ కార్యము చేపట్టరు అని భావము.

||శ్లోకార్థములు||

యుద్ధాని అసత్యాని చ -
యుద్ధము అనిశ్చితము
సంశయః మే న రోచతే -
అనిశ్చితాలమీద నాకు ఇష్టము లేదు
నిఃసంశయః ససంశయం కార్యం -
నిస్సంశయముగా సంశయము కల కార్యమును
కః ప్రజ్ఞః కుర్యాత్ - ఏ ప్రజ్ఞాశాలి చేపట్టును

||శ్లోకతాత్పర్యము||

"యుద్ధములోని అనిశ్చితాలమీద నాకు ఇష్టము లేదు. ఏ ప్రజ్ఞాశాలి నిస్సంశయముగా సంశయముతో కూడిన కార్యము తీసుకొనును?" ||30.35||

||శ్లోకము 30.36||

ప్రాణత్యాగశ్చ వైదేహ్యా భవేత్ అనభిభాషణే||30.36||
ఏష దోషో మహాన్ హి స్యా న్మమ సీతాభిభాషణే|

స|| అనభిభాషణే వైదేహ్యా ప్రాణత్యాగశ్చ భవేత్ | సీతా అభిభాషణే ఏష మహాన్ దోషః స్యాత్ |

||శ్లోకార్థములు||

అనభిభాషణే -
మాటలాడక పోతే
వైదేహ్యా ప్రాణత్యాగశ్చ భవేత్ -
వైదేహి ప్రాణత్యాగము చేయవచ్చు
సీతా అభిభాషణే -
సీతదేవి తో మాట్లాడినా కూడా
ఏష మహాన్ దోషః స్యాత్ -
ఈ మహా ప్రమాదము కలుగవచ్చు

||శ్లోకతాత్పర్యము||

"మాటలాడక పోతే వైదేహి ప్రాణత్యాగము చేయవచ్చు. సీతదేవి తో మాట్లాడినా కూడా మహా ప్రమాదము కలుగవచ్చు."||30.36||

||శ్లోకము 30.37||

భూతా శ్చార్థా వినశ్యంతి దేశకాలవిరోధితాః||30.37||
విక్లబం దూతమాసాద్య తమః సూర్యోదయే యథా|

స|| విక్లబం దూతం అసాద్య భూతాః అర్థాః దేశకాలవిరోధితాః సూర్యోదయే తమసః యథా వినశ్యంతి||

||శ్లోకార్థములు||

విక్లబం దూతం అసాద్య -
వివేకహీనుడైన దూతచే
భూతాః అర్థాః - అర్థవంతమైన కార్యములు
సూర్యోదయే తమసః యథా -
సూర్యోదయముచే నాశనము చేయబడిన చీకటిలాగా
దేశకాలవిరోధితాః వినశ్యంతి -
దేశకాల విరోధములతో నాశనము అవును

||శ్లోకతాత్పర్యము||

" దేశకాల విరోధములతో వివేకహీనుడైన దూతచే అర్థవంతమైన కార్యములు సూర్యోదయముచే నాశనము చేయబడిన చీకటిలాగా నాశనము అవును." ||30.37||

||శ్లోకము 30.38||

అర్థానర్థాంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే||30.38||
ఘాతయంతి హి కార్యాణి దూతాం పండితమానినః|

స|| అర్థాన్ అనర్థాం అంతరే బుద్ధిః నిశ్చితాపి న శోభతే | పండితమానినః దూతాః కార్యాణి ఘాతయంతి హి||

||శ్లోకార్థములు||

అర్థాన్ అనర్థాం అంతరే -
అర్థము అనర్థము మధ్యలో
బుద్ధిః నిశ్చితాపి న శోభతే -
నిశ్చయమైన బుద్ధి కూడా శోభించదు
పండితమానినః దూతాః -
తమని తాము పండితులము అనుకునే దూతలు
కార్యాణి ఘాతయంతి హి -
కార్యములు అనర్థము చేయుదురు

||శ్లోకతాత్పర్యము||

"అర్థము అనర్థము మధ్యలో నిశ్చయమైన బుద్ధి కూడా శోభించదు. తమని తాము పండితులము అనుకునే దూతలు కార్యములు అనర్థము చేయుదురు." ||30.37||

||శ్లోకము 30.39||

న వినశ్యేత్ కథం కార్యం వైక్లబ్యం న కథం భవేత్ ||30.39||
లంఘనం చ సముద్రస్య కథం ను వృథాభవేత్|

