||సుందరకాండ ||

||నలభై ఆరవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 46 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ షట్చత్త్వారింశస్సర్గః||

ఈ సర్గలో ఒక ముఖ్యవిషయము వుంది. ఈ సర్గలో పదమూడువేల శ్లోకాలు పూర్తి అవుతాయి. అంటే పదునాలుగొవ సహస్రములో మొదటి శ్లోకము వుంది అంటే గాయత్రీమహామంత్రములోని పదునాలుగొవ అక్షరము "ధీ"వుంది అన్నమాట.

పదునాలుగొవ సహస్రములో మొదటి శ్లోకము అంటే పదమూడువేల ఒకటవ శ్లోకము(13001).

ఆ శ్లోకము ఇది:
"సవాజిరథమాతఙ్గాః స కపిః శాస్యతామితి|
నావమాన్యో భవద్భిశ్చ కపిః ధీరపరాక్రమః||"

అంటే " రథములు అశ్వములు మాతంగములు కల సేనతో ఈ వానరుని శిక్షించుడు. మీచేత ఈ ధీరపరాక్రముడైన వానరుడు అవమానింపబడకుండు గాక" అని. ఈ శ్లోకములో, గాయత్రిలోని పదునాలుగొవ అక్షరము "ధీ"వుంది కనుక, ఈ శ్లోకము మంత్రము గా పరిగణింపబడుతుంది.

ఇక నలుబది ఆరవ సర్గలో శ్లోకాలు.

||శ్లోకము 46.01||

హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా|
రావణః సంవృతాకారః చకార మతిముత్తమామ్||46.01||

స|| మహాత్మనా వానరేణ మంత్రిసుతాన్ హతాన్ (ఇతి) బుద్ధ్వా రావణః సంవృతాకారః ఉత్తమామ్ మతిం చకార||

తిలక టీకాలో- సంవృతాకారో నిగృహీత అన్తర్గత భయః। లోపలనున్న భయమును కూడబట్టుకొని।

|| శ్లోకార్థములు||

మహాత్మనా వానరేణ - మహాత్ముడైన వానరునిచేత
మంత్రిసుతాన్ హతాన్ (ఇతి) బుద్ధ్వా-
మంత్రిసుతులు హతమార్చబడిరి అని తెలిసికొని
రావణః సంవృతాకారః -
రావణుడు తన విచారమును వెళ్ళడించకుండా
ఉత్తమామ్ మతిం చకార -
చక్కగా విచారించెను

|| శ్లోకతాత్పర్యము||

"మహాత్ముడైన వానరునిచేత మంత్రిసుతులు హతమార్చబడిరి అని తెలిసికొని రావణుడు తన విచారమును వెళ్ళడించకుండా చక్కగా అలోచించెను." ||46.01||

"సంవృతాకారః" అంటే మనస్సులోనే మాట దాచుకొనేవాడు. ఎవరు ? ఇక్కడ వాడు రావణుడు. మనస్సులో ఎందుకు దాచుకుంటున్నాడు?

కింకరులు హతులయ్యారు. జంబుమాలి హతుడయ్యాడు. అమాత్యుల ఏడుగురు పుత్రులు కూడా హతమయ్యారు. రావణుడికి వాలి సుగ్రీవులు తెలుసు. నీలుడు ద్వివిదులు కూడా తెలుసు. ఇక్కడ అశోకవనములో వున్నవానరుడు, వాళ్ళందరినీ మించిన వాడులా వున్నాడు. అందుకని తన మస్సులో అనుమానాలు దాచుకొని, "చకార మతిముత్తమమ్"
బుద్దితో గట్టిగా ఆలోచించాడు అని.

ఆ ఆలోచనతో, ఆరితేరిన అగ్ర సేనానాయకులు,
ఐదుమందికి ఆదేశము ఇస్తాడు

||శ్లోకము 46.02, 03||

స విరూపాక్షయూపాక్షౌ దుర్ధరం చైవ రాక్షసమ్ |
ప్రఘసం భాసకర్ణం చ పంచ సేనాగ్ర నాయకాన్||46.02||
సందిదేశ దశగ్రీవో వీరాన్నయవిశారదాన్ |
హనుమద్గ్రహణా వ్యగ్రాన్ వాయువేగసమాన్యుధి||46.03||

స|| సః దశగ్రీవః వీరాన్ నయవిశారదాన్ రాక్షసాం విరూపాక్ష యుపాక్షౌ ప్రఘసం భాసకర్ణం చ దుర్ధరం చ పంచ సేనాగ్రనాయకాన్ యుధి వాయువేగ సమాన్ హనుమాన్ గ్రహణావ్యగ్రాన్ సందిదేశ||

|| శ్లోకార్థములు||

సః దశగ్రీవః - ఆ దశగ్రీవుడు
వీరాన్ నయవిశారదాన్ రాక్షసాం -
వీరులు యుద్ధములో అరితేరిన రాక్షసులు
విరూపాక్ష యుపాక్షౌ ప్రఘసం భాసకర్ణం చ -
విరూపాక్షుడు యూపాక్షుడు ప్రఘసుడు భాసకర్ణుడు
దుర్ధరం చ పంచసేనాగ్రనాయకాన్ -
దుర్ధరుడు అను ఇదుమంది అగ్రసేనానాయకులను
వాయువేగ సమాన్ హనుమాన్ -
వాయువేగము కల హనుమంతుని
యుధి గ్రహణావ్యగ్రాన్ సందిదేశ -
యుద్ధములో బంధించుటకు ఆదేశమిచ్చెను

|| శ్లోకతాత్పర్యము||

"ఆ దశగ్రీవుడు వీరులు యుద్ధములో అరితేరిన రాక్షసులు విరూపాక్షుడు యూపాక్షుడు ప్రఘసుడు భాసకర్ణుడు దుర్ధరుడు అని ఇదుమంది అగ్రసేనానాయకులను యుద్ధములో వాయువేగము కల హనుమంతుని బంధించుటకు ఆదేశమిచ్చెను."

