||సుందరకాండ ||

||ఏభై రెండవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 52 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ ద్విపంచాశస్సర్గః||

'క్షమస్వ రోషం త్యజ రాక్షసేంద్ర', అంటే
'రాక్షసేంద్రా క్షమించుము, రోషమును విడువుము.'

ఇవి విభీషణుని మాటలు. విభీషణుడు రావణుని చిన్న తమ్ముడు. తల్లి తన తండ్రి యగు విశ్వావసుని , అన్నయగు కుబేరుని ధర్మబద్ధమైన మార్గమును అనుసరించమంటే , అతని కన్న గొప్పవాడు అవడానికి రావణుడు పదివేల సంవత్సరాలు కఠోర తపస్సు చేశాడుట. అప్పుడే అదే తల్లి మాటలతో విభీషణుడు కూడా ఐదువేల సంవత్సరాలు తపస్సు చేస్తాడు. బ్రహ్మ ప్రత్యక్షమైనపుడు ఏమి వరముకావాలి అంటే , విభీషణుడు తను జీవితాంతము ఎన్నికష్టాలు ధర్మమార్గము విడిచిపెట్టకుండా వుండాలి అని వరము కోరుకుంటాడు. బ్రహ్మ తథాస్తు అని ఆ వరము ఇస్తాడు. విభీషణూడు అట్టివాడన్నమాట. ఇది ఉత్తరకాండలో చెప్పబడిన మాట.

సుందరకాండలో విభీషణుడు ప్రవేశించడము ఇదే మొదటి సారి. త్రిజట తన స్వప్న వృత్తాంతములో విభీషణుని గురించి చెపుతుంది. 'ఏకః తత్ర మయా దృష్టః శ్వేతఃఛత్రో విభీషణః' ; రావణుని దుర్దశ వివర్ణిస్తూ త్రిజట విభీషణుని గురించి కూడా చెపుతుంది. విభీషణుడు తెల్లని వస్త్రములతో, తెల్లని ఛత్రముతో కనిపించాడు అని అంటుంది. తెలుపు రంగు శుభసూచకము. అంటే త్రిజట కల విభీషణునికి శుభము, రావణునికి అశుభము సూచిస్తుంది.

తరువాత సీతమ్మ హనుమంతునితో తన సంభాషణలో, విభీషణుడు 'రామునకు తనని తిరిగి సమర్పించమనే ప్రయత్నము' చేశాడు అని అంటుంది. అంటే విభీషణుడు, సీత వృత్తాంతము, మంచి చెడ్డలు తెలిసినవాడన్నమాట. రావణుడు రామ దూతగా వచ్చిన హనుమని వధించమని ఆజ్ఞ ఇచ్చాడు. విభీషణుడు ఆ ఆజ్ఞను మళ్ళించడానికి రావణునితో తన మాటలగా హితోపదేశము చేస్తాడు ఈ సర్గలో.

ఇక ఏభైరెండవ సర్గలో శ్లోకార్థ తాత్పర్యాలతో జరిగే కథ చూద్దాము.

||శ్లోకము 52.01||

తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః |
ఆజ్ఞాపయత్ వధం తస్య రావణః క్రోథమూర్చితః ||52.01||

స|| రావణః మహాత్మనః వానరస్య తస్య వచనం శ్రుత్వా క్రోధమూర్ఛితః తస్య వధం ఆజ్ఞాపయత్ ||

|| శ్లోకార్థములు||'

మహాత్మనః వానరస్య -
మహాత్ముడైన హనుమంతుని
తస్య వచనం శ్రుత్వా-
అతని వచనములను విని
క్రోధమూర్ఛితః రావణః -
క్రోధమూర్ఛితుడై రావణుడు
తస్య వధం ఆజ్ఞాపయత్ -
హనుమంతుని వధించుటకు ఆజ్ఞాపించెను

||శ్లోకతాత్పర్యము||

రావణుడు మహాత్ముడైన హనుమంతుని వచనములను విని క్రోధమూర్ఛితుడై హనుమంతుని వధించుటకు ఆజ్ఞాపించెను. ||52.01||

||శ్లోకము 52.02||

వధే తస్య సమాజ్ఞప్తే రావణేన దురాత్మనా |
నివేదితవతో దౌత్యం నానుమేనే విభీషణః ||52.02||

స|| దురాత్మనా రావణేన నివేదితవతః తస్య వధే సమాజ్ఞప్తే విభీషణః దౌత్యం నాను మేనే ||

గోవిన్దరాజ టీకాలో- నివేదితవతః ఉక్తవతః

రామ టీకాలో- వధ ఇతి| రావణేన వధే సమాజ్ఞప్తం సతి దౌత్యం స్వనిష్టదూత ధర్మం నివేదితవతో హనూమతః వధే విభీషణో నాను మేనే అనుమతిం న చకార|

|| శ్లోకార్థములు||

దురాత్మనా రావణేన - దురాత్ముడైన రావణునిచే
నివేదితవతః - నివేదించబడిన
తస్య వధే సమాజ్ఞప్తే -
హనుమంతుని వధించమని ఇవ్వబడిన ఆజ్ఞను
విభీషణః దౌత్యం నాను మేనే -
విభీషణుడు ఆ ఆజ్ఞను అంగీకరించలేదు

||శ్లోకతాత్పర్యము||

దురాత్ముడైన రావణునిచే హనుమంతుని వధించమని నివేదించబడిన ఆజ్ఞ, విభీషణునికి దూతను చంపుట అధర్మము అని తోచెను. ||52.02||

ఈ సర్గ లో మొదటి పాదము"తస్య తద్వచనం శ్రుత్వా వానరస్య మహాత్మనః" అని . అంటే మహాత్ముడైన హనుమంతుని హిత వాక్యములను విని రావణుడు క్రోధమూర్ఛితుడై హనుమంతుని వధించుటకు ఆజ్ఞాపించెను అని.

