||సుందరకాండ ||

|| ముప్పది ఎనిమిదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 38 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||


సుందరకాండ.
అథ అష్టత్రింశస్సర్గః

ముప్పది ఏడవ సర్గలో రాముడు వచ్చి రావణ సంహారం చేసి తనను తీసుకుపోవుట యే రామునకు యుక్తము అంటూ, తనని తన పృష్టముపై ఎక్కించుకొని రామునితో తక్షణమే సీతా చేర్చగలనని చెప్పిన హనుమంతుని మాటని, తగిన కారణాలతో నిరాకరిస్తుంది సీత.

సీత హనుమంతుడు రాక్షసుల నందరినీ చంపి వేయడానికి సమర్థుడైనా అలాచేస్తే "రాఘవస్య యశో హీయేత్' అంటే రాఘవుని యశస్సుకు భంగము అని, రాముడు వచ్చి రావణసంహారము చేసి తనని తీసుకు పోవుట యుక్తము అని చెప్పి, తరువాత హనుమంతుడి పృష్టము మీద కూర్చుని పోవడములో తన పాతివ్రత్యము భంగము అవుతుంది అన్నమాట కూడా చెపుతుంది. దానికి సమాధానముగా హనుమంతుడు తల్లీ నీవు చెప్పిన మాట నీకే తగును. ఇంకెవరూ ఇలా చెప్పలేరు' అని సీత మాటతో సమ్మతిస్తాడు.

అంటే "తత్ తస్య సదృశం"- అలా చేయడము ఆయనకు తగును - అన్న సీత మాటకి , హనుమంతుడు " తత్ తే సదృశం", అంటే ఆ మాట నీకే తగును అంటూ సీత మాటలను వేనోళ్ల పొగుడుతాడు.

అప్పుడు హనుమ సీతమ్మను రాఘవుడు గుర్తింపగల అభిజ్ఞానమును ఇవ్వమని కోరుతాడు.ఈ విధముగా హనుమంతునిచే ప్రేరేపింప బడిన సీత కాక వృత్తాంతము చెపుతుంది అదే ఈ సర్గలో ముఖ్యభాగము.

ఇక ముప్పది ఎనిమిదవ సర్గ లో శ్లోకాలు.

||శ్లోకము 38.01||

తతః స కపిశార్దూలః తేన వాక్యేన హర్షితః|
సీతామువాచ తత్ శ్రుత్వా వాక్యం వాక్య విశారదః||38.01||

స|| తతః తత్ వాక్యం శ్రుత్వా తేన వాక్యేన హర్షితా వాక్య విశారదః కపిశార్దూలః సీతాం ఉవాచ||

||శ్లోకార్థములు||

తతః తత్ వాక్యం శ్రుత్వా -
ఆప్పుడు ఆ మాటలు విని
తేన వాక్యేన హర్షితా -
ఆ మాటలతో సంతోషపడినవాడై
వాక్య విశారదః కపిశార్దూలః -
మాటలాడుటలో విశారదుడైన వానరోత్తముడు
సీతాం ఉవాచ - సీతతో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"ఆప్పుడు ఆ మాటలు విని, ఆ మాటలతో సంతోషపడినవాడై, మాటలాడుటలో విశారదుడైన వానరోత్తముడు సీతతో ఇట్లు పలికెను." ॥38.01॥

||శ్లోకము 38.02||

యుక్తరూపం త్వయా దేవి భాషితం శుభదర్శనే|
సదృశం స్త్రీస్వభావస్య సాధ్వీనాం వినయస్య చ||38.02||

స|| హే శుభదర్శనే దేవి త్వయా భాషితం యుక్తరూపం సదృశం స్త్రీ స్వభావస్య సాద్వీనాం వినయస్య చ||

తిలకటీకాలో- వచనస్య యుక్తరూపం ప్రాశస్త్యం దర్శయతి।

||శ్లోకార్థములు||

హే శుభదర్శనే దేవి -
ఓ మంగళశ్వరూపీ అయిన సీతా
త్వయా భాషితం యుక్తరూపం -
నీవు చెప్పిన మాటలు యుక్తము
స్త్రీ స్వభావస్య - స్త్రీ స్వభావమునకు
సాద్వీనాం వినయస్య చ -
సాధ్వి యొక్క నమ్రతకు
సదృశం - అనుగుణముగా ఉన్నాయి

||శ్లోకతాత్పర్యము||

"ఓ మంగళశ్వరూపీ అయిన సీతా ! నీవు చెప్పిన మాటలు యుక్తము. అవి స్త్రీరూపమునకు స్వభావమునకు సాధ్వి యొక్క నమ్రతకు అనుగుణముగా ఉన్నాయి." ||38.02||

||శ్లోకము 38.03||

స్త్రీత్వం న తు సమర్థ హి సాగరం వ్యతివర్తితుమ్|
మా మధిష్ఠాయ విస్తీర్ణం శతయోజన మాయతమ్||38.03||

స|| మమ అధిష్ఠాయ శతయోజనం విస్తీర్ణం సాగరం వ్యతివర్తితుం స్త్రీత్వం న సమర్థం హి ||

||శ్లోకార్థములు||

మమ అధిష్ఠాయ - నాపై ఎక్కి
శతయోజనం విస్తీర్ణం సాగరం వ్యతివర్తితుం -
నూరు యోజనముల విస్తీర్ణము కల సాగరము దాటుట
స్త్రీత్వం న సమర్థం హి -
సహజముగా స్త్రీలకు కాని పని.

||శ్లోకతాత్పర్యము||

"నాపై ఎక్కి నూరు యోజనముల విస్తీర్ణము కల సాగరము దాటుట సహజముగా స్త్రీలకు కాని పని." ||38.03||

||శ్లోకము 38.04||

ద్వితీయం కారణం యచ్చ బ్రవీషి వినయాన్వితే|
రామాత్ అన్యస్య నార్హామి సంస్పర్శమితి జానకి||38.04||

స|| హే జానకీ వినయాన్వితే ద్వితీయం కారణం యత్ బ్రవీషి రామాత్ అన్యస్య సంస్పర్శం న అర్హామి ఇతి తత్ ||

||శ్లోకార్థములు||

హే జానకీ వినయాన్వితే -
వినయముతో మూర్తీభవించిన ఓ జానకీ
ద్వితీయం కారణం యత్ బ్రవీషి -
నీవు చెప్పిన రెండవకారణము
రామాత్ అన్యస్య సంస్పర్శం న అర్హామి ఇతి తత్ -
రాముని కాక ఇతర పురుషుని తాకను అన్నది

||శ్లోకతాత్పర్యము||

"వినయముతో మూర్తీభవించిన ఓ జానకీ ! నీవు చెప్పిన రెండవకారణము రాముని కాక ఇతరపురుషుని తాకను అన్నది." ||38.04||

||శ్లోకము 38.05||

ఏతత్ తే దేవి సదృశం పత్న్యాస్తస్య మహాత్మనః|
కా హ్యాన్యా త్వా మృతే దేవి బ్రూయాత్ వచన మీదృశమ్ ||38.05||

స|| దేవి ! ఏతత్ మహాత్మనః పత్న్యాః తస్య సదృశం | త్వం ఋతే అన్యాః కాః ఈదృశం వచనం బ్రూయాత్ |

||శ్లోకార్థములు||

దేవి ! ఏతత్ మహాత్మనః పత్న్యాః -
ఓ దేవీ అది మహాత్ముడైన పత్నికే
తస్య సదృశం -
ఆమెకే సదృశముసదృశము
త్వం ఋతే అన్యాః కాః -
నీవు తప్పఇతరులు ఎవరు
ఈదృశం వచనం బ్రూయాత్ -
ఇటువంటి వచనములు చెప్పెదరు

||శ్లోకతాత్పర్యము||

"అది మహాత్ముడైన పత్నికే సదృశము. నీవు తప్ప ఇంకెవరూ ఇటువంటి మాటలు చెప్పరు." ||38.05||

||శ్లోకము 38.06||

శ్రోష్యతే చైవ కాకుత్‍స్థః సర్వం నిరవశేషతః|
చేష్ఠితం య త్వయా దేవి భాషితం మమచాగ్రతః||38.06||

స|| కాకుత్‍స్థః దేవి త్వయా యత్ చేష్టితం మమాగ్రతః భాషితం చ సర్వం నిరవశేషతః శ్రోష్యతే||

||శ్లోకార్థములు||

దేవి త్వయా యత్ చేష్టితం -
ఓ దేవీ ఇక్కడ జరిగినది అంతా
మమాగ్రతః భాషితం చ సర్వం నిరవశేషతః -
నా ముందు జరిగిన భాషణ అంతా శేషము లేకుండా
కాకుత్‍స్థః శ్రోష్యతే - కాకుత్‍స్థుడు వినును

||శ్లోకతాత్పర్యము||

"కాకుత్‍స్థుడు ఇక్కడ జరిగినది అంతా నాముందు జరిగిన భాషణ అంతయూ శేషము లేకుండా వినును". ||38.06||

||శ్లోకము 38.07||

కారణైర్బహుభిర్దేవి రామప్రియ చికీర్షయా|
స్నేహప్రస్కన్న మనసా మయైతత్ సముదీరితమ్||38.07||

స|| దేవి బహుభిః కారణైః రామప్రియచికీర్షయా స్నేహప్రస్కన్న మనసా మయా ఏతత్ సముదీరితం ||

తిలక టీకాలో - రామప్రియచికీర్షయా శీఘ్రం రామప్రీతి వాంఛయా బహుభిః కారణైః కాణాన్తరైశ్చ స్నేహేన ప్రస్కన్నమ్ ద్రవీభూతం మనః యస్య తేన మయా ఏతత్ సముదీరితమ్।

||శ్లోకార్థములు||

దేవి బహుభిః కారణైః -
ఓ దేవి అనేక కారణముల వలన
రామప్రియచికీర్షయా -
శీఘ్రముగా రామునికి ప్రీతి కలిగించ కోరికతో
స్నేహప్రస్కన్న మనసా -
స్నేహముతో ద్రవింవించిన మనస్సుతో
మయా ఏతత్ సముదీరితం-
నాచేత ఈ విధముగా చెప్పబడినది.

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవి అనేక కారణముల వలన, శీఘ్రముగా రామునికి ప్రీతి కలిగించ కోరికతో, స్నేహముతో ద్రవించిన మనస్సుతో నాచేత ఈ విధముగా చెప్పబడినది." ||38.07||

||శ్లోకము 38.08||

లంకాయా దుష్ప్రవేశత్వాత్ దుస్తరత్వాన్మహోదధే|
సామర్థ్యాత్ అత్మనశ్చైవ మయైతత్ సముదీరితమ్||38.08||

స|| లంకాయా దుష్ప్రవేశత్వాత్ మహోదధేః దుస్తరత్వాత్ ఆత్మనః సామర్థ్యాశ్చైవ మయా ఏతత్ సముదీరితం||

||శ్లోకార్థములు||

లంకాయా దుష్ప్రవేశత్వాత్ -
లంకాప్రవేశము దుష్కరము కనుక
మహోదధేః దుస్తరత్వాత్ -
దాటుటకు సాధ్యముకాని మహాసాగరము వలన
ఆత్మనః సామర్థ్యాశ్చైవ -
నాకు కల సామర్థ్యము వలన
మయా ఏతత్ సముదీరితం-
నా చేత ఇది చెప్పబడడమైనది

||శ్లోకతాత్పర్యము||

"లంకాప్రవేశము దుష్కరము కనుక, దాటుటకు సాధ్యముకాని మహాసాగరము వలన, నాకు కల సామర్థ్యము వలన ఇది చెప్పబడడమైనది." ||38.08||

||శ్లోకము 38.09||

ఇఛ్ఛామి త్వాం సమానేతుం అద్యైవ రఘుబంధునా|
గురుస్నేహేన భక్త్యా చ నాన్యథైతత్ ఉదాహృతమ్||38.09||

స|| గురుస్నేహేన భక్త్యాచ త్వాం రఘుబంధునా అద్యైవ సమానేతుం ఏతత్ ( కథితం) న అన్యథా ఉదాహృతం||

రామ టీకాలో - గురో రామస్య స్నేహేన త్వయి భక్త్యా చ ఉక్తమ్ నతు నిజ బల గర్వాత్ ఇత్యర్థః।

||శ్లోకార్థములు||

గురుస్నేహేన భక్త్యాచ -
గురుస్నేహముతో భక్తితో
త్వాం రఘుబంధునా అద్యైవ సమానేతుం -
నిన్ను ఈ దినమే రాఘవునితో చేర్చుటకు
ఏతత్ ఉదాహృతం -
ఇది చెప్పబడినది
న అన్యథా - ఇంకేమీ కారణములేదు

||శ్లోకతాత్పర్యము||'