ఆ ఆలోచనతో, ఆరితేరిన అగ్ర సేనానాయకులు, ఐదుమందికి ఆదేశము ఇస్తాడు. ఆ ఐదుమంది అగ్రసేనానాయకులు విరూపాక్షుడు, యూపాక్షుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, మరియు దుర్ధరుడు అని పేరులు గల వారు. వాళ్ళు రావణునితో కలిసి దేవతలపై యుద్ధాలలో పాల్గొని విజయము చేపట్టినవారు.

||శ్లోకము 46.04||

యాత సేనాగ్రగాః సర్వే మహాబలపరిగ్రహాః|
సవాజిరథమాతంగాః స కపిః శాస్యతామితి||46.04||

స|| సేనాగ్రగాః సర్వే మహాబలపరిగ్రహాః సవాజిరథమాతంగాః స కపిః శాస్యతాం ఇతి ||

|| శ్లోకార్థములు||

సేనాగ్రగాః సర్వే -
సేనానాయకులారా అందరూ
మహాబలపరిగ్రహాః సవాజిరథమాతంగాః -
మస్త గజములు అశ్వములు రథములు కల మహాబలముతో కూడిన వారై
స కపిః శాస్యతాం ఇతి -
ఆ వానరుని శాసించుడు

|| శ్లోకతాత్పర్యము||

"సేనానాయకులు లారా సమస్త గజములు అశ్వములు రథములు కల మహాబలముతో కూడిన వారై ఆ వానరుని శాసించుడు". ||46.04||

||శ్లోకము 46.05||

యతైశ్చ ఖలు భావ్యం స్యాత్తమాసాద్య వనాలయమ్|
కర్మ చాపి సమాధేయం దేశకాలావిరోధినమ్||46.05||

స|| తం వనాలయం ఆసాద్య యత్తైః చ భావ్యం దేశకాలావిరోధినం కర్మచాపి సమాధేయం||

గోవిన్దరాజ టీకాలో - యత్తైఃయతమానైః అప్రమత్తైః ఇతి।
తిలక టీకాలో -యత్తైః సావసానైః । కించ అత్ర దేసకాల విరోధీ కర్మ న కార్యం ఇత్యాహ దేశకాలావిరోధితం తత్ విరుద్ధం।తత్ ఉచితమితి యావత్। సమాధేయం కార్యం।

|| శ్లోకార్థములు||

తం వనాలయం ఆసాద్య -
ఆ వనాలయుని సమీపించి
యత్తైః చ భావ్యం - అప్రమత్తముగా
దేశకాలావిరోధినం - దేశకాలములకు అనుగుణముగా
కర్మచాపి సమాధేయం - కర్మ చేయతగినది

|| శ్లోకతాత్పర్యము||

"ఆ వనాలయుని సమీపించి అప్రమత్తముగా దేశ కాలములకు అనుగుణముగా, తగిన రీతిని కార్యము చేపట్టండి."||46.05||

||శ్లోకము 46.06||

న హ్యహం తం కపిం మన్యే కర్మణా ప్రతితర్కయన్|
సర్వధా తన్మహద్భూతం మహాబలపరిగ్రహమ్||46.06||

స|| అహం కర్మణా ప్రతితర్కయన్ తం కపిం న మన్యే | సర్వథా మహత్ భూతం మహాబలపరిగ్రహం ||

|| శ్లోకార్థములు||

అహం కర్మణా ప్రతితర్కయన్ -
నేను జరిగిన కర్మలను గురించి ఆలోచించి
తం కపిం న మన్యే -
అతడు వానరుడు అని అనుకొనను
సర్వథా మహత్ భూతం -
అన్నివిధములుగా మహత్తరమైన ప్రాణి
మహాబలపరిగ్రహం -
మహత్తరమైన బలము కల ప్రాణి

|| శ్లోకతాత్పర్యము||

"నేను జరిగిన కర్మలను చూచి అతడు వానరుడు అనుకొనను. అతడు అన్నివిధములుగా మహత్తరమైన బలము కల మహా ప్రాణి".||46.06||

||శ్లోకము 46.07||

భవేదింద్రేణ వా సృష్టమస్మదర్థం తపోబలాత్|
సనాగయక్షగంధర్వా దేవాసురమహర్షయః||46.07||

స|| అస్మదర్థం తపోబలాత్ ఇంద్రేణ స నాగయక్ష గంధర్వా దేవాసుర మహర్షయః సృష్ఠం వా||

|| శ్లోకార్థములు||

అస్మదర్థం తపోబలాత్ ఇంద్రేణ -
మనను జయించుటకు తపోబలముతో ఇంద్రునిచేత
స నాగయక్ష గంధర్వా -
నాగ యక్ష గంధర్వులతో పాటు
దేవాసుర మహర్షయః సృష్ఠం వా-
దేవాసుర మహర్షులు చేత సృష్ఠింప బడి ఉండవచ్చు

|| శ్లోకతాత్పర్యము||

"మనను జయించుటకు తపోబలముతో ఇంద్రునిచేత నాగ యక్ష గంధ్రవ దేవ అసుర మహర్షుల చేత సృష్ఠింపబడి ఉండవచ్చు." ||46.07||

||శ్లోకము 46.08||

యుష్మాభి స్సహితైః సర్వేర్మయా సహ వినిర్జితాః|
తైరవశ్యం విధాతవ్యం వ్యళీకం కించిదేవ నః||46.08||

యుష్మాభిః సహ తైః సర్వైః మయా వినిర్జితాః| అవశ్యం తైః కించిదేవ వ్యళీకం విధాతవ్యం ||

|| శ్లోకార్థములు||

యుష్మాభిః సహ - మీ అందరి తో కలిసి
తైః సర్వైః మయా వినిర్జితాః -
వారు అందరు నాచేత జయింపబడితిరి కదా
అవశ్యం తైః కించిదేవ -
తప్పక వారు మనకు కొంచమైనా
వ్యళీకం విధాతవ్యం -
ఉపద్రవము కలిగించవచ్చు

|| శ్లోకతాత్పర్యము||

"మీ అందరి తో కలిసి వారు అందరినీ నేను జయించితిని కదా. తప్పక వారు మనకు ఉపద్రవము కలిగించవచ్చు." ||46.08||

అంటే ముందు వారిని జయించాముకాబట్టి , వాళ్ళు రోషముతో మనకి ఉపద్రవము కలిగించుటకు , వానర రూపములో వచ్చి వుండవచ్చును అని భావము.

||శ్లోకము 46.09||

తదేవ నాత్ర సందేహః ప్రసహ్యా పరిగృహ్యతామ్|
యాత సేనాగ్రగాః సర్వే మహాబల పరిగ్రహాః ||46.09||

