||సుందరకాండ ||
||ఏభై ఏడవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||
|| Sarga 57 || with Slokas and meanings in Telugu
|| Om tat sat ||
||ఓమ్ తత్ సత్||
సుందరకాండ.
అథ శ్లోకార్థ తత్త్వదీపికా సహిత
సప్తపంచాశస్సర్గః||
- "అసౌ హనుమాన్ సర్వథా కృతకార్యః" -
'సర్వథా కృతకార్యః', అంటే 'అన్ని విధములుగా కార్యము సాధించినవాడు' అని; ఎవరు ఆ కార్యములు సాధించినది? - 'అసౌ హనుమన్', అంటే 'ఆ హనుమంతుడు'; ఇది ఎవరు చెపుతున్నారు? దూరమునుంచి ఆకాశములో ఎగురుతున్న హనుమంతుని గర్జన వినిన, జాంబవంతుడు చెప్పినమాట.
వానరలు అందరూ సీతాన్వేషణకి దక్షిణ సముద్ర తీరమున, ఆ సముద్రము దాటలేమని నిరాశ పడుతున్నప్పుడు, హనుమంతుని ప్రేరేపించిన వాడు కూడా జాంబవంతుడే.
జాంబవంతుని ప్రేరణ వలననే హనుమ సాగరము దాటడానికి నిశ్చయించుకున్నాడు. హనుమంతుడు తిరుగు ప్రయాణములో చేసిన గర్జన తో జాంబవంతుడుకి అర్థమైంది. హనుమ, 'సర్వథా కృతకార్యః', అన్నివిధాల పని సాధించుకు వస్తున్నాడు అని.
జాంబవంతుడికి హనుమ పై ఎంత నమ్మకమో, అది ఇంకో ఉదాహరణతో మనకి తెలిసి వస్తుంది. యుద్ధకాండలో యుద్ధరంగములో ఇంద్రజిత్తు ప్రయోగించిన బ్రహ్మాస్త్రముతో, విభీషణుడు హనుమ తప్ప, రామ లక్ష్మణులతో సహ సమస్త వానర సైన్యము దెబ్బతిని మూర్ఛిల్లి పడిపోయారు. అప్పుడు ఆ రాత్రి హనుమ విభీషణుడు యుద్ధరంగములో ఎవరు బ్రతికి ఉన్నారో చూడడానికి బయలు దేరుతారు. ఆ చీకటిలో గాయపడి వున్న జాంబవంతుడు కనిపిస్తాడు. చీకటిలో చూడలేకపోయినా, మాటలతో విభీషణుని గుర్తించి జాంబవంతుడే అడుగుతాడు, 'హనుమ ఎలాగ వున్నాడు' అని. ఆ ప్రశ్న విని విభీషణుడు ఆశ్చర్యపోతాడు.
ఈ యుద్ధానికి ముఖ్యులు రామలక్ష్మణులు. ఆ తరువాత ముఖ్యుడు వానరాధిపతి అయిన సుగ్రీవుడు. వీళ్ళ క్షేమ సమారాచారములు అడగకుండా, హనుమ క్షేమము ఎందుకు అడుగుతున్నాడు అని వీభీషణుని ఆలోచన.
ఆశ్చర్యపోయిన విభీషణుడు, జాంబవంతుని అదే ప్రశ్న అడుగుతాడు. దానికి జాంబవంతుని సమాధానము విన తగినది. జాంబవంతుడు చెప్పిన మాట ఇది.
"హనుమ బ్రతికి ఉంటే, మనము చనిపోతున్నా బ్రతికి బయటపడతాము. హనుమ లేకపోతే, మనము బ్రతికి వున్నా లేనట్టే లెక్క" అని.
అది జాంబవంతునికి హనుమంతుని పై వున్న విశ్వాసము. అందుకనే హనుమ గర్జన వినగానే, జాంబవంతుడు నిస్సంశయముగా హనుమ జయము సాధించాడు అని చెపుతాడు.
హనుమ చేసిన కార్యాలలో చాలా విశేషాలు ఉంటాయి. ఈ తిరుగు ప్రయాణములో ఇంకో మాట వింటాము. 'పర్వతేన్ద్రం సునాభం చ సముస్పృశ్య వీర్యవాన్', అంటే దారిలో పర్వతేంద్రియమైన మైనాకుని స్పృశించి మరీ వెళతాడుట.
హనుమ లో ఇంకో విశేషము. మహేంద్రపర్వతము మీద దిగిన హనుమ, వానరులకు తన ఘనత వినిపించకుండా, 'దృష్టా సీతేతి', అంటే సీతమ్మని చూచితిని అని, సీతమ్మ క్షేమము గురించి క్లుప్తముగా చెపుతాడు. అదే విని వానరులందరూ సంతోషపడతారు, గంతులు వేస్తారు
ఇది ఎలా జరిగిందో మనము ఈ సర్గలో వింటాము.
ఇక ఈ సర్గలో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.
||శ్లోకము 57.01||
స చంద్ర కుసుమం రమ్యం సార్క కారణ్డవం శుభం|
తిష్యశ్రవణకాదమ్బ మభ్రశైవాలశాద్వలమ్||57.01||
స|| స చంద్ర కుసుమం రమ్యం | సార్కకారండవమ్ శుభం| తిష్యశ్రవణ కాదమ్బం| అభ్రశైవాలశాద్వలమ్ |
||శ్లోకార్థములు||
స చంద్ర కుసుమం రమ్యం -
చంద్రుడు రమ్యమైన తెల్ల కలువలాగాను
సార్కకారండవమ్ శుభం -
సూర్యుడు కారండవ పక్షి లాగాను
తిష్యశ్రవణ కాదమ్బం -
పుష్య శ్రవణ నక్షత్రములు కలహంసలుగానూ
అభ్రశైవాలశాద్వలమ్ -
మేఘాలు పచ్చి బీళ్ళవలెను
||శ్లోకతాత్పర్యము||
"ఆ అకాశములాంటి సముద్రములో చంద్రుడు తెల్ల కలువలాగాను , సూర్యుడు కారండవ పక్షి లాగాను మేఘాలు పచ్చి బీళ్ళవలెను, పుష్య శ్రవణ నక్షత్రములు కలహంసలుగానూ; ||57.01||
ఈ సర్గలో మొదటి ఆరు శ్లోకాలలో తిరుగు ప్రయాణములో, ఆకాశములో వాయువేగము తో ఎగురుచున్న హనుమ, ఒక పెద్ద ఓడ సముద్రాన్ని దాటినట్లు, అవధి లేని సముద్రాన్ని అనాయాసముగా దాటుచుండెను అని చెపుతూ, అకాశమునకు సముద్రము ఉపమానముగా తీసుకొని వర్ణిస్తాడు కవి.
ఆ అద్భుత వర్ణన ఇలా సాగుతుంది ముందు శ్లోకాలలో;
ఆ అకాశములాంటి సముద్రములో చంద్రుడు తెల్ల కలువలాగాను; సూర్యుడు కారండవ పక్షి లాగాను, మేఘాలు పచ్చి బీళ్ళవలెను; పుష్య శ్రవణ నక్షత్రములు కలహంసలుగానూ; పునర్వసు నక్షత్రము మహామీనము గానూ; కుజగ్రహము పెద్ద మొసలిగానూ ; ఐరావతమే మహాద్వీపముగానూ ; స్వాతీ నక్షత్రము హంసగానూ; వాయుతరంగములు జలతరంగములుగానూ; చంద్రకిరణాలు, చల్లని ఉదకముగనూ; యక్ష గంధర్వ ఉరగములు, కలువలూ తామరల వలెనూ విరాజిల్లుతున్నారు అని. అది ఆకాశ వర్ణన.