"గురువైన రామునిపై స్నేహముతో, నీపై భక్తితో నిన్ను ఈ దినమే రాఘవునితో చేర్చుటకు ఈ విధముగా చెప్పబడడమైనది. ఇతర కారణము ఏమీ లేదు." ||38.09||

||శ్లోకము 38.10||

యది నోత్సహసే యాతుం మయా సార్థ మనిందితే|
అబ్జిజ్ఞానం ప్రయచ్ఛ త్వం జానీయాత్ రాఘవో హి తత్||38.10||

స|| అనిందితే మమసార్థం యాతుం న ఉత్సహే యది తతః యత్ రాఘవః జానీయాత్ (తత్) అభిజ్ఞానం త్వం ప్రయచ్ఛ||

||శ్లోకార్థములు||

అనిందితే -
దోషములు లేని దానా (ఓ సీతా)
మమసార్థం యాతుం న ఉత్సహే యది -
నాతో వెళ్ళుటకు ఇష్టము లేనిచో
తతః యత్ రాఘవః జానీయాత్ -
అప్పుడు రాఘవునకు ఏది తెలుసునో
(తత్) అభిజ్ఞానం త్వం ప్రయచ్ఛ-
(అట్టి) ఒక అభిజ్ఞానమును ఇవ్వుము

||శ్లోకతాత్పర్యము||

"దోషములు లేని ఓ సీతా నాతో వెళ్ళుటకు ఇష్టము లేనిచో అప్పుడు రాఘవునకు తెలియునట్లు ఒక అభిజ్ఞానమును ఇవ్వుము." ||38.10||

||శ్లోకము 38.11||

ఏవముక్తా హనుమతా సీతా సురసుతోపమా|
ఉవాచ వచనం మందం భాష్పప్రగ్రథితాక్షరమ్||38.11||
ఇదం శ్రేష్ఠం అభిజ్ఞానం బ్రూయాస్త్వంతు మమ ప్రియమ్|

స|| ఏవం ఉక్తా హనుమతా సురసోపమా సీతా భాష్ప ప్రగ్రథితాక్షరం వచనం మందం ఉవాచ || త్వం ఇదం శ్రేష్ఠం మమ ప్రియం అభిజ్ఞానం బ్రూయాస్తు ||

||శ్లోకార్థములు||

ఏవం ఉక్తా హనుమతా -
ఈ విధముగా హనుమంతునిచే ప్రేరేపింపబడిన
సురసోపమా సీతా -
సురలతో సమానమైన సీత
భాష్ప ప్రగ్రథితాక్షరం వచనం -
కన్నీళ్ళతో తడబడిన మాటలతో
మందం ఉవాచ -
మందస్వరముతో ఇట్లు పలికెను
త్వం ఇదం శ్రేష్ఠం మమ ప్రియం అభిజ్ఞానం బ్రూయాస్తు -
నీకు ఈ శ్రేష్ఠమైన నా ప్రియునకు తెలిసిన ఆభిజ్ఞానము చెప్పెదెను

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధముగా హనుమంతునిచే ప్రేరేపింపబడిన సురలతో సమానమైన సీత కన్నీళ్ళతో తడబడిన మాటలతో మందస్వరముతో ఇట్లు పలికెను. 'నీకు ఈ శ్రేష్ఠమైన నా ప్రియునకు తెలిసిన ఆభిజ్ఞానము చెప్పెదెన'."||38.11||

||శ్లోకము 38.12,13||

శైలస్య చిత్రకూటస్య పాదే పూర్వోత్తరే పురా||12||
తాపసాశ్రమవాసిన్యాః ప్రాజ్యమూలఫలోదకే|
తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యా హ్యదూరతః||13||

స|| పురా పూర్వోత్తరే శైలస్య చిత్రకూటస్య పాదే ప్రాజ్ఞమూలఫలోదకే తస్మిన్ సిద్ధాశ్రమే దేశే మందాకిన్యాం అదూరతః తాపసాశ్రమవాసిన్యాః మః||

||శ్లోకార్థములు||

పురా పూర్వోత్తరే శైలస్య చిత్రకూటస్య పాదే -
చిత్రకూట పర్వతముయొక్క ఈశాన్యభాగములో
ప్రాజ్ఞమూలఫలోదకే -
జలమూలఫలములు సమ్మృద్ధిగా వున్న
తస్మిన్ సిద్ధాశ్రమే దేశే -
సిద్ధాశ్రమములు కలప్రదేశములో
మందాకిన్యాం అదూరతః -
మందాకినీ నదికి దగ్గరలో
తాపసాశ్రమవాసిన్యాః మః -
తాపసాశ్రమ వాసుల వలె ఉండెడివారము

||శ్లోకతాత్పర్యము||

"చిత్రకూట పర్వతముయొక్క ఈశాన్యభాగములో , జలమూలఫలములు సమ్మృద్ధిగా వున్న పర్వతపాదప్రాంతములో, సిద్ధాశ్రమములు కలప్రదేశములో, మందాకినీ నదికి దగ్గరలో తాపసాశ్రమ వాసుల వలె ఉండెడివారము." ||38.12,13||

||శ్లోకము 38.14||

తస్యోపవనషండేషు నానాపుష్పసుగంధిషు|
విహృత్య సలిలక్లిన్నా తవాంకే సముపావిశమ్||38.14||

స|| తస్య ఉపవనసండేషు నానాపుష్పసుగంధిషి సలిలక్లిన్నా విహృత్య తవాంకే సముపావిశం ||
.

||శ్లోకార్థములు||

తస్య నానాపుష్పసుగంధిషి ఉపవనసండేషు -
అక్కడి పుష్పపరిమళాలతో నిండిన ఉపవనములలో
సలిలక్లిన్నా విహృత్య -
సలిలములతో ఆడుకొని
తవాంకే సముపావిశం -
నీ వడిలో పడుకొనినదానను

||శ్లోకతాత్పర్యము||

"అక్కడి పుష్పపరిమళాలతో నిండిన ఉపవనములలో విహరించి, సలిలములతో ఆడుకొని నీ వడిలో పడుకొనినదానను." ||38.14||

||శ్లోకము 38.15||

తతో మాంస సమాయుక్తో వాయసః పర్యతుండయత్ |
త మహం లోష్టముద్యమ్య వారయామి స్మ వాయసమ్ ||38.15||

స|| తతః మాంససమాయుక్తః వాయసః పర్యతుండయత్ | అహం లోష్టం ఉద్యమ్య తం వాయసం వారయామి స్మ ||

||శ్లోకార్థములు||

తతః వాయసః - అప్పుడు ఒక వాయసము
మాంససమాయుక్తః -
మాంసపు ముక్కతో కూడినదై
పర్యతుండయత్ -
దానిని మాటిమాటికి తన ముక్కుతో పొడుస్తూ ఉండెను
అహం లోష్టం ఉద్యమ్య -
నేను ఒక మట్టిబెడ్డతో
తం వాయసం వారయామి స్మ -
దానిని వారించుతున్నదానను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఒక వాయసము మాంసపు ముక్కతో దానిని మాటిమాటికి తన ముక్కుతో పొడుస్తూ ఉండెను. " ||38.15||

||శ్లోకము 38.16||

దారయన్ స చ మాం కాకః తత్రైవ పరిలీయతే|
న చాప్యుపారమన్ మాంసాత్ భక్షార్థి బలిభోజనః ||38.16||

స|| సః కాకః మామ్ దారయన్ తత్రైవ పరిలీయతే | భక్ష్యార్థి బలిభోజనః మాంసాత్ న ఉపరిమత్ చ అపి ||

||శ్లోకార్థములు||

సః కాకః మామ్ దారయన్ -
ఆ కాకి నన్ను పొడుచుటకు
తత్రైవ పరిలీయతే -
అక్కడే తిరుగుచుండెను
మాంసాత్ భక్ష్యార్థి బలిభోజనః -
మాంసము తినడానికి కోరికగల
న ఉపరిమత్ చ అపి -
శాంతించకుండా

||శ్లోకతాత్పర్యము||

"మాంసము తినడానికి కోరికగల ఆ కాకి శాంతించకుండా నన్ను పొడుచుటకు అక్కడే తిరుగుచుండెను." ||38.16||

||శ్లోకము 38.17||

ఉత్కర్షన్త్యాం చ రశనాం క్రుద్ధాయాం మయి పక్షిణి|
స్త్రస్యమానే చ వసనే తతో దృష్ట్వా త్వయా హ్యహమ్||38.17||

స|| పక్షిణి కృద్ధాయామ్ మయి వసనే స్త్రస్యమానే చ రశనామ్ ఉత్కర్షన్యాం చ తతః త్వయా అహం దృష్టా||

||శ్లోకార్థములు||

తతః పక్షిణి కృద్ధాయామ్ మయి -
అప్పుడు పక్షిపై కోపముతో వున్న నేను
వసనే స్త్రస్యమానే చ -
జారిన పమిటను సరిచేసుకొనుచున్న
రశనామ్ ఉత్కర్షన్యాం చ -
వడ్డాణము తీసుకొనుచున్న
త్వయా అహం దృష్టా -
నేను నీచేత చూడబడితిని

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు పక్షిపై కోపముతో వున్న నేను, జారిన పమిటను సరిచేసుకొనుచున్న వడ్డాణము తీసుకొనుచుండగా నేను నీచేత చూడబడితిని." ||38.17||

||శ్లోకము 38.18||

త్వయాపఽహసితా చాహం క్రుద్ధా సంలజ్జితా తదా|
భక్షగృధ్నేన కాకేన దారితా త్వాముపాగతా ||38.18||

స|| తదా క్రుద్ధా అహం అపహసితా | సంలజ్జితా భక్షగృధ్నేన కాకేన దారితా త్వాం ఉపాగతా ||

||శ్లోకార్థములు||

తదా క్రుద్ధా అహం అపహసితా -
అలా కోపములో ఉన్న నన్నుచూసి నవ్వితివి
సంలజ్జితా భక్షగృధ్నేన కాకేన దారితా -
తినాలనే కోరికగల కాకిచేత గీకబడి
త్వాం ఉపాగతా - నిన్ను చేరితిని

||శ్లోకతాత్పర్యము||

"కోపములో ఉన్న నేను అపహససించబడి సిగ్గుపడితిని. తినాలనే కోరికగల కాకిచేత గీకబడి నేను నీ ఆశ్రయమునకు చేరితిని."||38.18||

||శ్లోకము 38.19||

అసీనస్య చ తే శ్రాంతా పునరుత్సంగమావిశమ్|
క్రుధ్యంతీ చ ప్రహృష్టేన త్వయాsహం పరిసాంత్వితా ||39.19||

స|| శ్రాంతా ఆసీనస్య ఉత్సాంగం పునః ఆవిశం| కృధ్యంతి అహం ప్రహృష్టేన త్వయా పరిసాంత్వితా ||

||శ్లోకార్థములు||

శ్రాంతా ఆసీనస్య ఉత్సాంగం -
అలసి పోయి ఉపాసీనుడవైన నీ వడిలో
పునః ఆవిశం - మరల ప్రవేశించితిని
కృధ్యంతి అహం - క్రోధముతో ఉన్న నేను
ప్రహృష్టేన త్వయా పరిసాంత్వితా -
నవ్వుతూ నీ చేత ఊరడించిబడితిని

||శ్లోకతాత్పర్యము||

"అలసి పోయి ఉపాసీనుడవైన నీ వడిలో మరల ప్రవేశించితిని. క్రోధముతో ఉన్న నేను నవ్వుతూ నీ చేత ఊరడించిబడితిని." ||39.19||

||శ్లోకము 38.20||

భాష్పపూర్ణ ముఖీ మందం చక్షుషీ పరిమార్జతీ|
లక్షితాsహం త్వయా నాథ వాయసేన ప్రకోపితా||39.20||

