||సుందరకాండ ||

||ఏభై ఎనిమిదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 58 || with Slokas and meanings in Telugu

                                                       ||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

అష్టపంచాశస్సర్గః||

 

’కథందృష్టా త్వయా దేవీ’, 


’కథందృష్టా త్వయా దేవీ’, అంటే ’ఆ దేవిని ఎలా చూచావు’ అని. జాంబవంతుడు అందరి తరఫున  హనుమంతుడిని ఆ సీతమ్మని ఎలాచూశాడో వివరింపని అడుగుతాడు 


సుందరకాండ  ప్రథమ సర్గనుంచి  వాల్మీకి ద్వారా ఆ వర్ణనే వింటాము. ’తతోరావణ నీతాయాః’, అంటూ హనుమ బయలుదేరాడని,’దదర్శలంకాం అమరావతీమివ’ - అంటూ అమరావతి లాంటి లంకను చూచాడని, ’ఏవం సీతాం తదా దృష్ట్వా’ - అలాగ సీతమ్మని చూచి అని అంటూ,   అంతా వాల్మీకి ద్వారా విన్నాము.


అంటే ఈ సర్గలో, ముందు జరిగిన వృత్తాంతము అంతా మళ్ళీ హనుమ కళ్ళ ద్వారా ,అంటే హనుమ మాటలలో, ’నేను చూశాను , నేను చేశాను’, అన్నట్లుగా వింటాము.


ఈ సర్గలో మైనాకుని చూచిన సంగతి హనుమ తన మాటలలో, ’కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరం’, అంటాడు. నాగమాత గురించి, ’తతః పశ్యామ్యహం దేవీం సురసా నాగమాతరం’, అంటాడు; ’తతః సీతాం అపశ్యన్తు’ - అక్కడ సీతమ్మను చూశాను అంటాడు.; ’దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మనా’, దురాత్ముడైన రావణుని చూచి వాడితో మాట్లాడాను అంటాడు; ’దహతా చ మయా లంకాం’ - నేను లంకను దహించాను అని అంటాడు.


ఇలా ’అహం’,  అంటే నేను, నాచేత అన్నమాటలు చాలా వినిపిస్తాయి. కాని అవి అహం తో చెప్పబడిన అహంకార మాటలు కావు. హనుమ చెప్పేముందర, ’ప్రణమ్య శిరాసా దేవ్యై’, అంటే ఆ దేవికి ప్రణమిల్లి చెప్పిన మాటలు ఇవి.


ఇవి రామదాసుడిగా చెప్పిన మాటలు. ఇక్కడ ’అహం’లో, అహం లేదు. ఇక్కడ గర్వముతో అహంకారభావముతో చెప్పబడిన మాట అసలే లేదు.


అంతా చెప్పి, నేను జరిగినదంతా సుగ్రీవుని ఆజ్ఞానుసారముగా చేశాను. ’అత్ర యన్ అకృతం శేషం’,  - ఇంక ఏమన్నా చేయవలసినది మిగిలి వుంటే, ’తత్ సర్వం క్రియతామ్ ఇతి’, అది అంతా చేయబడుగాక అంటాడు. ఇది సుగ్రీవ సచివుడు, రామదాసుడు అయిన హనుమ చెప్పిన మాట.


జయమంత్రములో ’దాసోఽహం’, అని వస్తుంది. ’దాసోఽహం’, అంటే నేను కౌసలేంద్రుని దాసుడను అని.  నేను అంటూ, హనుమ మాటలలో వున్నజయమంత్రము మనము చదివితే , అప్పుడు మనము కూడా, ’దాసోఽహం’  అంటూ కౌసలేంద్రుని దాసులము అని ఉద్ఘాటించినట్లే అనిపించి, ఆ మంత్ర పఠనలో వున్న పఠిత్వము మనకు దక్కుతుంది. అది ఆ మంత్ర మహిమ.


అలాగే హనుమ తనమాటలలో చెప్పే కథ మనము  చదివితే, మనము ఆ కథలో పాల్గొన్నట్టే అనిపిస్తుంది. అందుకనే కాబోలు పెద్దలు  యాభై ఎనిమిదవ సర్గ చదివితే సుందరకాండ చదివినట్లే అంటారు.


ఈ సర్గలో మనము హనుమ ద్వారా లంకలో జరిగిన వృత్తాంతం అంతా వింటాము. .


ఇక ఏభై ఎనిమిదవ సర్గ శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.


||శ్లోకము 58.01||


 తతః తస్య గిరేః శృఙ్గే మహేన్ద్రస్య మహాబలాః |

హనుమత్ప్రముఖాః ప్రీతిం హరయో జగ్మురుత్తమామ్ ||58.01||


స|| తతః మహాబలాః హనుమత్ప్రముఖాః హరయః తస్య మహేన్ద్రస్య గిరేః శృఙ్గే ఉత్తమమ్ ప్రీతిం జగ్ముః||


||శ్లోకార్థములు||


తతః మహాబలాః హనుమత్ప్రముఖాః - 

అప్పుడు మహాబలురు హనుమత్ప్రముఖులు 

హరయః తస్య మహేన్ద్రస్య గిరేః - 

వానరులు ఆ మహేంద్రగిరి పర్వతములోని

శృఙ్గే ఉత్తమమ్ ప్రీతిం జగ్ముః - 

శిఖరములలో అనిర్వచనీయమైన అనందము పొందిరి


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు మహాబలురైన హనుమత్ప్రముఖులు తదితర వానరులు, ఆ మహేంద్రగిరి పర్వత శిఖరములలో అనిర్వచనీయమైన అనందము పొందిరి. ||58.01||


||శ్లోకము 58.02|| 


తం తతః ప్రీతిసంహృష్టః ప్రీతిమన్తం మహాకపిమ్ |

జామ్బవాన్కార్యవృత్తాన్తం అపృచ్ఛదనిలాత్మజమ్ ||58.02||


స|| తతః  ప్రీతిసంహృష్టః జాంబవాన్ తం ప్రీతిమన్తం  మహాకపిం అనిలాత్మజం కార్యవృత్తంతం అపృఛ్ఛత్ ||


||శ్లోకార్థములు||


తతః  ప్రీతిసంహృష్టః జాంబవాన్ - 

అప్పుడు ప్రీతితో అనందభరితుడైన జాంబవంతుడు

తం ప్రీతిమన్తం మహాకపిం -  

ఆ అనందభరితుడైన అయిన మహాకపిని

అనిలాత్మజం - అనిలాత్మజుని

కార్యవృత్తంతం అపృఛ్ఛత్ - 

జరిగిన కార్యము గురించి అడిగెను


||శ్లోకతాత్పర్యము||


అప్పుడు ప్రీతితో అనందభరితుడైన జాంబవంతుడు, అనందభరితుడైన  మహాకపి, అనిలాత్మజుడు అగు  హనుమంతుని, జరిగిన కార్యముగురించి అడిగెను. ||58.02|| 


||శ్లోకము 58.03|| 


కథం దృష్టా త్వయా దేవీ కథం వా తత్ర వర్తతే |

తస్యాం వా స కథం వృత్తః క్రూరకర్మా దశాననః ||58.03||


స|| త్వయా దేవీ కథం దృష్టా | వా తత్ర కథం వర్తతే | క్రూరకర్మా సః  దశాననః తస్యాం కథం వృత్తః || 


రామటీకాలో- దేవీ సీతా తత్ర లంకాయాం త్వయా కథం దృష్టా, దశాననో రావణః తస్యాం సీతాయాం కథం వృత్తః ప్రవృతః సేవతే ఇత్యర్థః , ఏతత్ సర్వం తత్త్వతః నః త్వం ప్రబౄహి।


||శ్లోకార్థములు||


త్వయా దేవీ కథం దృష్టా - నీవు ఆ దేవిని ఎట్లు చూచితివి? 

వా తత్ర కథం వర్తతే - ఆమె అచట ఎట్లు ఉన్నది?