||శ్లోకము 57.02||
పునర్వసు మహామీనం లోహితాంగమహాగ్రహమ్ |
ఇరావత మహాద్వీపం స్వాతీహంసవిలోళితమ్ ||57.02||
స|| పునర్వసుమహామీనం | లోహితాంగ మహాగ్రహం | ఐరావత మహాద్వీపం | స్వాతీహంసవిలోళితమ్|
||శ్లోకార్థములు||
పునర్వసుమహామీనం -
పునర్వసూ నక్షత్రము మహామీనము గానూ
లోహితాంగ మహాగ్రహం -
కుజగ్రహము పెద్ద మొసలిగానూ
ఐరావత మహాద్వీపం -
ఇరావతమే మహాద్వీపముగానూ
స్వాతీహంసవిలోళితమ్ -
స్వాతీ నక్షత్రము హంసగానూ
||శ్లోకతాత్పర్యము||
పునర్వసు నక్షత్రము మహామీనము గానూ, కుజగ్రహము పెద్ద మొసలిగానూ , ఐరావతమే మహాద్వీపముగానూ, స్వాతీ నక్షత్రము హంసగానూ ; ||57.02||
||శ్లోకము 57.03||
వాతసంఘాతజాతోర్మి చన్ద్రాంశుశిశిరామ్బుమత్ |
భుజంగయక్షగంధర్వ ప్రబుద్ధ కమలోత్పలమ్ ||57.03||
స|| వాతసంఘాత్జాతోర్మి |చన్ద్రశిశురాంబుమత్| భుజంగయక్షగంధర్వప్రబుద్ధ కమలోత్పలమ్ |
||శ్లోకార్థములు||
వాతసంఘాత్జాతోర్మి -
ఆ వాయుతరంగములు జలతరంగములుగానూ
చన్ద్రశిశురాంబుమత్ -
చంద్రకిరణాలే చల్లని ఉదకముగనూ
భుజంగయక్షగంధర్వ -
యక్ష గంధర్వ ఉరగములు
ప్రబుద్ధ కమలోత్పలమ్ -
కలువలూ తామరలలాగానూ
||శ్లోకతాత్పర్యము||
ఆ వాయుతరంగములు జలతరంగములుగానూ , చంద్రకిరణాలే చల్లని ఉదకముగనూ యక్ష గంధర్వ ఉరగములు కలువలూ తామరలలాగానూ విరాజిల్లుతున్నాయి. ||57.03||
||శ్లోకము 57.04||
హనుమాన్మారుతగతి ర్మహానౌరివ సాగరమ్|
అపార మపరిశ్రాంతం పుప్లువే గగనార్ణవమ్||57.04||
స|| అపారం అపరిశ్రాంతం గగనార్ణవమ్ మహనౌః సాగరం ఇవ హనుమాన్ మారుతగతిః పుప్లువే||
||శ్లోకార్థములు||
అపారం గగనార్ణవమ్ -
అవధి లేని అకాశమును
మహనౌః సాగరం ఇవ -
పెద్ద ఓడ సముద్రాన్ని దాటినట్లు
హనుమాన్ మారుతగతిః -
వాయువేగము కల హనుమంతుడు
అపరిశ్రాంతం పుప్లువే -
అనాయాసముగా దాటుతున్నాడు
||శ్లోకతాత్పర్యము||
వాయువేగము కల హనుమంతుడు ఒక పెద్ద ఓడ సముద్రాన్ని దాటినట్లు అవధి లేని ఆకాశమును అనాయాసముగా దాటుతున్నాడు. ||57.04||
అకాశము వర్ణించిన తరువాత , కవి దృష్టి హనుమ వేపు వెళ్ళుతుంది. ఇక్కడ మారుతాత్మజుడు, శ్రీమాన్ మహాకపి. ఆ హనుమ తిరుగు ప్రయాణములో ఆకాశములో ఎలా కనిపిస్తున్నాడో ముందు శ్లోకాలలో వర్ణిస్తాడు.
||శ్లోకము 57.05,06||
గ్రసమాన ఇవాకాశం తారాధిప మివోల్లిఖన్|
హారన్నివ స నక్షత్రమ్ గగనం సార్క మణ్డలమ్ ||57.05||
మారుతస్యాత్మజః శ్రీమాన్కపి ర్వ్యోమచరో మహాన్|
హనుమన్మేఘజాలాని వికర్షన్నివ గచ్ఛతి ||57.06||
స|| మారుతస్య ఆత్మజః శ్రీమాన్ మహాన్ కపిః హనుమాన్ వ్యోమచరః ఆకాసం గ్రసమానః ఇవ తారాధిపం ఉల్లిఖనివ సనక్షత్రం సార్కమండలం గగనం హరన్ ఇవ మేఘజాలాని వికర్షన్ ఇవ గచ్ఛతి ||
||శ్లోకార్థములు||
మారుతస్య ఆత్మజః శ్రీమాన్ -
మారుతియొక్క ఆత్మజుడు, శ్రీమంతుడు
మహాన్ కపిః వ్యోమచరః హనుమాన్ -
మహాకపి వినువీధిలో తిరుగుచున్నవాడు అయిన హనుమంతుడు
ఆకాసం గ్రసమానః ఇవ -
ఆకాశమును మింగుతున్నాడా అన్నట్లు
తారాధిపం ఉల్లిఖనివ -
తారాధిపుని స్పర్శితూ పోతున్నాడా అన్నట్లు
సనక్షత్రం సార్కమండలం -
నక్షత్ర సూర్యమండలములతో కూడిన
గగనం హరన్ ఇవ -
ఆకాశాన్ని హరిస్తున్నాడా అన్నట్లు
మేఘజాలాని వికర్షన్ ఇవ -
మేఘసమూహాలను తనతో ఈడ్చుకుపోతున్నాడా
గచ్ఛతి - వెళ్ళుచుండెను
||శ్లోకతాత్పర్యము||
మారుతియొక్క ఆత్మజుడు, శ్రీమాన్ మహాకపి, వినువీధిలో తిరుగుచున్నవాడు అయిన హనుమంతుడు, ఆకాశమును మింగుతున్నాడా అన్నట్లు, తారాధిపుని స్పర్శితూ పోతున్నాడా అన్నట్లు, నక్షత్ర సూర్యమండలములతో కూడిన ఆకాశాన్ని హరిస్తున్నాడా అన్నట్లు, మేఘ సమూహాలను తనతో ఈడ్చుకుపోతున్నాడా అన్నట్లు కానవచ్చెను. ||57.05,06||
||శ్లోకము 57.07||
పాణ్డురారుణవర్ణాని నీలమాంజిష్టకాని చ |
హరితారూణ వర్ణాని మహాభ్రాణి చకాశిరే ||57.07||
స|| పాణ్డురారుణ వర్ణాని నీలమాంజిష్టకాని చ హరితారుణ వర్ణాని మహభ్రాణి చకాశిరే||
||శ్లోకార్థములు||
పాణ్డురారుణ వర్ణాని -
తెలుపు ఎఱుపు రంగులతో
నీలమాంజిష్టకాని చ -
నీలం పసుపు రంగులతో
హరితారుణ వర్ణాని -
ఆకుపచచ్చ ఎఱుపు రంగులతో
మహభ్రాణి చకాశిరే -
మేఘములు ప్రకాశించినవి
||శ్లోకతాత్పర్యము||
ఆ మేఘములు తెలుపు ఎఱుపు నీలం పసుపు ఆకుపచ్చ రంగులతో వెలుగుతూ ప్రకాశించినవి. ||57.07||
||శ్లోకము 57.08||
ప్రవిశన్నభ్రజాలాని నిష్పతం చ పునః పునః |
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చన్ద్రమా ఇవ లక్ష్యతే ||57.08||
స|| అభ్రజాలాని ప్రవిశన్ పునః పునః నిష్పతంశ్చప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ చంద్రమాః లక్ష్యతే||
||శ్లోకార్థములు||
అభ్రజాలాని ప్రవిశన్ -
ఆ మేఘసమూహాలలోకి ప్రవేశిస్తూ
పునః పునః నిష్పతంశ్చ -
మళ్ళీ మళ్ళీబయటికి వస్తున్న
ప్రచ్ఛన్నశ్చ ప్రకాశశ్చ -
మబ్బుల తో కప్పబడి మరల కనపడుతూ
చంద్రమాః లక్ష్యతే -
చంద్రుని వలె ప్రకాశించెను
||శ్లోకతాత్పర్యము||
"ఆ మేఘసమూహాలలోకి ప్రవేశిస్తూ బయటికి వస్తున్న హనుమంతుడు మబ్బులతో కప్పబడి, మరల కనపడే చంద్రుని వలె ప్రకాశించెను." ||57.08||
||శ్లోకము 57.09||
వివిధాభ్రఘనాపన్న గోచరో ధవళాంబరః |
దృశ్యాదృశ్యతనుర్వీరః తదా చన్ద్రాయతేఽమ్బరే ||57.09||
స|| తదా వివిధాభ్రఘనాపన్నగోచరః ధవళాంబరః దృశ్యాదృశ్య తనుః వీరః అమ్బరే చన్ద్రాయతే ||
గోవిన్దరాజ టీకాలో - ధవళాంబరః శుక్లవాసాః, దృశ్యాదృశ్య తనుః మేఘాన్తః ప్రవేశనిష్క్రమాణాభ్యాం ఇతి భావః।
||శ్లోకార్థములు||
తదా వివిధాభ్రఘనాపన్నగోచరః -
దట్టమైన మేఘములలో దూసుకు పోతూ
ధవళాంబరః వీరః -
ధవళవస్త్ర ధారి అయిన వీరుడు
దృశ్యాదృశ్య తనుః -
కనపడీ కనపడకుండా
అమ్బరే చన్ద్రాయతే -
ఆకాశములో చంద్రుని వలె ప్రకాశించుచుండెను.