స|| హే నాథ వాయసేన ప్రకోపితా బాష్పపూర్ణముఖీ మందం చక్షుషీ పరిమార్జతీ అహం త్వయా లక్షితా ||

||శ్లోకార్థములు||

హే నాథ వాయసేన ప్రకోపితా -
ఓ నాధ ! వాయసముచేత ప్రకోపింపబడిన
బాష్పపూర్ణముఖీ -
భాష్పములతో నిండిన ముఖము కల
మందం చక్షుషీ పరిమార్జతీ -
మెల్లిగా కళ్ళను తుడుచుకొనుచున్న
అహం త్వయా లక్షితా-
నేను నీచేత చూడబడితిని

||శ్లోకతాత్పర్యము||

"ఓ నాధ ! వాయసముచేత ప్రకోపింపబడిన భాష్పములతో నిండిన ముఖము కల నాక్రోధమును నీవు చూచితివి."||39.20||

||శ్లోకము 38.21||

పరిశ్రమాత్ ప్రసుప్తాచ రాఘవాంకేఽప్యహం చిరమ్|
పర్యాయేణ ప్రసుప్తశ్చ మమాంకే భరతాగ్రజః ||38.21||
స తత్ర పునరే వాథ వాయసః సముపాగమత్

స|| అహం అపి పరిశ్రమాత్ రాఘవాంకే చిరం ప్రసుప్తా చ | పర్యాయేణ భరతాగ్రజః మమ అంకే ప్రసుప్తః || అథ స వాయసః పునరేవ తత్ర సముపాగమత్ |

||శ్లోకార్థములు||

అహం అపి పరిశ్రమాత్ -
నేను కూడా ఆ శ్రమతో
రాఘవాంకే చిరం ప్రసుప్తా చ -
రాఘవుని అంగములలో చాలాసేపు నిద్రపోయితిని
పర్యాయేణ భరతాగ్రజః -
మరల భరతాగ్రజుడు
మమ అంకే ప్రసుప్తః -
నా అంగములలో నిద్రపోయెను
అథ స వాయసః పునరేవ -
అప్పుడు ఆ వాయసము మరల
తత్ర సముపాగమత్ - అచటికే వచ్చెను

||శ్లోకతాత్పర్యము||

"నేనుకూడా ఆ శ్రమతో రాఘవుని అంగములలో చాలాసేపు నిద్రపోయితిని. మరల భరతాగ్రజుడు నా అంగములలో నిద్రపోయెను. అప్పుడు ఆ వాయసము మరల అచటికే వచ్చెను." ||38.21||

||శ్లోకము 38.22, 23||

తతః సుప్త ప్రబుద్ధాం మాం రామస్యాంకాత్ సముత్థితమ్ ||38.22||
వాయసః సహసాగమ్య విదదార స్తనాంతరే |
పునః పునరథోత్పత్య విదదార స మాం భృశమ్ ||38.23||

స|| తతః సః వాయసః సహసా ఆగమ్య సుప్తప్రబుద్ధాం రామస్య అంకాత్ సముత్థితాం మామ్ స్తనాంతరే విదదార| అథ పునః ఉత్పత్య మాం భృశం విదదార ||

||శ్లోకార్థములు||

తతః సః వాయసః సహసా ఆగమ్య -
అప్పుడు ఆ వాయసము వెంటనే వచ్చి
సుప్తప్రబుద్ధాం రామస్య అంకాత్ సముత్థితాం -
నిద్రించి రాముని అంగములనుంచి లేచిన
మామ్ స్తనాంతరే విదదార -
నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను
అథ పునః ఉత్పత్య -
అది మళ్ళీ ఎగిరి
మాం భృశం విదదార -
నన్ను మళ్ళీ మళ్ళీ పొడిచెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ వాయసము వెంటనే వచ్చినిద్రించి రాముని అంగములనుంచి లేచిన నా స్తనముల మధ్య తన ముక్కుతో పొడిచెను. అది మళ్ళీ ఎగిరి నన్ను మళ్ళీ పొడిచెను". ||38.22,23||

||శ్లోకము 38.24||

తతః సముత్‍క్షితో రామో ముక్తైః శోణితబిందుభిః |
వాయసేన తతస్తేన బలవత్ క్లిశ్యమానయా ||38.24||
స మయా బోధితః శ్రీమాన్ సుఖసంతప్తః పరంతపః |

స|| తతః రామః ముక్తైః శోణిత బిందుభిః సముక్షితః | తతః తేన వాయసేన బలవత్ క్లిస్యమానయా మయా శ్రీమాన్ పరంతపః సుఖసుప్తః సః బోధితః|

||శ్లోకార్థములు||

తతః రామః - అప్పుడు రాముడు
ముక్తైః శోణిత బిందుభిః సముక్షితః -
మీద పడుచున్న రక్త బిందువులతో తడిసెను
తతః తేన వాయసేన బలవత్ క్లిస్యమానయా -
ఆ వాయసముచేత బలవత్తరముగా బాధింపబడుతున్న
మయా శ్రీమాన్ పరంతపః -
నా చేత శతృవులను తపించు శ్రీమంతుడు
సుఖసుప్తః -
సుఖముగా నిద్రలో నున్న
సః బోధితః- అతడు లేపబడెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు రాముడు మీద పడుచున్న రక్త బిందువులతో తడిసెను. అప్పుడు ఆ వాయసముచేత బలవత్తరముగా బధింపబడుతున్న నాచేత శతృవులను తపించు సుఖముగా నిద్రలో నున్న శ్రీమాన్ కి లేపబడెను." ||38.24||

||శ్లోకము 38.25||

స మాం దృష్ట్వా మహాబాహుర్వితున్నాం స్తనయోః తదా ||38.25||
అశీవిష ఇవ క్రుద్ధః శ్వసన్ వాక్య మభాషత|

స|| మహాబాహుః సః తదా స్తనయోః వితున్నాం మాం దృష్ట్వా కృద్ధః ఆశీవిషైవ శ్వసన్ వాక్యం అభాషత ||

||శ్లోకార్థములు||

మహాబాహుః సః -
మహాబాహువులు కల అతడు
తదా స్తనయోః వితున్నాం -
స్తనములపై గాయపరచబడిన
మాం దృష్ట్వా కృద్ధః -
నన్నుచూచి కోపముతో
ఆశీవిషైవ శ్వసన్ వాక్యం అభాషత-
విషముక్రక్కుచున్న పాము వలె బుసలు కొట్టుతూ ఇట్లు పలికితివి

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాబాహువులు కల అతడు స్తనములప్పై గాయపరచబడిన నన్నుచూచి, కోపముతో విషముక్రక్కుచున్న పాము వలె బుసలు కొట్టుతూ ఇట్లు పలికితివి." ||38.25||

||శ్లోకము 38.26||

కేన తే నాగ నాసోరు విక్షతం వై స్తనాంతరమ్ ||38.26||
కః క్రీడతి స రోషేణ పంచ వక్త్రేణ భోగినా|

స|| నాగనాసోరు సీతా స్తనాంతరం కేన విక్షతం వై సరోషేణ పంచవక్త్రేణ భోగినా కః క్రీడతి ||

||శ్లోకార్థములు||

నాగనాసోరు సీతా -
ఓ నాగనాసోరూ సీతా
స్తనాంతరం కేన విక్షతం వై -
స్తనముల మధ్య లో గాయము చేసిన వాడెవడు
సరోషేణ పంచవక్త్రేణ భోగినా -
కోపించిన ఇదుతలలగల పాముతో
కః క్రీడతి -
ఎవడు ఆడగోడుచున్నాడు

||శ్లోకతాత్పర్యము||

"ఓ నాగనాసోరూ ! సీతా నీ స్తనముల మధ్య లో గాయము చేసిన వాడెవడు. కోపించిన ఇదుతలలగల పాముతో ఎవడు ఆడగోడుచున్నాడు?" ||38.26||

||శ్లోకము 38.27||

వీక్షమాణః తతః తం వై వాయసం సముదైక్షత ||38.27||
నఖైః సరుధిరైః తీక్ష్‍ణైర్మామేవాభిముఖం స్థితమ్|

స|| తతః వీక్షమాణః సరుధిరైః తీక్షణైః నఖైః మామేవ అభిముఖం స్థితం తం వాయసం సముదేక్షత వై ||

||శ్లోకార్థములు||

తతః వీక్షమాణః -
అలా చూస్తూ వున్న
సరుధిరైః తీక్షణైః నఖైః -
తీక్షణమైన రక్తసిక్తమైన గోళ్లతో
మామేవ అభిముఖం స్థితం -
నాకు ఎదురుగా నిలబడి వున్న
తం వాయసం సముదేక్షత వై -
అ వాయసమును చూచితివి

||శ్లోకతాత్పర్యము||

"అలా చూస్తూ వున్న తీక్షణమైన రక్తసిక్తమైన గోళ్లతో నాకు ఎదురుగా నిలబడి వున్న అ వాయసమును చూచితివి." ||38.27||

||శ్లోకము 38.28||

పుత్రః కిల స శక్రస్య వాయసః పతతాం వరః ||38.28||
ధరాంతరగతః శీఘ్రం పవనస్య గతౌ సమః |

స|| పతతాం వరః సః వాయసః శక్రస్య పుత్రః కిల ధరాంతరగతః శీఘ్రం గతౌ పవనస్య సమః||

తిలక టీకాలో - కో సా ఏవం విధో వాయస ఇతి హనుమతః శఙ్కాం దూరీకుర్వతి ఆహ పుత్రేతి । శక్ర పుత్రో జయన్తః స తు వాయసః వాయసరూపధారీ ఇత్యర్థః। ధరాన్తర గతౌ భూమి బిలం ప్రాప్తః। శీఘ్రగతౌ పవనస్య సమః।

రామ టీకాలో - గతౌ పవనస్య సమః అత ఏవ శీఘ్రం ధరాన్తరం గతౌ వాయసః శక్రస్య పుత్రః ఏతేన రామ పరాక్రమ పరీక్షార్థం శక్రప్రేరణయైవాయ ఆగతః ఇతి ధ్వనితమ్॥

||శ్లోకార్థములు||

పతతాం వరః సః వాయసః -
ఎగురువానిలో శ్రేష్ఠుడు అగు ఆ వాయసము
శక్రస్య పుత్రః కిల -
ఇంద్రుని పుత్రుడు
ధరాంతరగతః -
భూమిపై దిగి వచ్చిన వాడు
శీఘ్రం గతౌ పవనస్య సమః -
శీఘ్రముగా గతిలో వాయుసమానుడు

||శ్లోకతాత్పర్యము||

"ఎగురువానిలో శ్రేష్ఠుడు ఆ వాయసము ఇంద్రుని పుత్రుడు. శీఘ్రముగా భూమిపై దిగి వచ్చిన వాడు. గతిలో వాయుసమానుడు." ||38.28||

ఇంద్రుని పుత్రుడు జయంతుడు వాయసరూపములో వచ్చెనను అని ఒకమాట చెప్పబడినది తిలక టీకాలో; రామ టీకాలో ఇంద్రునిచేత పేరేపింపబడి రాముని పరాక్రమము పరీక్షించుటకు వాయస రూపములో వచ్చిన ఇంద్రుని పుత్రుడు అని ఒక మాట.

||శ్లోకము 38.29||

తతః తస్మిన్ మహాబాహుః కోపసంవర్తితేక్షణః||38.29||
వాయసే కృతవాన్ క్రూరాం మతిం మతిమతాం వరః|

స|| తతః మతిమతాం వరః మహాబాహుః కోపసంవర్తితేక్షణః తస్మిన్ వాయసే క్రూరాం మతిం కృతవాన్ ||

||శ్లోకార్థములు||

తతః మతిమతాం వరః -
అప్పుడు బుద్ధికలవారిలో శ్రేష్ఠుడు
మహాబాహుః కోపసంవర్తితేక్షణః -
మహాబాహువులు కల వాడు కోపముతో నిండిన కళ్లతో
తస్మిన్ క్రూరాం వాయసే -
ఆ కౄరమైన వాయసముపై
మతిం కృతవాన్ - ఆలోచించితివి

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు మహాబాహువులు కల వాడు బుద్ధికలవారిలో శ్రేష్ఠుడు కోపముతో నిండిన కళ్లతో ఆ కౄరమైన వాయసముపై ఆలోచించితివి." ||38.29||

||శ్లోకము 38.30||

స దర్భం సంస్తరాత్ గృహ్య బ్రాహ్మేణాస్త్రేణ యోజయత్||38.30||
స దీప్త ఇవ కాలాగ్నిర్జజ్వాలాభిముఖో ద్విజమ్|

