||సుందరకాండ ||

||నలభై ఆరవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 46 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షట్చత్త్వారింశస్సర్గః||

హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా|
రావణః సంవృతాకారః చకార మతిముత్తమామ్||1||

స|| మహాత్మనా వానరేణ మంత్రిసుతాన్ హతాన్ (ఇతి) బుద్ధ్వా రావణః సంవృతాకారః ఉత్తమామ్ మతిం చకార||

తా|| మహాత్ముడైన వానరునిచేత మంత్రిసుతులు హతమార్చబడిరి అని తెలిసికొని రావణుడు తనవిచారమును వెళ్ళడించకుండా అలోచించెను.

స విరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసమ్ |
ప్రఘసం భాసకర్ణం చ పంచ సేనాగ్ర నాయకాన్||2||
సందిదేశ దశగ్రీవో వీరాన్నయవిశారదాన్ |
హనుమద్గ్రహణా వ్యగ్రాన్ వాయువేగసమాన్యుధి||3||

స|| సః దశగ్రీవః వీరాన్ నయవిశారదాన్ రాక్షసాం విరూపాక్ష యుపాక్షౌ ప్రఘసం భాసకర్ణం చ దుర్ధరం చ పంచసేనాగ్రనాయకాన్ యుధి వాయువేగ సమాన్ హనుమాన్ గ్రహణావ్యగ్రాన్ సందిదేశ||

తా|| ఆ దశగ్రీవుడు వీరులు యుద్ధములో అరితేరిన రాక్షసులు విరూపాక్షుడు, యూపాక్షుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, దుర్ధరుడు అని ఐదుమంది అగ్రసేనానాయకులను యుద్ధములో వాయువేగము కల హనుమంతుని బంధించుటకు ఆదేశమిచ్చెను.

యాత సేనాగ్రగాః సర్వే మహాబలపరిగ్రహాః|
సవాజిరథమాతంగాః స కపిః శాస్యతామితి||4||
యతైశ్చ ఖలు భావ్యం స్యాత్తమాసాద్య వనాలయమ్|
కర్మ చాపి సమాధేయం దేశకాలవిరోధినమ్||5||
న హ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్|
సర్వధా తన్మహద్భూతం మహాబలపరిగ్రహమ్||6||

స|| సేనాగ్రగాః సర్వే మహాబలపరిగ్రహాః సవాజిరథమాతంగాః స కపిః శాస్యతాం ఇతి ||తం వనాలయం ఆసాద్య యత్నైః చ భావ్యం దేశకాలవిరోధినం కర్మచాపి సమాధేయం|| అహం కర్మణా ప్రతితర్కయన్ తం కపిం న మన్యే | సర్వథా మహత్ భూతం మహాబలపరిగ్రహం ||

తా|| ' సేనానాయకులు లారా సమస్త గజములు అశ్వములు రథములు కల మహాబలముతో కూడిన వారై ఆ వానరుని శాసించుడు. ఆ వనాలయుని సమీపించి దేశకాలానుగుణముగా తగిన రీతిని కార్యము చేపట్టండి. నేను జరిగిన కర్మలను చూచి అతడు వానరుడు అను కొనను. అతడు అన్నివిధములుగా మహత్తరమైన బలము కల మహా ప్రాణి'.

భవేదింద్రేణ వా సృష్టమస్మదర్థం తపోబలాత్|
సనాగయక్షగంధర్వా దేవాసురమహర్షయః||7||
యుష్మాభి స్సహితైః సర్వేర్మయా సహ వినిర్జితాః|
తైరవశ్యం విధాతవ్యం వ్యళీకం కించిదేవ నః||8||
తదేవ నాత్ర సందేహః ప్రసహ్యా పరిగృహ్యతామ్|
నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీరపరాక్రమః||9||

స|| అస్మదర్థం తపోబలాత్ ఇంద్రేణ స నాగయక్ష గంధర్వా దేవాసుర మహర్షయః సృష్ఠం వా||యుష్మాభిః సహ తైః సర్వైః మయా వినిర్జితాః| అవశ్యం తైః కించిదేవ వ్యళీకం విధాతవ్యం || తదేవ అత్ర సందేహః న | ప్రసహ్య పరిగృహ్యతాం | ధీరపరిక్రమః హరిః భవద్భిః న అవమాన్యః చ||

తా|| 'మనను జయించుటకు తపోబలముతో ఇంద్రునిచేత, నాగ యక్ష గంధ్రవ దేవ అసుర మహర్షుల చేత, ఇతడు సృష్ఠింపబడి ఉండవచ్చు. మీ అందరి తో కలిసి వారిని అందరినీ నేను జయించితిని కదా. తప్పక వారు మనకు ఉపద్రవము కలిగించవచ్చు. దానిలో సందేహము లేదు. బలముతో అతనిని పరిగ్రహించుడు. ఆ ధీరపరాక్రమము గల వానరుడు మీచేత అవమానింపబడరాదు'.

