||సుందరకాండ ||
||ఏభై రెండవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||
|| Sarga 54 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
సుందరకాండ.
అథ చతుఃపంచాశస్సర్గః||
"న వానరోఽయం " అంటే "వీడు వానరుడు కాదు"అని. అయితే వానరుడు కాకపోతే వీడు ఎవడు? "స్వయమేవ కాలః" అంటే " స్వయముగా మృత్యువే " అని.
ఇది లంకావాసులు వాళ్లలో వాళ్ళు చెప్పుకుంటున్నమాట.
హనుమ తో యుద్ధానికి వెళ్ళిన వాళ్ళందరికి ఇది తెలిసినమాటే . కింకరులు, చైత్య ప్రాసాద రక్షకులు, జంబుమాలి, అలాగే అమాత్యపుత్రులు, ఇంకా ఐదుగురు సేనానాయకులు, వీరందరికి అశోక వన ధ్వంసము తరువాత జరిగిన యుద్ధములో, హనుమ కాలుడు లాగే కనిపించాడు. ఇప్పుడు లంకావాసులకి కూడా అదే అర్థము అయిందన్నమాట. అది ఎలాజరిగిందో ఈ సర్గలో వింటాము.
ఇక ఏభైనాలుగొవ సర్గలో శ్లోకాలు అర్థతాత్పర్యాలతో.
||శ్లోకము 54.01||
వీక్షమాణస్తతో లంకాం కపిః కృత మనోరథః |
వర్థమాన సముత్సాహః కార్యశేషచిన్తయత్ ||54.01||
స|| తతః కృతమనోరథః కపిః లంకాం వీక్షమాణః వర్ధమాన సముత్సాహః శేషం కార్యం అచిన్తయత్ ||
|| శ్లోకార్థములు||
తతః కృతమనోరథః -
అప్పుడు తన మనోరథమును సాధించినవాడు
కపిః లంకాం వీక్షమాణః -
ఆ వానరుడు లంకానగరమును చూచుచూ
వర్ధమాన సముత్సాహః -
ఉత్సాహము మరింత పెరిగినవాడై
శేషం కార్యం అచిన్తయత్ -
మిగిలిన కార్యక్రమము గురించి ఆలోచించెను
|| శ్లోకతాత్పర్యము||
అప్పుడు హనుమంతుడు తన మనోరథమును సాధించినవాడై లంకానగరమును చూచూ ఉత్సాహము మరింత పెరిగినవాడై మిగిలిన కార్యక్రమము గురించి ఆలోచించెను. ||54.01||
||శ్లోకము 54.02||
కిన్ను ఖల్వశిష్ఠం మే కర్తవ్య మిహ సాంప్రతమ్ |
యదేషాం రక్షసాం భూయః సంతాపజననం భవేత్ ||54.02||
స|| యత్ ఏషాం రాక్షసామ్ భూయః సంతాప జననం భవేత్ కిం ను కర్తవ్యం మే ఇహ సాంప్రతం అవశిష్టం ||
|| శ్లోకార్థములు||
యత్ ఏషాం రాక్షసామ్ -
ఇప్పుడు ఈ రాక్షసులకు
భూయః సంతాప జననం భవేత్ -
మరింత సంతాపము కలిగించడానికి
కిం ను కర్తవ్యం మే - నాకు ఏమి చేయవలెనో
ఇహ సాంప్రతం అవశిష్టం -
అదే నాకు మిగిలిన కర్తవ్యము
|| శ్లోకతాత్పర్యము||
'ఇప్పుడు ఈ రాక్షసులకు మరింత సంతాపము కలిగించగలిగినది ఎదో అదే నాకు మిగిలిన కర్తవ్యము'. ||54.02||
||శ్లోకము 54.03||
వనం తావత్ ప్రమథితం ప్రకృష్టా రాక్షసా హతాః |
బలైక దేశః క్షపితః శేషం దుర్గ వినాశనమ్ ||54.03||
స|| వనం ప్రమథితం తావత్ ప్రకృష్టాః రాక్షసాః హతాః | బలైక దేశః క్షపితః | దుర్గవినాశనం శేషం ||
|| శ్లోకార్థములు||
వనం ప్రమథితం తావత్ -
వనము ధ్వంసము చేయబడినది
ప్రకృష్టాః రాక్షసాః హతాః -
రాక్షసుల కొందరు హతమార్చబడిరి
బలైక దేశః క్షపితః -
దేశముయొక్క బలగము నాశనము చేయబడినది
దుర్గవినాశనం శేషం -
దుర్గవినాశనము మిగిలినది.
|| శ్లోకతాత్పర్యము||
'వనము ధ్వంసము చేయబడినది. రాక్షసుల కొందరు హతమార్చబడిరి. దేశముయొక్క బలగము నాశనము చేయబడినది'. ||54.03||
||శ్లోకము 54.04||
దుర్గేవినాశితే కర్మ భవేత్సుఖపరిశ్రమమ్ |
అల్పయత్నేన కార్యేఽస్మిన్ మమస్యాత్ సఫలః శ్రమః ||54.04||
స|| దుర్గే వినాశితే కర్మ సుఖపరిశ్రమమ్ భవేత్| అస్మిన్ కార్యే అల్పయత్నేన శ్రమః సఫలః స్యాత్||
|| శ్లోకార్థములు||
దుర్గే వినాశితే -
దుర్గము కూడా నాశనము చేసినచో
కర్మ సుఖపరిశ్రమమ్ భవేత్-
చేసినచో చేసిన పరిశ్రమ సుఖకరము అగును.
అల్పయత్నే అస్మిన్ కార్యే -
ఈ కార్యము చిన్న ప్రయత్నముతో
సఫలః స్యాత్- సఫలము అగును
న శ్రమః - శ్రమలేకుండా
|| శ్లోకతాత్పర్యము||
'దుర్గవినాశనము మిగిలినది. దుర్గము కూడా నాశనము చేసినచో చేసిన పరిశ్రమ సుఖకరము అగును'. ||54.04||
||శ్లోకము 54.05||
యోహ్యయం మమ లాంగూలే దీప్యతే హవ్య వాహనః|
అస్య సంతర్పణం న్యాయం కర్తుమేభిర్గృహోత్తమైః||54.05||
స|| మమలాంగూలే యః అయం హవ్యవాహనః దీప్యతే అస్య ఏభిః గృహోత్తమైః సన్తర్పణం కర్తుం న్యాయమ్||
గోవిన్దరాజ టీకాలో - యః అగ్నిః అతి శీతలతయా మమ మహోపకారం కృతవాన్ అస్య సంతర్పణం న్యాయః ఇతి అర్థః॥
|| శ్లోకార్థములు||
మమలాంగూలే - నా లాంగూలములో
యః అయం హవ్యవాహనః దీప్యతే -
ఏ అగ్నిదేవుడు ప్రజ్వరిల్లు చున్నాడో
అస్య ఏభిః గృహోత్తమైః -
ఆయనికి ఈ ఉత్తమమైన గృహములు
సన్తర్పణం కర్తుం న్యాయమ్ -
సంతర్పణ చేయుట న్యాయము
|| శ్లోకతాత్పర్యము||
'నా లాంగూలములో ప్రజ్వరిల్లుతున్న అగ్నిదేవునకు ఈ ఉత్తమమైన గృహములతో సంతర్పణ చేయుట న్యాయము'. ||54.05||
గోవిన్దరాజ టీకాలో - నాలాంగూలము శీతలముగా వుంచిన అగ్నిదేవునకు ఉత్తమమైన గృహములతో సంతర్పణ చేయుట న్యాయము అని.
||శ్లోకము 54.06||
తతః ప్రదీప్తలాంగూలః సవిద్యుదివ తోయదః |
భవనాగ్రేషు లంకాయా విచచార మహాకపిః ||54.06||
స|| తతః ప్రదీప్తలాంగూలః మహాకపిః సవిద్యుత్ తోయదః ఇవ లంకాయాః భవనాగ్రేషు విచచార||
|| శ్లోకార్థములు||
తతః ప్రదీప్తలాంగూలః మహాకపిః -
అప్పుడు ప్రజ్వరిల్లితున్న లాంగూలము కల మహాకపి
సవిద్యుత్ తోయదః ఇవ -
మెరుపులతో కూడిన మేఘములవలె
లంకాయాః భవనాగ్రేషు విచచార -
లంకయొక్క భవనాగ్రములలో సంచరించ సాగెను.