||శ్లోకతాత్పర్యము||
ధవళవస్త్ర ధారి అయిన హనుమంతుడు, దట్టమైన మేఘములలో దూసుకు పోతూ, అప్పుడప్పుడు కనపడీ కనపడకుండా మబ్బులచాటునుండు చంద్రుని వలె ప్రకాశించుచుండెను. ||57.09||
||శ్లోకము 57.10||
తార్‍క్ష్యయమాణే గగనే భభాసే వాయునన్దనః |
దారయన్మేఘబృన్దాని నిష్ప్రతం చ పునః పునః ||57.10||
నదన్నాదేన మహతా మేఘస్వనమహాస్వనః |
స|| మేఘవృందాని దారయన్ పునః పునః నిష్పతంశ్చ మహతా నాదేన మేఘస్వన మహాస్వనః వాయునన్దనః గగనే తార్‍క్ష్యాయమానః బభాసే ||
||శ్లోకార్థములు||
మేఘవృందాని దారయన్ -
మేఘములలో దారిచేసుకుంటూ
పునః పునః నిష్పతంశ్చ -
మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూ
మహతా నాదేన మేఘస్వన మహాస్వనః -
మేఘముల గర్జన తో సమానమైన మహత్తరమైన నాదముతో
వాయునన్దనః గగనే -
వాయునందనుడు ఆకాశములో
తార్‍క్ష్యాయమానః బభాసే-
గరుడుని వలే ప్రకాశించెను
||శ్లోకతాత్పర్యము||
మేఘములలో దారిచేసుకుంటూ, మళ్ళీ మళ్ళీ బయటకు వస్తూ, మేఘముల గర్జన తో సమానమైన మహత్తరమైన నాదముతో, వాయునందనుడు ఆకాశములో గరుడుని వలే ప్రకాశించెను. ||57.10||
||శ్లోకము 57.11,12||
ప్రవరాన్ రాక్షసాన్ హత్వా నామ విశ్రావ్యచాత్మనః ||57.11||
అకులాం నగరీం కృత్వా వ్యథయిత్వా చ రావణమ్ |
అర్థయిత్వా బలం ఘోరం వైదేహీమభివాద్య చ ||57.12||
అజగామ మహాతేజాః పునర్మధ్యేన సాగరమ్ |
స|| మహాతేజః ప్రవరాన్ రాక్షసాన్ హత్వా ఆత్మనః నామ విశ్రావ్య నగరీం అకులం కృత్వా రావణమ్ వ్యధయిత్వా ఘోరం బలం అర్దయిత్వా వైదేహీం అభివాద్య చ పునః సాగరం మధ్యేన ఆజగామ||
||శ్లోకార్థములు||
మహాతేజః ప్రవరాన్ రాక్షసాన్ హత్వా -
మహాతేజోమయుడు రాక్షసముఖ్యులను హతమార్చి
ఆత్మనః నామ విశ్రావ్య -
తనపేరుని చాటించుకొని
నగరీం అకులం కృత్వా -
లంకానగరమును అస్తవ్యస్తము చేసి
ఘోరం బలం అర్దయిత్వా-
ఘోరమైన బలములను జయించి
రావణమ్ వ్యధయిత్వా -
రావణునికి వ్యధకల్పించి
వైదేహీం అభివాద్య చ -
వైదేహికి నమస్కరించి
పునః సాగరం మధ్యేన ఆజగామ -
మరల సాగరమధ్యములో చేరెను
||శ్లోకతాత్పర్యము||
ఆ మహాతేజోమయుడైన హనుమంతుడు పలువురు రాక్షసముఖ్యులను హతమార్చి, తన పేరుని చాటించుకొని, లంకానగరమును అస్తవ్యస్తము చేసి, ఘోరమైన బలముతో రావణునికి వ్యధకల్పించి, వైదేహికి నమస్కరించి మరల సాగరమధ్యములో చేరెను. ||57.11,12||
ఇది ,'జయత్యతి బలోరామో', అంటూ రామలక్ష్మణ సుగ్రీవుల పేర్లు చాటి , రాక్షస హృదయాలలో భయము పుట్టించడానికి తన పరాక్రమము వివరించి , మీరందరూ చూస్తూవుండగా సీతమ్మవారికి నమస్కరించి మరీ వెడతాను అని పలికిన హనుమంతుని మాటల ప్రతి ధ్వని.
||శ్లోకము 57.13||
పర్వతేన్ద్రం సునాభం చ సముస్పృశ్య వీర్యవాన్||57.13||
జ్యాముక్త ఇవ నారాచో మహావేగోఽభ్యుపాగతః|
స|| వీర్యవాన్ పర్వతేంద్రం సునాభం చ సముస్పృశ్య జ్యాముక్తః నారాచః ఇవ మహావేగః అభ్యుపాగతః||
||శ్లోకార్థములు||
వీర్యవాన్ పర్వతేంద్రం -
వీరుడు హనుమంతుడు పర్వతేంద్రుడు అయిన
సునాభం చ సముస్పృశ్య -
మైనాకుని స్పృశించి,
జ్యాముక్తః నారాచః ఇవ -
ధనస్సునుండి విడువబడిన బాణమువలె
మహావేగః అభ్యుపాగతః -
మహావేగముకలవాడై పోసాగెను.
||శ్లోకతాత్పర్యము||
వీరుడు హనుమంతుడు సముద్రమధ్యములో మైనాకుని స్పృశించి, ధనస్సు నుండి విడువబడిన బాణమువలె మహావేగముకలవాడై పోసాగెను. ||57.13||
మొదటి సర్గలో రామకార్యము కొఱకు వెళ్ళుతున్న హనుమ, 'ప్రతిజ్ఞా చ మయా దత్తా'- అంటే ప్రతిజ్ఞచేశాను ఆగను', అని చెప్పి, మైనాకుని ఆతిధ్యము తీసుకోకుండా, ఆతిథ్యము తీసుకొనినట్లే భావింపమని చెప్పి, ముందుకు సాగి పోతాడు. ఇప్పుడు తిరుగుప్రయాణములో అదే గుర్తు వుంచుకొని, హనుమ మైనాకుని స్పృశించి మరీ వెళతాడన్నమాట. అదే హనుమ ప్రత్యేకత.
||శ్లోకము 57.14||
స కించిదనుసంప్రాప్తః సమాలోక్య మహాగిరిమ్ ||57.14||
మహేన్ద్రం మేఘసంకాశం ననాద హరిపుంగవః |
స|| సః హరిపుంగవః మహాగిరిం మేఘసంకాశం మహేంద్రం కించిత్ అనుసంప్రాప్తః సమాలోక్య ననాద ||
గోవిన్దరాజ టీకాలో - కించిదనుసంప్రాప్తః మైనాకాత్ పరం కచిత్ ప్రదేశం ప్రాప్తః |
||శ్లోకార్థములు||
సః హరిపుంగవః -
ఆ హరిపుంగవుడు
కించిత్ అనుసంప్రాప్తః -
కొంచెము దగ్గరగా వస్తూ
మహాగిరిం మేఘసంకాశం మహేంద్రం -
మేఘములతో సదృశమైన మహాపర్వతము అగు మహేంద్రమును
సమాలోక్య ననాద - చూచి మహానాదము చేసెను
||శ్లోకతాత్పర్యము||
ఆ హరిపుంగవుడు మేఘములతో సదృశమైన మహేంద్ర పర్వతము సమీపిస్తూ మహానాదము చేసెను. ||57.14||
||శ్లోకము 57.15||
స పూరయామాస కపిర్దిశో దశ సమన్తతః ||57.15||
నదన్నదేన మహతా మేఘస్వనమహాస్వనః |
స|| మేఘస్వనమహాస్వనః సః కపిః నదన్ మహతా నాదేన దశ దిశః సమన్తతః పూరయామాస ||
||శ్లోకార్థములు||
మేఘస్వనమహాస్వనః -
మేఘగర్జనలాంటి నాదము కల
సః కపిః నదన్ మహతా నాదేన -
ఆ మహాకపి చేసిన ఆ మహానాదము
దశ దిశః సమన్తతః పూరయామాస -
అన్ని దిశలనూ నింపివేసెను
||శ్లోకతాత్పర్యము||
మేఘగర్జనలాంటి నాదము కల ఆ మహాకపి, ఆ నాదముతో అన్ని దిశలనూ నింపివేసెను. ||57.15||
||శ్లోకము 57.16||
స తం దేశమనుప్రాప్తం సుహృద్దర్శన లాలసా ||57.16||
ననాద హరిశార్దూలో లాంగూలం చాప్యకమ్పయత్ |
స|| తం దేశం అనుప్రాప్తః సుహృత్ దర్శన లాలసః సా హరిశార్దూలః ననాద| లాంగూలం అకంప్యచ ||
||శ్లోకార్థములు||
తం దేశం అనుప్రాప్తః -
ఆ ప్రదేశమును సమీపించి
సుహృత్ దర్శన లాలసః -
మిత్రుల దర్శన లాలసుడైన
సా హరిశార్దూలః ననాద -
ఆ హనుమంతుడు నాదము చేసెను
లాంగూలం అకంప్యచ -
తన లాంగూలమును అటూ ఇటూ తిప్పెను
||శ్లోకతాత్పర్యము||
ఆ ( మహేంద్ర పర్వత) ప్రదేశమును సమీపించి, మిత్రుల దర్శన లాలసుడైన హనుమంతుడు, నాదము చేసెను. తనలాంగూలము అటూ ఇటూ తిప్పెను. ||57.16||