విభీషణునికి దూతను చంపుట అధర్మము అని తోచెను. కార్యములను సరిగా చేయు విభీషణుడు, రాజు వధించమని ఇచ్చిన ఆజ్ఞ విని, ఏమి చేయవలెను అని ఆలోచించెను.
అప్పుడు తన ఆలోచనలలో నిశ్చయమునకు వచ్చి , శత్రువులను జయించు, వాక్య విశారదుడు అగు విభీషణుడు , తన అగ్రజుడగు రావణునితో, ఎంతో హితమైన వచనములతో ఇట్లు పలికెను.

||శ్లోకము 52.03||

తం రక్షోధిపతిం క్రుద్ధం తచ్చ కార్యముపస్థితమ్ |
విదిత్వా చింతయామాస కార్యం కార్యవిధౌ స్థితః ||52.03||

స|| కార్యవిధౌ స్థితః తం రక్షోధిపం కృద్ధం ఉపస్థితం తత్ కార్యం చ విదిత్వా కార్యం చింతయామాస ||

|| శ్లోకార్థములు||

కార్యవిధౌ స్థితః - కార్యములను సరిగా చేయు
తం రక్షోధిపం కృద్ధం ఉపస్థితం -
దగ్గరలో ఉన్న కోపోద్రిక్తుడైన రాక్షసరాజు
తత్ కార్యం చ విదిత్వా -
చేయవలసిన కార్యము తెలిసికొని
కార్యం చింతయామాస - ఎటుల చేయవలనా అని అలోచించసాగెను

||శ్లోకతాత్పర్యము||

కార్యములను సరిగా చేయు విభీషణుడు కోపోద్రిక్తుడైన రాజు , వధించమని ఇచ్చిన ఆజ్ఞ తెలిసికొని ఏమి చేయవలెను అని ఆలోచించెను. ||52.03||

||శ్లోకము 52.04||

నిశ్చితార్థః తతః సామ్నా పూజ్య శత్రుజిదగ్రజమ్|
ఉవాచ హిత మత్యర్థం వాక్యం వాక్య విశారదః||52.04||

స|| తతః నిశ్చితార్థః శత్రుజిత్ వాక్యవిశారదః పూజ్యం అగ్రజం అత్యర్థం హితం వాక్యం సామ్నా ఉవాచ||

రామ టీకాలో- సామ్నా సామరూప ఉపాయేన

|| శ్లోకార్థములు||

తతః నిశ్చితార్థః -
అప్పుడు ఆలోచనలలో నిశ్చయమునకు వచ్చి
శత్రుజిత్ వాక్యవిశారదః -
శత్రువులను జయించు, వాక్య విశారదుడు
పూజ్యం అగ్రజం - పూజ్యుడైన అగ్రజుని
అత్యర్థం హితం వాక్యం - ఎంతో హితమైన వచనము లతో
సామ్నా ఉవాచ - ఇట్లు సామోపాయములతో పలికెను

||శ్లోకతాత్పర్యము||

అప్పుడు ఆలోచనలలో నిశ్చయమునకు వచ్చి శత్రువులను జయించు, వాక్య విశారదుడు తన అగ్రజుని ఎంతో హితమైన సామోపాయములతో కూడిన వచనములతో ఇట్లు పలికెను. ||52.04||

||శ్లోకము 52.05||

క్షమస్వ రోషం త్యజరాక్షసేంద్ర
ప్రసీదమద్వాక్య మిదం శ్రుణుష్వ |
వధం న కుర్వంతి పరావరజ్ఞాః
దూతస్య సంతో వసుధాధిపేన్ద్రాః ||52.05||

స|| రాక్షసేంద్ర క్షమస్వ | రోషం త్యజ|| ఇదం మద్వాక్యం శ్రుణుస్వ| వసుధాధిపేంద్రాః పరావరజ్ఞాః సంతః దూతస్య వధం న కుర్వంతి ||

|| శ్లోకార్థములు||

రాక్షసేంద్ర క్షమస్వ - ఓ రాక్షసేంద్ర ! క్షమించుము
రోషం త్యజ - రోషమును విడువుము
ఇదం మద్వాక్యం శ్రుణుస్వ - ఈ నా వాక్యములను వినుము.
వసుధాధిపేంద్రాః - రాజ్యములు ఏలువారు
పరావరజ్ఞాః సంతః - ఉచితానుచితములు ఎరిగినవారు
దూతస్య వధం న కుర్వంతి - దూత వధ చేయరు

||శ్లోకతాత్పర్యము||

'ఓ రాక్షసేంద్ర ! క్షమించుము. రోషమును విడువుము. ఈ నా వాక్యములను వినుము. రాజ్యములు ఏలువారు ఉచితానుచితములు ఎరిగినవారు దూత వధ చేయరు'. ||52.05||

||శ్లోకము 52.06||

రాజధర్మవిరుద్ధం చ లోకవృత్తైశ్చ విగర్హితమ్ |
తవ చాసదృశం వీర కపే రస్య ప్రమాపణమ్ ||52.06||