|| శ్లోకతాత్పర్యము||
అప్పుడు ప్రజ్వరిల్లితున్న లాంగూలము కల మహాకపి, మేఘములలో మెరుపులవలె ఆ భనాగ్రములలో సంచరించ సాగెను. ||54.06||
||శ్లోకము 54.07||
గృహాద్గృహం రాక్షసానాం ఉద్యానానిచ వానరః |
వీక్షమాణో హ్యసంత్రస్తః ప్రాసాదాంశ్చ చచార సః ||54.07||
స|| సః వానరః ఉద్యానాని చ ప్రాసాదాశ్చ వీక్షమాణః అసన్త్రస్తః రాక్షసానాం గృహాత్ గృహం చచార ||
|| శ్లోకార్థములు||
సః వానరః ఉద్యానాని -
ఆ వానరుడు ఉద్యానములను
ప్రాసాదాశ్చ వీక్షమాణః -
ప్రాసాదములను చూచి
అసన్త్రస్తః రాక్షసానాం -
భయము లేకుండా
గృహాత్ గృహం చచార-
ఒక భవనము నుండి ఇంకొక భవనము తిరిగెను
|| శ్లోకతాత్పర్యము||
ఆ వానరుడు ఉద్యానములను ప్రాసాదములను చూచి భయము లేకుండా ఒక భవనము నుండి ఇంకొక భవనము తిరిగెను. ||54.07||
||శ్లోకము 54.08,9||
అవప్లుత్య మహావేగః ప్రహస్తస్య నివేశనమ్|
అగ్నిం తత్ర స నిక్షిప్య శ్వసనేన సమో బలీ||8||
తతోన్యత్పుప్లువే వేశ్మ మహాపార్శ్వస్య వీర్యవాన్ ||
ముమోచ హనుమాన్ అగ్నిం కాలానలశిఖోపమమ్||54.09||
స|| మహావేగః శ్వసనేన సమః బలీ వీర్యవాన్ సః ప్రహస్తస్య నివేశనం అవప్లుత్య తత్ర అగ్నిం నిక్షిప్య తతః అన్యత్ మహాపార్శ్వస్య వేశ్మ పుప్లువే హనుమాన్ కాలనలశిఖోపమమ్ అగ్నిం ముమోచ||
|| శ్లోకార్థములు||
మహావేగః శ్వసనేన సమః -
వేగములో వాయువుతో సమానమైన మహావేగము కల
బలీ వీర్యవాన్ - వీరుడు మహాబలవంతుడు
సః ప్రహస్తస్య నివేశనం అవప్లుత్య - j
ప్రహస్తుని భవనము పైకి ఎగిరి
తత్ర అగ్నిం నిక్షిప్య -
అక్కడ నిప్పు అంటించి
తతః అన్యత్ మహాపార్శ్వస్య వేశ్మ పుప్లువే -
అక్కడనుంచి ఇంకొక మహాపార్శ్వుని గృహముపైకి ఎగిరెను .
హనుమాన్ కాలనలశిఖోపమమ్ -
ఎగిరి కాలాగ్నితో సమానమైన హనుమ
అగ్నిం ముమోచ -
అగ్నిని రగిలించెను
|| శ్లోకతాత్పర్యము||
వేగములో వాయువుతో సమానమైన మహావేగము కల వానరుడు ప్రహస్తుని నివేశమున పైకి ఎగిరి అక్కడ నిప్పు అంటించి అక్కడనుంచి ఇంకొక మహాపార్శ్వుని గృహముపైకి ఎగిరి కాలాగ్నితో సమానమైన అగ్నిని రగిలించెను. ||54.08,09||
||శ్లోకము 54.10||
వజ్రదంష్ట్రస్య చ తథా పుప్లువే స మహాకపిః|
శుకస్య చ మహాతేజాః సారణస్య చ ధీమతః||54.10||
స|| మహాతేజాః సః మహాకపిః తదా వజ్రదంష్ట్రస్య శుకస్య ధీమతః సారణస్య చ పుప్లువే||
|| శ్లోకార్థములు||
మహాతేజాః సః మహాకపిః -
ఆ మహాతేజము కల మహాకపి
తదా వజ్రదంష్ట్రస్య -
అప్పుడు వజ్రదంష్ట్రుని యొక్క
శుకస్య ధీమతః సారణస్య చ -
ధీరుడైన శుకుడు, సారణుని యొక్క ( గృహములపై)
పుప్లువే - ఎగిరి చేరెను.
|| శ్లోకతాత్పర్యము||
ఆ మహాతేజము కల మహాకపి అప్పుడు వజ్రదంష్ట్రుడు, ధీరుడైన శుకుడు, సారణుని గృహము పాకి దూకెను. ||54.10||
||శ్లోకము 54.11||
తథా చేన్ద్రజితో వేశ్మ దదాహ హరియూథపః|
జమ్బుమాలేః సుమాలేశ్చ దదాహ భవనం తతః||54.11||
స|| హరియూథపః తథా ఇంద్రజితః వేశ్మ దదాహ|తతః జంబుమాలే సుమాలేశ్చ భవనమ్ దదాహ||
|| శ్లోకార్థములు||
హరియూథపః -
తథా ఇంద్రజితః వేశ్మ దదాహ -
అప్పుడు ఇంద్రజిత్తుని భవనము దహించెను
తతః జంబుమాలే సుమాలేశ్చ -
పిమ్మట జంబుమాలి , సుమాలియొక్క
భవనమ్ దదాహ -
భవనములను దహించెను.
|| శ్లోకతాత్పర్యము||
ఆ వానర యూధపుడు అప్పుడు ఇంద్రజిత్తుని భవనము దహించెను. పిమ్మట జంబుమాలి, సుమాలి భవనములను దహించెను.||54.11||
||శ్లోకము 54.12||
రస్మికేతోశ్చ భవనం సూర్యశత్రోః తథైవ చ|
హ్రస్వకర్ణస్య దంష్ట్రస్య రోమశస్య చ రక్షసః||54.12||
స|| రస్మికేతోశ్చ భవనం తథైవ రక్షసః సూర్యశత్రోః చ హ్రస్వకర్ణశ్చ దంష్ట్రశ్చ రోమశస్య చ(దదాహ)||
|| శ్లోకార్థములు||
రస్మికేతోశ్చ భవనం తథైవ -
పిమ్మట రస్మికేతుని భవనము అలాగే
రక్షసః సూర్యశత్రోః చ -
రాక్షసులు అగు సూర్యశత్రువు
హ్రస్వకర్ణశ్చ దంష్ట్రశ్చ రోమశస్య చ(దదాహ)-
హ్రస్వకర్ణుడు, దంష్ట్రుడు, రోమశస్యుల గృహములను కూడా
|| శ్లోకతాత్పర్యము||
పిమ్మట రస్మికేతుని భవనము అలాగే రాక్షసులు అగు సూర్యశత్రువు , హ్రస్వకర్ణుడు, దంష్ట్ర్రుడు, రోమశస్యుల గృహములను కూడా దహించెను. ||54.12||
||శ్లోకము 54.13||
యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య రక్షసః|
విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ||54.13||
స||రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య ధ్వజగ్రీవస్య విద్యుజ్జిహ్వస్య ఘోరస్య తథా హస్తిముఖస్య చ దదాహ||
|| శ్లోకార్థములు||
రక్షసః యుద్ధోన్మత్తస్య మత్తస్య -
రాక్షసులు యుద్ధోన్మత్తుడు, మత్తుడు,
ధ్వజగ్రీవస్య విద్యుజ్జిహ్వస్య ఘోరస్య -
ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు
తథా హస్తిముఖస్య చ దదాహ -
అలాగే హస్తిముఖుల భవనములను కూడా (దహించెను)
|| శ్లోకతాత్పర్యము||
అలాగే రాక్షసులు యుద్ధోన్మత్తుడు, మత్తుడు, ధ్వజగ్రీవుడు, విద్యుజ్జిహ్వుడు, ఘోరుడు అలాగే హస్తిముఖుల భవనములనుకూడా దహించెను. ||54.13||
||శ్లోకము 54.14||
కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చైవ హి|
కుంభకర్ణస్య భవనం మకరాక్షస్య చైవ హి||54.14||
స|| కరాళస్య పిశాచస్య శోణితాక్షస్య చ ఏవ హి దదాహ| కుంభకర్ణస్య భవనం మకరాక్షస్య చ ఏవ దదాహ||
|| శ్లోకార్థములు||
కరాళస్య పిశాచస్య -
అలాగే కరాళుడు, పిశాచుడు
శోణితాక్షస్య చ ఏవ హి దదాహ -
శోణితాక్షుల గృహములను దహించెను
కుంభకర్ణస్య భవనం -
కుంభకర్ణుని భవనము
మకరాక్షస్య చ ఏవ దదాహ -
మకరాక్షుని భవనము కూడా దహించెను
|| శ్లోకతాత్పర్యము||
అలాగే కరాళుడు, పిశాచుడు, శోణితాక్షుల గృహములను దహించెను. కుంభకర్ణుని భవనము మకరాక్షుని భవనము దహించెను. ||54.14||