||శ్లోకము 57.17||
తస్య నానద్యమానస్య సుపర్ణ చరితే పథి ||57.17||
ఫలతీవాస్య ఘోషేణ గగనం సార్కమణ్డలమ్ |
స|| సుపర్ణచరితే పథి నానద్యమానస్య అస్య ఘోషేణ సార్కమండలం గగనం ఫలతి ఇవ ( అభూత్) ||
||శ్లోకార్థములు||
సుపర్ణచరితే పథి -
సుపర్ణ పథములో పోవుచున్న
నానద్యమానస్య అస్య ఘోషేణ -
నాదము చేయుచున్న ఆ హనుమంతుని ఘోషతో
సార్కమండలం గగనం ఫలతి ఇవ -
సూర్యమండలముతో కూడిన ఆకాశము బద్దలవుతున్నదా అన్నట్లు (వుండెను)
||శ్లోకతాత్పర్యము||
సుపర్ణ పథములో పోవుచున్న, నాదము చేయుచున్న, ఆ హనుమంతుని ఘోషతో ఆకాశము బద్దలవుతున్నదా అన్నట్లు వుండెను. ||57.17||
||శ్లోకము 57.18,19||
యేతు తత్రోత్తరే తీరే సముద్రస్య మహాబలాః ||57.18||
పూర్వం సంవిష్ఠితాః శూరాః వాయుపుత్త్ర దిదృక్షవః |
మహతో వాతనున్నస్య తో యద స్యేవ గర్జితమ్ ||57.19||
శుశ్రువుస్తే తదా ఘోషం ఊరువేగం హనూమతః |
స|| తత్ర సముద్రస్య ఉత్తరతీరే పూర్వం సంవిష్టితాః మహాబలాః శూరాః వాయుపుత్రదిద్రుక్షవః యే తే తదా వాతనున్నస్య మహతః తోయదయ గర్జితం ఇవ హనూమతః ఘోషం ఊరువేగం శుశ్రువుః ||
||శ్లోకార్థములు||
తత్ర సముద్రస్య ఉత్తరతీరే -
ఆ సముద్రముయొక్క ఉత్తరతీరములో
పూర్వం సంవిష్టితాః -
ముందునుంచే యున్న
మహాబలాః శూరాః -
మహాబలులూ శూరులూ
వాయుపుత్రదిద్రుక్షవః -
వాయుపుత్రుని రాకకై ఎదురు చూచుచున్నవారూ
యే తే తదా - వారందరూ అప్పుడు
వాతనున్నస్య మహతః తోయదయ గర్జితం ఇవ -
ఊరువేగములతో కూడిన మహత్తరమైన మేఘగర్జనలాంటి
హనూమతః ఘోషం ఊరువేగం శుశ్రువుః-
హనుమంతుని ఘోషను ఊరువేగముల శబ్దమునూ వినిరి
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు, ఆ సముద్రముయొక్క ఉత్తర తీరములో ముందునుంచే యున్న మహాబలురూ, శూరులూ, వాయుపుత్రుని రాకకై ఎదురు చూచుచున్నవారూ, ఆ మహత్తరమైన మేఘగర్జనలాంటి ఊరువేగముల శబ్దమునూ వినిరి. ||57.18,19||
||శ్లోకము 57.20||
తే దీనమససః సర్వే శుశ్రువుః కాననౌకసః ||57.20||
వానరేన్ద్రస్య నిర్ఘోషం పర్జన్య నినదోపమమ్ |
స|| దీనమనసః తే సర్వే కాననౌకసః వానరేంద్రస్య పర్జన్య నినదోపమమ్ నిర్ఘోషం శుశ్రువుః||
తిలక టీకాలో - వానరేంద్రస్య నిర్ఘోషం తస్య సింహనాదం|
గోవిన్దరాజ టీకాలో - తే దీనమనస ఇతి| అనిష్ట శ్రవణ శఙ్కాత్ దీనమనసః ఇతి|
||శ్లోకార్థములు||
దీనమనసః తే సర్వే -
దీనమైన మనస్థితో లో వున్న వారందరూ
కాననౌకసః వానరేంద్రస్య -
ఆతురతతో వానరేంద్రుని
పర్జన్య నినదోపమమ్ నిర్ఘోషం -
మేఘగర్జననలాంటి గర్జనను
శుశ్రువుః - వినిరి
||శ్లోకతాత్పర్యము||
దీనమైన మనస్థితో లో వున్న ఆ వానరులు, వానరేంద్రుని మేఘగర్జననలాంటి నాదము వినిరి. ||57.20||
ఉత్తరతీరములో వున్నవానరులకి ఒకవేపు ప్రభువు ఇచ్చిన కాల అవధి దాటిపోతోంది అనే భయము. లంకకు వెళ్ళిన హనుమపై ధైర్యము వున్నా, ఎక్కడ సీతమ్మ కనపడలేదు అనే అశుభ వార్త వింటామో అని భయము. ఈ భయాలతో దీనమైన మనస్సు కలవారు అని గోవిన్దరాజులవారి వ్యాఖ్య.
వానరుని యొక్క ఘోష అంటే, హనుమంతుని సింహనాదము అని తిలక టీకాలో
||శ్లోకము 57.21||
నిశమ్య నదతో నాదం వానరాః తే సమన్తతః ||57.21||
బభూవురుత్సుకాః సర్వే సుహృద్దర్శనకాంక్షిణః |
స|| సర్వే సమన్తతః తే వానరాః నదతః నాదం నిశమ్య సుహృత్ దర్సన కాంక్షిణః ఉత్సుకాః బభూవుః ||
||శ్లోకార్థములు||
సర్వే సమన్తతః తే వానరాః -
అప్పుడు గుమిగూడి యున్న ఆ వానరులు అందరూ
నదతః నాదం నిశమ్య -
ఆ నాదము చేయుచున్న హనుమంతుని నాదము విని
సుహృత్ దర్శన కాంక్షిణః -
హనుమద్దర్శన కాంక్షతో
ఉత్సుకాః బభూవుః -
ఉత్సాహముకలవారు అయిరి
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు గుమిగూడి యున్న ఆ వానరులు అందరూ, ఆ హనుమంతుని నాదము విని, హనుమద్దర్శన కాంక్షతో ఉత్సాహముకలవారు అయిరి. ||57.21||
||శ్లోకము 57.22||
జాంబవాన్ స హరిశ్రేష్ఠః ప్రీతిసంహృష్టమానసః ||57.22||
ఉపామన్త్ర్య హరీన్ సర్వాన్ ఇదం వచనమబ్రవీత్ |
స|| హరిశ్రేష్ఠః సః జామ్బవాన్ ప్రీతి సంహృష్టమానసః సర్వాన్ హరీన్ ఉపామన్త్ర్య ఇదం వచనం అబ్రవీత్ ||
||శ్లోకార్థములు||
హరిశ్రేష్ఠః సః జామ్బవాన్ -
హరిశ్రేష్ఠుడైన ఆ జాంబవంతుడు
ప్రీతి సంహృష్టమానసః -
ప్రీతితో నిండిన మనస్సు కలవాడై
సర్వాన్ హరీన్ ఉపామన్త్ర్య -
అక్కడి వానరులందరిని దగ్గర చేసికొని
ఇదం వచనం అబ్రవీత్ -
ఈ మాటలు పలికెను
||శ్లోకతాత్పర్యము||
హరిశ్రేష్ఠుడైన ఆ జాంబవంతుడు, ప్రీతితో నిండిన మనస్సు కలవాడై, అక్కడి వానరులందరిని దగ్గర చేసికొని, ఈ మాటలు పలికెను. ||57.22||
||శ్లోకము 57.23||
సర్వథా కృతకార్యోఽసౌ హనుమాన్నాత్ర సంశయః ||57.23||
న హ్యా స్యాకృతకార్యస్య నాద ఏవం విధో భవేత్ |
స|| అసౌ హనుమాన్ సర్వథా కృతకార్యః | అకృతకార్యస్య అస్య నాదః ఏవం విధః న భవేత్ హి ||
రామ టీకాలో - సర్వథా ఇతి | హి యతః అకృతకార్యస్య అస్య హనుమత ఏవం విధో నాదం న భవేత్ | అతః అసౌ హనుమాన్ సర్వథా సర్వ ప్రకారేణ కృత కార్యః అత్ర సంశయః న |
||శ్లోకార్థములు||
అసౌ హనుమాన్ -
ఈ హనుమంతుడు
సర్వథా కృతకార్యః -
అన్ని విధములుగా కృతకృత్యుడైనవాడు
అకృతకార్యస్య అస్య నాదః -
కృతకృత్యుడు కాని వాడి నాదము
ఏవం విధః న భవేత్ హి-
ఈ విధముగా వుండదు
||శ్లోకతాత్పర్యము||
'ఈ హనుమంతుడు అన్ని విధములుగా కృతకృత్యుడైనవాడు. కృతకృత్యుడు కాని వాడి నాదము ఈ విధముగా వుండదు'. ||57.23||
వినపడే హనుమ గర్జనల శబ్దములో వినిబడేది ఉత్సాహము, అయ్యో అనే దీనము కాదు. అందుకనే కృతకృత్యుడు కాని వాడి నాదము, ఈ విధముగా వుండదు అని చెప్పడమౌతుంది . ఇదే మాట మళ్ళీ అరవై నాలుగొవ సర్గలో సుగ్రీవుడు రాముడికి చెపుతాడు.