క్రూరకర్మా సః దశాననః - క్రూరకర్ముడైన ఆ దశాననుడు

తస్యాం కథం వృత్తః - అమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు?


||శ్లోకతాత్పర్యము||


’నీవు ఆ దేవిని ఎట్లు చూచితివి? ఆమె అచట ఎట్లు ఉన్నది? క్రూరకర్ముడైన ఆ దశాననుడు అమె పట్ల ఎలా ప్రవర్తిస్తున్నాడు?’  ||58.03||


||శ్లోకము 58.04|| 


తత్త్వతః సర్వమేతన్ నః ప్రబ్రూహి త్వం మహాకపే |

శ్రుతార్థాః చిన్తయిష్యామో భూయః కార్యవినిశ్చయమ్ ||58.04||


స|| మహాకపే ఏతన్ సర్వం త్వం  నః తత్త్వతః ప్రబ్రూహి | శ్రుతార్థాః భూయః వినిశ్చయం కార్యం చిన్తయిష్యామః ||


||శ్లోకార్థములు||


మహాకపే ఏతన్ సర్వం త్వం - 

ఓ మహాకపీ ఇదంతా నీవు

నః తత్త్వతః ప్రబ్రూహి - 

మాకు జరిగినది జరిగినట్లు చెప్పుము

శ్రుతార్థాః  - 

విని అర్థము చేసికొని 

భూయః వినిశ్చయం కార్యం చిన్తయిష్యామః - 

తరువాత చేయవలసిన కార్యము మీద అలోచిద్దాము


||శ్లోకతాత్పర్యము||


’ఓ మహాకపీ ఇదంతా నీవు జరిగినది జరిగినట్లు చెప్పుము. విని అర్థము చేసికొని మనము తరువాత కార్యముగురించి అలోచిద్దాము’. ||58.04|| 


||శ్లోకము 58.05|| 


యశ్చార్థః తత్ర వక్తవ్యో గతైరస్మాభిరాత్మవాన్ |

రక్షితం చ యత్ తత్ర తద్భావాన్వ్యాకరోతు నః ||58.05||


స|| గతైః అస్మాభిః తత్ర యః వక్తవ్యః యత్ తత్ర రక్షితవ్యం చ ఆత్మవాన్ భవాన్ నః వ్యాకరోతు||


గోవిన్దరాజ టీకాలో - తత్ర రామ సన్నిధౌ యోఽర్థో వక్తవ్యః వక్తుం అర్హః యత్ చ రక్షితవ్యం గోప్తవ్యం తత్ ఆత్మవాన్ బుద్ధిమాన్ భవాన్ వ్యాకరోతు॥


||శ్లోకార్థములు||


గతైః అస్మాభిః తత్ర యః వక్తవ్యః - 

అక్కడికి వెళ్ళి మనము ఏది చెప్పతగునో

యత్ తత్ర రక్షితవ్యం చ - 

ఏది రక్షింపతగునో కూడా

ఆత్మవాన్ భవాన్ నః - 

నీవు నిర్ణయించి మాకు 

వ్యాకరోతు - చెప్పుము


||శ్లోకతాత్పర్యము||


’అక్కడికి వెళ్ళి మనము ఏది చెప్పతగునో, ఏది రక్షింపతగునో అది నీవు నిర్ణయించి మాకు చెప్పుము’. ||58.05||


||శ్లోకము 58.06|| 


 స నియుక్తః తతః తేన సంప్రహృష్టతనూరుహః |

ప్రణమ్య శిరసా దేవ్యై సీతాయై ప్రత్యభాషత ||58.06||


స|| తతః తేన నియుక్తః సంప్రహృష్ట తనూరుహః సః దేవ్యై సీతాయై శిరసా ప్రణమ్య ప్రత్యభాషత ||


||శ్లోకార్థములు||


తతః తేన నియుక్తః - 

అపుడు అతని ( జాంబవంతుని) చేత నియోగించబడి

సంప్రహృష్టతనూరుహః సః - 

తనువు అంతా అనందముతో పులకితుడైన ఆ హనుమ

దేవ్యై సీతాయై శిరసా ప్రణమ్య - 

దేవి సీతకు శిరస్సు వంచి నమస్కరించి

ప్రత్యభాషత - చెప్పసాగెను.


||శ్లోకతాత్పర్యము||


అపుడు జాంబవంతుని చేత ఆ విధముగా నియోగించబడి, తనువు అంతా అనందముతో పులకితుడైన హనుమంతుడు, ఆ దేవి సీతకు శిరస్సు వంచి నమస్కరించి చెప్పసాగెను. ||58.06||


’ప్రణమ్య శిరసా దేవ్యై’, అన్నమాటలో  హనుమకి సీతమ్మవారిపై నున్న భక్తి ఉట్టిపడితుంది.


||శ్లోకము 58.07|| 


ప్రత్యక్షమేవ భవతాం మహేన్ద్రాఽగ్రాత్ ఖమాప్లుతః |

ఉదధేర్దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః ||58.07||


స|| ఉదధేః దక్షిణం పారం కాంక్షమాణః సమాహితః  మహేన్ద్ర అగ్రాత్ ఖం ఆప్లుతః భవతాం  ప్రత్యక్షమేవ || 


గోవిన్దరాజ టీకాలో - ప్రత్యక్షమేవేతి । ఇదం న వక్తవ్యం ఏవ ఇతి భావః॥


|శ్లోకార్థములు||


ఉదధేః దక్షిణం పారం కాంక్షమాణః - 

సాగరముయొక్క దక్షిణతీరము చేరగోరి 

సమాహితః భవతాం - సమాహితులైన మీరందరు

మహేన్ద్ర అగ్రాత్ ఖం ఆప్లుతః ప్రత్యక్షమేవ - 

మహేంద్రపర్వతము నుంచి అకాశము లోకి ఎగురుట మీరు చూచినదే 


||శ్లోకతాత్పర్యము||


’సాగరముయొక్క దక్షిణతీరము చేరగోరి మహేంద్రపర్వతము నుంచి అకాశము లోకి ఎగురుట  సమాహితులైన మీ అందరి  ముందే జరిగినది’. ||58.07||


దానిగురించి చెప్పనవసరము లేదు అని భావము.


||శ్లోకము 58.08|| 


గచ్ఛతశ్చ హి మేఘోరం విఘ్నరూపమివాభవత్ |

కాంచనం శిఖరం దివ్యం పశ్యామి సుమనోహరమ్ ||58.08||


స|| గచ్ఛతః మే ఘోరం విఘ్న రూపం ఇవా అభవత్ | మే దివ్యం సుమనోహరం కాంచనం శిఖరం పశ్యామి || 


|శ్లోకార్థములు||


గచ్ఛతః మే - వెళ్ళుతున్న నాకు

ఘోరం విఘ్న రూపం ఇవా అభవత్ - 

ఘోరమైన విఘ్నము అయినట్లు అనిపించెను

మే దివ్యం సుమనోహరం - 

నేను దివ్యమైన సుందరమైన 

కాంచనం శిఖరం పశ్యామి - 

కాంచన శిఖరము చూచితిని


||శ్లోకతాత్పర్యము||


’వెళ్ళుతున్న నాకు ఘోరమైన విఘ్నము అయినట్లు అనిపించెను. నేను దివ్యమైన సుందరమైన కాంచన శిఖరము చూచితిని’. ||58.08||


ఇది మైనాక వృత్తాంతము.


||శ్లోకము 58.09|| 


స్థితం పన్థానమావృత్య మేనే విఘ్నం చ తం నగమ్ |

ఉపసంగమ్య తం దివ్యం కాంచనం నగసత్తమమ్ ||58.09||

కృతా మే మనసా బుద్ధిర్భేతవ్యోఽయం మయేతి చ |


స|| పన్థానం ఆవృత్య స్థితం తం నగం విఘ్నమ్ మేనే | దివ్యం కాంచనం తం నగసత్తమమ్ ఉపసంగమ్య అయం మయా భేతవ్యః ఇతి మే మనసా బుద్ధిః కృతా ||


||శ్లోకార్థములు||


పన్థానం ఆవృత్య స్థితం - 

దారిలో అడ్డుగా నిలబడి వున్న

తం నగం విఘ్నమ్ మేనే - 

ఆ పర్వతమును విఘ్నముగా భావించితిని

దివ్యం కాంచనం తం నగసత్తమమ్ ఉపసంగమ్య - 

దివ్యమైన బంగారపు పర్వతమును సమీపించి 

 అయం మయా భేతవ్యః ఇతి - 

అది ముక్కలు చేయతగును అని

మే మనసా బుద్ధిః కృతా - 

అని మనస్సులో భావించితిని.