||శ్లోకము 54.15||
యజ్ఞశత్రోశ్చ భవనం బ్రహ్మశత్రోః తథైవ చ|
నరాన్తకస్య కుంభస్య నికుంభస్య దురాత్మనః||54.15||
స|| యజ్ఞశత్రోః భవనం తథైవ బ్రహ్మశత్రోః చ నరాన్తకస్య కుమ్భస్య దురాత్మనః నికుంభస్యచ భవనం దదాహ||
|| శ్లోకార్థములు||
యజ్ఞశత్రోః భవనం -
యజ్ఞశత్రుని భవనము,
తథైవ బ్రహ్మశత్రోః చ నరాన్తకస్య కుమ్భస్య -
బ్రహ్మశత్రుని భవనము, నరాన్తకుడు కుంభుని యొక్క
దురాత్మనః నికుంభస్యచ -
దురాత్ముడు నికుంభుని యొక్క
భవనం దదాహ -
భవనములను దహించెను
|| శ్లోకతాత్పర్యము||
యజ్ఞశత్రుని భవనము, బ్రహ్మశత్రుని భవనము, నరాన్తకుడు కుంభుడు , దురాత్ముడు నికుంభుని భవనము దహించెను. ||54.15||
||శ్లోకము 54.16||
వర్జయిత్వా మహాతేజా విభీషణ గృహం ప్రతి|
క్రమమాణః క్రమేణైవ దదాహ హరిపుంగవః||54.16||
స|| మహాతేజా విభీషణ గృహం ప్రతి వర్జయిత్వా క్రమమాణః క్రమేనైవ హరిపుంగవః దదాహ||
|| శ్లోకార్థములు||
మహాతేజా విభీషణ గృహం -
మహాతేజోవంతుడగు విభీషణుని భవనము
ప్రతి వర్జయిత్వా - మాత్రము వదిలేసి
క్రమమాణః క్రమేనైవ -
క్రమముగా మిగిలిన
హరిపుంగవః దదాహ -
హరిపుంగవుడు దహించెను
|| శ్లోకతాత్పర్యము||
మహాతేజోవంతుడగు విభీషణుని భవనము మాత్రము వదిలేసి క్రమముగా మిగిలిన భవనములను క్రమము తప్పకుండా ఆ హరిపుంగవుడు దహించెను. ||54.16||
||శ్లోకము 54.17||
తేషు తేషు మహార్హేషు భవనేషు మహాయశాః|
గృహేష్వృద్ధిమతాం వృద్ధిం దదాహ మహాకపిః||54.17||
స|| మహాయశాః సః మహాకపిః ఋద్ధిమతాం మహార్హేషు తేషు తేషు గృహేషు ఋద్ధిం దదాహ||
|| శ్లోకార్థములు||
మహాయశాః సః మహాకపిః -
మహాయశోవంతుడైన ఆ మహాకపి
ఋద్ధిమతాం మహార్హేషు -
ఐశ్వర్యముతో తులతూగుతున్నవారి వారి
తేషు తేషు గృహేషు -
వారి వారి గృహములలోని
ఋద్ధిం దదాహ -
ఐశ్వర్యమంతా దహించెను.
|| శ్లోకతాత్పర్యము||
మహాయశోవంతుడైన ఆ మహాకపి ఐశ్వర్యముతో తులతూగుతున్నవారి వారి గృహములలోని ఐశ్వర్యమంతా దహించెను. ||54.17||
||శ్లోకము 54.18||
సర్వేషాం సమతిక్రమ్య రాక్షసేంద్రస్య వీర్యవాన్|
అసదాథ లక్ష్మీవాన్ రావణస్య నివేశనమ్||54.18||
స|| వీర్యవాన్ లక్ష్మీవాన్ సర్వేషాం సమతిక్రమ్య అథ రాక్షసేంద్రస్య రావణస్య నివేశనమ్ అససాద||
|| శ్లోకార్థములు||
వీర్యవాన్ లక్ష్మీవాన్ -
ఆ వీరుడు లక్ష్మీగుణసంపన్నుడు
సర్వేషాం సమతిక్రమ్య -
అందరి గృహములను దాటి
అథ రాక్షసేంద్రస్య రావణస్య -
అప్పుడు రాక్షసేంద్రుడు రావణుని
నివేశనమ్ అససాద - భవనము చేరెను
|| శ్లోకతాత్పర్యము||
"ఆ వీరుడు అన్నిటినీ దాటి రాక్షసేంద్రుడు రావణుని భవనము చేరెను. ||54.18||
||శ్లోకము 54.19||
తతస్తస్మిన్ గృహే ముఖ్యే నానారత్న విభూషితే|
మేరుమందర సంకాశే సర్వమంగళశోభితే||54.19||
ప్రదీప్త మగ్ని ముత్సృజ్య లాంగులాగ్రే ప్రతిష్టితమ్|
ననాద హనుమాన్ వీరో యుగాన్త జలదో యథా||54.20||
స|| తతః హనుమాన్ నానారత్న విభూశితే మేరుమందర సంకాశే సర్వమంగళ శోభితే తస్మిన్ ముఖ్యే గృహే లాంగూలాగ్రే ప్రతిష్టం ప్రదీప్తం అగ్నిం ఉత్సృజ్య యుగాన్త జలదే ననాద||
|| శ్లోకార్థములు||
తతః హనుమాన్ -
అక్కడ హనుమంతుడు
నానారత్న విభూషితే -
నానారత్న విభూషణములతో విరాజిల్లుచున్
మేరుమందర సంకాశే -
మేరు మందర పర్వతములవలెనున్న
సర్వమంగళ శోభితే -
అన్నిరకములుగా మంగళప్రదముగానున్
తస్మిన్ ముఖ్యే గృహే -
అతని ముఖ్యగృహములో
లాంగూలాగ్రే ప్రతిష్టం -
తన లాంగూలాగ్రములో ప్రతిష్టమైవున్న
ప్రదీప్తం అగ్నిం ఉత్సృజ్య -
ప్రజ్వరిల్లు చున్న అగ్నితో నిప్పంటించి
యుగాన్త జలదే ననాద -
కాలమేఘములవలె గర్జించెను
|| శ్లోకతాత్పర్యము||
అక్కడ హనుమంతుడు నానారత్న విభూషణములతో విరాజిల్లుచున్న, మేరు మందర పర్వతములవలెనున్న, అన్నిరకములుగా మంగళ ప్రదముగానున్న ముఖ్యగృహములో తన లాంగూలాగ్రములో ప్రజ్వరిల్లు చున్న అగ్నితో నిప్పంటించి కాలమేఘములవలె గర్జించెను. ||54.19,20||
||శ్లోకము 54.21||
శ్వసనేన చ సంయోగాత్ అతివేగో మహాబలః|
కాలాగ్నిరివ జజ్వాల ప్రావర్ధత హుతాశనః ||54.21||
స|| శ్వసనేన సంయోగాత్ హుతాశనః అతివేగః మహాబలః ప్రావర్ధత | కాలాగ్నిః ఇవ జజ్వాల||
|| శ్లోకార్థములు||
శ్వసనేన సంయోగాత్ -
వాయువు కలవడముతో
హుతాశనః అతివేగః -
అగ్ని అతి వేగముగా
మహాబలః ప్రావర్ధత -
బలవత్తరముగా పెరిగెను
కాలాగ్నిః ఇవ జజ్వాల -
కాలాగ్ని వలె జ్వలించెను
|| శ్లోకతాత్పర్యము||
వాయువు కలవడముతో అగ్ని అతి వేగముగా బలవత్తరముగా పెరిగెను. ఆ అగ్ని కాలాగ్ని వలె జ్వలించెను. ||54.21||
||శ్లోకము 54.22||
ప్రదీప్తమగ్నిం పవనః తేషు వేశ్మ స్వచారయత్|
అభూచ్ఛ్వసన సంయోగాత్ అతివేగో హుతాశనః||54.22||
స|| పవనః ప్రదీప్తం అగ్నిం తేషు వేశ్మసు ఆచారయత్ | శ్వసనసంయోగాత్ హుతాశనః అతివేగః అభూత్||
|| శ్లోకార్థములు||
పవనః ప్రదీప్తం అగ్నిం -
పవనునితో ప్రదీప్తమైన అగ్ని
తేషు వేశ్మసు ఆచారయత్ -
ఆ భవనములన్నిటిలో తిరిగెను
శ్వసనసంయోగాత్ హుతాశనః -
వాయు సంయోగముతో అగ్ని
అతివేగః అభూత్ -
మరింతవేగము కలదై అయ్యెను
|| శ్లోకతాత్పర్యము||
ఆ అగ్ని కాలాగ్ని వలె జ్వలించెను. పవనునిచేత ప్రజ్వలింపబడిన అగ్ని ఆ భవనములన్నిటిలో తిరిగెను. ||54.22||
||శ్లోకము 54.23||
తాని కాంచనజాలాని ముక్తామణిమయాని చ|
భవనాన్యవశీర్యన్త రత్నవన్తి మహాన్తి చ||54.23||
స|| కాంచనజాలాని ముక్తామణిమయాని చ రత్నవంతి మహన్తి చ తాని భవనాని అవశీర్యన్త||
|| శ్లోకార్థములు||
కాంచనజాలాని ముక్తామణిమయాని చ -
బంగారు జాలలు మణిరత్న భూషితమైన
రత్నవంతి మహన్తి చ -
మహత్తరమైన రత్నములతో కూడినవి
తాని భవనాని అవశీర్యన్త -
ఆ భవనములు కాలి పడిపోయినవి.
