||సుందరకాండ ||

||ముప్పది తొమ్మిదవ సర్గ తెలుగులో||


|| ఓమ్ తత్ సత్||
మణిం దత్వా తతః సీతా హనుమంతమథాsబ్రవీత్|
అభిజ్ఞానం అభిజ్ఞాతం ఏతత్ రామస్య తత్త్వతః||1||
మణిం తు దృష్ట్వా రామో వై త్రయాణాం సంస్మరిష్యతి|
వీరో జనన్యా మమ చ రాజ్ఞో దశరథస్య చ||2||

స||తతః మణిం దత్త్వా సీతా హనుమంతం అథ అబ్రవీత్| ఏతత్ రామస్య అబిజ్ఞాత తత్త్వతః అభిజ్ఞానం|| రామః మణిం దృష్ట్వా త్రయాణాం సంస్మరిష్యతి.| వీరః మమ జనన్యా రాజ్ఞః దశరథస్య చ||

పిమ్మట ఆ మణిని ఇచ్చి సీత హనుమంతునితో ఇట్లు పలికెను."అనవాలుగా ఇచ్చిన ఈ అభిజ్ఞానము రామునికి బాగా తెలుసు. రాముడు మణిని చూచి ముగ్గురను సంస్మరించును. నన్ను తన తల్లిని, దశరథ మహారాజుని."
|| ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకోనచత్వారింశస్సర్గః

పిమ్మట ఆ మణిని ఇచ్చి సీత హనుమంతునితో ఇట్లు పలికెను. 'అనవాలుగా ఇచ్చిన ఈ అభిజ్ఞానము రామునికి బాగా తెలుసు. రాముడు మణిని చూచి ముగ్గురను సంస్మరించును. నన్ను తన తల్లిని, దశరథ మహారాజుని.'

'ఓ హరిసత్తమ ! ఆయన మరల ఉత్సాహముతో నిలబడి ఈ కార్యము సాధించుటకు ఎది ఉత్తమమో అది సాగునట్లు నీవు అలోచించుము. హరిసత్తమ, ఈ కార్యము సాధించుటకు నీవే కీలకము. హనుమాన్ నీ ప్రయత్నముతో నా దుఃఖమును క్షీణింపచేయువాడవు కమ్ము. నీ ప్రయత్నముతో అలోచనతో ఈ దుఃఖము క్షీణించిపోవును.' ఆ ప్రచండ విక్రమముగల మారుతి అలాగే అని ప్రతిజ్ఞ చేసి శిరస్సుతో వైదేహికి వందనము చేసి వెళ్ళుటకు సంక్రమించెను.

వెళ్ళుటకు సిద్ధముగానున్న మారుతాత్మజుడగు హనుమంతునితో మైథిలి గద్గద స్వరముతో మరల ఇట్లు పలికెను.

' హనుమాన్ రామలక్ష్మణులతో కూడిన సుగ్రీవుని కుశలములు అడుగుము. అతని మంత్రులు, వృద్ధులైన వానరులు అందరిని ధర్మసహితమైన కుశలములను అడుగుము. ఓ వానరశ్రేష్ఠ మహాబాహువులు కల రాఘవుడు నన్ను ఈ దుఃఖ సంకటమునుంచి ఎట్లు రక్షించునో అట్లు నీవు చూడుము. హనుమాన్ కీర్తిమంతుడైన రాముడు నేను జీవించియుండగనే ఎట్లు తీసుకుపోవునో అట్టి మాటలను చెప్పి ధర్మము సాధించుము'.

'నీచే చెప్పబడిన ఉత్సాహముతో కూడిన మాటలు విని, నన్ను పొందటకు రాఘవుని పౌరుషము వర్ధిల్లును. వీరుడైన రాముడు నీ ద్వారా నా సందేశముతో కూడిన మాటలను విని విధివత్ తన పరాక్రమముతో చేయవలసిన కార్యములను మొదలెట్టును'.

సీతయొక్క మాటలను విని మారుతాత్మజుడగు హనుమంతుడు శిరస్సుతో అంజలి ఘటించి జవాబుగా ఇట్లు పలికెను.

'కాకుత్‍స్థుడు వానరభల్లూక ప్రవరులతో సమేతుడై త్వరలోనే వచ్చును. యుద్ధములో శత్రువులను జయించి నీ శోకమును తొలగించును. రాముని బాణముల ధాటికి ముందు నిలబడగల వాడు మనుష్యులలోగాని సురాసురులలో గాని నాకు కానరావడము లేదు. నీ కొరకై యుద్ధములో సూర్యుని పర్జన్యుని వైవస్వతుని యముని సహితము అందరిని జయించ గలడు. ఆయన సాగరములతో చుట్టబడిన ఈ భూమి యావత్తును శాసించ గలవాడు. ఓ జనకనందిని రాముని జయము నీకొఱకే గదా.'