||శ్లోకతాత్పర్యము||


’దారిలో నిలబడి వున్న ఆ పర్వతమును విఘ్నముగా భావించితిని. దివ్యమైన బంగారపు పర్వతమును సమీపించి, అది ముక్కలు చేయతగును అని మనస్సులో భావించితిని’. ||58.09||


 ||శ్లోకము 58.10|| 


ప్రహతం చ మయా తస్య లాంగూలేన మహాగిరేః ||58.10||

శిఖరం సూర్య సంకాశం వ్యశీర్యత సహస్రథా |


స|| మయా లాంగూలేన ప్రహతం తస్య మహాగిరేః సూర్యసంకాశం శిఖరం సహస్రథా వ్యశీర్యత ||


|శ్లోకార్థములు||


మయా లాంగూలేన ప్రహతం - 

నా యొక్క లాంగూలముతో  కొట్టబడి

తస్య మహాగిరేః సూర్యసంకాశం - 

ఆ మహాపర్వతముయొక్క సూర్యునితో సమానముగా ప్రకాశిస్తున్న

శిఖరం సహస్రథా వ్యశీర్యత - 

శిఖరము వేయిముక్కలుగా అయినది


||శ్లోకతాత్పర్యము||


’నా యొక్క లాంగూలముతో  కొట్టబడి, సూర్యునితో సమానముగా ప్రకాశిస్తున్న  ఆ మహాపర్వతము యొక్క శిఖరము వేయిముక్కలుగా అయినది’. ||58.10|| 


||శ్లోకము 58.11|| 


వ్యవసాయం చ తం బుద్ధ్వా స హోవాచ మహాగిరిః ||58.11||

పుత్రేతి మధురాం వాణీం మనః పహ్లాదయన్నివ |


స|| సః మహాగిరిః తం వ్యవసాయం బుద్ధ్వా మనః ప్రహ్లాదయన్నివ పుత్ర ఇతి మధురం వాణీం ఉవాచ హ || 


||శ్లోకార్థములు||


సః మహాగిరిః - ఆ మహాపర్వతము

తం వ్యవసాయం బుద్ధ్వా - 

ఆ కార్యమును గ్రహించి 

మనః ప్రహ్లాదయన్నివ - 

మనస్సును ప్రీతిపొందించునట్లు 

పుత్ర ఇతి మధురం వాణీం ఉవాచ హ -  

"పుత్రా" అని మధురమైన మాటలతో పలికెను


||శ్లోకతాత్పర్యము||


’ఆ మహాపర్వతము ఆ కార్యమును గ్రహించి, మనస్సుతో ప్రీతిపొందించునట్లు  "పుత్రా" అని మధురమైన మాటలతో పలికెను’. ||58.11||


||శ్లోకము 58.12|| 


పితృవ్యం చాపి మాం విద్ధి సఖాయం మాతరిశ్వనః ||58.12||

మైనాకమితి విఖ్యాతం నివసన్తం మహాదధౌ|


స|| మహదధౌ నివసన్తం మైనాకమితి విఖ్యాతం మాతరశ్వినః  సఖాయం| మామ్ పితృవ్యం చాపి విద్ధి ||


||శ్లోకార్థములు||


మహదధౌ నివసన్తం - 

మహా సముద్రములో నివశిస్తున్న

మైనాకమితి విఖ్యాతం - 

మైనాకుడను పేరుతో విఖ్యాతిపొందిన

మాతరశ్వినః  సఖాయం -

 నీ తండ్రియొక్క సఖుడను

మామ్ పితృవ్యం చాపి విద్ధి - 

నన్ను పినతండ్రిగా తెలిసికొనుము


||శ్లోకతాత్పర్యము||


"మైనాకుడను పేరుతో విఖ్యాతిపొంది సముద్రములో నివశిస్తున్న, నేను నీ తండ్రియొక్క సఖుడను. నన్ను నీ పినతండ్రిగా తెలిసికొనుము" అని. ||58.12||


||శ్లోకము 58.13|| 


పక్షవన్తః పురా పుత్త్ర బభూవుః పర్వతోత్తమాః ||58.13||

ఛన్దతః పృథివీం చేరుర్బాధమానాః సమన్తతః |



స|| పుత్త్ర పురా పర్వతోత్తమాః పక్షవన్తః బభూవుః బాధమానాః ఛన్దతః సమన్తతః పృథివీం చేరుః ||


||శ్లోకార్థములు||


పుత్త్ర పురా పర్వతోత్తమాః -

 ఓ కుమారా పూర్వకాలములో పర్వతోత్తములు

పక్షవన్తః బభూవుః - రెక్కలుకలవై ఉండెడివి

ఛన్దతః సమన్తతః - శ్వేచ్ఛగా అన్నిచోటలా తిరుగుచూ

పృథివీం బాధమానాః చేరుః - 

భూమికి బాధలను కలిగిస్తూ వుండెడివి


||శ్లోకతాత్పర్యము||


"ఓ కుమారా పూర్వకాలములో పర్వతోత్తములు రెక్కలుకలవై  తిరుగుతూ ఉండెడివి. ఆ పర్వతములు శ్వేచ్ఛగా అన్నిచోటలా తిరుగుచూ, భూమికి బాధలను కలిగిస్తూ వుండెడివి". ||58.13||


మైనాకుడు తను సముద్రములో ఉండడానికి కారణము చెపుతున్నాడు.


||శ్లోకము 58.14|| 


శ్రుత్వా నగానాం చరితం మహేన్ద్రః పాకశాసనః ||58.14||

చిచ్ఛేద భగవాన్ పక్షాన్ వజ్రేణైషాం సహశ్రసః |


స|| నగానాం చరితం శ్రుత్వా పాకశాసనః మహేన్ద్రః వజ్రేణ ఏషాం సహస్రసః పక్షాన్ చిచ్ఛేద ||


||శ్లోకార్థములు||


నగానాం చరితం శ్రుత్వా - 

ఆ తిరుగుతున్న పర్వతముల గురించి విని 

పాకశాసనః మహేన్ద్రః - 

పాకశాసనుడగు మహేంద్రుడు

వజ్రేణ ఏషాం సహస్రసః పక్షాన్ చిచ్ఛేద- 

వజ్రాయుధముతో  వేలకొలదీ (పర్వతపు) రెక్కలను కొట్టివేసెను


||శ్లోకతాత్పర్యము||


"ఆ తిరుగుతున్న పర్వతముల గురించి విని, పాకశాసనుడగు మహేంద్రుడు, తన వజ్రాయుధముతో  వేలకొలదీ (పర్వతపు) రెక్కలను కొట్టివేసెను." ||58.14||


||శ్లోకము 58.15|| 


అహం తు మోక్షితః తస్మాత్ తవపిత్త్రా మహాత్మనా ||58.15||

మారుతేన తదావత్స ప్రక్షిప్తోఽస్మి మహార్ణవే |


స|| అహం మహాత్మనా తవ పిత్త్రా మారుతేన తస్మాత్ మోక్షితః | వత్స తదా మహార్ణవే ప్రక్షిప్తః అస్మి ||


|శ్లోకార్థములు||


అహం మహాత్మనా - 

నేను మహాత్ముడైన

తవ పిత్త్రా మారుతేన - 

నేను నీ తండ్రి అయిన వాయుదేవునిచే

తస్మాత్ మోక్షితః - 

అతనిని నుండి రక్షింపబడితిని

వత్స తదా మహార్ణవే ప్రక్షిప్తః అస్మి- 

ఓ కుమారా అప్పటినుంచి సాగరములో దాగినవాడను అయితిని


||శ్లోకతాత్పర్యము||


"నేను నీపిత్రుడైన వాయుదేవునిచే, అతని  ( ఇంద్రుని) నుండి రక్షింపబడితిని. ఓ కుమారా, అప్పటినుంచి సాగరములో దాగినవాడను అయితిని". ||58.15||


||శ్లోకము 58.16|| 


రామస్య చ మయా సాహ్యే వర్తితవ్య మరిన్దమ ||58.16||

రామో ధర్మభృతాం శ్రేష్టో మహేన్ద్రసమవిక్రమః |


స|| అరిన్దమ మయా రామస్య చ సాహ్యే వర్తితవ్యం | రామః ధర్మభృతాం శ్రేష్ఠః  మహేన్ద్ర సమవిక్రమః ||


||శ్లోకార్థములు||


అరిన్దమ మయా రామస్య చ - 

ఓ అరిందమ ! నేను రామునికి

సాహ్యే వర్తితవ్యం - 

సహాయముగా ప్రవర్తింపతగును

రామః ధర్మభృతాం శ్రేష్ఠః - 

రాముడు ధర్మము ఆచరించువారిలో శ్రేష్ఠుడు,

మహేన్ద్ర సమవిక్రమః - 

మహేంద్రునితో సమానమైన పరాక్రమము


||శ్లోకతాత్పర్యము||


"ఓ అరిందమ ! నేను రామునికి సహాయముగా ప్రవర్తింపతగును. రాముడు ధర్మము ఆచరించువారిలో శ్రేష్ఠుడు, మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడు". ||58.16||


||శ్లోకము 58.17,18|| 


ఏత చ్ఛ్రుత్వా వచస్తస్య మైనాకస్య మహాత్మనః ||58.17||

కార్యమావేద్య తు గిరే రుద్యతం చ మనో మమ |

తేన చాఽహమనుజ్ఞాతో మైనాకేన మహత్మనా ||58.18||


స|| మహాత్మనః మైనాకస్య తస్య  ఏతత్ వచః  శ్రుత్వా గిరేః కార్యం ఆవేద్య మనః ఉద్యతం అహం తేన మహాత్మనా మైనాకేన అనుజ్ఞాతః చ || 


