||సుందరకాండ ||

||ముప్పది ఆరవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
భూయ ఏవ మహాతేజా హనుమాన్ మారుతాత్మజః|
అబ్రవీత్ ప్రశ్రితం వాక్యం సీతా ప్రత్యయకారణాత్||1||

స||మహాతేజా హనుమాన్ మారుతాత్మజః భూయః సీతా ప్రత్యయకారణాత్ ప్రశ్రితం వాక్యం అబ్రవీత్||

తా||మహాతేజోవంతుడైన మారుతాత్మజుడగు హనుమంతుడు సీతాదేవికి మరింత నమ్మకము కలిగించుటకు మరల చెప్పెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షట్ర్త్రింశస్సర్గః

మహాతేజోవంతుడైన మారుతాత్మజుడగు హనుమంతుడు సీతాదేవికి మరింత నమ్మకము కలిగించుటకు మరల చెప్పెను.
' ఓ మహాదేవి నేను వానరుడను. ధీమంతుడైన రాముని దూతను. ఓ దేవి చూడుము ఇది రామనామాంకితమైన అంగుళీయకము. ఆ మహాత్ముడు నీకు విశ్వాసము కలిగించుటకు దీనిని ఇచ్చెను. నీ దుఃఖములన్నీ క్షీణించిపోగాక. నీకు శుభము అగుగాక'. వానరుడు ఈ విధముగా చెప్పి సీతాదేవికి తన భర్త చేతి ఆభరణమును ప్రసాదించెను. అప్పుడు ఆ జానకి ఆ అంగుళీయకము తీసుకొని భర్తనే పొందినట్లు సంతోషపడెను.

ఆ విశాలాక్షియొక్క ఎఱ్ఱని కళ్ళు గల అందమైన వదనము రాహుముఖమునుండి విడివడిన చంద్రుని వలె శోభించెను. అప్పుడు ఆమె భర్త సందేశముతో హర్షితురాలై స్త్రీలకు సహజమైన లజ్జాంకిత హర్షముతో ఆ మహాకపిని ప్రశంశించెను.

'ఓ వానరోత్తమా నీవు ఒక్కడివే దుర్భేద్యమైన ఈ రాక్షసపదమునకు చెరితివి. నీవు విక్రాంతుడవు. సమర్థుడవు. ప్రాజ్ఞుడవు. మకరాలయమైన నూరుయోజనములు కల ఈ సాగరమును ఆవు పాదము మోపినంత మేరను దాటినట్లు అవలీలగా నీ శ్లాఘినీయమైన పరాక్రమముతో దాటితివి. ఓ వానరర్షభ ! రావణునిపై ఏమీ భయము లేకుండా సంభ్రమము లేకుండా వున్న నీవు సామాన్యమైన వానరుడవు కావు'.

' విదితాత్ముడగు రామునిచేత పంపబడిన వాడవు కనక నీవు మాట్లాడడానికి తగిన వాడివే. అజేయుడైన రాముడు పరాక్రమము తెలిసికొనకుండా పరీక్షించకుండా అందులోనూ నాకోసమై ఎవరినీ పంపడు. నా అదృష్టము కొలదీ ధర్మాత్ముడు సత్యసంగరుడు అయిన రాముడు క్షేమముగా ఉన్నాడు. అలాగే మహాతేజోవంతుడైన సుమిత్రానందనుడు అగు లక్ష్మణుడు కూడా'.

