||సుందరకాండ ||

||నలభైరెండవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
తతః పక్షి నినాదేన వృక్షభంగస్వనేన చ|
బభూవు స్త్రాససంభ్రాంతాః సర్వే లంకానివాసినః||1||

స|| తతః సర్వే లంకావాసినః పక్షి నినాదేణ వృక్షభంగస్వనేన చ త్రాస సంభ్రాంతాః బభూవుః||

అప్పుడు లంకావాసులు అందరూ పక్షుల నినాదములతోనూ చెట్లు పడగొట్టబడుతున్న ధ్వనులతోనూ భయపడి భ్రాంతులు అయ్యారు.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ద్విచత్వారింశస్సర్గః

అప్పుడు లంకావాసులు అందరూ పక్షుల నినాదములతోనూ చెట్లు పడగొట్టబడుతున్న ధ్వనులతోనూ భయపడి భ్రాంతులు అయ్యారు. .

మృగములు పక్షులు భయముతో శబ్దము చేసినవి. రాక్షసులు క్రూరమైన శకునములు చూసిరి. వికృతమైన ముఖములు కల రాక్షసులు నిద్రనుంచి మేలుకొని భగ్నమైన వనమును, వీరుడగు మహాకపిని చూచిరి. మహాబలము మహాసత్త్వము గల ఆ వానరుడు, ఆ భయపడిన రాక్షసులను చూచి మహత్తరమైన రూపమును ధరించెను.

అప్పుడు పర్వతాకారముతో సమానమైన కాయముగల మహాకాయుని, మహాబలుడు అగు వానరుని చూచి ఆ రాక్షసులు జనకాత్మజ ని అడిగిరి. ' ఇతడు ఎవరు? ఎవరి వాడు?ఎక్కడినుంచి ఎందుకు ఇక్కడికి వచ్చినవాడు? నీతో అతడు ఏమి మాట్లాడినాడు? ఓ విశాలాక్షీ మాతో చెప్పుము. ఓ సౌభాగ్యవంతురాలా భయము వలదు. ఓ అసితేక్షణా అతడు నీతో ఏమి మాట్లాడెను?'

సర్వాంగసుందరీ మహాసాధ్వి అయిన సీత ఇట్లు పలికెను. 'భీమరూపులైన రాక్షసుల గతి గురించి నాకు ఎలా తెలుయును? మీకే తెలిసిఉండాలి, ఇతడు ఎవరో ఎందుకువచ్చాడో, ఏమి చేయగోరుచున్నాడో? పాముయొక్క గుర్తులు పాములకే తెలియును కదా. అందులో సందేహము లేదు. నేను కూడా భయములో ఉన్నాను. ఇతడెవరో నాకు తెలియదు. ఇలావచ్చిన ఇతడు కామరూపులు అగు రాక్షసులవాడే అని అనుకొంటాను.'

వైదేహి వచహనములను వినిన రాక్షసులు అన్ని దిశలలో పోయిరి. కొందరు అక్కడే ఉండిపోయిరి. కొందరు రావణునికి చెప్పుటకు వెళ్ళిరి. వికృతాననము గల రాక్షసులు రావణుని వద్దకు పోయి భయంకరరూపము గల వానరుని గురించి చెప్పుటకు ఉపక్రమించిరి.

'ఓ రాజన్, అమితమైన విక్రమము గల, భయము కలిగించు వానరుడు సీతతో మాట్లాడి అశోకవనిక మధ్యలో ఉన్నాడు. లేడి కళ్ళవంటి కళ్ళు గల జానకి, మాచేత అనేకవిధములుగా అడగబడినప్పటికీ వానిగురించి చెప్పుట లేదు. అతడు ఇంద్రుడి దూతయో, కుబేరుని దూతయో, సీతాన్వేషణగురించి రామునిచేత పంపబడిన వాడో కావచ్చు'.

' ఆద్భుతరూపము గలవానిచేత మనోహరమైన అనేక మృగములతో కూడి వున్న ఆ ప్రమదావనము నాశనము అయినది. అతనిచేత నాశనము చేయబడని స్థలము లేదు. జానకి ఎక్కడ ఉన్నదో అక్కడ మాత్రము ధ్వంశము చేయబడ లేదు. జానకీ దేవి రక్షణకోసమో లేక శ్రమవలనో వదిలేసెనో మాకు తెలియదు. వానిచేత ఎందుకు అది రక్షింపబడెనో తెలియదు. సీత స్వయముగా కూర్చుని ఉన్న. అందమైన చిగుళ్ళు కల శింశుపావృక్షము అతనిచేత రక్షింపబడినది'.

"ఎవనితో సీత సంభాషణ చేసెనో అతడు, ఆ వనమును ధ్వంశము చేసెను. ఆ ఉగ్రరూపముగల వానిని నువ్వు ఉగ్రమైన దండము విధించ తగును. తన జీవితముపై ఆశవదిలినవాడు తప్ప ఎవడు రాక్షసాధిపును మనస్సును బందించిన ఆ సీతతో మాట్లాడగలడు?' రాక్షసుల వచనములను విన్న, కోపము గల రాక్షసాధిపతి కళ్ళతో ఉరుముతూ కోపము గలవాడై, హుతాగ్ని వలె మండి పడెను.

