||సుందరకాండ ||

||నలభై మూడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 43 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రిచత్వారింశస్సర్గః

తతః స కింకరాన్ హత్వా హనుమాధ్యానమాస్థితః|
వనం భగ్నం మయా చైత్యప్రాసాదో న వినాశితః||1||

స|| తతః కింకరాన్ హత్వా హనుమాన్ ధ్యానం అస్థితః | మయా వనం భగ్నం (కృతా)|చైత్య ప్రాసాదః న వినాశితః||

కింకరులను హతమార్చిన తరువాత హనుమంతుడు ధ్యానములో పడెను. 'నేను వనమును భగ్నము చేసితిని చైత్య ప్రాసాదము మాత్రము భగ్నము కాలేదు'.

తస్మాత్ ప్రాసాదమప్యేనం భీమం విధ్వంశయామ్యహమ్|
ఇతి సంచిత్య మనసా హనుమాన్ దర్శయన్ బలమ్||2||
చైత్యప్రాసాదమాప్లుత్య మేరుశృంగ మివోన్నతమ్|
ఆరురోహ కపిశ్రేష్ఠో హనుమాన్ మారుతాత్మజః||3||

స|| తస్మాత్ అహం ఏనం ప్రాసాదం భీమం విధ్వంశయామి | కపిశ్రేష్ఠః మారుతాత్మజః హనుమాన్ మనసా ఇతి సంచిత్య బలం దర్శయన్ మేరుశ్రుంగమివ ఉన్నతం చైత్య ప్రాసాదమాప్లుత్య ఆరురోహ ||

'అందువలన నేను ఈ ప్రాసాదమును ధ్వంసము చేయదను '. కపిశ్రేష్ఠుడు మారుతాత్మజుడగు హనుమంతుడు మనస్సులో ఇలా అలోచించి బలమును ప్రదర్శిస్తూ మేరుశిఖరములవలె ఎత్తుగానున్న చైత్యప్రాస్దము పైకి ఎగిరి ఎక్కెను.

ఆరుహ్య గిరిసంకాశం ప్రాసాదం హరియూథపః|
బభౌ స సుమహాతేజాః ప్రతిసూర్య ఇవోదితః||4||
సంప్రధృష్య చ దుర్ధర్షం చైత్యప్రాసాదముత్తమమ్|
హనుమాన్ ప్రజ్వలన్ లక్ష్మ్యా పారియాత్రోపమా భవేత్||5||

స|| హరి యూథపః గిరిసంకాశం ప్రాసాదం ఆరుహ్య మహాతేజాః సః ప్రతిసూర్య ఇవ ఉదితః||హనుమాన్ దుర్ధర్షం ఉత్తమమ్ ఛైత్యప్రాసాదం సంప్రధృష్య ప్రజ్వలన్ పారియాత్రాపమః అభవత్ ||

పర్వతమువలెనున్న ప్రాసాదమును ఎక్కిన ఆ హరియూధపుడు మహా తేజోవంతుడు అయిన ఆ హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుని వలెనుండెను. దుర్ధరమైన ఆ ప్రాసాదమును ఆక్రమించిన హనుమంతుడు పారియాత్రమనే కులపర్వతమంత పెరిగెను.

స భూత్వా సు మహాకాయః ప్రభావాన్ మారుతాత్మజః|
ధృష్టమాస్ఫోటయామాస లంకాం శబ్దేన పూరయన్||6||
తస్యాస్ఫోటిత శబ్దేన మహతా శ్రోతఘాతినా|
పేతుర్విహంగమాస్తత్ర చైత్యపాలాశ్చ మోహితాః||7||

స|| సః మారుతాత్మజః ప్రభావాత్ సుమహాకాయః భూత్వా శబ్దేన లంకాం పూరయన్ అస్ఫోటయామాస||తస్య శ్రోత్రఘాతినా మహతా అస్ఫోటిత శబ్దేణ తత్ర విహంగమాః చైత్యపాలాశ్చ మోహితాః||

ఆ మారుతాత్మజుడు తన ప్రభావముతో మహాకాయము గలవాడై తన ధ్వని లంక అంతా మారుమోగునట్లు జబ్బలు చరిచెను. ఆ మహత్తరమైన ధ్వనితో అకాశములో ఉన్న విహంగములు , చైత్యప్రాసాదములో ఉన్న రక్షకులు మూర్ఛితులైరి.

