||సుందరకాండ ||

||ముప్పది నాలుగవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 34 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||


సుందరకాండ.
అథ చతుస్త్రింశస్సర్గః

"భార్యా రామస్య ధీమతః' అంటూ తన పరిచయము చెప్పుకొని, "తతః త్యక్ష్యామి జీవితం"అంటూ తన స్థితిని వెల్లడించిన, సీతాదేవి యొక్క దుఃఖభరితమైన మాటలు వినిన హనుమంతుడు, సీతను ఓదార్చడము తన కర్తవ్యము అనుకొని, ఆ కర్తవ్య నిర్వహణము ధ్యేయముగా వుంచుకొని, సీతతో తన సంభాషణ ముందుకు సాగిస్తాడు ఈ సర్గలో.

ఇక ముప్పది నాలుగొవ సర్గలో శ్లోకాలు.

||శ్లోకము 34.01||

తస్యాత్ తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూధపః|
దుఃఖా దుఃఖాభిభూతాయాః సాంత్వ ముత్తర మబ్రవీత్||34.01||

స|| హరియూధపః దుఃఖాత్ దుఃఖాభిభూతాయాః తస్యాః తత్ వచనం శ్రుత్వా సాంత్వం ఉత్తరం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

హరియూధపః దుఃఖాత్ -
హనుమంతుడు దుఃఖములో
దుఃఖాభిభూతాయాః తస్యాః -
దుఃఖముతో నిండియున్న ఆమె యొక్క
తత్ వచనం శ్రుత్వా -
ఆ వచనములను విని
సాంత్వం ఉత్తరం అబ్రవీత్ -
ఓదార్చు వచనములతో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"దుఃఖములో దుఃఖముతో నిండియున్న ఆమె వచనములను విని, ఆ హనుమంతుడు ఆమెను ఓదార్చు వచనములతో ఇట్లు పలికెను". ||34.01||

||శ్లోకము 34.02||

అహం రామస్య సందేశాత్ దేవి దూతస్తవాగతః|
వైదేహీ కుశలీ రామః త్వాం చ కౌశలమబ్రవీత్||34.02||

స|| దేవీ అహం రామస్య దూతః తవ సందేశాత్ ఆగతః | వైదేహీ కుశలీ రామః త్వాం చ కౌశలం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

దేవీ అహం రామస్య దూతః -
దేవి నేను రాముని దూతను
తవ సందేశాత్ ఆగతః -
నీ కొఱకై పంపబడి వచ్చిన వాడను
వైదేహీ కుశలీ రామః -
వైదేహీ కుశలముగానున్న రాముడు
త్వాం చ కౌశలం అబ్రవీత్ -
నీ యొక్క కుశలము అడుగుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవి నేను రాముని దూతను నీ కొఱకై పంపబడి వచ్చిన వాడను. వైదేహీ కుశలముగా నున్న రాముడు నీ యొక్క కుశలము అడుగుచున్నాడు." ||34.02||

||శ్లోకము 34.03||

యో బ్రహ్మమస్త్రం వేదాంశ్చ వేద వేదవిదాం వరః|
స త్వా దాశరథీ రామో దేవి కౌశల మబ్రవీత్||34.03||

స|| వేదవిదాం వరః యః బ్రహ్మమ్ అస్త్రం చ వేదాంశ్చ వేద సః దాశరథీ రామః త్వాం కౌశలం అబ్రవీత్ |

||శ్లోకార్థములు||

వేదవిదాం వరః - వేదములలో పారంగతుడు
యః బ్రహ్మమ్ అస్త్రం చ వేదాంశ్చ వేద -
ఎవరైతే బ్రహ్మాస్త్రముగురించి వేదములగురించి తెలిసినవాడో
సః దాశరథీ రామః -
ఆ దాశరథి రాముడు
త్వాం కౌశలం అబ్రవీత్ -
నీ కుశలము గురించి అడుగుతున్నాడు

||శ్లోకతాత్పర్యము||

" వేదములలో పారంగతుడు, ఎవరైతే బ్రహ్మాస్త్రముగురించి వేదములగురించి తెలిసినవాడో ఆ దాశరథి నీ కుశలము గురించి అడుగుతున్నాడు."

||శ్లోకము 34.04||

లక్ష్మణశ్చ మహాతేజా భర్తుస్తేఽనుచరః ప్రియః|
కృతవాన్ శోకసంతప్తః శిరసా తే అభివాదనమ్||34.04||

స|| తే భర్తుః అనుచరః మహాతేజాః లక్ష్మణః చ శోకసంతప్తః తే శిరసా అభివాదనం కృతవాన్ ||

||శ్లోకార్థములు||

తే భర్తుః అనుచరః - నీ భర్త అనుచరుడు
మహాతేజాః లక్ష్మణః చ -
మహాతేజోవంతుడు అగు లక్ష్మణుడు
శోకసంతప్తః - శోకసంతాపముతో
తే శిరసా అభివాదనం కృతవాన్ -
నీకు శిరసాభివందనము చేయుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"నీ భర్త అనుచరుడు మహాతేజోవంతుడు అగు లక్ష్మణుడు, శోకసంతాపముతో నీకు శిరసాభివందనము చేయుచున్నాడు".||34.04||

||శ్లోకము 34.05|

సా తయోః కుశలం దేవీ నిశమ్య నరసింహయోః|
ప్రీతిసంహృష్ట సర్వాంగీ హనూమంతం అథాబ్రవీత్||34.05||

స|| అథ సా దేవీ ప్రీతిసంహృష్టసర్వాంగీ తయోః నరసింహయోః కుశలం నిశమ్య ప్రీతి సంహృష్టః హనుమంతం అబ్రవీత్||

||శ్లోకార్థములు||

అథ సా దేవీ - అప్పుడు ఆ దేవి
ప్రీతిసంహృష్టసర్వాంగీ -
ఆనందముతో నిండిన అవయవములు కలదై
తయోః నరసింహయోః కుశలం నిశమ్య -
ఆ ఇద్దరు నరసింహుల కుశలము విని
ప్రీతి సంహృష్టః -
అత్యంత సంతోషముతో
హనుమంతం అబ్రవీత్ -
హనుమంతునితో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ ఇద్దరు నరసింహుల కుశలము విని ఆ దేవి సమస్త అవయవములలో పొంగిన ఆనందము కలదై హనుమంతునితో ఇట్లు పలికెను." ||34.05||

