||సుందరకాండ ||
||నలభై ఏడవ సర్గ తెలుగు తాత్పర్యముతో||
|| Sarga 47 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ సప్తచత్త్వారింశస్సర్గః||
సేనాపతీన్ పంచ స తు ప్రమాపితాన్
హనుమతా సానుచరాన్ సవాహనాన్|
సమీక్ష్య రాజా సమరోద్ధతోన్ముఖం
కుమారమక్షం ప్రసమైక్షతాగ్రతః||1||
స||పంచ సేనాపతీన్ స అనుచరాన్ స వాహనాన్ ప్రమాపితాన్ సమీక్ష్య రాజా సమరోద్ధతః ఉన్ముఖం కుమారం అక్షం అగ్రతః ప్రసమైక్షత||
తా|| పంచ సేనాపతులు వారి అనుచరులలతో వాహనములతో హతమార్చబడిరని వినిన రాజు ఆ తన దృష్టిని సమరమునకు సుముఖుడైన తన కుమారుడు అక్షునివైపు సారించెను.
స తస్య దృష్ట్యర్పణసంప్రచోదితః
ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముకః|
సముత్పపాతాథ సదస్యుదీరితో
ద్విజాతిముఖ్యైర్హవిషేవ పావకః||2||
తతో మహద్బాలదివాకరప్రభమ్
ప్రతప్త జాంబూనదజాలసంతతమ్|
రథం సమాస్థాయ యయౌ స వీర్యవాన్
మహాహరిం తం ప్రతి నైరృతర్షభః||3||
స|| అథ తస్య దృష్ట్యర్పణ సంప్రచోదితః ప్రతాపవాన్ కాంచన చిత్రకార్ముఖః సదసి ద్విజాతి ముఖ్యైః హవిషాఉదీరితః పావకః ఇవ సముత్పపాత|| తతః వీర్యవాన్ నైరృతర్షభః మహత్ బాలదివాకరప్రభం ప్రతప్త జాంబూనద జాలసంతతం రథం సమాస్థాయ స మహహరిం ప్రతి యయౌ ||
తా|| అప్పుడు అతని చూపునే ఆదేశముగా గ్రహించిన ప్రతాపము గల వాడు బంగారు ధనస్సును ధరించినవాడై సదస్సులో వెలిగించబడిన హవిస్సులాగా లేచి నిలబడెను. అప్పుడు బాలదివాకురునివలె తేజము కల వీరుడు, మేలిమి బంగారపు జాలలతో విలసిల్లుతున్న రథమును ఎక్కి ఆ మహావానరుని ప్రతి యుద్ధమునకు బయలు దేరెను.
తతస్తపః సంగ్రహ సంచయార్జితమ్
ప్రతప్త జాంబూనదజాల శోభితమ్|
పతాకినం రత్నవిభూషితధ్వజమ్
మనోజవాష్టాశ్వవరైః సుయోజితమ్||4||
సురాసురాధృష్య మసంగచారిణం
రవిప్రభం వ్యోమచరం సమాహితమ్|
సతూణమష్టాసినిబద్ధబంధురమ్
యథాక్రమావేశిత శక్తితోమరమ్||5||
స|| తతః తపఃసంగ్రహః సంచయార్జితం ప్రతప్త జాంబూనదజాలశోభితం పతాకినం రత్నవిభూషిత ధ్వజమ్ మనోజవా అష్ట వరైః అశ్వైః సుయోజితం ||సురాసురాధృష్యం అసంగచారిణం రవిప్రభం వ్యోమచరం సతూణం సమాహితం అష్టాసి నిబద్ధబంధురం యథాక్రమావేశితశక్తితోరణం||
తా|| తపస్సుతో ఆర్జించబడిన మేలిమి బంగారపు జాలలతో శోభించుచున్న ఆ రథము , పతాకములతో రత్నములతో పొదగబడిన ధ్వజముతో గలది. మనోవేగముతో పోగల ఎనిమిది అశ్వములచేత లాగబడినది. ఆ రథము సురాసురులకు దుష్కరమైనది. నిరాటంకముగా పోగలగినది. రవితేజముతో ఆకాశమార్గమున పోగలగినది. బాణములుపెట్టుకొనే తూర్ణము, ఎనిమిది ఖడ్గములు, శక్తులు మున్నగునవి సముచిత స్థానములలో అ రథములో అమరించబడినవి.
