||సుందరకాండ ||

||ముప్పది ఇదవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచత్రింశస్సర్గః

వైదేహి ఆ వానరోత్తముని ద్వారా రామకథను విని మధురమైన మాటలతో శాంతముగా ఇట్లు పలికెను.

' ఓ వానరోత్తమ ! నీవు రామునితో ఎప్పుడు కలిసితివి ? లక్ష్మణుని ఎటుల నెఱుంగుదువు? నరులకు వానరులకు సమాగమము ఎట్లు సంభవించెను.ఓ వానరా రాముని చిహ్నములు ఏమి ? లక్ష్మణుని చిహ్నములు ఏమి? అవి నీవు మళ్ళీ చెప్పుము. అప్పుడు నా శోకము శమించును. రాముని సంస్థానమెట్లుండును? రాముని రూపము ఎట్లుండును?ఊరువులు బాహువులు ఎట్లుండును ? అలాగే లక్ష్మణుడెట్లుండును?'

అప్పుడు వైదేహి చేత ఇట్లు అడగబడిన మారుతాత్మజుడగు హనుమంతుడు, రాముని యథాతథముగా వర్ణించుటకు ఉపక్రమించెను.

" ఓ కమలపత్రాక్షీ వైదేహీ భర్త లక్ష్మణుల సంస్థానము తెలిసి కూడా నా అదృష్ఠము కొలదీ నన్ను అడుగుచున్నావు. రామలక్ష్మణులు చిహ్నములు ఏవి ఉన్నవో అవి చెప్పెదను వినుము. ఓ జనకాత్మజా ! రాముడు పుట్టుకతో కమలపత్రాక్షుడు. అన్ని విధములుగా మనోహరుడు. రూపము దక్షత సంపదలుగా గలవాడు. తేజస్సులో సూర్యునితో సమానుడు. క్షమలో భూమితో సమానుడు. బుద్ధిలో బృహస్పతి తో సమానుడు. యశస్సులో ఇంద్రునితో సమానుడు. జీవలోకమును రక్షించువాడు. తన జనములను రక్షించువాడు. శతృవులను తపించు పరంతపుడు. తనను ఆశ్రయించినవారిని ధర్మమును రక్షించువాడు. ఓ దేవి లోకములో నాలుగు వర్ణములవారిని రక్షించువాడు. అతడు లోకములో మర్యాదలను నిలపెట్టువాడు పాటించువాడు".

" అత్యంత తేజోమయుడు. పూజితుడు. బ్రహ్మచర్య వ్రతములో నిష్ఠగలవాడు. సాధువులకు ఉపకారము చేయుటలో ప్రజ్ఞకలవాడు. కర్మలను పాటించుటలో పాటింపచేయబడుటలో ప్రజ్ఞ కలవాడు. అతడు రాజవిద్యా వినీతుడు. బ్రాహ్మణులను ఆదరించువాడు. అతడు పరంతపుడు. వేదవిద్యలలో పారంగతుడు . శీలము కలవాడు.బుద్ధిమంతుడు. యజుర్వేదము తెలిసినవాడు.వేదములను తెలిసిన వారిచేత పూజింపబడువాడు. వేదములలోనూ వేదాంగములలోనూ ధనుర్వేదములోనూ నిష్ఠ కలవాడు".

" ఓ దేవి రాముడు విశాలమైన భుజములు కలవాడు. పెద్ద బాహువులు కలవాడు. కంఠము శంఖాకారములో నున్నవాడు. మంగళప్రదమైన ముఖము కలవాడు. రాముడు మూపుసంధి ఎముకలు గూఢముగా గలవాడు. మంచి తామ్రవర్ణముగల కళ్ళు కలవాడు. రాముడు లోకములో అందరికి తెలిసినవాడు. రాముని స్వరము దుందుభి వంటిది. నిగనిగలాడు మేలిమి ఛాయకలవాడు. ప్రతాపము కలవాడు. అన్ని అవయవములు సమానమైన ప్రమానములో కలవాడు. శ్యామవర్ణముతో నిండినవాడు".

