||సుందరకాండ ||

||నలభై ఆరవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

||ఓమ్ తత్ సత్||
హతాన్ మంత్రిసుతాన్ బుద్ధ్వా వానరేణ మహాత్మనా|
రావణః సంవృతాకారః చకార మతిముత్తమామ్||1||
స|| మహాత్మనా వానరేణ మంత్రిసుతాన్ హతాన్ (ఇతి) బుద్ధ్వా రావణః సంవృతాకారః ఉత్తమామ్ మతిం చకార||
తా||మహాత్ముడైన వానరునిచేత మంత్రిసుతులు హతమార్చబడిరి అని తెలిసికొని రావణుడు తనవిచారమును వెళ్ళడించకుండా అలోచించెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ షట్చత్త్వారింశస్సర్గః||

మహాత్ముడైన వానరునిచేత మంత్రిసుతులు హతమార్చబడిరి అని తెలిసికొని రావణుడు తనవిచారమును వెళ్ళడించకుండా అలోచించెను.

ఆ దశగ్రీవుడు వీరులు యుద్ధములో అరితేరిన రాక్షసులు విరూపాక్షుడు, యూపాక్షుడు, ప్రఘసుడు, భాసకర్ణుడు, దుర్ధరుడు అని ఐదుమంది అగ్రసేనానాయకులను యుద్ధములో వాయువేగము కల హనుమంతుని బంధించుటకు ఆదేశమిచ్చెను.

' సేనానాయకులు లారా సమస్త గజములు అశ్వములు రథములు కల మహాబలముతో కూడిన వారై ఆ వానరుని శాసించుడు. ఆ వనాలయుని సమీపించి దేశకాలానుగుణముగా తగిన రీతిని కార్యము చేపట్టండి. నేను జరిగిన కర్మలను చూచి అతడు వానరుడు అను కొనను. అతడు అన్నివిధములుగా మహత్తరమైన బలము కల మహా ప్రాణి. మనను జయించుటకు తపోబలముతో ఇంద్రునిచేత నాగ యక్ష గంధర్వ దేవ అసుర మహర్షుల చేత సృష్ఠింపబడి ఉండవచ్చు. మీ అందరితో కలిసి వారు అందరినీ నేను జయించితిని కదా. తప్పక వారు మనకు ఉపద్రవము కలిగించవచ్చు. దానిలో సందేహము లేదు. బలముతో అతనిని పరిగ్రహించుడు. ఆ ధీరపరాక్రమము గల వానరుడు మీచేత అవమానింపబడరాదు'.

' పూర్వము నాచేత అతి పరాక్రమము గల మహాబలవంతులు వాలీ జాంబవంతుడు సుగ్రీవుడు చూడబడిరి. నీలుడు ద్వివిదుడు ఇంకా ఇతర సేనాపతులకు కూడా ఇలాంటి వేగము తేజము పరాక్రమము లేవు. అంత బుద్ధి, బలము ఉత్సాహము శరీరరూప పరికల్పన శక్తి లేవు. ఇతడు కపిరూపము ధరించిన మహత్తరమైన ప్రాణి అని తెలిసికొనవలెను. మహత్తరమైన ప్రయత్నముతో వానిని నిగ్రహించుడు. ఇంద్రునితో కలిపి ఈ మూడు లోకములలో సురాసుర మానవులలో యుద్ధరంగములో ఎవరూ మీ ముందు నిలబడ లేరు అన్నది నిజము. అయిననూ రణములో జయము ఆకాంక్షించు ప్రయత్నములో ఆత్మరక్షణ చేసుకోవలెను. యుద్దములో సిద్ధి అచంచలము కదా.'

రావణుని చేత ఈ విధముగా చెప్పబడిన మహత్తరమైన ఔజసము కల , అగ్నితో సమానమై తేజస్సు కల ఆ ఐదుగురు సేనానాయకులు
తమ స్వామి వచనములను స్వీకరించి మహావేగముతో మత్తెక్కిన మాతంగములతో, అధిక వేగము కల అశ్వములతో, తీక్షణమైన శస్త్రములతోకూడిన సైన్యము తీసుకొని బయలు దేరిరి.

అప్పుడు ఆ వీరులు తన తేజముతో ఉజ్జ్వరిల్లుతున్న సూర్యునివలె వెలుగుతూవున్న మహోత్సాహముతో అశోకవన తోరణముపై కూర్చుని ఉన్నమహాబలము కల మహత్తరమైన సత్త్వముగల మహాకపిని చూచిరి. మహత్తరమైన బుద్ధి, మహా వేగము మహాకాయము మహాబలము కల వానిని చూచి వారు అందరూ అన్ని దిశలనుంచి తమ తమ భయంకరమైన అస్త్రములతో దాడిచేసిరి.

ఐదు వాడిఅయిన ముక్కు గల పచ్చని కలువరేకుల రంగుకల ఇనుముతో చేయబడిన శరములను ఆ వానరుని శిరస్సుపై దుర్ధరుడు ప్రయోగించెను. ఆ వానరుడు ఆ ఐదు బాణములతో శిరస్సుపై కొట్టబడి పది దిశలలో మారుమోగునట్లు పెద్దశబ్దము చేయుచూ ఆకాశములోకి ఎగిరెను.

