||సుందరకాండ ||

|| ఎభైయ్యొకటవ సర్గ తెలుగు తాత్పర్యముతో||

|| Sarga 51 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ఏకపంచాశస్సర్గః||

తం సమీక్ష్య మహాసత్త్వం సత్త్వవాన్ హరిసత్తమః|
వాక్య మర్థవదవ్యగ్రః తం ఉవాచ దశాననమ్||1||

స|| సత్త్వవాన్ హరిసత్తమః మహాసత్త్వం తం దశాననమ్ అవ్యగ్రః అర్థవత్ వాక్యం తం ఉవాచ||

బలవంతుడూ వానరోత్తముడు అయిన హనుమంతుడు అ మహాబలపరాక్రము గలవాడు అయిన దశాననునితో అర్థవంతముగా ఇట్లు పలికెను.

అహం సుగ్రీవసన్దేశాత్ ఇహ ప్రాప్తః తవాలయమ్|
రాక్షసేంద్ర హరీశస్త్వాం భ్రాతా కుశలమబ్రవీత్||2||
భ్రాతుః శృణు సమాదేశం సుగ్రీవస్య మహాత్మనః|
ధర్మార్థోపహితం వాక్య మిహచాముత్ర చ క్షమమ్||3||

స|| రాక్షసేంద్ర అహం సుగ్రీవ సందేశాత్ ఇహ తవ ఆలయం ప్రాప్తః| హరీశః భ్రాతా త్వాం కుశలం అబ్రవీత్||భ్రాతుః మహాత్మనః సుగ్రీవస్య సమాదేశం ఇహ చ అముత్ర చ దర్మార్థ ఉపహిత వాక్యం క్షమమ్ శృణు |

' ఓ రాక్షసేంద్రా నేను సుగ్రీవుని సందేశముతో నీ ఆలయమునకు వచ్చితిని. వానరాధిపతి సోదరసమానుడు నీ కుశలములను అడుగుచున్నాడు. సోదర సమానుడు మహాత్ముడు అయిన సుగ్రీవుని వద్దనుంచి వచ్చిన సందేశము నీకు ఇహ పరములలో శ్రేయస్సు కలిగించునది ధర్మము తో కూడినది. అది వినుము'.

రాజా దశరథో నామ రథకుజ్ఞరవాజిమామ్|
పితేవ బంధుర్లోకస్య సురేశ్వర సమద్యుతిః||4||
జ్యేష్ఠః తస్య మహాబాహుః పుత్రః ప్రియకరః ప్రభుః|
పితుర్నిర్దేశాన్నిష్క్రాంతః ప్రవిష్ఠో దండకావనమ్||5||
లక్ష్మణేన సహభ్రాత్రా సీతాయా చాపి భార్యయా|
రామో నామ మహాతేజా ధర్మ్యం పన్థానమాశ్రితః||6||

స|| రథకుంజిరవాజిమాన్ బంధుః లోకస్య పితేవ సురేశ్వరద్యుతిః దశరథః నామ రాజా||తస్య జ్యేష్ఠ పుత్రః ప్రియకరః ప్రభుః రామః నామ మహాతేజా ధర్మ్యం పమ్థానమాశ్రితః పితుః నిర్దేశాత్ నిష్క్రాంతః | లక్ష్మనేన సహభ్రాతా భార్యయా సీతా చ అపి ప్రవిష్ఠః దండకావనమ్ ||

' దశరథుడనే పేరుగల రాజు రథములు ఏనుగులు సమృద్ధిగాగలవాడు. లోకబంధువు. ప్రజలకు తండ్రిలాంటి వాడు. ఇంద్రునితో సమానమైన తేజము కలవాడు. ఆయన జ్యేష్ఠపుత్రుడు ప్రియము చేయువాడు నా ప్రభువు రాముడనే పేరుగలవాడు. మహాతేజము కలవాడు. ధర్మమార్గమును అనుసరిస్తూ తండ్రి ఆదేశముతో వనవాసమున కు వెళ్ళెను. తన తమ్ముడైన లక్ష్మణునితో భార్య సీతతో దండకావనము ప్రవేశించెను.