||శ్లోకము 34.06||

కల్యాణీ బతగాథేయం లౌకీకి ప్రతిభాతి మా|
ఏతి జీవితమానందో నరం వర్షశతాదపి||34.06||

స||] జీవంతం నరం వర్షశతాదపి జీవంతం (తదా) ఆనందః ఏతి లౌకీకి గాధా కల్యాణి ఇతి మే ప్రతిభాతి||

||శ్లోకార్థములు||

నరం వర్షశతాదపి జీవంతం -
నరుడు వందసంవత్సరములు బతికినచో
(తదా) ఆనందః ఏతి -
తప్పక ఆనందము పొందును
లౌకీకి గాధా -
అన్న లౌకిక గాధ
కల్యాణి ఇతి మే ప్రతిభాతి -
మంగళకరము అని నాకు తెలియుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"నరుడు వందసంవత్సరములు బతికినచో తప్పక ఆనందము పొందును అన్న లౌకికము ఎంత మంగళకరమో నాకు తెలియుచున్నది".||34.06||

ఆ 'లౌకికము' అన్నమాట ఇది. "ఏతి జీవన్తి మానందో నరం వర్ష శతాదపి"- "జీవించియున్న నరునికి నూరేండ్లకైననూ ఆనందము కలుగును"

రామలక్ష్మణులు కుశలముగా వున్నారని వినిన సీతకి, నూరేళ్ళు బ్రతికిఉంటే సుఖములను పొందవచ్చు అనే లౌకికమైన మాట నిజము అని అనిపించింది.

ఆ మాట లౌకికమే కాదు, అది అధ్యాత్మిక సత్యము కూడా అని అంటారు అప్పలాచార్యులుగారు.

ఆనందమే పరబ్రహ్మము. దానికి దూరమైన జీవుడు దుఃఖము పొందును. అనేక జన్మల నెత్తును. ఎన్నో జన్మల తరువాత అయినా చివరికి జీవుడు భగవదాభిముఖము కలిగి, ఆనందమగు పరబ్రహ్మమమును పొందును. అది తథ్యము. అందుచే జీవితము ఆనందముతోనే అంతమగును. జీవితము ఒక జన్మ తో ముగియునది కాదు. పరమాత్మకు విముఖుడై దూరమైన జీవుడు పరమాత్మకు అభిముఖుడై పరమాత్మను చేరుట ఒక జీవితము.

అదే నూరేళ్ళు బ్రతికిన మానవుడు ఆనందము పొందడము. జీవితము ఎప్పుడూ సుఖముతోనే అంతమగును. అందుకే భారతీయ సంప్రదాయములో జీవితమునకు ప్రతిబింబములగు పౌరాణికములు నాటకములు సుఖాంతముగా వుంటాయి.

ఇంకోమాట. ఇక్కడ నరుడు ఆనందము పొందలేదు. ఆనందము నరుని పొందును."ఆనందః నరం ఏతి"

నరుడు తనంత తానుగా భగవంతుని పొందలేదు. భగవదభిముఖము కలిగి , భగవంతుని పొందవలెనని ఆర్తి కలిగినచో, ఆ ప్రేమకు వశమై భగవంతుడే నరుని పొందును.

భగవత్ప్రాప్తి అందరకు కలుగునా ? ఎట్లు భగవత్ప్రాప్తి కలుగును ఎన్నాళ్ళకు భగవత్ప్రా ప్తి కలుగును? అనే మాటలకి సమాధానము- "ఏతి జీవన్తి మానందో నరం వర్ష శతాదపి"
అనే మాటతో స్పష్ఠమౌతుంది.

రాముని కుశలములు వినిన సీత , హనుమంతునిపై అద్భుతమైన ప్రీతితో , అభిమానము తో ఈ మాట చెపుతుంది.

||శ్లోకము 34.07||

తయా సమాగతే తస్మిన్ ప్రీతిరుత్పాదితాద్భుతా|
పరస్పరేణ చాలాపం విశ్వస్తౌతౌ ప్రచక్రతుః||34.07||

స|| సమాగతే తస్మిన్ తథా అద్భుతా ప్రీతిః ఉత్పాదితా | తౌ విశ్వస్తౌ పరస్పరేణ ఆలాపం చ చక్రతుః||

||శ్లోకార్థములు||

సమాగతే తస్మిన్ తథా -
అలా కలిసిన అతనితో
అద్భుతా ప్రీతిః ఉత్పాదితా -
అద్భుతమైన అభిమానము కలిగెను
తౌ విశ్వస్తౌ - వారిద్దరూ విశ్వాసముతో
పరస్పరేణ ఆలాపం చ చక్రతుః -
పరస్పరముగా మాట్లాడుకొనసాగిరి

||శ్లోకతాత్పర్యము||

"అలా కలిసిన అతనితో అద్భుతమైన అభిమానము కలిగెను. వారిద్దరూ విశ్వాసముతో మాట్లాడుకొనసాగిరి." ||34.07||

||శ్లోకము 34.08||

తస్యాః తద్వచనం శ్రుత్వా హనుమాన్ హరియూధపః|
సీతాయాః శోకదీనాయాః సమీపముపచక్రమే||34.08||

స|| హనుమాన్ హరియూధపః సీతాయాః శోకదీనాయాః తస్యాః సమీపం ఉపచక్రమే ||

||శ్లోకార్థములు||

హనుమాన్ హరియూధపః -
వానరవీరుడు హనుమంతుడు
సీతాయాః శోకదీనాయాః -
శోకముతో దైన్యస్థితిలో నున్న సీత
తస్యాః సమీపం ఉపచక్రమే -
ఆమె దగ్గరకు వచ్చుచుండెను"

||శ్లోకతాత్పర్యము||

"వానరవీరుడు హనుమంతుడు శోకముతో దైన్యస్థితిలో నున్న సీత దగ్గరకు వచ్చుచుండెను" ||34.08||

||శ్లోకము 34.09||

యథా యథా సమీపం స హనుమానుపసర్పతి|
తథా తథా రావణం సా తం సీతా పరిశంకతే||34.09||

స|| యథా యథా సః హనుమాన్ ఉపసర్పతి తథా తథా సా సీతా తం రావణం పరిశంకతే||

||శ్లోకార్థములు||

యథా యథా సః హనుమాన్ ఉపసర్పతి -
అలా హనుమంతుడు దగ్గరకు వచ్చుచున్నకొలదీ
తథా తథా సా సీతా -
అలా అలా సీతకు
తం రావణం పరిశంకతే -
అతడు రావణుడా అని శంక కలిగెను.