|| శ్లోకతాత్పర్యము||
బంగారు జాలలు మణిరత్న భూషితమైన అ మహత్తరమైన భవనములు కాలి పడిపోయినవి. ||54.23||
||శ్లోకము 54.24||
సంజజ్ఞే తుములః శబ్దోరాక్షసానాం ప్రధావతాం|
స్వగృహ్వస్య పరిత్రాణే భగ్నోత్సాహోర్జితశ్రియామ్||54.24||
నూనమేషోఽగ్ని రాయాతః కపిరూపేణ హా ఇతి|
స||స్వగృహస్య పరిత్రాణే ప్రధావతాం భగ్నోత్సాహోర్జితశ్రియాం రాక్షసానామ్ నూనమ్ ఏషః అగ్నిః కపిరూపేణ ఆయాతః ఇతి తుములః శబ్దః సంజజ్ఞే ||
|| శ్లోకార్థములు||
స్వగృహస్య పరిత్రాణే -
తమ గృహములను రక్షించుకొనుటకు
ప్రధావతాం రాక్షసానామ్ -
పరిగెడుచున్నరాక్షసులు
భగ్నోత్సాహోర్జితశ్రియాం -
సంపాదించిన సంపదలను రక్షించుకో లేక భగ్నోత్సాహము కలవారై
నూనమ్ ఏషః అగ్నిః -
తప్పక ఈ అగ్ని
కపిరూపేణ ఆయాతః -
కపిరూపములో వచ్చినది ( అనుకొనిరి)
ఇతి తుములః శబ్దః సంజజ్ఞే -
అప్పుడు హాహాకారముల శబ్దములు చెలరేగినవి.
|| శ్లోకతాత్పర్యము||
తమ గృహములను రక్షించుకొనుటకు పరిగెడుచున్నరాక్షసులు సంపాదించిన సంపదలను రక్షించుకో లేక భగ్నోత్సాహము కలవారై 'తప్పక అగ్నియే కపిరూపములో వచ్చినది' అని అనుకొనిరి. అప్పుడు హాహాకారముల శబ్దములు చెలరేగినవి. ||54.24||
||శ్లోకము 54.25,26||
క్రన్దన్త్యః సహసాపేతుః స్తనన్థయధరాః స్త్రియః||54.25||
కాశ్చిదగ్ని పరీతేభ్యో హర్మ్యేభ్యో ముక్త మూర్థజాః|
పతన్త్యో రేజిరేఽభ్రేభ్యః సౌదామిన్య ఇవామ్బరాత్||54.26||
స||కాశ్చిత్ స్త్రియః స్తనన్ధరాః ముక్తమూర్ధజాః క్రన్దన్త్యః అగ్నిపరీతేభ్యః హర్మ్యేభ్యః సహసా పేతుః| అంబరాత్ అభ్రేభ్యః పతన్యః సౌదామిన్యః ఇవ||
|| శ్లోకార్థములు||
కాశ్చిత్ స్త్రియః స్తనన్ధరాః -
కొందరు పసిబిడ్డలకి పాలు ఇచ్చుచున్న స్త్రీలు
ముక్తమూర్ధజాః -
వారి జుట్టు విడిపోయి
క్రన్దన్త్యః - హాహాకారము చేస్తూ
అగ్నిపరీతేభ్యః హర్మ్యేభ్యః -
అగ్నితో చుట్టబడిన భవనములనుండి
సహసా పేతుః - తోందరలో దూకిరి
అంబరాత్ అభ్రేభ్యః పతన్యః -
అప్పుడు వారు అంబరమునుండి పడుతున్న
సౌదామిన్యః ఇవ-
సౌదామినులవలె నుండిరి
|| శ్లోకతాత్పర్యము||
కొందరు పసిబిడ్డలకి పాలు ఇచ్చుచున్న స్త్రీలు వారి జుట్టు విడిపోయి హాహాకారము చేస్తూ అగ్నితో చుట్టబడిన భవనములనుండి తోందరలో దూకిరి. అప్పుడు వారు అంబరమునుండి పడుతున్న సౌదామినులవలె నుండిరి. ||54.25,26||
||శ్లోకము 54.28||
వజ్రవిద్రుమ వైడూర్య ముక్తా రజత సంహితాన్|
విచిత్రాన్భవనాన్ దాతూన్ స్యన్దమానాన్ దదర్శ హ||54.28||
స|| సః వజ్రవిద్రుమ వైడూర్య ముక్తా రజత సంహితాన్ విచిత్రాన్ భవనాత్ స్యన్దమానాన్ ధాతూన్ దదర్శ||
|| శ్లోకార్థములు||
వజ్రవిద్రుమ వైడూర్య -
వజ్రములు పగడములు వైడూర్యములు
ముక్తా రజత సంహితాన్ విచిత్రాన్ -
బంగారము వెండి ధాతువులతో కూడిన
సః భవనాత్ స్యన్దమానాన్ -
ఆ హనుమంతుడు ఆ అగ్నిజ్వాలలకి దగ్ధమౌతున్న భవనముల నుండి పడుతూవున్న
ధాతూన్ దదర్శ - ధాతువులను చూచెను
|| శ్లోకతాత్పర్యము||
ఆ హనుమంతుడు ఆ అగ్నిజ్వాలలకి దగ్ధమౌతున్న భవనముల నుండి వజ్రములు పగడములు వైడూర్యములు బంగారము వెండి ధాతువులతో కూడిన ద్రవ్యముల ధాతువులను చూచెను. ||54.28||
||శ్లోకము 54.29,30||
నాగ్నిః తృప్యతి కాష్ఠానాం తృణానాం చ యథా తథా |
హనుమాన్ రాక్షసేంద్రాణాం వధే కించిన్న తృప్యతి||54.29||
న హనుమాద్విశస్తానాం రాక్షసానాం వసున్ధరా||54.30||
స|| యథా అగ్నిః కాష్టానాం తృణానాం న తృప్యతి తథా హనుమాన్ రాక్షసేంద్రాణాం వధే కించిత్ న తృప్యతి| హనూమత్ విశస్తానాం రాక్షసానాం వసున్ధరా అపి న (తృప్త్యతి)।
గోవిన్దరాజ టీకాలో - అగ్నిః కాష్టైః తృణైశ్చ న తృప్త్యతి। హరియూథపః అగ్నేః న తృప్త్యతి।అగ్ని ప్రక్షేపణేన న తృప్త్యతి ఇత్యర్థః।ఏవం వసుంధరా విశస్తానాం రాక్షసానాం విశస్తైః రాక్షసైః
న తృప్త్యతి యోజ్యం। అనేన రాక్షసావకీర్ణా భూరభుదితి అర్థః॥
|| శ్లోకార్థములు||
యథా అగ్నిః - ఏ విధముగా అగ్ని
కాష్టానాం తృణానాం న తృప్యతి -
కట్టెలు తృణములతో తృప్తిచెందదో
తథా హనుమాన్ -
ఆ విధముగా హనుమంతుడు
రాక్షసేంద్రాణాం వధే -
ఎందరు రాక్షసులను వధించినప్పటికి
న తృప్యతి - తృప్తి చెందలేదు
హనూమత్ విశస్తానాం రాక్షసానాం - హనుమంతునిచే చంపబడిన రాక్షసులతో
వసున్ధరా అపి న -
భూమి కూడా తృప్తి చెందలేదు
|| శ్లోకతాత్పర్యము||
ఏవిధముగా అగ్ని కట్టెలు తృణములతో తృప్తిచెందదో ఆవిధముగా హనుమంతుడు రాక్షసేంద్రుని రాక్షసులను హతమార్చినా తృప్తి చెందలేదు. హనుమంతుడు ఎందరు రాక్షసులను నేలకూల్చినప్పటికి భూమి కూడా తృప్తి చెందలేదు. ||54.29,30||
||శ్లోకము 54.31||
క్వచిత్ కింశుకసంకాశాః క్వచిచ్ఛాల్మలిసన్నిభాః |
క్వచిత్కుంకుమసంకాశాః శిఖావహ్నేశ్చకాశిరే ||54.31||
స|| వహ్నేః శిఖాః క్వచిత్ కింశుకసంకాశాః క్వచిత్ శాల్మలిసన్నిభాః క్వచిత్ కుంకుమ సంకాశాః చకాశిరే ||