తస్య భార్యా వనే నష్టా సీతా పతిమనువ్రతా|
వైదేహస్య సుతా రాజ్ఞో జనకస్య మహాత్మనః||7||
సమార్గమాణస్తాం దేవీం రాజపుత్త్రః సహానుజః|
ఋష్యమూకమనుప్రాప్తః సుగ్రీవేణ సమాగతః||8||
తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయాం పరిమార్గణమ్|
సుగ్రీవస్యాపి రామేణ హరిరాజ్యం నివేదితమ్||9||

స|| సీతా మహాత్మనః రాజ్ఞో వైదేహస్య జనకస్య సుతా సీతా పతివ్రతా తస్య భార్యా వనే నష్టా ||తాం దేవీం మార్గమాణః సః రాజపుత్రః అనుజః సహ ఋష్యమూకం అనుప్రాప్తః సుగ్రీవేణ సమాగతః||తేన తస్య సీతాయాం పరిమార్గణం ప్రతిజ్ఞాతం| రామేణ సుగ్రీవస్యా అపి హరిరాజ్యం నివేదితుం ( ప్రతిజ్ఞాతం)||

ఆయన భార్య మహాత్ముడైన విదేహమహరాజుయొక్క కూతురు పతివ్రత సీత వనములో కనిపించకుండా పోయినది. ఆ దేవిని వెతుకుతూ ఆ రాజపుత్రులు ఋష్యమూక పర్వతప్రాంతమునకి వచ్చి సుగ్రీవునితో కలిసిరి. ఆ సుగ్రీవుడు వారి సీతాన్వేషణకు ప్రతిజ్ఞాబద్ధుడయ్యెను. రాముడు కూడా వానరరాజ్యము కట్ట బెట్టుటకు ప్రతిజ్ఞాబద్ధుడయ్యెను.

తతః తేన మృథే హత్వా రాజపుత్త్రేణ వాలినమ్|
సుగ్రీవః స్థాపితో రాజ్యే హర్యృక్షాణాం గణేశ్వరః||10||
త్వయా విజ్ఞాతపూర్వశ్చవాలీ వానరపుంగవః |
రామేణ నిహత సజ్ఞ్ఖ్యేశరేణైకేన వానరః||11||
స సీతా మార్గమాణే వ్యగ్రః సుగ్రీవసత్యసంగరః|
హరీన్ సంప్రేషయామాస దిశః సర్వా హరీశ్వరః||12||

స|| తతః తేన రాజపుత్రేణ వాలినం మృథే హత్వా సుగ్రీవః హర్యృ క్షాణాం రాజ్యే గణేశ్వరః స్థాపితః||వాలీ వానరపుంగవః త్వయా విజ్ఞాతపూర్వః చ | వానరః రామేణ సంఖ్యే ఏకేన శరేన నిహతః||సుగ్రీవః సత్య సంగరః హరీశ్వరః స సీతా మార్గమాణే వ్యగ్రః దిశః సర్వాన్ హరీన్ సంప్రేషయామాస ||

అప్పుడు ఆ రాజపుత్రుడు వాలిని యుద్ధములో హతమార్చి సుగ్రీవుని వానరగణములకు అధిపతిగా స్థాపించెను. వానరపుంగ వుడైన వాలి గురించి నీకు విదితమే. ఆ వానరుడు రాముని చేత ఒకే బాణముతో హతమార్చబడెను. వానరాధిపుడు మాటతప్పని వాడు సుగ్రీవుడు సీతాన్వేషణకు అన్ని దిక్కులలో వానరులను పంపెను.

తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ|
దిక్షు సర్వాసు మార్గన్తే హ్యథశ్చోపరిచామ్బరే||13||
వైనతేయసమాః కేచిత్కేచిత్ తత్రానిలోపమాః|
అసంగతయః శీఘ్రా హరివీరా మహాబలాః||14||

స|| హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ తామ్ సర్వాసు దిక్షు అథశ్చ ఉపరి అంబరే చ మార్గంతే||హరివీరాః మహాబలాః అసంగతయః శీఘ్రాః కేచిత్ వైనతేయసమాః కేచిత్ అనిలోపమాః|

వందల వేలకొలదీ వానరులు సీతాన్వేషణము కై అన్ని దిశలలో నూ ఆకాశములో పాతాళములోనూ వెదుకుచున్నారు. ఆ వానర వీరులు కొందరు మహాబలులు ఏమీ ఆటంకములులేకుండా శీఘ్రముగా వెళ్ళువారు. కొందరు గరుత్మంతునితోసమానులు. కొందరు వాయుదేవునితో సమానులు.

అహం తు హనుమాన్నామ మారుతస్య ఔరసస్సుతః|
సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతమ్||15||
సముద్రం లంఘయిత్వైవ తాం దిద్రుక్షురిహాగతః|
భ్రమతా చ మయా దృష్టా గృహే తే జనకాత్మజా||16||
తద్భవాన్ దృష్టధర్మార్థః తపః కృత పరిగ్రహః|
పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి||17||

స|| అహం హనుమాన్ నామ మారుతస్య ఔరస సుతః | సీతాయాస్తు కృతే తూర్ణమ్ శతయోజనం ఆయతం సముద్రం లంఘయిత్వైవ దిదృక్షు రిహాగతః ||భ్రమతా మయా తే గృహే జనకాత్మజా దృష్టా| భవాన్ దృష్టధర్మార్థః |తపః కృతపరిగ్రహః | తత్ మహాప్రాజ్ఞ త్వం పరదారాన్ ఉపరోద్ధం న అర్హసి||

' నేను హనుమంతుడను పేరుగలవాడను మారుతియొక్క ఔరసపుత్రుడను. సీతాదేవి కొఱకై వందయోజనములు విస్తీర్ణముగల సముద్రమును దాటి ఇచటికి వచ్చితిని. తిరుగుతూ ఉన్న నాచేత నీ గృహములో జనకాత్మజ చూడబడినది. నీకు ధర్మము తెలిసినదే. తపస్సు కూడా చేసినవాడవు. ఓ బుద్ధిశాలీ నీకు పరస్త్రీలను నిర్బంధించుట తగని పని'.

న హి ధర్మ విరుద్ధేషు బహ్వాపాయేషు కర్మసు|
మూలఘాతిషు సజ్జన్తే బుద్ధిమన్తో భవద్విథాః||18||
కశ్చ లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినామ్|
శరణామగ్రతః స్థాతుం శక్తో దేవాసురేష్వపి||19||
న చాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన|
రాఘవస్య వ్యళీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్||20||

స|| భవద్భిః బుద్ధిమానః ధర్మవిరుద్ధేషు బహ్వాపయేషు మూలధాతిషు కర్మసు న సజ్జంతే హి ||లక్ష్మణముక్తానాం రామకోపానువర్తినామ్ శరాణాం అగ్రతః స్థాతుం దేవాసురేష్వపి కః శక్తః||రాజన్ రాఘవస్య వ్యలీకం కృత్వా సుఖం అవాప్నుయాత్ త్రిషు లోకేషు కశ్చన న విద్యేత్ ||
'బుద్ధిమంతుడైన నీలాంటి వారిచేత ధర్మవిరుద్ధమైన కార్యములు, నాశనమునకు మూలకారణములగు కార్యములు చేబట్టరు కదా. దేవతలూ అసురులు ఎవరూ రాముని కోఫమును అసురించి లక్ష్మణునిచే వదిలిన శరపరంపరధాటికి నిలబడలేరు. ఓ రాక్షసేంద్రా రామునికి అపకారము చేసి సుఖము పొందగలవాడు ఈ ముల్లోకములలో ఎవరూ లేరు'.