' మరి కుశలుడైన కాకుత్‍స్థుడు కాలాగ్నివలె మండుతున్న కోపముతో సాగరముతో చుట్టబడిన ఈ భూమిని ఎందుకు దహించివేయుటలేదు? లేక సురులను కూడా నిగ్రహించకల శక్తిమంతులు నాదుఖమునకు అంతులేదని తలచుచున్నారా? రాముడు వ్యథలో నుండెనా? పరితపించుటలేదు కదా? ఆ పురుషోత్తముడు చేయవలసిన కార్యములు చేయుచున్నాడా"

'ఆ రాజకుమారుడు దీనుడుగా భ్రాంతిలో లేడు కదా? కార్యములో విముఖతలేదు కదా? పురుషకార్యములు నెఱవేర్చుచున్నాడు కదా? ఆ పరంతపుడు మిత్రులపై ఆదరముతో రెండు ఉపాయములు అనబడు సామదానములను శత్రువులపై విజయకాంక్షతో మూడు ఉపాయములు అనబడు దాన భేద దండో పాయములను పాటిస్తున్నాడు కదా? మిత్రులను సంపాదించుచున్నాడా? మిత్రులు కూడా అతనిపై కోరికగలవారై ఉన్నారా? మిత్రులు కల్యాణము కోరుకొనువారే కదా? మిత్రులచేత గౌరవింపబడుతున్నాడా?'

'ఆ పార్థివాత్మజుడు దేవతలను ప్రసాదించుచున్నాడా? పురుషకార్యములు దైవకార్యములు చేయుచున్నాడా? రాఘవుడు ఎడబాటులో నా పై స్నేహము లేనివాడు కాదు గదా? ఓ వానరా నన్ను ఈ కష్టములనుంచి విముక్తి కలిగిస్తాడు కదా ? ఎల్లప్పుడు సుఖములకు తగిన అసుఖములను ఎఱగని రాఘవుడు దుఖములలో మునిగిపోలేదు కదా?'

'కౌసల్యయొక్క సుమిత్ర యొక్క అలాగే భరత్ను కుశలక్షేమముల గురించి వింటున్నాడు కదా? మానార్హుడైన రాముడు నాకోసమైన దుఖములో అన్యమనస్కుడు కాలేదు కదా? నన్ను ఎప్పుడు రక్షించును? భాత్రువత్సలుడైన భరతుడు మంత్రులచేత రక్షింపబడు శత్రుభయంకరమైన అక్షహౌణి సైన్యములను నాకొఱకై పంపునుకదా?'

'వానరాధిపతి అయిన సుగ్రీవుడు దంతములు నఖములు ఆయుధముగా గల వానరసైన్యములతో కలిసి ఎప్పుడు వచ్చును? శూరుడు సుమిత్రానందవర్ధనుడు అగు లక్ష్మణుడు తన అస్త్రజాలముతో రాక్షసులను ఎప్పుడు వధించును? జ్వలించుచున్న రౌద్రశస్త్రములతో రణములో మిత్రబాంధవులతో హతమార్చబడిన రావణుని అచిరకాలములో చూడకలను కదా"

'బంగారు వన్నెకల పద్మసమానగంధము కల ఆయన వదనము నా వియోగ శోకముతో జలక్షయముతో వాడగొట్టబడిన పద్మము వలె వాడిపోలేదు కదా? ధర్మపాలనకై రాజ్యమును త్యజించినపుడు, కాలినడకన అరణ్యములో ప్రవేశించినఫుడుగాని వ్యధచెందక భయము లేక శోకములేక వున్న వాడు, ఇప్పుడు ఇంకా హృదయములో ధైర్యము కలవాడై ఉన్నాడు కదా? నాతండ్రి అనురాగముకాని, నా తల్లి అనురాగముకాని, విశిష్ఠమైన ఆయన అనురాగముతో సమానము కాదు. ఓ దూతా ! నా ప్రియుని వృత్తాంతము వినుటవఱకై నేను జీవించుటకు కోరుచున్నాను'.

సీతాదేవి ఆ వానరేంద్రునకు మధురమైన మహత్తరమైన అర్ధము కల ఈ వచనములను చెప్పి ఆ రాముని గురించి మనోహరమైన మాటలు మరల వినగోరి విరమించెను.

భయంకరమైన పరాక్రమము కల మారుతి కూడా సీతయొక్క వచనములను విని శిరస్సు తో అంజలి ఘటించి ప్రత్యుత్తరముగా ఇట్లు చెప్పెను.