స|| వీర కపేః ప్రమాపణం రాజధర్మవిరుద్ధం చ లోక వృత్తైశ్చ గర్హితం | తవ చ అసదృశం ||

గోవిన్ద టీకాలో - ప్రమాపణం మారణం|

|| శ్లోకార్థములు||

వీర కపేః ప్రమాపణం -
ఓ వీరుడా ! ఆ కపిని వధించుట
రాజధర్మవిరుద్ధం చ -
రాజధర్మమునకు విరుద్ధము ఇంకా
లోక వృత్తైశ్చ గర్హితం -
లోకములో నిందించబడునది
తవ చ అసదృశం -
నీకు తగని పని

||శ్లోకతాత్పర్యము||

'ఓ వీరుడా ! ఆ కపిని వధించుట రాజధర్మమునకు విరుద్ధము. అది లోకములో నిందించబడు కార్యము. అది నీకు తగని పని'. ||52.06||

||శ్లోకము 52.07||

ధర్మజ్ఞశ్చ కృతజ్ఞశ్చ రాజధర్మ విశారదః |
పరావరజ్ఞో భూతానాం త్వ మేవ పరమార్థవిత్ ||52.07||

స||త్వమేవ ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ రాజధర్మవిశారదః భూతానాం పరావరజ్ఞః పరమార్థవిత్ ||

|| శ్లోకార్థములు||

త్వమేవ ధర్మజ్ఞః చ కృతజ్ఞః చ -
నీవే ధర్మజ్ఞుడవు. కృతజ్ఞత గురించి తెలిసిన వాడవు
రాజధర్మవిశారదః - రాజధర్మములో విశారుదుడవు
భూతానాం పరావరజ్ఞః -
ప్రాణులతో వ్యవహరించు విధానములు తెలిసినవాడవు
పరమార్థవిత్ - పరమార్థము తెలిసినవాడివి

||శ్లోకతాత్పర్యము||

'నీవు ధర్మజ్ఞుడవు. కృతజ్ఞత గురించి తెలిసిన వాడవు. రాజధర్మములో విశారుదుడవు. ప్రాణులతో వ్యవహరించు విధానములు తెలిసినవాడవు. పరమార్థము తెలిసినవాడివి'. ||52.07||

||శ్లోకము 52.08||

గృహ్యన్తే యది రోషేణ త్వాదృశోఽపి విపశ్చితః|
తతః శాస్త్రవిపశ్చిత్త్వం శ్రమ ఏవ హి కేవలమ్||52.08||

స|| త్వాదృశః విచక్షణః రోషేణ గృహ్యంతే తతః శాస్త్రవిపశ్చిత్వం కేవలం శ్రమ ఏవ హి ||

తిలక టీకాలో - శాస్త్రవిపశ్చిత్వం శాస్త్ర పాండిత్య సంపాదనం

రామ టీకాలో - యది త్వాదృశోవిచక్షణా అపి దోషేణ కర్త్రా గృహ్యన్తే తదా శాస్త్ర విపశ్చిత్వం శాస్త్ర జ్ఞానం శ్రమ ఏవ|

|| శ్లోకార్థములు||

త్వాదృశః విచక్షణః -
నీలాంటి విచక్షణ గలవారు
రోషేణ గృహ్యంతే -
కోపముతో ప్రవర్తిస్తే
తతః శాస్త్రవిపశ్చిత్వం -
శాస్త్రజ్ఞానము సంపాదించుట
కేవలం శ్రమ ఏవ హి -
కేవలము శ్రమయే అగును

||శ్లోకతాత్పర్యము||

'నీలాంటి విచక్షణ గలవారు కోపముతో ప్రవర్తిస్తే శాస్త్రజ్ఞానము సంపాదించుట కేవలము శ్రమయే అగును'. ||52.08||

||శ్లోకము 52.09||

తస్మాత్ ప్రసీద శత్రుఘ్న రాక్షసేన్ద్ర దురాసద |
యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దణ్డో విధీయతామ్ ||52.09||

స|| రాక్షసేంద్ర శత్రుఘ్న దురాసద ప్రసీద | తస్మాత్ యుక్తాయుక్తం వినిశ్చిత్య దూతః దణ్డః విధీయతామ్ ||

రామటీకాలో - తస్మాత్ మదుక్త హేతోః ప్రసీద చిత్త ప్రసాదం కురు | అత ఏవ యుక్తాయుక్తం వినిశ్చిత్య దూత దణ్డః దూతోచిత క్రియా విధీయతామ్ |

|| శ్లోకార్థములు||

రాక్షసేంద్ర - ఓ రాక్షసేంద్రా
శత్రుఘ్న దురాసద ప్రసీద -
శతృవులను వధించువాడా నిగ్రహించుము
తస్మాత్ యుక్తాయుక్తం వినిశ్చిత్య -
అందువలన యుక్తాయుక్తములను అలోచించి
దూతః దణ్డః విధీయతామ్ -
దూతకు దండనము విధించవలెను

||శ్లోకతాత్పర్యము||

'ఓ రాక్షసేంద్రా ! శతృవులను వధించువాడా ! నిగ్రహించుము. అందువలన యుక్తాయుక్తములను అలోచించి అప్పుడు దూతకు దండనము విధించవలెను'. ||52.09||

||శ్లోకము 52.10||

విభీషణవచః శ్రుత్వా రావణో రాక్షసేశ్వరః |
రోషేణ మహతాఽఽవిష్టో వాక్య ముత్తరమబ్రవీత్ ||52.10||