స|| తదేవ అత్ర సందేహః న | ప్రసహ్య పరిగృహ్యతాం || యాత సేనాగ్రగాః సర్వే మహాబల పరిగ్రహాః॥

|| శ్లోకార్థములు||

తదేవ అత్ర సందేహః న -
దానిలో సందేహము లేదు
ప్రసహ్య పరిగృహ్యతాం -
బలముతో అతనిని పరిగ్రహించవలెను
సేనాగ్రగాః సర్వే -
సేనానాయకులారా అందరూ
మహాబలపరిగ్రహాః -
మహాబలముతో కూడిన వారు

|| శ్లోకతాత్పర్యము||

"దానిలో సందేహము లేదు. బలముతో అతనిని పరిగ్రహించవలెను. సేనానాయకులారా అందరూ మహా బలముతో కూడిన వారు."||46.09||

||శ్లోకము 46.10||

సవాజిరథమాతంగాః స కపిః శాస్యతామితి||
నావమాన్యో భవద్భిశ్చ హరిర్ధీరపరాక్రమః||46.09||

స||సవాజిరథమాతంగాః స కపిః శాస్యతామితి| స హరిః ధీరపరిక్రమః భవద్భిః న అవమాన్యః చ||

గోవిన్దరాజులవారి టీకాలో- నావమాన్యో హరిద్భిశ్చ హరిర్ధీరపరాక్రమః ఇతి అత్ర త్రయోదశ శ్లోకాః గతాః । అయం చతుర్దససహస్రస్య ఆదిః।ధీ ఇతి గాయత్ర్యా చతుర్దశ అక్షరం।

'నావమాన్యో హరిద్భిశ్చ హరిర్ధీరపరాక్రమః' అని ఇక్కడితో పదమూడువేల శ్లోకాలు పూర్తి అయినాయి. ఇది పదునాలుగొవ సహస్రము మొదలు. గాయత్రీమంత్రములోని పదునాలుగొవ అక్షరము 'ధీ' ధీరపరాక్రమః అన్నపదములో ఇమిడి యున్నది.

|| శ్లోకార్థములు||

సవాజిరథమాతంగాః -
సమస్త గజములు అశ్వములు రథములు కలవారై
స కపిః శాస్యతామితి- ఆ కపిని శాసించుడు
స హరిః ధీరపరిక్రమః -
ఆ వానరుడు ధీరపరాక్రమము గలవాడు
భవద్భిః న అవమాన్యః చ -
వానరుడు మీచేత అవమానింపబడరాదు

|| శ్లోకతాత్పర్యము||

"దానిలో సందేహము లేదు. బలముతో అతనిని పరిగ్రహించుడు. ఆ ధీరపరాక్రమము గల వానరుడు మీచేత అవమానింపబడరాదు".||46.09||

అంటే ఈ శ్లోకము ఒక మంత్రములా పరిగణించబడుతుంది. మంత్రము అంటే ధ్యానసమయములలో దీనిని ఉపయోగించవచ్చు అని.

||శ్లోకము 46.11||

దృష్టా హి హరయః పూర్వం మయా విపులవిక్రమాః|
వాలీ చ సహ సుగ్రీవో జాంబవంశ్చ మహాబలః||46.11||

స|| పూర్వం మయా విపులవిక్రమాః మహాబలః వాలీ చ జాంబవంతః సుగ్రీవః సహ హరయః దృష్టా ||

|| శ్లోకార్థములు||

పూర్వం మయా -పూర్వము నా చేత
విపులవిక్రమాః మహాబలః వాలీ చ -
అతి పరాక్రమము గల మహాబలవంతులు వాలీ అలాగే
జాంబవంతః సుగ్రీవః సహ హరయః -
జాంబవంతుడు సుగ్రీవుడు మున్నగు వానరులు
దృష్టా - చూడబడిరి

|| శ్లోకతాత్పర్యము||

"పూర్వము నాచేత అతి పరాక్రమము గల మహాబలవంతులు వాలీ జాంబవంతుడు సుగ్రీవుడు చూడబడిరి."||46.11||

||శ్లోకము 46.12||

నీలః సేనాపతిశ్చైవ యే చాన్యే ద్వివిదాదయః|
నైవం తేషాం గతిర్భీమాన తేజో న పరాక్రమః||46.12||

స|| నీలః ద్వివిదాదయః అన్యే సేనాపతిః చ తేషాం గతిః న ఏవం తేజః పరాక్రమః న||

|| శ్లోకార్థములు||

నీలః ద్వివిదాదయః -
నీలుడు ద్వివిదుడు
అన్యే సేనాపతిః చ -
ఇంకా ఇతర సేనాపతులు కూడా
తేషాం గతిః న ఏవం -
వారి వేగము ఇలాంటి కాదు.
తేజః పరాక్రమః న -
తేజము పరాక్రమము లేవు

|| శ్లోకతాత్పర్యము||

"నీలుడు ద్వివిదుడు ఇంకా ఇతర సేనాపతులు వారికి ఇలాంటి వేగము తేజము పరాక్రమము లేవు. " ||46.12||

||శ్లోకము 46.13||

నమతిర్న బలోత్సాహౌ న రూపపరికల్పనమ్|
మహత్సత్త్వ మిదం జ్ఞేయం కపిరూపం వ్యవస్థితమ్||46.13||
ప్రయత్నం మహదాస్థాయ క్రియతా మస్య నిగ్రహః|

స|| న మతిః బలః ఉత్సాహః న రూపపరికల్పనం | ఇదం కపిరూపం వ్యవస్థితం మహత్ సత్త్వం జ్ఞేయం || మహత్ ప్రయత్నం ఆస్థాయ అస్య నిగ్రహః క్రియతాం||

|| శ్లోకార్థములు||

న మతిః బలః ఉత్సాహః -
అంత బుద్ధి, బలము ఉత్సాహము లేవు
న రూపపరికల్పనం -
శరీరరూప పరికల్పన శక్తి లేవు
ఇదం కపిరూపం వ్యవస్థితం -
ఈ కపిరూపము ధరించిన (ఇతడు)
మహత్ సత్త్వం జ్ఞేయం -
మహత్తరమైన ప్రాణి అని తెలిసికొనవలెను
మహత్ ప్రయత్నం ఆస్థాయ -
మహత్తరమైన ప్రయత్నముతో
అస్య నిగ్రహః క్రియతాం -
వానిని నిగ్రహించుడు

|| శ్లోకతాత్పర్యము||

"అంత బుద్ధి, బలము ఉత్సాహము శరీరరూప పరికల్పన శక్తి లేవు. ఇతడు కపిరూపము ధరించిన మహత్తరమైన ప్రాణి అని తెలిసికొనవలెను. మహత్తరమైన ప్రయత్నముతో వానిని నిగ్రహించుడు".||46.13||

||శ్లోకము 46.14||

కామం లోకాస్త్రయః సైంద్రాః ససురాసురమానవాః |
భవతా మగ్రతః స్థాతుం న పర్యాప్తా రణాజిరే||46.14||