స|| సః సంస్తరాత్ దర్భం గృహ్య బ్రాహ్మేణ అస్త్రేణ యోజయత్ | సః దీప్తః కాలాగ్నిరివ ద్విజం అభిముఖః జజ్వాల||

||శ్లోకార్థములు||

సః సంస్తరాత్ దర్భం గృహ్య -
దర్భాసనమునుండి ఒక దర్భను తీసికొని
బ్రాహ్మేణ అస్త్రేణ యోజయత్ -
బ్రహ్మ అస్త్రముగా ప్రయోగించితివి
సః దీప్తః కాలాగ్నిరివ -
ఆ అస్త్రము కాలాగ్నివలె
ద్విజం అభిముఖః జజ్వాల -
ఆ వాయసమునకు అభిముఖమై ప్రజ్వరిల్లసాగెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు దర్భాసనమునుండి ఒక దర్భను తీసికొని బ్రహ్మ అస్త్రముగా ప్రయోగించితివి. ఆ అస్త్రము కాలాగ్నివలె మండుచూ ఆ వాయసమునకు అభిముఖమై ప్రజ్వరిల్లసాగెను." ||38.30||

||శ్లోకము 38.31||

స తం ప్రదీప్తం చిక్షేప దర్భం తం వాయసం ప్రతి||38.31||
తతః తం వాయసం దర్భస్సోంబరేనుజగామ హ|

స|| సః ప్రదీప్తం తం దర్భం తం వాయసం ప్రతి చిక్షేప | తతః సః దర్భః తం వాయసం అంబరే అనుజగామ హ||

||శ్లోకార్థములు||

సః ప్రదీప్తం తం దర్భం -
ఆ మండుచున్న దర్భను
తం వాయసం ప్రతి చిక్షేప -
ఆ వాయసముపై ప్రయోగించితివి
తతః సః దర్భః తం వాయసం -
అప్పుడు ఆ దర్భ ఆ వాయసమును
అంబరే అనుజగామ హ -
ఆకాశములో అనుసరించసాగెను.

||శ్లోకతాత్పర్యము||

"ఆ మండుచున్న దర్భను ఆ వాయసముపై ప్రయోగించితివి. అప్పుడు ఆ దర్భ ఆ వాయసమును ఆకాశములో అనుసరించసాగెను." ||38.31||

||శ్లోకము 38.32||

అనుశ్రుష్టః తదా కాకో జగామ వివిధాం గతిమ్ ||38.32||
లోకకామ ఇమం లోకం సర్వం వై విచచార హ |

స|| తదా కాకః అనుశ్రుష్టః వివిధం గతిం జగామ | లోకకామః ఇమం సర్వం లోకం విచచార హ ||

||శ్లోకార్థములు||

తదా కాకః అనుశ్రుష్టః -
అప్పుడు ఆ కాకి అనుసరించబడినదై
వివిధం గతిం జగామ -
అనేకమైన ప్రదేశములు వెళ్ళెను
లోకకామః ఇమం సర్వం లోకం విచచార హ -
తనప్రాణ రక్షణకోసము అన్ని లోకములనూ గాలించెను.

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ కాకి అనుసరించబడినదై అనేకమైన ప్రదేశములు వెళ్ళెను. తనప్రాణ రక్షణకోసము అన్ని లోకములనూ గాలించెను." ||38.32||

||శ్లోకము 38.33||

స పిత్రా చ పరిత్యక్తః సురైశ్చ సమహర్షిభిః ||38.33||
త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య తమేవ శరణం గతః |

స|| సః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య పిత్రా చ సమహర్షిభీ సురైశ్చ పరిత్యక్తః తమేవ శరణం గతః ||

||శ్లోకార్థములు||

సః త్రీన్ లోకాన్ సంపరిక్రమ్య -
ఆ వాయసము ముల్లోకములను తిరిగి
పిత్రా చ సమహర్షిభీ సురైశ్చ పరిత్యక్తః -
తండ్రి అలాగే మహర్షులచేత తిరస్కరింపబడిన వాడై
తమేవ శరణం గతః - నిన్నే శరణు కోరెను.

||శ్లోకతాత్పర్యము||

" ఆ వాయసము ముల్లోకములను తిరిగి తండ్రి అలాగే మహర్షులచేత తిరస్కరింపబడిన వాడై నిన్నే శరణు కోరెను". ||38.33||

||శ్లోకము 38.34,35||

స నిపతితం భూమౌ శరణ్యః శరణాగతమ్ ||34||
వధార్హమపి కాకుత్‍స్థః కృపయా పర్యపాలయత్ ||35||

స|| శరణ్యః స కాకుత్‍స్థః శరణాగతం భూమౌ నిపతితాం తం వధార్హం అపి కృపయా పర్యపాలయత్ ||

||శ్లోకార్థములు||

శరణ్యః స కాకుత్‍స్థః -
శరణుకోరబడిన ఆ కాకుత్‍స్థుడు
శరణాగతం భూమౌ నిపతితాం -
శరణాగతుడై భూమిపై పడివున్న
తం వధార్హం అపి కృపయా పర్యపాలయత్ -
వధార్హుడైనప్పటికీ దయతో కాపాడితివి

||శ్లోకతాత్పర్యము||

"శరణుకోరబడిన ఆ కాకుత్‍స్థుడు , శరణాగతుడై భూమిపై పడివున్న అ వాయసమును వధార్హుడైనప్పటికీ దయతో కాపాడితివి." ||38.34,35||

||శ్లోకము 38.36||

పరిద్యూనం విషణ్ణం చ స త మాయాంతం అబ్రవీత్ |
మోఘం కర్తుం న శక్యం తు బ్రాహ్మమస్త్రం తదుచ్యతామ్ ||38.36||

స|| సః పరిద్యూనం విషణ్ణం ఆయాంతం తం అబ్రవీత్ | బ్రహ్మం అస్త్రం మోఘం కర్తుం న శక్యం తు | తత్ ఉచ్యతామ్||

||శ్లోకార్థములు||

పరిద్యూనం విషణ్ణం ఆయాంతం-
అలిసిపోయి విషణ్ణ వదనముతో వచ్చిన
సః తం అబ్రవీత్ -
ఆ వాయసముతో ఇట్లు పలికితివి
బ్రహ్మం అస్త్రం మోఘం కర్తుం న శక్యం తు-
ప్రయోగింపబడిన బ్రహ్మ అస్త్రమును నిరర్ధకము చేయుట శక్యము కాదు
తత్ ఉచ్యతామ్ -
ఏమి చేయవలనో చెప్పుము

||శ్లోకతాత్పర్యము||

"అలిసిపోయి విషణ్ణ వదనముతో వచ్చిన ఆ వాయసముతో ఇట్లు పలికితివి. ' ప్రయోగింపబడిన బ్రహ్మ అస్త్రమును నిరర్ధకము చేయుట శక్యము కాదు. ఏమి చేయవలనో చెప్పుము' అని" ||38.36||

||శ్లోకము 38.37||

హినస్తు దక్షిణాక్షి త్వచ్ఛర ఇత్యథ సోబ్రవీత్ |
తతః తస్యాక్షి కాకస్య హినస్తి స్మ స దక్షిణమ్ ||
దత్వా స దక్షిణం నేత్రం ప్రాణేభ్యః పరిరక్షితం ||37||

స||అథ సః అబ్రవీత్ త్వత్ శరః దక్షినాక్షి హినస్తు ఇతి | తతః సః తస్య కాకస్య దక్షిణం అక్షి హినస్తి స్మ| సః దక్షిణమ్ దత్వా ప్రాణేభ్యః పరిరక్షితః ||

||శ్లోకార్థములు||

అథ సః అబ్రవీత్ -
అప్పుడు ఆ వాయసము చెప్పెను
త్వత్ శరః దక్షినాక్షి హినస్తు ఇతి -
నీ శరము నా కుడికన్నును నిరర్ధకము చేయుగాక
తతః సః తస్య కాకస్య-
అప్పుడు ఆ వాయసముయొక్క
దక్షిణం అక్షి హినస్తి స్మ -
కుడికన్ను నిరర్ధకము చేయబడినది
సః దక్షిణమ్ దత్వా -
ఆ వాయసము అలా కుడి కన్ను ఇచ్చి
ప్రాణేభ్యః పరిరక్షితః -
తన ప్రాణములను రక్షించుకొనెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ వాయసము చెప్పెను. " నీ శరము నా కుడికన్నును నిరర్ధకము చేయుగాక' అని. అప్పుడు ఆ వాయసముయొక్క కుడికన్ను నిరర్ధకము చేయబడినది. ఆ వాయసము అలా కుడి కన్ను ఇచ్చి తన ప్రాణములను రక్షించుకొనెను." ||38.37||

||శ్లోకము 38.38||

స రామాయా నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ చ |
విసృష్టేన వీరేణ ప్రతిపేదే స్వమాలయమ్ ||38.38||

స|| సః రామాయ నమస్కృత్వా రాజ్ఞే దశరథాయ తేన వీరేణ విశృష్టః చ స్వం ఆలయమ్ ప్రతిపేదే |

||శ్లోకార్థములు||

సః రామాయ నమస్కృత్వా -
పిమ్మట ఆ వాయసము రామునకు నమస్కరించి
రాజ్ఞే దశరథాయ చ -
దశరథునకు నమస్కరించి
తేన వీరేణ విశృష్టః -
ఆ వీరుని ఆజ్ఞతో
స్వం ఆలయమ్ ప్రతిపేదే -
తన నివాసమునకు తరలి పోయెను

||శ్లోకతాత్పర్యము||

"పిమ్మట ఆ వాయసము రామునకు నమస్కరించి దశరథునకు నమస్కరించి ఆ వీరుని ఆజ్ఞతో తన నివాసమునకు తరలి పోయెను." ||38.38||

రామ టీకాలో - స ఇతి। తేన రామేణ విసృష్ఠః త్యక్తః స వాయసః రామాయ నమస్కృత్వా స్వర్గే దశరథాయ దశరథమనుకూలయితుం నమస్కృత్వా స్వమాలయం ప్రతిపేదే। దశరథం నమస్కృత్వేతి అనేన పలాయన సమయే దశరథోపదేశాదేవ రామశరణాగతం ఇతి ధ్వనితం

అంటే రాముని చేత విడుదల చేయబడిన వాయసము దశరథునికి నమస్కరించి వెళ్ళెను అని చెప్పడములో , వాయసము పలాయయన సమయములో ఇంద్రుడు తదితరులచే త్యజింపబడినా, దశరథుడు వాయసానికి రాముని శరణుకోరమని ఉపదేశము ఇచ్చెను కనుక అని ధ్వనిస్తుంది అంటారు. రక్షకత్వము అంటే శరణాగతులను రక్షింపడము అన్నది వంశపారంపర్యముగా వచ్చుచున్న సుగుణము అని కూడా ధ్వని.