తత్త్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుబన్ది చ|
మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతామ్||21||
దృష్ఠా హీయం మయా దేవీ లబ్దం య దిహ దుర్లభమ్|
ఉత్తరం కర్మ యత్ శేషం నిమిత్తం తత్ర రాఘవః||22||

స|| తత్ త్రికాలహితం ధర్మ్యం అర్థానుబంధి చ వాక్యం మన్యస్వ| నరదేవాయ జానకీ ప్రతిదీయతామ్||మయా ఇయమ్ దేవీ దృష్టాహి యత్ దుర్లభం ఇహ లబ్ధం | ఉత్తరం యత్ కర్మ శేషం తత్ర రాఘవః నిమిత్తం||

' అందుకని త్రికాలహితమైన ధర్మమును అనుసరించు నా ఈ మాటలను వినుము. ఆ నరదేవునకు సీతను అప్పగించుము. ఎవరికీ సాధ్యముకాని ఈ దేవిని చూడడమనే కార్యమును నేను సాధించితిని. ఇక పై చేయవలసిన కర్మ రాఘవునిపై వుండును'.

లక్షితేయం మయా సీతా తథా శోకపరాయణా|
గృహ్యాయాం నాభిజానాసి పజ్ఞ్చాస్యామివ పన్నగీం||23||
నేయం జరయితుం శక్యా సాసురైరమరైరపి|
విషసంసృష్ట మత్యర్థం భుక్తమన్నమివౌజసా||24||

స|| తథా శోకపరాయణా ఇయం సీతా మయా లక్షితా పంచాస్యం పన్నగీం ఇవ యాం గృహ్య నాభిజానాసి||అత్యర్థం విషసంసృష్టం భుక్తం అన్నం ఇవ ఇయం సాసురైః అమరైః అపి ఔజసా జరయితుం న శక్యా ||

ఈ శోకసముద్రములో మునిగియున్న నా చేత చూడబడిన సీత , నీ చేత నిర్బంధించబడిన ఈమె ఇదు తలల పాము వంటిది అని నీవు గ్రహించకుండా ఉన్నావు. విషముతో కూడిన అన్నము తిని జీర్ణించుకొనుట ఎలా సాధ్యముకాదో అలాగ సురాసురులకు కూడా ఆమెను బంధములో ఉంచుట సాధ్యము కాదు.

తపః సన్తాపలబ్దస్తే యోsయం ధర్మపరిగ్రహః|
న స నాశయితుం న్యాయ ఆత్మ ప్రాణపరిగ్రహః||25||
అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి|
ఆత్మనః సాసురైర్దేవైర్హేతుః తత్రాప్యయం మహాన్||26||

స|| తపః సంతాపలబ్ధః తే యః అయం ధర్మపరిగ్రహః ఆత్మప్రాణపరిగ్రహః సః నాశయితుం న న్యాయ్యః||భవాన్ తపోభిః ఆత్మనః సాసురైః దేవైః యామ్ అవధ్యతాం సమనుపశ్యసి తత్రాపి అయం మహాన్ హేతుః ||

తపోబలముచే ధర్మకార్యముల పరిపాలనచే పోందబడిన ప్రాణరక్షణ వరములను నాశనము చేసికొనుట నీకు భావ్యము కాదు. నీ తపోబలముచేత నీవు అవధ్యుడవు అని కల ధైర్యము సరికాదు . దానికో కారణము ఉంది.

సుగ్రీవో నహి దేవోఽయం నాసురో న చ రాక్షసః|
న దానవో న గంధర్వో న యక్షో న చ పన్నగః||27||
తస్మాత్ ప్రాణపరిత్రాణం కథం రాజన్ కరిష్యసి|

స|| సుగ్రీవః అయం దేవః న| న అసురః | న రాక్షసః | న దానవః| న గంధర్వః| న యక్షః | న చ పన్నగః|రాజన్ తస్మాత్ ప్రాణ పరిత్రాణం కథం కరిష్యసి||

ఈ సుగ్రీవుడు దేవుడు కాదు. అసురుడుకాదు. రాక్షసుడు కాదు, దానవుడు కాదు. గంధర్వుడు కాదు. యక్షుడు కాదు. పన్నగుడు కాదు. ఓ రాజా అందువలన నీ ప్రాణము ఎలా కాపాడుకుందువు?