స|| స ఇంద్రాః స సురాసురమానవాః త్రయః లోకాః రణాజిరే భవతామ్ అగ్రతః స్థాతుం న పర్యాతాః కామమ్||

|| శ్లోకార్థములు||

స ఇంద్రాః స సురాసురమానవాః -
ఇంద్రునితో సురాసుర మానవులలో
త్రయః లోకాః -
ఈ మూడు లోకములలో
రణాజిరే భవతామ్ అగ్రతః స్థాతుం -
యుద్ధరంగములో మీ ముందు నిలబడుటకు
న పర్యాతాః కామమ్ -
ఎవరూ లేరని చెప్పవచ్చు

|| శ్లోకతాత్పర్యము||

"ఇంద్రునితో కలిపి ఈ మూడు లోకములలో సురాసుర మానవులలో యుద్ధరంగములో ఎవరూ మీ ముందు నిలబడ లేరు అన్నది నిజము."||46.14||

||శ్లోకము 46.15||

తథాపి తు నయజ్ఞేన జయ మాకాంక్షతా రణే||46.15||
అత్మా రక్ష్యః ప్రయత్నేన యుద్ధసిద్దిర్హి చంచలా|

స|| తథాపి తు రణే జయం ఆకాంక్షయా ప్రయత్నేన ఆత్మా రక్ష్యః | యుద్ధసిద్ధిః చంచలాః||

|| శ్లోకార్థములు||

తథాపి తు రణే జయం -
అయిననూ రణములో జయము
ఆకాంక్షయా ప్రయత్నేన -
ఆకాంక్షించు ప్రయత్నములో
ఆత్మా రక్ష్యః - ఆత్మరక్షణ చేసుకోవలెను
యుద్ధసిద్ధిః చంచలాః -
యుద్దములో సిద్ధి అచంచలము కదా

|| శ్లోకతాత్పర్యము||

"అయిననూ రణములో జయము ఆకాంక్షించు ప్రయత్నములో ఆత్మరక్షణ చేసుకోవలెను. యుద్దములో సిద్ధి అచంచలము కదా".||46.15||

ఇక్కడ రావణుని మాటలు, "ఇంద్రునితో కలిపి ఈ మూడు లోకములలో సురాసుర మానవులలో యుద్ధరంగములో ఎవరూ మీ ముందు నిలబడ లేరు అన్నది నిజము. అయిననూ రణములో జయము ఆకాంక్షించు ప్రయత్నములో ఆత్మరక్షణ చేసుకోవలెను. యుద్దములో సిద్ధి అచంచలము కదా", అని.

అంటే కింకరులు, జంబుమాలి, అమాత్య పుత్రులు అవలీలగా హతమార్చబడడముతో, రావణుడుకి వాలి సుగ్రీవులకన్నా పరాక్రమము గలవాడు, ఈ వానరుడు ఎవరా అని అనుమానము రేకెత్తింది అన్నమాట.

||శ్లోకము 46.16, 17||

తే స్వామి వచనం సర్వే ప్రతిగుహ్య మహౌజసః||46.16||
సముత్పేతుర్మహావేగా హుతాశసమతేజసః|

రథైర్మత్తైశ్చ మాతంగైర్వాజిభిశ్చ మహాజనైః||46.17||
శస్త్రైశ్చ వివిధైః తీక్ష్‍ణైః సర్వైశ్చోపచితా బలైః|

స|| మహౌజసః హుతాశ సమ తేజసః తే సర్వే స్వామివచనం ప్రతిగృహ్య మహావేగాః రథైః మత్తైః మాతంగైః మహాజవైః వాజిభిశ్చ తీక్ష్ణైః వివిధైః శస్త్రైః సర్వే బలైః ఉపచితాః సముత్పేతుః||

|| శ్లోకార్థములు||

మహౌజసః - మహత్తరమైన ఔజసము కలవారు
హుతాశ సమ తేజసః -
అగ్నితో సమానమై తేజస్సు కలవారు
తే సర్వే స్వామివచనం ప్రతిగృహ్య-
వారు అందరు తమ స్వామి వచనములను స్వీకరించి
రథైః మత్తైః మాతంగైః మహాజవైః వాజిభిశ్చ -
మత్తెక్కిన మాతంగములతో, అధిక వేగము కల అశ్వములతో
తీక్ష్ణైః వివిధైః శస్త్రైః -
తీక్షణమైన శస్త్రములతోకూడిన
సర్వే బలైః ఉపచితాః -
సమస్త సైన్యము తీసుకొని
మహావేగాః సముత్పేతుః -
మహావేగము గలవారు బయలు దేరిరి

|| శ్లోకతాత్పర్యము||

మహత్తరమైన ఔజసము కలవారు , అగ్నితో సమానమై తేజస్సు కలవారు వారు అందరు తమ స్వామి వచనములను స్వీకరించి మహావేగముతో మత్తెక్కిన మాతంగములతో, అధిక వేగము కల అశ్వములతో, తీక్షణమైన శస్త్రములతోకూడిన సైన్యము తీసుకొని బయలు దేరిరి.

||శ్లోకము 46.18||

తతస్తం దదృశుర్వీరా దీప్యమానం మహాకపిమ్|
రస్మిమంతమివోద్యంతం స్వతేజోరశ్మిమాలినమ్|
తోరణస్థం మహోత్సాహం మహాసత్త్వం మహాబలమ్||46.18||