||శ్లోకార్థములు||


మహాత్మనః మైనాకస్య - 

మహత్ముడైన ఆ మైనాకుని

తస్య  ఏతత్ వచః  శ్రుత్వా -

 ఆ వచనములను విని,

మనః కార్య గిరేః ఆవేద్య  - 

పర్వతరాజమునకు మనస్సులోని కార్యము నివేదించి

ఉద్యతం అహం తేన మహాత్మనా - 

ముందుకు పోవుతున్న నేను

మైనాకేన అనుజ్ఞాతః చ - 

మైనాకుని యొక్క అనుజ్ఞపొందితిని


||శ్లోకతాత్పర్యము||


’మహత్ముడైన ఆ మైనాకుని వచనములను విని, ఆ పర్వతమునకు నా  మనస్సులో  కార్యము గురించి నివేదించి, ముందుకు పోవుటకు ఆ మహాత్ముడైన మైనాకుని అనుజ్ఞ పొందితిని’. ||58.17,18||


||శ్లోకము 58.19|| 


స చాప్యస్తర్హితః శైలో మానుషేణ వపుష్మతా |

శరీరేణ మహాశైలః శైలేన చ మహాదధౌ ||58.19||


స|| సః శైలః మానుషేణ వపుష్మతా అన్తర్హితః మహాశైలః శైలేన శరీరేణ చ మహోదధౌ అన్తర్హితః || 


రామ టీకాలో- వపుష్మతా శోభనావయవవిశిష్టేన శైలేన శరీరేణ శిలామయేన మానుషేణ మనుష్యాకృతినా శరీరేణ ఉపలక్షితాః  మహాన్తః శైలాః గిరయో యస్య గిరీణాం రాజః ఇత్యర్థః శైలః సః మైనాకః మహాదధౌ అన్తర్హితః।


|| శ్లోకార్థములు||


సః శైలః మానుషేణ-  

మానుషరూపము ధరించిన ఆ పర్వతము

వపుష్మతా అన్తర్హితః - 

తన స్వరూపములో దాల్చి

మహాశైలః శైలేన శరీరేణ చ - 

మహాపర్వతము పర్వత రూపములో

మహోదధౌ అన్తర్హితః - 

మహా సాగరములో నిక్షిప్తమాయెను.


||శ్లోకతాత్పర్యము||


’ఆ మానుషరూపము ధరించిన పర్వతము  మరల తన రూపముదాల్చి మహాసాగరములో  నిక్షిప్తమాయెను’. ||58.19||


||శ్లోకము 58.20|| 


ఉత్తమం జవమాస్థాయ శేషం పన్థాన మవస్థితః |

తతోఽహం సుచిరం కాలం వేగేనాభ్యగమం పథి ||58.20||


స|| తతః అహం ఉత్తమం జవం ఆస్థాయ శేషం పన్థానం ఆస్థితః సుచిరం కాలం వేగేన అభ్యాగమమ్ ||


|| శ్లోకార్థములు||


తతః అహం ఉత్తమం జవం ఆస్థాయ - 

అప్పుడు నేను మంచి వేగము పొంది

 శేషం పన్థానం ఆస్థితః - 

అదే మార్గములో పయనిస్తూ

సుచిరం కాలం వేగేన అభ్యాగమమ్- 

చాలాకాలము వేగముగా పోతిని.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను మంచి వేగము పొంది,  అదే మార్గములో పయనిస్తూ చిరకాలము వేగముగా పోయితిని’. ||58.20||


||శ్లోకము 58.21|| 


తతః పశ్యామ్యహం దేవీం సురసాం నాగమాతరం |

సముద్ర మధ్యే సా దేవీవచనమ్ మాం అభాషత ||58.21||


స|| తతః అహం సముద్ర మధ్యే దేవీం సురసాం నాగమాతరం పశ్యామి | మాం సా దేవీ వచనం అభాషత || 


|| శ్లోకార్థములు||


తతః అహం సముద్ర మధ్యే - 

అప్పుడు ఆ సముద్ర మధ్యములో

దేవీం సురసాం నాగమాతరం పశ్యామి- 

నాగమాతయగు సురసా దేవిని చూచితిని

మాం సా దేవీ వచనం అభాషత - 

నాతో ఆ దేవి ఇట్లు పలికెను


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు ఆ సముద్ర మధ్యములో నాగమాతయగు సురసా దేవిని చూచితిని. నాతో ఆ దేవి ఇట్లు పలికెను’. ||58.21||


||శ్లోకము 58.22|| 


మమభక్షః ప్రదిష్టత్వం అమరైః హరిసత్తమ |

అతస్త్వాం భక్షయిష్యామి విహితస్త్వం చిరస్య మే ||58.22||


స|| హరిసత్తమ అమరైః  త్వం మమభక్షః ప్రదిష్టః | అతః త్వాం భక్షయిష్యామి|  త్వం మే చిరస్య విహితః ||   


|| శ్లోకార్థములు||


హరిసత్తమ అమరైః త్వం - 

ఓ హరిసత్తమా! దేవతలచే నీవు

మమభక్షః ప్రదిష్టః -

 నాకు ఆహారముగా పంపబడితివి

అతః త్వాం భక్షయిష్యామి -

 అందువలన నేను నిన్ను భక్షించెదను

త్వం మే చిరస్య విహితః- 

నీవు చాలాకాలము తరువాత లభించినవాడవు


||శ్లోకతాత్పర్యము||


’ఓ హరిసత్తమా! దేవతలచే నీవు నాకు ఆహారముగా పంపబడితివి. అందువలన నేను నిన్ను భక్షించెదను. నీవు చాలాకాలము తరువాత లభించినవాడవు’. ||58.22||


||శ్లోకము 58.23|| 


ఏవముక్తః సురసయా ప్రాంజలిః ప్రణతః స్థితః |

విషణ్ణవదనో భుత్వా వాక్యం చేదముదీరయమ్ ||58.23||


స||సురసయా ఏవం ఉక్తః ప్రాంజలిః ప్రణతః స్థితః| వివర్ణవదనః భూత్వా ఇదం వాక్యం చ ఉదీరయమ్ ||


|| శ్లోకార్థములు||


సురసయా ఏవం ఉక్తః - 

సురస చేత ఈ విధముగా చెప్పబడిన

ప్రాంజలిః ప్రణతః స్థితః - 

నేను చేతులు జోడించి నిలబడితిని

వివర్ణవదనః భూత్వా - వివర్ణవదనముతో 

ఇదం వాక్యం చ ఉదీరయమ్ - 

ఆమెకు ఈ మాటలను చెప్పితిని.


||శ్లోకతాత్పర్యము||


’సురస చేత ఈ విధముగా చెప్పబడిన నేను చేతులు జోడించి నిలబడితిని. వివర్ణవదనముతో, ఆమెకు ఈ మాటలను చెప్పితిని’.  ||58.23||


’దేవతలచే ఆహారముగా పంపబడితివి’, అన్నమాట వినిన హనుమ, సురసని విఘ్నముగా  చూడకుండా, రామకార్యము కూడా దేవతల కార్యమే కనుక, అంగీకారము తీసుకుందామని సురసనే ప్రార్థిస్తాడు.


||శ్లోకము 58.24|| 


రామో దాశరథిః శ్రీమాన్ ప్రవిష్టోదణ్డకావనమ్ |

లక్ష్మణేన సహభ్రాత్రా సీతాయా చ పరన్తపః ||58.24||


స|| పరన్తపః రామః దాశరథిః శ్రీమాన్  సీతాయాః లక్ష్మణేన సహ ప్రవిష్టః దణ్డకావనం || 


|| శ్లోకార్థములు||


పరన్తపః రామః దాశరథిః శ్రీమాన్ - 

శత్రువులను హతమార్చు దశరథ పుత్రుడు రాముడు

సీతాయాః భ్రాత్రా లక్ష్మణేన సహ - 

భార్య సీత తమ్ముడు లక్ష్మణునితో సహా   

దణ్డకావనం ప్రవిష్టః - 

దండకావనము ప్రవేశించెను


||శ్లోకతాత్పర్యము||


"శత్రువులను హతమార్చు దశరథ పుత్రుడు రాముడు,  భార్య సీత తమ్ముడు లక్ష్మణునితో సహా దండకావనము ప్రవేశించెను". ||58.24||


||శ్లోకము 58.25|| 


తస్య సీతా హృతా భార్యా రావణేన దురాత్మనా |

తస్యాస్సకాశం దూతోఽహం గమిష్యే రామశాసనాత్ ||58.25||


స|| తస్య భార్యా సీతా రావణేన దురాత్మనా హృతా | అహం  తస్యాః దూతః | రామశాసనాత్ సకాశం గమిష్యే ||