అస్త్ర విజ్జయతాం రామో లక్ష్మణశ్చ మహాబలః|
రాజా జయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః||8||
దాసోsహం కోసలేంద్రస్య రామస్య క్లిష్టకర్మణః|
హనుమాన్ శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః||9||
న రావణసహస్రం మే యుద్ధే ప్రతిబలం భవేత్|
శిలాభిస్తు ప్రహరతః పాదపైశ్చ సహస్రశః||10||
అర్థయిత్వా పురీం లంకాం అభివాద్య చ మైథిలీమ్|
సమృద్ధార్థో గమిష్యామి మిషతాం సర్వ రక్షసామ్||11||

స|| అస్త్రవిత్ రామః జయతాం | మహాబలః లక్ష్మణః చ | రాఘవేణ అభిపాలితః సుగ్రీవః జయతి||శత్రుసైన్యానాం నిహంతా మారుతాత్మజః హనుమాన్ అహం అక్లిష్టకర్మణః కోసలేంద్రస్య రామస్య దాసః||సహస్రశః శిలాభిః పాదపైశ్చ ప్రహరతః మే యుద్ధే రావణసహస్రం ప్రతిబలం తు న భవేత్|| సర్వరక్షసాం మిషతాం లంకం పురీం అర్దయిత్వా మైథిలీమ్ అభివాద్య చ సమృద్ధార్ధః గమిష్యామి||

'అస్త్రవిద్యలో విదుడైన రామునికి జయము. మహబలుడైన లక్ష్మణునికి కూడా జయము. రాఘవునిచే పాలింపబడు సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను హతమార్చు హనుమంతుడను నేను క్లిష్టకార్యములను సాధించగల కోసలేంద్రుడైన రామునికి దాసును. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ ఉన్న నాకు యుద్ధములో వేయిమంది రావణులు కూడా నాకు సమానులు కారు. రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా లంకాపురిని ధ్వంసము చేసి మైథిలి కి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'.

ఏవముక్తా విమానస్థః చైత్యస్థాన్ హరియూథపః|
ననాద భీమనిర్హ్రాదో రక్షసాం జనయన్ భయమ్||12||

స|| హరియూథపః విమానస్థః చైత్యస్థాన్ ఏవం ఉక్త్వా భీమ నిర్హ్రాదః రాక్షసానాం భయం జనయన్ ననాద||

హరియూధపుడు ఈ విధముగా చైత్యప్రాసాద విమానములో వుండి చెప్పి భయంకరమైన నినాదము చేసి రాక్షసులలో భయము రేకిత్తెంచెను.

తేన శబ్దేన మహతా చైత్యపాలాః శతం యుయుః|
గృహీత్వా వివిధాన్ అస్త్రాన్ ప్రాసాన్ఖడ్గాన్పరశ్వథాన్||13||
విసృజంతో మహాకాయా మారుతిం పర్యవారయన్|

స|| తేన శబ్దేన శతం చైత్యపాలాః వివిధాన్ అస్త్రాణ్ ప్రాసాన్ ఖడ్గాన్ పరశ్వథాన్ గృహీత్వా యుయుః మహాకాయాః విశృజంతః మారుతిం పర్యవారయన్||

హనుమంతుని ఘోషతో వందమంది చైత్యాపాలులు మహాకాయులు వివిధరకములైన ఆయుధములను ప్రాసములను ఖడ్గములను తీసుకొని విజృంభించి మారుతిని చుట్టు ముట్టితిరి.

తే గదాభిర్విచిత్రాభిః పరిఘైః కాంచనాంగదైః||14||
అజఘ్నుర్వానరశ్రేష్ఠం బాణైశ్చాదిత్యసన్నిభైః|
ఆవర్త ఇవ గంగాయాః తోయస్య విపులో మహాన్||15||
పరిక్షిప్య హరిశ్రేష్ఠం స బభౌ రక్షసాం గణః|

స|| తే విచిత్రాభిః గదాభిః కాంచనాంగదైః పరిఘైః ఆదిత్య సన్నిభైః బాణైశ్చ వానరశ్రేష్ఠం అజఘ్నుః||సః రక్షసాం గణః హరిశ్రేష్ఠం పరిక్షిప్య గంగాయాః తోయస్య మహాన్ విపులః ఆవర్త ఇవ బభౌ||

వారు చిత్రవిచిత్రమైన గదలతో బంగారుపిడిగులు కల పరిఘలతోనూ సూర్యకిరణముల లాంటి బాణములతోనూ వానరశ్రేష్ఠుని పై దాడిచేసిరి. ఆ రాక్షసగణములు గంగానది యొక్క నీరులో వున్న మహత్తరమైనసుడిగుండము వలె హనుమంతుని చుట్టుముట్టిరి.

తతో వాతాత్మజః క్రుద్ధో భీమం రూపం సమాస్థితః||16||
ప్రాసాదస్య మహన్తస్య స్తంభం హేమపరిష్కృతమ్|
ఉత్పాటయిత్వా వేగేన హనుమాన్ పవనాత్మజః||17||
తతః తం భ్రామయామాస శతధారం మహాబలః|

స|| తతః వాతాత్మజః కృద్ధః భీమం రూపం సమాస్థితః | మహాన్ పవనాత్మజః మహాబలః హనుమాన్ తస్య ప్రాసాదస్య హేమపరిష్కృతం స్తంభం ఉత్పాటయిత్వా తతః శతధారం తం వేగేన భ్రామయామాస||

అప్పుడు ఆ వాతాత్మజుడు కోపముతో భయంకర రూపము దాల్చెను. అ మహాబలవంతుడైన పవనాత్మజుడు ఆ ప్రాసాదముయొక్క స్వర్ణాలంకృతమైన మూలస్తంభమును పెకలించి వంద అంచులు గల మహాస్తంభమును వేగముగా గిరగిరాతిప్పెను.

