||సుందరకాండ ||

||నలభై ఎనిమిదవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
తతస్సరక్షోఽధిపతిర్మహాత్మా
హనూమతాక్షే నిహతే కుమారే|
మనః సమాధాయ సదేవకల్పం
సమాదిదేశేంద్రజితం సరోషమ్||1||

స|| తతః రక్షోధిపతిః మహాత్మా హనుమతా కుమారే అక్షే నిహతే మనః సమాధాయ సరోషం దేవకల్పం ఇంద్రజితం సమాదిదేశ ||

తా|| ఆ రాక్షసాధిపతి మహాత్ముడైన హనుమంతునిచేత అక్షకుమారుడు హతమార్చబడగా అలజడబడిన మనస్సును సమాధానపరచుకొని రోషముతో, దేవులతో సమానమైన ఇంద్రజిత్తుని అదేశించెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ అష్టచత్త్వారింశస్సర్గః||

ఆ రాక్షసాధిపతి రావణుడు, మహాత్ముడైన హనుమంతునిచేత అక్షకుమారుడు హతమార్చబడగా, అలజడబడిన మనస్సును సమాధానపరచుకొని, రోషముతో ప్రాక్రమములో దేవులతో సమానమైన ఇంద్రజిత్తుని అదేశించెను.

'నీవు అస్త్రజ్ఞానము తెలిసిన వారిలో వరిష్ఠుడవు. సురులకు అసురులకు శోకము ప్రదానము చేయుగలవాడవు. ఇంద్రుడు మున్నగు సురలలు సైతము నీ పరాక్రమము చూసిన వారు. బ్రహ్మదేవుని అరాధించి అనేక శస్త్రములను సంపాదించినవాడవు. నీ అస్త్రబలమును చూచి అసురులు కాని మరుద్గణములు కాని సురేశ్వరుడుగాని యుద్ధములో నీ ఎదురుగా నిలబడలేరు. నీతో యుద్ధములో కష్టపడని వాడు ముల్లోకములలో లేడు. నీవే బుద్ధికుశలములు గలవాడవు. నీవు నీ భుజబలముచే తపోబలముచే రక్షింపబడుతున్నవాడవు. దేశకాలానుసారము కార్యసాధనలో ప్రజ్ఞాశాలివి. సమరములో నీకు శక్యముకాని పనిలేదు. బుద్ధికౌశల్యములతో నీకు సాధింపబడని కార్యము లేదు. నీ అస్త్రపాటవము బలము గురించితెలియనివాడు ముల్లోకములలోను లేడు. తపోబలములో యుద్ధములో పరాక్రమములో రణములో శస్త్రాస్త్ర ప్రయోగ కౌశలములో నీవు నాతో సమానము. నీవు నిలబడితే నా మనస్సు నిశ్చయముగా నిశ్చింతగా ఉంటుంది'.

' కింకరులు అలాగే జంబుమాలి , అమాత్యపుత్రులు వీరులైన పంచ సేనాగ్రనాయకులు అనేక బలములు అశ్వములు ఏనుగులు అందరూ హతమార్చబడిరి. నీ సహోదరుడు అక్షకుమారుడు కూడా హతమార్చబడెను. ఓ శత్రు సంహారకా! నీ బలము పై నున్న నమ్మకము నాకు ఇంకెవరి లోనూ లేదు. ఓ బుద్ధిమంతుడా ! నీవు ఆ కపి యొక్క మహత్తరమైన బలము, ప్రభావము, పరాక్రమము , నీ యొక్క బలము పరిగణించుకొని నీ బలానుసారముగా పరివర్తించుము. అస్త్రవిద్యలలో వరిష్ఠుడా! అక్కడకి వెళ్ళి శత్రుబలము తెలిసికొని మనబలములకు నష్టముకాని రీతిలో యుద్ధము ఆరంభింపుము. ఓ వీరుడా సేనాగణములు అనవసరము. వజ్రాయుధము కూడా అతని పై పనిచేయదు. అతడు మారుతివేగము కలవాడు. అతడు ప్రజ్వరిల్లుతున్న అగ్నిలాంటివాడు. సాధారణమైన పద్దతులు వ్యర్థము. నేను చెప్పిన విషయములు బాగుగా అలోచించి ఆత్మస్థైర్యముతో ఏమి చేయవలెనో అలోచించుకొని దివ్యాస్త్రములను స్మరించి పోరాటమునకు ఉద్యమించుము. నేను నిన్ను పంపుచున్నాను అన్నమాట నాకు సముచితముగా కనపడుటలేదు. ఇది రాజధర్మము క్షత్రియుల ధర్మము. ఓ అరిందమ సంగ్రామములో అనేక శస్త్రముల ఉపయోగించురీతులు పూర్తిగా అవగాహనలో ఉండవలెను. రణములో విజయమే కోరతగినది కదా".