జానకి హనుమంతునిచేత సత్యమైన బాగుగా చెప్పబడిన మాటలను విని అత్యంత గౌరవభావముతో మరల ఈ మాటలను చెప్పెను. అప్పుడు అలా వెళ్ళుటకు సిద్ధముగానున్న వానిని మళ్ళీ మళ్ళీ చూస్తూ భర్తపై స్నేహపూర్వకముగా చెప్పబడిన మాటలతో ఆనందముపొందెను.

' ఓ వీరుడా ఒకవేళ తగును అనుకుంటే, ఒక క్షేమమైన ప్రదేశములో ఒకరోజు గడుపుము. విశ్రాంతి తీసుకొని రేపు వెళ్ళుము. ఓ వానరా నీ సాన్నిధ్యముతో అల్పభాగ్యముకల నాకు మహత్తరమైన ఈ శోకమునుంచి ఒక క్షణమైనా ఉపశమనము లభించకలదు. ఓ హరిశార్దూల నీ పునరాగమనము వఱకూ నాప్రాణములు సంకటములో నుండును. అందులో సందేహము లేదు'.

'ఓ వానరా దుఖపరంపరలో మునిగియున్న నాకు నీవు కానరాకపోవడముచే కలిగే దుఃఖము మరింత తాపమును కూర్చును. ఓ వీర హరీశ్వర, నీ సహాయకులు అగు వానర భల్లుక గణముల పై నాకు మహత్తరమైన సందేహము కలుగుచున్నది. ఆ వానరభల్లూక సైన్యములు, ఆ నరవరులిద్దరూ దుష్కరమైన ఆ సాగరమును ఎట్లు దాటగలరు. ఈ సాగరము దాటుటలో నీకు గరుత్మంతునికి వాయుదేవునకు మాత్రమే సాధ్యము కదా.'

' ఓ వీరుడా ఈ కష్ఠమైన పని సాధించుటకు ఏమి ఉపాయము చూస్తున్నావు. నీవు కార్యములు సాధించుటలో దక్షత కలవాడవు. ఓ వీరా ఈ కార్యము సాధించుటకు నీవు ఒక్కడివే తగినవాడవు. ఈ కార్యసాధనయొక్క కీర్తి నీదే అగును'.

' యుద్ధములో రావణుని తన బలములతో సహా జయించి, ఆ విజయముతో నన్ను తన పురమునకు తీసుకుపోయినచో అది ఆయనకు తగినపని. శత్రువులను తపించు కాకుత్‍స్థుడు లంకానగరమును తన శరపరంపరతో సంకులము చేసి నన్ను తీసుకుపోయినచో అది ఆయనకు తగును. ఆ శూరుడు అగు మహాత్ముని పరాక్రమమునికి తగునట్లు కార్యాచరణము అగుటకు నీవు చేయుము'.

హనుమంతుడు అర్థముతో కూడిన సందర్భోచితమైన మాటలను విని హనుమంతుడు మిగిలిన మాటలను ఇట్లు చెప్పెను.

' ఓ దేవీ ! వానర హల్లూక సైన్యములకు అధిపతి వానరశ్రేష్ఠుడు అయిన సుగ్రీవుడు నిన్ను ఆదుకోవలననే నిశ్చయములో ఉన్నవాడు. ఓ వైదేహీ ! అతడు వేలకొలదీ వానర సైన్యములతో కలిసి రాక్షసులను తుదముట్టించుటకు త్వరలో ఇక్కడికి వచ్చును. పరాక్రమమే సంపదగా గల, శ్రమ ఎఱగని మహాబలులు మనస్సులో తలచిన విధముగా పోగలవారు అయన అదేశమునకు తయారుగా వున్నారు. వారి ఊర్ధ్వ అధో తిర్యక్ గమనములకు అడ్దులేదు. అమిత తేజస్సుగల వారు ఎంతకష్ట మైన పని అయినా సాధించగలరు.'

' వారు మహోత్సాహము కల వారు. వాయుమార్గానుసారులై సాగరములతో కూడిన భూమిని పలుసార్లు ప్రదక్షిణము చేసినవారు. అక్కడ సుగ్రీవుని సన్నిధిలో నా కన్నా విశిష్ఠమైనవారు సమానులూ అయిన వనవాసులు కలరు. నా కన్న తక్కువ వారు లేనే లేరు. నేనే ఇక్కడికి రాగలిగితే మహాబలము కల వారి సంగతి చెప్పనేల? విశిష్ఠమైనవారిని గాక సామాన్యులనే ఇట్టిపనులకు పంపెదరు కదా'.