||శ్లోకము 57.24||
తస్య బాహూరువేగం చ నినాదం చ మహాత్మనః ||57.24||
నిశమ్య హరయో హృష్టాః సముత్పేతుః తతస్తతః |
స|| మహాత్మనః తస్య బాహూరువేగం చ నినాదం చ నిశమ్య హృష్టాః హరయః తతః తతః సముత్పేతుః ||
||శ్లోకార్థములు||
మహాత్మనః తస్య బాహూరువేగం చ -
ఆ మహాత్ముని బాహువుల ఊరువుల వేగము
నినాదం చ నిశమ్య -
దానితో జనించిన శబ్దము విని
హృష్టాః హరయః -
సంతోషపడిన వానరులు
తతః తతః సముత్పేతుః-
అక్కడే గంతులు వేయసాగిరి
||శ్లోకతాత్పర్యము||
ఆ మహాత్ముని బాహువుల ఊరువుల వేగములతో జనించిన శబ్దము విని, సంతోషపడిన అ వానరులు, అక్కడే గంతులు వేయసాగిరి. ||57.24||
వానరలు సంతోషము పట్టలేక కుప్పిగంతులు వేస్తారు. పదవ సర్గలో హనుమ , మండోదరిని చూచి సీతమ్మ అనుకొని సంతోషపడి, ఆ సంతోషముతో కుప్పి గంతులు వేసినప్పుడు , కవి హనుమ తన కపిత్వము ప్రదర్శించాడు అని అన్నాడు. ఇక్కడ కూడా కనపదేది ఆ కపిత్వమే.
||శ్లోకము 57.25||
తే నగాగ్రాన్ నగాగ్రాణి శిఖరాత్ శిఖరాణి చ ||57.25||
ప్రహృష్టాః సమపద్యన్త హనూమన్తం దిదృక్షవః |
స|| తే ప్రహృష్టాః హనుమంతం దిద్రుక్షవః నగాగ్రాత్ నగాగ్రాణి శిఖరాత్ శిఖరాణి చ సముపద్యంత ||
||శ్లోకార్థములు||
తే ప్రహృష్టాః -
వారు ఆ సంతోషముతో
హనుమంతం దిద్రుక్షవః-
హనుమంతుని చూడకోరినవారై
నగాగ్రాత్ నగాగ్రాణి -
ఒక పర్వతముపైనుంచి ఇంకో పర్వతము పైకి
శిఖరాత్ శిఖరాణి -
ఒక శిఖరమునుండి ఇంకో శిఖరమునకు
చ సముపద్యంత- ఎగరసాగిరి
||శ్లోకతాత్పర్యము||
ఆ సంతోషముతో హనుమంతుని చూడకోరినవారై, ఒక పర్వతముపై నుంచి ఇంకో పర్వతము పైకి , ఒక శిఖరమునుండి ఇంకో శిఖరమునకు ఎగరసాగిరి. ||57.25||
||శ్లోకము 57.26||
తే ప్రీతాః పాదపాగ్రేషు గృహ్యశాఖాః సువిష్టితాః ||57.26||
వాసాం సీవ ప్రశాఖాశ్చ సమావిధ్యన్త వానరాః |
స|| తే వానరాః ప్త్రీతాః పాదపాగ్రేషు శాఖాః గృహ్య సువిష్టితాః ప్రశాఖాః వాసాంసీవ సమావిధ్యంత ||
గోవిన్దరాజ టీకాలో - యథా మనుష్యాః దూరస్థస్వకీయానయనాయ వాసాంసు ధూన్వన్తి , తదైవ వానారాశ్చాన్యోన్యాయాహ్వానాయ పుష్పిత శాఖాః గృహీత్వా సమావిధ్యంత పర్యభ్రామయన్ |
||శ్లోకార్థములు||
తే వానరాః ప్త్రీతాః -
ఆ వానరులు సంతోషముతో
పాదపాగ్రేషు శాఖాః గృహ్య -
వృక్షముల పైన కొమ్మలను పట్టుకొని
సువిష్టితాః ప్రశాఖాః వాసాంసీవ -
ఆ కొమ్మలను వస్త్రములవలే
సమావిధ్యంత - ఊపిరి
||శ్లోకతాత్పర్యము||
ఆ వానరులు వృక్షముల పైన కొమ్మలను పట్టుకొని ఊగుతూ , ఆ కొమ్మలను వస్త్రములవలే ఊపి తమ సంతోషము ప్రదర్శించిరి. ||57.26||
ఎవరైనా జ్ఞాతులకోసము వేచియున్నప్పుడు, వారు దూరములో కనపడగానే మనుష్యజాతి వారు ఎలా వస్త్రము వూపుతారో, అలా హనుమ కోసము వేచియున్న వానరులు కూడా పుష్పములతో కూడిన కొమ్మలను సంతోషముతో వూపారు అని గోవిన్దరాజులవారి వ్యాఖ్య.
||శ్లోకము 57.27||
గిరిగహ్వరసంలీనో యథా గర్జతి మారుతః ||57.27||
ఏవం జగర్జ బలవాన్ హనుమాన్ మారుతాత్మజః |
స|| గిరిగహ్వర సంలీనః మారుతః యథా గర్జతి (తథా) బలవాన్ మారుతాత్మజః హనుమాన్ ఏవం జగర్జ ||
||శ్లోకార్థములు||
గిరిగహ్వర సంలీనః మారుతః -
పర్వత గుహలలో మారుతము
యథా గర్జతి (తథా) -
ఎలా ప్రతిధ్వనించునో (అలాగ)
బలవాన్ మారుతాత్మజః -
బలవంతుడు మారుతాత్మజుడైన
హనుమాన్ ఏవం జగర్జ -
హనుమంతుడు కూడా అలా గర్జించెను
||శ్లోకతాత్పర్యము||
పర్వత గుహలలో మారుతము ఎలా ప్రతిధ్వనించునో (అలాగ) బలవంతుడు మారుతాత్మజుడైన హనుమంతుడు కూడా అలా గర్జించెను. ||57.27||
||శ్లోకము 57.28||
తమభ్రఘనసంకాశ మాపతన్తం మహాకపిమ్ ||57.28||
దృష్ట్వా తే వానరాః సర్వే తస్థుః ప్రాంజలయస్తదా |
స|| తదా అభ్రఘనసంకాసం ఆపతతంతం తం మహాకపిం దృష్ట్వా తే వానరః ప్రాంజలయః తస్థుః ||
||శ్లోకార్థములు||
తదా అభ్రఘనసంకాసం -
అప్పుడు మహామేఘమువలె నున్న
ఆపతతంతం తం -
ఆకాశమునుండి దిగుతున్నఆ
మహాకపిం దృష్ట్వా -
మహాకపిని చూసి
తే వానరః ప్రాంజలయః తస్థుః -
ఆ వానరులందరూ అందెలు మోడ్చి నిలబడిరు
||శ్లోకతాత్పర్యము||
మహామేఘమువలె నున్న, ఆకాశమునుండి దిగుతున్నఆ మహాకపిని చూసి, ఆ వానరులందరూ అందెలు మోడ్చి నిలబడిరు. ||57.28||
||శ్లోకము 57.29||
తతస్తు వేగవాం స్తస్య గిరేర్గిరినిభః కపిః||57.29||
నిపపాత మహేన్ద్రస్య శిఖరే పాదపాకులే |
స|| తతః గిరినిభః వేగవాన్ కపిః తస్య మహేన్ద్రస్య గిరేః పాదపాకులే శిఖరే నిపపాత||
||శ్లోకార్థములు||