|| శ్లోకార్థములు||
వహ్నేః శిఖాః -
ఆ అగ్నిశిఖలు
క్వచిత్ కింశుకసంకాశాః -
కొన్ని కింశుకాపుష్పముల వెలుగుతూ
క్వచిత్ శాల్మలిసన్నిభాః -
కొన్ని శాల్మలీపుష్పముల వెలుగుతూ
క్వచిత్ కుంకుమ సంకాశాః -
కొన్ని కుంకుమ పుష్పముల వెలుగుతూ
చకాశిరే - ప్రకాశించుచున్నవి
|| శ్లోకతాత్పర్యము||
ఆ అగ్నిశిఖలు కొన్ని కింశుకాపుష్పముల వెలుగుతూ, కొన్ని శాల్మలీపుష్పముల వెలుగుతూ, కొన్ని కుంకుమ పుష్పముల వెలుగుతూ ప్రకాశించుచున్నవి. ||54.31||
||శ్లోకము 54.32||
హనూమతా వేగవతా వానరేణ మహాత్మనా |
లంకాపురం ప్రదగ్ధం తత్ రుద్రేణ త్రిపురం యథా ||54.32||
స|| వేగవతా వానరేణ మహాత్మనా హనుమతా లంకాపురం రుద్రేణ త్రిపురం యథా ప్రదగ్ధమ్||
|| శ్లోకార్థములు||
మహాత్మనా హనుమతా -
మహాత్ముడైన హనుమంతునిచే
వేగవతా వానరేణ -
వేగముకల వానరునిచేత
లంకాపురం - లంకాపురము
రుద్రేణ త్రిపురం యథా -
రుద్రుడు త్రిపురమును దగ్ధమొనరించినట్లు
ప్రదగ్ధమ్ -
దగ్ధము చేయబడెను
|| శ్లోకతాత్పర్యము||
మహాత్ముడైన వేగముకల హనుమంతుని చేత ఆ లంకాపురము రుద్రుడు త్రిపురమును దగ్ధమొనరించినట్లు దగ్ధము చేయబడెను. ||54.32||
||శ్లోకము 54.33||
తతస్తు లంకాపుర పర్వతాగ్రే
సముత్థితో భీమపరాక్రమోఽగ్నిః |
ప్రసార్యచూడావలయం ప్రదీప్తో
హనూమతా వేగవతా విసృష్టః ||54.33||
స||తత్ః వేగవతా హనుమాతా విశ్రుష్టః భీమపరాక్రమః అగ్నిః చూడావలయం ప్రసార్య ప్రదీప్తః లంకాపురపర్వతాగ్రే సముత్థితః||
|| శ్లోకార్థములు||
తత్ః భీమపరాక్రమః వేగవతా హనుమాతా -
ఆ భీమపరాక్రమము గల వేగముకల హనుమంతుని చేత
విశ్రుష్టః అగ్నిః-
వేగముగా అంటింపబడిన అగ్ని
చూడావలయం ప్రసార్య ప్రదీప్తః -
వలయాకారముగా పెరుగుతూ ప్రజ్వలిస్తూ
లంకాపురపర్వతాగ్రే సముత్థితః -
శిఖరాగ్రమున ఉన్న ఆ లంకానగరము పైకి లేచెను.
|| శ్లోకతాత్పర్యము||
ఆ భీమపరాక్రమము గల హనుమంతుని చేత వేగముగా ప్రజ్వలింపబడిన అగ్ని, వలయాకారముగా పెరుగుతూ శిఖరాగ్రమున ఉన్న ఆ లంకానగరము పైకి లేచెను. ||54.33||
||శ్లోకము 54.34||
యుగాన్త కాలానలతుల్యవేగః
సమారుతోఽగ్నిర్వవృధే దివిస్పృక్ |
విధూమరశ్మిర్భవనేషు సక్తో
రక్షః శరీరాజ్యసమర్పితార్చిః ||54.34||
స|| విధూమరస్మిః భవనేషు సక్తః సమారుతాగ్ని రక్షః శరీరాజ్యసమర్పితార్చిః యుగాన్తకాలానలతుల్యవేగః వవృధే ||
|| శ్లోకార్థములు||
విధూమరస్మిః భవనేషు సక్తః -
ధూమములేని ఆ భవనములలో వున్న
సమారుతాగ్ని -
వాయువుచేత ప్రకోపింపబడిన అగ్ని
రక్షః శరీరాజ్యసమర్పితార్చిః -
రాక్షస శరీరములను దగ్ధము చేయుచూ
దివిస్పృక్ -
అకాశమంతా అంటుతూ
యుగాన్తకాలానలతుల్యవేగః -
యుగాంతములో కాలాగ్నితో సమానమైన వేగముతో
వవృధే - పెరిగినవి
|| శ్లోకతాత్పర్యము||
ధూమములేని ఆ భవనములలో వున్న అగ్ని వాయువుచేత ప్రకోపింపబడి రాక్షస శరీరములను దగ్ధము చేయుచూ అకాశమంతా అంటుతూ, యుగాంతములో కాలాగ్నితో సమానమైన వేగముతో మరింత పెరిగినవి. ||54.34||
||శ్లోకము 54.35||
ఆదిత్యకోటీసదృశః సుతేజా
లంకాం సమస్తాం పరివార్య తిష్టన్ |
శబ్దైరనైకై రశనిప్రరూఢైర్భిన్దన్
నివాణ్డం ప్రబభౌ మహాగ్నిః ||54.35||
స||ఆదిత్యకోటి సదృశః సుతేజాః సమస్తాం లంకాం పరివార్య తిష్టన్ మహాగ్నిః| అనైకైః అశనిప్రరూఢైః శబ్దైః అణ్డం భిన్దన్ ఇవ ప్రబభౌ||
|| శ్లోకార్థములు||
ఆదిత్యకోటి సదృశః -
కోటి సూర్యుల సమానముగా
సుతేజాః మహాగ్నిః -
తేజోవంతమైన ఆ మహాగ్ని
సమస్తాం లంకాం పరివార్య తిష్టన్ -
సమస్త లంకానగరమును చుట్టి
అశనిప్రరూఢైః అనైకైః -
వజ్రాయుధము తో కొట్టబడి చేసిన చాలా
అణ్డం భిన్దన్ ఇవ శబ్దైః -
బ్రహ్మాండమంతా విరుగుచున్నట్లు వున్న శబ్దములతో
ప్రబభౌ- ప్రభవించెను
|| శ్లోకతాత్పర్యము||
సమస్త లంకానగరమును చుట్టిన ఆ తేజోవంతమైన ఆ అగ్ని కోటి సూర్యుల సమానముగా కనపడెను. ఆ అగ్ని వజ్రాయుధము తో కొట్టబడి బ్రహ్మాండమంతా విరుగుచున్నట్లు చేసిన శబ్దములు వలె కల శబ్దములతో ప్రభవించెను. ||54.35||
||శ్లోకము 54.36||
తత్రామ్బరాదగ్నిరతిప్రవృద్ధో
రూక్షప్రభః కింశుకపుష్పచూడః|
నిర్వాణధూమాకులరాజయశ్చ
నీలోత్పలాభాః ప్రచకాశిరేఽభ్రాః||54.36||
స|| తత్ర రుక్షప్రభః కింశుకపుష్పచూడః అగ్నిః అమ్బరాత్ అతిప్రవృద్ధః అభ్రాః నిర్వానధూమాకులరాజయః నీలోత్పలాభాః ప్రచకాశిరే||
|| శ్లోకార్థములు||
తత్ర రూక్షప్రభః కింశుకపుష్పచూడః అగ్నిః -
ఆ అగ్ని కింశుకాపుష్పపు వర్ణముతో వెలుగుచూ మిరిమిట్లు కొలిపే కాంతులతో
అమ్బరాత్ అతిప్రవృద్ధః -
ఆకాశమంతా వ్యాపించి
అభ్రాః నిర్వాణధూమాకులరాజయః -
సమస్తము దగ్ధముచేసి మంటలు చల్లారిన పిమ్మట లేచిన పొగలతో చుట్టబడిన మేఘములు
నీలోత్పలాభాః ప్రచకాశిరే -
నలువ కలువలవలే ప్రకాశించుచున్నవి
|| శ్లోకతాత్పర్యము||