తిలక టీకాలో  - సకాశం సమీపమ్|


|| శ్లోకార్థములు||


తస్య భార్యా సీతా - 

ఆయన భార్య సీత

రావణేన దురాత్మనా హృతా - 

దురాత్ముడైన రావణుని చే అపహరింపబడెను

అహం తస్యాః దూతః - 

నేను ఆయన దూతను

రామశాసనాత్ సకాశం గమిష్యే -

 రాముని శాసనముతో అమె దగ్గరకు వెళ్ళుచున్నవాడను


||శ్లోకతాత్పర్యము||


"ఆయన భార్య సీత దురాత్ముడైన రావణుని చే అపహరింపబడెను. నేను ఆయన దూతను. రాముని శాసనముతో అమె దగ్గరకు వెళ్ళుచున్నవాడను". ||58.25||


||శ్లోకము 58.26|| 


 కర్తుమర్హసి రామస్య సాహాయ్యం విషయే సతీ |

అథవా మైథిలీం దృష్ట్వా రామం చ క్లిష్టకారిణమ్ ||58.26||

ఆగమిష్యామి తే వక్త్రం సత్యం ప్రతిశృణోమి తే |


స|| సతీ రామం అక్లిష్ఠకారిణం విషయే సాహాయ్యం కర్తుం అర్హసి  | అథవా రామస్య మైథిలీం దృష్ట్వా తే వక్త్రం ఆగమిష్యామి | తే సత్యం ప్రతిశ్రుణోమి | 


రామ టీకాలో- కర్తుం ఇతి | విషయే రామదేశే సతి ఇతి విద్యమానే సాహాయ్యం కర్తుం అర్హసి | నను రామాత్ అహం న బిభేమి ఇతి త్వాం భక్షైష్యామ్యెవేత్యత ఆహ అథవా ఇతి | ప్రతిశృణోమి ప్రతిజ్ఞాం కరోమి |


|| శ్లోకార్థములు||


సతీ రామం అక్లిష్ఠకారిణం విషయే -

 ఓ దేవీ రామునికి ఈ విషయములో

సాహాయ్యం కర్తుం అర్హసి - 

సహాయము చేయతగిన దానవి 

అథవా రామస్య మైథిలీం దృష్ట్వా - 

లేక రామునియొక్క మైథిలిని చూచి

తే వక్త్రం ఆగమిష్యామి - 

నీ నోటిలోకి వచ్చెదను

తే సత్యం ప్రతిశ్రుణోమి- 

నేను సత్యము చెప్పుచున్నవాడను


||శ్లోకతాత్పర్యము||


"ఓ దేవీ, రామునికి ఈ విషయములో సహాయము చేయతగిన దానవి. లేక రామునియొక్క మైథిలిని చూచి, నీ నోటిలోకి వచ్చెదను. నేను సత్యము చెప్పుచున్నవాడను". ||58.26||


రాముని కార్యము చేసి మళ్ళీ వస్తాను నీ నోట్లోకి అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు హనుమ.


||శ్లోకము 58.27|| 


 ఏవముక్తా మయా సాతు సురసా కామరూపిణీ ||58.27||

అబ్రవీన్నాతివర్తేత కశ్చిదేష వరో మమ |


స|| మయా ఏవం ఉక్తా సా సురసా కామరూపిణి అబ్రవీత్ | కశ్చిత్ నాతివర్తేత ఏషః వరః మమ |


తిలక టీకాలో-  నాతివర్తేత నాతిక్రమేత|


|| శ్లోకార్థములు||


మయా ఏవం ఉక్తా - 

నా చేత ఈ విధముగ చెప్పబడి

సా సురసా కామరూపిణి అబ్రవీత్ - 

ఇచ్ఛానుసారముగా రూపములు ధరించగల సురసా ఇట్లు పలికెను

కశ్చిత్ న అతివర్తేత ఏషః వరః మమ- 

నా ఈ వరమును ఎవరూ దాటలేరు


||శ్లోకతాత్పర్యము||


’నా చేత ఈ విధముగ చెప్పబడి, ఇచ్ఛానుసారముగా రూపములు ధరించగల సురసా ఇట్లు పలికెను. "నా ఈ వరమును ఎవరూ దాటలేరు" అని’. ||58.27||


||శ్లోకము 58.28|| 


ఏవముక్త్వా సురసయా దశయోజనమాయతః ||58.28||

తతోర్థగుణవిస్తారో బభూవాహం క్షణేన తు |


స|| సురసయా ఏవం ఉక్తః అహం తతః దశయోజనమ్ ఆయతః  అర్థగుణవిస్తారః క్షణేన బభూవ ||


|| శ్లోకార్థములు||


సురసయా ఏవం ఉక్తః - 

సురస చే ఈ విధముగా చెప్పబడి

అహం తతః దశయోజనమ్ ఆయతః  - 

నేను క్షణములో పది యోజనములు పొడవు

అర్థగుణవిస్తారః క్షణేన బభూవ - 

దానిలో సగము వెడల్పు పెరిగితిని.


||శ్లోకతాత్పర్యము||


’సురస చే ఈ విధముగా చెప్పబడి, క్షణములో పది యోజనములు పొడవు, దానిలో సగము వెడల్పుగా పెరిగితిని’. ||58.28||


||శ్లోకము 58.29|| 


 మత్ప్రమాణానురూపం చ వ్యాదితం చ ముఖం తయా ||58.29||

తద్దృష్ట్వా వ్యాదితం చాస్యం హ్రస్వం హ్యకరవం వపుః |

తస్మిన్ముహూర్తే చ పునః బభూవాంగుష్ఠమాత్రకః ||58.30||


స|| తయా ముఖం మత్ప్రమాణానురూపం వ్యాదితం | వ్యాదితం తత్ ఆస్యం దృష్ట్వా వపుః హ్రస్వం ఆకారవమ్ తస్మిన్ ముహూర్తే పునః అంగుష్ఠమాత్రకః బభూవ||


రామటీకాలో - దశయోజనమాయతః స్వాభావిక దశయోజన విస్త్రుతోఽహం యస్మిన్ కాలే సురసయా ఎవం ఉక్తః తస్మిన్ కాలే  అర్థగుణవిస్తారః  పంచయోజన విస్త్రుతోభభూవతథా సురసయాతు క్షణేనైవ మత్ ప్రమాణాత్ అధికం ముఖం వ్యాదితం తదాస్యం వ్యాదితం దృష్ట్వా అహం హ్రస్వం సూక్ష్మ రూప మకరవమ్।


|| శ్లోకార్థములు||


తయా ముఖం - ఆమె తన నోటిని

మత్ప్రమాణానురూపం వ్యాదితం - 

నా ప్రమాణమునకు అణుగుణముగా పెంచెను

వ్యాదితం తత్ ఆస్యం దృష్ట్వా - 

అలా పెరిగిన ఆమె నోటిని చూచి

తస్మిన్ ముహూర్తే పునః  బభూవ - 

ఆ క్షణములో మరల 

వపుః హ్రస్వం ఆకారవమ్ బభూవ  - 

నా శరీర ప్రమాణమును చిన్నదిగా చేసితిని


||శ్లోకతాత్పర్యము||


’ఆమె తన నోటిని నా ప్రమాణమునకు అణుగుణముగా పెంచెను. అలా పెరిగిన ఆమె నోటిని చూచి నా శరీర ప్రమాణమును చిన్నదిగా చేసితిని’. ||58.29,30||


మొదటి సర్గలో చెప్పబడిన , ’శతయోజన మాయత’ అన్నమాట ఇక్కడ లేదు. అందుకని మొదటి సర్గలో ఈ పెరగడము మీద చెప్పబడిన శ్లోకాలు, ప్రక్షిప్తము అంటే ఎవరో కల్పించినవి అని గోవిన్దరాజులవారి వ్యాఖ్య. 


||శ్లోకము 58.30,31|| 


తస్మిన్ముహూర్తే చ పునః బభూవాంగుష్ఠమాత్రకః ||58.30||

అభిపత్యాశు తద్వక్త్రం నిర్గతోఽహం తతః క్షణాత్ |

అబ్రవీత్సురసా దేవీ స్వేన రూపేణ మాం పునః ||58.31||


స||  తస్మిన్ముహూర్తే చ అహం పునః అంగుష్టమాత్రకః ఆసు తత్ వక్త్రం అభిపత్య క్షణాత్ నిర్గతః| దేవీ సురసయా స్వేన రూపేణ పునః మాం అబ్రవీత్ ||