తతః గిరినిభః వేగవాన్ కపిః -
అప్పుడు పర్వతసమానమైన వేగముగాపోగల ఆ వానరుడు
తస్య మహేన్ద్రస్య గిరేః -
ఆ మహేన్ద్రపర్వతము యొక్క
పాదపాకులే శిఖరే -
వృక్షముల తో నిండిన శిఖరములో
నిపపాత - దిగెను
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు పర్వతసమానమైన, వేగముగాపోగల ఆ వానరుడు, వృక్షముల తో నిండిన మహేంద్రగిరి శిఖరములలో దిగెను. ||57.29||
||శ్లోకము 57.30||
హర్షేణాపూర్యమాణోఽసౌ రమ్యే పర్వత నిర్ఝరే ||57.30||
ఛిన్నపక్ష ఇవాఽఽకాశాత్ పపాత ధరణీ ధరః |
స|| హర్షేణ ఆపూర్యమాణః అసౌ ఛిన్నపక్షః ధరణీధరః ఇవ రమ్యే పర్వతనిర్ఝరే ||
||శ్లోకార్థములు||
హర్షేణ ఆపూర్యమాణః -
అమిత ఆనందముతో నిండిన
అసౌ ఛిన్నపక్షః ధరణీధరః ఇవ -
రెక్కలులేని మహాపర్వతమువలె నున్న
రమ్యే పర్వతనిర్ఝరే -
రమ్యమైన పర్వత సెలయేరు తీరములో దిగెను
||శ్లోకతాత్పర్యము||
అమిత ఆనందముతో నిండిన, రెక్కలులేని మహాపర్వతమువలె నున్న ఆ హనుమంతుడు, అప్పుడు ఆ పర్వతముపై నున్న రమ్యమైన సెలయేరు తీరములో దిగెను. ||57.30||
||శ్లోకము 57.31,32||
తతస్తే ప్రీతమనసః సర్వే వానరపుంగవః ||57.31||
హనుమన్తం మహాత్మానం పరివార్యోపతస్థిరే |
పరివార్య చ తే సర్వే పరాం ప్రీతి ముపాగతాః ||57.32||
స|| తతః సర్వే తే వానరపుంగవాః ప్రీతిమనసః మహాత్మానం హనుమంతం పరివార్య ఉపతస్థిరే ||
||శ్లోకార్థములు||
తతః సర్వే తే వానరపుంగవాః ప్రీతిమనసః -
అప్పుడు ఆనందభరితులైన ఆ వానరులందరూ
మహాత్మానం హనుమంతం -
మహాత్ముడైన హనుమంతుని
పరివార్య ఉపతస్థిరే -
సమీపించి చుట్టూ చేరిరి
పరివార్య చ తే సర్వే పరాం -
చుట్టూ చేరి వారందరు
పరాం ప్రీతిముపాగతాః-
అమితమైన సంతోషము పొందిరి
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు ఆనందభరితులైన ఆ వానరులందరూ మహాత్ముడైన హనుమంతుని సమీపించి అతని చుట్టూ చేరిరి. చుట్టూ చేరి వారందరు అమితమైన సంతోషము పొందిరి ||57.31,32||
||శ్లోకము 57.33||
ప్రహృష్టవదనాః సర్వే తమరోగముపాగతమ్ |
ఉపాయనాని చాదాయ మూలాని ఫలాని చ ||57.33||
ప్రత్యర్చయన్ హరిశ్రేష్టం హరయో మారుతాత్మజమ్ |
స|| సర్వే హరయః ప్రహృష్టవదనాః మూలాని ఫలాని చ ఉపాయనాని ఆదాయ అరోగం ఉపాగతం హరిశ్రేష్టం మారుతాత్మజం ప్రత్యర్పయన్ ||
||శ్లోకార్థములు||
సర్వే హరయః ప్రహృష్టవదనాః -
ఆ వానరులందరూ అతిసంతోషముతో
మూలాని ఫలాని చ ఉపాయనాని ఆదాయ -
పూవులూ ఫలములూ పానీయములు తీసుకు వచ్చి
అరోగం ఉపాగతం - క్షేమముగా తిరిగివచ్చిన
హరిశ్రేష్టం మారుతాత్మజం ప్రత్యర్పయన్-
వానరులలో శ్రేష్ఠుడైన హనుమంతునికి సమర్పించిరి
||శ్లోకతాత్పర్యము||
ఆ వానరులందరూ అతిసంతోషముతో, పూవులూ ఫలములూ తీసుకు వచ్చి క్షేమముగా తిరిగివచ్చిన, వానరులలో శ్రేష్ఠుడైన హనుమంతునికి సమర్పించిరి. ||57.33||
||శ్లోకము 57.34||
హనుమాంస్తు గురూన్ వృద్ధాన్
జాంబవత్ప్రముఖాం స్తదా ||57.34||
కుమారమంగదం చైవ
సోఽవన్దత మహాకపిః |
స|| తదా మహాకపిః హనుమాంస్తు గురూన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ కుమారం అంగదం చైవ అవన్దత ||
||శ్లోకార్థములు||
తదా మహాకపిః హనుమాంస్తు-
అప్పుడు ఆ మహాకపి అయిన హనుమంతుడు
గురూన్ వృద్ధాన్ జాంబవత్ ప్రముఖాన్ -
గురువులు వృద్ధులైన జాంబవదాది ప్రముఖులకు
కుమారం అంగదం చైవ అవన్దత -
అంగదకుమారునకు కూడా వందనము చేసెను
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు ఆ మహాకపి అయిన హనుమంతుడు, గురువులు వృద్ధులైన జాంబవదాది ప్రముఖులకు, అంగద కుమారునకు కూడా వందనము చేసెను. ||57.34||
||శ్లోకము 57.35||
స తాభ్యాం పూజితః పూజ్యః కపిభిశ్చ ప్రసాదితః ||57.35||
దృష్టా సీతేతి విక్రాన్తః సంక్షేపేణ న్యవేదయత్ |
స|| పూజ్యః సః తాభ్యాం పూజితః కపిభిః ప్రసాదితః సీతా దృష్టా ఇతి సంక్షేపేణ నివేదయత్ ||
||శ్లోకార్థములు||
పూజ్యః సః తాభ్యాం పూజితః -
పూజనీయుడువారి చేత పూజింపబడినవాడై
కపిభిః ప్రసాదితః -
వానరులచేత ప్రసాదింపబడినవాడై
సీతా దృష్టా ఇతి -
సీతమ్మను చూచితిని అని
సంక్షేపేణ నివేదయత్ -
సంక్షేపముగా నివేదించెను
||శ్లోకతాత్పర్యము||
ఆ పూజనీయుడు, పూజింపబడినవాడై, వారిని పూజించి సంక్షిప్తముగా సీతమ్మను చూచితిని అని నివేదించెను. ||57.35||
హనుమ 'సీతా దృష్టా' అని ఒక్క మాటతో, రామకార్యము పూర్తిచేశాను అని చెప్పాడు, ఇందులో తన ఘనత గురించి ఒక్క మాటలేదు.