||శ్లోకతాత్పర్యము||

"అలా హనుమంతుడు దగ్గరకు వచ్చుచున్నకొలదీ సీతకు అతడు రావణుడా అని శంక కలిగెను." ||34.09||

||శ్లోకము 34.10||

అహోధిగ్దుష్కృత మిదం కథితం హి య దస్య మే|
రూపాంతర ముపాగమ్య స ఏవాయం హి రావణః||34.10||

స|| అహో యది అయం రూపాంతరం ఉపాగమ్య సః రావణః హి (అస్తి) ఇదం అస్య మే కథితం దుష్కృతం ధిక్||

||శ్లోకార్థములు||

అహో యది అయం రూపాంతరం ఉపాగమ్య -
అయ్యో ఇతడు రూపము మార్చుకొని వచ్చిన
సః రావణః హి (అస్తి) -
ఆ రావణుడే అయితే
ఇదం అస్య మే కథితం -
ఇతనికి నేను చెప్పినమాటలతో
దుష్కృతం ధిక్ -
చేయరాని పని చేసితిని

||శ్లోకతాత్పర్యము||

' అయ్యో ఇతడు రూపము మార్చుకొని వచ్చిన ఆ రావణుడే అయితే ఇతనికి నేను చెప్పినమాటలతో చేయరాని పని చేసితిని' అని అనుకొనెను. ||34.10||

||శ్లోకము 34.11||

తామశోకస్య శాఖాం సా విముక్త్వా శోకకర్శితా|
తస్యా మే వానవద్యాంగీ ధరణ్యాం సముపావిశత్||34.11||

స|| అనవద్యాంగీ సా అశోకశ్చ శాఖామ్ విముక్త్వా శోకకర్శితా తస్యాం ధరణ్యామేవ సముపావిశత్ ||

||శ్లోకార్థములు||

అనవద్యాంగీ -
అందమైన అవయవములు కల ఆమె
సా అశోకశ్చ శాఖామ్ విముక్త్వా -
అశోకవృక్షముల శాఖలను వదిలి
శోకకర్శితా - శోకముతో నిండినదై
తస్యాం ధరణ్యామేవ సముపావిశత్ -
ఆ భూమి మీద కూలబడెను.

||శ్లోకతాత్పర్యము||

"అందమైన అవయవములు కల ఆమె అశోకవృక్షముల శాఖలను వదిలి శోకముతో నిండినదై ఆ భూమి మీద కూలబడెను."||34.11||

||శ్లోకము 34.12||

హనుమానపి దుఃఖార్తాం తాం దృష్ట్వా భయమోహితామ్|
అవందత మహాబాహుః తతస్తాం జనకాత్మజామ్||34.12||

స|| మహాబాహుః హనుమాన్ అపి దుఃఖార్తాం భయమోహితాం జనకాత్మజాం తాం దృష్ట్వా అవందత||

||శ్లోకార్థములు||

మహాబాహుః హనుమాన్ అపి -
మహాబాహువులు కల హనుమంతుడు కూడా
దుఃఖార్తాం భయమోహితాం -
దుఃఖములో మునిగియున్న భయపడియున్న
జనకాత్మజాం - జనకాత్మజ అగు
తాం దృష్ట్వా అవందత -
ఆమెను చూచి వందనము చేసెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాబాహువులు కల హనుమంతుడు కూడా దుఃఖములో మునిగియున్న భయపడియున్న జనకాత్మజను చూచి వందనము చేసెను." ||34.12||

||శ్లోకము 34.13||

సా చైనం భయవిత్రస్తా భూయో నైవాభ్యుదైక్షత|
తం దృష్ట్వా వందమానం తు సీతా శశినిభాననా||34.13||
అబ్రవీత్ దీర్ఘముచ్ఛ్వస్య వానరం మధురస్వరా|

స|| భయవిత్రస్తా సా చ ఏనం భూయః న అభ్యుదైక్షత ఏవ| తం శశినిభాననా సీతా దీర్ఘః ఉచ్ఛ్వస్య వందమానం వానరం మధుర స్వరా అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

భయవిత్రస్తా సా చ -
భయముతో వణుకుచున్న ఆమె కూడా
ఏనం భూయః న అభ్యుదైక్షత ఏవ -
అతని వైపు కూడా చూడలేదు
తం శశినిభాననా సీతా -
ఆ చంద్రునివంటి ముఖముకల సీత
దీర్ఘః ఉచ్ఛ్వస్య -
దీర్ఘముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను
వందమానం వానరం -
వందనము చేసిన వానరుని తో
మధుర స్వరా అబ్రవీత్ -
మధురమైన స్వరముతో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"భయముతో వణుకుచున్న ఆమె అతని వైపు కూడా చూడలేదు. ఆ చంద్రునివంటి ముఖముకల సీత దీర్ఘముగా ఉచ్ఛ్వాస నిశ్వాసములను విడచుచూ వందనము చేసిన వానరుని తో మధురమైన స్వరముతో ఇట్లు పలికెను."||34.13||

||శ్లోకము 34.14||

మాయాం ప్రవిష్టో మాయావీ
యది త్వం రావణః స్వయమ్||34.14||
ఉత్పాదయసి మే భూయః
సంతాపం తన్నశోభనమ్|

స|| యది త్వం స్వయం మాయావీ రావణః మాయాం ప్రవిష్టః మే భూయః సంతాపం ఉత్పాదయసి తత్ న శోభనమ్||

||శ్లోకార్థములు||

యది త్వం స్వయం - నీవు స్వయముగా
మాయావీ రావణః - మాయవి రావణుడవైతే
మాయాం ప్రవిష్టః - మాయతో ప్రవేశించి
మే భూయః సంతాపం ఉత్పాదయసి -
మరల నాకు సంతాపము కలిగిస్తున్నావు
తత్ న శోభనమ్ - అది శుభకరము కాదు

||శ్లోకతాత్పర్యము||

"నీవు స్వయముగా మాయవి రావణుడవైతే . మాయతో ప్రవేశించి మరల నాకు సంతాపము కలిగిస్తున్నావు అది శుభకరము కాదు" ||34.14||

||శ్లోకము 34.15||

స్వం పరిత్యజ్య రూపం యః పరివ్రాజకరూపధృత్||34.15||
జనస్థానే మయా దృష్టః త్వం స ఏవాసి రావణః|