గోవిన్దరాజులవారు తమ టీకాలో - దశరథాయ స్వలోకస్థతయా పూర్వమేవ మిత్రాయ ఇతి। అంటే తనలోకములోనే( స్వర్గములోనే) వున్నాడు కనుక, పూర్వపు మిత్రత్వము వలన నమస్కారము చెప్పాడు అని।

||శ్లోకము 38.39||

మత్కృతే కాకమాత్రేతు బ్రహ్మాస్త్రం సముదీరితమ్ |
కస్మాద్యోమా హరేత్ త్వత్తః క్షమసే తం మహీపతే ||39||

స|| మహీపతే మత్కృతే కాకమాత్రే బ్రహ్మాస్త్రం సముదీరితం త్వత్తః మాం యః అహరన్ తం కస్మాత్ క్షమసే ||

రామ టీకాలో - మత్కృతే మత్ పరితోషార్థం ; నాకోసము అంటే నన్ను సంతోషపెట్టడానికి అని

||శ్లోకార్థములు||

మహీపతే మత్కృతే -
ఓ రాజా నా కోసము
కాకమాత్రే బ్రహ్మాస్త్రం సముదీరితం -
కాకి మీదనే బ్రహ్మాస్త్రము ప్రయోగించిన
త్వత్తః మాం యః అహరన్ -
నీవు నన్ను ఎవరు అపహరించెనో
తం కస్మాత్ క్షమసే-
వానిని ఎందుకు క్షమిస్తున్నావు?

||శ్లోకతాత్పర్యము||

"ఓ రాజా ! నన్ను బాధించిన ఆ వాయసముపై బ్రహ్మాస్త్రము ప్రయోగించిన నీవు, నన్ను అపహరించిన వానిని ఎందుకు క్షమిస్తున్నావు?" ||38.39||

||శ్లోకము 38.40||

స కురుష్వ మహోత్సాహః కృపాం మయి నరర్షభ |
త్వయా నాథవతీ నాథ హ్యనాథా ఇవ దృశ్యతే ||40||

స|| నరర్షభ స మహోత్సాహః మయి కృపాం కురుష్వ| నాథ త్వయా నాథవతీ అనాథా ఇవ దృశ్యతే ||

||శ్లోకార్థములు||

నరర్షభ స మహోత్సాహః-
ఓ నరర్షభ ! మహోత్సాహముతో
త్వయా మయి కృపాం కురుష్వ -
నాపై నీ చేత దయచూపబడుగాక
నాథ నాథవతీ -
ఓ నాధా, నాధకల
అనాథా ఇవ దృశ్యతే-
అనాధవలె కనపడుచున్నది

||శ్లోకతాత్పర్యము||

"ఓ నరర్షభ ! మహోత్సాహముతో నాపై నీచేత దయచూపబడుగాక. ఓ నాధా ! నాధ కల నేను అనాధవలె కనపడుచున్నాను". ||38.40||

రామ టీకాలో- సః సదా మత్పరితోషకత్వం మహోత్సాహి అత్యుత్సాహవిశిష్ఠాం మయి కృపాం కురుష్వ తత్త్ర హేతుః త్వయ్యైవ నాథవతీ అనాథా దృశ్యతే । - అంటే నాకు పారితోషకముగా అత్యుత్సాహముతో దయ చూపుము; దానికి హేతువు నేను నీవు నాథుడుగావున్నా అనాధలాగా కనిపిస్తున్నాను

||శ్లోకము 38.41,42||

అనృశంస్యం పరో ధర్మః త్వత్త ఏవ మయా శ్రుతః |
జానామి త్వాం మహావీర్యం మహోత్సాహం మహాబలమ్ ||38.41||
అపారపార మక్షోభ్యం గాంభీర్యాత్ సాగరోపమమ్ |
భర్తారం ససముద్రాయా ధరణ్యా వాసవోఽపమమ్ ||38.42||

స|| అనృశంస్యం పరః ధర్మః మయా త్వత్తః ఏవ శ్రుతః | త్వం మహావీర్యం మహోత్సాహం మహాబలం అపారపారం అక్షోభ్యం గంభీర్యాత్ సాగరోపమం సముద్రాయాః ధరణ్యాః భర్తారం వాసవోపమం జానామి ||

||శ్లోకార్థములు||

అనృశంస్యం పరః ధర్మః-
కరుణయే పరమమైన ధర్మము అని
మయా త్వత్తః ఏవ శ్రుతః -
నీ దగ్గరనుంచే నాచేత వినబడినది
మహావీర్యం మహోత్సాహం మహాబలం -
మహావీరుడవు మహోత్సాహముకల మహాబలుడవు
అపారపారం అక్షోభ్యం -
దాటలేనివానిని దాటగల, క్షోబలేని
గంభీర్యాత్ సాగరోపమం -
గంభీరములో సముద్రము వంటి
సముద్రాయాః ధరణ్యాః భర్తారం -
సముద్రములకు ధర్తికి భర్త అయిన
వాసవోపమం త్వం జానామి-
ఇంద్రునితో వసమానమైనవాడివి అని నాకు తెలుసు

||శ్లోకతాత్పర్యము||

"ఇతరుల శోకమును శమింపచేయుట ధర్మము అని నీ దగ్గరనుంచే నాచేత వినబడినది. నీవు మహావీరుడవు మహోత్సాహముకల మహాబలుడవు. అసాధ్యమైన వాటిని సాధ్యము చేయువాడవు. సముద్రము వలె గంభీరుడవు. ధరణికి భర్త. ఇంద్రుని తో సమానుడవు అని నాకు తెలుసు". ||38.41,42||

"అనృశంస్యం పరః ధర్మః" అన్నమాట అరణ్యకాండలో సీతమ్మతో అన్నమాట అని గోవిన్దరాజులవారి టీకాలో.

||శ్లోకము 38.43||

ఏవమస్త్రవిదాం శ్రేష్ఠః సత్వవాన్ బలవానపి |
కిమర్థం అస్త్రం రక్షస్సు న యోజయతి రాఘవః ||38.43||

స|| రాఘవ ఏవం అస్త్రవిదాం శ్రేష్ఠః సత్యవాన్ బలవాన్ అపి రక్షస్సు అస్త్రం కిమర్థం న యోజసి ||

||శ్లోకార్థములు||

రాఘవ ఏవం అస్త్రవిదాం శ్రేష్ఠః -
ఓ రాఘవా అస్త్రములు ప్రయోగించువారిలో శ్రేష్ఠుడవు
సత్యవాన్ బలవాన్ అపి -
సత్యసంధుడు మహాశక్తిగలవాడవు
రక్షస్సు అస్త్రం -
రాక్షసులపై అస్త్రములను
కిమర్థం న యోజసి -
ఎందుకు ప్రయోగించవు.

||శ్లోకతాత్పర్యము||

"ఓ రాఘవా అస్త్రములు ప్రయోగించువారిలో శ్రేష్ఠుడవు బలవంతుడవు అయి ఈ రాక్షసులపై ఎందుకు అస్త్రములను ప్రయోగించవు."||38.43||

||శ్లోకము 38.44||

న నాగ నాపి గంధర్వా నాసురా న మరుద్గణాః ||44||
రామస్య సమరే వేగం శక్తాః ప్రతిసమాధితుమ్ |

స||సమరే రామస్యవేగం ప్రతిసమాధితుం న నాగాః న గంధర్వా న సురాః న మరుద్గణాః అపి శక్తాః ||

||శ్లోకార్థములు||

సమరే రామస్యవేగం ప్రతిసమాధితుం -
సమరములో రాముని ధాటికి నిలబడుటకు
న నాగాః న గంధర్వా న సురాః -
నాగులు గంధర్వులు సురులు
న మరుద్గణాః అపి శక్తాః -
మరుద్గణములు కూడా సమర్థులు కారు

||శ్లోకతాత్పర్యము||

"సమరములో రాముని ధాటికి నిలబడుటకు నాగులు గంధర్వులు సురులు మరుద్గణములు కూడా సమర్థులు కారు."||38.44||

||శ్లోకము 38.45||

తస్య వీర్యవతః కశ్చిత్ యద్యస్తి మయి సంభ్రమః ||38.45||
కిమర్థం న శరైః తీక్ష్‍ణైః క్షయం నయతి రాక్షసాన్ |

స|| వీర్యవతః తస్య మయి కశ్చిత్ సంభ్రమః అస్తి యది తతః తీక్ష్‍ణైః బాణైః రాక్షసాన్ కిమర్థం క్షయం న నయతి ||

రామ టీకాలో - సంభ్రమః ఆదరః

||శ్లోకార్థములు||

వీర్యవతః - వీరుడైన రామునకు
తస్య మయి కశ్చిత్ సంభ్రమః అస్తి యది-
నాపై కించిత్తు ఆదరము వున్నా
తతః తీక్ష్‍ణైః బాణైః - తీక్షణమైన బాణములతో
రాక్షసాన్ కిమర్థం క్షయం న నయతి-
రాక్షసులను ఎందుకు నాశనము చేయుటలేదు?

||శ్లోకతాత్పర్యము||

"ఆ వీరుడైన రామునకు నాపై కించిత్తు దయవున్నా తీక్షణమైన బాణములతో రాక్షసులను ఎందుకు నాశనము చేయుటలేదు?"||38.45||

||శ్లోకము 38.46||

భ్రాతురాదేశమాదాయ లక్ష్మణోవా పరంతపః ||38.46||
కస్య హేతోర్నమాం వీరం పరిత్రాతి మహాబలః |

స|| పరంతపః మహాబలః వీరః లక్ష్మణో వా భ్రాతుః ఆదేశం ఆదాయా కస్యహేతోః మామ్ న పరిత్రాతి ||

||శ్లోకార్థములు||

పరంతపః మహాబలః వీరః -
పరంతపుడు మహాబలుడు వీరుడు అయిన
లక్ష్మణో వా భ్రాతుః ఆదేశం ఆదాయా -
లక్ష్మణుడు అన్నగారి ఆదేశముతో
కస్యహేతోః మామ్ న పరిత్రాతి -
ఎందుకు నన్ను రక్షించుట లేదు?"

||శ్లోకతాత్పర్యము||

"పరంతపుడు మహాబలుడు వీరుడు అయిన లక్ష్మణుడు అన్నగారి ఆదేశముతో ఎందుకు నన్ను రక్షించుట లేదు?" ||38.46||

||శ్లోకము 38.47||

యది తౌ పురుషవ్యాఘ్రౌ వాయ్వగ్నిసమ తేజసౌ ||38.47||
సురాణామపి దుర్దర్షౌ కిమర్థం మాముపేక్షతః |

స|| వాయ్వగ్నిసమతేజసౌ పురుషవ్యాఘ్రౌ తౌ సురాణాం దుర్ధర్షౌ యది అపి మాం కిమర్థం ఉపేక్షతః ||

||శ్లోకార్థములు||

వాయ్వగ్నిసమతేజసౌ -
వాయువు అగ్నితో సమానమైన తేజస్సుగల
పురుషవ్యాఘ్రౌ తౌ సురాణాం అపి దుర్ధర్షౌ యది -
పురుషవ్యాఘ్రము లగు వారిని సురులు కూడా ఎదురుకొనలేనప్పుడు
అపి మాం కిమర్థం ఉపేక్షతః-
నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నారు

||శ్లోకతాత్పర్యము||

"వాయువు అగ్నితో సమానమైన తేజస్సుగల పురుషవ్యాఘ్రము లగు వారిని సురులు కూడా ఎదురుకొనలేరు. వారు నన్ను ఎందుకు ఉపేక్షించుచున్నారు?" ||38.47||

||శ్లోకము 38.48||

మమైవ దుష్కృతం కించిన్మహదస్తి న సంశయః ||48||
సమర్థా వ పి తౌ యన్మాం నావేక్షేతే పరంతపౌ |

స||మమైవ మహత్ కించిత్ దుష్కృతం అస్తి |సంశయః న | యత్ సమర్థావపి పరంతపౌ తౌ మామ్ న ఆవేక్షేతే ||

||శ్లోకార్థములు||

మమైవ మహత్ కించిత్ దుష్కృతం అస్తి -
నాలో ఎదో మహత్తరమైన పాపము ఉన్నది
సంశయః న - సంశయము లేదు
యత్ సమర్థావపి పరంతపౌ తౌ మామ్ న ఆవేక్షేతే -
సమర్ధులైనాగాని ఆ పరంతపులు నన్ను ఉపేక్షించుచున్నారు

||శ్లోకతాత్పర్యము||

"నాలో ఎదో మహత్తరమైన పాపము ఉన్నది. సంశయము లేదు. సమర్ధులైనాగాని ఆ పరంతపులు నన్ను ఉపేక్షించుచు." ||38.48||

గోవిన్దరాజులవారు తమ టీకాలో ఇలా వ్యాఖ్యానిస్తారు- పరాక్రమములో సాటి ఎవ్వరూ లేరు అని అయినా తన స్థితిని గురించి నిర్లక్ష్యము ఎందుకు చేస్తున్నారు అని చెప్పి ఇక్కడ దానికి కారణము తను ఎప్పుడో చేసిన దుష్కర్మయే అని ఇక్కడ చెపుతోఓది సీత అంటారు.

సీత తను "అల్ప పుణ్యా" అని , " కీదృశం పాపం పురా జన్మాంతరే కృతం" అని, ఇంతకు ముందుకూడా తనను తాను నిందించుకున్నది. ఇక్కడ హనుమంతునితో సంభాషణలో అదే మాట చెపుతుంది. చివరి మాటలో "ఎదో మహత్తరమైన పాపము నాదే" అనడములో ఇంకో ధ్వని వినిపిస్తుంది.

భగవంతుడే ఉపాయమని విశ్వశించియున్న భక్తులు, వారు తమకు కష్టములు ఏవైనా వచ్చినప్పుడు భగవంతుని దూషించుట, దెప్పుట చేయరు. ఆ కష్టములు వచ్చుటకు తాము చేసిన పాపమే కారణమనియు, భగవంతుడు ఆ కర్మను అనుభవింపచేసి తనను చేర్చుకొనుటకే అనుగ్రహించుచున్నాడని తలుస్తారు. అలాగే సీతకూడా తాను అనుభవించుచున్న కష్టాలకి తన పాపమే కారణమని అనుకుంటుంది.