దృష్టా హి హరయః పూర్వం మయా విపులవిక్రమాః|
వాలీ చ సహ సుగ్రీవో జాంబవాంశ్చ మహాబలః||10||
నీలః సేనాపతిశ్చైవ యే చాన్యే ద్వివిదాదయః|
నైవం తేషాం గతిర్భీమాన తేజో న పరాక్రమః||11||
నమతిర్న బలోత్సాహౌ న రూపపరికల్పనమ్|
మహత్సత్త్వ మిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితమ్||12||
ప్రయత్నం మహదాస్థాయ క్రియతా మస్య నిగ్రహః|

స|| పూర్వం మయా విపులవిక్రమాః మహాబలః వాలీ చ జాంబవంతః సుగ్రీవః సహ హరయః దృష్టా || నీలః ద్వివిదాదయః అన్యే సేనాపతిః చ తేషాం గతిః న ఏవం తేజః పరాక్రమః న|| న మతిః బలః ఉత్సాహః న రూపపరికల్పనం | ఇదం కపిరూపం వ్యవస్థితం మహత్ సత్త్వం జ్ఞేయం || మహత్ ప్రయత్నం ఆస్థాయ అస్య నిగ్రహః క్రియతాం||

తా|| ' పూర్వము నాచేత అతి పరాక్రమము గల మహాబలవంతులు వాలీ జాంబవంతుడు సుగ్రీవుడు చూడబడిరి. నీలుడు ద్వివిదుడు ఇంకా ఇతర సేనాపతులగు వారికి ఇలాంటి వేగము తేజము పరాక్రమము లేవు. అంత బుద్ధి, బలము, ఉత్సాహము, శరీరరూప పరికల్పన, శక్తి లేవు. ఇతడు కపిరూపము ధరించిన మహత్తరమైన ప్రాణి అని తెలిసికొనవలెను. మహత్తరమైన ప్రయత్నముతో వానిని నిగ్రహించుడు'

కామం లోకాస్త్రయః సైంద్రాః ససురాసురమానవాః |
భవతా మగ్రతః స్థాతుం న పర్యాప్తా రణాజిరే||
తథాపి తు నయజ్ఞేన జయ మాకాంక్షతా రణే||14||
అత్మా రక్ష్యః ప్రయత్నేన యుద్ధసిద్దిర్హి చంచలా|

స|| స ఇంద్రాః స సురాసురమానవాః త్రయః లోకాః రణాజిరే భవతామ్ అగ్రతః స్థాతుం న పర్యాతాః కామమ్|| తథాపి తు రణే జయం ఆకాంక్షయా ప్రయత్నేన ఆత్మా రక్ష్యః | యుద్ధసిద్ధిః చంచలాః||

తా|| ' ఇంద్రునితో కలిపి ఈ మూడు లోకములలో సురాసుర మానవులలో యుద్ధరంగములోఎవరూ మీ ముందు నిలబడ లేరు అన్నది నిజము. అయిననూ రణములో జయము ఆకాంక్షించు ప్రయత్నములో ఆత్మరక్షణ చేసుకోవలెను. యుద్దములో సిద్ధి అచంచలము కదా'
.
తే స్వామి వచనం సర్వే ప్రతిగుహ్య మహౌజసః||15||
సముత్పేతుర్మహావేగా హుతాశసమతేజసః|
రథైర్మత్తైశ్చ మాతంగైర్వాజిభిశ్చ మహాజనైః||16||
శస్త్రైశ్చ వివిధైః తీక్ష్‍ణైః సర్వైశ్చోపచితా బలైః|

స|| మహౌజసః హుతాశ సమ తేజసః తే సర్వే స్వామివచనం ప్రతిగృహ్య మహావేగాః రథైః మత్తైః మాతంగైః మహాజవైః వాజిభిశ్చ తీక్ష్ణైః వివిధైః శస్త్రైః సర్వే బలైః ఉపచితాః సముత్పేతుః||

తా|| మహత్తరమైన ఔజసము కలవారు , అగ్నితో సమానమై తేజస్సు కలవారు వారు అగు వారందరు తమ స్వామి వచనములను స్వీకరించి మహావేగముతో మత్తెక్కిన మాతంగములతో, అధిక వేగము కల అశ్వములతో, తీక్షణమైన శస్త్రములతోకూడిన సైన్యము తీసుకొని బయలు దేరిరి.

