||సుందరకాండ ||

|| మూడవ సర్గ తెలుగులో||

||ఓం తత్ సత్ ||

శో|| స లమ్బ శిఖరే లమ్బే లమ్బతోయద సన్నిభే|
సత్త్వమాస్థాయ మేధావీ హనుమాన్మారుతాత్మజః||1||
నిశి లఙ్కాం మహోసత్త్వో వివేశ కపికుంజరః|
రమ్యకానన తోయాఢ్యాం పురీం రావణపాలితామ్||2||

తా|| ఆ మేధావి అయిన మారుతాత్మజుడు సమున్నత శిఖరాలతో , ఎత్తైన మేఘములలా కనపడుతున్న,లంబ పర్వతముపై నెలకొన్న, సుందరమైన అరణ్యములతోనూ జలాశయములతోనూ వున్న, రావణునిచే పాలించబడు లంకానగరమును ప్రవేశించెను.

||ఓం తత్ సత్ ||

సుందరకాండ.
అథ తృతీయ సర్గః

ఆ మేధావి అయిన మారుతాత్మజుడు మేఘములను అంటుకుంటున్న శిఖరముపై సుందరమైన అరణ్యములతోనూ జలాశయములతోనూ వున్న రావణునిచే పాలించబడు లంకానగరమును ప్రవేశించెను.

అ లంకానగరము శరత్కాలపు మేఘములవలెనున్న భవనములతో శోభించుచున్నది. సాగరఘోషతో సమానమైన ఘోషలతో నున్నది. సాగరవాయువులచేత సేవింపబడినది. విటపావతి నగరములాగా బలిష్టులైన సైనికులతో వున్నది. సుందరమైన తోరణములు తెల్లని ముఖద్వారములు గలది, పాములతోనిండి రక్షింపబడు భోగవతీ నగరము వలె శుభకరముగా నున్నది. మెఱుపులతో కూడిన మేఘములచే ఆవరింపబడినది. మెల్లగా వీచుచున్నమారుతముతో సేవింపబడుచున్న ఆ లంకానగరము జ్యోతిర్మార్గమును అందుకునుచున్నబంగారు ప్రాకారములతో చుట్టబడి ఇంద్రుని యొక్క అమరావతి లా వున్నది. చిరిగజ్జెల ధ్వనులతో ఎగురుచున్నపతాకములతో అలంకరింపబడిన ఆ లంకానగరమును సంతోషమైన మనస్సు కలవాడై హనుమంతుడు తోందరగా ఆ ప్రాకారమును చేరుకొనెను.

ఆ లంకనగరము అన్నివైపులా బంగారుతో రూపొందించిన ద్వారాలతో, వైఢూర్యములతో అలంకరింపబడిన వేదికలతో వున్నది. వజ్రములు స్ఫటికములతోనూ, మణులతోనూ అలంకరింపబడిన సోపానములు గలవు. ఆ సోపానములు వేడిబంగారముతో పూయబడిన ప్రతిమలతో, వెండిలా తెల్లగావున్నవైఢూర్యములతో అలంకరింపబడినవి. అక్కడ స్ఫటిక మాణిక్యాల కుప్పలు ఉన్నాయి. క్రౌంచపక్షులు నెమళ్ళు తిరుగాడుచున్న, రాజహంసలు తిరుగాడుచున్న, వాద్యముల ఆభరణముల ధ్వని ప్రతిధ్వనులతో నిండిన, వస్వౌకసారా అనబడు స్వర్గలోకనగరములాగ ఆకాసములోకి ఎగిరిపోతున్నదా అన్నట్లు వున్న ఆ లంకానగరమును చూచి హనుమంతుడు ఎంతో ఆనందపడెను.

శుభమైన రమ్యమైన ఉత్తమమైన మంగళప్రదమైన సుందరమైన ఐశ్వర్యముతో తులతూగుచున్న ఆ నగరమును చూచి పరాక్రమశాలి అయిన హనుమంతుడు అలోచించసాగెను.

'రావణ బలగములచే రక్షింపబడుచున్న ఈ నగరము ఇంకొకరిచేత బలముతో జయింపబడ శక్యము కాదు".

'ఈ భూమి కుముదుడు అంగదుడు మహాకపి అగు సుషేనుడు మైందుడు ద్వివిదుడు మున్నగు వారికి తెలిసివుండవచ్చు. వివస్వతుని కుమారుడు వానారాధిపతి అగు సుగ్రీవుడు, కుశపర్వుణుడు, ఋక్షుడు , కేతుమాలుడు నేను మాత్రమే ఇక్కడికి రాగలము'.

