||సుందరకాండ ||
||ముప్పది రెండవ సర్గ తెలుగులో||
|| Om tat sat ||
సుందరకాండ.
అథ ద్వాత్రింశస్సర్గః
అప్పుడు వృక్షశాఖలలో లీనమైన తెల్లని వస్త్రము ధరించిన, మెఱుపుతీగలవంటి వర్ణము కల వానరుని చూచి, చలించిన మనస్సు కలదాయెను. వికశించిన పుష్పములకాంతితో శోభిల్లుతున్న, పుడిమి బంగారపు కాంతులుగల నేత్రములతో, ప్రియవచనములు పలుకుతున్న, వినయముతో నున్న వానరుని చూచెను.
విస్మయము చెందిన మైథిలి అలోచించసాగెను.
"అయ్యో ఈ వానరుని రూపము భయంకరముగా సమీపింప సాధ్యముకానిదిగా ఉన్నది. చూడశక్యముగానిదిగానున్నది" అని తలచి మళ్ళీ కలత చెంది తీవ్రముగా విలపింపసాగెను.
ఆ భామిని సీత భయపడినదై దుఃఖములో మునిగి రామా రామా అని లక్ష్మణా మెల్లగా మందస్వరముతో అనేకవిధములుగా రోదించెను. ఆ సీత వినయముగా కూర్చుని ఉన్న ఆ వానరశ్రేష్ఠుని చూచి ఇది కలయే అని అనుకొనెను.
అలా పరికిస్తూ ఉన్న సీత పెద్ద ముఖము కలవాడు, వానరరాజాధిపతి ఆజ్ఞను పరిపాలించు సుగ్రీవుని అమాత్యుడు అగు, వాయునందనుడు, బుద్ధిమంతులలో శ్రేష్ఠుడు అగు హనుమంతుని చూచెను. ఆమె అతనిని చూచిన వెంటనే మూర్ఛిల్లి, ప్రాణము పోయినదానివలె ఆయెను. విశాలనేత్రములు కల ఆ దేవి వెంటనే తేరుకొని మరల ఆలోచించసాగెను.
"ఇప్పుడు నేను వికృతమైన శాస్త్రములో నిషిద్ధింపబడిన వానరుని స్వప్నములో చూచితిని. లక్ష్మణునితో కూడిన రామునకు, అలాగే రాజు నా తండ్రి అగు జనకునకు శుభము అగుగాక. ఇది స్వప్నము కూడా కాదు. పూర్ణచంద్రుని బోలి ముఖముగల వానిని బాసి, శోకములో దుఃఖముతో పీడింపబడుతున్న నాకు నిద్రకూడా లేదు కదా. రామా రామా అంటూ సదా అదే చింతనతో అయననే స్మరిస్తూ, అందుకు అనుగుణముగా అలాంటి కధలనే వింటూ, చూస్తూ ఉన్నట్లు ఉన్నాను. నేను ఆయనతో మనస్సు నిండినదై , పీడింపబడినదై , అన్నివిధములుగా అయనపై భావము కలదాననై అయనే చూస్తూ వింటూ ఉన్నాను. ఇది నామనోరథము అని అనుకుంటాను. నా మనస్సులో తర్కించుకుంటాను. కాని ఆ తర్కమునకు రూపము ఉండదు కదా. కాని ఇప్పుడు ప్రత్యక్షముగా కనిపిస్తున్న రూపము మాట్లాడు చున్నది అది ఎలాగ?"
" ఇంద్రునకు నమస్కారము. బృహస్పతికి బ్రహ్మదేవునకు నమస్కారములు. నా ముందున్న ఈ వనవాసుడు చెప్పినది నిజము అగు గాక . అది అసత్యము కాకూడదు గాక ! "
ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది రెండవ సర్గ సమాప్తము
||ఓం తత్ సత్||