స|| తతః వీరాః స్వతేజోరస్మిమాలినం ఉద్యంతం రస్మిమంతం ఇవ దీప్యమానం తోరణస్థం మహోత్సాహం మహాసత్త్వం మహాబలం తం మహాకపిం దదృశుః||

|| శ్లోకార్థములు||

తతః వీరాః - అప్పుడు ఆ వీరులు
స్వతేజోరస్మిమాలినం -
తన తేజముతో ఉజ్జ్వరిల్లుతున్న
ఉద్యంతం రస్మిమంతం ఇవ దీప్యమానం - సూర్యునివలె వెలుగుతూవున్న
తోరణస్థం - తోరణముపై కూర్చుని ఉన్న
మహోత్సాహం మహాసత్త్వం మహాబలం -
మహోత్సాహము మహాబలము కల మహత్తరమైన సత్త్వముగల
తం మహాకపిం దదృశుః -
ఆ మహాకపిని చూచిరి

|| శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ వీరులు తన తేజముతో ఉజ్జ్వరిల్లుతున్న సూర్యునివలె వెలుగుతూవున్న మహోత్సాహముతో అశోకవన తోరణముపై కూర్చుని ఉన్నమహాబలము కల మహత్తరమైన సత్త్వముగల మహాకపిని చూచిరి."||46.18||

||శ్లోకము 46.19||

మహామతిం మహావేగం మహాకాయం మహాబలమ్
తం సమీక్ష్యైవ తే సర్వే దిక్షు సర్వాస్వవస్థితాః||46.19||
తైస్తైః ప్రహరణైర్భీమైరభిపేతుః తతస్తతః|

స|| మహామతిం మహావేగం మహాకాయం మహాబలం తం సమీక్ష్యైవ తే సర్వే సర్వా దిక్షుః తైః తైః తతః తతః భీమైః ప్రహరణైః అభిపేతుః వ్యవస్థితాః ||

|| శ్లోకార్థములు||

మహామతిం మహావేగం -
మహత్తరమైన బుద్ధి , మహా వేగము
మహాకాయం మహాబలం -
మహాకాయము మహాబలము కల
తం సమీక్ష్యైవ - వానిని చూచి
తే సర్వే సర్వా దిక్షుః తతః తతః -
వారు అందరూ అన్ని దిశలలో అక్కడ అక్కడ
తైః తైః - తమ తమ
భీమైః ప్రహరణైః అభిపేతుః వ్యవస్థితాః-
భయంకరమైన అస్త్రములతో దాడిచేసిరి.

|| శ్లోకతాత్పర్యము||

"మహత్తరమైన బుద్ధి , మహా వేగము మహాకాయము మహాబలము కల వానిని చూచి వారు అందరూ అన్ని దిశలలోడాక్కదక్కద తమ తమ భయంకరమైన అస్త్రములతో దాడిచేసిరి."||46.19||

||శ్లోకము 46.20||

తస్య పంచాయసాః తీక్ష్ణాః శితాః పీతముఖాః శరాః||46.20||
శిరస్యుత్పలపత్రాభా దుర్ధరేణ నిపాతితాః|

స||పంచ తీక్ష్ణాః శితాః పీతముఖాః ఉత్పలపత్రాభాః ఆయసాః శరాః తస్య శిరస్యు దుర్ధరేణ నిపాతితాః ||

|| శ్లోకార్థములు||

పంచ తీక్ష్ణాః శితాః పీతముఖాః ఉత్పలపత్రాభాః -
ఇదు వాడిఅయిన ముక్కు గల పచ్చని కలువరేకుల రంగుకల
ఆయసాః శరాః -
ఇనుముతో చేయబడిన శరములను
దుర్ధరేణ తస్య శిరస్యు నిపాతితాః -
దుర్ధరుని చేత ఆ వానరుని శిరస్సుపై ప్రయోగింపబడెను

|| శ్లోకతాత్పర్యము||

"ఇదు వాడిఅయిన ముక్కు గల పచ్చని కలువరేకుల రంగుకల ఇనుముతో చేయబడిన శరములను ఆ వానరుని శిరస్సుపై దుర్ధరుడు ప్రయోగించెను."

||శ్లోకము 46.21||
"
స తైః పంచభిరావిద్ధః శరైః శిరసి వానరః||46.21||
ఉత్పపాత నదన్ వ్యోమ్ని దిశో దశ వినాదయన్|

స||సః వానరః తైః పంచభీ శరైః శిరసి ఆవిద్ధః నదన్ దశదిశః వినాదయన్ వ్యోమ్ని ఉత్పపాత||

|| శ్లోకార్థములు||

సః వానరః - ఆ వానరుడు
తైః పంచభీ శరైః శిరసి ఆవిద్ధః -
ఆ ఇదు బాణములతో శిరస్సుపై కొట్టబడి
నదన్ దశదిశః వినాదయన్ -
పది దిశలలో మారుమోగునట్లు పెద్దశబ్దము చేయుచూ
వ్యోమ్ని ఉత్పపాత -
ఆకాశములోకి ఎగిరెను

|| శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుడు ఆ ఇదు బాణములతో శిరస్సుపై కొట్టబడి పది దిశలలో మారుమోగునట్లు పెద్దశబ్దము చేయుచూ ఆకాశములోకి ఎగిరెను." ||46.21||

||శ్లోకము 46.22||

తతస్తు దుర్ధరో వీరః సరథః సజ్యకార్ముకః||46.22||
కిరణ్ శతశతైః తీక్ష్‍ణైరభిపేదే మహాబలః|

స|| తతః మహాబలః దుర్ధరః సరథః సజ్యకార్ముకః తీక్ష్ణైః శరశతైః కిరణ్ అభిపేదే||

|| శ్లోకార్థములు||

తతః మహాబలః దుర్ధరః -
అప్పుడు ఆ మహబలుడు అగు దుర్ధరుడు
సరథః సజ్యకార్ముకః -
రథముపై నుండి తన ధనస్సుతో
తీక్ష్ణైః శరశతైః కిరణ్ అభిపేదే -
వందలకొలదీ తీక్షణమైన బాణములను ప్రయోగించెను

|| శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ మహబలుడు అగు దుర్ధరుడు రథముపై నుండి తనధనస్సుతో వందలకొలదీ తీక్షణమైన బాణములను ప్రయోగించెను."||46.22||

||శ్లోకము 46.23||

స కపిర్వారయామాస తం వ్యోమ్ని శరవర్షిణమ్||46.23||
సృష్టిమంతం పయోదాంతే పయోదమివ మారుతః|

స|| స కపిః వ్యోమ్ని శరవర్షిణం తం పయోదాంతే వృష్టిమంతం పయోదం మారుతః ఇవ వారయామాస||

రామ టీకాలో - పయోదాన్తే వర్షాన్తకాలే వృష్టిమన్తం పయోదమివ

|| శ్లోకార్థములు||

స కపిః వ్యోమ్ని - ఆ వానరుడు ఆకాశములో
తం పయోదాంతే వృష్టిమంతం పయోదం -
వర్షాకాలము చివరిలో నీటితో నిండిన మేఘములను
మారుతః ఇవ శరవర్షిణం వారయామాస -
వాయువు వలె శరపరంపరను చెల్లాచెదరు చేసెను

|| శ్లోకతాత్పర్యము||

"వర్షాకాలము అంతములో నీటితో నిండిన మేఘములను వాయువు అడ్డగించి చెల్లా చెదరు చేశినట్లు ఆ వానరుడు ఆ దుర్ధరుని శరపరంపరను చెల్లా చెదరు చేసెను." ||46.23||

||శ్లోకము 46.24||

అర్ధ్యమానః తతస్తేన దుర్ధరేణానిలాత్మజః||46.24||
చకార కథనం భూయో వ్యవర్థత చ వేగవాన్ |