ఆ అగ్ని కింశుకాపుష్పపు వర్ణముతో వెలుగుచూ మిరిమిట్లు కొలిపే కాంతులతో ఆకాశమంతా వ్యాపించినది. సమస్తము దగ్ధముచేసి మంటలు చల్లారిన పిమ్మట లేచిన పొగలతో చుట్టబడిన మేఘములు నలువ కలువలవలే ప్రకాశించుచున్నవి.||54.36||
||శ్లోకము 54.37||
వజ్రీమహేంద్రస్త్రిదశేశ్వరో వా
సాక్షాద్యమో వా వరుణోఽనిలో వా|
రుద్రోఽగ్నిరర్కో ధనదశ్చ సోమో
న వానరోఽయం స్వయమేవ కాలః||54.37||
స|| అయం వానరః న| వజ్రీ త్రిదశేశ్వరః మహేన్ద్రః వా సాక్షాత్ యమః వా అనిలో వా రుద్రః అగ్నిః అర్కః ధనదశ్చ సోమః స్వయం కాలః ఏవ వా||
|| శ్లోకార్థములు||
అయం వానరః న -
ఇతడు వానరుడుకాడు
వజ్రీ త్రిదశేశ్వరః మహేన్ద్రః వా -
వజ్రాయుధధారి దేవతలప్రభువు అయిన ఇంద్రుడుకావచ్చు
సాక్షాత్ యమః వా -
లేకసాక్షాత్తు యముడో లేక
అనిలో వా రుద్రః అగ్నిః -
వాయుదేవుడో రుద్రుడో అగ్నియో
అర్కః ధనదశ్చ సోమః -
సూర్యుడో కుబేరుడో చంద్రుడో
స్వయం కాలః ఏవ వా -
స్వయముగా కాలపురుషుడో అవవచ్చు'
|| శ్లోకతాత్పర్యము||
(ధగ్ధమగుతున్న నగరముచూచి రాక్షసులు ఈ విధముగా తలచిరి). 'ఇతడు వానరుడుకాడు. వజ్రాయుధధారి దేవతలప్రభువు అయిన ఇంద్రుడుకావచ్చు,లేకసాక్షాత్తు యముడో , వాయుదేవుడో రుద్రుడో అగ్నియో సూర్యుడో కుబేరుడో చంద్రుడో అవవచ్చులేక స్వయముగా కాలపురుషుడో అవవచ్చు'.||54.37||
||శ్లోకము 54.38||
కింబ్రాహ్మణః సర్వ పితామహస్య
సర్వస్య ధాతుశ్చతురాననస్య|
ఇహాఽగతో వానర రూపధారీ
రక్షోపసంహారకరః ప్రకోపః||54.38||
స|| సర్వపితామహస్య సర్వస్య ధాతుః చతురాననస్య బ్రహ్మణహ్ రక్షోపసంహారకరః ప్రకోపః వానరరూపధారీ ఇహ ఆగతః ఉపాయాతః కిమ్?||
రామ టీకాలో - సర్వపితామహత్వాది విశిష్టస్య బ్రహ్మణః రక్షోపసంహారకరః ప్రకోపః వానరరూపధారీ సన్ ఇహాగతః కిమ్?
|| శ్లోకార్థములు||
సర్వపితామహస్య సర్వస్య ధాతుః -
సమస్త పితామహుడు సమస్త సృష్టి కర్త
చతురాననస్య బ్రహ్మణః చతురాననుడైన బ్రహ్మయే
రక్షోపసంహారకరః ప్రకోపః -
కోపముతో రాక్షససంహారమునకు
వానరరూపధారీ ఉపాయాతః -
వానర రూపధారియై
ఇహ ఆగతః కిమ్?-
ఇక్కడికి వచ్చెనా ఏమి?
|| శ్లోకతాత్పర్యము||
'లేక సమస్త పితామహుడు సమస్త సృష్టికర్త చతురాననుడైన బ్రహ్మయే కోపముతో రాక్షససంహారమునకు వానరరూపములో ఇక్కడికి వచ్చెనా ఏమి?'||54.38||
||శ్లోకము 54.39||
కిం వైష్ణవం వా కపిరూపమేత్య
రక్షో వినాశాయ పరం సుతేజః|
అనన్తమవ్యక్త మచిన్త్య మేకమ్
స్వమాయయా సామ్ప్రత మాగతం వా||54.39||
స|| అనంతం అవ్యక్తం అచిన్త్యం ఏకం వైష్ణవమ్ పరం సుతేజః సామ్ప్రతం రక్షో వినాసాయ స్వమాయయా కపిరూపం ఏత్య ఆగతం కిం వా||
రామ టీకాలో - స్వమాయయా రక్షోవినాశాయ కపిరూపం ఏత్య అచిన్త్యం చిన్తయితుం అశక్యం అత ఏవ అవ్యక్తం ప్రధానం వైష్ణవం మహావిష్ణుసంబన్ధి సుతేజో వాకిమ్?
|| శ్లోకార్థములు||
అనంతం అవ్యక్తం అచిన్త్యం -
అనంతము అవ్యక్తము ఊహకందని
ఏకం వైష్ణవమ్ పరం సుతేజః -
ఒకే మహావిష్ణువు అతి తేజోమయుడు
సామ్ప్రతం రక్షో వినాసాయ -
రాక్షసులను పూర్తిగా అంతము చేయుటకు
స్వమాయయా కపిరూపం ఏత్య -
స్వయముగా వానరూపము పొంది
ఆగతం కిం వా- ఇక్కడికి వచ్చెనా ఏమి?
|| శ్లోకతాత్పర్యము||
'అనంతము అవ్యక్తము ఊహకందని ఒకే మహావిష్ణువు అతి తేజోమయుడు రాక్షసులను పూర్తిగా అంతము చేయుటకు వానరూపములో వచ్చెనా? అని'. ||54.39||
||శ్లోకము 54.40||
ఇత్యేవమూచుర్భవో విశిష్ఠా
రక్షోగణాస్తత్ర సమేత్య సర్వే|
సప్రాణి సంఘాం సగృహాం సవృక్షామ్
దగ్ధాం పురీం తాం సహసా సమీక్ష్య||54.40||
స|| సప్రాణి సంఘాం సగృహం సవృక్షాం తాం పురీం సహసా దగ్ధాం బహవః విశిష్టాః సర్వే రక్షోగణాః తత్ర సమేత్య ఇతి ఏవం ఊచుః||
తిలకటీకాలో - బహవః విశిష్టాః ప్రహస్తాదయః ఇత్యర్థః।
|| శ్లోకార్థములు||
సప్రాణి సంఘాం -
సమస్త ప్రాణి సంఘములూ
సగృహం సవృక్షాం -
గృహములూ వృక్షముల తో సహా
తాం పురీం సహసా దగ్ధాం -
ఆ పురము వెంటనే దగ్ధమైపోతూవుంటే
బహవః విశిష్టాః సర్వే రక్షోగణాః - రాక్షసగణములందరూ అనేక మంది పెద్దలూ
తత్ర సమేత్య ఇతి ఏవం ఊచుః-
అక్కడ కలిసి ఈ విధముగా చెప్పుకొనసాగిరి
|| శ్లోకతాత్పర్యము||
'సమస్త ప్రాణి సంఘములలూ గృహములూ వృక్షముల తో సహా ఆ నగరము దగ్ధము అయిపోతూవుంటే ఈ విధముగా ఆ రాక్షస గణములందరూ కలిసి ఒకరికొకరు ఈ విధముగా చెప్పుకొనసాగిరి'. ||54.40||
||శ్లోకము 54.41||
తతస్తు లంకా సహసా ప్రదగ్ధా
సరాక్షసా సాశ్వరథా సనాగా |
సపక్షిసంఘా సమృగా సవృక్షా
రురోద దీనా తుములం సశబ్దమ్ ||54.41||
స|| తతః సరాక్షసా సాశ్వరథా స నాగా సపక్షిసంఘాః స మృగా స వృక్షా లంకా సహసా ప్రదగ్ధా దీనా తుములం సుశబ్దం రురోద||
|| శ్లోకార్థములు||
తతః సరాక్షసా -
అప్పుడు రాక్షసులుతో కూడి
సాశ్వరథా స నాగా -
అశ్వములూ రథములు గజములు
సపక్షిసంఘాః స మృగా స వృక్షా -
మృగములతో పక్షిసంఘముల తో వృక్షములతో సహా
లంకా సహసా ప్రదగ్ధా -
దగ్ధము అవుతున్న ఆ లంకా నగరము
దీనా తుములం సుశబ్దం రురోద-
దీనమైన రోదన ధ్వనులు పైకి లేచాయి.