రామ టీకాలో - అభిపత్య ప్రవిశ్య, క్షణాత్ నిర్గతోఽస్మి ఇతి |


|| శ్లోకార్థములు||


తస్మిన్ముహూర్తే చ - ఆ క్షణములో

అహం పునః అంగుష్టమాత్రకః - 

అంగుష్ఠమాత్రుడను అయిన నేను

ఆసు తత్ వక్త్రం అభిపత్య - 

వెంటనే ఆమె నోటిలో ప్రవేశించి

క్షణాత్ నిర్గతః - 

క్షణములో బయటకు వచ్చితిని

దేవీ సురసయా స్వేన రూపేణ- 

సురసా దేవి తన స్వరూపము ధరించి

 పునః మాం అబ్రవీత్ - 

మరల నాతో ఇట్లు పలికెను


||శ్లోకతాత్పర్యము||


’క్షణములో  అంగుష్ఠమాత్రుడను అయిన నేను, ఆమె నోటిలో ప్రవేశించి క్షణములో బయటకు వచ్చితిని. అప్పుడు సురసా దేవి తన స్వరూపము ధరించి మరల నాతో ఇట్లు పలికెను.’ ||58.30,31||


||శ్లోకము 58.32|| 

 

 అర్థ్యసిద్ధై హరిశ్రేష్ఠ గచ్ఛ సౌమ్య యథాసుఖమ్ |

సమానయచ వైదేహీం రాఘవేణ మహాత్మనా ||58.32||

సుఖీభవమహాబాహో ప్రీతాఽస్మి తవ వానర |


స|| సౌమ్య హరిశ్రేష్ఠ అర్థ్యసిద్ధ్యై యథా సుఖం గచ్చ | వైదేహీం మహాత్మనా రాఘవేణ సమానయ| మహాబలో వానర సుఖీ భవ | తవ ప్రీతా అస్మి ||


రామ టీకాలో - సమానయ సంయోజయ|


|| శ్లోకార్థములు||


సౌమ్య హరిశ్రేష్ఠ -

 ఓ సౌమ్యుడా ! వానర శ్రేష్ఠుడా !

అర్థ్యసిద్ధ్యై - 

నీ కార్యము సిద్ధించుకొని

యథా సుఖం గచ్చ -

 సుఖముగా పొమ్ము

వైదేహీం మహాత్మనా రాఘవేణ సమానయ - 

మహాత్ముడగు రాఘవునితో వైదేహిని చేర్చుము

మహాబలో వానర సుఖీ భవ  - 

మహాబలుడా, సుఖముగా ఉండుము.

తవ ప్రీతా అస్మి- 

నీతో నేను సంతుష్టురాలను అయితిని


||శ్లోకతాత్పర్యము||


’ఓ సౌమ్యుడా, వానర శ్రేష్ఠుడా, నీ కార్యము సిద్ధించును. సుఖముగా పొమ్ము. మహాత్ముడగు రాఘవునితో వైదేహిని చేర్చుము. వానరుడా, మహాబలుడా, సుఖముగా ఉండుము. నీతో నేను చాలా సంతుష్టురాలను అయితిని". ||58.32||


||శ్లోకము 58.33|| 


తతోఽహం సాధు సాధ్వితి సర్వభూతైః ప్రశంసితః ||58.33||

తతోన్తఽరిక్షం విపులం ప్లుతోఽహం గరుడో యథా |


స|| తతః అహం సాధు సాధు ఇతి సర్వభూతైః ప్రశంశితః | తతః అహం గరుడో యథా విపులం అన్తరిక్షం ప్లుతః ||


|| శ్లోకార్థములు||


తతః అహం సర్వభూతైః - 

అప్పుడు నేను సమస్త ప్రాణులచేత

సాధు సాధు ఇతి ప్రశంశితః - 

’బాగు బాగు" అని ప్రశంసించబడితిని

తతః అహం గరుడో యథా - 

పిమ్మట నేను గరుడుని వలె 

విపులం అన్తరిక్షం ప్లుతః - 

అంతరిక్షములో ఎగురుతూ పయనించితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను సమస్త ప్రాణులచేత, "బాగు బాగు" అని ప్రశంసించబడితిని. పిమ్మట నేను గరుడుని వలె అంతరిక్షములో ఎగురుతూ పయనించితిని. ||58.33|| 

 

||శ్లోకము 58.34,35|| 


 చాయామే నిగృహీతా చ న చ పశ్యామి కించన ||58.34||

సోఽహం విగతవేగస్తు దిశోదశ విలోకయన్ |

న కించిత్ తత్ర పశ్యామి యేన మేఽపహృతా గతి ||58.35||’


స|| మే ఛాయా నిగృహీతా కించన | న చ పశ్యామి| విగతవేగః స అహం దశ దిశః విలోకయన్ యేన మే గతిః అపహృతా కించిత్ తత్ర న పశ్యామి || 


|| శ్లోకార్థములు||


మే ఛాయా నిగృహీతా కించన - 

అప్పుడు నా నీడ ఎవరో ఎలాగో పట్టుకొనిరి

న చ పశ్యామి - నాకు ఏమి కనపడలేదు

విగతవేగః స అహం - వేగము పోయిన నేను 

దశ దిశః విలోకయన్ - పది దిక్కులూ చూచితిని

 యేన మే గతిః అపహృతా -

 నా కదలికని ఎవరు అపహరించితిరా అని 

కించిత్ తత్ర న పశ్యామి - 

కాని ఏమీ కనపడ లేదు.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నా నీడ ఎవరో ఎలాగో పట్టుకొనిరి. కాని నాకు ఏమి కనపడలేదు. వేగము పోయిన నేను, నా కదలికని ఎవరు అపహరించితిరా అని, పది దిక్కులూ చూచితిని. కాని ఏమీ కనపడ లేదు’. ||58.34,35||


||శ్లోకము 58.36|| 


తతో మే బుద్ధిరుత్పన్నా కిన్నామ గగనే మమ |

ఈదృశో విఘ్న ఉత్పన్నో రూపం యత్ర న దృశ్యతే ||58.36||


స||తతః మేబుద్ధిః ఉత్పన్నా మమ గగనే యత్ర రూపం న దృశ్యతే కిం నామ ఈదృశః విఘ్నః ఉత్పన్నః ||


|| శ్లోకార్థములు||


తతః మేబుద్ధిః ఉత్పన్నా - 

అప్పుడు నాకు మనస్సులో అనిపించెను

మమ గగనే యత్ర రూపం న దృశ్యతే - 

ఆకాశములో నన్నుఎవరు తనరూపము కనపరచకుండా 

కిం నామ ఈదృశః విఘ్నః ఉత్పన్నః- 

ఈ విధమైన విఘ్నము కలిగించిరి అని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నాకు మనస్సులో అనిపించెను ,"ఆకాశములో నన్నుఎవరు తన రూపము కనపరచకుండా ఈ విధమైన విఘ్నము కలిగించిరి", అని’. ||58.36|| 


||శ్లోకము 58.37|| 


అధో భాగేన మే దృష్టిః శోచతా పాతితా మయా |

తతోఽద్రాక్ష మహం భీమాం రాక్షసీం సలిలేశయామ్ ||58.37||


స|| శోచతా అథో భాగేన మేదృష్టిః మయా పాతితా | తతః సలిలేశయాం మహాం భీమాం రాక్షసీం అద్రాక్షామ్ ||


||శ్లోకార్థములు||


శోచతా అథో భాగేన - 

ఆవిధముగా ఆలోచిస్తూ క్రింద భాగములో

మే దృష్టిః మయా పాతితా - 

నా దృష్టిని ప్రసరించితిని.

తతః సలిలేశయాం మహాం భీమాం - 

అప్పుడు ఆ సలిలాశయములో మహా భయంకరమైన

రాక్షసీం అద్రాక్షామ్ - 

రాక్షసిని చూచితిని


||శ్లోకతాత్పర్యము||


’ఆ విధముగా ఆలోచిస్తూ, క్రింద భాగములో నా దృష్టిని ప్రసరించితిని. అప్పుడు ఆ సలిలాశయములో మహా భయంకరమైన ఒక రాక్షసిని చూచితిని’. ||58.37||    


||శ్లోకము 58.38|| 

  