స|| తేన దుర్ధరేన అర్ధ్యమానః అనిలాత్మజః తతః కదనం చకార| వేగవాన్ భూయః వ్యవర్ధత||

|| శ్లోకార్థములు||

తేన దుర్ధరేన అర్ధ్యమానః -
ఆ దుర్ధరునిచేత ఎదుర్కొనబడిన
అనిలాత్మజః తతః కదనం చకార -
ఆ అనిలాత్మజుడు తన పనిమొదలెట్టెను
వేగవాన్ భూయః వ్యవర్ధత -
వేగముగా తన పరిణామము పెంచెను

|| శ్లోకతాత్పర్యము||

"ఆ దుర్ధరునిచేత ఎదుర్కొనబడిన ఆ అనిలాత్మజుడు తన పనిమొదలెట్టెను.వేగముగా తన పరిణామము పెంచెను."||46.24||

||శ్లోకము 46.25||

సదూరం సహసోత్పత్య దుర్దరస్య రథే హరిః||46.25||
నిపపాత మహావేగో విద్ర్యుద్రాశిర్గిరావివ|

స|| స హరిః సహసా ఉత్పత్య మహావేగః గిరౌ విద్యుత్ రాశిః ఇవ దుర్ధరస్య రథే నిపపాత||

|| శ్లోకార్థములు||

స హరిః సహసా ఉత్పత్య -
ఆ వానరుదు వెంటనే పైకి ఎగిరి
మహావేగః గిరౌ విద్యుత్ రాశిః ఇవ -
మహావేగముతో పర్వతముపై పిడుగులు పడినట్లు
దుర్ధరస్య రథే నిపపాత -
దుర్ధరుని రథముపై పడెను

|| శ్లోకతాత్పర్యము||

"ఆ వానరుదు వెంటనే పైకి ఎగిరి మహావేగముతో పర్వతముపై పిడుగులు పడినట్లు దుర్ధరుని రథముపై పడెను." ||46.25||

||శ్లోకము 46.26||

తతః స మధితాష్టాశ్వం రథం భగ్నాక్షకూబరమ్||46.26||
విహాయన్యపతద్భూమౌ దుర్ధరః త్యక్త జీవితః|

స|| తతః సః మథితాష్టాశ్వం భగ్నాక్షకూబరం రథం విహాయ త్యక్తజీవితః భూమౌ న్యపతత్ ||
'
|| శ్లోకార్థములు||

తతః సః - అప్పుడు అతడు
మథితాష్టాశ్వం భగ్నాక్షకూబరం రథం విహాయ -
ఆ తాకిడికి ఎనిమిది గుఱ్ఱములు, ఆ రథము భగ్నమైపోగా దానిని వదిలి
త్యక్తజీవితః భూమౌ న్యపతత్ -
జీవితము వదిలినవాడై భూమిపై పడెను

|| శ్లోకతాత్పర్యము||

"ఆప్పుడు అతడు ఆ తాకిడికి ఎనిమిది గుఱ్ఱములుకల ఆ రథము భగ్నమైపోగా దానిని వదిలి, జీవితము వదిలినవాడై భూమిపై పడెను." ||46.26||

||శ్లోకము 46.27||

తం విరూపాక్షయూపాక్షౌ దృష్ట్వా నిపతితం భువి||46.27||
సంజాతరోషౌ దుర్దర్షావుత్పేతతురరిందమౌ|

స|| దుర్ధర్షౌ అరిందమౌ విరూపాక్షయూపాక్షౌ భువి నిపాతితం తం దృష్ట్వా సంజాతరోషౌ ఉత్పేతుః||

|| శ్లోకార్థములు||

దుర్ధర్షౌ అరిందమౌ విరూపాక్షయూపాక్షౌ -
దుర్ధరులైన ఆ యూపాక్ష విరూపాక్షులు
భువి నిపాతితం తం దృష్ట్వా-
భూమిమీద పడిన ఆ దుర్ధరుని చూచి
సంజాతరోషౌ ఉత్పేతుః -
మరింత రోషము కలవారై పైకి ఎగిరిరి

|| శ్లోకతాత్పర్యము||

"దుర్ధరులైన ఆ యూపాక్ష విరూపాక్షులు భూమిమీద పడిన ఆ దుర్ధరుని చూచి మరింత రోషము కలవారు అయిరి." ||46.27||

||శ్లోకము 46.28||

స తాభ్యాం సహసోత్పత్య విష్ఠితో విమలేంబరే||46.28||
ముద్గరాభ్యాం మహాబాహు ర్వక్షస్యభిహితః కపిః|

స|| విమలే అంబరే తిష్ఠితః మహాబాహుః సః మహాకపిః తాభ్యాం సహసా ఉత్పత్య ముద్గరాభ్యాం వక్షసి అభిహితః||

|| శ్లోకార్థములు||

విమలే అంబరే తిష్ఠితః -
విమాలాకాశములో ఉన్న
మహాబాహుః సః మహాకపిః -
మహాబాహువులు కల ఆ మహాకపి
తాభ్యాం సహసా ఉత్పత్య -
వేగముగా పైకి లేచిన వారిద్దరి చేత
ముద్గరాభ్యాం వక్షసి అభిహితః -
ముద్గరలతో వక్షస్థలముపై కొట్టబడెను

|| శ్లోకతాత్పర్యము||

"విమాలాకాశములో ఉన్న మహాబాహువులు కల ఆ మహాకపి వేగముగా పైకి లేచిన వారిద్దరి చేత తన వక్షస్థలముపై కొట్టబడెను." ||46.28||

||శ్లోకము 46.29||

తయోర్వేగవతోర్వేగం వినిహత్య మహాబలః||46.29||
నిపపాత పునర్భూమౌ సుపర్ణ సమవిక్రమః|

స|| మహాబలః సుపర్ణసమ విక్రమః వేగవతోః తయోః వేగం వినిహత్య పునః భూమౌ నిపపాత||

|| శ్లోకార్థములు||

మహాబలః సుపర్ణసమ విక్రమః -
మహాబలుడు గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల వానరుడు
వేగవతోః తయోః వేగం వినిహత్య -
వేగముతో వచ్చిన వారిద్దరిని వేగము ధాటిని ఎదురుకొని
పునః భూమౌ నిపపాత -
మరల భూమిపై పడెను

|| శ్లోకతాత్పర్యము||

"మహాబలుడు గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల వానరుడు వేగముతో వచ్చిన వారిద్దరిని వేగము ధాటిని ఎదురుకొని మరల భూమిపై పడెను." ||46.29||

||శ్లోకము 46.30||

స సాలవృక్ష మాసాద్య త ముత్పాట్య చ వానరః||46.30||
తా వుభౌ రాక్షసౌ వీరౌ జఘాన పవనాత్మజః|'