తతస్తం దదృశుర్వీరా దీప్యమానం మహాకపిమ్||17||
రస్మిమంతమివోద్యంతం స్వతేజోరశ్మిమాలినమ్|
తోరణస్థం మహోత్సాహం మహాసత్త్వం మహాబలమ్||18||
మహామతిం మహావేగం మహాకాయం మహాబలమ్|
తం సమీక్ష్యైవ తే సర్వే దిక్షు సర్వాస్వవస్థితాః||19||
తైస్తైః ప్రహరణైర్భీమైరభిపేతుః తతస్తతః|

స|| తతః వీరాః స్వతేజోరస్మిమాలినం ఉద్యంతం రస్మిమంతం ఇవ దీప్యమానం తోరణస్థం మహోత్సాహం మహాసత్త్వం మహాబలం తం మహాకపిం దదృశుః|| మహామతిం మహావేగం మహాకాయం మహాబలం తం సమీక్ష్యైవ తే సర్వే సర్వా దిక్షుః తైః తైః తతః తతః భీమైః ప్రహరణైః అభిపేతుః వ్యవస్థితాః ||

తా|| అప్పుడు ఆ వీరులు తన తేజముతో ఉజ్జ్వరిల్లుతున్న సూర్యునివలె వెలుగుతూవున్న మహోత్సాహముతో అశోకవన తోరణముపై కూర్చుని ఉన్నమహాబలము కల మహత్తరమైన సత్త్వముగల మహాకపిని చూచిరి. మహత్తరమైన బుద్ధి , మహా వేగము మహాకాయము మహాబలము కల వానిని చూచి వారు అందరూ అన్ని దిశలనుంచి తమ తమ భయంకరమైన అస్త్రములతో దాడిచేసిరి.

తస్య పంచాయసాః తీక్ష్ణాః శితాః పీతముఖాః శరాః||20||
శిరస్యుత్పలపత్రాభా దుర్ధరేణ నిపాతితాః|
స తైః పంచభిరావిద్ధః శరైః శిరసి వానరః||21||
ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశో దశ వినాదయన్|

స||పంచ తీక్ష్ణాః శితాః పీతముఖాః ఉత్పలపత్రాభాః ఆయసాః శరాః తస్య శిరస్యు దుర్ధరేణ నిపాతితాః || సః వానరః తైః పంచభీ శరైః శిరసి ఆవిద్ధః నదన్ దశదిశః వినాదయన్ వ్యోమ్ని ఉత్పపాత||

తా|| ఐదు వాడిఅయిన ముక్కు గల పచ్చని కలువరేకుల రంగుకల ఇనుముతో చేయబడిన శరములను ఆ వానరుని శిరస్సుపై దుర్ధరుడు ప్రయోగించెను. ఆ వానరుడు ఆ ఐదు బాణములతో శిరస్సుపై కొట్టబడి, పది దిశలలో మారుమోగునట్లు పెద్దశబ్దము చేయుచూ ఆకాశములోకి ఎగిరెను.

తతస్తు దుర్ధరో వీరః సరథః సజ్యకార్ముకః||22||
కిరణ్ శతశతైః తీక్ష్‍ణైరభిపేదే మహాబలః|
స కపిర్వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణమ్||23||
సృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః|
అర్ధ్యమానః తతస్తేన దుర్ధరేణానిలాత్మజః||24||
చకార కథనం భూయో వ్యవర్థత చ వేగవాన్ |
సదూరం సహసోత్పత్య దుర్దరస్య రథే హరిః||25||
నిపపాత మహావేగో విద్ర్యుద్రాశిర్గిరావివ|

స|| తతః మహాబలః దుర్ధరః సరథః సజ్యకార్ముకః తీక్ష్ణైః శరశతైః కిరణ్ అభిపేదే|| స కపిః వ్యోమ్నిశరవర్షిణం తం పయోదాంతే వృష్టిమంతం పయోదం మారుతః ఇవ వారయామాస|| తేన దుర్ధరేన అర్ధ్యమానః అనిలాత్మజః తతః కదనం చకార| వేగవాన్ భూయః వ్యవర్ధత|| స హరిః సహసా ఉత్పత్య మహావేగః గిరౌ విద్యుత్ రాశిః ఇవ దుర్ధరస్య రథే నిపపాత||