|| శ్లోకతాత్పర్యము||
'అప్పుడు రాక్షసులు అశ్వములు రథములు ఏనుగులు మృగములతో పక్షిసంఘముల తో వృక్షములతో సహా దగ్ధము అవుతున్న ఆ లంకా నగరము నుండి రోదన ధ్వనులు పైకి లేచాయి'. ||54.41||
||శ్లోకము 54.42||
హా తాత హాపుత్త్రక కాన్త మిత్త్ర
హా జీవితం భోగయుతం సుపుణ్యమ్|
రక్షోభిరేవం బహుధా బ్రువద్భిః
శబ్దః కృతో ఘోరతరః సుభీమః||54.42||
స|| హా తాత హాపుత్త్రక హా కాన్త హా మిత్ర భోగయుతం సుపుణ్యం హా జీవితం బహుధా బ్రువద్భిః రక్షోభిః ఘోరతరః సుభీషః శబ్దః కృతః ||
|| శ్లోకార్థములు||
హా తాత హాపుత్త్రక -
ఓ తాత ఓ పుత్రా
హా కాన్త హా మిత్ర -
ఓ కాంతా ఓ మిత్రుడా
భోగయుతం సుపుణ్యం హా జీవితం-
భోగించతగిన పుణ్యమైన జీవితము
బహుధా బ్రువద్భిః -
అనేకవిధములుగా మాట్లాడు చున్న
రక్షోభిః ఘోరతరః సుభీషః శబ్దః కృతః - రాక్షసులందరి ద్వారా ఘోరమైన నాదము లేచెను
|| శ్లోకతాత్పర్యము||
'ఓ తాత ఓ పుత్రా ఓ మిత్రుడా భోగించతగిన పుణ్యమైన జీవితము నాశనమైనది' అంటూ అనేకవిధములుగా మాట్లాడు చున్న రాక్షసులందరి ద్వారా ఘోరమైన నాదము లేచెను'. ||54.42||
||శ్లోకము 54.43||
హుతాశనజ్వాలసమావృతా సా
హతప్రవీరా పరివృత్త యోధా|
హనూమతః క్రోధ బలాభిభూతా
బభూవ శాపోపహతేవ లంకా||54.43||
స|| హుతాశనజ్వాలసమావృతా హతప్రవీరాః పరివృత్తయోధా హనూమతః క్రోధబలాభిభూతా సా లంకా శాపోపహతేవ బభూవ||
|| శ్లోకార్థములు||
హుతాశనజ్వాలసమావృతా -
అగ్ని జ్వాలలతో చుట్టబడి,
హతప్రవీరాః పరివృత్తయోధా -
హతులైన యోధులతో, పారిపోతున్న సైనికులతో నిండిన
హనూమతః క్రోధబలాభిభూతా - హనుమంతుని క్రోధ బలములచే కూడిన
సా లంకా శాపోపహతేవ బభూవ -
లంకా నగరము శపింపబడినదా అన్నట్లు ఉండెను
|| శ్లోకతాత్పర్యము||
'హనుమంతుని క్రోధ బలములచే అగ్ని జ్వాలలతో చుట్టబడి, హతులైన యోధులతో, పారిపోతున్న సైనికులతో నిండిన లంకా నగరము శపింపబడినదా అన్నట్లు ఉండెను'. ||54.43||
||శ్లోకము 54.44||
ససంభ్రమత్రస్త విషణ్ణ రాక్షసామ్
సముజ్జ్వల జ్జ్వాలహుతాశనాంకితామ్|
దదర్శ లంకాం హనుమాన్మహామనాః
స్వయంభుకోపోపహతా మివావనిమ్||54.44||
స|| మహాత్మనః హనుమాన్ ససంభ్రమత్రస్తవిషణ్ణరాక్షసామ్ సముజ్జ్వలజ్జ్వాల హుతాశనాంకితామ్ లంకాం స్వయమ్భూకోపోపహతాం అవనిం ఇవ లంకాం దదర్శ||
|| శ్లోకార్థములు||
మహాత్మనః హనుమాన్ -
మహాత్ముడైన ఆ హనుమంతుడు
ససంభ్రమత్రస్తవిషణ్ణరాక్షసామ్ -
సంభ్రమముతో విషణ్ణులైన రాక్షసులతో
సముజ్జ్వలజ్జ్వాల హుతాశనాంకితామ్ -
అగ్నిజ్వాలలతో చుట్టబడి దగ్ధమౌతున్న
స్వయమ్భూకోపోపహతాం వనిం ఇవ -
స్వయముగా బ్రహ్మ యొక్క ఆగ్రహమునకు గురి అయినదా అన్నట్లు వున్న
లంకాం దదర్శ - లంకానగరమును చూసెను.
|| శ్లోకతాత్పర్యము||
'మహాత్ముడైన ఆ హనుమంతుడు సంభ్రమముతో విషణ్ణులైన రాక్షసులతో నిండిన అగ్నిజ్వాలలతో చుట్టబడి దగ్ధమౌతున్న స్వయముగా బ్రహ్మ యొక్క ఆగ్రహమునకు గురి అయినదా అన్నట్లు వున్న లంకానగరమును చూసెను'. ||54.44||
||శ్లోకము 54.45||
భఙ్‍క్త్వా వనం పాదపరత్నసంకులమ్
హత్వాతు రక్షాంసి మహాన్తి సంయుగే|
దగ్ధ్వా పురీం తాం గృహరత్న మాలినీమ్
తస్థౌ హనుమాన్ పవనాత్మజః కపిః||54.45||
స||పవనాత్మజః హనుమాన్ పాదపరత్నసంకులం వనం భుంక్త్వా సంయుగే మహన్తి రక్షాంసి హత్వా గృహరత్నమాలినీం తాం పురీం దగ్ధ్వా తస్థౌ||
|| శ్లోకార్థములు||
పాదపరత్నసంకులం వనం భుంక్త్వా -
అత్యంత ఉత్తమమైన వృక్షములతో కూడిన వనములను దహించి
సంయుగే మహన్తి రక్షాంసి హత్వా -
రాక్షసులను యుద్ధములో హతమార్చి,
గృహరత్నమాలినీం తాం పురీం దగ్ధ్వా- గృహములతో కూడిన ఆ లంకను దహించి
పవనాత్మజః హనుమాన్ తస్థౌ-
పవనాత్మజుడైన ఆ హనుమంతుడు అచట నిలబడెను
|| శ్లోకతాత్పర్యము||
అత్యంత ఉత్తమమైన వృక్షములతో కూడిన వనములను దహించి, రాక్షసులను హతమార్చి, రత్నమాలికలవలె కూర్చబడిన గృహములతో కూడిన లంకను దహించి ఆ పవనాత్మజుడైన ఆ హనుమంతుడు అచట నిలబడెను'.||54.45||
||శ్లోకము 54.46||
త్రికూటశృంగాగ్రతలే విచిత్రే
ప్రతిష్టితో వానరరాజసింహః|
ప్రదీప్త లాంగూలకృతార్చిమాలీ
వ్యరాజతాఽఽదిత్య ఇవాంశుమాలీ||54.46||
స||విచిత్రే త్రికూట శృంగాగ్రతలే ప్రతిష్టితః ప్రదీప్త లాంగూలకృతార్చిమాలీ వానరరాజసింహః అంశుమాలీ ఆదిత్య ఇవ వ్యరాజత||
|| శ్లోకార్థములు||
విచిత్రే త్రికూట శృంగాగ్రతలే ప్రతిష్టితః -
అ విచిత్రమైన త్రికూట శిఖరముపై నిలబడి
ప్రదీప్త లాంగూలకృతార్చిమాలీ -
ప్రజ్వలిస్తున్న లాంగూలముతో మాల వలె చుట్టబడి
వానరరాజసింహః -
ఆ వానరులలో సింహము లాంటి హనుమంతుడు
అంశుమాలీ ఆదిత్య ఇవ -
కిరణములమాలతో ప్రకాశించుచున్న సూర్యునివలె
వ్యరాజత - విరాజిల్లెను
|| శ్లోకతాత్పర్యము||
'అ విచిత్రమైన త్రికూట శిఖరముపై నిలబడి ప్రజ్వలిస్తున్న లాంగూలముతో ఆ వానరులలో సింహము లాంటి హనుమంతుడు కిరణములమాలతో ప్రకాశించుచున్న సూర్యునివలె విరాజిల్లెను'.||54.46||
||శ్లోకము 54.47||
స రాక్షసాం స్తాన్ సుబహూంశ్చ హత్వా
వనం చ భంక్త్వా బహుపాదపం తత్|
విసృజ్య రక్షోభవనేషు చాగ్నిమ్