స|| యః రావణః స్వం రూపం పరిత్యజ్య పరివ్రాజక రూపధృత్ జనస్థానే మయా దృష్టః త్వం స ఏవ అసి||

||శ్లోకార్థములు||

యః రావణః స్వం రూపం పరిత్యజ్య -
ఏ రావణుడు తన స్వరూపమును త్యజించి
పరివ్రాజక రూపధృత్-
పరివ్రాజక రూపములో
జనస్థానే మయా దృష్టః -
జనస్థానములో నాచేత చూడబడినవాడో
త్వం స ఏవ అసి - నీవు వాడివే

||శ్లోకతాత్పర్యము||

"ఏ రావణుడు తన స్వరూపమును త్యజించి పరివ్రాజక రూపములో జనస్థానములో నాచేత చూడబడినవాడో - ఆ రావణుడవు నీవే."".||34.15||

||శ్లోకము 34.16||

ఉపవాసకృశాం దీనాం కామరూప నిశాచర||34.16||
సంతాపయసి మాం భూయః సంతప్తాం తన్నశోభనమ్|

స|| నిశాచర కామరూప ఉపవాస కృశాం సంతప్తాం దీనాం మాం భూయః సంతాపయసి తత్ న శోభనమ్||

||శ్లోకార్థములు||

నిశాచర కామరూప -
కామరూపము ధరించగల నిశాచరుడా
ఉపవాస కృశాం -
ఉపవాస దీక్షలో కృశించిన
సంతప్తాం దీనాం మాం -
దీనురాలను నాకు
భూయః సంతాపయసి -
మరల సంతాపము కలిగించుట
తత్ న శోభనమ్ -
అది తగదు

||శ్లోకతాత్పర్యము||

" ఓ కామరూపము ధరించగల నిశాచరుడా, ఉపవాస దీక్షలో కృశించిన దీనురాలను నాకు మరల సంతాపము కలిగించుట తగదు".||34.16||

||శ్లోకము 34.17||

అథవా నైతదేవం హి యన్మయా పరిశంకితమ్||34.17||
మనసో హి మమ ప్రీతిరుత్పన్నా తవదర్శనాత్|

స|| అథవా మయా యత్ పరిశంకితం ఏతత్ ఏవం న హి (కింతు) తవ దర్శనాత్ మమ మనసః ప్రీతిః ఉత్పన్న హి ||

||శ్లోకార్థములు||

అథవా మయా యత్ పరిశంకితం -
లేక నాకు కలిగిన ఈ శంక
ఏతత్ ఏవం న హి -
అది నిజము కాదేమో
(కింతు) తవ దర్శనాత్ -
( ఎందుకనగా) నీ దర్శనముతో
మమ మనసః ప్రీతిః ఉత్పన్న హి-
నా మనస్సుకి ప్రీతి కలుగుచున్నది.

||శ్లోకతాత్పర్యము||

"లేక నాకు కలిగిన ఈ శంక నిజము కాదేమో. నీ దర్శనముతో నా మనస్సుకి ప్రీతి కలుగుచున్నది." ||34.17||

||శ్లోకము 34.18||

యది రామస్య దూతస్త్వం ఆగతో భద్రమస్తుతే ||34.18||
పృఛ్ఛామి త్వాం హరిశ్రేష్ఠ ప్రియా రామకథా హి మే|

స|| యది త్వం రామస్య దూతః ఆగతః తే భద్రం అస్తు | హరిశ్రేష్ఠ త్వాం మే ప్రియా రామకథా పృచ్ఛామి |

||శ్లోకార్థములు||

యది త్వం రామస్య దూతః ఆగతః -
నీవు రాముని దూతవే అయితే
హరిశ్రేష్ఠ తే భద్రం అస్తు -
హరిశ్రేష్ఠా నీకు మంగళమగు గాక
త్వాం మే ప్రియా రామకథా పృచ్ఛామి -
నిన్నునాకు ప్రియమైన రామకథను గురించి అడుగుతున్నాను

||శ్లోకతాత్పర్యము||

"నీవు రాముని దూతవే అయితే నీకు మంగళమగు గాక. ఓ వానరులలో శ్రేష్ఠుడా నాకు ప్రియమైన రామకథను గురించి అడుగుతున్నాను. ||34.18||

||శ్లోకము 34.19||

గుణాన్ రామస్య కథయ ప్రియస్య మమ వానర ||34.19||
చిత్తం హరసి మే సౌమ్య నదీకూలం యథా రయః |

స|| వానర మమ ప్రియస్య రామస్య గుణాన్ కథయ | హే సౌమ్య యథా నదీకూలం రయః తథా మే చిత్తం హరసి ||

||శ్లోకార్థములు||

వానర మమ ప్రియస్య -
ఓ వానరుడా నా ప్రియుడగు
రామస్య గుణాన్ కథయ -
రాముని గుణములు చెప్పుము
హే సౌమ్య యథా నదీకూలం రయః -
ఓ సౌమ్యుడా నది ఒడ్డును హరించిన విధముగా
తథా మే చిత్తం హరసి -
నా మనస్సును హరిస్తున్నావు

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరుడా నా ప్రియుడగు రాముని గుణములు చెప్పుము. ఓ సౌమ్యుడా నది ఒడ్డును హరించిన విధముగా నా మనస్సును హరిస్తున్నావు". ||34.19||

"నది ఒడ్డును హరించిన విధముగా నా మనస్సును హరిస్తున్నావు" అన్న మాటకి హేతువు ఏమిటి అన్న ప్రశ్నకి సమాధానముగా తిలక టీకాలో చెప్పిన మాట, - 'మచ్చిత్త తాపకర్షకత్వం రామ గుణ జ్ఞానం ఏవ ఇతి సూచితమ్'. హనుమకి గల రామ గుణముల జ్ఞానమే సీతమ మనస్సును హరించడానికి కారణము అని అంటారు.

||శ్లోకము 34.20||

అహో స్వప్నస్య సుఖతా యాఽహమేవం చిరాహృతా||34.20||
ప్రేషితం నామ పశ్యామి రాఘవేణ వనౌకసం|