స|| రాక్షసేశ్వరః రావణః విభీషణవచః శ్రుత్వా మహతా రోషేణ ఆవిష్టః ఉత్తరం వాక్యం అబ్రవీత్ ||

|| శ్లోకార్థములు||

రాక్షసేశ్వరః రావణః -
ఆ రాక్షసేశ్వరుడు రావణుడు
విభీషణవచః శ్రుత్వా -
విభీషణుని వచనములను విని
మహతా రోషేణ ఆవిష్టః -
మహత్తరమైన రోషముతో కూడినవాడై
ఉత్తరం వాక్యం అబ్రవీత్ -
ఈ విధముగా ఉత్తరమిచ్చెను

||శ్లోకతాత్పర్యము||

ఆ రాక్షసేశ్వరుడు రావణుడు విభీషణుని వచనములను విని మహత్తరమైన రోషముతో ఈ విధముగా ఉత్తరమిచ్చెను. ||52.10||

||శ్లోకము 52.11||

న పాపానాం వధే పాపం విద్యతే శత్రుసూదన |
తస్మాదేవం వధిష్యామి వానరం పాపచారిణమ్ ||52.11||

స|| శత్రుసూదన పాపానాం వధే పాపం న విద్యతే| వానరం పాపచారిణం తస్మాత్ ఏవం వధిష్యామి||

|| శ్లోకార్థములు||

శత్రుసూదన - ఓ శత్రుసూదనా
పాపానాం వధే పాపం న విద్యతే -
పాపులను వధించుట పాపము అనబడబోదు.
వానరం పాపచారిణం -
పాపములు చేసిన వానరుని
తస్మాత్ ఏవం వధిష్యామి-
అందువలననే వధించవలెను

||శ్లోకతాత్పర్యము||

'ఓ శత్రుసూదనా ! పాపులను వధించుట పాపము అనబడబోదు. ఈ పాపములు చేసిన వానరుని అందువలననే వధించవలెను'. ||52.11||

||శ్లోకము 52.12||

అధర్మమూలం బహుదోషయుక్తం
అనార్యజుష్టం వచనమ్ నిశమ్య |
ఉవాచ వాక్యం పరమార్థతత్త్వమ్
విభీషణో బుద్ధిమతాం వరిష్ఠ ||52.12||

స|| విభీషణః బుద్ధిమతాం వరిష్ఠః బహుదోషయుక్తం అధర్మమూలం అనార్య జుష్టం వచనం నిశమ్య పరమార్థతత్వం వచనం ఉవాచ||

|| శ్లోకార్థములు||

విభీషణః బుద్ధిమతాం వరిష్ఠః-
బుద్ధిమంతులలో వరిష్ఠుడైన విభీషణుడు
బహుదోషయుక్తం అధర్మమూలం -
బహు దోషములతో కూడినది, అధర్మమునకు మూలమైనది
అనార్య జుష్టం వచనం నిశమ్య -
ఆర్యులచేత ఆదరింపబడని ఆ వచనములను విని
పరమార్థతత్వం వచనం ఉవాచ -
పరమార్థయుక్తమైన వచనములను పలికెను

||శ్లోకతాత్పర్యము||

బుద్ధిమంతులలో వరిష్ఠుడైన విభీషణుడు బహు దోషములతో కూడినది, అధర్మమునకు మూలమైనది, ఆర్యులచేత ఆదరింపబడని ఆ వచనములను విని పరమార్థయుక్తమైన వచనములను పలికెను. ||52.12||

||శ్లోకము 52.13||

ప్రసీద లంకేశ్వర రాక్షసేన్ద్ర
ధర్మార్థ యుక్తం వచనం శ్రుణుష్వ |
దూతాన్ అవధ్యాన్ సమయేషు రాజన్
సర్వేషు సర్వత్ర వదన్తి సన్తః ||52.13||

స|| రాక్షసేంద్ర లంకేశ్వర ప్రసీద| ధర్మార్థ యుక్తం వచనం శ్రుణుస్వ| రాజన్ సన్తః సర్వత్ర సర్వేషు వదంతి| సర్వేషు సమయేషు దూతాన్ అవధ్యాన్ ||

గోవిన్దరాజ టీకాలో - సర్వత్ర సర్వేషు సర్వ దేశేషు సర్వజాతిషు ఇత్యర్థః

|| శ్లోకార్థములు||

రాక్షసేంద్ర లంకేశ్వర ప్రసీద -
ఓ రాక్షసేంద్రా లంకేశ్వర దయచేసి ప్రసన్నుడవు అగుము
ధర్మార్థ యుక్తం వచనం శ్రుణుస్వ -
ధర్మముతో కూడిన వచనములను వినుము
రాజన్ సన్తః సర్వత్ర సర్వేషు వదంతి-
. ఓ రాజన్ సంతులు సర్వత్ర ఈ విధముగా చెపుతారు.
సర్వేషు సమయేషు దూతాన్ అవధ్యాన్ - అన్ని సమయములలోనూ దూతలు వధింపతగని వారు

||శ్లోకతాత్పర్యము||

'ఓ రాక్షసేంద్రా లంకేశ్వర దయచేసి ప్రసన్నుడవు అగుము. ధర్మముతో కూడిన వచనములను వినుము. ఓ రాజన్ సంతులు సర్వత్ర ఈ విధముగా చెపుతారు. అన్ని సమయములలోనూ దూతలు వధింపతగని వారు'. ||52.13||

||శ్లోకము 52.14||

అసంశయం శత్రురయం ప్రవృద్ధః
కృతం హ్యనే నాప్రియ మప్రమేయమ్ |
న దూతవధ్యాం ప్రవదన్తి సంతో
దూతస్య దృష్టా బహవో హి దణ్డాః ||52.14||