విరాజమానం ప్రతిపూర్ణ వస్తునా
సహేమదామ్నా శశిసూర్యవర్చసా|
దివాకరాభం రథమాస్థితః తతః
స నిర్జగామామరతుల్యవిక్రమః||6||
స పూరయన్ ఖం మహీం చ సాచలామ్
తురంగమాతంగ మహారథస్వనైః|
బలైః సమేతైః స హి తోరణస్థితమ్
సమర్థ మాసీనముపాగమత్ కపిమ్||7||
స||తతః అమరతుల్యవిక్రమః విరాజమానం సః సహేమదామ్నా శశిసూర్య వర్చసా ప్రతిపూర్ణవస్తునా విరాజమానం దివాకరాభం రథం ఆస్థితః నిర్జగామ|| సః తురంగ మాతంగ మహారథస్వనైః ఖం మహీం చ స అచలాం పూరయన్ సమేతైః బలైః సహ తోరణస్థం సమర్థం ఆసీనం కపిం ఉపాగమత్||
తా|| అప్పుడు పరాక్రమములో అమరులతో సమానమైన అ అక్షకుమారుడు బంగారుమాలలచే విరాజిల్లుచున్న, చంద్ర సూర్యల తేజస్సుగల , అన్నిరకముల ఆయుధములతో నిండివున్న , దివ్యరథమును ఎక్కి బయలు దేరెను. తురంగముల మాతంగముల మహారథముల ఘోషతో భూమిని ఆకాశమును పర్వతరాజములను నింపుతో్. మహాసైన్యముతో ఆ రాక్షసుడు, సమర్థుడు తోరణముపై ఉపశ్థితుడైన అయిన వానరుని సమీపించెను.
స తం సమాసాద్య హరిం హరీక్షణో
యుగాంతకాలాగ్నిమివ ప్రజాక్షయే|
అవస్థితం విస్మితజాతసంభ్రమః
సమైక్షతాక్షో బహుమానచక్షుసా||8||
స తస్యవేగం చ కపేర్మహాత్మనః
పరాక్రమం చారిషు పార్థివాత్మజః|
విచారయన్ స్వం చ బలం మహాబలో
హిమక్షయే సూర్య ఇవాsభివర్ధతే||9||
స|| సః హరీక్షణః అక్షః ప్రజాక్షయే యుగాంతకాలగ్నిం ఇవ అవస్థితం తం హరిం సమాసాద్య విస్మితజాత సంభ్రమః బహుమాన చక్షుసా సమైక్షత || మహాబలః పార్థివాత్మజః మహాత్మనః తస్య కపేః వేగం చ అరిషు పరాక్రమం చ స్వం బలం చ విచారయన్ హిమక్షయే సూర్య ఇవ అభివర్ధతే||
తా|| ఆ సింహపు దృష్టి గల అక్షుడు, యుగాంతములో ప్రజలను నశింపచేయు ప్రళయాగ్నివలె వున్న ఆ వానరుని సమీపించి, గౌరవభావముతో అశ్చర్యసంతోష జనిత దృష్టితో హనుమంతుని చూడసాగెను. మహాబలుడు రాజకుమారుడు మహాత్ముడు అగు అక్షుడు ఆ వానరుని వేగమును , శత్రువులమీద చూపగల బలమును, తన బలమును గురించి విచారించి, మంచును నశింపచేయు సూర్యుని వలె భాసించెను.