పిమ్మట దక్షుని పుత్రునితో సమానమైన ప్రభావము కలవాడు అగు ఇంద్రజిత్తు, ఆ వచనములను విని భయములేని వాడై రణమునకు సిన్నద్ధుడై తండ్రి కి ప్రదక్షిణము చేసెను. అప్పుడు యుద్ధమునకు తయారైన ఇంద్రజిత్తు తనవారిచే పూజింపబడి ఉత్సాహము కలవాడై బయలు దేరెను. శ్రీమంతుడు, పద్మరేకుల వంటి కళ్ళు గలవాడు, మహాతేజము గలవాడు, రాక్షసాధిపతి పుత్రుడు అగు ఇంద్రజిత్తు, పర్వ దినములలో ఉండు సముద్రమువలె ఉప్పొంగుతూ యుద్ధమునకు వెడలెను.

ఇంద్రునివంటి ఆ ఇంద్రజిత్తు, గరుత్మంతునితో సమానమైన వేగము కల , వాడి అయిన కోరలుగల నాలుగు వ్యాఘ్రములచేత లాగబడిన రథమును ఎక్కెను. ఆ రథము ఎక్కి ధనస్సు ధరించిన శ్రేష్ఠుడు, శస్త్రవిద్యా పారంగతుడూ, అస్త్రవిద్యలు నేర్చిన వారిలో శ్రేష్ఠుడు, త్వరగా రథములో హనుమంతుడు ఎచట ఉండెనో అచటికి పోయెను.

ఆ కపిప్రవరుడు అతని రథఘోషలను , ధనస్సులాగిన శబ్దములను విని మరింత సంతోషము కలవాడయ్యెను. రణములో పండితుడు అగు ఇంద్రజిత్తు, వాడి అయిన శరములను మహత్తరమైన ధనస్సు తీసుకొని హనుమంతుని ఎదురుకొనుటకు సిద్ధపడెను.

ఇంద్రజిత్తు సమరోత్సాహ జనిత సంతోషము కలవాడై ధనస్సు చేతిలో పట్టుకొని రణమునకు వెళ్ళగానే అన్ని దిశలు కలుషమయ్యెను. రౌద్రమైన మృగములు వికృతమైన స్వరముతో అరవసాగెను. అక్కడ చేరిన నాగులు యక్షులు మహర్షులు సిద్ధులు ఆకాశములో అమిత సంతోషముతో గుమిగూడిరి. పక్షి సంఘములుగట్టిగా అరవసాగినవి.

ఆ వానరుడు రథములో వేగముగా వచ్చుచున్న ఇండ్రజిత్తుని చూచి పెద్ద నాదము చేసెను. త్వరగా తన కాయమును పెంచెను. ఆ దివ్యమైన రథముపై నున్న ఇంద్రజిత్తు కూడా తన అద్భుతమైన ధనస్సు చేతబట్టి ధనస్సుతో ధనుష్ఠంకారము చేసెను. అప్పుడు తీక్ష్ణవేగము కలవారు మహాబలులు అగు ఆ వానరుడు మరియు రాక్షసాధిపతి సుతుడు బద్ధవైరులైన ఇంద్రుడు రాక్షసేంద్రులవలె రణమున పోరాడసాగిరి.

అప్రమేయుడు తనశరీరము పెంచుకొనిన వాడు అయిన హనుమంతుడు మహారథుడు ధనస్సు ధరించిన వాడు ప్రయోగించిన శరపరంపరలను నిర్వీర్యము చేస్తూ తన తండ్రి మార్గమైన ఆకాశములో తిరగసాగెను.

అప్పుడు శత్రుసంహారకుడు వీరుడు ఇంద్రజిత్తు, పొడుగుగా వాడి అయిన రెక్కలుగల బంగారముతో చేయబడిన, కొంచెము వంగిన అగ్రభాగము కలవి, వజ్రపాతము వంటి వేగము కలవి అయిన బాణములను హనుమంతుని పై ప్రయోగించెను. అప్పుడు హనుమంతుడు రథము యొక్క ధ్వని, మృదంగములు భేరిలు పటహముల ధ్వని, ఆ ఇంద్రజిత్తు ధనస్సుచేసిన ధ్వని, విని అకాశములో ఇంకా పైకి ఎగిరెను.