ఆ పాపముల గురించి మాట్లాడుతూ సీత, "కించి మహత్ అస్తి" అంటే ఏదో పెద్దపాపమే చేశాను అనుకుంటుంది. అదే "కొద్దియో గొప్పయో నాపాపమే కారణము" అన్నమాటలో, పాపములను గురించి విశదీకరిస్తూ అప్పలాచార్యులవారు ఇలా చెపుతారు. భగవదపచారము కొద్ది పాపము. భాగవతాపచారము పెద్దపాపము. భగవంతుని విషయములో చేసే తప్పు కన్న, భగవంతుని భక్తులవిషయములో చేసే తప్పు పెద్ద అపచారము అని.

తండ్రిమాట నిలబెట్టుటకు వనవాసము పోబోతున్న రామునితో,
సీత తను వనవాసమునకు వస్తాను అని బ్రతిమాలి చివరికి ఇలా అంటుంది - " భార్యను అరణ్యమునకు తీసుకు వేళ్ళలేదని మా తండ్రి అగు జనకుడు విన్నచో, స్త్రీయే పురుషవేషమున వచ్చి తన కుమార్తెను వివాహమాడెను అని తలంచును" ఇలా చేసిన ఆక్షేపణలో సీత చేసినది అపచారమే. రాముడు భగవత్స్వరూపుడు ఇది భగవదపచారము, పాపము.

మాయామృగమును చంపుటకు రాముడు వెళ్ళి మారీచుని చంపగా , మారీచుడు " హా సీతా హా లక్ష్మణా" అని కేకవేసి చనిపోయెను. అప్పుడు సీత రాముని రక్షించుటకు వెళ్ళమని లక్ష్మణునితో చాలా పరుషముగా మాట్లాడును. అది భగవద్భక్తుడగు లక్ష్మణుని విషయములో చేసిన అపచారము. అది భాగవదపచారము. మహాపచారము. ఈ రెండింటినీ అనుభవించుచున్నానని సీత గుర్తించెను. ఈ రెండిటి ఫలమే బంధము.

||శ్లోకము 38.49||

వైదేహ్యా వచనం శ్రుత్వా కరుణం సాశ్రుభాషితమ్ ||38.49||
అథాబ్రవీన్మహాతేజా హనుమాన్మారుతాత్మజః |

స|| అథ మహాతేజా మారుతాత్మజః హనుమాన్ వైదేహ్యాః సాశ్రుభాషితం కరుణం వచనం శ్రుత్వా అబ్రవీత్ ||

||శ్లోకార్థములు||

వైదేహ్యాః సాశ్రుభాషితం కరుణం వచనం శ్రుత్వా-
వైదేహి యొక్క ఆ కన్నీరుతో పలికిన వచనములను వినిన
అథ మహాతేజా మారుతాత్మజః హనుమాన్ -
మహా తేజము కల మారుతాత్మజుడగు ఆ హనుమంతుడు
అబ్రవీత్ - ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"వైదేహి యొక్క ఆ కన్నీరుతో పలికిన వచనములను వినిన మహా తేజము కల ఆ హనుమంతుడు ఇట్లు పలికెను." ||38.49||

||శ్లోకము 38.50||

త్వచ్ఛోకవిముఖో రామో దేవి సత్యేన తే శపే ||38.50||
రామే దుఃఖాభిపన్నే చ లక్ష్మణః పరితప్యతే |

స|| దేవి రామః త్వత్ శోకవిముఖః | సత్యేన తే శపే |రామే దుఃఖాభిపన్నే లక్ష్మణః పరితప్యతే ||

తిలకటీకాలో - త్వత్ వియోగజ శోకేన (రామః) సర్వకార్యవిముఖః ।

||శ్లోకార్థములు||

దేవి రామః త్వత్ శోకవిముఖః -
ఓ దేవి నీ వియోగ శోకముతో రాముడు విషయములలో విముఖత చూపించుచున్నాడు
సత్యేన తే శపే -
సత్యముగా ప్రమాణము చేసి చెప్పుచున్నాను
రామే దుఃఖాభిపన్నే - రాముడు దుఃఖములో నుండుటవలన
లక్ష్మణః పరితప్యతే - లక్ష్మణుడు కూడా దుఃఖములో ఉన్నాడు.

||శ్లోకతాత్పర్యము||

"ఓ దేవి నీ వియోగ శోకముతో రాముడు విషయములలో విముఖత చూపించుచున్నాడు. సత్యముగా ప్రమాణము చేసి చెప్పుచున్నాను. రాముడు దుఃఖములో నుండుటవలన లక్ష్మణుడు కూడా దుఃఖములో ఉన్నాడు." ||38.50||

||శ్లోకము 38.51||

కథంచిత్ భవతీ దృష్టా న కాలః పరిశోచితుమ్ ||51||
ఇమం ముహూర్తం దుఃఖానాం ద్రక్ష్యస్యంతమనిందితే |

స|| కథంచిత్ భవతీ దృష్టా| పరిదేవితుం కాలః న| అనిందితే ఇమం ముహూర్తం దుఃఖానాం అంతం ద్రక్ష్యసి||

||శ్లోకార్థములు||

కథంచిత్ భవతీ దృష్టా -
ఎలాగో నీవు చూడబడినావు
పరిదేవితుం కాలః న -
విచారించవలసిన కాలము కాదు
అనిందితే ఇమం ముహూర్తం -
ఓ పూజ్యురాలా ఈ క్షణమే
దుఃఖానాం అంతం ద్రక్ష్యసి -
దుఃఖముల అంతము చూచెదవు

||శ్లోకతాత్పర్యము||

"ఎలాగో నీవు చూడబడినావు. ఇది విచారించవలసిన కాలము కాదు. ఓ పూజ్యురాలా ! ఈ క్షణమే దుఃఖముల అంతము చూచెదవు." ||38.51||

||శ్లోకము 38.52||

తావుభౌ పురుషవ్యాఘ్రౌ రాజపుత్రౌ మహాబలౌ ||52||
త్వద్దర్శన కృతోత్సాహౌ లంకాం భస్మీకరిష్యతః |

స|| పురుషవ్యాఘ్రౌ మహాబలౌ త్వత్ దర్శన కృతోత్సాహౌ ఉభౌ తౌ రాజపుత్రౌ లంకాం భస్మీకరిష్యతః||

||శ్లోకార్థములు||

త్వత్ దర్శన కృతోత్సాహౌ -
నీ దర్శనమునకై ఉత్సాహముతో
పురుషవ్యాఘ్రౌ మహాబలౌ -
మహాబలవంతులూ పురుషవ్యాఘ్రములు అగు
ఉభౌ తౌ రాజపుత్రౌ -
ఆ రాజపుత్రులు ఇద్దరూ
లంకాం భస్మీకరిష్యతః -
లంకానగరమును భస్మము చేసెదరు

||శ్లోకతాత్పర్యము||

"ఆ మహాబలవంతులూ పురుషవ్యాఘ్రములు అగు రాజపుత్రులు ఇద్దరూ నీ దర్శనము నకై ఉత్సాహముతో ఈ లంకానగరమును భస్మము చేసెదరు."||38.52||

||శ్లోకము 38.53||

హత్వా చ సమరే క్రూరం రావణం స బాంధవమ్ ||53||
రాఘవస్త్వాం విశాలాక్షి నేష్యతి స్వాం పురీం ప్రతి |

స|| విశాలాక్షీ రాఘవః సహబాంధవం కౄరం రావణం హత్వా స్వాం పురీం ప్రతి త్వాం నేష్యతి ||

||శ్లోకార్థములు||

విశాలాక్షీ - ఓ విశాలాక్షీ
సహబాంధవం కౄరం రావణం హత్వా -
కౄరుడైన రావణుని అతని బంధువులతో సహా హతమార్చి
రాఘవః స్వాం పురీం ప్రతి -
రాఘవుడు తన పురమునకు
త్వాం నేష్యతి - నిన్ను గొనిపోవును

||శ్లోకతాత్పర్యము||

"ఓ విశాలాక్షీ రాఘవుడు రావణుని అతని బంధువులతో సహా హతమార్చి నిన్ను తన పురమునకు తీసుకుపోవును". ||38.53||

||శ్లోకము 38.54||

బ్రూహి యద్రాఘవో వాచ్యో లక్ష్మణశ్చ మహాబలః ||54||
సుగ్రీవో వాపి తేజస్వీ హరయోsపి సమాగతః |

స|| రాఘవః యత్ వాచ్యః మహాబలః లక్ష్మణశ్చ తేజస్వీ సుగ్రీవో అపి సమాగతాః హరయో అపి బ్రూహి||

||శ్లోకార్థములు||

రాఘవః యత్ వాచ్యః బ్రూహి -
రాఘవునకు ఏమి మాటలు చెప్పవలెనో అవి నీవు చెప్పుము
మహాబలః లక్ష్మణశ్చ - మహాబలుడు లక్ష్మణునకు
తేజస్వీ సుగ్రీవో అపి సమాగతాః హరయో అపి -
తేజస్వి సుగ్రీవునకు అక్కడ సమాగమైన వానరులకు కూడా

||శ్లోకతాత్పర్యము||

"రాఘవునకు, మహాబలుడు లక్ష్మణునకు, తేజస్వి సుగ్రీవునకు అక్కడ సమాగమైన వానరులకు ఎమి మాటలు చెప్పవలెనో అవి నీవు చెప్పుము". ||38.54||

||శ్లోకము 38.55||

ఇత్యుక్తవతి తస్మింశ్చ సీతా సురసుతోపమా ||55||
ఉవాచ శోక సంతప్తా హనూమంతం ప్లవంగమమ్ |

స|| తస్మిన్ ఇత్యుక్తవతి సురసుతోపమా సీతా శోక సంతప్తా ప్లవంగమం హనుమంతం ఉవాచ||

||శ్లోకార్థములు||

తస్మిన్ ఇత్యుక్తవతి సురసుతోపమా -
ఈ విధముగా చెప్పబడిన, సురలతో సమానమైన
సీతా శోక సంతప్తా -
శోకములో ఉన్నఆ సీతా
ప్లవంగమం హనుమంతం ఉవాచ -
మారుతాత్మజుడగు హనుమంతునితో ఇట్లు పలికెను

||శ్లోకతాత్పర్యము||

"ఈ విధముగా చెప్పబడిన, శోకములో ఉన్న, సురలతో సమానమైన ఆ సీతా మారుతాత్మజుడగు హనుమంతునితో ఇట్లు పలికెను." ||38.55||

||శ్లోకము 38.56||


కౌసల్యా లోకభర్తారం సుషువే యం మనస్వినీ ||38.56||
తం మమార్థే సుఖమ్ పృఛ్చ శిరసా చాభివాదయ |

స|| లోకభర్తారం యం మనస్వినీ కౌసల్యా సుషువే తం మదర్థం సుఖం పృచ్ఛ శిరసా అభివాదయ చ సుఖమ్ పృఛ్చ ||

||శ్లోకార్థములు||

లోకభర్తారం - లోకము సంరక్షించుటకు
యం మనస్వినీ కౌసల్యా సుషువే -
మనస్విని అయిన కౌసల్య ఎవరిని జన్మనిచ్చెనో
తం మదర్థం శిరసా అభివాదయ చ-
వానికి నా కొఱకు శిరస్సు వంచి అభివాదము చేసి
సుఖమ్ పృఛ్చ- కుశలము అడుగుము

||శ్లోకతాత్పర్యము||

"లోకము సంరక్షించుటకు మనస్విని అయిన కౌసల్య ఎవరిని జన్మనిచ్చెనో వానికి నాకొఱకు శిరస్సు వంచి అభివాదము చేసి వారి కుశలము అడుగుము." ||38.56||

హనుంతుడు అడిగిన ప్రశ్నకు సమాధానముగా సీతమ్మ లోకసంరక్షణము కోసము కౌసల్య గర్భములో జనించిన రామునికి తన తరఫున శిరస్సు వంచి అభివాదము చేసి కుశలము అడగమంటుంది - అంటే లోకసంరక్షణకు పుట్టినరాముడు తన రక్షణ కూడా చేయవలసినవాడే. అట్టివానిని కుశలము అడగడములో అతని భార్య కుశలములు గుర్తుచేయడము అవుతుంది అని.