' ఓ దేవీ అందువలన ఈ పరితాపము చాలును. నీ శోకము నశించుగాక. ఆ వానర సేనలు ఒక్కగంతులో లంకను చేరెదరు. నరసింహులు మహా సత్త్వము గల రామలక్ష్మణులు ఇద్దరూ నా పృష్ఠము పై ఎక్కి ఉదయించిన సూర్యచంద్రులవలె నీ దగ్గరకు వచ్చెదరు. ఆ నరవరులైన వీరులు రామలక్ష్మణులు ఇద్దరూ వచ్చి ఈ లంకానగరమును శరపరంపరలతో నాశనము చేసెదరు.'

' రఘునందనుడగు రాఘవుడు రావణుని తన గణములతో సహా హతమార్చి నిన్ను తీసుకొని, తన పురమునకు పోవును. అది నానమ్మకము. నీకు భద్రము అగు గాక. నీవు మంచి కాలముకోసము వేచియుండుము. ప్రజ్వలిస్తున్న అగ్ని వలె ఉన్న రాముని త్వరలో చూడగలవు. ఈ రాక్షసుడు తన బంధువర్గముతో హతమార్చబడిన పిమ్మట రోహిణి చంద్రుని చేరినట్లు నీవు రామునితో కలిసెదవు. అచిరకాలములో రామునిచేత రావణుడు హతమార్చబడడము చూచెదవు'.

మారుతాత్మజుడైన హనుమంతుడు వైదేహి కి ఇలా అశ్వాసము ఇచ్చి వెళ్ళుటకు నిశ్చయించుకొనిన వాడై వైదేహితో మరల ఇట్లు పలికెను.

' కృతనిశ్చయులై లంకాద్వారము దగ్గర ధనుర్ధారులై ఉపస్థితులైన శత్రుమర్దనులు అగు రామ లక్ష్మణులను త్వరలో చూచెదవు. నఖములు దంతములు ఆయుధములుగా గల వీరులను, సింహ శార్దూలములతో సమానమైన పరాక్రమము గల వానరేంద్రులను, తండోప తండములుగా వున్న వానరులను త్వరలో చూసెదవు. ఓ పూజనీయురాలా మేఘములతో కూడిన పర్వత సమానులు అగు అనేక మంది కపిముఖ్యులను త్వరలోనే లంకా మలయ పర్వతములలో చూచెదవు'.

'రాముడు మన్మధుని బాణములచే కొట్టబడిన హృదయాంగములు కలవాడై సింహముచే అడ్డగింపబడిన ఏనుగవలె శాంతి లేనివాడు. ఓ దేవి శోకముతో దుఃఖించకు. నీ మనస్సు అప్రియము కాకుండు గాక. శక్రుని శచీదేవి వలె నీవు కూడా అట్టి నాథుడు గలదానవు. ఓ దేవి రాముని కంటె విశిష్ఠుడు ఎవరు? లక్ష్మణునితో సమానుడు ఎవరు? అగ్ని వాయువు వలెనున్న అన్నతమ్ములిద్దరూ నీకు అండ.'

' ఓ దేవి రాక్షసగణముల నివాసస్థానమైన భయంకరమైన ఈ ప్రదేశములో నువ్వు ఎక్కువ కాలము ఉండవు. నీ ప్రియుడు త్వరలోనే వచ్చును. నే వెళ్ళి సందేశము ఇచ్చువఱకు ఓర్చుకొనుము.'

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ముప్పది తొమ్మిదవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||

నాస్మిం శ్చిరం వత్స్యసి దేవి దేశే
రక్షోగణైరధ్యుషితేsతి రౌద్రే|
న తే చిరాదాగమనం ప్రియస్య
క్షమస్వ మత్సంగమకాలమాత్రమ్||54||

స|| దేవి రక్షోగణైః అధ్యుషితే అతిరౌద్రౌ అస్మిన్ దేశే చిరం న వత్స్యసి |తే ప్రియస్య ఆగమనం న చిరాత్ | మత్సంగమకాలమాత్రం క్షమస్వ||

' ఓ దేవి రాక్షసగణముల నివాసస్థానమైన భయంకరమైన ఈ ప్రదేశములో నువ్వు ఎక్కువ కాలము ఉండవు. నీ ప్రియుడు త్వరలోనే వచ్చును. నేను వెళ్ళి సందేశము ఇచ్చువఱకు ఓర్చుకొనుము.'
|| ఓమ్ తత్ సత్||