||సుందరకాండ ||
||ముప్పది మూడవ సర్గ తెలుగులో||
|| Om tat sat ||
సుందరకాండ.
అథ త్రయస్త్రింశస్సర్గః
వినయవిధేతలు గలవాని వలే వస్త్రములు ధరించినవాడు, పగడములతో సమానమైన కాంతి గలవాడు, అగు మారుతాత్మజుడు ఆ వృక్షమునుంచి దిగి సమీపించి సీతమ్మకి నమస్కరించెను. ఆ హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి మధురమైన మాటలతో ఆ సీతతో మాట్లాడెను.
"పద్మరేకులవంటి కళ్ళు కలదానా, నలిగిన పట్టువస్త్రములు ధరించినదానా, దోషములు లేని దానా చెట్టుకొమ్మని పట్టుకొని నిలబడిన దానా, నీవు ఎవరివి? తామరాకులనుంచి నీరు జారినట్లు నీ నేత్రములనుంచి ఎందుకు కనీళ్ళు జారుతున్నాయి? ఓ మంగళరూపిణీ సురలలో గాని అసురలలోగాని నాగులు గంధర్వులు రాక్షసులు లేక కిన్నరులగాని వీరిలో నీవు ఎవరివి? రుద్రగణములకు కాని మరుత్ గణములకు కాని వసువులకుగాని చెందిన దానవా ?"
" ఓ వరాననా, అందమైన అవయవములు కలదానా, నీవు తప్పక దేవతలవలే శోభిస్తున్నావు. చంద్రుని వదలి ఆకాశమునుంచి పడిన నక్షత్రములలో శ్రేష్ఠమైన , శ్రేష్ఠమైన గుణములు కల రోహిణివా నువ్వు? ఓ కల్యాణీ దోషములేని నేత్రములు కలదానా ఎవరివి నీవు? కోపముతోకాని మోహముతో కాని భర్త అయిన వశిష్ఠుని వదిలి వచ్చిన అరుంధతివా ? ఓ సుమధ్యమా ! నీ పుత్రులు, తండ్రి భర్త, సోదరులు ఎవరు ఈ లోకమునుంచి పరలోకమునకు పోవుటవలన నువ్వు దుఃఖములో ఉన్నావు. నీ రోదనములో ని ఉఛ్వాస నిఃశ్వాసములతో, భూమి మీద నిలబడడముతో, రాజలక్షణములతో నీవు దేవతవు కావు అని అనుకుంటున్నాను. నీ మీదయున్న లక్షణములతో నువ్వు రాజ మహిషి అగు రాజ కన్యవు అని భావిసున్నాను. నీవు జనస్థానమునుండి రావణుని చేత బలాత్కారముగా అపహరింపబడిన సీత అయినచో అది నాకు చెప్పుము. నీకు శుభము అగు గాక. నీ లోని దైన్యము, అతిమానుషరూపము, తపస్విని వేషము చూచి నువ్వు తప్పక రామ మహిషి వే !"
హనుమ వచనములను విని రామకీర్తనతో హర్షితురాలై, ఆ వృక్షమునాశ్రయించిన వైదేహి, హనుమంతునితో ఇట్లు పలికెను.
"నేను భూమండలములో రాజసింహులలో ముఖ్యులైన, ఆత్మను ఎరిగిన, శత్రు సైన్యములను రూపుమాపిన, దశరథుని కోడలిని. నేను మహాత్ముడైన విదేహమహరాజు అగు జనకుని పుత్రికను. ధీమంతుడైన రాముని భార్యను. సీత అని పేరుగలదానిని. నేను ఆ రాఘవుని నివాసములో మానుష భోగములను అనుభవిస్తూ అన్ని సదుపాయములతో పన్నెండు సంవత్సరములు గడిపితిని. అప్పుడు పదమూడవ సంవత్సరములో రాజ గురువులతో కలిసి ఆ మహారాజు ఇక్ష్వాకు నందనుడగు రాముని పట్టాభిషేకమునకు నిర్ణయించెను. ఆ రాఘవుని పట్టాభిషేకమునకు జరుగుతున్న సంరంభములతో కైకేయి అనబడు దేవి భర్త అగు దశరథునితో ఇట్లు పలికెను. " రాముని అభిషేకముతో నేను ఏమీ తాగను , ప్రతిరోజూ భోజనము చేయను. ఇది నా జీవితమునకు అంతము. ఓ నృపసత్తమా నీవు ప్రేమతో ఏ మాటలు చెప్పితివో ఆవి వృధాకాకుండా వుండాలి అంటే రాఘవుడు వనము నకు పోవును. సత్యవంతుడైన ఆ రాజు, ఆ దేవికి ఇచ్చిన వరదానమును స్మరించి, కైకేయి యొక్క అప్రియమైన మాటలు విని మూర్ఛపోయెను. అప్పుడు సత్య ధర్మములో అనుష్ఠితుడైన ఆ రాజు విలపించుచూ జ్యేష్ఠపుత్రుని రాజ్యము గురించి కోరెను. ఆ శ్రీమంతుడు అభిషేకము కన్న పిత్రువచన పరిపాలన ముఖ్యమని మనసా తలిచి తన వాక్కుతో అంగీకరించెను. సత్యమే పరాక్రమముగా గల ఆ రాముడు ఎప్పుడూ ఇచ్చెడి వాడు. మరల తీసుకొనువాడు కాదు. ప్రాణసంకటములో కూడా అప్రియమైన మాటలు చెప్పువాడు కాడు. మహాయశోవంతుడైన అతడు మహత్తరమైన ఉత్తరీయములను వదిలి, మనసా రాజ్యము వదిలి, నన్ను తన జననికి అప్పగించెను. నేను ఆయనికి ముందే వనచారిణి గా సిద్ధము అయితిని. ఆయన లేకుండా నాకు స్వర్గము కూడా ఇష్ఠము లేదు. మహాభాగుడు మిత్రనందనుడు అగు సౌమిత్రి కూడా పూర్వజుని అనుసరించుటకు నారచీరలతో అలంకరించుకొనెను".
" మేము అందరము రాజ ఆదేశమును శిరసావహించి ధృడమైన వ్రతముతో ఎప్పుడూ చూడబడని గంభీరమైన అ వనమును ప్రవేశించితిమి. అమితతేజస్సు కల ఆయన భార్యను అయిన నేను దండకారణ్యములో నివశించుచుండిని. దురాత్ముడైన రాక్షసుడు రావణుని చేత అపహరించబడితిని. వానిచేత రెండు నెలల కాలము జీవితము గడువు పెట్టబడెను. ఆ రెండు నెలల తరువాత జీవితము త్యజించెదను".
ఈవిధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది మూడవ సర్గ సమాప్తము.
|| ఓమ్ తత్ సత్||