స జాతమన్యుః ప్రసమీక్ష్య విక్రమం
స్థిరం స్థితః సంయతి దుర్నివారణమ్|
సమాహితాత్మా హనుమంతమాహవే
ప్రచోదయామాస శరైస్త్రిభిశ్శితైః||10||
తతః కపిం తం ప్రసమీక్ష్య గర్వితమ్
జితశ్రమం శత్రుపరాజయోర్జితమ్|
అవైక్షతాక్షః సముదీర్ణమానసః
స బాణపాణిః ప్రగృహీతకార్ముకః||11||
స|| సంయతి దుర్నివారణం స్థిరం విక్రమం ప్రసమీక్ష్య సః( అక్షుః) జాతమన్యుః స్థిరః సమాహితాత్మా హనుమంతం శితైః త్రిభిః శరైః ఆహవే ప్రచోదయామాస||తతః సః అక్షః గర్వితం శత్రుపరాజయోర్జితమ్ తం కపిం జితశ్రమం ప్రసమీక్ష్య బాణపాణిః ప్రగృహీతకార్ముకః సముదీర్ణమానసః అవైక్షత||
తా|| యుద్ధములో ఎదుర్కొనబడలేని స్థిరమైన పరాక్రమము గల హనుమంతుని చూచి కోపము గలవాడై మనస్సును స్థిరపరచుకొని హనుమంతునిపై సునిశితమైన మూడు బాణములతో ఆహ్వానరూపముగా ప్రయోగించెను. అప్పుడు ఆ అక్షుడు శత్రుపరాజయములను ఆర్జించిన గర్వము గల, శ్రమలేని ఆ వానరుని చూచి ధనస్సును బాణములను చేతబట్టి రణోత్సాహముతో తనమనస్సులో అలోచించెను.
స హేమ నిష్కాంగద చారుకుండలః
సమాససాదాsశు పరాక్రమః కపిమ్|
తయోర్బభూవాప్రతిమః సమాగమః
సురాసురాణామపి సంభ్రమప్రదః||12||
రరాస భూమిర్నతతాప భానుమాన్
వవౌ న వాయుః ప్రచచాల చాచలః|
కపేః కుమారస్య చ వీక్ష్య సంయుగమ్
ననాద చ ద్యౌరుదధిశ్చ చుక్షుభే||13||
స|| అశు పరాక్రమః హేమనిష్కాంగద చారుకుండలః సః కపిం సమాసాద | తయోః అప్రతిమః సంగమః సురః అసురాణాం అపి సంభ్రమప్రదః అభూత్ || కపేః కుమారస్య చ సంయుగం వీక్ష్య భూమిః రరాస | భానుమాన్ నతతాప| వాయుః న వవౌ| అచలః చ ప్రచచాల | ద్యౌః ఉదధిశ్చ చుక్షుభే||
తా|| ప్రచండ పరాక్రమము గల బంగారు బాహుపురులు కుండలములను దాల్చిన ఆ రాజకుమారుడు ఆ కపిని (యుద్ధమునకై) సమీపించెను. వారి అప్రతిమ సంగమము సురులకు అసురులకు కూడా సంభ్రమము కలిగించెను. ఆ వానరుని రాజకుమారుని సమరము చూచి భూమి దద్దరిల్లెను. సూర్యుడు తపించుటలేదు. వాయువు వీచుటలేదు. అచలములు చలించినవి. ఆకాశము సముద్రము క్షోభించినవి.
తతః సవీరః సుముఖాన్ పతత్రిణః
సువర్ణపుంఖాన్ సవిషా నివోరగాన్|
సమాధిసంయోగ విమోక్షతత్త్వవిత్
శరానథత్రీన్ కపిమూర్ధ్నపాతయత్||14||
స తైః శరైర్మూర్థ్ని సమం నిపాతితైః
క్షరన్నసృద్దిగ్ధ వివృత్తలోచనః|
నవోదితాదిత్యనిభః శరాంశుమాన్
వ్యరాజతాదిత్య ఇవాంశుమాలికః||15||
స|| తతః అథ వీరః సమాధిసంయోగవిమోక్షతత్త్వవిత్ సః సుముఖాన్ సువర్ణపుంఖాన్ పతత్రిణః సవిషాన్ ఉరగాన్ ఇవ త్రీన్ శరాన్ కపిమూర్ధ్ని అపాతయత్ ||సమం మూర్ధ్ని నిపాతితైః తైః శరైః క్షరన్ అసృగ్ధితవివృత్తలోచనః నవోదితాదిత్యనిభః శరాంశుమాన్ సః అంశుమాలికః ఆదిత్య ఇవ వ్యరాజత||
తా|| ఆప్పుడు బాణములను సంధించి గురిచూచి లక్ష్యములకు మోక్షము కలిగించు వాడు, సుముఖమైన బంగారు పిడులుకలవాడు అగు ఆ అక్షకుమారుడు వీరుడు విషపూరితమైన మూడు బాణములను కపి శిరస్సు పై ప్రయోగించెను. ఒకే క్షణములో తలపై పడిన, ఆ శరములతో కొట్టబడి , కారుచున్నరక్తధారతో తడిసిన కళ్ళుకల ఆ వానరుడు, ఆ శరములే కిరణముల లాగా కొత్తగా ఉదయించిన సూర్యుని వలె, కిరణములే మాలలా గల సూర్యునివలె విరాజిల్లెను.
