||సుందరకాండ ||

|| నాలుగొవ సర్గ తెలుగులో||


|| Om tat sat ||

సుందరకాండ.
అథ చతుర్థః సర్గః

అప్పుడు ఆ కపిసత్తముడు మహాబాహువు అగు హనుమంతుడు కామరూపిణీ అగు లంకిణిని తన పరాక్రమముతో జయించి శ్రేష్ఠమైన నగరమును ద్వారములేని చోటనుంచిప్రవేశించెను. కపిరాజుహితము కోరు ఆ హనుమంతుడు తన ఎడమపాదమును శత్రువుతలపై పెట్టినట్లు లంకానగరము లో ఎడమపాదము ముందు పెట్టి ఆనగరములో ప్రవేశించెను.

ఆ విధముగా ఆ రాత్రి , బలిష్ఠుడైన ఆ మారుతాత్మజుడు ముత్యములతో పుష్పములతో విరాజిల్లు మహామార్గములలో ప్రవేశించెను. నవ్వులసందడితో, వాద్యఘోషలతో నిండిన, వజ్రములతో అలంకరింపబడిన గవాక్షములు గల మేఘములను అందుకుంటున్న గృహములతో నున్న ఆ లంకానగరము మేఘములతో ఉన్న ఆకాశములాగ ప్రకాశించెను. ఆ లంకానగరము తెల్లని మేఘములతో సమానమైన గృహములతో, శుభకరమైన పద్మాకారము స్వస్తికాకారము గల రాక్షస గణముల గృహములతో, అన్నిచోటలా వర్ధిల్లగల భవనముల అంటే దక్షిణ ద్వారము లేని భవనములతో భూషితమై యున్నది.

ఆ కపిరాజు హితము కోరువాడు అగు హనుమంతుడు రాఘవుని కార్యము చేయుటకై తిరుగుచూ ఆ నగరము చూచి ఆనంద పడెను. ఒక భవనమునుంచి ఇంకో భవనము వెళ్ళుతూ ఆ పవనాత్మజుడు వివిధాకృతిగల భవనములను చూచెను.

ఆ నగరములో దేవలోకములోని అప్సరసలవలె ఆ నగర స్త్రీలు మూడు స్థానములుగల స్వరములతో మధురముగా పాడుతున్న పాటలు విన్నాడు. మహాత్ముల భవనములనుంచి కాలికి కట్టిన గజ్జెలసందడి, నడుముకట్టిన గజ్జెల సందడి, అక్కడక్కడ సోపానములమీద పాదముల సవ్వడి, తప్పట్ల ధ్వని, అక్కడక్కడ సింహనాదములు విన్నాడు. అక్కడ రాక్షసుల గృహములనుంచి జపించబడుచున్న మంత్రములను కూడా విన్నాడు. తమంతట తామే వేదాధ్యయనము చేయుచున్న రాక్షసులను చూచెను. అలాగే రావణస్తవము చేయుచూ గర్జించుచున్న వారిని కూడా చూచెను.

నగరమధ్యములో రాజమార్గముల మీద మహత్తరమైన రాక్షసుల సైన్యమును , అనేకమంది రావణుని గూఢచారులను కూడా చూచెను. దీక్షలో నున్నవారిని, జటాజూటధారులను, గోజీనాంబరము వేసికొని , ధర్భలు చేతులో వుంచుకొనిన, యజ్ఞయాగాదులకు కావలసిన పాత్రలు తీసుకుపోవుచున్న బ్రాహ్మణులను చూచెను. చేతిలో ఇనుపగుదియ ఉన్నవారిని, అలాగే దండాయుధము కలవారిని , ఒకే కన్ను ఉన్నవారిని, ఒకే చెవి వున్నవారిని, పెద్దపొట్టగలవారినీ, పెద్ద స్తనములు గలవారినీ చూచెను.

వికృతరూపముతో భయంకరమైన ముఖము గలవారిని, వామనులను, చూచెను. ఖడ్గము ధరించిన వారిని, ధనస్సు, ముసలాయుధములను ధరించిన వారినీ కూడా చూచెను. పరిఘలు లాగ వున్న చేతులు గలవారిని , విచిత్రమైనకవచములు ధరించినవారిని , మరీ స్థూలము కాకుండా మరీ సన్నముగా కాకుండా మరీ పొడుగా కాకుండా మరీ పొట్టిగా కాకుండా ఉన్నవారిని చూచెను. మరీ తెల్లగా కాకుండా మరీ నల్లగా కాకుండా మరీ కుబ్జారూపములో లేని వారిని, వామనులను. బహువిధములుగా విరూపము గలవారిని , సుందరరూపము గలవారిని మంఛి వర్ఛస్సు గలవారిని, ధ్వజములు పతాకములు పట్టుకున్నవారిని అనేక రకములైన ఆయుధములు ధరించిన వారిని చూచెను.