స|| అయం శత్రుః ప్రవృద్ధః అశంసయమ్ | అనేన అప్రమేయం అప్రియం కృతం హి | సన్తః దూతవధ్యామ్ న ప్రవదన్తి | దూతస్య బహవః దణ్డాః దృష్టాః హి ||

రామ టీకాలో- హి యతః అప్రమేయం బహు అప్రియం అనేన కృతం అతోఽయం ప్రవృద్ధః మహాన్ శత్రుః తథాపి సన్తః దూతవధ్యాం దూతానాం వధం న ప్రవదన్తి| బహవః దణ్డాః దృష్టా శాస్త్రే అపి అవలోకితాః ||

|| శ్లోకార్థములు||

అయం శత్రుః ప్రవృద్ధః అశంసయమ్ -
అశంసయముగా ఇతడు హద్దుమీరిన శత్రువు
అనేన అప్రమేయం అప్రియం కృతం హి -
ఇతనిచేత అసమానమైన అప్రియము చేయబడెను
సన్తః దూతవధ్యామ్ న ప్రవదన్తి -
సంతులు దూతను వధించమని చెప్పరు
దూతస్య బహవః దణ్డాః దృష్టాః హి -
దూతలకు విధింపతగు దండములు చాలా వున్నాయి

||శ్లోకతాత్పర్యము||

'అశంసయముగా ఇతడు హద్దుమీరిన శత్రువు. ఇతనిచేత అసమానమైన అప్రియము చేయబడెను. అయినా సంతులు దూతను వధించమని చెప్పరు. దూతలకు విధింపతగు దండములు చాలా వున్నాయ'. ||52.14||

||శ్లోకము 52.15||

వైరూప్యమంగేషు కశాభిఘాతో
మౌణ్డ్యం తథా లక్షణ సన్నిపాతః |
ఏతాన్ హి దూతే ప్రవదన్తి దణ్డాన్
వధస్తు దూతస్య న నః శ్రుతోఽపి ||52.15||

స|| అంగేషు వైరుధ్యం కశాభిఘాతః మౌణ్డ్యం తథా లక్షణ సన్నిపాతః ఏతత్ దూతే దణ్డాన్ ప్రవదంతి| దూతస్య వధస్తు శ్రుతః నాస్తి||

|| శ్లోకార్థములు||

అంగేషు వైరుధ్యం - అంగవైరూప్యము
కశాభిఘాతః - కొరడాతో కొట్టడము
మౌణ్డ్యం తథా లక్షణ సన్నిపాతః -
ముండనము చేయడము, శరీరము మీద ముద్రలు వేయడము
ఏతత్ దూతే దణ్డాన్ ప్రవదంతి -
ఇవన్నీ దూతలకి ఇవ్వ తగిన దండములు అని సంతులు చెపుతారు
దూతస్య వధస్తు శ్రుతః నాస్తి -
దూతల వధమాత్రము చెప్పబడలేదు

||శ్లోకతాత్పర్యము||

'అంగవైరూప్యము , కొరడాతో కొట్టడము, ముండనము చేయడము, శరీరము మీద ముద్రలు వేయడము, ఇవన్నీ దూతలకి ఇవ్వ తగిన దండములు అని సంతులు చెపుతారు. దూతల వధమాత్రము చెప్పబడలేదు'. ||52.15||

||శ్లోకము 52.16||

కథం చ ధర్మార్థవీనీతబుద్ధిః
పరావరప్రత్యయనిశ్చితార్థః |
భవద్విధః కోపవశే హి తిష్ఠత్
కోపన్ నియచ్ఛన్తి హి సత్త్వవన్తః ||52.16||

స|| ధర్మార్థ వినీత బుద్ధిః పరావరప్రత్యయ నిశ్చితార్థః | భవద్విధః కోపవసే కథం తిష్ఠేత్ | సత్త్వవంతః కోపం నియచ్ఛన్తి హి ||

|| శ్లోకార్థములు||

ధర్మార్థ వినీత బుద్ధిః - ధర్మార్థములు ఎరిగినవారు
పరావరప్రత్యయ నిశ్చితార్థః -
యుక్తాయుక్తములను చూచి నిశ్చయమునకు వచ్చుదురు
భవద్విధః కోపవసే కథం తిష్ఠేత్ -
నీలాంటి వారికి కోపము వస్తే ఎలాగ
సత్త్వవంతః కోపం నియచ్ఛన్తి హి -
సత్త్వము గలవారు కోపమును అదుపులో ఉంచెదరు.

||శ్లోకతాత్పర్యము||

'ధర్మార్థములు ఎరిగినవారు యుక్తాయుక్తములను చూచి నిశ్చయమునకు వచ్చుదురు. నీలాంటి వారికి కోపము వస్తే ఎలాగ ? సత్త్వము గలవారు కోపమును అదుపులో ఉంచెదరు.' ||52.16||

||శ్లోకము 52.17||

న ధర్మవేదే న చ లోకవృత్తే
న శాస్త్రబుద్ధి గ్రహణేషు చాపి |
విద్యేత కశ్చిత్తవ వీర తుల్యః
త్వం హ్యుత్తమః సర్వ సురాసురాణామ్ ||52.17||