స|| కార్యం కథం న వినశ్యేత్ | వైక్లబ్యం న కథం భవేత్ | సముద్రస్య లంఘనం కథం ను వృథాభవేత్ ||

||శ్లోకార్థములు||

కార్యం కథం న వినశ్యేత్ -
కార్యము ఎట్లు చెడకుండా ఉండాలి?
వైక్లబ్యం న కథం భవేత్ -
బుద్ధిని ఎట్లు హీనము కాకుండా చేయగలము
సముద్రస్య లంఘనం కథం ను వృథాభవేత్ -
సముద్ర లంఘనము ఎట్లు వృధాకాకూడదు?

||శ్లోకతాత్పర్యము||

"కార్యము ఎట్లు చెడకుండా ఉండాలి? బుద్ధిని ఎట్లు హీనము కాకుండా చేయగలము? సముద్ర లంఘనము ఎట్లు వృధాకాకూడదు?" ||30.39||

||శ్లోకము 30.40||

కథం ను ఖలు వాక్యం మే శృణుయాన్నో ద్విజేత వా ||30.40||
ఇతి సంచింత్య హనుమాంశ్చకార మతిమాన్మతిమ్|

స|| మే వాక్యం కథమ్ ను శృణుయాయాత్ న ఉద్విజేత్ వా ఇతి సంచిత్య మతిమాన్ హనుమాన్ మతిం చకార||

||శ్లోకార్థములు||

మే వాక్యం న ఉద్విజేత్ -
నా మాటల వలన భయపడకుండావుండునట్లు
కథమ్ ను శృణుయాత్ ఖలు ఇతి సంచిత్య-
ఎట్లు వినిపించగలను అని ఆలోచించి
మతిమాన్ హనుమాన్ - బుద్ధిమంతుడగు హనుమాన్
మతిం చకార - ఒక నిర్ణయమునకు వచ్చెను

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధముగా నా మాటల వలన సీత ఎట్లు భయపడకుండావుండునట్లు చేయగలను" అని అలోచించి, హనుమ నిర్ణయముకు వచ్చెను."

||శ్లోకము 30.41||

రామం అక్లిష్టకర్మాణం స్వబంధు మనుకీర్తయన్||30.41||
నైనా ముద్వేజయిష్యామి తద్బంధుగత మానసామ్|

స|| అక్లిష్టకర్మణాం సుబంధుం రామం అనుకీర్తయన్ తద్ బంధుగతమానసాం ఏనాం న ఉద్వేజయిష్యామి||

||శ్లోకార్థములు||

అక్లిష్టకర్మణాం -
ఎటువంటి క్లిష్టకర్మలైనా సాధించగల సమర్థుడు
సుబంధుం రామం అనుకీర్తయన్ -
ఆమెకు ప్రియుడు అగు రాముని కీర్తిస్తూ
తద్ బంధుగతమానసాం ఏనాం -
రాముని యందే లగ్నమైన మనస్సు గల ఈమెను
న ఉద్వేజయిష్యామి - భయపెట్టజాలను

||శ్లోకతాత్పర్యము||

"ఎటువంటి క్లిష్ట కర్మలైనా సాధించ గల సమర్థుడు అగు రాముని కీర్తిస్తూ, రాముని యందే లగ్నమైన మనస్సు గల ఈమెను భయపెట్టజాలను."||30.41||

క్లిష్టమైన పనులు సాధించగల రాముని కీర్తిస్తే సీతకి భయము రాదు. హనుమ కూడా క్లిష్టమైన పరిస్థితులలో రామ కీర్తనే ఆయుధముగా ఉపయోగిస్తాడు కూడా.

||శ్లోకము 30.42,43||

ఇక్ష్వాకూణాం వరిష్టస్య రామస్య విదితాత్మనః||30.42||
శుభాని ధర్మయుక్తాని వచనాని సమర్పయన్|
శ్రావయిష్యామి సర్వాణి మధురాం ప్రబ్రువన్ గిరమ్||30.43||

స|| ఇక్ష్వాకూణామ్ వరిష్ఠస్య విదితాత్మనః రామస్య శుభాని వచనాని సమర్పయన్ మధురాం గిరం ప్రబృవన్ సర్వాణి శ్రావైష్యామి |