జగామ రామం మనసా మహాత్మా||54.47||
స|| మహాత్మా సః సుబహూన్ తాన్ రాక్షసాన్ హత్వా బహుపాదపమ్ తత్ వనం చ భంక్త్వా రక్షోభవనేషు అగ్నిం విశ్రుజ్య మనసా రామం జగామ||
|| శ్లోకార్థములు||
మహాత్మా సః - మహాత్ము డైన ఆ హనుమంతుడు
సుబహూన్ తాన్ రాక్షసాన్ హత్వా -
అనేక మంది రాక్షసులను హతమార్చి
బహుపాదపమ్ తత్ వనం చ భంక్త్వా -
వృక్షములతో కూడిన వనములను భగ్నముచేసి
రక్షోభవనేషు అగ్నిం విశ్రుజ్య -
రాక్షస భవనములకు నిప్పు అంటించి
మనసా రామం జగామ -
మనస్సులో రాముని తలచుకొనెను
|| శ్లోకతాత్పర్యము||
'మహాత్ము డైన ఆ హనుమంతుడు అనేక రాక్షసులను వృక్షములతో కూడిన వనములను భగ్నముచేసి రాక్షస భవనములకు నిప్పు అంటించి మనస్సులో రాముని తలచుకొనెను'. ||54.47||
||శ్లోకము 54.48||
తతస్తు తం వానరవీర ముఖ్యం
మహాబలం మారుతతుల్య వేగమ్|
మహామతిం వాయుసుతం వరిష్టం
ప్రతుష్టువుర్దేవగణాశ్చ సర్వే||54.48||
స|| తతః వానరవీరముఖ్యం మహాబలం మారుతతుల్యవేగం మహామతిం వరిష్టం తం వాయుసుతం సర్వే దేవగణాః ప్రతుష్టువుః||
|| శ్లోకార్థములు||
తతః వానరవీరముఖ్యం -
అప్పుడు ఆ వానరవీరులలో ముఖ్యుడైన
మహాబలం మారుతతుల్యవేగం -
మహాబలవంతుడు మారుతితో సమానమైన వేగము కలవాడు
మహామతిం వరిష్టం -
గొప్పబుద్ధిశాలి అయిన సర్వశ్రేష్టుడు అయిన
తం వాయుసుతం-
ఆ వాయుసూనుని
సర్వే దేవగణాః ప్రతుష్టువుః-
దేవగణములందరూ ప్రశంశించిరి.
|| శ్లోకతాత్పర్యము||
'అప్పుడు ఆ వానరవీరులలో ముఖ్యుడైన మారుతితో సమానమైన వేగము కల మహాబలవంతుడైన గొప్పబుద్ధిశాలి అయిన సర్వశ్రేష్టుడు అయిన హనుమంతుని దేవగణములందరూ ప్రశంశించిరి'. ||54.48||
||శ్లోకము 54.49||
భఙ్‍క్త్వా వనం మహాతేజా హత్వా రక్షాంసి సంయుగే|
దగ్ధ్వా లంకాపురీం రమ్యాం రరాజ స మహాకపిః||54.49||
స||మహాతేజః మహాకపిః వనం భంక్త్వా సంయుగే రక్షాంసి హత్వా రమ్యాం లంకపురీమ్ దగ్ధ్వా రరాజ||
|| శ్లోకార్థములు||
మహాతేజః మహాకపిః -
ఆ మహాతేజోమయుడైన మహాకపి
వనం భంక్త్వా సంయుగే రక్షాంసి హత్వా-
వనములను ధ్వంసము చేసి యుద్ధములో రాక్షసులను హతమార్చి
రమ్యాం లంకపురీమ్ దగ్ధ్వా-
రమ్యమైన లంకానగరము దగ్ధము చేసి
రరాజ - రాజిల్లెను
|| శ్లోకతాత్పర్యము||
'ఆ మహాతేజోమయుడైన మాహాకపి వనములను ధ్వంసము చేసి యుద్ధములో రాక్షసులను హతమార్చి రమ్యమైన లంకానగరము దగ్ధము చేసి రాజించెను'. ||54.49||
||శ్లోకము 54.50||
తత్రదేవాః సగంధర్వాః సిద్ధాశ్చ పరమర్షయః|
దృష్ట్వా లంకాం ప్రదగ్ధాం తాం విస్మయం పరమం గతాః||54.50||
స||తత్ర సగంధర్వాః దేవాః సిద్ధాశ్చ పరమర్షయః దగ్ధాం తాం లంకాం పురీం దృష్ట్వా పరమమ్ విస్మయమ్ గతాః ||
|| శ్లోకార్థములు||
తత్ర సగంధర్వాః దేవాః -
అప్పుడు గంధర్వులతో కూడిన దేవతలూ
సిద్ధాశ్చ పరమర్షయః -
సిద్ధులు మహాఋషులూ
దగ్ధాం తాం లంకాం పురీం దృష్ట్వా -
ఆ దగ్ధమైన లంకను చూస్తూ
పరమమ్ విస్మయమ్ గతాః -
అత్యంత విస్మయము పొందిరి
|| శ్లోకతాత్పర్యము||
'అప్పుడు గంధర్వులతో కూడిన దేవతలూ సిద్ధులు మహాఋషులూ ఆ దగ్ధమైన లంకను చూస్తూ అత్యంత విస్మయము పొందిరి'.||54.50||
||శ్లోకము 54.51||
తం దృష్ట్వా వానరశ్రేష్ఠం హనుమంతం మహాకపిం|
కాలాగ్నిరితి సంచిన్త్య సర్వభూతాని తత్రసుః||54.51||
స|| వానరశ్రేష్ఠం మహాకపిం తం హనుమంతం దృష్ట్వా కాలాగ్నిః ఇతి సంచిత్య సర్వభూతాని తత్రసుః||
|| శ్లోకార్థములు||
వానరశ్రేష్ఠం మహాకపిం -
ఆ మహాకపి వానరలలో శ్రేష్టుడు
తం హనుమంతం దృష్ట్వా -
అయిన హనుమంతుని చూచి
కాలాగ్నిః ఇతి సంచిత్య -
అతడు కాలాగ్ని యే అని భావించి
సర్వభూతాని తత్రసుః -
సమస్తభూతములూ భయభ్రాంతులైరి
|| శ్లోకతాత్పర్యము||
'ఆ మహాకపి వానరలలో శ్రేష్టుడు అయిన హనుమంతుని చూచి సమస్తభూతములూ అతడు కాలాగ్ని యే అని భావించి భయభ్రాంతులైరి'.||54.51||
శ్లో|| దేవాశ్చ సర్వేమునిపుంగవాశ్చ
గంధర్వవిద్యాధరనాగయక్షాః|
భూతాని సర్వాణి మహాన్తి తత్ర
జగ్ముః పరాం ప్రీతిమతుల్యరూపామ్||54.52||
స||తత్ర సర్వే మునిపుంగవాశ్చ గంధర్వవిద్యాధరనాగయక్షాః మహంతి సర్వాణి భూతాని అతుల్యరూపాం పరాం ప్రీతిం జగ్ముః||
|| శ్లోకార్థములు||
తత్ర సర్వే మునిపుంగవాశ్చ -
అక్కడ ముని పుంగవులు అందరూ
గంధర్వవిద్యాధరనాగయక్షాః -
గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు,
మహంతి సర్వాణి భూతాని -
సమస్త భూతములు
అతుల్యరూపాం పరాం ప్రీతిం జగ్ముః -
అత్యంతమైన ఆనందమును పొందిరి.
|| శ్లోకతాత్పర్యము||
రాక్షసాధిపతి రావణుని లంకా దహనముతో,ముని పుంగవులు గంధర్వులు, విద్యాధరులు, నాగులు, యక్షులు, సమస్త భూతములు అత్యంతమైన ఆనందమును పొందిరి. ||54.52||
బాలకాండలో 15 వ సర్గలో రావణుని దుష్చేష్టల వలన సమస్త భూతములు దుఃఖములో వున్నారని వింటాము. ఇప్పుడు సమస్త భూతములు ఆనందము పొందిరి అన్నమాటకి మనము ఆశ్చర్య పడనక్కరలేదు.
ఇదే ఏబది నాలుగవ సర్గ లో మనము వినే కథ.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే చతుఃపంచాశస్సర్గః ||
||ఓమ్ తత్ సత్||