తతః స పింగాధిపమంత్రిసత్తమః
సమీక్ష్య తం రాజవరాత్మజం రణే|
ఉదగ్ర చిత్రాయుధ చిత్రకార్ముకమ్
జహర్ష చాపూర్య చాహవోన్ముఖః||16||
స మందరాగ్రస్థ మివాంశుమాలికో
వివృద్ధకోపా బలవీర్యసంయుతః|
కుమారమక్షం సబలం స వాహనమ్
దదాహ నేత్రాగ్ని మరీచిభిస్తదా||17||
తతస్స బాణాసన చిత్రకార్ముకః
శర ప్రవర్షో యుధి రాక్షసాంబుదః|
శరాన్ ముమోచాశు హరీశ్వరాచలే
వలాహకో వృష్టి మివాsచలోత్తమే||18||
స|| తతః సః పింగాధిపమంత్రిసత్తమః ఉదగ్ర చిత్రాయుధ కార్ముకం తం రాజవరాత్మజం సమీక్ష్య అహవః ఉన్ముఖః అపూర్యత చ ||మందరాగ్రస్థః ఇవ బలవీర్యసంయుతః సః వివృద్ధకోపః సబలం సవాహనం కుమారం అక్షం తదా నేత్రాగ్నిమరీచిభిః దదాహ||తతః బాణాసన చిత్రకార్ముకః శరప్రవర్షః సః రాక్షసాంబుదః యుధి ఆశు హరీశ్వరాచలే వలాహకః అచలోత్తమే వృష్టిం ఇవ శరాన్ ముమోచ||
తా|| అప్పుడు వానరాధిపతి మంత్రిసత్తముడు అయిన హనుమంతుడు, వివిధమైన అయుధములతోనూ చిత్రమైన ధనస్సుతోనూ ఉన్న ఆ రాజుయొక్క వరిష్ట పుత్రుని చూచి యుద్ధమునకు తయారు అయ్యెను. మందరపర్వతము పై కూర్చునినవాని వలె బలము వీర్యము కల మరింతపెరిగిన కోపము కల ఆ వానరుడు, బలముతో వాహనముతో వున్న ఆ అక్షకుమారుని తనకళ్లలో ఉన్న అగ్నితో దహించివేయునా అన్నట్లు చూచెను. అప్పుడు ఆ బాణములు కల చిత్రమైన ధనస్సుతో శరపరంపరను, ఆ వానరోత్తమునిపై అక్షకుమారుడు నీటితో నిండిన మేఘములు సమున్నత పర్వతముపై వర్షము కురిపించునట్లు కురిపించెను.
తతః కపిస్తం రణచండవిక్రమమ్
విరుద్ధతేజో బలవీర్యసంయుతమ్|
కుమారమక్షం ప్రసమీక్ష్య సంయుగే
ననాద హర్షాత్ ఘనతుల్యవిక్రమః||19||
స బాలబావాద్యుధి వీర్యదర్పితః
ప్రవృత్తమన్యుః క్షతజోపమేక్షణః|
సమాససాదాప్రతిమం కపిం రణే
గజో మహాకూపమివావృతం తృణైః||20||
స|| తతః కపిః రణచండవిక్రమమ్ విరుద్ధతేజోబలవీర్య సంయుతం ఘనతుల్యవిక్రమమ్ తం కుమారం అక్షం ప్రసమీక్ష్య హర్షాత్ ననాద|| సః బాలభావాత్ యుధి వీర్యదర్పితః ప్రవృద్ధమన్యుః క్షతజోపమేక్షణః సః రణే అప్రతిమం కపిం గజః తృణైః ఆవృతం మహాకూపం ఇవ సమాససాద||
తా|| ఆ యుద్ధములో ప్రచండ విక్రమము గల అమిత పరాక్రమము గల వానరుడు, మేఘములతో సమానమైన పరాక్రమము గల ఆ అక్షుని చూచి ఆనందముతో గర్జించెను. ఆ అక్షుడు బాలుని భావముతో యుద్ధములో గర్వముతో, తన కళ్ళను ఎర్రచేస్తూ రణములో అప్రతిమమైన వానరుని వైపు గడ్డితో కప్పబడిన మహాకూపమును దాటుతున్న ఏనుగ వలె ముందుకుదూసుకు పోయెను.
