||సుందరకాండ ||

||ఏభైమూడవ సర్గ తెలుగులో||


||ఓమ్ తత్ సత్||
శ్లో|| తస్య తద్వచనం శ్రుత్వా దశగ్రీవో మహాబలః|
దేశకాలహితం వాక్యం భ్రాతురుత్తరమబ్రవీత్||1||
స|| దశగ్రీవః మహాబలః తస్య తద్వచనం దేశకాలహితం వాక్యం శ్రుత్వా భ్రాతురుః ఉత్తరం అబ్రవీత్||
తా|| మహాబలుడైన దశగ్రీవుడు దేశకాలానుగుణమైన తమ్ముని హితవాక్యములను విని అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ త్రిపంచాశస్సర్గః||

మహాబలుడైన దశగ్రీవుడు దేశకాలానుగుణమైన తమ్ముడు విభీషణుని హితవాక్యములను విని అతనికి ప్రత్యుత్తరమిచ్చెను.

' దూత వధ గర్హితము అని నీ చేత సముచితముగా చెప్పబడినది. ఇతనిని వధించుటకన్న, ఇతర దండన తప్పక విధించాలి. వానరులకు వారి లాంగూలమే భూషణము. ఇష్టము. అందువలన అతని లాంగూలము కాల్చబడుగాక. ఆ తోక దగ్ధముకాగానే అతడు శీఘ్రముగా వెళ్ళుగాక. అప్పుడు ఆ అంగవైకల్యముతో దీన స్థితిలో నున్న అతనిని బంధుమిత్రులు ఆప్తులు చూచెదరు. అంటించగా మండుతున్న లాంగూలముతో ఇతనిని నగరమంతా నాలుగు వీధులలోనూ రాక్షసులచే ఊరేగింప బడుగాక' అని రాక్షసరాజు ఆజ్ఞాపించెను.

ఆ రాజుయొక్క ఆ వచనములను వినిన కోపోద్రిక్తులై ఉన్న రాక్షసులు హనుమంతుని లాంగూలమునకు పాతబడిన నూలు బట్టలు కట్టసాగిరి.
లాంగులము అలా కట్టబడుతున్నప్పుడు హనుమంతుడు వనములో మోడువారి ఎండినచెట్లు అగ్ని దహించునఫుడు పెరిగిన రీతిగా తన దేహమును పెద్దదిగా చేసెను. ఆ రాక్షసులు హనుమంతుని తోకను తైలము తో తడిపి, నిప్పు అట్టించిరి. బాల సూర్యునితో సమానముగా భాసిస్తున్నహనుమంతుడు ఆ మండుతున్న లాంగూలముతో రాక్షసులను కొట్టెను. ప్రజ్వరిల్లుతున్న హనుమంతుని తోక చూచుటకు ఆనందముతో రాక్షసులు బాలురు స్త్రీలు వృద్ధులు అచటికి వచ్చిరి.

కౄరులైన రాక్షసులందరి చేత మరల బంధింపబడిన హనుమంతుడు తదనుసారముగా ఇట్లు ఆలోచించెను.

'ఈ రాక్షసులచేత బంధింపబడినప్పటికీ నాకు శక్తిలో వీరు సమానులు కారు. నేను మరల నా పాశములను ఛేదించి వీరందరిని హతమార్చగలను. అలా చేసినచో నా రాజుయొక్క హితము కోరి తిరుగుచున్న నేను నా విధిని నిర్వర్తించడములో విఫలము కావచ్చు . నన్ను ఈ రాక్షసులు వారి రాజు అదేశముతో బంధించితిరి. యుద్ధములో ఈ రాక్షసులందరినీ హతమార్చుటకు నేను ఒక్కడినే చాలు. రాముని ప్రీతికై నేను ఈ విధముగా మరల లంకను మళ్ళీ చూడడము అగును. రాత్రి అన్వేషణార్థము తిరుగుచూ లంకా దుర్గ రక్షణా విధములను బాగుగా పరిశీలించలేదు. అది తప్పక చూడవలెను. మళ్ళీ బంధించబడిన నా లాంగూలము మండిస్తూ రాక్షసులు తప్పక బాధించెదరు. కాని అది నా మనస్సుకు శ్రమ కాదు'.