స|| వీర ధర్మవాదే తవ తుల్యః కశ్చిత్ న | లోకవృత్తే (తవ తుల్యః) న| శాస్త్రబుద్ధి గ్రహణేషుచాపి న | త్వం సర్వ సుర అసురాణాం ఉత్తమః హి||

|| శ్లోకార్థములు||

వీర ధర్మవాదే తవ తుల్యః కశ్చిత్ న -
ఓ వీర ధర్మవాదములో నీతో సమానులు లేరు
లోకవృత్తే (తవ తుల్యః) న -
లోకజ్ఞానములోనూ ( నీతో సమానులు లేరు)
శాస్త్రబుద్ధి గ్రహణేషుచాపి న -
శాస్త్రములను అర్థము చేసుకొనుటలోనూ కూడా
త్వం సర్వ సుర అసురాణాం ఉత్తమః హి-
నీవు సురాసురులలో ఉత్తముడవు

||శ్లోకతాత్పర్యము||

'ఓ వీర ధర్మవాదములోనూ, లోకజ్ఞానములోనూ, శాస్త్రములను అర్థము చేసుకొనుటలోనూ నీతో సమానులు లేరు. నీవు సురాసురులలో ఉత్తముడవు' . ||52.17||

||శ్లోకము 52.18||

శూరేణ వీరేణ నిశాచరేంద్ర
సురాసురాణామపి దుర్జయేన |
త్వయా ప్రగల్భాః సౌరదైత్యసంఘాః
జితాస్చ యుద్ధేష్వకృత్ నరేంద్రాః ||52.18||

స|| నిశాచరేంద్ర శూరేణ వీరేణ సురాసురాణాం అపి త్వయా దుర్జయేన| ప్రగల్భాః సురదైత్య సంఘాః నరేంద్రాః యుద్ధేషు అసకృత్ జితాః చ ||

|| శ్లోకార్థములు||

నిశాచరేంద్ర శూరేణ వీరేణ -
నిశాచరేంద్రా శూరులు చేత వీరులచేత
సురాసురాణాం అపి త్వయా దుర్జయేన -
సురులు అసురులకు కూడా దుర్జయుడవు
ప్రగల్భాః సురదైత్య సంఘాః నరేంద్రాః -
ప్రగల్భములు పలుకు సురదైత్య సంఘములు నరేంద్రుడూ
యుద్ధేషు అసకృత్ జితాః చ- యుద్ధములో అశక్యులై జయించబడినవారు

||శ్లోకతాత్పర్యము||

'నిశాచరేంద్రా నీవు శూరులు చేత వీరులచేత గాని సురులు అసురులకు కూడా దుర్జయుడవు. ప్రగల్భములు పలుకు సురదైత్య సంఘములు నరేంద్రుడూ యుద్ధములో అశక్యులై జయించబడినవారు'.||52.18||

||శ్లోకము 52.19||

న చాప్యస్య కపేర్ఘాతే కంచిత్పశ్యామ్యహం గుణమ్ |
తే ష్వయం పాత్యతాం దణ్డోయైరయం ప్రేషితః కపిః ||52.19||

స|| అస్య కపేః ఘాతే అహం కించిత్ గుణం న పశ్యామి | అయం దణ్డః యైః అయం కపిః ప్రేషితః తేషు పాత్యతాం||

గోవిన్దరాజ టీకాలో - న కేవలం దూతస్య వధే శాస్త్ర విరోధః, గుణమపి నకించిత్ పశ్యామి| అతః ఏతత్ ప్రేషకేప్యపి దణ్డః పాత్యతామ్ ఇతి ఆహ|

రామటీకాలో - అస్య కపేర్ఘాతే కించిత్ గుణం న పశ్యామి| అతః పరైః అయం కపిః ప్రేషితః తేషు అయం ప్రాణాంతః దణ్డః పాత్యతామ్||

|| శ్లోకార్థములు||

అస్య కపేః ఘాతే - ఈ కపిని వధించుటలో
అహం కించిత్ గుణం న పశ్యామి -
ఒక మంచి గుణము కనపడుట లేదు
అయం దణ్డః యైః అయం కపిః ప్రేషితః -
ఈ కపిని ఇక్కడికి పంపించిన వారు దండనీయులు
తేషు పాత్యతాం - వారిని శిక్షించు

||శ్లోకతాత్పర్యము||

'ఈ కపిని వధించుటలో ఒక మంచి గుణము కనపడుట లేదు. ఈ కపిని ఇక్కడికి పంపించిన వారు దండనీయులు'. ||52.19||.

||శ్లోకము 52.20||

సాధుర్వాయది వాసాధుః పరైరేష సమర్పితః|
బ్రువన్పరార్థం పరవాన్ న దూతో వధ మర్హతి||52.20||'

స||సాధుః వా అసాధుః యది ఏష పరైః సమర్పితః| పరార్థం బ్రువన్ పరవాన్ దూతః వధం న అర్హతి||

|| శ్లోకార్థములు||

సాధుః వా అసాధుః యది -
ఇతడు సాధువా కాడా అయినా
ఏష పరైః సమర్పితః -
ఇతడు పరులచే పంపబడినవాడు
పరార్థం బ్రువన్ -
ఇతరులమాట చెప్పుటకు
పరవాన్ దూతః వధం న అర్హతి -
ఇతరుల దూత వధింప తగడు

||శ్లోకతాత్పర్యము||

'ఇతడు సాధువా కాడా అన్నది చర్చనీయము కాదు. ఇతరులచేత చెప్పుటకు పంపబడిన దూత వధింప తగడు'. ||52.20||

||శ్లోకము 52.21||

అపిచాస్మిన్హతే రాజన్ నాన్యం పశ్యామి ఖేచరమ్ |
ఇహ యః పునరాగచ్ఛేత్ పరం పారం మహోదధేః ||52.21||

స|| రాజన్ అపి చ అస్మిన్ హతే యః మహోదధేః పరం పారం పునః ఇహ ఆగచ్ఛేత్ అన్యం ఖేచరం న పశ్యామి ||