'ఓ కమలలోచనా నీవు ఇక్కడ ఉన్నావు అని రామునికి తెలియదు. అందువలనే ఇంద్రుడు శచీదేవిని తీసుకుపోయినట్లు నిన్నుతీసుకుపోలేదు. నా మాటలు వినిన వెంటనే వానర గణములతో నిండిన మహత్తర సైన్యముతో ఇక్కడికి వచ్చును. కాకుత్‍స్థుడు నీటితో నిండిన సాగరమును స్థంబించి ఈ లంకాపురమును రాక్షసరహితము చేయును'.

'ఆ రాముని మార్గములో యముడితో సహా దేవతలు ఉన్నా వాళ్ళను కూడా వధించును. ఆర్యుడైన రాముడు నీ వియోగముతో శోకములో మునిగి సింహము ముందు పడిన ఏనుగు లాగ అశాంతిలో ఉన్నాడు'.

'ఓ దేవీ వింధ్యా మేరు పర్వతములపై, భుజింపతగు మూలఫలములపై ప్రమాణము చేసి చెప్పుచున్నాను. అందమైన నయనములతో పెదవులతో మంచి కుండలములను దాల్చి ఉదయించిన పూర్ణచంద్రుని ముఖము బోలియున్న రాముని ముఖము త్వరలో నే చూచెదవు'.

'ఓ వైదేహీ ఇరావతము మీదకూర్చుని వున్న ఇంద్రునివలె ప్రస్రవణ పర్వతము మీద రాముని త్వరలోనే చూచెదవు. రాఘవుడు మాంసము తినుటలేదు. మధు సేవనము కూడా చేయుటలేదు. నిత్యము వనములో దొరికిన భుక్తిలో ఇదవభాగమే తినుచున్నాడు. రాఘవుడు నీ విడబాటుతో మనస్సులో మునిగి శరీరమునుండి కీటకములను పురుగులను తోలుటలేదు'.

'రాముడు నిత్యము శోకములో మునిగియుండి నీ పై ధ్యానపరుడై కామవశములో ఇంక దేనిగురించి అలోచించుటలేదు. రాముడు ఎల్లపుడు నిద్రలేనివాడై, నిద్రిస్తున్నాగాని సీతా అని మధురమైన వాణితో పలికుతూ మళ్ళీ లేచినవాడగును. ఫల్ము పుష్పము లేక ఎదైన మనోహరమైనది చూచినా 'హా ప్రియా' అంటూ నిట్టూర్పులు విడుచును'.

'ఓదేవీ మహాత్ముడైన ఆ రాజకుమారుడు నిత్యము పరితాపములో నుండి "సీతా" అని తలచుకుంటూ నీతోనే మాట్లాడతలచి ధృఢవ్రతుడై నిన్ను పొందుటకు అన్నివిధములుగా ప్రయత్నిసున్నాడు'.

రాముని శోకముతో సమానమైన శోకముగల ఆ వైదేహి హనుమంతుని రామసంకీర్తనతో మేఘములతో కప్పబడి ప్రకాశించీ ప్రకాశించని శరత్ కాల చంద్రునివలె ప్రకాశించెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది ఆరవ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

సా రామసంకీర్తనవీతశోకా రామస్య శోకేన సమానశోకా|
శరమ్మఖే సాంబుదశేష చంద్రా నిశేవ వైదేహసుతా బభూవ||47||

స|| రామస్య శోకేన సమానశోకా రామసంకీర్తన వీత శోకా సా వైదేహ సుతా శరన్ ముఖే సామ్బుదశేషచంద్రా నిశేవ బభూవ||

తా||రాముని శోకముతో సమానమైన శోకముగల ఆ వైదేహి హనుమంతుని రామసంకీర్తనతో మేఘములతో కప్పబడి ప్రకాశించీ ప్రకాశించని శరత్ కాల చంద్రునివలె ప్రకాశించెను

||ఓమ్ తత్ సత్||