ఇక్కడ రాముని నమస్కరించి కుశలములు అడగమని చెపుతూ సీత, రాముడు లోకము సంరక్షించుటకు కౌసల్యాదేవికి పుట్టినవాడు అని అన్నప్పుడు, మనము వినే ధ్వని, 'ఓ లోకసంరక్షకా నీకు నమస్కరిస్తున్నాను నన్నుకూడా రక్షించు' అని. ఆ కుశలములు అడగడము నమస్కారములలోనే ఇమిడి యుంది సీతమ్మ ఆత్మ రక్షణ ఘోష.

భగవంతుడు ఉన్నాడు అని నమ్మి, 'నేను నావాడను కాను , నీ వాడను అని వంగి నమస్కరిస్తే' చాలును. భగవంతుడే ఆ భవసాగరమును దాటించును. ఇక్కడ సీతమ్మ చేస్తున్నది అదే.

సీత ఇంకా చెపుతుంది..

||శ్లోకము 38.57,58||

స్రజశ్చ సర్వరత్నాని ప్రియాయాశ్చ వరాంగనా ||57||
ఇశ్వర్యం చ విశాలాయాం పృథివ్యాం అపి దుర్లభమ్ |

పితరం మాతరం చైవ సమ్మాన్యాభిప్రసాద్యచ ||58||
అనుప్రవ్రజితో రామం సుమిత్రా యేన సుప్రజాః|

స||స్రజశ్చ సర్వరత్నాని ప్రియాః యాః వరాంగన్యాః విశాలాయాం పృథివ్యాం దుర్లభం ఇశ్వర్యే చాపి అభి ప్రసాద్య చ పితరం మాతరం చాపి సమ్మాన్య యేన సుమిత్రా సుప్రజాః రామం అనుప్రవ్రాజితః ||

రామ టీకాలో - 'యేన సుమిత్ర సుప్రజ శోభనపుత్రవతీ' అంటే ఎవరివలన సుమిత్ర శోభనపుత్రవతీ అనే పేరు పొందినదో ఆ లక్ష్మణుడు అని అర్థము.

ఇక్కడ లక్ష్మణుని కుశలము అడగడములో, "స్రజశ్చ సర్వ రత్నాని " అంటూ లక్ష్మణుని పొగుడుతూ చెప్పిన మాటలు, సీతమ్మ పూర్వవృత్తాంతము గుర్తుంచుకొని చెప్పిన మాటలు అని అంటారు టీకాత్రయములో వ్యాఖ్యాతలు. మారీచవధకి వెళ్ళిన రాముని వెనకాతల సహాయముగా లక్ష్మణుని పంపడానికి ఎన్నో పరుషవాక్యములు పలికిన సీత, తన మాటలతో లక్ష్మణునకు అపచారము చేసినదానను అని గ్రహించి, ఆ మాటలు నిరర్ధకము చేయడానికి చెప్పినదా అన్నట్లు, తనను తల్లివలె చూస్తాడు అంటూ లక్ష్మణుని కీర్తి ఇనుమడించే మాటలు చెపుతుంది ఇక్కడ.

||శ్లోకార్థములు||

యేన స్రజశ్చ సర్వరత్నాని -
ఎవరి చేత అన్ని రత్నములను
ప్రియాః యాః వరాంగన్యాః -
అనురాగవతులైన స్త్రీలను
విశాలాయాం పృథివ్యాం -
విశాలమైన పృథివినీ
దుర్లభం ఇశ్వర్యే చాపి స్రజశ్చ -
దుర్లభమైన ఇశ్వర్యమును త్యజించి
సుమిత్రా సుప్రజాః చ -
సుమిత్ర శోభనపుత్రవతియో
(సః) పితరం మాతరం చాపి సమ్మాన్య అభిప్రసాద్య-
తల్లి తండ్రులను గౌరవించి వారి అనుమతితో
రామం అనుప్రవ్రాజితః-
రాముని అనుసరించినవాడు

||శ్లోకతాత్పర్యము||

"ఎవరు పుష్పమాలికలనూ , అన్ని రత్నములను అనురాగవతులైన స్త్రీలను విశాలమైన పృథివినీ దుర్లభమైన ఇశ్వర్యమును త్యజించి, ఎవరివలన సుమిత్రను శోభనపుత్రవతియో అట్టి లక్ష్మణుడు, తల్లి తండ్రులను గౌరవించి వారి అనుమతితో రాముని అనుసరించినవాడు. ||38.57,58||

||శ్లోకము 38.59||

అనుకూల్యేన ధర్మాత్మా త్యక్త్వా సుఖమనుత్తమమ్ ||59||
అనుగచ్ఛతి కాకుత్‍స్థం భ్రాతరం పాలయన్ వనే |

స|| ధర్మాత్మా అనుత్తమం సుఖం త్యక్త్వా భ్రాతరం కాకుత్‍స్థం వనే ఆనుకూల్యేన పాలయన్ అనుగచ్ఛతి ||

||శ్లోకార్థములు||

ధర్మాత్మా అనుత్తమం సుఖం త్యక్త్వా-
ధర్మాత్ముడు , అత్యుత్తమమైన సుఖము ను త్యజించి
భ్రాతరం కాకుత్‍స్థం వనే -
అన్నగారైన కాకుత్‍స్థునికి వనములో
ఆనుకూల్యేన పాలయన్ అనుగచ్ఛతి -
అనుకూలముగా పాలించుటకు వెళ్ళెను

||శ్లోకతాత్పర్యము||

"లక్ష్మణుడు ధర్మాత్ముడు , అత్యుత్తమమైన సుఖము ను త్యజించి అన్నగారైన కాకుత్‍స్థుని కి తోడునీడగా వనములో వుండుటకు వెళ్ళెను." ||38.59||

లక్ష్మణుడు భ్రాతు ప్రేమ ఇక్కడ మళ్ళీ చెప్పబడినది

||శ్లోకము 38.60||

సింహస్కంధో మహాబాహుః మనస్వీ ప్రియదర్శనః ||38.60||
పితృవత్ వర్తతే రామే మాతృన్మాం సమాచరన్ |

స||సింహస్కంధః మహాబాహుః మనస్వి ప్రియదర్శనః మామ్ మాత్రువత్ సమాచరన్ రామే పిత్రువత్ వర్తతే||

||శ్లోకార్థములు||

సింహస్కంధః మహాబాహుః -
సింహపు స్కంధమువంటి స్కంధముకల, మహాబాహువులు కల
మనస్వి ప్రియదర్శనః -
మనస్వి, ప్రియదర్శనుడు
మామ్ మాత్రువత్ సమాచరన్ -
నన్ను కన్నతల్లిలాగ
రామే పిత్రువత్ వర్తతే -
రాముని కన్న తండ్రిలాగా చూచుకొనును

||శ్లోకతాత్పర్యము||

"సింహపు స్కంధమువంటి స్కంధముకల, మహాబాహువులు కల, మనస్వి, ప్రియదర్శనుడు. నన్ను కన్నతల్లిలాగ రాముని కన్న తండ్రిలాగా చూచుకొనును."||38.60||

ఇవన్నీ లక్ష్మణుని గుణముల వర్ణన.

||శ్లోకము 38.61,62||

హ్రియమాణాం తదా వీరో న తు మాం వేద లక్ష్మణః ||38.61||
వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తోన బహుభాషితా|
రాజపుత్త్రః ప్రియశ్రేష్ఠః సదృశః శ్వసురస్యమే ||38.62||

స|| వీరః లక్ష్మణః తదా మామ్ హ్రియమాణం న వేద వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తః న బహుభాషితా మే శ్వశురస్య సదృశః ప్రియః శ్రేష్ఠః రాజపుత్రః||

||శ్లోకార్థములు||

తదా వీరః లక్ష్మణః -
అప్పుడు వీరుడు లక్ష్మణునికి
మామ్ హ్రియమాణం న వేద -
నన్ను అపహరింపబడడము తెలియదు
వృద్ధోపసేవీ లక్ష్మీవాన్ శక్తః -
వృద్ధులని సేవించు సమర్థుడైన
న బహుభాషితా - మిత భాషి
ప్రియః శ్రేష్ఠః రాజపుత్రః -
ప్రియమనవాడు, శ్రేష్ఠుడు రాజపుత్రుడు
మే శ్వశురస్య సదృశః -
నాకు మామగారితో సమానుడు."

||శ్లోకతాత్పర్యము||

"వీరుడు లక్ష్మణుని కి నన్ను అపహరింపబడడము తెలియదు. వృద్ధులని సేవించు, వివేకముగల సమర్థుడైన అందరిమెప్పు పొందిన ఆ రాజకుమారుడు నా మామగారితో సమానుడు." ||38.61,62||

||శ్లోకము 38.63,64||

మమ ప్రియతరో నిత్యం భ్రాతా రామస్య లక్ష్మణః |
నియుక్తో ధురి యస్యాం తు తాముద్వహతి వీర్యవాన్ ||38.63||
యం దృష్ట్వా రాఘవో నైవ వృత్తం ఆర్యమనుస్మరేత్|
స మమార్థాయ కుశలం వక్తవ్యో వచనాన్మమ ||38.64||

స|| || రామస్య భ్రాతా లక్ష్మణః నిత్యం మమ ప్రియతరః వీర్యవాన్ యస్యాం ధురి నియుక్తః తాం ఉద్వహతి||యం దృష్ట్వా రాఘవః వృత్తం ఆర్యం న అనుస్మరేత్ సః మమ ఆర్థాయ మమ వచనాత్ కుశలం వక్తవ్యః||

||శ్లోకార్థములు||

రామస్య భ్రాతా లక్ష్మణః -
రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు
నిత్యం మమ ప్రియతరః -
ఎల్లప్పుడూ నాకు ప్రియమైన వాడు
వీర్యవాన్ యస్యాం ధురి నియుక్తః -
వీరుడు ఏపని అప్పగించినా
తాం ఉద్వహతి - దానిని నిర్వర్తించువాడు
యం దృష్ట్వా రాఘవః -
ఎవరిని చూచి రాముడు
వృత్తం ఆర్యం న అనుస్మరేత్ -
జరిగిన వృత్తాంతము తలచడో
సః మమ ఆర్థాయ -
అతనిని నా కొఱకు
మమ వచనాత్ కుశలం వక్తవ్యః -
నా మాటగా కుశలమును అడుగుము

||శ్లోకతాత్పర్యము||

"రాముని యొక్క తమ్ముడు లక్ష్మణుడు. ఎల్లప్పుడూ నాకు ప్రియమైన వాడు. వీరుడు ఏపని అప్పగించినా నిర్వర్తించువాడు. ఎవరిని చూచి రాముడు జరిగిన వృత్తాంతము తలచడో అతనిని నా కొఱకై నా మాటలుగా కుశలము అడుగుము". ||38.63,64||

||శ్లోకము 38.65||

మృదుర్నిత్యం శుచిర్దక్షః ప్రియో రామస్య లక్ష్మణః |
యథా హి వానరశ్రేష్ఠ దుఃఖక్షయకరో భవేత్ ||38.65||
త్వమస్మిన్ కార్యనిర్యోగే ప్రమాణం హరిసత్తమ ||

స|| వానరశ్రేష్ఠ హరిసత్తమః మృదుః నిత్యం శుచిః దక్షః రామస్య ప్రియః లక్ష్మణః యథా దుఃఖక్షయకరో భవేత్ | అస్మిన్ కార్యనియోగే త్వం ప్రమాణం||

||శ్లోకార్థములు||

వానరశ్రేష్ఠ - ఓ వానరోత్తమ వానరశ్రేష్ఠ
రామస్య ప్రియః లక్ష్మణః -
రామునికి ప్రియుడు లక్ష్మణుడు
మృదుః నిత్యం శుచిః దక్షః-
మృదుస్వభావి పావనుడు సమర్థు
హరిసత్తమః యథా దుఃఖక్షయకరో భవేత్ -
ఓ వానరోత్తమ ఏ విధముగా దుఃఖము క్షీణించునో
అస్మిన్ కార్యనియోగే - ఆ కార్యసాధనకు
త్వం ప్రమాణం- నీవే తగినవాడివి

||శ్లోకతాత్పర్యము||

"ఓ వానరోత్తమ మృదుస్వభావి పావనుడు సమర్థుడు రామునికి ప్రియుడు అయిన లక్ష్మణుడు ఏ విధముగా నాదుఃఖమును అంతముచేయునో అట్లు నీవు కార్యము సాధింప వలెను". ||38.65||

గోవిన్దరాజులవారు తమ టీకాలో- రామః యథా దుఃఖక్షయకరో భవేత్ తథా వక్తవ్యః। అంటేరామునికి ఏ విధముగా దుఃఖము తగ్గునో ఆవిధముగా చెప్పవలెను అని ; అస్మిన్ కార్య నిర్యోగే త్వం ప్రమాణమ్ - ఈ కార్యము సాధించుటలో నీవే తగినవాడివి.