||శ్లోకము 57.36,37||
నిషసాద చ హస్తేన గృహీత్వా వాలినస్సుతమ్ ||57.36||
రమణీయే వనోద్దేశే మహేన్ద్రస్య గిరేస్తదా |
హనుమానబ్రవీద్దృష్టః తదా తాన్ వానరర్షభాన్ ||57.37||
స|| తదా వాలినః సుతం హస్తేన గృహీత్వా మహేన్ద్రస్య గిరేః రమణీయే వనొద్దేశే నిషసాద | తదా హృష్టః హనుమాన్ తాన్ వానరర్షభాన్ అబ్రవీత్ |
||శ్లోకార్థములు||
తదా వాలినః సుతం హస్తేన గృహీత్వా -
అప్పుడు వాలిపుత్రుని చేయి పట్టుకొని
మహేన్ద్రస్య గిరేః - ఆ మహేంద్ర పర్వతము మీద
రమణీయే వనోద్దేశే నిషసాద చ -
రమణీయమైన వన ప్రదేశములో కూర్చొనెను
తదా హృష్టః హనుమాన్ -
అప్పుడు ఆనందభరితుడైన హనుమంతుడు
తాన్ వానరర్షభాన్ అబ్రవీత్ -
ఆ వానరపుంగవులతో ఇట్లు పలికెను
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు హనుమ, వాలిపుత్రుని చేయి పట్టుకొని, ఆ మహేంద్ర గిరి మీద రమణీయమైన ప్రదేశములో కూర్చొనెను. అప్పుడు ఆనందభరితుడైన హనుమంతుడు ఆ వానరపుంగవులతో ఇట్లు పలికెను. ||57.36,37||
||శ్లోకము 57.38,39||
అశోకవనికాసంస్థా దృష్టా సా జనకాత్మజా |
రక్ష్యమాణా సుఘోరాభీ రాక్షసీభిరనిన్దితా ||57.38||
ఏకవేణీ ధరా బాలా రామదర్శన లాలసా |
ఉపవాసపరిశ్రాన్తా జటిలా మలినా కృశా||57.39||
స|| అశోకవనికాసంస్థా సుఘోరాభిః రాక్షసీభిః రక్ష్యమాణా అనిన్దితా ఏకవేణీ ధరా బాలా రామదర్శన లాలసా ఉపవాసపరిశ్రాంతా జటిలా మలినా కృశా సా జనకాత్మజా దృష్టా ||
రామటీకాలో - పృష్టో హనుమాన్ సుఘోరాభిః రాక్షసీభిః రక్ష్యమాణా అనిన్దితా నిన్దాసంసర్గ రహితా రామదర్శనలాలసా కృశా అశోకవనికా సంస్థా జనకాత్మజా మయా దృష్టేతి వానరర్ష్భాన్ అబ్రవీత్ |
||శ్లోకార్థములు||
అశోకవనికాసంస్థా -
అశోకవనములో నున్న
సుఘోరాభిః రాక్షసీభిః రక్ష్యమాణా -
అనేకమంది రాక్షస స్త్రీల కాపలాలో వున్న
అనిన్దితా ఏకవేణీ ధరా బాలా -
నిందింపలేని ఒకే జడవేసికొని వున్న అబల
రామదర్శన లాలసా -
రామదర్శన లాలసతో వున్న
ఉపవాసపరిశ్రాంతా కృశా -
ఉపవాసదీక్షలతో కృశించిఉన్న
జటిలా మలినా -
జటిలనమైన జిట్టుతో మలినమైన వస్త్రములతో వున్న
సా జనకాత్మజా దృష్టా-
ఆ జనకాత్మజను చూచితిని
||శ్లోకతాత్పర్యము||
'అశోకవనములో నున్న, అనేకమంది రాక్షస స్త్రీల కాపలాలో ఉన్న, ఒకే జడవేసికొని రామదర్శన లాలసతో వున్న , ఉపవాసదీక్షలతో కృశించి ఉన్న, మలినమై వున్నవస్త్రములతో వున్న, నిందింపలేని జనకాత్మజను చూచితిని', అని చెప్పెను. ||57.38,39||
మళ్ళీ ఇక్కడ కూడా హనుమ ధ్యాస , సీతమ్మ వారి మీదే తప్ప , తన ఘనత చూపడు
||శ్లోకము 57.40||
తతో దృష్టేతి వచనం మహార్థం అమృతోపమమ్ |
నిశమ్య మారుతేః సర్వే ముదితా వానారాభవన్ ||57.40||
స|| తతః దృష్టా ఇతి మారుతేః మహార్థం అమృతోపమం వచనం నిశమ్య సర్వే వానరాః ముదితా అభవత్||
||శ్లోకార్థములు||
తతః దృష్టా ఇతి -
అప్పుడు చూచితిని అన్న
మారుతేః మహార్థం -
మారుతియొక్క మహత్తరమైన
అమృతోపమం వచనం నిశమ్య -
అమృతోపముతో సమానమైన ఆ మాటను విని
సర్వే వానరాః ముదితా అభవత్ -
ఆ వానరులందరూ ఆనందభరితులైరి
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు సీతను చూచితిని అన్న మారుతియొక్క మహత్తరమైన అమృతోపము అయిన ఆ మాటను విని ఆ వానరులందరూ ఆనందభరితులైరి. ||57.40||
||శ్లోకము 57.41||
క్ష్వేళన్త్యన్యే ననదన్తన్యే గర్జన్తన్యే మహాబలాః |
చక్రుః కిల కిలాం అన్యే ప్రతిగర్జన్తి చాపరే ||57.41||
స|| మహాబలాః అన్యే క్ష్వేళంతి |అన్యే నదన్తి |అన్యే గర్జంతి |అన్యే కిల్కిలాం చక్రుః | అపరే ప్రతిగర్జంతి ||
గోవిన్దరాజులవారి టీకాలో - క్ష్వేళంతి సింహనాదం కుర్వన్తి | నన్దన్తి అవ్యక్త శబ్దం కుర్వన్తి | గర్జన్తి వృషభనాదం కుర్వన్తి | కిలికిలాం స్వజాతి ఉపచిత కిలకిలాశబ్దం|
||శ్లోకార్థములు||
మహాబలాః అన్యే క్ష్వేళంతి -
కొందరు మహాబలురు గట్టిగా అరిచిరి
అన్యే నదన్తి -
మరికొందరు సింహనాదము చేసిరి
అన్యే గర్జంతి -
మరికొందరు గర్జించిరి
అన్యే కిల్కిలాం చక్రుః -
కోందరు కిలకిలారావములు చేసిరి
అపరే ప్రతిగర్జంతి -
మరికొందరు గర్జనకు సమాధానముగా గర్జించిరి
||శ్లోకతాత్పర్యము||
కొందరు మహాబలురు గట్టిగా అరిచిరి.మరికొందరు సింహనాదము చేసిరి. మరికొందరు గర్జించిరి. కోందరు కిలకిలారావములు చేసిరి. మరికొందరు గర్జనకు సమాధానముగా గర్జించిరి. ||57.41||
||శ్లోకము 57.42||
కేచిదుచ్ఛ్రితలాంగూలాః ప్రహృష్టాః కపికుంజరాః |
అంచితాయుతదీర్ఘాణి లాంగూలాని ప్రవివధ్యుః ||57.42||
స|| ప్రహృష్టాః కేచిత్ కపికుంజరః ఉచ్ఛ్రితలాంగూలాః ఆయతాంచిత దీర్ఘాణి లాంగూలాని ప్రవివ్యధుః ||
||శ్లోకార్థములు||
ప్రహృష్టాః కేచిత్ కపికుంజరః -
సంతోషపడిన కొందరు తమలాంగూలములను పైకెత్తారు
ఉచ్ఛ్రితలాంగూలాః -
లాంగూలములను పైకెత్తిరి
ఆయతాంచిత దీర్ఘాణి -
పొడుగా అందముగా వున్న
లాంగూలాని ప్రవివ్యధుః-
లాంగూలములను నేలమీద కొట్టి (సంతోషము వ్యక్తము చేశారు)
||శ్లోకతాత్పర్యము||
సంతోషపడిన కొందరు తమలాంగూలములను పైకెత్తారు. కొందరు తమ తోకలతో నేలమీద కొట్టి సంతోషము వ్యక్తము చేశారు. ||57.42||
||శ్లోకము 57.43||
అపరే చ హనూమంతం వానరావారణోపమం |
ఆప్లుత్య గిరిశృంగేభ్యః సంస్పృశన్తి స్మ హర్షితాః ||57.43||
స|| అపరే వానరాః హర్షితాః గిరిశ్రుంగేభ్యః ఆప్లుత్య వారణోపమం హనూమంతం సంస్పృశన్తి చ||
||శ్లోకార్థములు||
అపరే వానరాః హర్షితాః -
ఇంకొందరు వానరులు సంతోషముతో
గిరిశ్రుంగేభ్యః ఆప్లుత్య-
శిఖరాగ్రములనుంచి దూకి
వారణోపమం హనూమంతం -
గజము వంటి హనుమంతుని
సంస్పృశన్తి చ- స్పృశించిరి కూడా
||శ్లోకతాత్పర్యము||
ఇంకొందరు వానరులు సంతోషముతో శిఖరాగ్రములనుంచి దూకి, గజము వంటి హనుమంతుని స్పృశించిరి కూడా. ||57.43||.