ఆ మహాకపి లక్ష్యము ఛేదిస్తూ బాణ ప్రయోగములో నిష్ణాతుడైన ఇంద్రజిత్తుయొక్క లక్ష్యసంగ్రహమును వ్యర్థము చేస్తూ అంతరిక్షములో తిరగసాగెను. మారుతాత్మజుడైన హనుమంతుడు, అతని శరములకు అందకుండా ముందు సాగుతూ తన చేతులను చాచి పైకి ఎగిరిపోయెను. వారిద్దరూ రణకర్మలో విశారుదులు. వేగము కలవారు. వారు సమస్త భూతములకు మనస్సు హరించే విధముగా యుద్ధము చేయసాగిరి.

రాక్షసునకు హనుమంతుని అంతు తెలియుటలేదు. మారుతికి కూడా ఆ రాక్షసుని అంతు తెలియుటలేదు. దేవసమాన విక్రమము గల వారిద్దరూ ఒకరికొకరు లొంగకుండా యుద్ధము చేయసాగిరి. అప్పుడు లక్ష్యమును సంపాదించని ఆ శరపరంపరను ఎకాగ్రతో వదిలిన ఆ మహత్ముడు ఇంద్రజిత్తు అలోచనలో పడెను. అప్పుడు ఆ రాక్షసరాజ సుతుడు ఈ వానరుడు చంపబడడు అని నిశ్చయించుకొని, ఇతనిని ఎట్లు బంధించవలెను అని ఆ వానరుని గురించి ఆలోచించెను.

అప్పుడు వీరుడు అస్త్రప్రయోగములో విదుడు మహాతేజము కలవాడు అగు ఇంద్రజిత్తు, ఆ వానరోత్తముని మీద పితామహుని బ్రహ్మాస్త్రము సంధించెను. ఆ అస్త్రముల తత్త్వము ఎరిగిన మహాబాహువులు కల ఇంద్రజిత్తు ఆ వానరుడు అవధ్యుడు అని గ్రహించి మారుతాత్మజుని ఆ అస్త్రముతో బంధించెను. అప్పుడు ఆ రాక్షసునిచేత ఆ అస్త్రముతో బంధింపబడి ఆ వానరుడు చేష్టలు లేని వాడయ్యెను. ఆ వానరుడు భూమిపై పడెను. అప్పుడు ఆ వానరుడు ఆ బంధించిన అస్త్రముయొక్కప్రభావము తెలిసికొని వేగము లేనివాడై తనలో బ్రహ్మదేవుడిచ్చిన అనుగ్రహము గురించి ఆలోచించసాగెను. అప్పుడు హనుమంతుడు స్వయంభూ యొక్క మంత్రముచే అభిమంత్రించబడిన బ్రహ్మాస్త్రము తనకు ఇచ్చిన వరదానము గుర్తుచేసుకొనెను.

'లోకములగురువు ప్రభావమువలన కలిగిన అస్త్రబంధనము నుంచి విడివడగల శక్తి లేదని అని ప్రయోగింపబడిన నన్ను బంధించిన ఈ అస్త్రమును నేను అనుసరించవలెను'. ఆ వానరుడు ఆ అస్త్రముయొక్క వీర్యమును గురించి విచారించు , తనకు విమోక్షణ శక్తిపై పితామహుని అనుగ్రహమును గుర్తుతెచ్చుకొని, పితామహుని అస్త్రమును అనుసరించుటకు నిశ్చయించుకొనెను.

'ఈ అస్త్రముచే బంధింపబడినప్పటికీ నాకు భయము లేకున్నది. బ్రహ్మదేవుడు ఇంద్రుడు వాయుదేవులచే నేను రక్షింపబడుతున్నాను కాబోలు. రాక్షసులచేత బంధింపబడి రాక్షసేంద్రునితో మట్లాడు అవకాశము కలుగును. అందువలన వారు నన్ను బంధింతురుగాక"
శత్రువులను హతమార్చగలవాడు, కార్యములను సమీక్షించి కార్యములను చేయువాడు, నిశ్చయము చేసికొనినవాడై, చేష్టలు ఏమీ లేకుండా ఉండెను. రాక్షసులు దగ్గరకు వచ్చి బంధించి భయపెడుతూ ఉంటే ఆ హనుమంతుడు బిగ్గరగా నాదము చేసెను.

అప్పుడు శత్రువులను నాశనము చేయగల ఆ హనుమంతుడు చేష్టలు లేకుండా వుండుట చూచి ఆ రాక్షసులు హనుమంతుని నారచీరలతో తాళ్లతో మరల బంధించిరి. హనుమంతుడు 'ఆ రాక్షసేంద్రుడు కుతూహలముకొలదీ నన్ను చూచుటకు వచ్చును ' అని తలచి, నిశ్చయమైన మనస్సు కలవాడై తనను బంధించుచున్ననూ ఏమీ చేయక ఊరకుండా ఉండెను.