స|| స్వప్నస్య సుఖతా అహో చిరాహృతా యా రాఘవేణ ప్రేషితం నామ వనౌకసం ఏవమ్ పశ్యామి ||

||శ్లోకార్థములు||

స్వప్నస్య సుఖతా అహో -
ఇది స్వప్నము యొక్క సుఖము
చిరాహృతా - చాలాకాలము నుంచి
యా రాఘవేణ ప్రేషితం నామ -
రాఘవునిచేత పంపబడిన
వనౌకసం ఏవమ్ పశ్యామి -
వనచరుని మాత్రమే చూచుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"ఇది స్వప్నము యొక్క సుఖము. చాలాకాలము నుంచి నేను రాఘవునిచేత పంపబడిన వనచరుని మాత్రమే చూచుచున్నాను." ||34.20||

||శ్లోకము 34.21||

స్వప్నేఽపి యద్యహం వీరం రాఘవం సహ లక్ష్మణమ్||34.21||
పశ్యేయం నావసీదేయం స్వప్నోఽసి మమమత్సరీ|

స|| స్వప్నే అపి సహలక్ష్మణం వీరం రాఘవం పశ్యేయం యది న అవసీదేయం మమ స్వప్నః అపి మత్సరీ|

||శ్లోకార్థములు||

స్వప్నే అపి - స్వప్నమే అయినా
సహలక్ష్మణం వీరం రాఘవం పశ్యేయం యది -
లక్ష్మణునితో కూడిన రామును చూచినచో
నావసీదేయం - కష్టములను దాటకలను
మమ స్వప్నః అపి మత్సరీ -
స్వప్నముకు కూడా నాపై దయలేదు

||శ్లోకతాత్పర్యము||

"స్వప్నమే అయినా లక్ష్మణునితో కూడిన రామును చూచినచో కష్టములను దాటకలను. కాని స్వప్నముకు కూడా నాపై దయలేదు ".||34.21||

నాహం స్వప్న మహం మన్యే
స్వప్నే దృష్ట్వా హి వానరమ్||34.22||
న శక్యోఽభ్యుదయః ప్రాప్తుం
ప్రాప్త శ్చాభ్యుదయో మమ|

స|| అహం ఇయం స్వప్నం న మన్యే| స్వప్నే వానరం దృష్ట్వా అభ్యుదయః ప్రాప్తుం న శక్యః | (పరంతు) మమ అభ్యుదయః ప్రాప్తః చ ||

||శ్లోకార్థములు||

అహం ఇయం స్వప్నం న మన్యే -
నేను ఇది స్వప్నము అనుకోను
స్వప్నే వానరం దృష్ట్వా-
వానరుని స్వప్నములో చూచినచో
అభ్యుదయః ప్రాప్తుం న శక్యః -
అభ్యుదయము కలగదు.
(పరంతు) మమ అభ్యుదయః ప్రాప్తః చ -
కాని నాకు ఆనందముతో అభ్యుదయము ప్రాప్తించి నట్లేయున్నది

||శ్లోకతాత్పర్యము||

'' నేను ఇది స్వప్నము అనుకోను. వానరుని స్వప్నములో చూచినచో అభ్యుదయము కలగదు. కాని నాకు ఆనందముతో అభ్యుదయము ప్రాప్తించి నట్లేయున్నది" ||34.22||

||శ్లోకము 34.23||

'కిన్ను స్యాచ్చిత్తమోహోఽయం
భవేద్వాతగతిస్త్వియమ్||34.23||
ఉన్మాదజో వికారో వా
స్యాదియం మృగతృష్ణికా|

స|| అయం చిత్తమోహః స్యాత్ కిం ను ? ఇయం వాతగతిః భవేత్ | ఉన్మాదజః వికారో వా| ఇయం మృగతృష్ణికా స్యాత్ ||

||శ్లోకార్థములు||

అయం చిత్తమోహః స్యాత్ కిం ను ?
- ఇది చిత్త మోహమా ఏమి
ఇయం వాతగతిః భవేత్ -
ఇది వాతము వలన కలిగినది కాబోలు
ఉన్మాదజః వికారో వా -
లేక ఉన్మాదమో లేక వికారమో
ఇయం మృగతృష్ణికా స్యాత్ -
ఇది ఎండమావిలాంటిది ఏమో

||శ్లోకతాత్పర్యము||

"ఇది చిత్త మోహమా? ఇది వాతము వలన కలిగినది కాబోలు. ఇది ఉన్మాదమో లేక వికారమో. ఇది ఎండమావిలాంటిది ఏమో." ||34.23||

||శ్లోకము 34.24||

అథవా నాయమున్మాదో మోహోఽప్యున్మాదలక్షణః||34.24||
సంబుధ్యే చాహ మాత్మానం ఇమం చాపి వనౌకసమ్|

స|| అథవా న అయం ఉన్మాదః ఉన్మాదలక్షణః మోహః అపి న | అహం ఆత్మానమ్ ఇయం వనౌకసాం సంబుధ్యే||

||శ్లోకార్థములు||

అథవా న ఆయం ఉన్మాదః -
లేక ఇది ఉన్మాదము కాదు
ఉన్మాదలక్షణః మోహః అపి న -
ఉన్మాద లక్షణము కాదు
అహం ఆత్మానమ్ -
నేను స్వయముగా
ఇయం వనౌకసాం సంబుధ్యే-
ఈ వానరుని ప్రత్యక్షముగా చూచుచున్నాను.

||శ్లోకతాత్పర్యము||

"కాని ఇది ఉన్మాదము కాదు, ఉన్మాద లక్షణము కాదు. నేను వానరుని ప్రత్యక్షముగా చూచుచున్నాను". ||34.24||

||శ్లోకము 34.25||

ఇత్యేవం బహుధా సీతా సంప్రధార్య బలాబలమ్ ||34.25||
రక్షసాం కామరూపత్వాన్ మేనే తం రాక్షసాధిపమ్|

స|| సీతా ఇత్యేవం బలాబలం బహుధా సంప్రధార్య రక్షసాం కామరూపత్వాత్ తం రాక్షసాధిపమ్ మేనే||

||శ్లోకార్థములు||

సీతా ఇత్యేవం బలాబలం -
సీత ఈ విధముగా బలాబలములను
బహుధా సంప్రధార్య -
అనేక విధములుగా తర్కించి
రక్షసాం కామరూపత్వాత్ -
రాక్షసులు కామ రూపులు గనక
తం రాక్షసాధిపమ్ మేనే -
అతనిని రాక్షసాధిపుడే అని తలచెను

||శ్లోకతాత్పర్యము||

"సీత ఈ విధముగా బలాబలములను అనేక విధములుగా తర్కించి , రాక్షసులు కామ రూపులు గనక అతడు కామరూపము ధరించిన రాక్షసాధిపుడే అని తలచెను."||34.25||

||శ్లోకము 34.26||

'ఏతాం బుద్ధిం తదా కృత్వా సీతా సా తనుమధ్యమా||34.26||
న ప్రతి వ్యాజహారాఽథ వానరం జనకాత్మజా|