న తు ధర్మోపసంహారం అధర్మఫలసంహితమ్||28||
తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః|
ప్రాప్త ధర్మఫలం తావత్ భవతా నాత్ర న సంశయః||29||
ఫలమస్యాప్యధర్మ్యస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే|

స|| ధర్మోపసంహారం అధర్మఫలసంహితం | న తు తత్ ఫలమేవ అన్వేతి ధర్మశ్చ అధర్మ నాశనః||భవతా ధర్మఫలం ప్రాప్తం తావత్ అత్ర సంశయః న | అస్య అధర్మస్య ఫలం అపి క్షిప్రమేవ ప్రపత్స్యసే||

' ధర్మమును సంహరించుటవలనే కలిగేది అధర్మము తో కూడిన ఫలము. ఆ ఫలముపొందినచో ధర్మము నాశనము అగును. నీచేత ధర్మఫలము పొందబడినది అందులో సందేహము లేదు. ఈ అధర్మముయొక్క ఫలము కూడా త్వరలో పొందెదవు'.

జనస్థానవథం బుద్ధ్వా బుద్ధ్వా వాలివథం ప్రతి||30||
రామసుగ్రీవ సఖ్యం చ బుద్ధ్యస్వ హిత మాత్మనః|
కామం ఖ ల్వహ మప్యేకః సవాజిరథకుజ్ఞరామ్||31||
లంకాం నాశయితుం శక్తస్తస్యైష తు న నిశ్చయః|

స|| జనస్థానవధం బుద్ధ్వా తథా వాలివథం బద్ధ్వా రామసుగ్రీవ సఖ్యం చ ఆత్మనః జితం బుద్ధ్యస్వ||అహం ఏకః అపి సవాజిరథకుంజరామ్ లంకాం నాశయితుం కామం శక్తాః ఖలు | ఏషః తు నిశ్చయః న||

' జనస్థానములో రాక్షస సంహారము తెలిసికొని , వాలి వధ గురించి తెలిసికొని, రామ సుగ్రీవుల సఖ్యము గురించి తెలిసికొని నీవు జయించబడినట్లే అని తెలిసికొనుము. నేను ఒక్కడినే రథ తురగ గజముల సేనలతో కూడిన ఈ లంకను నాశనము చేయగల శక్తి కలవాడను. అందులో సందేహము లేదు'.

రామేణ హి ప్రతిజ్ఞాతం హర్యృక్షగణసన్నిధౌ||32||
ఉత్సాదనమమిత్రాణాం సీతాయైస్తు ప్రధర్షితా|
అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందరః||33||
న సుఖం ప్రాప్నుయాదన్యః కిం పునస్త్వద్విధో జనః|

స|| రామేణ హర్యక్షుగణ సన్నిధౌ యైః సీతా ప్రధర్షితా అమిత్రాణాం ఉత్సాదనం ప్రతిజ్ఞాతం హి ||రామస్య అపకుర్వన్ సాక్షాత్ పురందరః అపి సుఖం న ఆప్నుయాత్ | త్వత్ విధః కిం పునః||

రాముడు వానర భల్లూక గణముల సమక్షములో సీతను అపహరించిన శత్రువులను నాశనము చేసెదనని ప్రతిజ్ఞ చేశెను. రాముని కి అపకారము చేసి సాక్షాత్తు పురందరుడు కూడా సుఖముపొందలేడు. అప్పుడు నీలాంటి వారిగురించి చెప్పనవసరము లేదు.