గోవిన్దరాజ టీకాలో- అస్మిన్ హతే సతి వృత్తాంతం నివేదక అభావత్ రామలక్ష్మణయోః ఇహ ఆగమన అభావేన తవ శతృ క్షయో నస్యాత్ | విముక్తే అస్మిన్ ఏతస్మిన్ నివేదిత వృత్తాంతయోః తయోః ఇహ ఆగమనాత్ యత్నేన తవ శతృ నాశో భవే ఇతి అభిప్రేత్యాహ |

|| శ్లోకార్థములు||

రాజన్ అపి చ - ఓ రాజన్ ఇంకా
అస్మిన్ హతే - ఇతనిని చంపినచో
యః మహోదధేః పరం పారం పునః -
ఈ మహాసాగరము మళ్ళీ దాటి
ఇహ ఆగచ్ఛేత్ అన్యం ఖేచరం -
ఇక్కడికి రాగలవాడు ఇంకొకడు
న పశ్యామి - నాకు కనపడుటలేదు

||శ్లోకతాత్పర్యము||

'ఓ రాజన్ ! ఇతనిని చంపినచో ఈ మహాసాగరము దాటి ఇక్కడికి రాగలవాడు ఇంకొకడు నాకు కనపడుటలేదు'. ||52.21||

||శ్లోకము 52.22||

తస్మాన్నాస్య వధే యత్నః కార్యః పరపురంజయః |
భవాన్ సేంద్రేషు దేవేషు యత్న మాస్థాతు మర్హతి ||52.22||

స|| పరపురంజయ తస్మాత్ అస్య వధే యత్నః న కార్యః | భవాన్ సేన్ద్రేషు దేవేషు యత్నం అస్థాతుం అర్హతి ||

|| శ్లోకార్థములు||

పరపురంజయ తస్మాత్ -
ఓ పరపురంజయ అందువలన
అస్య వధే యత్నః న కార్యః -
ఇతనిని వధించు ప్రయత్నము చేయరాదు
భవాన్ సేన్ద్రేషు దేవేషు -
నీవు ఇంద్రునితో సహా దేవతలతో
యత్నం అస్థాతుం అర్హతి -
యుద్ధము చేయుటకు తగినవాడివి

||శ్లోకతాత్పర్యము||

'ఓ పరపురంజయ ! అందువలను ఇతనిని వధించు ప్రయత్నము చేయరాదు. నీవు ఇంద్రునితో సహా దేవతలతో యుద్ధము చేయుటకు తగినవాడివి'. ||52.22||

||శ్లోకము 52.23||

అస్మిన్విశిష్టే న హి దూత మన్యం
పశ్యామి యస్తౌ రాజపుత్త్రౌ |
యుద్ధాయ యుద్ధప్రియాయ దుర్వినీతా
వుద్యోజయే దీర్ఘపథావరుద్ధౌ||52.23||"

స|| యుద్ధప్రియ అస్మిన్ వినష్టే దుర్వినీతౌ దీర్ఘపరావరుద్ధౌ తౌ నరరాజపుత్రౌ యః యుద్ధాయ ఉజ్యోజయేత్ అన్యం దూతం న పశ్యామి హి ||

గోవిన్దరాజ టీకాలో - అస్మిన్ వినష్టే ఇతి ఏతత శ్లోకానన్తరం పరాక్రమోత్సాహ మనస్వినాం చేతి శ్లోకః| తతో హితాశ్చేతి శ్లోకః | అథ తదేక దేసేనేతి శ్లోకః | అథ నిశాచరాణం ఇతి సర్గాన్త శ్లోకః | అయమేవ పాఠక్రమః సమీచీనః | అన్యే అత్ర శ్లోకాః కల్పితే దృశ్యన్తే ||

|| శ్లోకార్థములు||

యుద్ధప్రియ అస్మిన్ వినష్టే -
ఓ యుద్ధప్రియుడా ! ఇతనిని వధించినచో
దుర్వినీతౌ దీర్ఘపరావరుద్ధౌ -
దుర్వినీతులు సుదూరములో ఉన్న
తౌ నరరాజపుత్రౌ - ఆ రాజపుత్రులనిద్దరినీ
యః యుద్ధాయ ఉజ్యోజయేత్ -
ఎవరు యుద్ధమునకు ప్రోత్సహించగలరో
అన్యం దూతం న పశ్యామి హి -
అట్టి ఇతర దూతలు నాకు కనపడుటలేదు

||శ్లోకతాత్పర్యము||'

'ఓ యుద్ధప్రియుడా ! ఇతనిని వధించినచో దుర్వినీతులు సుదూరములో ఉన్న ఆ రాజపుత్రులనిద్దరినీ యుద్ధమునకు ఉద్యమించగల ఇతర దూతలు నాకు కనపడుటలేదు'. ||52.23||

గోవిన్దరాజులవారు తమ టీకాలో ఇక్కడ పాఠక్రమము విశదీకరిస్తూ , శ్లోకాలు పరాక్రమోత్సాహ మనస్వినాంచ, హితాశ్చ శూరాశ్చ అన్నశ్లోకము, తదేకదేశేన అన్న శ్లోకము , నిశాచరాణాం అన్న శ్లోకము వున్నాయి అని, మిగిలిన శ్లోకాలు కల్పితము అని రాస్తారు.

||శ్లోకము 52.24||

పరాక్రమోత్సాహ మనస్వినాం చ
సురాసురాణామపి దుర్జయేవ |
త్వయా మనో నన్దన నైతానామ్
యుద్ధాయతిర్నాశయితుం న యుక్తా ||52.24||