అప్పుడు ఆ రాక్షసులు, వశుడైనట్లు ప్రవర్తిస్తున్న ఆ మహబలవంతుడగు హనుమంతుని తీసుకొని లంకా నగర వీధులకు వెళ్ళిరి. క్రూరులైన రాక్షసులు ఆ హనుమంతుని తిప్పుతూ, శంఖముల భేరీల నినాదముతో తమ గొప్పతనము చాటుకుంటూ, ఆ నగరములో తిరుగుచుండిరి.

శత్రుమర్దనుడగు హనుమంతుడు రాక్షసులచే ఆ విధముగా తిప్పబడుచూ ఆ మహా నగరమంతా చూచుచూ సుఖమును పొందెను. అప్పుడు అ మహాకపి విచిత్రమైన భవనములను, గోప్యమైన భూమి భాగములను, చక్కగా తీర్చిదిద్దినట్లున్న రాజమార్గములను చూచెను. పవనాత్మజుడు గృహములతో కిక్కిరిసిఉన్న వీధులను, అలాగే విశాలమైన రాజమార్గములను, చిన్న ఇళ్ళను, మేఘములను అందుకునుచుట్లు ఉన్న ఎత్తై న గృహములను చూచెను.

ఆ రాక్షసులందరూ నాలుగు వీధులు కలిసే చోటులోను, నాలుగుస్థంభములు కల మంటపాల వద్ద ఆ వానరుని, "లంకలో ప్రవేశించిన చారుడు" అని, ప్రకటిస్తూ పోయిరి. మండుతున్న తోకతో ఉన్న ఆ హనుమంతుని చూచుటకు కుతూహలము కొద్దీ స్త్రీలు, బాలులూ, వృద్ధులూ అచటికి చేరిరి. అప్పుడు కొందరు రాక్షస స్త్రీలు 'హనుమంతుని తోకకు నిప్పంటింపబడినది' అను అప్రియమైన మాటలను ఆ సీతా దేవికి వినిపించిరి. "ఓ సీతా నీతో మాట్లాడిన ఎర్రని ముఖముకల వానరుడు లాంగూలము నకు నిప్పు అంటించబడినవాడై లంకానగరమంతా తిప్పబడుచున్నవాడు" అని.

ఆ మాటలను వినిన వైదేహి, అది తనను అపహరింపబడిన విషయముతో సమానముగా క్రూరమైన మాట అని తలచి, విని శోకములో మునిగిపోయి, అగ్నిహోత్రము వద్దకు వచ్చెను. ఆప్పుడు ఆమె ఆ మహాకపి యొక్క మంగళముకోరుచూ ఆ అగ్నిని, విశాలాక్షి ప్రార్థించెను.

' నేను పతిసేవాపరాయణురాలను అయితే, తపస్సు చేసినదానను అయితే, పతివ్రతను అయితే, ఓ అగ్నిదేవా నీవు హనుమంతుని పై చల్లగా ఉండుము. ధీమంతుడైన రామునికి నాపై కించిత్తు దయ ఉన్నా, నాకు ఏమైన భాగ్యము ఉన్నా, ఓ అగ్నిదేవా హనుమంతుని చల్లగా చూడుము. ధర్మాత్ముడైన రాముడు నన్ను పతివ్రతగానూ, తన సమాగమునకై వేచి ఉన్నదానిని గా భావిస్తే, ఓ అగ్నిదేవా హనుమంతుని పై చల్లగా చూడుము. ఆర్యుడు సత్యసంధుడూ అయిన సుగ్రీవుడు నన్ను ఈ దుఃఖసాగరమునుంచి నన్ను రక్షించువాడైతే, ఓ అగ్నిదేవా హనుమంతునిపై చల్లగా చూడుము'. ఈ విధముగా ప్రార్థింపబడిన ఆ హుతాశనములో ఉన్న అనలుడు, సీతమ్మకు కపి యొక్క క్షేమము తెలియచేస్తున్నాడా అన్నట్లు అప్పుడు ఒక్కసారి ప్రజ్వలించెను. తోకపై అగ్నికి తోడుగా వీచు, హనుమంతుని జనకుడు అగు వాయువు, దేవిచేత హనుమంతుని స్వాస్థతకై చేసిన ప్రార్థన విన్నట్లుగా చల్లగా వీచెను.