ఆ వల్కలములచేత బంధింపబడిన ఆ వీరుడు ఆ బ్రహ్మాస్త్రమునుండి విడివడెను. ఆ అస్త్రబంధము ఇంకొక బంధనముఉన్నచో తన బంధము విడి పెట్టును. అప్పుడు ఆ వీరుడు ఇంద్రజిత్తు తాళ్లతో కట్టబడి బ్రహ్మాస్త్రమునుండి విడుదలపొందిన వానరుని చూచి ఆలోచనలో పడెను. 'ఇతర బంధనములు ఉన్నచో బ్రహ్మాస్త్రము బంధించదు. అయ్యో మహత్తరమైన కర్మ నిరర్ధకమైనది. ఈ రాక్షసులకు మంత్రవిధానము తెలియదు. మంత్రమునుంచి విడుదలపొందినచో మరియే మంత్రము పనిచేయదు. అన్ని సంశయములో పడినవి కదా', అని అనుకొనెను.

హనుమంతుడు తను బ్రహ్మాస్త్రమునుండి విడివడెను అని తెలిసికొన లేదు. ఆ రాక్షసులచేత బంధింపబడినవాడై, బంధములతో బాధింపబడినప్పటికీ అలాగే ఉండిపోయెను. అప్పుడు ఆ వానరుడు కౄరులైన ఆ రాక్షసులచేత పిడికలతో పీడింపబడి కర్రలతో కొట్టబడి రాక్షసేంద్రుని సమీపమునకు తీసుకుపోబడెను. ఆ విధముగా తాళ్లతో కట్టబడిన, ఆ బ్రహ్మాస్త్రమునుండి విడుదల అయిన వానిని చూచి మహాబలుడైన ఇంద్రజిత్తు అ వానరోత్తముని రాజునకు రాక్షసగణములకు చూపించెను.

మదించిన మాతంగము వలె బంధింపబడిన వానరోత్తముని ఆ రాక్షసుడు రాక్షసాధిపతి అగు రావణునికి సమర్పించిరి. 'ఇతడు ఎవడు? ఎవరివాడు? ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చిన వాడు? ఏ కార్యము కొరకు? ఇతడి వెనక ఎవరున్నారు', అని రాక్షస వీరులు తమలో తాము అనుకొనిరి. ఇంకా కొంతమంది రాక్షసులు కోపోద్రిక్తులై ఇతనిని 'హతమార్చండి', ' దహనము చేయండి', 'భక్షించండి' అని ఒకరికొకరు చెప్పుకొనసాగిరి,

అ మహాత్ముడు తొందరగా రాజమార్గమును దాటి ఆ రాజుయొక్క మహారత్నములతో అలంకరింపబడిన రాజగృహమును, రాక్షసాధిపుని పాదములవద్ద ఆసీనులైన వృద్ధపరిచారకులను చూచెను.

మహాతేజము గల ఆ రావణుడు వికృతాకారముకల రాక్షసులచేత అక్కడికి తీసుకు రాబడిన కపిసత్తముని చూచెను. ఆ వానరోత్తముడు కూడా తేజో బలములతో భాస్కరుని వలె విరాజిల్లు చున్న రాక్షసాధిపతిని చూచెను.

అ దశాననుడు రోషముతో ఎఱ్ఱబడిన కళ్ళుగలవాడై ఆ కపిని చూచి , ఉపావిశులైన అనుభవశీలులైన మంత్రిముఖ్యులను ఆ వానరుని గురించి అడిగెను. వారిచేత యథాక్రమముగా వచ్చినకార్యము దాని మూలము గురించి అడగబడగా ఆవానరుడు " కపిరాజు యొక్క కార్యము వలన వచ్చిన వాడను " అని పలికెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో నలభై ఎనిమిదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

యథాక్రమం తైః స కపిర్విపృష్టః
కార్యార్థమర్థస్య చ మూలమాదౌ|
నివేదయామాస హరీశ్వరస్య
దూతః సకాశాత్ అహమాగతోఽస్మి||62||

స||తైః యథాక్రమం కార్యార్థం అర్ధస్య మూలం విపృష్టః సః కపిః హరీశ్వరస్య సకాశాత్ ఆగతః అస్మి ఇతి నివేదయామాస||

తా|| వారిచేత యథాక్రమముగా వచ్చినకార్యము దాని మూలము గురించి అడగబడగా ఆవానరుడు " కపిరాజు యొక్క కార్యము వలన వచ్చిన వాడను " అని పలికెను.
||ఓమ్ తత్ సత్||