స|| నైతానాం మనోనన్దన పరాక్రమోత్సాహమనస్వినాం చ సురాసురాణాం అపి దుర్జయేన త్వయా యుద్ధాయతిః నాశయితుం న యుక్తా ||

|| శ్లోకార్థములు||

నైతానాం మనోనన్దన -
రాక్షసుల మనస్సు రంజింపచేయువాడా
పరాక్రమోత్సాహమనస్వినాం చ -
పరాక్రమము ఉత్సాహము కలవారికి కూడా
సురాసురాణాం అపి దుర్జయేన త్వయా -
సురాసురుల చేత కూడా జయింపబడలేని నీచేత
యుద్ధాయతిః నాశయితుం న యుక్తా -
యుద్ధమునకు అవకాశమును నాశనము చేయుట యుక్తము కాదు

||శ్లోకతాత్పర్యము||

'రాక్షసుల మనస్సు రంజింపచేయువాడా సురాసురులని జయింపగల నీవు యుద్ధమునకు అవకాశమును నాశనము చేయుట యుక్తము కాదు'. ||52.24||

||శ్లోకము 52.25||

హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ
కులేషు జాతాశ్చ మహాగుణేషు |
మనస్వినః శస్త్రభృతాం వరిష్టాః
కోట్యగ్రతస్తే సుభృతాశ్చ యోధాః ||52.25||"

స|| హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ మహాగుణేషు కులేషు జాతాః మనస్వినః శస్త్రభృతాం వశిష్టాః సుభృతాశ్చ యోధాః కోట్యగ్రతః ||

|| శ్లోకార్థములు||

హితాశ్చ శూరాశ్చ సమాహితాశ్చ -
ఆరితేరిన హితులు శూరులు
మహాగుణేషు కులేషు జాతాః -
మహాగుణములు కల కులములలో పుట్టినవారు
మనస్వినః శస్త్రభృతాం వశిష్టాః -
బుద్ధిమంతులు శస్త్రధారులలో శ్రేష్ఠులు యోధులూ
సుభృతాశ్చ యోధాః కోట్యగ్రతః -
యోధులైన మఛి భృత్యులు కోట్లకు మించి ఉన్నారు.

||శ్లోకతాత్పర్యము||

'హితులు శూరులు మహాగుణములు కల కులములలో పుట్టినవారు , శస్త్రధారులలో శ్రేష్ఠులు యోధులూ కోట్లకొలది ఉన్నారు'. ||52.25||

||శ్లోకము 52.26||

త దేక దేశేన బలస్య తావత్
కేచిత్తవాsదేశకృతోsభియాస్తు |
తౌ రాజపుత్త్రౌ వినిగృహ్య మూఢౌ
పరేషు తే భావయితుం ప్రభావమ్ ||52.26||

స|| తత్ తవ ఆదేశకృతః కేచిత్ బలస్య ఏకదేశేన మూఢౌ తౌ రాజపుత్రౌ వినిగృహ్య తే ప్రభావం భావయితుం అభియాంతు ||

|| శ్లోకార్థములు||'

తత్ తవ ఆదేశకృతః -
వారు నీ అదేశముతో
కేచిత్ బలస్య ఏకదేశేన -
ఒక బలగము తీసుకొని
మూఢౌ తౌ రాజపుత్రౌ వినిగృహ్య -
మూఢులైన రాజపుత్రులను జయించి
తే ప్రభావం భావయితుం అభియాంతు -
నీ ప్రభావము చూపించుటకు వేచియున్నారు

||శ్లోకతాత్పర్యము||

'వారు నీ అదేశముతో ఒక బలగము తీసుకుపోయి ఆ మూఢులైన రాజపుత్రులను జయించి నీ ప్రభావము చూపించుటకు వేచియున్నారు'. ||52.26||

||శ్లోకము 52.27||

నిశాచరణామధిపోనుజస్య
విభీషణస్యోత్తమ వాక్యమిష్టమ్ |
జగ్రాహ బుద్ద్యా సురలోకశత్రు
ర్మహాబలో రాక్షసరాజముఖ్యః ||52.27||

స|| నిశాచరాణాం సురలోకశత్రుః మహాబలః రాక్షసరాజముఖ్యః అనుజస్య విభీషణస్య ఇష్టం ఉత్తమవాక్యం బుద్ధ్యా జగ్రాహ ||

|| శ్లోకార్థములు||

నిశాచరాణాం సురలోకశత్రుః -
నిశాచరులలో సురలోకమునకు శత్రువు
మహాబలః రాక్షసరాజముఖ్యః -
మహాబలుడు రాక్షసరాజులలో ముఖ్యుడు
అనుజస్య విభీషణస్య - తన తమ్ముడగు విభీషణుని
ఇష్టం ఉత్తమవాక్యం - ఉత్తమమైన తగిన వచనములను
బుద్ధ్యా జగ్రాహ- పాటించవలెనని తలచెను

||శ్లోకతాత్పర్యము||

నిశాచరులలో సురలోకమునకు శత్రువు మహాబలుడు రాక్షసరాజులలో ముఖ్యుడు అగు రావణుడు, తన తమ్ముడగు విభీషణుని ఉత్తమమైన తగిన వచనములను పాటించవలెనని తలచెను. ||52.27||

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో యాభైరెండవ సర్గ సమాప్తము.


ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే ద్విపంచాశస్సర్గః ||

||ఓమ్ తత్ సత్||