" రాముడు మూడు స్థలములలో అనగా వక్షస్థలము, మణికట్టు ,పిడికెట్టులలో ధృఢముగా కలవాడు. మూడు స్థలములలో అనగా బాహువులు కనుబొమలు వృషణకోశములో దీర్ఘముగావుండువాడు. మూడు ప్రదేశములలో అవయవములు (నాభి, రొమ్ము, పొత్తికడుపు) ఎత్తైనవిగా అమరి వున్నాయి. మూడు చోట్లలో ( అర చేయి, అరికాళ్ళూ, గోళ్లు) ఎఱ్ఱని రంగు కలవాడు. మూడు విధములుగా ( నడకతీరు,నిలబడు విధానము, కంఠస్వరము) గంభీరముగా వుండువాడు. ఉదరముపై మూడు మడతలు కలవాడు. స్తనములు స్తనాగ్రములు పాదరేఖలు నిమ్నముగా నున్నవాడు. నాలుగు ( కంఠము, లింగము, వీపు, పిక్కలు) హ్రస్వమైనవి. తలపై మూడు సుడులు కలవాడు. (అంగుష్ఠముపై) నాలుగు రేఖలు కలవాడు. నాలుగు మూరల ఎత్తు గలవాడు. నాలుగు చోట్ల ( బాహువులు, మోకాళ్ళు, తోడలు, చెక్కిళ్ళు) సమానమైన ప్రమాణములలో ఉండువాడు".

" రాముడు పద్నాలుగు జతల అంగములు సమముగా కలవాడు ( కనుబొమ్మలు, నాశికపుటములు,కళ్ళు, పెదవులు, చెవులు, చేతులు, మోచేతులు , మణికట్లు, స్తనాగ్రములు, పిరుదులు, వృషణములు,మోకాళు, పాదములు , నడుము ఇరుప్రక్కలు), నాలుగు ( ముందు పళ్ళు) దంతములు కలవాడు. నాలుగు విధములగు ( సింహ, శార్దూల, వృష, భగజ) నడకతీరు కలవాడు. మహత్తరమైన దవడలు, ముక్కు కలవాడు. ఇదు చోట్ల ( కళ్ళు, పళ్ళు, చర్మము, పాదములు, కేశములు) నిగనిగలాడుచుండువాడు. రాముని శరీరములో అష్టవంశములు ( శరీరము, చేతివేళ్ళు, కాలివేళ్ళు, చేతులు, నాశికలు, నేత్రాలు, చెవులు, వృషణములు) సమానమైన ప్రమాణములో కలవాడు. పది విధములుగా పద్మము పోలియుండువాడు ( ముఖము, నేత్రములు, నోరు నాలుక , పెదవులు, దవడలు స్తనములు, గోళ్ళు, హస్తములు, పాదములు). పది అవయవములు విపులముగా అమరి వుండువాడు( శిరస్సు, నుదురు, చెవులు, కంఠము, వక్షము , హృదయము, పొట్త చేతులు, కాళ్ళు వీపు). మూడు (తేజస్సు, కీర్తి సంపద) తో ప్రఖ్యాతి కలవాడు. రెండిటిని ( మాతృ, పితృ వంశములను)పావనము చేసినవాడు. ఆరు అంగములు ఉన్నతమైన వాడు( చంకలు, కడుపు, వక్షము, ముక్కు, మూపు, లలాటము). తొమ్మిది తనువులు కలవాడు. మూడు కాలములలో ధర్మార్థకామములను ఆచరించువాడు. సత్యధర్మములను ఆచరించువాడు , సకలైశ్వర్య సంపన్నుడు, సంగ్రహించుట అనుగ్రహించుటలో రక్తికలవాడు, దేశకాలముల జ్ఞానము కలవాడు, లోకములో అందరికి ప్రియముకలుగునట్లు మాట్లాడువాడు. అతని తమ్ముడు, సవితితల్లి కోడుకు , సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు అపరాజితుడు. రూపము అనురాగము గుణములలోరాముని వంటి వాడే".

" ఆ నరశార్దూలురు ఇద్దరూ నీ దర్శనముకై ఆతురతతో భూమండలము అంతా వెతుకుతూ మమ్ములను కలుసుకున్నారు. నిన్ను వెతుకుతూవున్న సమయములో పూర్వజునిచేత బహిష్కృతుడైన వానరాధీశుడగు సుగ్రీవుని చూచెను. ఆ నరశార్దూలు ఇద్దరూ అనేకమైన వృక్షములు కల ఋష్యమూక పర్వతములో అన్నపై భయపడి దాగివున్న ప్రియదర్శనుడగు సుగ్రీవుని కలిసిరి. మేము కూడా వానరాధీశుడు, రాజ్యమునుంచి అగ్రజునిచేత వెడలగొట్టబడిన, సత్యపరాధీనుడైన, సుగ్రీవుని పరిచర్యలలో వున్నవారము".