యాం సీతే త్యభిజానాసి యేయం తిష్టతి తే వశే||34||
కాళరాత్రీతి తాం విద్ధి సర్వలంకావినాశినీం|
తదలం కాలపాశేన సీతావిగ్రహరూపిణా||35||
స్వయం స్కన్థావసక్తేన క్షమమాత్మని చిన్త్యతాం|

స|| యాం సీతా ఇతి అభిజానాసి యా ఇయమ్ తే వశే తిష్ఠతి తాం సర్వలంకావినాశినీం కాళరాత్రి ఇతి విద్ధి||తత్ సీతావిగ్రహరూపిణా స్వయం స్కన్ధావసక్తేన కాలపాశేన అలం | ఆత్మని క్షేమమ్ చిన్త్యతామ్ ||

' నీవు సీత అని ఎవరిని తెలిసికున్నావో , ఏ సీత నీ నిర్బంధములో ఉన్నదో ఆమెను సర్వలంకా వినాశినిగా కాళరాత్రిగా తెలిసికొనుము. ఆ సీతా రూపములో నున్న కాలపాశమును నీ మెడకు కట్టుకోకు. నీ క్షేమము గురించి ఆలోచించుకొనుము' .

సీతాయా స్తేజసా దగ్ధాం రామ కోపప్రపీడితామ్||36||
దహ్యమానా మిమాం పశ్య పురీం సాట్టప్రతోళికాం|
స్వాని మిత్త్రాణి మన్త్రీంశ్చ జ్ఞాతీన్ భాతౄన్ సుతాన్ హితాన్||37||
భోగాన్దారాం శ్చ లంకాం చ మా వినాశముపానయ|

స|| తేజసా దగ్ధామ్ రామకోపప్రపీడితామ్ దహ్యమానాం సాట్టప్రతోళికాం ఇమాం పురీం పశ్య ||స్వాని మిత్రాణి మంత్రీంశ్చ జ్ఞాతీన్ భాతౄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాంశ్చ లంకాం చ వినాశం మా ఉపానయ||

' సీత యొక్క తేజస్సుతో రాముని కోపముతో దగ్ధమగు సాట్టప్రాకారములతో కూడిన ఈ నగరము చూడుము. నీ మిత్రులు మంత్రులు బంధువులు తమ్ములు పిల్లలూ హితులు భార్యలు భోగములతో కూడిన ఈ లంకా నాశనమునకు కారణము కాకుము'.

సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ||38||
రామదాసస్య దూతస్య వానరస్య చ విశేషతః|
సర్వాన్ లోకాన్ సుసంహృత్య సభూతాన్ స చరాచరాన్||39||
పునరేవ తథా స్రష్ఠుం శక్తో రామో మహాయశాః|

స|| రాక్షస రాజేంద్ర మమ దూతస్య వానరస్య విశేషతః రామదాసస్య సత్యం వచనం శృణుస్వ ||రామః మహాయశః సర్వాన్ లోకాన్ సభూతాన్ స చరాచరాన్ సుసంహృత్య పునరేవ తథా స్రష్టుం శక్తః ||

' ఓ రాక్షస రాజేంద్ర దూతను వానరుడను ప్రత్యేకముగా రాముని దాసుడను అగు నా సత్యమైన మాటలను వినుము. మహాయశస్సుగల రాముడు సమస్త చరాచర భూతములతో కూడిన లోకములను నశింపచేసి మరల సృష్టించ గల శక్తి కలవాడు'.

దేవాసుర నరేన్ద్రేషు యక్షరక్షోగణేషు చ||40||
విధ్యాధరేషు సర్వేషు గన్ధర్వేషూరగేషు చ|
సిద్ధేషు కిన్నరేన్ద్రేషు పతత్రిషు చ సర్వతః||41||
సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి సః|
యో రామం ప్రతియుధ్యేత విష్ణుతుల్య పరాక్రమమ్||42||