స|| వానరః సః పవనాత్మజః సాలవృక్షం ఆసాద్య తం ఉత్పాట్య తౌ ఉభౌ వీరౌ రాక్షసౌ జఘాన||

|| శ్లోకార్థములు||

వానరః సః పవనాత్మజః -
పవనాత్మజుడైన అ వానరుడు
సాలవృక్షం ఆసాద్య తం ఉత్పాట్య -
ఒక సాలవృక్షమును పెకలించి తీసుకొని
తౌ ఉభౌ వీరౌ రాక్షసౌ జఘాన -
ఆ రాక్షస వీరులిద్దరినీ హతమార్చెను

|| శ్లోకతాత్పర్యము||

"పవనాత్మజుడైన అ వానరుడు అప్పుడు ఒక సాలవృక్షమును తీసుకొని ఆ రాక్షస వీరులిద్దరినీ హతమార్చెను". ||46.30||

||శ్లోకము 46.31,32||

తతః తాం స్త్రీన్ హతాన్ జ్ఞాత్వా వానరేణ తరస్వినా||46.31||
అభిపేదే మహావేగః ప్రసహ్యా ప్రఘసో హరిం|
భాసకర్ణశ్చ సంక్రుద్ధః శూలమాదాయ వీర్యవాన్||46.32||

స||తతః తరస్వినా వానరేన తాన్ త్రీన్ హతాన్ జ్ఞాత్వా ప్రఘసః మహావేగః ప్రసహ్యా అభిపేదే | వీర్యవాన్ భాసకర్ణః చ సంకృద్ధః శూలం ఆదాయ||

|| శ్లోకార్థములు||

తతః తరస్వినా వానరేన -
అప్పుడు మహావేగము కల వానరుని చేత
తాన్ త్రీన్ హతాన్ జ్ఞాత్వా -
ముగ్గురు హతమార్చబడినట్లు తెలిసికొని
ప్రఘసః మహావేగః ప్రసహ్యా అభిపేదే -
ప్రఘసుడు మహావేగముతో దాడి చేసెను
వీర్యవాన్ భాసకర్ణః చ -
వీరుడు భాసకర్ణుడు కూడా
సంకృద్ధః శూలం ఆదాయ -
కోపోద్రిక్తుడై శూలము తీసుకు వచ్చెను

|| శ్లోకతాత్పర్యము||

"అప్పుడు అతి బలవంతుడైన వానరుని చేత ముగ్గురు హతమార్చబడినట్లు తెలిసికొని ప్రఘసుడు మహావేగముతో దాడి చేసెను. వీరుడు భాసకర్ణుడు కూడా కోపోద్రిక్తుడై శూలము తీసుకు వచ్చెను." ||46.31,32||

||శ్లోకము 46.33||

ఏకతః కపిశార్దూలం యశస్వినమవస్థితమ్|
పట్టిసేన శితాగ్రేణ ప్రఘసః ప్రత్యయోధయత్||46.33||
భాసకర్ణశ్చ శూలేన రాక్షసః కపిసత్తమమ్|

స|| యశస్వినం కపిశార్దూలం ఏకతః అవస్థితం తం ప్రఘసః శితాగ్రేణ పట్టిసేన కపిసత్తమం ప్రత్యయోధయత్ భాసకర్ణః రాక్షసః శూలేన||

|| శ్లోకార్థములు||

తం యశస్వినం కపిశార్దూలం -
యశోవంతుడు కపి శార్దూలుడు అయిన హనుమంతుని
ఏకతః అవస్థితం ప్రఘసః శితాగ్రేణ పట్టిసేన -
ఒకవేపు వున్నప్రఘసుడు పదునుపట్టిన పట్టిసముతో
భాసకర్ణః రాక్షసః శూలేన -
రాక్షసుడు భాసకర్ణుడు శూలముతో
కపిసత్తమం ప్రత్యయోధయత్ -
ఆ కపిసత్తమునితో యుద్ధము చేయసాగిరి

|| శ్లోకతాత్పర్యము||

"యశోవంతుడు కపి శార్దూలుడు అయిన హనుమంతుని ఒకవేపు పదునుపట్టిన పట్టిసముతో ప్రఘసుడు, ఇంకొకవేపు శూలముతో భాసకర్ణుడు యుద్ధము చేయసాగిరి." ||46.33||

||శ్లోకము 46.34||

స తాభ్యాం విక్షతైర్గాత్రైరసృగ్దిగ్థ తనూరుహః||46.34||
అభవత్ వానరః క్రుద్ధో బాలసూర్య సమప్రభః|

స|| తాభ్యాం విక్షతైః గాత్రైః అసృగ్ధితనూరుహః సః వానరః బాలసూర్యసమప్రభః కృద్ధః అభవత్||

|| శ్లోకార్థములు||

తాభ్యాం విక్షతైః గాత్రైః అసృగ్ధితనూరుహః -
వారిద్దరిచేత గాయపడిన అంగములు కలవాడై శరీరము రక్తశిక్తమయెను
సః వానరః బాలసూర్యసమప్రభః -
ఆ హనుమంతుడు ఉదయభానువలె తేజరిల్లుచూ
కృద్ధః అభవత్ - అతికృద్ధుడయ్యెను

|| శ్లోకతాత్పర్యము||

"వారిద్దరిచేత గాయపడిన అంగములు కలవాడై, శరీరము రక్తశిక్తమయెను. అప్పుడు ఆ హనుమంతుడు ఉదయభానువలె తేజరిల్లుచూ అతికృద్ధుడయ్యెను." ||46.34||

||శ్లోకము 46.35||

సముత్పాట్య గిరేః శృంగం సమృగవ్యాళపాదపమ్||46.35||
జఘాన హనుమాన్వీరౌ రాక్షసౌ కపికుంజరః|