ఆ కోపము గలవాని కళ్ళనుండి ప్రజ్వరిల్లు తున్న దీపములనుండి మంటతో కూడిన తైలబిందువులు రాలినట్లు అశ్రుకణములు రాలెను. ఆ మహాతేజోవంతుడైన హనుమంతుని నిగ్రహించుటకు తనతో సమానమైన కింకరులు అను పేరుగల రాక్షసులకు అదేశము మిచ్చెను.

మహత్తరమైన ఉదరము, మహత్తరమైన పళ్ళు గల ఘోరరూపము గల భయకరరూపముగల ఎనభైవేల కింకరుల సముదాయము, యుద్ధము చేయుటకు మనస్సు గలదై హనుమంతుని బంధించుటకు ఆ భవనము నుండి వెడలెను.

వారు అశోకవన తోరణము పై ఆసీనుడైన కపీంద్రుని సమీపించి, ప్రజ్వరిల్లు తున్న అగ్నిలోకి దూకిన కీటకుములవలే, హనుమంతునిపై దూకిరి. వారు విచిత్రమైన గదలతో పరిఘలతో బంగారు గదలతో సూర్యునికిరణములవలె తేజరిల్లు తున్న శరములతో వానరశేష్ఠునిపై దాడిచేసిరి. ముద్గరములు పట్టిశములు శూలములు పట్టుకొని వేగముగా హనుమంతుని చుట్టుముట్టిరి.

తేజస్వి పర్వతాకారరూపము గల హనుమంతుడు తన తోక ఝాడించి మహత్తరమైన నాదము చేసెను. మారుతాత్మజుడు అయిన ఆ హనుమంతుడు తన కాయమును పెరిగించి లంకానగరము అంతా శబ్దముతో నిండునట్లు జబ్బలు చరిచెను. ఆ మహత్తరమైన నాదముతో పలికిన శబ్దములతో ఆకాశమునుండి పక్షులు నేలకు రాలినవి. హనుమంతుడు గట్టిగా ఇట్లు ఘోషించెను.

'అతిబలవంతుడైన రామునికి జయము. మహాబలుడైన లక్ష్మణునికి జయము. రామునిచేత పరిపాలింపబడిన సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను వధించగల మారుతాత్మజుడను. నేను క్లిష్టటమైన కర్మలను సాధించ గల రాముని దాసుడను. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ వున్న నన్ను యుద్ధములో వేయి మంది రావణులు కూడా ఎదిరించలేరు. రాక్షసులందరూ చూస్తూ ఉండగానే లంకను ధ్వంశము చేసి మైథిలికి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'

వారందరూ అతని చే చేయబడిన నాదముతో భయపడినవారైరి. సంధ్యాకాల మేఘమువలె ఉన్నతమైన ఆకారము చూచిరి. అప్పుడు ఆ రాక్షసులు ప్రభువు ఆదేశానుసారము చిత్ర విచిత్రములైన ఆయుధములతో కపి పై దాడి చేసిరి. ఆ మహాబలుడు ఆ శూరులచే అన్నివేపుల చుట్టుముట్టబడి, తోరణముపై ఉన్న భయంకరమైన పరిఘను తీసుకొనెను.

అతడు ఆ పరిఘను తీసుకొని నిశాచరులను కొట్టెను. వీరుడు ఆ మారుతి, గరుత్మంతుడు మహాసర్పమును పట్టుకొని అకాశములో తిరిగినట్లు, ఆపరిఘను తీసుకొని తిరిగెను. వీరుడైన ఆ మారుతాత్మజుడు కింకరులు అనబడు రాక్షసులను హతమార్చి యుద్ధము చేయుటకు కోరిక గలవాడై మరల ఆ తోరణము ఆశ్రయించెను.

అప్పుడు అక్కడ అయనపై భయపడి పరిపోయిన కొందరు రాక్షసులు 'కింకరులు అందరూ హతమార్చబడిరి" అని రావణుని కి నివేదించిరి.

ఆ రాజు రాక్షసులయొక్క మహత్తరమైన బలగము హతమార్చబడినట్లు విని , కళ్ళు తిప్పుతూ అప్రతిమమైన పరాక్రమము గల జయింపబడలేని ప్రహస్తుని పుత్రునికి ఆదేశమిచ్చెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభైరెండవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

స రాక్షసానాం నిహతం మహద్బలం నిశమ్య రాజా పరివృత్త లోచనః|
సమాదిదేశాప్రతిమం పరాక్రమే ప్రహస్తపుత్రం సమరే సుదుర్జయమ్||44||

స||సః రాజా రాక్షసానాం మహత్ బలం నిహతం నిశమ్య పరివృతలోచనః పరాక్రమే అప్రతిమం సమరే సుదుర్జయం ప్రహస్త పుత్రం సమాదిదేశ||

ఆ రాజు, రాక్షసులయొక్క మహత్తరమైన బలగము హతమార్చబడినట్లు విని , కళ్ళు తిప్పుతూ అప్రతిమమైన పరాక్రమము గల జయింపబడలేని ప్రహస్తుని పుత్రునికి ఆదేశమిచ్చెను.
||ఓమ్ తత్ సత్||