" అప్పుడు నారచీరలు ధరించిన ధనస్సును చేతిలో పట్టుకున్న వారిద్దరూ ఋష్యమూక పర్వతమువద్దనున్న రమ్యమైన ప్రదేశమునకు వచ్చితిరి. నరవ్యాఘ్రములవలెనున్న ఆ నరవరులను చూచి భయపడినవాడై వానరాధీశుడు ఆ పర్వత శిఖరముకు ఎగిరి వెళ్ళెను. ఆవానరేంద్రుడు ఆ శిఖరమునందే ఉండి ఆ వారిద్దరి సమీపమునకు నన్ను వెంటనే పంపించెను".

" నేను ప్రభువైన సుగ్రీవుని వచనములతో రూపలక్షణసంపన్నులగు వారిద్దరికి అంజలిఘటించి నిలబడితిని. వారి తత్త్వమును తెలిసికొనిన నేను ప్రీతి ప్రసన్నతకల వారిద్దరినీ నా పృష్ఠముపై నెక్కించుకొని వారిని మా దేశమునకు కొనిపోయితిని. మహాత్ముడైన సుగ్రీవునకు వారి తత్త్వము నివేదించిన పిమ్మట వారిద్దరి అన్నోన్య సల్లాపములతో మైత్రి ఉదయించెను. అలాగ ప్రీతిసంపన్నులగు వారిద్దరూ పూర్వము జరిగిన వృత్తాంతములతో పరస్పర ఆశ్వాసము పొందిరి".

" అప్పుడు స్త్రీ కారణముగా అన్నయైన వాలిచేత వెళ్ళగొట్టబడిన సుగ్రీవుని లక్ష్మణాగ్రజుడు ఊరడించెను. అప్పుడు లక్ష్మణుడు క్లిష్ఠమైన కార్యములు సాధించ గల రాముని దహించుతున్న శోకమును ఆ వానరేంద్రునికి నివేదించెను. ఆ వానరేంద్రుడు లక్ష్మణుని చేత చెప్పబడిన మాటలను విని గ్రహము పట్టిన సూర్యుని వలె తేజోవిహీనిడయ్యెను. అప్పుడు భూమిపై పడిన నీ అవయవములకు శోభను కలిగించు ఆభరణజాలమును చూపించెను. వానర ముఖ్యులు ఆ ఆభరణములన్ని తీసుకువచ్చి సంతోషముతో రామునకు చూపించ సాగిరి. నీవు ఎక్కడికి తీసుకుపోబడితివో ఆ మార్గము వారికి తెలియదు. నా చేత సేకరింపబడిన వాటిని రామునికి ఇచ్చితిమి. వాటిని చూడగానే గుర్తించిన రాముడు మూర్చ్ఛిల్లెను. చూపించిన ఆ ఆబరణములను తన ఒడిలో ఉంచుకొని దేవతలవలె ప్రకాశించుచున్న ఆ దేవుడు పరిపరివిధములుగా విలపించెను".

" వాటిని ( ఆ అభరణములను) చూస్తూ మళ్ళీ మళ్ళీ విలపిస్తూ మండిపోతున్న దాశరథి శోకమును అవి మరింప ప్రజ్వలింపచేశాయి. దుఃఖములో మునిగి పడిపోయిన ఆ మహాత్ముని నేను కూడా వివిధ మాట్లతో లేవతీసితిని. ఆ అభరణములను చూచి ఆ మహాబాహువులు కల రాఘవుడు మరల చూచి సౌమిత్రితో కలిసి సుగ్రీవునకు అప్పగించెను. ఆర్యుడైన రాఘవుడు నీ దర్శనము లేక అగ్ని పర్వతము వలె జ్వలించుచూ పరితపిస్తున్నాడు".

"నీ గురించి మహాత్ముడగు ఆ రాముడు నిద్రలేక శోకముతో చింతతో అగ్నిచే ప్రజ్వలిస్తున్న అగ్ని పర్వతము వలె తపించిపోతున్నాడు. నీ దర్శనము లేక శోకములో రాఘవుడు మహత్తరమైన భూకంపముతో చలించిన మహత్తరమైన పర్వతము వలె చలించి పోతున్నాడు. నిన్ను కానక రమ్యమైన వనములలో తిరుగుతున్నప్పటికీ రతిని పొందుటలేదు".