ఆ నిరుత్సాహపు ఆలోచనలు దాటవేసి, హనుమంతుడు మహాబాహువు అయిన రాఘవుని పరాక్రమము , లక్ష్మణుని పరాక్రమము తలచుకొని ఆనందభరితు డాయెను.

ఆ లంకానగరము బాగావెలుగుచున్న దీపములచేత పారదోలబడిన చీకటి కలదై ఉన్నది.

సీతాన్వేషణతో ఉత్సాహములో నున్న హనుమంతునికి అ రాక్షసరాజు నగరి రత్నకాంతులనే వస్త్రములు కల, కోష్టాగారములనే కనభూషణములు కల, యంత్రాగారములనే స్తనములు కల, స్త్రీవలె కనిపించెను.

అప్పుడు అలా ప్రవేశించుచున్న మహబలుడు, వానరులలో శార్దూలమువంటి వాడు, పవనాత్మజుడగు హనుమంతుని ఆ నగరదేవత తన స్వరూపములో చూచెను.

రావణునిచే పాలింపబడు వికృతమైన కళ్ళు కల ఆ లంకానగరి ఆ వానరోత్తముని చూచి అక్కడే అతనిముందు లేచి నిలబడెను.

వాయుపుత్రుడగు కపివర్యుని ముందర నుంచుని మహానాదము చేస్తూ పవనాత్మజుని తో ఇట్లనెను.

"ఓ వనాలయా నీవు ఎవరు ? ఏకారణము వలన ఇక్కడికి వచ్చినావు? నీవు ప్రాణాలు ధరించి వున్నసమయములో యధార్థము చెప్పుము. ఓ వానరా రావణ బలములతో అన్నివిధములుగా రక్షింపబడిన లంకానగరములోకి నీకు ప్రవేశించుటకు శక్యము కాదు".

అప్పుడు వీరుడు హనుమంతుడు తన ముందు నుంచునివున్న ఆమె తో ఇట్లు పలికెను. "నువ్వు నన్ను ఏమి అడుగుతున్నావో దానికి యదార్థము చెప్పెదను. ఓ దారుణమైన వికృతమైన కన్నులుగలదానా! పుర ద్వారములో నుంచుని ఉన్న నీవు ఏవరవు? ఎందుకు కొరకు నన్నుఆపి భయపెట్టుచున్నావు?"

హనుమంతుని ఆ వచనములు విని అ కామరూపిణి లంకిణి కోపముతో పరుషమైన మాటలతో పవనాత్మజునితో ఇట్లు పలికెను.

"నేను మహాత్ముడగు రాక్షస రాజు ఆజ్ఞ మీద దుర్ధర్షమైన ఈ నగరమును రక్షించుచున్నాను. నన్ను కాదని నీకు ఈ నగరము ప్రవేశించుటకు శక్యము కాదు. ఇప్పుడు నా చేత చంపబడి ప్రాణములు కోల్పోయి శాశ్వత నిద్ర పోయెదవు. నేను స్వయముగా లంకా నగరపు లంకిణి. ఈ నగరమును అన్నివైపులనుంచి రక్షించుచున్నాను. ఇది నీకు చెప్పుచున్నాను."

ఆ మారుతాత్మజుడు హనుమంతుడు లంకిణి యొక్క ఆమాటలు విని ఆమెకి ఎదురుగా పర్వతాకారములో నిలబడెను. మేధావి, సత్త్వము గలవాడు, ఎగురగలవారిలో గరిష్ఠుడు వానరపుంగవుడు అయిన హనుమంతుడు, వికృతమైన స్త్రీరూపములో నున్న ఆమె తో ఇట్లు పలికెను.

"బురుజులు ప్రాకారములు గల ఈ లంకానగరము చూచుటకై ఇచ్చటికి వచ్చిన వాడను. నాకు చాలా కుతూహలముగా వున్నది. ఇక్కడి వనములు ఉద్యానవనములు ముఖ్యమైన గృహములు అన్ని చూచుటకు వచ్చినవాడను."