తత్ర చాగ్నిస్సమభవత్ ప్రాసాదశ్చాప్యదహ్యత||18||
దహ్యమానం తతో దృష్ట్వా ప్రాసాదం హరియూథపః|
స రాక్షసశతం హత్వా వజ్రేణేంద్ర ఇవాసురాన్||19||
అంతరిక్షే స్థితః శ్రీమాన్ ఇదం వచనమబ్రవీత్|

స|| తతః అగ్నిః చ సమభవత్ ప్రాసాదశ్చ అపి అధహ్యత | తతః హరియుధపః దహ్యమానం ప్రాసాదం దృష్ట్వా ఇంద్రః వజ్రేణ అసురాన్ ఇవ రాక్షస శతం హత్వా శ్రీమాన్ అంతరిక్షే స్థితః ఇదం వచనం అబ్రవీత్||

అప్పుడు అగ్ని ఉద్భవించెను. ప్రాసాదము దగ్ధము అయ్యెను. అప్పుడు మండుచున్న ఆ ప్రాసాదము చూస్తూ ఇంద్రుడు వజ్రాయుధముతో అసురలను హతమార్చిన విధి రాక్షసులను హతమార్చి , హనుమంతుడు అంతరిక్షములో నుండి ఈ వచనములను పలికెను.

మాదృశానాం సహస్రాణి విసృష్టాని మహాత్మనామ్||20||
బలినాం వానరేంద్రాణాం సుగ్రీవవశవర్తినామ్|
అటంతి వసుధాం కృత్స్నాం వయమన్యే చ వానరాః||21||

స||మహాత్మనాం బలినాం సుగ్రీవవశవర్తినాం మాదృశానాం వానరేంద్రాణాం సహస్రాణి విశ్రుష్టాని వయం అన్యే కృత్స్నాం వసుధామ్ అటంతి||

'మహాత్ముడు బలవంతుడు అయిన సుగ్రీవుని వశములో వున్ననాలాంటి వానరేంద్రులు వెలకొలదీ పంపబడిరి. మేము అనేకమంది భూమండలము అంతా సంచరిస్తున్నామ".

దశనాగబలాః కేచిత్ కేచిత్ దశగుణోత్తరాః|
కేచిన్నాగసహస్రస్య బభూవుః తుల్యవిక్రమాః||22||
సంతి చౌఘబలాః కేచిత్ కేచిద్వాయుబలోపమాః|
అప్రమేయ బలాశ్చాన్యే తత్రాసన్ హరియూధపాః||23||

స|| కేచిత్ దశనాగబలాః కేచిత్ దశగుణోత్తరాః కేచిత్ నాగసహస్రస్య తుల్యవిక్రమాః బభూవుః||కేచిత్ ఓఘబలాః సన్తి కేచిత్ వాయుబలోపమాః తత్ర అన్యే హరియూథపాః అప్రమేయ బలాశ్చ ఆసన్ ||

' కొందరు పది ఏనుగుల బలము కలవారు. కొందరు దానికి పదిరెట్ల బలము కలవారున్నారు. కొందరు వేయి ఏనుగుల బలము కలవారున్నారు. కొందరు వరద ప్రావాహపు బలము కలవారు. కొందరు వాయుబలము కలవారు. మరిఇంకొందరు అప్రమేయమైన బలము కలవారు'.

ఈదృగ్విధైస్తు హరిభిర్వృతో దంతానఖాయుధైః|
శతైః శతసహస్రైశ్చ కోటీభిరయుతైరపి||24||
ఆగమిష్యతి సుగ్రీవః సర్వేషాం వో నిషూదనః|

స||ఈదృగ్విధైః దన్త అపి తు నఖాయుధైః శతైః అయుతైః శతసహస్రైః కోటిభిః హరిభిః వృతః సుగ్రీవః సర్వేషాం నిషూదనః ఆగమిష్యతి ||

'ఈలాంటి అనేకమంది యోధులతో దంతములు నఖములు ఆయుధములు గా గల వందవేలకోట్ల వానరులతో కలిసి అందరినీ అంతమొనర్చగల సుగ్రీవుడు ఇక్కడికి వచ్చును".

నేయమస్తి పురీ లంకా న యూయం న చ రావణః|
యస్మాదిక్ష్వాకు నాథేన బద్ధం వైరం మహాత్మనా||25||

స|| యస్మాత్ మహాత్మనా ఇక్ష్వాకునాథేన వైరం బద్ధం ఇయం లంకాపురీ నాస్తి |యూయం న| రావణః చ న||

'ఈ లంకాపురి వుండదు. మీరు ఉండరు. రావణుడు ఉండడు. ఎందుకు అనగా మహాత్ముడగు ఇక్ష్వాకు నాధునితో బద్ద వైరము చేసికొనినందువలన'.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే త్రిచత్వారింశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాందలో నలభై మూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||