రామ టీకాలో - ఈ శ్లోకము లక్షణుని కుశలము తో కలిపి ఈ విధముగా చెపుతారు:- 'స లక్ష్మణః మమార్థాయ యథా దుఃఖ క్షయకరో భవేత్ తథా వక్తవ్యః'; లక్ష్మణుడు సీతమ్మ దుఃఖము ఎలా తగ్గించగలడో అలా చెప్పవలెను అంటుంది సీత అంటారు. ఇది సాధించడానికి నీవే ప్రమాణము అంటూ హనమంతునిపై భారము వేస్తుంది సీత.

||శ్లోకము 38.66||

రాఘవః త్వత్సమారంభాన్మయి యత్నపరో భవేత్ ||38.66||
ఇదం బ్రూయాశ్చ మే నాథం శూరం రామం పునః పునః |

స|| రాఘవః త్వత్ సమారంభాత్ మయి యత్నపరః భవేత్ ! మే నాథం శూరం రామం పునః పునః ఇదం బ్రూయాః ||

రామటీకాలో - 'త్వత్సమారంభాత్ త్వదుత్సాహనాత్' -

||శ్లోకార్థములు||

రాఘవః త్వత్ సమారంభాత్ -
రాఘవుడు నీ సంరంభము వలనే
మయి యత్నపరః భవేత్ -
నన్ను రక్షించు యత్నములో పడును
మే నాథం శూరం రామం -
నా నాధుడు శూరుడు రామునికి
పునః పునః ఇదం బ్రూయాః -
మరల మరల చెప్పుము

||శ్లోకతాత్పర్యము||

"రాఘవుడు నీ ఉత్సాహము వలనే నన్ను రక్షించు యత్నములో పడును. నా నాధునికి మరల మరల చెప్పుము." ||38.66||

||శ్లోకము 38.67||

జీవితం ధారయిష్యామి మాసం దశరథాత్మజ ||38.67||
ఊర్ధ్వం మాసాన్న జీవేయం సత్యే నాహం బ్రవీమి తే |

స|| దశరథాత్మజ మాసం జీవితం ధారయిష్యామి | మాసాత్ ఊర్ధ్వం న జీవేయం| అహం సత్యేన తే బ్రవీమి||

||శ్లోకార్థములు||

దశరథాత్మజ - దశరథాత్మజ
మాసం జీవితం ధారయిష్యామి -
నేను ఒక మాసము జీవితము ధరించెదను
మాసాత్ ఊర్ధ్వం న జీవేయం -
మాసము గడిచి జీవించను
అహం సత్యేన తే బ్రవీమి-
నేను సత్యముగా చెప్పుచున్నాను

||శ్లోకతాత్పర్యము||

"దశరథాత్మజ నేను ఒక మాసము జీవితము ధరించెదను. మాసము గడిచి జీవించను. నేను సత్యముగా చెప్పుచున్నాను." ||38.67||

||శ్లోకము 38.68||

రావణే నోపరుద్ధాం మాం నికృత్యా పాపకర్మణా ||38.68||
త్రాతుమర్హసి వీర త్వం పాతాళాదివ కౌశికీమ్ |

స|| వీర పాపకర్మణా రావణేన నికృత్య ఉపరుద్ధాం మాం త్వం పాతాళాత్ కౌశికీం ఇవ త్రాతుమ్ అర్హసి||

||శ్లోకార్థములు||

వీర పాపకర్మణా రావణేన -
ఓ వీరా పాపకర్ముడగు రావణుని చే
నికృత్య ఉపరుద్ధాం మాం -
అవమానింపబడి బంధించబడిన నన్ను
పాతాళాత్ కౌశికీం ఇవ -
నువ్వు పాతాళమునుంచి ఇంద్రుని ఇశ్వర్యమును విష్ణువు రక్షించినట్లు
త్వం త్రాతుమ్ అర్హసి -
నీవు నన్ను (రావణ బంధము నుండి) రక్షింపవలెను

||శ్లోకతాత్పర్యము||

"ఓ వీరా పాపకర్ముడగు రావణుడు నన్ను బంధించినవాడు. పాతాళమునుంచి ఇంద్రుని ఇశ్వర్యమును విష్ణువు రక్షించినట్లు నీవు నన్ను రావణబంధమునుండి రక్షింపవలెను". ||38.68||

గోవిన్దరాజులవారిటీకాలో - ఏవం బ్రహ్మపురాణే శ్రూయతే। .. తతః సా శ్రీః పాతాలం ప్రవివేశ। తత్ర ప్రవేష్టుం అశక్నువన్తో దేవాః ..పురుషోత్తం ప్రార్థయామాసుః। స తత్ర ప్రవిశ్య పాతాలాత్ తాం శ్రీం శక్రాయ ప్రదాదితి। ఇది విష్ణువు ఇంద్రునికి పాతాళమునుంచి శ్రీని రక్షించినట్లు రాముడు సీతమ్మని రక్షించవలెనని సీతమ్మ ప్రార్థన ॥

తిలకటీకాలో - ఇంకా క్లుప్తముగా - కౌశికీ దేవేన్ద్ర శ్రీః। పురా కిల వృత్రవధాభి భూతస్య ఇన్ద్రశ్య లక్ష్మీం పాతాలం ప్రవిష్టాం దేవప్రార్థితో నారాయణ ఉద్హృత్య పునః ఇన్ద్రాయ ప్రాయచ్ఛత్ ఇతి పురాణ గాథా।

||శ్లోకము 38.69||

తతో వస్త్రగతం ముక్త్వా దివ్యం చూడామణిం శుభమ్ ||38.69||
ప్రదేయో రాఘవాయేతి సీతా హనుమతే దదౌ |

స|| తతః సీతా వస్త్రగతం శుభం దివ్యం చూడామణిం ముక్త్వా రాఘవాయ ప్రదేయః ఇతి హనుమతే దదౌ||

||శ్లోకార్థములు||

తతః సీతా వస్త్రగతం -
అప్పుడు సీత తన వస్త్రములో కట్టబడిన
శుభం దివ్యం చూడామణిం ముక్త్వా-
శుభకరము దివ్యము అయిన చూడామణిని తీసి
రాఘవాయ ప్రదేయః ఇతి హనుమతే దదౌ -
రాఘవునకు ఇవ్వమని హనుమంతునికి ఇచ్చెను

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు సీత తన వస్త్రములో కట్టబడిన శుభకరము దివ్యము అయిన చూడామణిని తీసి రాఘవునకు ఇవ్వమని హనుమంతునికి ఇచ్చెను." ||38.69||

||శ్లోకము 38.70||

ప్రతిగృహ్య తతో వీరో మణిరత్నమనుత్తమమ్ ||38.70||
అంగుళ్యా యోజయామాస న హ్యస్య ప్రాభవద్భుజః |

స|| తత్ః వీరః అనుత్తమం మణిరత్నం ప్రతిగుహ్య అంగుల్యా యోజయామాస అస్య భుజః న ప్రాభవత్ హి ||

||శ్లోకార్థములు||

తత్ః వీరః - అప్పుడు ఆ వీరుడు
అనుత్తమం మణిరత్నం ప్రతిగుహ్య -
అత్యుత్తమమైన ఆ మణిరత్నమును తీసుకొని
అంగుల్యా యోజయామాస - వేలికి పెట్టుకొనెను
అస్య భుజః న ప్రాభవత్ హి-
భుజమునందు ఇమడని కారణమువలన

||శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ వీరుడు అత్యుత్తమమైన ఆ మణిరత్నమును తీసుకొని అది తన భుజమునందు ఇమడని కారణమువలన తన వేలికి పెట్టుకొనెను." ||38.70||

||శ్లోకము 38.71||

మణిరత్నం కపివరః ప్రతిగృహ్యఽభివాద్య చ ||38.71||
సీతాం ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః స్థితః |

స|| కపిప్రవీరః మణిరత్నం ప్రతిగుహ్య సీతాం అభివాద్య చ ప్రదక్షిణం కృత్వా ప్రణతః పార్శ్వతః స్థితః||

||శ్లోకార్థములు||

కపిప్రవీరః మణిరత్నం ప్రతిగుహ్య -
ఆ కపిప్రవీరుడు మణిరత్నము తీసుకొని
సీతాం అభివాద్య చ -
సీతాదేవికి అభివందనములు చేసి
ప్రదక్షిణం కృత్వా- ప్రదక్షిణము చేసి
ప్రణతః పార్శ్వతః స్థితః -
వినమ్రముగా అమె పక్కన నిలబడెను

||శ్లోకతాత్పర్యము||

"ఆ కపిప్రవీరుడు మణిరత్నములు తీసుకొని సీతాదేవికి , ప్రదక్షిణము చేసి అభివందనములు చేసి వినమ్రముగా అమె పక్కన నిలబడెను." ||38.71||

||శ్లోకము 38.72,73||

హర్షేణ మహతా యుక్తః సీతా దర్శనజేన సః ||38.72||
హృదయేన గతో రామం శరీరేణ తు విష్ఠితః ||38.73||

స|| సః సీతాదర్శనజేన మహతా హర్షేణ యుక్తః హృదయేన రామం గతః శరీరేణ తు విష్ఠితః||

||శ్లోకార్థములు||

సః సీతాదర్శనజేన -
ఆతడు సీతా దర్శనముతో
మహతా హర్షేణ యుక్తః -
అత్యంత హర్షముపొంది
హృదయేన రామం గతః -
తన మనస్సుతో రాముని చేరెను
శరీరేణ తు విష్ఠితః -
శరీరము ఇక్కడే ఉన్నా

||శ్లోకతాత్పర్యము||

"ఆతడు సీతా దర్శనముతో అత్యంత హర్షముపొంది శరీరము ఇక్కడే ఉన్నా తన మనస్సుతో రాముని చేరెను." ||38.72,73||

||శ్లోకము 38.74||

మణివరముపగృహ్య మహార్హం
జనకనృపాత్మజయా ధృతం ప్రభావాత్|
గిరిరివ పవనావధూతముక్తః
సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే ||38.74||

స|| మహార్హం జనకనృపాత్మజయా ధృతం తం మణివరం ఉపగృహ్య ప్రభావాత్ పవనావధూతముక్తః గిరిరివ సుఖితమనాః ప్రతిసంక్రమం ప్రపేదే||

||శ్లోకార్థములు||

మహార్హం జనకనృపాత్మజయా -
జనకమహరాజు యొక్క కుమార్తె ద్వారా మహత్తరమైన
ధృతం తం మణివరం ఉపగృహ్య -
ధరించిన అ మణిని తీసుకొని,
ప్రభావాత్ - దాని ప్రభావము వలన
పవనావధూతముక్తః గిరిరివ-
వాయువులచే కంపింపబడి కుదుటబడిన పర్వతమువలె
సుఖితమనాః -
సుఖమైన మనస్సు గలవాడై
ప్రతిసంక్రమం ప్రపేదే -
తిరుగు ప్రయాణమునకు సిద్ధపడెను

||శ్లోకతాత్పర్యము||

"జనకమహరాజు యొక్క కుమార్తె ద్వారా మహత్తరమైన మణిని తీసుకొని, వాయువులచే కంపింపబడి కుదుటబడిన పర్వతమువలె, సుఖమైన మనస్సు గలవాడై తిరుగు ప్రయాణమునకు హనుమంతుడు సిద్ధపడెను. " ||38.74||

ఆ కపిప్రవీరుడు మణిరత్నము తీసుకొని సీతాదేవికి ప్రదక్షిణము చేసి అభివందనములు చేసి ఆమె పక్కన నిలబడి, సీతా దర్శనముతో అత్యంత హర్షముపొంది శరీరము ఇక్కడే ఉన్నా తన మనస్సుతో రాముని చేరెను. అంటే తిరుగు ప్రయాణమునకు హనుమంతుడు సిద్ధము అయ్యాడు అన్నమాట.

ఈ మాటతో ముప్పది ఎనిమిదవ సర్గ సమాప్తము అవుతుంది

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే అష్టత్రింశస్సర్గః ||

|| om tat sat ||