స తేన బాణైః ప్రసభం నిపాతితైః
చకార నాదం ఘననాదనిస్స్వనః|
సముత్పపాతాశు నభస్సమారుతి
ర్భుజోరువిక్షేపణ ఘోరదర్శనః||21||
సముత్పతంతం సమభిద్రవద్బలీ
స రాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ |
రథీ రథిశ్రేష్ఠతమః కిరన్ శరైః
పయోధరః శైలమివాశ్మ వృష్టిభిః||22||
స|| సః తేన ప్రసభం నిపాతితైః బాణైః ఘననాదనిఃస్వనః నాదం చకార | సః మారుతిః భుజోరువిక్షేపణ ఘోరదర్శనః ఆశు నభః సముత్పపాత|| బలీ రాక్షసానాం ప్రవరః ప్రతాపవాన్ రథీ రథశ్రేష్ఠతమః సః పయోధరః అశ్మవృష్టిభిః శైలం ఇవ శరైః కిరణ్ ఉత్పతంతం సమభిద్రవత్ ||
తా|| ఆ వానరుడు అతని బాణములతో కోట్టబడి మహత్తరమైన నాదము చేసెను. ఆమారుతి భుజములు తొడలు చరుస్తూ ఘోరమైన రూపముతో ఆకాశములోకి ఎగిరెను. బలముగల రాక్షసులలో ప్రవరుడు ప్రతాపము గలవాడు రథములో ఉన్నవాడు రథికులలో శ్రేష్ఠుడు అయిన ఆరాక్షసుడు మేఘములు పర్వతముపై వర్షము కురిపించిన రీతి బాణములను ప్రయోగించుచూ వానరుని వెంటాడెను.
స తాన్ శరాం స్తస్య హరిర్విమోక్షయన్
చచార వీరః పథి వాయు సేవితే|
శరాంతరే మారుతవద్వినిష్పతన్
మనోజనః సంయతి చండవిక్రమః||23||
త మాత్త బాణాసన మాహవోన్ముఖం
ఖ మాస్తృణంతం నిశిఖైః శరోత్తమైః|
అవైక్షతాక్షం బహుమాన చక్షుసా
జగామ చింతాం చ స మారుతాత్మజః||24||
స|| మనోజవః సంయతి చండవిక్రమః వీరః సః హరిః మారుతవత్ వినిష్పతన్ తస్య శరాన్ విమోక్షయన్ వాయుసేవితే పథి చచార||స మారుతాత్మజః ఆత్తబాణాసనం అహవోన్ముఖం విశిఖైః శరోత్తమైః ఖం ఆస్తృణాంతం తం అక్షం బహుమానచక్షుసా అవైక్షత చింతాం చ జగామ||
తా|| మనస్సుతో సమానమైన వేగముకల యుద్ధములో ప్రచండ విక్రమము కల వీరుడు అగు ఆ వానరుడు, వాయువు వలె తిరుగుతూ అతని బాణములను తప్పించుకుంటూ ఆకాశమున తిరిగెను. ఆ మారుతాత్మజుడు రణోన్ముఖుడై ఒకే ధారగా నిశితమైన ఉత్తమమైన బాణముల తో ఆకాశము అంతా నింపుతున్న ఆ అక్షుని గౌరవభావముతో చూస్తూ ఆలోచించసాగెను.