స|| తదా సా తనుమధ్యమా జనకాత్మజా ఏతాం బుద్ధిం కృత్వా అథ వానరం ప్రతి న వ్యాజహార ||

||శ్లోకార్థములు||

తదా సా తనుమధ్యమా జనకాత్మజా -
అప్పుడు ఆ సన్నని నడుము కల జనకాత్మజ
ఏతాం బుద్ధిం కృత్వా -
ఈ విధముగా ఆలోచించి
అథ వానరం ప్రతి న వ్యాజహార -
వానరునితో మాట్లాడకుండా ఉండెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ సన్నని నడుము కల జనకాత్మజ ఈ విధముగా ఆలోచించి వానరునితో మాట్లాడకుండా ఉండెను." ||34.26||

||శ్లోకము 34.27||

సీతాయాశ్చింతితం బుద్ధ్వా హనుమాన్ మారుతాత్మజః||34.27||
శ్రోత్రానుకూలై ర్వచనైః తదా తాం సంప్రహర్షయత్|

స|| హనుమాన్ మారుతాత్మజః సీతాయాః చింతితం బుద్ధ్వాతదా శ్రోత్రానుకూలైః వచనైః తాం సంప్రహర్షయత్ ||

||శ్లోకార్థములు||

హనుమాన్ మారుతాత్మజః -
మారుతాత్మజుడగు హనుమంతుడు
సీతాయాః చింతితం బుద్ధ్వా -
సీతయొక్క ఆలోచనలను గ్రహించి
తదా శ్రోత్రానుకూలైః వచనైః -
అప్పుడు వినుటకు తగిన మాటలతో
తాం సంప్రహర్షయత్ -
ఆమెకు సంతోషము కలిగించెను

||శ్లోకతాత్పర్యము||

" మారుతాత్మజుడగు హనుమంతుడు సీతయొక్క ఆలోచనలను గ్రహించి వినుటకు తగిన మాటలతో ఆమెకు సంతోషము కలిగించెను." ||34.27||

రామ కథ రామ నామము రామ బాణము లాంటివి. హనుమంతుడు రామ కథ చెప్పడములో ఆరితేరినవాడు. మారుతాత్మజుడగు హనుమంతుడు సీతయొక్క ఆలోచనలను గ్రహించి, వినుటకు తగిన మాటలతో రాముని గుణములు వర్ణిస్తూ సీతమ్మకు మళ్ళీ ప్రాణము పోస్తాడు.

||శ్లోకము 34.28||

అదిత్య ఇవ తేజస్వీ లోకకాంతః శశీ యథా ||34.28||
రాజా సర్వస్య లోకస్య దేవో వైశ్రవణో యథా |
విక్రమేణోపపన్నశ్చ యథా విష్ణు ర్మహాయశాః ||34.29||

స||అదిత్య ఇవ తేజస్వీ శశీ యథా లోకకాంతః దేవః వైశ్రవణో యథా సర్వస్య లోకస్య రాజా మహాయశాః విష్ణు యథా విక్రమేణ ఉపపన్నః చ||

||శ్లోకార్థములు||

అదిత్య ఇవ తేజస్వీ -
అదిత్యునివలే తేజస్వి
శశీ యథా లోకకాంతః -
చంద్రునివలె లోకమునకు అహ్లాదపరచువాడు
దేవః వైశ్రవణో యథా -
దేవుడు వైశ్రవణుని వలే
సర్వస్య లోకస్య రాజా -
వలే అన్ని లోకములకు రాజు
మహాయశాః విష్ణు యథా -
మహాకీర్తి గల విష్ణువువలె మహాకీర్తి గల
విక్రమేణ ఉపపన్నః చ -
పరాక్రమము తో కూడినవాడు.

||శ్లోకతాత్పర్యము||

' రాముడు అదిత్యునివలే తేజస్వి. చంద్రునివలె లోకమునకు అహ్లాదపరచువాడు. దేవుడు వైశ్రవణుని వలే అన్ని లోకములకు రాజు. విష్ణువువలె మహాకీర్తి గలవాడు పరాక్రమశాలి." ||34.28,29||

||శ్లోకము 34.30||

సత్యవాదీ మథురవాగ్దేవో వాచస్పతి ర్యథా|
రూపవాన్ సుభగః శ్రీమాన్ కందర్ప ఇవ మూర్తిమాన్||34.30||

స||సత్యవాదీ వాచస్పతీ యథా మధుర వాగ్దేవః | రూపవాన్ సుభగః శ్రీమాన్ మూర్తిమాన్ కందర్ప ఇవ||

||శ్లోకార్థములు||

సత్యవాదీ వాచస్పతీ యథా -
సత్యవాది బృహస్పతి వలె
మధుర వాగ్దేవః -
మధురమైన మాటలు చెప్పగలడు
రూపవాన్ సుభగః శ్రీమాన్ -
రూప సౌభాగ్యము గలవాడు శ్రీమంతుడు
మూర్తిమాన్ కందర్ప ఇవ -
మన్మధునివలె నుండు రూపము గలవాడు

||శ్లోకతాత్పర్యము||

"సత్యవాది బృహస్పతి వలె మధురమైన మాటలు చెప్పగలడు. రూప సౌభాగ్యము గలవాడు, శ్రీమంతుడు, మన్మధునివలె నుండు రూపము గలవాడు." ||34.30||

||శ్లోకము 34.31||

స్థానక్రోథఃప్రహర్తా చ శ్రేష్ఠో లోకే మహారథః|
బాహుచ్ఛాయా మవష్టబ్ధో యస్య లోకో మహాత్మనః||34.31||