తా|| అప్పుడు ఆ మహబలుడు అగు దుర్ధరుడు రథముపై నుండి తన ధనస్సుతో వందలకొలదీ తీక్షణమైన బాణములను ప్రయోగించెను. శరద్కాలప్రారంభములో నీటితో నిండిన మేఘములను వాయువు అడ్డగించి చెల్లా చెదరు చేశినట్లు, ఆ వానరుడు ఆ దుర్ధరుని శరపరంపరను చెల్లా చెదరు చేసెను. ఆ దుర్ధరునిచేత ఎదుర్కొనబడిన ఆ అనిలాత్మజుడు తన పనిమొదలెట్టెను. వేగముగా తన పరిణామము పెంచెను. ఆ వానరుడు వెంటనే పైకి ఎగిరి మహావేగముతో పర్వతముపై పిడుగులు పడినట్లు దుర్ధరుని రథముపై పడెను.

తతః స మధితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరమ్||26||
విహాయన్యపతద్భూమౌ దుర్ధరః త్యక్త జీవితః|

స|| తతః సః మథితాష్టాశ్వం భగ్నాక్షకూబరం రథం విహాయ త్యక్తజీవితః భూమౌ న్యపతత్ ||

తా|| ఆప్పుడు అతడు తాకిడికి, ఎనిమిది గుఱ్ఱములుకల ఆ రథము భగ్నమైపోగా దానిని వదిలి, జీవితము వదిలినవాడై (దుర్ధరుడు) భూమిపై పడెను.

తం విరూపాక్షయూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి||27||
సంజాతరోషౌ దుర్దర్షావుత్పేతతురరిందమౌ|
స తాభ్యాం సహసోత్పత్య విష్ఠితో విమలేంబరే||28||
ముద్గరాభ్యాం మహాబాహు ర్వక్షస్యభిహితః కపిః|
తయోర్వేగవతోర్వేగం వినిహత్య మహాబలః||29||
నిపపాత పునర్భూమౌ సుపర్ణ సమవిక్రమః|

స|| దుర్ధర్షౌ అరిందమౌ విరూపాక్షయూపాక్షౌ భువి నిపాతితం తం దృష్ట్వా సంజాతరోషౌ ఉత్పేతుః|| విమలే అంబరే తిష్ఠితః మహాబాహుః సః మహాకపిః తాభ్యాం సహసా ఉత్పత్య ముద్గరాభ్యాం వక్షసి అభిహితః|| మహాబలః సుపర్ణసమ విక్రమః వేగవతోః తయోః వేగం వినిహత్య పునః భూమౌ నిపపాత||

తా|| దుర్ధరులైన ఆ యూపాక్ష విరూపాక్షులు భూమిమీద పడిన ఆ దుర్ధరుని చూచి మరింత రోషము కలవారు అయిరి. విమాలాకాశములో ఉన్న మహాబాహువులు కల ఆ మహాకపి, వేగముగా పైకి లేచిన వారిద్దరి చేత తన వక్షస్థలముపై కొట్టబడెను. మహాబలుడు గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల వానరుడు వేగముతో వచ్చిన వారిద్దరిని వేగము ధాటిని ఎదురుకొని మరల భూమిపై పడెను.

స సాలవృక్ష మాసాద్య త ముత్పాట్య చ వానరః||30||
తా వుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజః|
తతః తాం స్త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్వినా||31||
అభిపేదే మహావేగః ప్రసహ్యా ప్రఘసో హరిం|
భాసకర్ణశ్చ సంక్రుద్ధః శూలమాదాయ వీర్యవాన్||32||

స|| వానరః సః పవనాత్మజః సాలవృక్షం ఆసాద్య తం ఉత్పాట్య తౌ ఉభౌ వీరౌ రాక్షసౌ జఘాన||తతః తరస్వినా వానరేన తాన్ త్రీన్ హతాన్ జ్ఞాత్వా ప్రఘసః మహావేగః ప్రసహ్యా అభిపేదే | వీర్యవాన్ భాసకర్ణః చ సంకృద్ధః శూలం ఆదాయ||

తా|| పవనాత్మజుడైన అ వానరుడు అప్పుడు ఒక సాలవృక్షమును తీసుకొని ఆ రాక్షసులిద్దరినీ హతమార్చెను. అప్పుడు అతి బలవంతుడైన వానరుని చేత ముగ్గురు హతమార్చబడినట్లు తెలిసికొని ప్రఘసుడు మహావేగముతో దాడి చేసెను. వీరుడు భాసకర్ణుడు కూడా కోపోద్రిక్తుడై శూలము తీసుకు వచ్చెను.

ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితమ్|
పట్టిసేన శితాగ్రేణ ప్రఘసః ప్రత్యయోధయత్||33||
భాసకర్ణశ్చ శూలేన రాక్షసః కపిసత్తమమ్|
స తాభ్యాం విక్షతైర్గాత్రైరసృగ్దిగ్థ తనూరుహః||34||
అభవత్ వానరః క్రుద్ధో బాలసూర్య సమప్రభః|

స|| యశస్వినం కపిశార్దూలం ఏకతః అవస్థితం తం ప్రఘసః శితాగ్రేణ పట్టిసేన కపిసత్తమం ప్రత్యయోధయత్ భాసకర్ణః రాక్షసః శూలేన||తాభ్యాం విక్షతైః గాత్రైః అసృగ్ధితనూరుహః సః వానరః బాలసూర్యసమప్రభః కృద్ధః అభవత్||

తా|| యశోవంతుడు కపి శార్దూలుడు అయిన హనుమంతుని ఒకవేపు పదునుపట్టిన పట్టిసముతో ప్రఘసుడు, ఇంకొకవేపు శూలముతో భాసకర్ణుడు యుద్ధము చేయసాగిరి. వారిద్దరిచేత గాయపడిన (హనుమ) శరీరము రక్తశిక్తమయెను. ఆ హనుమంతుడు ఉదయభానువలె తేజరిల్లుచూ అతికృద్ధుడయ్యెను

సముత్పాట్య గిరేః శృంగం సమృగవ్యాళపాదపమ్||35||
జఘాన హనుమాన్వీరౌ రాక్షసౌ కపికుంజరః|
తతస్తేష్వవసన్నేషు సేనాపతిషు పంచసు||
బలం చ తదవశేషం చ నాశయామాస వానరః|||36||
అశ్వైరశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథై రథాన్|
సకపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్||37||

స|| కపికుంజరః వీరః హనుమాన్ సమృగవ్యాలపాదపమ్ గిరే శృంగం సముత్పాట్య రాక్షసౌ జఘాన|| తతః తేషు పంచసు సేనాపతిషు అవసన్నేషు వానరః తత్ అవశేషం బలం నాశయామాస|| స కపిః సహస్రాక్షః అసురాన్ ఇవ అశ్వైః అశ్వాన్ గజైః నాగాన్ యోధైః యోధాన్ రథైః రథాన్ నాసయామాస||

తా|| వీరుడు కపికుంజరుడు అయిన ఆ హనుమంతుడు మృగములు వృక్షములతో కూడిన ఒక పర్వత శిఖరమును పెకలించి ఆ రాక్షసులను హతమార్చెను. అప్పుడు ఆ ఐదుమంది సేనాపతులను హతమార్చి మిగిలిన సేనా బలములను నాశనము చేయసాగెను. సహస్రాక్షుడు అసురలను చంపినట్లు ఆ హనుమంతుడు అశ్వములను అశ్వములతో, గజములను గజములతో, యోధులను యోధులతోనూ, రథములను రథములతోనూ నాశనము చేయసాగెను.

హతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహారథైః|
హతైశ్చ రాక్షసైర్భూమీరుద్దమార్గా సమంతతః||38||

స|| హతైః నాగైః తురగైః భగ్నాక్షైః మహారథైశ్చ హతైః రాక్షసః భూమిః సమన్తతః రుద్ధమార్గా||

తా|| హతమార్చబడిన గజములతో, తురగములతో, ముక్కలు చేయబడిన మహారథములతో, హతమార్చబడిన రాక్షసులతో, భూమిలో మార్గములన్ని నిండి పోయినవి.

తతః కపిస్తాన్ ధ్వజినీపతీన్ రణే
నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్|
సమీక్ష్య వీరః పరిగృహ్య తోరణం
కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే||39||

స|| తతః వీరః కపిః వీరాన్ సబలాన్ స వాహనాన్ తాన్ ధ్వజినిపతీన్ రణే నిహత్య సమీక్ష తోరణం పరిగృహ్య ప్రజాక్షయే కాలః ఇవ కృతక్షణః||

తా|| అప్పుడు ఆ వీరుడు వానరుడు ఆ సైన్యబలములతో కూడిన వాహనములతో కూడిన ఆ వీరులను రణములో హతమార్చి మళ్ళీ అశోకవన తోరణముపై ప్రజలను కబళించు కాలుని వలె నిలబడెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్చత్త్వారింశస్సర్గః ||

తా|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఆరవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||