||సుందరకాండ ||

||నలభై మూడవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ త్రిచత్వారింశస్సర్గః

కింకరులను హతమార్చిన తరువాత హనుమంతుడు ధ్యానములో పడెను. 'నేను వనమును భగ్నము చేసితిని చైత్య ప్రాసాదము మాత్రము భగ్నము కాలేదు'.

'అందువలన నేను ఈ ప్రాసాదమును ధ్వంసము చేయదను '. కపిశ్రేష్ఠుడు మారుతాత్మజుడగు హనుమంతుడు మనస్సులో ఇలా అలోచించి బలమును ప్రదర్శిస్తూ మేరుశిఖరములవలె ఎత్తుగానున్న చైత్యప్రాస్దము పైకి ఎగిరి ఎక్కెను.

పర్వతమువలెనున్న ప్రాసాదమును ఎక్కిన ఆ హరియూధపుడు మహా తేజోవంతుడు అయిన ఆ హనుమంతుడు ఉదయిస్తున్న సూర్యుని వలెనుండెను. దుర్ధరమైన ఆ ప్రాసాదమును ఆక్రమించిన హనుమంతుడు పారియాత్రమనే కులపర్వతమంత పెరిగెను.

ఆ మారుతాత్మజుడు తన ప్రభావముతో మహాకాయము గలవాడై తన ధ్వని లంక అంతా మారుమోగునట్లు జబ్బలు చరిచెను. ఆ మహత్తరమైన ధ్వనితో అకాశములో ఉన్న విహంగములు , చైత్యప్రాసాదములో ఉన్న రక్షకులు మూర్ఛితులైరి.
'అస్త్రవిద్యలో విదుడైన రామునికి జయము. మహబలుడైన లక్ష్మణునికి కూడా జయము. రాఘవునిచే పాలింపబడు సుగ్రీవునకు జయము. శత్రుసైన్యములను హతమార్చు హనుమంతుడను నేను క్లిష్టకార్యములను సాధించగల కోసలేంద్రుడైన రామునికి దాసును. వేలకొలది శిలలతో వృక్షములతో తిరుగుతూ ఉన్న నాకు యుద్ధములో వేయిమంది రావణులు కూడా నాకు సమానులు కారు. రాక్షసులు అందరూ చూస్తూ ఉండగా లంకాపురిని ధ్వంసము చేసి మైథిలి కి అభివాదము చేసి కృతకృత్యుడనై వెళ్ళెదను'.

హరియూధపుడు ఈ విధముగా చైత్యప్రాసాద విమానములో వుండి చెప్పి భయంకరమైన నినాదము చేసి రాక్షసులలో భయము రేకిత్తెంచెను.

హనుమంతుని ఘోషతో వందమంది చైత్యాపాలులు మహాకాయులు వివిధరకములైన ఆయుధములను ప్రాసములను ఖడ్గములను తీసుకొని విజృంభించి మారుతిని చుట్టు ముట్టితిరి.

వారు చిత్రవిచిత్రమైన గదలతో బంగారుపిడిగులు కల పరిఘలతోనూ సూర్యకిరణముల లాంటి బాణములతోనూ వానరశ్రేష్ఠుని పై దాడిచేసిరి. ఆ రాక్షసగణములు గంగానది యొక్క నీరులో వున్న మహత్తరమైనసుడిగుండము వలె హనుమంతుని చుట్టుముట్టిరి.

అప్పుడు ఆ వాతాత్మజుడు కోపముతో భయంకర రూపము దాల్చెను. అ మహాబలవంతుడైన పవనాత్మజుడు ఆ ప్రాసాదముయొక్క స్వర్ణాలంకృతమైన మూలస్తంభమును పెకలించి వంద అంచులు గల మహాస్తంభమును వేగముగా గిరగిరాతిప్పెను.

అప్పుడు అగ్ని ఉద్భవించెను. ప్రాసాదము దగ్ధము అయ్యెను. అప్పుడు మండుచున్న ఆ ప్రాసాదము చూస్తూ ఇంద్రుడు వజ్రాయుధముతో అసురలను హతమార్చిన విధి రాక్షసులను హతమార్చి , హనుమంతుడు అంతరిక్షములో నుండి ఈ వచనములను పలికెను.

'మహాత్ముడు బలవంతుడు అయిన సుగ్రీవుని వశములో వున్ననాలాంటి వానరేంద్రులు వెలకొలదీ పంపబడిరి. మేము అనేకమంది భూమండలము అంతా సంచరిస్తున్నామ".

' కొందరు పది ఏనుగుల బలము కలవారు. కొందరు దానికి పదిరెట్ల బలము కలవారున్నారు. కొందరు వేయి ఏనుగుల బలము కలవారున్నారు. కొందరు వరద ప్రావాహపు బలము కలవారు. కొందరు వాయుబలము కలవారు. మరిఇంకొందరు అప్రమేయమైన బలము కలవారు'.

'ఈలాంటి అనేకమంది యోదులు దంతములు నఖములు ఆయుధములు గా గల వందవేలకోట్ల వానరులతో కలిసి అందరినీ అంతమొనర్చగల సుగ్రీవుడు ఇక్కడికి వచ్చును".

'ఈ లంకాపురి వుండదు. మీరు ఉండరు. రావణూడు ఉండదూ. ఎందుకు అనగా మహాత్ముడు ఇక్ష్వాకు నాధునితో బద్ద వైరము చేసికొనినందువలన'.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాందలో నలభై మూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||