రామ టీకాలో- మథురాం గిరం ప్రబృవన్ సన్ సర్వాణి రమసందేశ వచనాని శ్రావయిష్యామియథా యేన ప్రకారేణ సీతా శ్రద్ధాస్యతి రామవచనత్వేన శ్రద్ధాం కరిష్యతి తథా సర్వం సీతాయాః అసంకిత జాతం సమాదధే ప్రత్యుత్తరస్యామి|

||శ్లోకార్థములు||

ఇక్ష్వాకూణామ్ వరిష్ఠస్య -
ఇక్ష్వాకులలో వరిష్ఠుడు
విదితాత్మనః రామస్య -
ఆత్మను ఎరిగినవాడు అగు రాముని (కథ)
శుభాని వచనాని సమర్పయన్ -
శుభవచనములతో సమర్పిస్తూ
మధురాం గిరం ప్రబృవన్ -
మధురమైనమాటలతో చెపుతూ
సర్వాణి శ్రావైష్యామి -
అంతా అమెకి వినిపిస్తాను

||శ్లోకతాత్పర్యము||

"ఇక్ష్వాకులలో వరిష్ఠుడు ఆత్మను ఎరిగినవాడు అగు రాముని కథ శుభవచనములతో మధురమైనమాటలతో అంతా వినిపించెదను. ||30.42,43||

||శ్లోకము 30.44||

శ్రద్దాస్యతి యథా హీయం తథా సర్వం సమాదధే||30.44||

స|| ఇయం యథా శ్రద్ధాస్యతి తథా సర్వం సమాదదే||

||శ్లోకార్థములు||

ఇయం యథా శ్రద్ధాస్యతి -
ఈమెకు ఎట్లు నాపట్లవిశ్వాసమును పొందించగలనో
తథా సర్వం సమాదదే -
అట్లు సర్వము విశదీకరించెదను

||శ్లోకతాత్పర్యము||

"ఈమెకు ఎట్లు నాపట్లవిశ్వాసమును పొందించగలనో అట్లు సర్వము విశదీకరించెదను".

||శ్లోకము 30.45||

ఇతి స బహువిధం మహానుభావో
జగతి పతేః ప్రమదామవేక్షమాణః|
మధురమవితథం జగాద వాక్యం
ద్రుమవిటపాంతర మాస్థితో హనూమాన్||30.45||

స|| మహానుభావః సః హనుమాన్ ద్రుమవిటపాంతరం ఆస్థితః జగతి పతేః ప్రమదాం అవేక్షమాణః బహువిధం అవితథం మథురం వాక్యం ఇతి జగాద||

||శ్లోకార్థములు||

మహానుభావః సః హనుమాన్ -
అప్పుడు మహానుభావుడైన ఆ హనుమంతుడు
ద్రుమవిటపాంతరం ఆస్థితః -
ఆ చెట్టుకొమ్మలమధ్యలో కూర్చుని
జగతి పతేః ప్రమదాం అవేక్షమాణః -
అ జగత్పతి యొక్క భార్యని చూస్తూ
బహువిధం అవితథం -
పలువిధములుగా విశ్వసనీయమైన మాటలతో
మథురం వాక్యం ఇతి జగాద-
మధురమైన వాక్యములతో ఈ విధముగా పలుకసాగెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు మహానుభావుడైన ఆ హనుమంతుడు ఆ చెట్టుకొమ్మలమధ్యలో కూర్చుని అ జగత్పతి యొక్క భార్యని చూస్తూ పలువిధములుగా విశ్వసనీయమైన మాటలతో మధురమైన వాక్యములతో ఈ విధముగా పలుకసాగెను." ॥30.45॥

అనేక విధములుగా ఆలోచించిన హనుమంతుడు ఆ చెట్టుకొమ్మలమధ్యలో కూర్చుని అ జగత్పతి యొక్క భార్యని చూస్తూ మధురమైన వాక్యములతో రాముని కీర్తిస్తాడు .

అప్పుడు హనుమంతుడు పలికేది రామకథ. రామకథా ప్రసంగమువలన అంతరాయములు కలుగవు. హనుమంతుడు సముద్ర లంఘనములో మైనాకుడు అడ్డుపడినప్పుడు, సురస అడ్డుపడినప్పుడు వెంటనే తన కర్తవ్యమును అంటే క్లుప్తముగా రామకథను చెపుతాడు.

ఇక్కడ కూడా అలాగే సీతాదేవికి ఊరట కలగడానికి రామకథ చెపుతాడు . అదే రామకథా ప్రభావము. అదే ఈ ముప్పదియవ సర్గలో అంతరార్ధము

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రింశస్సర్గః||

||ఓమ్ తత్ సత్||