స|| స్థానక్రోధః ప్రహర్తా చ లోకే శేష్ఠః మహారథః లోకః యస్య మహాత్మనః బాహుచ్ఛాయామవష్టభ్యో ||

||శ్లోకార్థములు||

స్థానక్రోధః -
తగిన సమయములో క్రోధము చూపువాడు
ప్రహర్తా చ -
శిక్షింపతగిన వారిని శిక్షించువాడు
లోకే శేష్ఠః మహారథః -
లోకములో శ్రేష్ఠుడైన మహారథుడు.
లోకః యస్య మహాత్మనః -
లోకము ఏ మహాత్ముని
బాహుచ్ఛాయామవష్టభ్యో -
బాహుచ్ఛాయలలో నడచునో ( అట్టి వాడు)


||శ్లోకతాత్పర్యము||

"తగిన సమయములో క్రోధము చూపువాడు. శిక్షింపతగిన వారిని శిక్షించువాడు. లోకములో శ్రేష్ఠుడైన మహారథుడు. లోకము ఎవరి బాహుచ్ఛాయలలో నడచునో అట్టి వాడు రాముడు." ||34.31||

||శ్లోకము 34.32||

అపకృష్యాశ్రమపదాన్ మృగరూపేణ రాఘవం|
శూన్యే యేనాపనీతాపి తస్య ద్రక్ష్యసి యత్ ఫలమ్||34.32||

స|| యేన రాఘవం మృగరూపేణ ఆశ్రమపదాత్ అపకృష్య శూన్యే అపనీతా అసి త్వయా యత్ ఫలం ద్రక్ష్యసి ||

||శ్లోకార్థములు||

యేన రాఘవం - ఏ రాఘవుని -
మృగరూపేణ ఆశ్రమపదాత్ అపకృష్య -
మృగరూపములో ఆశ్రమపదమునుంచి తీసుకుపోయి
శూన్యే అపనీతా అసి త్వయా -
శూన్యమైన అశ్రమపదమునుంచి అపహరింపబడితివి
యత్ ఫలం ద్రక్ష్యసి-
దాని ఫలము నీవు చూచెదవు

||శ్లోకతాత్పర్యము||

"ఏ మృగరూపములో రాఘవుని ఆశ్రమపదమునుంచి తీసుకుపోయి శూన్యమైన అశ్రమపదమునుంచి అపహరింపబడితివో. దాని ఫలము నీవు చూచెదవు". ||34.32||

||శ్లోకము 34.33||

'న చిరాత్ రావణం సంఖ్యే యో వధిష్యతి వీర్యవాన్|
రోషప్రముక్తైరిషుభిః జ్వలద్భిరివ పావకైః||34.33||

స|| వీర్యవాన్ యః నచిరాత్ రోషప్రముక్తైః జ్వలద్భిః పావకైః ఇవ ఇషుభిః సంఖ్యే రావణం వధిష్యతి॥

||శ్లోకార్థములు||

నచిరాత్ - క్రొద్ధికాలములో
రోషప్రముక్తైః జ్వలద్భిః పావకైః ఇవ ఇషుభిః -
రోషముతో ప్రయోగించబడిన మంటలుక్రక్కుతున్న బాణములతో
వీర్యవాన్ సంఖ్యే రావణం వధిష్యతి -
వీరుడు యుద్ధములో రావణుని సంహరించును

||శ్లోకతాత్పర్యము||

"ఆ వీరుడు క్రొద్ధికాలములో రోషముతో ప్రయోగించబడిన మంటలుక్రక్కుతున్న బాణములతో యుద్ధములో రావణుని సంహరించును". ||34.33||

||శ్లోకము 34.34||

తేనాహం ప్రేషితో దూతః త్వత్సకాశ మిహాగతః|
తద్వియోగేన దుఃఖార్తః స త్వాం కౌశలమబ్రవీత్||34.34||

స|| తేన దూతః ప్రేషితః ఇహ త్వత్సకాశం ఆగతః | త్వద్వియోగేన దుఃఖార్తః సః త్వాం కౌశలం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

తేన దూతః ప్రేషితః -
నేను ఆయన చేత పంపబడిన దూతను
ఇహ త్వత్సకాశం ఆగతః -
ఇక్కడకు నీకోసమై వచ్చినవాడను
త్వద్వియోగేన దుఃఖార్తః -
నీ వియోగముతో దుఃఖములో మునిగియున్న
సః త్వాం కౌశలం అబ్రవీత్ -
ఆ రాముడు నీ కుశలములను అడుగుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"నేను ఆయన చేత పంపబడిన దూతను ఇక్కడకు నీ కోసమై వచ్చినవాడను. నీ వియోగముతో దుఃఖములో మునిగియున్న ఆ రాముడు నీ కుశలములను అడుగుచున్నాడు".||34.34||

||శ్లోకము 34.35||

లక్ష్మణశ్చ మహాతేజాః సుమిత్రానందవర్ధనః|
అభివాద్య మహాబాహుః స త్వాం కౌశలమబ్రవీత్||34.35||

స|| మహాతేజః సుమిత్రానందవర్ధనః మహాబాహుః లక్ష్మణః చ అభివాద్య సః త్వాం కౌశలం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

మహాతేజః సుమిత్రానందవర్ధనః -
మహాతేజోమంతుడగు సుమిత్రానందనుడు
మహాబాహుః లక్ష్మణః చ అభివాద్య -
మహాబాహువులు కల లక్ష్మణుడు అభివాదముచేసి
సః త్వాం కౌశలం అబ్రవీత్ -
నీ కుశలములను అడుగుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"మహాతేజోమంతుడగు సుమిత్రానందనుడు మహాబాహువులు కల లక్ష్మణుడు అభివాదముచేసి నీ కుశలములను అడుగుచున్నాడు." ||34.35||

||శ్లోకము 34.36||

రామస్య చ సఖా దేవి సుగ్రీవో నామ వానరః|
రాజా వానరముఖ్యానాం స త్వాం కౌశలమబ్రవీత్ ||34.36||

స|| దేవీ రామస్య చ సఖా సుగ్రీవః నామ వానరః వానరముఖ్యానాం రాజా సః త్వాం కౌశలం అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

దేవీ రామస్య చ సఖా -
ఓ దేవి రాముని సఖుడగు
సుగ్రీవః నామ వానరః -
సుగ్రీవుడు అను పేరుగల వానరుడు
వానరముఖ్యానాం రాజా -
వానరాధీశుడు అగు రాజు
సః త్వాం కౌశలం అబ్రవీత్-
అతడు నీ కుశలములను అడుగుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