ఆ మహాకపి శక్తివృక్షములు ఆయుధముగా ధరించినవారిని, పట్టిశములు అశనములను పదునైన శూలములను, పాశములను చేతిలో ధరించినవారిని చూచెను. సుగంధ ద్రవ్యములను రాసుకున్నవారిని, మంచి ఆభరణములు ధరించినవారిని కూడా చూచెను. అనేక రకములైన వేషములు ధరించినవారిని, తమ స్వేచ్ఛానుసారము తిరుగుచున్నవారిని అలాగే తీక్ష్ణమైన శూలములు పట్టుకోని , వజ్రాయుధము పట్టుకొని తిరుగుచున్న మహాబలులను చూచెను.

ఆ కపివరుడు అంతఃపురము ముందు రాక్షసాధిపతిచే ఆజ్ఞాపింపబడి వందలవేల అప్రమత్తమైన రక్షకులను చూచెను. ఆ మహాకపి బంగారుమయమైన ముఖద్వారము గల , పర్వతశిఖరముపైనున్నప్రతిష్టించబడిన , తామరపూవులతో కూడియున్నతటాకములతో చుట్టబడిన ప్రాకారములతో నున్న రాక్షసాధిపతి భవనమును చూచెను.

దివ్యమైన స్వర్గములావున్న, దివ్యమైన నాద నినాదములతో మ్రోగుచున్న,గుఱ్ఱపు సంకిళ్ళతో నిండిన, ఆభరణపు సవ్వడులతో నున్న,రధములు వాహనములు విమానములతో అలాగే శుభకరమైన గుఱ్ఱములు ఏనుగులు తో నిండిన, తెల్లని మేఘసముదాయము వంటి నాలుగుదంతములు కల ఏనుగులతో అలంకరింపబడినట్టి , మత్తెక్కిన మృగములు పక్షులతో అలంకరింపబడిన ముఖద్వారములు గల , వేలకొలది రాక్షస రక్షకులచే రక్షింపబడుచున్న రాక్షసాధిపతి గృహమును ఆ మహాకపి ప్రవేశించెను.

ఆ హనుమంతుడు చుట్టూ బంగారుమయమైన , విలువలేని మణులతో అలంకరింపబడిన చాలామంచి అగరు చందనముల పూయబడిన రావణ అంతః పురమును ప్రవేశించెను.

ఈ విధముగా వాల్మీకి విరచిత రామాయణములో సుందరకాండలోని నాలుగవ సర్గ సమాప్తము.

తత్త్వ దీపిక:

ఇక్కడ మొదటి శ్లోకములో
" అద్వారేణ మహాబాహుః ప్రాకారమభిపుప్లువే"
హనుమ ద్వారము కాకుండా ప్రాకారము దాటిలోన ప్రవేశించెను.

శత్రువుల నగరములో ప్రవేశించునపుడు ద్వారము గుండా ప్రవేశించరాదు అన్న రాజనీతిని పాటించి తన స్వామికి శత్రువగు రావణుని కోటలో హనుమంతుడు ప్రవేశించెను.

ఇక్కడ జ్ఞాని యగు మహాపురుషుడు జన్మించు విధానము నిరూపింపబడినది.

జ్ఞానుల జన్మ సామాన్యమానవుల జన్మ వంటిది కాదు. వారు ఆత్మను దేహము కన్నా భిన్నము అని ఎరిగినవారు. వారు జన్మించుట కర్మభోగమునకై కాక భగవదాజ్ఞ నిర్వహణకొఱకు.

లంక శరీరము. అందుప్రవేశించు ద్వారము కర్మ. అనుభవించవలసిన కర్మలేని వారు జన్మఎత్తుటఎందులకు? భగవదాజ్ఞచే లోకకల్యాణము కొఱకు.

అట్టివాడు హనుమ. అందుచే ద్వారము ద్వారా కాకుండా పక్కనుండి ప్రవేశించెను.

అట్టి హనుమ మాహాబాహుః అని వర్ణింపబడెను.
ప్రాకారముపై చాచి పట్టుకొని దూకూటకు సమర్థుడిగా సూచించుటకు మహాబాహుః అని వర్ణింపబడెను. బాహువులు కర్మ సాధనములు. వాని మహత్వము పొడుగుగా బలముగా ఉండుటకాదు. చేసిన కర్మ అంటకుండా చేయగల బాహువులు కలవాడు అని. మహానుబాహుః అనగ సంగకర్తృత్వము విడచి కర్మను ఆచరించువాడు అని.

అట్టి హనుమ బంగారపు ప్రాకారము దూటెను. మనచుట్టు వుండే విషయాలే బంగారము. వాటిని అనుభవింపకుండా దూటి దాటకలిగిన వాడే జ్ఞాని.

అలాగ ఈ ముడు పదములు అద్వారేణ, మహాబాహుః , ప్రాకారములతో మహాజ్ఞానియొక్క లక్షణములు సూచింపబడినవి.

|| ఓమ్ తత్ సత్||