"ఓ జనకాత్మజా మనుజ శార్దూలుడు, రాఘవుడు రావణుని బంధుమిత్రులతో సహా సంహరించి నిన్ను తప్పక పొందును. అప్పుడు రామసుగ్రీవులిద్దరూ వాలిని హతమార్చుటకూ అలాగే నీ అన్వేషణమునకు అంగీకారముకు వచ్చితిరి. అప్పుడు ఆ హరీశ్వరుడు వీరులగు రాజకుమారులిద్దరితో కిష్కింధ వచ్చి యుద్ధములో వాలిని సంహరించిరి. అప్పుడు రాముడు యుద్ధములో వాలిని సంహరించి సుగ్రీవుని సమస్త వానర సంఘములకూ అధిపతిగా చేసెను".

" ఓ దేవీ రామసుగ్రీవుల ఐక్యము ఈ విధముగా కుదిరెను. నన్ను వారిద్దరి దూతగా ఇక్కడికి వచ్చిన హనుమంతుడు అని తెలిసికొనుము. సుగ్రీవుడు స్వరాజ్యము పొంది వానరలందరిని పిలిపించి నీ అన్వేషణార్థము పది దిక్కులలో మహాబలము కలవారిని పంపసాగెను. వానరేంద్రుడు మహాతేజస్సుగల సుగ్రీవుని అదేశము ప్రకారము నిన్ను వెతుకుటకై అనేక మంది వానరులు బయలుదేరిరి".

" అప్పుడు మేము, ఇతరవానరులు సుగ్రీవుని ఆదేశానుసారము నిన్ను వెదుకుతూ భూమండలము అంతా తిరుగుచున్నారము. కపిశార్దూలుడు వాలిసూనుడు లక్ష్మీవంతుడు అగు అంగదుడు మూడుభాగములలో ఒకవంతు సైన్యముతో బయలుదేరెను. వింధ్యపర్వతములలో దారితెన్నూతెలియక అత్యంత శోకసముద్రములో అహోరాత్రములు గడిచినవి".

" మేము అందరము కార్య నిరాశవలన కాలము గడిచిపోవుటవలన కపిరాజుపై భయముతో ప్రాణములు త్యజించుటకు సిద్ధపడితిమి. వనదుర్గములు కోండలు లోయలూ అన్వేషించి దేవి యొక్క స్థానము కనుగొనలేక ప్రాణములను త్యజించుటకు సిద్ధపడితిమి. ప్రాయోపవేశమునకు సిద్ధపడిన వానరులందరినీ చూచి అంగదుడు దుఃఖసాగరములో మునిగిపోయెను".

"ఓ వైదేహీ నీ అన్వేషణావిఫలము, వాలి వథ, జటాయుషు మరణము ఇవన్ని కారణములయ్యెను. స్వామి అదేశములపై నిరాశతో ప్రాణత్యాగమునకు సిద్ధమైన సమయములో సమయనుకూలముగా వీరుడైన గొప్ప పక్షిరాజు అక్కడికి వచ్చెను. పక్షిరాజు సోదరుడు, సంపాతి అనబడు పక్షిరాజు భాతృ వధగురించి విని కోపముతో ఇట్లు పలికెను. 'వానరోత్తములారా నా తమ్ముడు ఎవరిచేత ఎక్కడ హతమార్చబడెనో మీచేత చెప్పబడుటకు కోరుచున్నాను'. అప్పుడు నీ కొఱకు భీమరూపముగల రాక్షసుడు జనస్థానములో చేసిన జటాయు మహావథను యథా తథముగా చెప్పితిని. ఓ వరాననా ఆ అరుణాత్మజుడు జటాయువు మరణము విని దుఃఖపడి నువ్వు రావణుని అంతఃపురములో వున్నట్లు చెప్పెను. ఆ సంపాతి యొక్క ప్రీతిని కలిగించు మాటలు విని అంగదప్రముఖులు మేము అందరము అచటినుంచి వెంటనే బయలు దేరితిమి".

"' ఆకాశములో ఎగరగల వారందరమూ నీ దర్శనము కలుగుననే ఉత్సాహముతో వింధ్యపర్వతమునుంచి లేచి సాగరము యొక్క ఉత్తర తీరము చేరితిమి. అంగద ప్రముఖులు నిన్ను చూడవలను ఉత్సాహముతో సముద్రతీరము చేరి, సముద్రము చూచి భయపడి మరల చింతాక్రాంతులైరి. అప్పుడు నేను సాగరము చూచి వానరసైన్యము యొక్క భయము తొలగిస్తూ వందయోజనముల సాగరమును లంఘించితిని".