స|| విష్ణుతుల్యపరాక్రమం రామం ప్రతియుధ్యేత దేవాసురనరేంద్రేషు యక్షరక్షోగణేషు చ సర్వేషు విద్యాధరేషు గన్ధర్వేషు ఉరగేషు చ సిద్ధేషు చ కిన్నరేన్ద్రేషు సర్వతః పతత్రిషు సర్వభూతేషు సర్వత్ర సర్వకాలేషు నాస్తి||

' విష్ణువుతో సమానమైన పరాక్రమము గల రాముని తో యుద్ధము చేయుగల దేవతలూ అసురులు యక్షరాక్షస గణములు విద్యాధరులు గంధర్వులు సిద్ధులలోనూ కిన్నరులలో అన్ని భూతములలోనూ అన్నిచోటలా అన్ని కాలములలో ఎవరూ ఎక్కడా లేరు'.

సర్వలోకేశ్వర స్యైవం కృత్వా విప్రియ ముత్తమం|
రామస్య రాజసింహస్య దుర్లభం తవ జీవితమ్||43||

స|| సర్వలోకేశ్వరస్య రాజసింహస్య రామస్య ఏవం ఉత్తమమ్ విప్రియం కృత్వా తవ జీవితమ్ దుర్లభం ||

' సర్వలోకములకు ఈశ్వరుడైన రాజసింహుడు రామునితో ఈవిధముగా అప్రియమని పని చేసిన నీ జీవితము దుర్లభము'.

దేవాశ్చ దైత్యాశ్చ నిశాచరేన్ద్ర గంధర్వవిధ్యాధరనాగయక్షాః|
రామస్య లోకత్రయనాయకస్య స్థాతుం నశక్తాః సమరేషు సర్వే||44||
బ్రహ్మా స్వయంభూశ్చతురాననోవా రుద్రస్త్రిణేత్రః త్రిపురాన్తకో వా|
ఇన్ద్రో మహేన్ద్రోః సురనాయకో వా త్రాతుమ్ న శక్తా యుధి రామవధ్యం||45||

స|| నిశాచరేంద్ర దేవాశ్చ దైత్యాశ్చ గన్ధర్వవిధ్యాధరనాగయక్షాః సర్వే లోకత్రయనాయకస్య రామస్య సమరేషు స్థాతుం న శక్తాః ||యుధి రామవధ్యం స్వయమ్భూః చతురాననః బ్రహ్మా వా త్రినేత్రః త్రిపురాంతకః రుద్రో వా ఇంద్రః సురనాయకః మహేణ్ద్రః వా త్రాతుం న శక్తాః||

' ఓ నిశాచరేంద్రా ! దేవులలో దైత్యులలో గంధర్వ విధ్యాధరనాగ యక్షులు అందరిలో ముల్లోకములకు నాయకుడగు రాముని ముందర యుద్ధములో నిలబడు శక్తి లేదు. యుద్ధములో రాముడు వధించువానిని రక్షించుటకు చతురాననుడు అయిన బ్రహ్మ కాని, త్రినేత్రుడు త్రిపురాంతకుడు అయిన రుద్రునకు గాని, సురనాయకుడు మహేంద్రుడు అయిన ఇంద్రునకు కాని శక్యము కాదు'.

స సౌష్టవో పేత మదీనవాదినః
కపేర్నిశమ్యాప్రతిమోఽప్రియం చ|
దశాననః కోపవివృత్తలోచనః
సమాదిశత్ తస్య వధం మహాకపేః||46||

స|| అప్రతిమః సః దశాననః అదీనవాదినః కపేః సౌష్టవోపేతం అప్రియం వచః నిశమ్య కోపవివృతలోచనః తస్య మహాకపేః వధం సమాదిశత్ ||

అప్రియమైన హేతుబద్ధమైన అ వానరుని నిర్భయమైన మాటలు వినిన సాటిలేని దశకంఠుడుఆ మహాకపి యొక్క వధకు ఆజ్ఞ ఇచ్చెను.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ఏకపంచాశస్సర్గః ||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎభైయ్యొకటవ సర్గ సమాప్తము.

|| ఓమ్ తత్ సత్||