 ప్రహస్య చ మహానాద ముక్తోఽహం భీమయా తయా |

అవస్థిత మసంభ్రాన్తం ఇదం వాక్యమశోభనమ్ ||58.38||


స||భీమయా తయా మహానాదం ప్రహస్య అవస్థితం అసమ్భ్రాంతం ఇదం అశోభనమ్ వాక్యం (తయా) అహం ఉక్తః || 


|| శ్లోకార్థములు||


భీమయా తయా మహానాదం ప్రహస్య -

 భయంకరమైన ఆమెచేత మహానాదముచేయబడి

అవస్థితం అసమ్భ్రాంతం - గట్టిగా నవ్వి

ఇదం అశోభనమ్ వాక్యం (తయా) అహం ఉక్తః - 

ఈ అశుభకరనైన వాక్యములను నాతో పలికెను


||శ్లోకతాత్పర్యము||


’భయంకరమైన ఆమె మహానాదముచేసి, గట్టిగా నవ్వి, ఈ అశుభకరనైన వాక్యములను నాతో పలికెను’.  ||58.38||


||శ్లోకము 58.39|| 


క్వాసి గన్తా మహాకాయా క్షుధితాయా మమేప్సితః |

భక్షః ప్రీణయ మే దేహం చిరమాహారవర్జితమ్ ||58.39||


స|| ఓ మహాకాయ క్వ గన్తా అసి | క్షుధితాయాః మమ ఈప్సితః భక్షః చిరం ఆహార వర్జితం మే దేహం ప్రీణయ ||


|| శ్లోకార్థములు||


ఓ మహాకాయ క్వ గన్తా అసి - 

ఓ బలసిన శరీరము కలవాడా ఎక్కడికి పోవుచున్నావు

క్షుధితాయాః - 

అకలితోవున్న దానిని

మమ ఈప్సితః భక్షః -

నాకు తినవలెనని కోరిక ఉన్నది

చిరం ఆహార వర్జితం - 

చాలాకాలము ఆహారముతినని 

మే దేహం ప్రీణయ - 

నా దేహమునకు ప్రీతి కలిగించుము.


||శ్లోకతాత్పర్యము||


"ఓ బలసిన శరీరము కలవాడా, ఎక్కడికి పోవుచున్నావు. అకలితోవున్న దానిని. చాలాకాలము ఆహారము తినని నాకు, నిన్ను తినుటకు కోరిక ఉన్నది. నా దేహమునకు ప్రీతి కలిగించుము". అని’. ||58.39||


||శ్లోకము 58.40|| 


 బాఢమిత్యేన తాం వాణీం ప్రత్యగృహ్ణా మహం తతః |

అస్య ప్రమాణా దధికం తస్యాః కాయ మపూరయమ్ ||58.40||


స|| అహం బాడం ఇత్యేవ  తాం వాణీం ప్రత్యగృహ్ణాం | తతః తస్యాః ఆస్యప్రమాణాత్ అధికం కాయం అపూరయమ్ ||


|| శ్లోకార్థములు||


అహం బాడం ఇత్యేవ  - 

నేను సరేనని చెప్పి

తతః తాం వాణీం ప్రత్యగృహ్ణాం - 

అప్పుడు ఆ పలుకుచున్నదాని నోరు పట్టనంతగా

తస్యాః ఆస్యప్రమాణాత్ అధికం - 

దాని నోటి  ప్రమాణమునకు కన్నా అధికముగా 

కాయం అపూరయమ్ - 

(నా) శరీరము పెంచితిని


||శ్లోకతాత్పర్యము||


’నేను సరేనని, ఆ పలుకుచున్నదాని నోరు పట్టనంతగా, దాని ప్రమాణముకన్న అధికముగా, నా శరీరము పెంచితిని’. ||58.40|| 


||శ్లోకము 58.41|| 


తస్యాశ్చాస్యం మహద్భీమం వర్ధతే మమభక్షణే |

న చ మాం సాధు బుబుధే మమ వా వికృతం కృతమ్ ||58.41||


స|| తస్యాః మహత్ భీమం ఆస్యం చ మమభక్షణే | వర్ధతే మాం కృతం మమ వికృతం సాధు న బుబుధే || 


తిలకటీకాలో - మాం సా న బుబుధే, అయం కామరూపీ సర్వ విఘ్ననిర్దలన ఇతి మాం న జ్ఞాతవతీ ఇత్యర్థః మమ కృత వికృతం మయా కృతం వికృతం వికార స్వరూపమ్ వక్షమాణా సూక్ష్మ రూపత్వం చ న బుబుధే ||


|| శ్లోకార్థములు||


తస్యాః మహత్ భీమం ఆస్యం చ - 

అమె తన యొక్క  భయంకరమైన నోరును

 మమభక్షణే  వర్ధతే - 

నన్ను భక్షించుటకు పెంచెను 

మాం కృతం మమ - 

నా చేత చేయబడిన

వికృతం సాధు న బుబుధే - 


నా పన్నుగడ గురించి కాని తెలియదు


||శ్లోకతాత్పర్యము||


’అమె తన యొక్క  భయంకరమైన నోరును నన్ను భక్షించుటకు తెరచెను. పెరుగుచున్నఆమెకు నా గురించి గాని, నా పన్నుగడ గురించి కాని తెలియదు’. ||58.41|| 


తిలక టీకాలో - ఇదే వివరించడమైనది.


||శ్లోకము 58.42|| 


తతోఽహం విపులం రూపం సంక్షిప్య నిమిషాన్తరాత్ |

తస్యా హృదయమాదాయ ప్రపతామి నభః స్థలమ్ ||58.42||


స|| తతః అహం నిమిషాన్తరాత్ విపులం రూపం సంక్షిప్య తస్యాః హృదయం ఆదాయ నభస్థలం ప్రపతామి ||


||శ్లోకార్థములు||


తతః అహం నిమిషాన్తరాత్ - 

అప్పుడు క్షణములో నా

విపులం రూపం సంక్షిప్య - 

విపులమైన  ప్రమాణము తగ్గించి

తస్యాః హృదయం ఆదాయ - 

అమె లోకి ప్రవేశించి  హృదయము పెకలించి

నభస్థలం ప్రపతామి- 

ఆకాశములోకి ఎగిరిపోయితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు క్షణములో నా విపులమైన  ప్రమాణము తగ్గించి అమె లోకి ప్రవేశించి  హృదయము పెకలించి ఆకాశములోకి ఎగిరిపోయితిని.’ ||58.42||


||శ్లోకము 58.43|| 


 సా విసృష్టభుజా భీమా పపాత లవణాంభసి |

మయా పర్వతసంకాశా నికృత్త హృదయా సతీ ||58.43||


స|| భీమా పర్వతసంకాశా సా మయా నికృత హృదయా సతీ విశ్రుష్టభుజా లవణాంభసి పపాత||



|| శ్లోకార్థములు||


భీమా పర్వతసంకాశా సా - 

భయంకరమైన పర్వతము తో సమానమైన ఆమె

మయా నికృత హృదయా సతీ - 

నా చేత హృదయముపెకలింపబడినదై

విశ్రుష్టభుజా లవణాంభసి పపాత - 

భుజములు వేలాడేసుకొని సముద్రములో పడిపోయెను


||శ్లోకతాత్పర్యము||


’భయంకరమైన పర్వతము తో సమానమైన ఆమె , నా చేత హృదయము పెకలింపబడినదై, భుజములు వేలాడేసుకొని సముద్రములో పడిపోయెను’. ||58.43|| 


||శ్లోకము 58.44|| 


శృణోమి ఖగతానాం చ సిద్ధానాం చారణైః సహ |

రాక్షసీ సింహికా భీమా క్షిప్రం హనుమతా హతా ||58.44||


స|| చారణైః సహ ఖగతానాం సిద్ధానాం చ భీమా రాక్షసీ సింహికా క్షిప్రం హనుమతా హతా శ్రుణోమి ||


|| శ్లోకార్థములు||


చారణైః సహ ఖగతానాం సిద్ధానాం చ - 

అపుడు చారుణులతో సహా ఆకాశములో వశించు సిద్ధులు

భీమా రాక్షసీ సింహికా క్షిప్రం - 

భయంకరమైన రాక్షసి సింహిక క్షణములో

హనుమతా హతా - 

హనుమంతుని చే హతమార్చబడినది

శ్రుణోమి -  వింటిని


||శ్లోకతాత్పర్యము||


’అపుడు చారుణులతో సహా ఆకాశములో వశించు సిద్ధులు, "భయంకరమైన రాక్షసి సింహిక హనుమంతుని చే హతమార్చబడినది" అని అనడము వింటిని’. ||58.44||


||శ్లోకము 58.45|| 


 తాం హత్వా పునరేవాఽహం కృత్య మాత్యయికం స్మరన్ |

గత్వా చాహం మహాధ్వానం పశ్యామి నగమణ్డితమ్ ||58.45||

దక్షిణం తీర ముదధేః లంకా యత్ర చ సా పురీ |


స|| అహం తామ్ హత్వా పునరేవ అత్యధికం కృత్యం స్మరన్ మహత్ అధ్వానం గత్వా యత్ర సాలంకాపురీ (అస్తి)  (తత్ర) ఉదధేః దక్షిణమ్ తీరం పశ్యామి ||