తతః శరైర్భిన్నభుజాంతరః కపిః
కుమారవీరేణ మహత్మనా నదన్|
మహాభుజః కర్మవిశేషతత్త్వవిత్
విచింతయామాస రణే పరాక్రమమ్||25||
అబాలవద్బాలదివాకర ప్రభః
కరోత్యయం కర్మ మహాన్ మహాబలః|
న చాస్య సర్వాహవకర్మశోభినః
ప్రమాపనే మే మతిరత్ర జాయతే||26||
స|| తతః మహభుజః కర్మవిశేషతత్త్వవిత్ కపిః మహాత్మనా కుమారవీరేణ భిన్నభుజాంతరః నదన్ రణే పరాక్రమం విచింతయామాస|| బాలదివాకరప్రభః మహాబలః అయం అబాలవత్ మహత్ కర్మ కరోతి| అత్ర సర్వాహవకర్మశోభినః అస్య ప్రమాపణే మే మతిః న చ జాయతే||
తా|| అప్పుడు మహాభుజములు కల విశేషకర్మల జ్ఞానముకల ఆ వానరుడు ఆ కుమారవీరునిచే గాయపడిన భుజాంతరముకలవాడు గర్జన చేయుచూ అలోచింపసాగెను. ' బాలదివాకరుని తేజస్సు కలవాడు అయిన ఈ బాలకుడు అరితేరిన వానివలె మహత్తరమైన యుద్ధము చేయుచున్నాడు. యుద్ధకర్మలను అన్నింటితోనూ శోభిస్తున్న ఇతనిని హతమార్చుటకు నాకు మనస్కరించుటలేదు'.
అయం మహాత్మా చ మహాంశ్చవీర్యతః
సమాహితశ్చాతిసహశ్చ సంయుగే|
అసంశయం కర్మగుణోదయాదయం
సనాగయక్షైర్మునిభిశ్చ పూజితః||27||
పరాక్రమోత్సాహవివృద్ధమానసః
సమీక్షతే మాం ప్రముఖాగ్రతః స్థితః|
పరాక్రమో హ్యస్య మనాంసి కంపయేత్
సురాసురాణామపి శీఘ్రగామినః||28||
స|| అయం మహాత్మా చ వీర్యతః చ మహాన్ సమాహితః సంయుగే అతిసహః | అయం అసంశయమ్ కర్మగుణోదయాత్ సనాగయక్షైః మునిభిః చ పూజితః||పరాక్రమోత్సాహ వివృద్ధమానసః ప్రముఖాగ్రతః స్థితః మామ్ సమీక్షతే శీఘ్రగామినః అస్య పరాక్రమః సురః అసురాణాం మనాంసి అపి ప్రకంపయేత్ ||
తా|| 'ఇతడు మహాత్ముడు. వీరత్వములో మహాత్ముడు. యుద్ధములో సహనము వివేకము గలవాడు. ఇతడు తన గుణములతో అశంసయముగా నాగులకు యక్షులకు దేవతలకు పూజనీయుడు. పరాక్రమోత్సాహములతో పెరుగుతున్న మనసు కలవాడై నాముందు నిలచి నన్ను ధైర్యముగా చూచుచున్నాడు. శీఘ్రముగా చలనము కల ఈ ధీరుని పరాక్రమము సురులు అసురుల మనస్సులో భీతి కలిగించును'.
న ఖల్వయం నాభిభవేదుపేక్షితః
పరాక్రమో హ్యస్యరణేవివర్ధతే|
ప్రమాపణం త్వేవ మమాద్య రోచతే
న వర్ధమానోగ్నిరుపేక్షితుం క్షమః||29||
ఇతి ప్రవేగం తు పరస్య తర్కయన్
స్వకర్మయోగం చ విధాయ వీర్యవాన్ |
చకారవేగం తు మహాబలః తదా
మతిం చ చక్రేఽస్య వధే మహాకపిః||30||
స|| అయం న ఉపేక్షితః నాభిభవేత్ న ఖలు రణే అస్య పరాక్రమః వర్ధతే హి | అద్య ప్రమాపణం త్వేవ మమ రోచతే | వర్ధమానః అగ్నిః ఉపేక్షితుం న క్షమః||వీర్యవాన్ మహాబలః మహాకపిః ఇతి పరస్య ప్రవేగం చింతయన్ స్వకర్మయోగం చ విధాయ తథా వేగం చకార| అస్య వధే మతిం చ చక్రే||
తా|| 'ఇతనిని ఉపేక్షించరాదు. నన్నుఈ రణములో అతిక్రమించకపోయినా ఇతని పరాక్రమము వర్ధిల్లు చున్నది. ఇప్పుడు ఇతనిని తుదముట్టించడమే మంచిదని నాకు తోచుచున్నది. పెరుగుతున్న మంటలను ఉపేక్షించుట కూడని పని'. వీరుడైన మహాబలుడు మహాకపి ఇలాగ అతనిపై అలోచించి తను చేయవలసిన కార్యమును నిశ్చయించుకొని వేగముగా ముందుకు సాగెను. మనస్సులో అతనిని వధించుటకు నిశ్చయించుకొనెను.