ఆ లాంగూలము మండుచుండగా వానరుడు చింతించ సాగెను. 'ప్రదీపిస్తున్న ఈ అగ్ని నన్నుఅంతా ఎందుకు దహించుటలేదు? మహాజ్వాలలతో కనిపిస్తున్న ఈ అగ్ని నన్ను కోంచెము కూడా బాధించుటలేదు. ఇంకా మండుతున్న లాంగూలము చివర, మంచుముక్క పట్టినట్లు ఉన్నది. లేక నేను ఎగురుతూ వున్నప్పుడు రాముని ప్రభావముతో సాగరములోనున్న పర్వతము నన్నుఆదరించినట్లు అగ్నికూడా ఆ విధముగా చెయుచున్న వాడేమో. సీతదేవి యొక్క అనుగ్రహము వలన, రాముని తేజస్సు వలన, నా తండ్రి వాయుదేవుని స్నేహము వలన, అగ్ని దేవుడు నన్ను దహించకుండా ఉన్నాడు'.

ఆ కపికుంజరుడు మరల చితించసాగెను. వేగముతో పైకెగిరి మహా నాదము చేసెను. ఆ అనిలాత్మజుడు ఆ విధముగా రాక్షసులనుంచి విడివడి పర్వత శిఖరముమల్లె నున్న నగర ద్వారముపై నిలబడెను. తన పర్వత రూపము వీడి క్షణములో చిన్న రూపము పొంది తన బంధములనుంచి విడివడెను. హనుమంతుడు అలా బంధ విముక్తుడై మరల పర్వతాకారము పొందెను. అ హనుమంతుడు తోరణాశ్రితుడై అటు ఇటూ వీక్షించి అక్కడ ఉన్న పరిఘను చూచెను. మహాబాహువు అయిన ఆ మారుతి ఆ ఇనుముతో చేయబడిన పరిఘను తీసుకొని ఆ రక్షకులందరినీ హతమార్చెను.

రణములో చండ విక్రముడైన ఆ హనుమంతుడు వారిని హతమార్చి మళ్ళీ లంకను చూస్తూ, మండుతూ ఉన్న లాంగూలము కల, ఆ హనుమంతుడు అనేక కిరణములతో భాసించు సూర్యుని వలె భాసించెను.

ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుండరకాండలో ఏభైమూడవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||
శ్లో||స తాన్ నిహత్వా రణచణ్డవిక్రమః సమీక్షమాణః పునరేవ లంకామ్||
ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ ప్రకాశతాssదిత్య ఇవార్చిమాలీ||
స|| రణచండవిక్రమః సః తాన్ నిహత్వా పునరేవ లంకాం సమీక్షమానః ప్రదీప్తలాంగూలకృతార్చిమాలీ అర్చిమాలీ అదిత్య ఇవ ప్రకాశత||
తా|| రణములో చండ విక్రముడైన ఆ హనుమంతుడు వారిని హతమార్చి మళ్ళీ లంకను చూస్తూ మండుతూ ఉన్న లాంగూలము కల ఆ హనుమంతుడు అనేక కిరణములతో భాసించు సూర్యుని వలె భాసించెను
||ఓమ్ తత్ సత్||