" ఓ దేవి రాముని సఖుడు, సుగ్రీవుడు అను పేరుగల వానరాధీశుడు అగు రాజు నీ కుశలములను అడుగుచున్నాడు".||34.36||

||శ్లోకము 34.37||

నిత్యం స్మరతి రామః త్వాం ససుగ్రీవః సలక్ష్మణః|
దిష్ట్యా జీవసి వైదేహీ రాక్షసీవశమాగతా||34.37||

స||వైదేహీ ససుగ్రీవః స లక్ష్మణః చ రామః త్వాం నిత్యమ్ స్మరతి|రాక్షసీవశమ్ ఆగతా దిష్ట్యా జీవసి ||

||శ్లోకార్థములు||

||శ్లోకతాత్పర్యము||

"ఓ వైదేహీ సుగ్రీవుడు లక్ష్మణులతో కలిసి రాముడు నిన్ను నిత్యము తలచుకుంటూ వుంటాడు. రాక్షసులవశమైన నీవు జీవించివుండుట మా అదృష్టము"||34.37||

||శ్లోకము 34.38||

న చిరాత్ ద్రక్ష్యసే రామం లక్ష్మణం చ మహాబలమ్|
మధ్యే వానర కోటీనాం సుగ్రీవం చామితౌజసమ్||34.38||

స||రామమ్ మహాబలం లక్ష్మణం చ వానర కోటీనాం మధ్యే అమితౌజసాం సుగ్రీవం చ న చిరాత్ ద్రక్ష్యసే||

||శ్లోకార్థములు||

రామమ్ మహాబలం లక్ష్మణం చ-
మహాబలవంతుడైన రాముని లక్ష్మణునితో
వానర కోటీనాం మధ్యే -
కోటి వానరుల మధ్యలో నున్న
అమితౌజసాం సుగ్రీవం చ -
అమిత తేజసము కల సుగ్రీవుని
న చిరాత్ ద్రక్ష్యసే-
త్వరలో చూచెదవు

||శ్లోకతాత్పర్యము||

" మహాబలవంతుడైన రాముని లక్ష్మణుని కోటి వానరుల మధ్యలో నున్న అమిత తేజసము కల సుగ్రీవుని త్వరలో చూచెదవు".||34.38||

||శ్లోకము 34.39||

అహం సుగ్రీవ సచివో హనుమాన్ నామ వానరః|
ప్రవిష్ఠో నగరీం లంకాం లంఘయిత్వా మహోదధిమ్||34.39||

స|| అహమ్ సుగ్రీవ సచివః | హనుమాన్ నామ వానరః| మహోదధిం లంఘయిత్వా లంకాం నగరీం ప్రవిష్ఠః ॥

||శ్లోకార్థములు||

అహమ్ సుగ్రీవ సచివః -
నేను సుగ్రీవుని మంత్రిని
హనుమాన్ నామ వానరః -
హనుమంతుడని పేరుకలవాడను
మహోదధిం లంఘయిత్వా -
మహాసాగరమును దాటి
లంకాం నగరీం ప్రవిష్ఠః -
లంకానగరమును ప్రవేశించి తిని

||శ్లోకతాత్పర్యము||

"నేను సుగ్రీవుని మంత్రిని. హనుమంతుడని పేరుకలవాడను. మహాసాగరమును దాటి లంకానగరమును ప్రవేశించి తిని." ||34.39||

||శ్లోకము 34.40||

కృత్వా మూర్థ్ని పదన్యాసం రావణస్య దురాత్మనః|
త్వాం ద్రష్టు ముపయాతోఽహం సమాశ్రిత్య పరాక్రమమ్||34.40||

స||దురాత్మనః రావణస్య మూర్ధ్నిః పదాన్యాసం కృత్వా పరాక్రమం సమాశ్రిత్య అహం త్వాం ద్రష్టుం ఉపయాతః||

||శ్లోకార్థములు||

దురాత్మనః రావణస్య మూర్ధ్నిః -
దురాత్ముడైన రావణుని తలపై
పదాన్యాసం కృత్వా - కాలుపెట్టి
పరాక్రమం సమాశ్రిత్య -
నా పరాక్రమముతో
అహం త్వాం ద్రష్టుం ఉపయాతః -
నేను నిన్ను చూచుటకు ఇక్కడికి వచ్చితిని'

||శ్లోకతాత్పర్యము||

"దురాత్ముడైన రావణుని తలపై కాలుపెట్టి నా పరాక్రమముతో నేను నిన్ను చూచుటకు ఇక్కడికి వచ్చితిని".||34.40||

||శ్లోకము 34.41||

నాహ మస్మి తథా దేవీ యథా మామ్ అవగచ్ఛసి|
విశంకా త్యజతాం ఏషా శ్రద్ధత్స్వ వదతో మమ||34.41||

స|| దేవీ మాం యథా అవగచ్ఛసి అహం తథా న అస్మి | ఏషా విశంకా త్యజతాం వదతః మమ శ్రద్ధత్స్వ||

||శ్లోకార్థములు||

దేవీ మాం యథా అవగచ్ఛసి -
ఓ దేవీ నీవు ఏవిధముగా అనుకొచున్నావో
అహం తథా న అస్మి - నేను అలా కాదు
ఏషా విశంకా త్యజతాం - ఈ విధమైన శంక వదలుము
వదతః మమ శ్రద్ధత్స్- నేను చెప్పినది శ్రద్ధగా వినుము

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవీ నీవు అనుకొచున్నవాడిని కాను. ఈ విధమైన శంక వదలుము. నేను చెప్పినది శ్రద్ధగా వినుము". ||34.40||

తను రావణుడు కాదు , రామదూతను అనే మాటతో హనుమంతుడు, శంకల వలయములో చిక్కుకొని వున్న సీత మనస్సుకి ఆహ్లాదకరమైన మాటలతో, రాముని వర్ణనతో ఊరటకలిగించడానికి, సీతకు నమ్మకము కలిగించడానికి ప్రయత్నము చేస్తాడు హనుమ.

రామ నామము, రామ కథ మనస్సుకి శాంతి కలిగిస్తాయి. తన ముందున్న హనుమ మాయావి రావణుడేనేమో అని శంకల వలయములో చిక్కుకున్నసీతమ్మకి రాముని గుణముల వర్ణనతో ఊరట కలిగించి, హనుమ తను రావణుడు కాదు, రామ దూతను అనే మాటతో సీతమ్మకి నమ్మకము కలిగిస్తాడు.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది నాలుగవ సర్గ సమాప్తము

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుస్త్రింశస్సర్గః||

||ఓమ్ తత్ సత్||