స తస్య తా నష్టహయాన్ మహాజవాన్
సమాహితాన్ భారసహాన్ వివర్తనే|
జఘాన వీరః పథి వాయుసేవితే
తలప్రహారైః పవనాత్మజః కపిః||31||
తతః తలేనాభిహతో మహారథః
స తస్య పింగాధిపమంత్రిసత్తమః|
ప్రభఘ్ననీడః పరిముక్తకూబరః
పపాత భూమౌ హతవాజిరంబరాత్||32||
స|| వీరః పవనాత్మజః సః కపిః వాయుసేవితే పథి మహాజవాన్ సమాహితాన్ నివర్తనే భారసహాన్ తాన్ అష్ట హయాన్ తలప్రహారైః జఘాన||తతః తలేన అభిహితః పింగాధిపమంత్రినిర్జితః తస్య మహారథః ప్రభఘ్ననీడః పరిముక్తకూబరః హతవాజిభిః అంబరాత్ భూమౌ పపాత||
తా|| వీరుడు పవనాత్మజుడు అగు ఆ కపిసత్తముడు, వాయువు సంచరించు మార్గములో పోవు, రథమును తిప్పగల మహత్తరమైన భారములను మోయగల ఆ ఎనిమిది అశ్వములను తన చేతితో కొట్టెను. అప్పుడు చేతితో కొట్టబడిన పింగాధిపతి మంత్రిచేత జయించబడి విరిగిన మహా రథముయొక్క కప్పు కూబరము ముక్కలు ముక్కలుగా చనిపోయిన గుఱ్ఱములతొ సహా భూమి మీద పడిపోయెను.
స తం పరిత్యజ్య మహారథో రథం
స కార్ముకః ఖడ్గధరః ఖ ముత్సహన్|
తపోభియోగాదృషిరుగ్రవీర్యవాన్
విహాయ దేహం మరుతామివాలయమ్||33||
తతః కపిస్తం ప్రచరంతమంబరే
పతత్రి రాజానిలసిద్ధసేవితే|
సమేతయ తం మారుతతుల్య విక్రమః
క్రమేణ జగ్రాహ సపాదయోర్దృఢం||34||
స||మహారథ సః రథం పరిత్యజ్య సకార్ముకః ఖడ్గధరః ఖం ఉత్పతన్ ఉగ్రవీర్యవాన్ దేహం విహాయ తపోభియోగాత్ మారుతం ఆలయం ఋషిః ఇవ||తతః మారుతితుల్యవిక్రమః కపిః పతత్రి రాజానిలసిద్ధసేవితే అంబరే విచరంతం తం సమేత్య క్రమేణ తం పాదయోః దృఢం జగ్రాహ||
తా|| ఆ రధమును పరిత్యజించి తన ధనస్సుతోనూ ఖడ్గముతోనూ అకాశములోకి ఎగిరిన ఉగ్రుడైన ఆమహావీరుడు మహారథి, తపశ్శక్తితో దేహము వదిలి అకాశమార్గమున పోవు ఋషులవలె నుండెను. అప్పుడు మారుతితో సమానమైన శక్తి కల వానరోత్తముడు సిద్ధులు గరుత్మంతుడు వాయువునకు సంచారయోగ్యమైన ఆకాశములో తిరుగుచున్న ఆ అక్షుని సమీపించి వాని పాదములు గట్టిగా పట్టుకొనెను.