||శ్లోకము 57.44||
ఉక్తవాక్యం హనూమన్తం అంగదః తమ్ అథాబ్రవీత్ |
సర్వేషాం హరివీరాణాం మధ్యే వచనముత్తమమ్ ||57.44||
స|| అథ అంగదః ఉక్తవాక్యం హనూమంతం సర్వేషాం హరివీరాణాం మధ్యే ఉత్తమం వచనం అబ్రవీత్ ||
||శ్లోకార్థములు||
అథ అంగదః ఉక్తవాక్యం -
అంగదుడు సముచితమైన మాటలతో
సర్వేషాం హరివీరాణాం మధ్యే -
వానర వీరులందరి మధ్యలో
హనూమంతం ఉత్తమం వచనం -
హనుమంతునితో సముచితమైన మాటలను
అబ్రవీత్ - పలికెను
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు ఆ వానర వీరులందరి మధ్యలో అంగదుడు సముచితమైన మాటలతో హనుమంతునితో ఇట్లు పలికెను. ||57.44||
||శ్లోకము 57.45||
స త్వే వీర్యే న తే కశ్చిత్సమో వానర విద్యతే |
యదవప్లుత్య విస్తీర్ణం సాగరం పునరాగతః ||57.45||
స|| వానర ! యత్ విస్తీర్ణం సాగరం అవప్లుత్య పునః ఆగతః సత్త్వే వీర్యే తే సమః కశ్చిత్ నా విద్యతే||
||శ్లోకార్థములు||
వానర యత్ విస్తీర్ణం సాగరం -
ఓ వానరా ఈ విస్తీర్ణమైన సాగరముని
అవప్లుత్య పునః ఆగతః -
దాటి మళ్ళీ వచ్చిన
సత్త్వే వీర్యే తే సమః -
సత్వములోను వీరత్వములోనూ నీతో సమానుడు
కశ్చిత్ నా విద్యతే -
ఎక్కడా వుండడు
||శ్లోకతాత్పర్యము||
'ఓ వానరా, ఈ విస్తీర్ణమైన సాగరముని దాటి మళ్ళీ వచ్చిన నీతో , సత్వములోను వీరత్వములోనూ, సమానుడు ఎవడూ వుండడు'. ||57.45||
||శ్లోకము 57.46||
అహో స్వామిని తే భక్తిరహో వీర్యమహో ధృతిః |
దిష్ట్యా దృష్టా త్వయా దేవీ రామపత్నీ యశస్వినీ ||57.46||
దిష్ట్యా త్యక్ష్యతి కాకుత్‍స్థః శోకం సీతావియోగజమ్ |
స|| స్వామిని తే భక్తిః అహో | ధృతిః అహో | దిష్ట్యా త్వయా రామపత్నీ యశస్వినీ దేవీ దృష్టా | దిష్ట్యా కాకుత్‍స్థః సీతావియోగజం శోకం తక్ష్యతి ||
||శ్లోకార్థములు||
స్వామిని తే భక్తిః అహో -
అహా ఏమి నీ స్వామి భక్తి
ధృతిః అహో - ఏమి నీ సాహసము
దిష్ట్యా త్వయా రామపత్నీ -
అదృష్టముకొలదీ నీచేత రామపత్ని
యశస్వినీ దేవీ దృష్టా -
యశస్విని అగు సీత చూడబడినది
దిష్ట్యా కాకుత్‍స్థః సీతావియోగజం -
అదృష్టముకొలదీ కాకుత్‍స్థుని సీతావియోగ
శోకం తక్ష్యతి - దుఃఖము తొలగిపోవును
||శ్లోకతాత్పర్యము||
'అహా ఏమి నీ స్వామి భక్తి . ఏమి నీ సాహసము. అదృష్టముకొలదీ నీ చేత యశస్విని అగు రామపత్ని చూడబడినది. అదృష్టముకొలదీ కాకుత్‍స్థుని సీతావియోగ దుఃఖము తొలగిపోవును'. ||57.46||
||శ్లోకము 57.47||
తతోఙ్గదం హనూమన్తం జాంబవన్తం చ వానరాః ||57.47||
పరివార్య ప్రముదితా భేజిరే విపులాః శిలాః |
స|| తతః వానరాః ప్రముదితాః అంగదం హనూమంతం జాంబవంతం చ పరివార్య విపులాః శిలాః భేజిరే ||
||శ్లోకార్థములు||
తతః వానరాః ప్రముదితాః -
అప్పుడు ఆనందభరితులైన వానరులందరూ
అంగదం హనూమంతం జాంబవంతం చ -
అంగదుని హనుమంతుని జామ్బవంతుని
పరివార్య విపులాః శిలాః భేజిరే-
చుట్టూచేరి పెద్ద పెద్ద శిలలపై కూర్చొనిరి.
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు ఆనందభరితులైన వానరులందరూ అంగదుని హనుమంతుని జామ్బవంతుని చుట్టూచేరి పెద్ద పెద్ద శిలలపై కూర్చొనిరి. ||57.47||
||శ్లోకము 57.48,49||
శ్రోతుకామాః సముద్రస్య లంఘనం వానరోత్తమాః ||57.48||
దర్శనం చాపి లంకాయాః సీతాయా రావణస్య చ |
తస్థుః ప్రాంజలయః సర్వే హనుమద్వదనోన్ముఖాః ||57.49||
స|| సర్వే వానరోత్తమాః సముద్రస్య లంఘనం లంకాయాః సీతాయాః రావణస్య దర్శనం చాపి శ్రోతుకామాః ప్రాంజలయః హనుమద్వచనోన్ముఖాః తస్థుః ||
||శ్లోకార్థములు||
సర్వే వానరోత్తమాః -
ఆ వానరోత్తములందరూ
సముద్రస్య లంఘనం -
సముద్ర లంఘనము
లంకాయాః సీతాయాః రావణస్య దర్శనం చాపి -
లంకలో సీతా దర్శనము రావణుని దర్శనము గురించి
శ్రోతుకామాః ప్రాంజలయః -
వినకోరినవారై చేతులు జోడించి
హనుమద్వచనోన్ముఖాః తస్థుః -
హనుమంతుని ద్వారా వినుటకై కూర్చుండిరి
||శ్లోకతాత్పర్యము||
ఆ వానరోత్తములందరూ సముద్ర లంఘనము లంకలో సీతా దర్శనము రావణుని దర్శనము గురించి వినకోరినవారై చేతులు జోడించి హనుమంతుని ద్వారా వినుటకై కూర్చుండిరి. ||57.48,49||
||శ్లోకము 57.50||
తస్థౌ తత్రాఙ్గదః శ్రీమాన్వానరైర్బహుభిర్వృతః |
ఉపాస్యమానో విబుధైః దివిదేవపతిర్యథా ||57.50||
స|| తత్ర శ్రీమాన్ బహుభిః వానరైః వృతః అంగదః దివి విబుధైః ఉపాశ్యమానః దేవపతిః యథా తస్థౌ ||
||శ్లోకార్థములు||
తత్ర శ్రీమాన్ అంగదః -
అక్కడ శ్రీమాన్ అంగదుడు
బహుభిః వానరైః వృతః -
అనేకమంది వానరులచేత చుట్టబడి
విబుధైః ఉపాశ్యమానః -
దేవతలచే చుట్టబడి సేవలు అందుకుంటున్న
దేవపతిః యథా తస్థౌ-
దేవేన్ద్రునివలె వుండెను
||శ్లోకతాత్పర్యము||
అప్పుడు, ఆ వానరులచేత చుట్టబడి వారి సేవలు అందుకుంటున్న ఆ అంగదుడు, ఇంద్రునివలె కనిపించెను. ||57.50||.
||శ్లోకము 57.51||
హనూమతా కీర్తిమతా యశస్వినా
తథాంగదే నాంగదబద్ధబాహునా |
ముదా తదాsధ్యాసితమున్నతం మహాన్
మహీధరాగ్రం జ్వలితం శ్రియాఽభవత్ ||57.51||
స|| కీర్తిమతా హనూమతా తథా యశస్వినా అంగదబద్ధబాహునా అంగదేన తదా ముదా అధ్యాసితం ఉన్నతం మహత్ మహీధరాగ్రం తదా శ్రియా జ్వలితం అభవత్ ||
గోవిన్దరాజ టీకాలో - కీర్తిమతేతి హనుమత్ విశేషణం | యశస్వినేతి అఙ్గద విశేషణం | భృత్యా కీర్త్యా స్వామినః కీర్తిః | అన్యథా పౌనరుక్త్యాత్ | యద్వా బుద్ధిమత్వజన్యా కీర్తిః | శౌర్య జన్యం యశః |
||శ్లోకార్థములు||
కీర్తిమతా హనూమతా -
కీర్తిమంతుడైన హనుమంతుడు
తథా యశస్వినా అంగదబద్ధబాహునా అంగదేన -
అలాగే యశస్సు గల భుజకీర్తులు దాల్చిన అంగదుడు
తదా ముదా అధ్యాసితం -
అప్పుడు సంతోషముతో అశీనులైన
ఉన్నతం మహత్ మహీధరాగ్రం -
ఉన్నతమైన మహత్తరమైన పర్వత శిఖరము
తదా శ్రియా జ్వలితం అభవత్ -
అతి శోభాయమానము గా అలరారుచుండెను
||శ్లోకతాత్పర్యము||
కీర్తిమంతుడైన హనుమంతుడు అలాగే యశస్సు గల, భుజకీర్తులు దాల్చిన అంగదుడు, ఆసీనులైన ఆ పర్వతము అతి శోభాయమానము గా అలరారుచుండెను. ||57.51||
కార్యము సాధించి వచ్చిన హనుమను చూచి, రాజాజ్ఞ ప్రకారము చేయవలసిన కార్యము చేశాము అనే సంతోషముతో వానరుల అందరూ , ఇంకా వినాలి అనే కుతూహలముతో మహేంద్ర పర్వతముపై కూర్చుని వున్నారు అన్న మాటతో, సుందరకాండలో ఏభై ఏడొవ సర్గ సమాప్తము అవుతుంది.
ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే సప్తపంచాశస్సర్గః ||
|| ఓమ్ తత్ సత్||