" రాక్షసులతో నిండి యున్న లంకానగరము రాత్రి ప్రవేశించి రావణుని కూడా చూచి , శోకములో మునిగియున్న నిన్ను చూచితిని. దోషములులేని ఓదేవీ! ఈ వృత్తాంతము యథా తథము గా వివరించితిని. నాతో మాట్లాడుము. నే దాశరథి దూతను. ఓ దేవి నీ కోసమై రామునిచేత నియోగింపబడి ఇక్కడికి వచ్చిన పవనాత్మజుని నన్ను సుగ్రీవుని సచివునిగా తెలిసికొనుము".

" సమస్త అస్త్రములను ధరించువారిలో శ్రేష్ఠుడైన నీ కాకుత్‍స్థుడు కుశలము. గురువును ఆరాధించు లక్ష్మణుడు కూడా కుశలము. ఓ దేవి వీరుడు నీ భర్త యొక్క హితము కోరువాడు అగు నేను సుగ్రీవుని వచనములతో ఒక్కడినే వచ్చితిని. నీజాడ తెలిసికొనగోరి, కోరిన రూపము ధరించగల నేను ఇంకెవరి సహాయము లేకుండా తిరుగుతూ ఈ దక్షిణప్రాంతమునకు వచ్చితిని".

" అదృష్టముకొలదీ నిన్ను చూచిన వార్త, నీ జాడతెలియక సంతాపములో మునిగియున్న వానరసైన్యముయొక్క శోకమును తొలగించును. అదృష్టము కొలదీ నీ దర్శనము చేసిన కీర్తిని నేను పొందెదను. మహావీరుడు రాఘవుడు, రావణుని మిత్రభాంధవులతో సహా హతమార్చి త్వరలో నిన్ను చేరును".

" వైదేహీ పర్వతములలో ఉత్తమమైనది మాల్యవంతమనే పర్వతము. అచటినుండి కేసరి అనబడు వానరుడు గోకర్ణమనే పర్వతము వెళ్ళెను. దేవఋషుల ఆదేశానుసారము నా తండ్రి ఆ పుణ్య నదీతీరములో శంబశాదనుని సంహరించెను. ఓ మైథిలీ ఆ వానరుల క్షేత్రములో వాయుదేవుని అనుగ్రహముతో జన్మించిన నేను నా చేతల వలన హనుమంతుడు అనే పేరుతో పేరుపొందితిని".

"ఓ వైదేహీ నీకు విశ్వాసము కలిగించుటకు నీ భర్త గుణములను చెప్పితిని. ఓ దేవి రాఘవుడు అచిరకాలములో వచ్చి నిన్ను తీసుకుపోవును".

శోకములో మునిగియున్న సీతా కూడా హేతువులతో విశ్వాసము పొంది, ఆ వానరుని రాముని దూతగా గుర్తించెను. జానకి అత్యంత ఆనందముతో అందమైన కనుబొమలద్వారా కన్నీళ్ళు కార్చెను.

ఆ ఎర్రని అంచుగల కళ్లతో ఆ విశాలాక్షి ముఖము రాహువు ముఖమునుండి వివడిన చంద్రుని వలె శోభించెను. ఆమె హనుమంతుడు వానరుడే ఇంకొకడు కాడు అని గ్రహించెను. అప్పుడు హనుమంతుడు ప్రసన్నమైన చూపులుగల ఆమె తో ఇట్లు పలికెను.

"ఓ మైథిలీ సర్వస్వము చెప్పితిని విశ్వసింపుము. ఏమి చేసినచో సంతోషపడుదువో చెప్పుము. నేను తిరిగి వెళ్ళెదను".

"ఓ మైథిలీ మహర్షుల అదేశానుసారము కపిప్రవరుడు శంబసాదనుని హతమార్చెను. మహర్షుల దీవెనలతో వాయుదేవుని వరప్రసాదముగా పుట్టి ప్రభావములో వాయుదేవునితో సమానమైన వాడను".

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి సుందరకాండలో ముప్పది ఇదవ సర్గ సమాప్తము

||ఓమ్ తత్ సత్||