స తం సమావిధ్య సహశ్రసః కపిః
మహోరగం గృహ్య ఇవాండజేశ్వరః|
ముమోచ వేగాత్ పితృతుల్య విక్రమో
మహీతలే సంయతి వానరోత్తమః||35||
సభగ్న బాహూరుకటీశిరోధరః
క్షరన్నసృజ్నిర్మథితాస్థిలోచనః|
సంభగ్నసంధిః ప్రవికీర్ణబంధనో
హతః క్షితౌ వాయుసుతేన రాక్షసః||36||
స|| పితృతుల్యవిక్రమః వానరోత్తమః సః కపిః అండజేశ్వరః మహోరగం గృహ్యైవ తం సంయతి సహశ్రసః సమావిధ్య వేగాత్ మహీతలే ముమోచ||స రాక్షసః భగ్నబాహు ఉరు కటీ శిరోధరః అసృక్ క్షరన్ నిర్మథితాస్థిలోచనః సంభగ్నసంధిఃప్రవికీర్ణబంధనః వాయుసుతేన క్షితౌ హతః||
తా|| ఇంద్రునితో సమానమైన పరాక్రమము గల వానరోత్తముడు అగు ఆ కపివరుడు, మహాసర్పమును గరుత్మంతుడు చేజిక్కుంచికొనినట్లు, ఆ అక్షకుమారుని పట్టుకొని వేయిసార్లు గిరగిరా తిప్పి భూమిపై పడవేసెను. ఆ రాక్షసుడు భగ్నమైన బాహువులు కలవాడై, తొడలు కటిప్రదేశము విరిగిపోయినవాడై, ఎముకలు విరిగిపోయి, కీళ్ళు ఊడిపోయి భూమిపై పడి వాయుసుతుని చేత హతమార్చబడినవాడయ్యను.
మహాకపిర్భూమితలే నిపీడ్య తం
చకార రక్షోఽధిపతేర్మహత్ భయమ్|
మహర్షిభిశ్చక్రచరైర్మహావ్రతైః
సమేత్య భూతైశ్చ సయక్షపన్నగైః||37||
సురేశ్చసేంద్రైర్భృశజాత విస్మయైః
హతే కుమారే స కపిర్నిరీక్షితః|
స|| మహాకపిః తం భూమితలే నిపీడ్య రక్షోధిపతేః మహత్ భయం చకార | కుమారే హతే సః కపిః భృశజాతవిస్మయైః చక్రచరైః మహావ్రతైః మహర్షిభిః స యక్షపన్నగైః భూతైశ్చ స ఇంద్రైః సురైశ్చ సమేత్య నిరీక్షితః ||
తా|| ఆ మహాకపి వానిని భూమిమీద పడవేసి, ఆ రాక్షసాధిపతికి మహత్తరమైన భయము కలిగించెను. ఆ వానరోత్తముని చేత ఆ కుమారుడు హతమార్చబడగా చూచిన, ఆకాశములో తిరుగు మహావ్రతములు చేయు మహర్షులు, యక్షులు పన్నగులు సమస్త భూతములు ఇంద్రుడుతో కూడిన సురలు ఎంతో ఆశ్చర్యచకితులైరి.
నిహత్య తం వజ్రిసుతోపమప్రభం
కుమారమక్షం క్షతజోపమేక్షణమ్||38||
తమేవ వీరోఽభి జగామ తోరణం
కృతః క్షణః కాల ఇవా ప్రజాక్షయే|| 39||
స||వీరః వజ్రిసుతోపమప్రభం క్షతజోపమేక్షణం తం అక్షం నిహత్య ప్రజాక్షయే కృతక్షణః కాలః ఇవ తం తోరణమేవ అభిజగామ||
తా|| ఇంద్రుని కొడుకుతూ సమానమైన తేజస్సుకలవాడు రక్తవర్ణనేత్రములు గలవాడు అయిన ఆ అక్షకుమారుని హతమార్చిన హనుమంతుడు, ప్రళయకాలములో ప్రజలను అంతమొందించు కాలునివలె, అశోకవన తోరణముపై మరల ఎక్కి కూర్చొనెను.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తచత్త్వారింశస్సర్గః ||
తా|| ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఏడవ సర్గ సమాప్తము.
||ఓమ్ తత్ సత్||