అప్పుడు ఆ మహబలుడు అగు దుర్ధరుడు రథముపై నుండి తన ధనస్సుతో వందలకొలదీ తీక్షణమైన బాణములను ప్రయోగించెను. శరద్కాలప్రారంభములో నీటితో నిండిన మేఘములను వాయువు అడ్డగించి చెల్లా చెదరు చేశినట్లు ఆ వానరుడు ఆ దుర్ధరుని శరపరంపరను చెల్లా చెదరు చేసెను. ఆ దుర్ధరుని చేత ఎదుర్కొనబడిన ఆ అనిలాత్మజుడు తన పనిమొదలెట్టెను. వేగముగా తన పరిణామము పెంచెను. ఆ వానరుడు వెంటనే పైకి ఎగిరి మహావేగముతో పర్వతముపై పిడుగులు పడినట్లు దుర్ధరుని రథముపై పడెను. ఆప్పుడు ఆ తాకిడికి ఎనిమిది గుఱ్ఱములుకల ఆ రథము భగ్నమైపోగా దానిని వదిలి, దుర్ధరుడు జీవితము వదిలినవాడై భూమిపై పడెను.

దుర్ధరులైన ఆ యూపాక్ష విరూపాక్షులు భూమిమీద పడిన ఆ దుర్ధరుని చూచి మరింత రోషము కలవారు అయిరి. విమాలాకాశములో ఉన్న మహాబాహువులు కల ఆ మహాకపి, వేగముగా పైకి లేచిన వారిద్దరి చేత, తన వక్షస్థలముపై తీవ్రముగా కొట్టబడెను. మహాబలుడు గరుత్మంతునితో సమానమైన పరాక్రమము గల హనుమ, వేగముతో వచ్చిన వారిద్దరి వేగము ధాటిని ఎదురుకొని, మరల భూమిపై పడెను.

పవనాత్మజుడైన అ వానరుడు అప్పుడు ఒక సాలవృక్షమును తీసుకొని ఆ యూపాక్ష విరూపాక్షులను ఇద్దరినీ హతమార్చెను.

అప్పుడు అతి బలవంతుడైన వానరుని చేత ముగ్గురు హతమార్చబడినట్లు తెలిసికొని ప్రఘసుడు మహావేగముతో దాడి చేసెను. వీరుడు భాసకర్ణుడు కూడా కోపోద్రిక్తుడై శూలము తీసుకు వచ్చెను.

యశోవంతుడు, కపిశార్దూలుడు అయిన హనుమంతునితో ఒకవేపు పదునుపట్టిన పట్టిసముతో ప్రఘసుడు, ఇంకొకవేపు శూలముతో భాసకర్ణుడు యుద్ధము చేయసాగిరి. వారిద్దరిచేత గాయపడిన హనుమంతుని శరీరము రక్తశిక్తమయ్యెను. అప్పుడు ఆ హనుమంతుడు ఉదయభానువలె తేజరిల్లుచూ అతికృద్ధుడయ్యెను

వీరుడు కపికుంజరుడు అయిన ఆ హనుమంతుడు మృగములు వృక్షములతో కూడిన ఒక పర్వత శిఖరమును పెకలించి ఆ రాక్షసులను ఇద్దరినీ హతమార్చెను. ఆ విధముగా ఐదుమంది సేనాపతులను హతమార్చి పిమ్మట మిగిలిన సేనా బలములను నాశనము చేయసాగెను. సహస్రాక్షుడు అసురలను చంపినట్లు, ఆ హనుమంతుడు అశ్వములను అశ్వములతో, గజములను గజములతో, యోధులను యోధులతోనూ, రథములను రథములతోనూ నాశనము చేయసాగెను.

హతమార్చబడిన గజములతో, తురగములతో, ముక్కలు చేయబడిన మహారథములతో, హతమార్చబడిన రాక్షసులతో భూమిలో మార్గములన్ని నిండి పోయినవి.

అప్పుడు ఆ వీరుడు వానరుడు సైన్యబలములతో కూడిన, వాహనములతో కూడిన, ఆ వీరులను రణములో హతమార్చి మళ్ళీ అశోకవన తోరణముపై ప్రజలను కబళించు కాలుని వలె నిలబడెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఆరవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||
తతః కపిస్తాన్ ధ్వజినీపతీన్ రణే
నిహత్య వీరాన్ సబలాన్ సవాహనాన్|
సమీక్ష్య వీరః పరిగృహ్య తోరణం
కృతక్షణః కాల ఇవ ప్రజాక్షయే||39||
స|| తతః వీరః కపిః వీరాన్ సబలాన్ స వాహనాన్ తాన్ ధ్వజినిపతీన్ రణే నిహత్య సమీక్ష తోరణం పరిగృహ్య ప్రజాక్షయే కాలః ఇవ కృతక్షణః||
తా|| అప్పుడు అ వీరుడు వానరుడు ఆ సైన్యబలములతో కూడిన వాహనములతో కూడిన ఆ వీరులను రణములో హతమార్చి మళ్ళీ అశోకవన తోరణముపై ప్రజలను కబళించు కాలుని వలె నిలబడెను.
||ఓమ్ తత్ సత్||

 

 

 

 

|| ఓమ్ తత్ సత్||