హనుమంతుని యొక్క ఆ మాటలు విని ఆ కామరూపిణి మళ్ళీ పరుషమైన వచనములతో ఇట్లు పలికెను. "ఓ దుర్బుద్ధిగలవాడా వానరులలో అధముడా ! నన్ను జయించకుండా రాక్షసేంద్రునిచే పాలింపబడు ఈ నగరము ఇప్పుడు చూచుటకి నీకు శక్యము కాదు."

అప్పుడు ఆ కపిశార్దూలుడు ఆ రాక్షసితో ఇట్లు పలికెను. " ఓ మంగళప్రదముగా నున్నదానా ! ఈ నగరము చూచి వచ్చిన విధముగనే పోయెదను" అని.

అప్పుడు ఆ లంకిణి భయంకరమైన నాదము చేసి వేగముగా వానరశ్రేష్ఠుని కోట్టసాగెను. ఆ విధముగా లంకిణి చేత గట్టిగా కోట్టబడినవాడై కపిశార్దూలుడు, పరాక్రమవంతుడు అయిన మారుతాత్మజుడు భయంకరమైన శబ్దము చేసెను.

అప్పుడు ఆ హనుమంతుడు మిక్కిలి కోపము కలవాడై తన ఎడమ చేతి యొక్క వేళ్లను మడిచి , ఆ పిడికిటతో ఆమెను కొట్టెను. ఆమె స్త్రీ అని తలచి తను స్వయముగా అతి క్రోధము చేయలేదు. ఆ వికృతమైన కళ్ళుగల రాక్షసి ఆ దెబ్బతో బెదురుపోయి వెంటనే భూమిమీద పడిపోయెను. అప్పుడు తేజస్వి ప్రాజ్ఞుడు అయిన హనుమంతుడు అలా పడిపోయిన ఆమెను చూచి జాలిపడెను.

అప్పుడు ఆ లంకిణి ఎంతో భయముతో గద్గదస్వరముతో గర్వముకోలుపోయి హనుమంతునితో ఇట్లు పలికెను.

" ఓ హరిసత్తమ రక్షింపుము. ఓ సౌమ్యుడా! సత్వము గలవారు మహాబలవంతులూ సమయానుకూలముగా వర్తిస్తారు. ఓ ప్లవంగమా! నేను స్వయముగా లంకానగరి లంకిణిని. ఓ వీరా ! మహాబలవంతుడా ! నేను నీ పరాక్రమముచేత జయించబడిన దానను. ఓ హరీశ్వరా పూర్వము స్వయంభువే నాకు వరము ఇచ్చెను. ఇది తథ్యము నీవు వినుము. "ఎప్పుడు నువ్వు ఒక వానరుని పరాక్రమము చేత జయింపబడుదువో అప్పుడు రాక్షసులకు కీడు కలుగును అని గ్రహించుము"అని. ఓ సౌమ్యుడా నీ దర్శనము చేత ఆ సమయము వచ్చినదని గ్రహించుచున్నాను. స్వయంభువు మాట సత్యము. దానికి తిరుగులేదు. దురాత్ముడైన రాజు రావణుని , రాక్షసులందరికీ సీత కారణముగా వినాశము కలుగనున్నది. ఓ హరిశ్రేష్ట ! కనుక ఈ రావణపాలిత లంకానగరము ప్రవేశించి ఏమి ఏమి కార్యములు చేయదలచినావో ఆ కార్యములన్నీ చేసుకో".

లంకిణి ఇంకా చెప్పసాగెను.

"ఓ వానరోత్తమ శాపగ్రస్తమైన రాక్షసరాజు చే పాలింపబడు శుభమైన ఈ నగరమును నీ ఇష్టమువచ్చినట్లు ప్రవేశించి అన్ని చోటలకు పోయి సుఖముగా సతీ సీతను వెతుకుము".

ఈ విధముగా వాల్మీకి సుందరకాండలో మూడవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్ ||

శో|| ప్రవిశ్య శాపోపహతం హరీశ్వరః
శుభాం పురీం రాక్షస ముఖ్యపాలితామ్|
యదృచ్ఛయా త్వం జనకాత్మజాం సతీమ్
విమార్గ సర్వత్ర గతో యథా సుఖమ్||52||

తా|| "ఓ వానరోత్తమ శాపగ్రస్తమైన రాక్షసరాజు చే పాలింపబడు శుభమైన ఈ నగరమును నీ ఇష్టమువచ్చినట్లు ప్రవేశించి అన్ని చోటలకు పోయి సుఖముగా సతీ సీతను వెతుకుము".

||ఓం తత్ సత్||