స|| కపికుంజరః వీరః హనుమాన్ సమృగవ్యాలపాదపమ్ గిరే శృంగం సముత్పాట్య రాక్షసౌ జఘాన||

|| శ్లోకార్థములు||

కపికుంజరః వీరః హనుమాన్ -
వీరుడు కపికుంజరుడు అయిన ఆ హనుమంతుడు
సమృగవ్యాలపాదపమ్ -
మృగములు వృక్షములతో కూడిన
గిరే శృంగం సముత్పాట్య -
పర్వత శిఖరమును పెకలించి
రాక్షసౌ జఘాన -
ఆ రాక్షసులను హతమార్చెను

|| శ్లోకతాత్పర్యము||

"వీరుడు కపికుంజరుడు అయిన ఆ హనుమంతుడు మృగములు వృక్షములతో కూడిన ఒక పర్వత శిఖరమును పెకలించి ఆ రాక్షసులను హతమార్చెను."||46.35||

||శ్లోకము 46.36||

తతస్తేష్వవసన్నేషు సేనాపతిషు పంచసు||
బలం చ తదవశేషం చ నాశయామాస వానరః||46.36||

స|| తతః తేషు పంచసు సేనాపతిషు అవసన్నేషు వానరః తత్ అవశేషం బలం నాశయామాస||

|| శ్లోకార్థములు||

తతః తేషు పంచసు సేనాపతిషు అవసన్నేషు -
అప్పుడు ఆ ఇదుమంది సేనాపతులు మరణించిన తరువాత
వానరః తత్ అవశేషం బలం -
వానరుడు మిగిలిన సేనా బలములను
నాశయామాస -
నాశనము చేయసాగెను.

|| శ్లోకతాత్పర్యము||

"అప్పుడు ఆ ఇదుమంది సేనాపతులను హతమార్చి మిగిలిన సేనా బలములను నాశనము చేయసాగెను." ||46.36||

||శ్లోకము 46.37||

అశ్వైరశ్వాన్ గజైర్నాగాన్ యోధైర్యోధాన్ రథై రథాన్|
సకపిర్నాశయామాస సహస్రాక్ష ఇవాసురాన్||46.37||

స|| స కపిః సహస్రాక్షః అసురాన్ ఇవ అశ్వైః అశ్వాన్ గజైః నాగాన్ యోధైః యోధాన్ రథైః రథాన్ నాసయామాస||

|| శ్లోకార్థములు||

స కపిః సహస్రాక్షః అసురాన్ ఇవ -
సహస్రాక్షుడు అసురలను చంపినట్లు
అశ్వైః అశ్వాన్ గజైః నాగాన్ -
అశ్వములను అశ్వముఅతో గజములను గజములతో
యోధైః యోధాన్ రథైః రథాన్ -
యోధులను యోధులతోనూ రథములను రథములతోనూ
నాశయామాస - నాశనము చేయసాగెను

|| శ్లోకతాత్పర్యము||

"సహస్రాక్షుడు అసురలను చంపినట్లు ఆ హనుమంతుడు అశ్వములను అశ్వములతో గజములను గజములతో యోధులను యోధులతోనూ రథములను రథములతోనూ నాశనము చేయసాగెను." ||46.37||

||శ్లోకము 46.38||

హతైర్నాగైశ్చ తురగైర్భగ్నాక్షైశ్చ మహారథైః|
హతైశ్చ రాక్షసైర్భూమీరుద్దమార్గా సమంతతః||46.38||

స|| హతైః నాగైః తురగైః భగ్నాక్షైః మహారథైశ్చ హతైః రాక్షసః భూమిః సమన్తతః రుద్ధమార్గా||

|| శ్లోకార్థములు||

హతైః నాగైః తురగైః -
హతమార్చబడిన గజములతో తురగములతో
భగ్నాక్షైః మహారథైశ్చ-
ముక్కలు చేయబడిన మహారథములతో
హతైః రాక్షసః -
హతమార్చబడిన రాక్షసులతో
భూమిః సమన్తతః రుద్ధమార్గా -
భూమిలో మార్గములన్నీ నిండి పోయినవి

|| శ్లోకతాత్పర్యము||

"హతమార్చబడిన గజములతో తురగములతో ముక్కలు చేయబడిన మహారథములతో హతమార్చబడిన రాక్షసులతో భూమిలో మార్గములన్ని నిండి పోయినవి." ||46.38||

||శ్లోకము 46.39||

తతః కపిస్తాన్ ధ్వజినీపతీన్ రణే
నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్|
సమీక్ష్య వీరః పరిగృహ్య తోరణం
కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే||46.39||

స|| తతః వీరః కపిః వీరాన్ సబలాన్ స వాహనాన్ తాన్ ధ్వజినిపతీన్ రణే నిహత్య సమీక్ష తోరణం పరిగృహ్య ప్రజాక్షయే కాలః ఇవ కృతక్షణః||

తిలక టీకాలో- ధ్వజనీపతీన్ సేనాపతీన్, పరిగృహ్య ఆశ్రిత్య స్థిత ఇతి శేషః।

|| శ్లోకార్థములు||

తతః వీరః కపిః -
అప్పుడు అ వీరుడు వానరుడు
వీరాన్ సబలాన్ స వాహనాన్ -
సైన్యబలములతో కూడిన వాహనములతో కూడిన ఆ వీరులను
తాన్ ధ్వజినిపతీన్ రణే నిహత్య -
సేనానాయకులను రణములో హతమార్చి
సమీక్ష తోరణం పరిగృహ్య -
అది సమీక్షించి అ అశోకవన తోరణము ఎక్కి
ప్రజాక్షయే కాలః ఇవ కృతక్షణః -
ప్రజలను కబళించు కాలుని వలె నిలబడెను.

|| శ్లోకతాత్పర్యము||

"అప్పుడు అ వీరుడు వానరుడు ఆ సైన్యబలములతో కూడిన వాహనములతో కూడిన ఆ వీరులను రణములో హతమార్చి మళ్ళీ అశోకవన తోరణముపై ప్రజలను కబళించు కాలుని వలె నిలబడెను." ||46.39||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఆరవ సర్గ సమాప్తము.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే షట్చత్త్వారింశస్సర్గః ||

|| ఓమ్ తత్ సత్||