గోవిన్దరాజ టీకాలో - కృత్యమాత్యయికం స్మరన్। ప్రాణాంతికం తత్ కర్మ విచిన్వన్  ఇత్యర్థః।


|| శ్లోకార్థములు||


అహం తామ్ హత్వా - నేను ఆమెను హతమార్చి

పునరేవ అత్యధికం కృత్యం స్మరన్ - 

మరల ఆ చేసిన కార్యమునే స్మరించుచూ

మహత్ అధ్వానం గత్వా - చాలాదూరము పయనించి 

యత్ర సాలంకాపురీ (అస్తి)  - ఎక్కడ లంకాపురికలదో

(తత్ర) ఉదధేః దక్షిణమ్ తీరం పశ్యామి - 

అక్కడ ఆ  సముద్రముయొక్క దక్షిణ తీరము చూచితిని


||శ్లోకతాత్పర్యము||


’నేను ఆమెను హతమార్చి మరల ఆ చేసిన కార్యమునే స్మరించుచూ, చాలాదూరము పయనించి, ఎక్కడ లంకాపురికలదో అక్కడ ఆ  సముద్రముయొక్క దక్షిణ తీరము చూచితిని’. ||58.45|| 


||శ్లోకము 58.46|| 


అస్తం దినకరే యాతే రక్షసాం నిలయం పురమ్ ||58.46||

ప్రవిష్టోఽహం అవిజ్ఞాతో రక్షోభిర్భీమవిక్రమైః |


స|| దినకరే అస్తం యాతే  అహం భీమవిక్రమైః రక్షోభిః అవిజ్ఞాతః రక్షసాం నిలయం పురం ప్రవిష్టః ||


రామ టీకాలో - రక్షోభిః అవిజ్ఞాతోఽహం పురీం లంకా ప్రవిష్టః।


|| శ్లోకార్థములు||


దినకరే అస్తం యాతే  - 

దినకరుడు అస్తమించిన తరువాత

అహం భీమవిక్రమైః రక్షోభిః - 

నేను భయంకర పరాక్రమము గల రాక్షసులకు

రక్షసాం నిలయం పురం - 

రాక్షసులకు నిలయమైన పురమును 

అవిజ్ఞాతః ప్రవిష్టః - 

తెలియకుండా ప్రవేశించితిని


||శ్లోకతాత్పర్యము||


’దినకరుడు అస్తమించిన తరువాత నేను, భయంకర పరాక్రమము గల రాక్షసులకు తెలియకుండా, రాక్షసులకు నిలయమైన ఆ పురములో ప్రవేశించితిని’. ||58.46||


||శ్లోకము 58.47|| 


 తత్ర ప్రవిశతశ్చాపి కల్పాన్తఘనసన్నిభా ||58.47||

అట్టహాసం విముంచ్యన్తీనారీ కాఽప్యుత్థితా పురః |


స|| తత్ర ప్రవిశతః పురః కల్పాన్తఘనసన్నిభా కాపి నారీ అట్టహాసం విముంచన్తీ ఉత్థితా||


|| శ్లోకార్థములు||


తత్ర ప్రవిశతః పురః- 

అక్కడ పురము ప్రవేశించుచుండగా

కల్పాన్తఘనసన్నిభా కాపి నారీ - 

ప్రళయకాల మేఘములను బోలిన ఒక స్త్రీ

అట్టహాసం విముంచన్తీ ఉత్థితా - 

అట్టహాసము చేస్తూ ఎదురుగా లేచి నిలబడెను 


||శ్లోకతాత్పర్యము||


’అక్కడ ప్రవేశించుచుండగా, ప్రళయకాల మేఘములను బోలిన ఒక స్త్రీ,  అట్టహాసము చేస్తూ ఎదురుగా లేచి నిలబడెను’. ||58.47||


||శ్లోకము 58.48|| 


జిఘాం సన్తీం తతస్తాం తు జ్వలదగ్నిశిరోరుహామ్ ||58.48||

సవ్యముష్టిప్రహారేణ పరాజిత్య సుభైరవామ్ |

ప్రదోషకాలే ప్రవిశన్ భీతయాఽహం తయోదితః ||58.49||


స|| తతః జిఘాంసన్తీం జ్వలదగ్ని శిరోరుహాం సుభైరవాం తాం సవ్యముష్టి ప్రహారేన  పరాజిత్య ప్రదోషకాలే ప్రవిశం అహం భీతయా తయా ఉదితః || 


తిలక టీకాలో - సుభైరవామ్ అతిశయేన భయంకర రూపామ్


|| శ్లోకార్థములు||


తతః జిఘాంసన్తీం - 

అప్పుడు మండుతున్న 

జ్వలదగ్ని శిరోరుహాం సుభైరవాం - 

జ్వాలాగ్నిలాంటి ఎర్రని కేశములు గల

తాం సవ్యముష్టి ప్రహారేన పరాజిత్య- 

ఆమెను  ఎడమ చేతి పిడికలతో కొట్టి పరాజించి  

ప్రదోషకాలే ప్రవిశం అహం -

 ప్రదోషకాలములో ప్రవేశించుతున్న నాతో

భీతయా తయా ఉదితః -  

భయపడిన ఆమె చేత  ఇట్లు చెప్పబడితిని 


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు మండుతున్న అగ్నిలాంటి ఎర్రని కేశములు గల ఆమె,  నన్ను కొట్టుటకు ప్రయత్నించగా, ఎడమ చేతి పిడికలతో కొట్టి, ఆమెని పరాజించితిని. అప్పుడు భయపడిన ఆ రాక్షసి, ప్రదోషకాలములో ప్రవేశించుతున్న నాతో, ఇట్లు పలికెను’. ||58.48,49||


||శ్లోకము 58.50|| 


అహం లంకాపురీ వీర నిర్జితా విక్రమేణ తే |

యస్మాత్తస్మాద్విజేతాఽసి సర్వరక్షాంస్యశేషతః ||58.50||


స|| వీర అహం లంకాపురీ తే విక్రమేణ నిర్జితా | తస్మాత్ సర్వరక్షాంసి అశేషతః విజేతాసి ||


రామ టీకాలో- యస్మాత్ - తే త్వయా అహం నిర్జితా తస్మాత్ సర్వరక్షాంసి త్వం విజేతాఽసి॥


|| శ్లోకార్థములు||


వీర అహం లంకాపురీ - ఓ వీర నేను లంకాపురిని

తే విక్రమేణ నిర్జితా - నీ పరాక్రమము చేత జయించబడితిని

తస్మాత్ సర్వరక్షాంసి - అందువలన నీవు రాక్షసులందరిని

అశేషతః విజేతాసి- నిశ్శేషముగా జయించెదవు


||శ్లోకతాత్పర్యము||


"ఓ వీర నేను లంకాపురిని. నీ పరాక్రమము చేత జయించబడితిని. అందువలన నీవు రాక్షసులందరిని నిశ్శేషముగా జయించెదవు". ||58.50||


ఇక్కడ లంకిణీ చెప్పిన స్వయంభూ వృత్తాంతము హనుమ చెప్పలేదు.


||శ్లోకము 58.51|| 


తత్రాహం సర్వరాత్రం తు విచిన్వన్ జనకాత్మజామ్ |

రావణాన్తః పురగతో న చాపశ్యం సుమధ్యమామ్ ||58.51||


స|| అహం తత్ర రావణాన్తః పురః  సర్వరాత్రం జనకాత్మజాం విచిన్వన్ గతఃసుమధ్యమాం న అపశ్యం చ || 


|| శ్లోకార్థములు||


అహం తత్ర రావణాన్తః పురః - 

నేను అప్పుడు రావణాంతః పురములో

సర్వరాత్రం జనకాత్మజాం విచిన్వన్ గతః- 

రాత్రి అంతా జనకాత్మజను వెతుకుతూ వెళ్ళితిని

సుమధ్యమాం న అపశ్యం చ - 

ఆ సుమధ్యమ కూడా కనపడలేదు 


||శ్లోకతాత్పర్యము||


’నేను అప్పుడు రాత్రి అంతా రావణాంతః పురములో జనకాత్మజను వెతుకుతూ వెళ్ళితిని. ఆ సుమధ్యమ కనపడలేదు’. ||58.51||


||శ్లోకము 58.52|| 


తతస్సీతా మపశ్యంస్తు రావణస్య నివేశనే |

శోకసాగరమాసాద్య న పార ముపలక్షయే ||58.52||


స|| తతః రావణస్య నివేశనే సీతాం అపశ్యం శోకసాగరం ఆసాద్య  పారం న ఉపలక్షయే ||


|| శ్లోకార్థములు||


తతః రావణస్య నివేశనే - 

అప్పుడు రావణుని నివేశములో

సీతాం అపశ్యం - 

సీత కనపడక పోవడముతో

శోకసాగరం ఆసాద్య - 

శోకసాగరములో పడి 

పారం న ఉపలక్షయే - 

తీరము పొందలేకపోయితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు రావణుని నివేశములో సీత కనపడక పోవడముతో , తీరము లేని శోకసాగరములో పడిపోతిని’. ||58.52||


||శ్లోకము 58.53|| 


శోచతా చ మయాదృష్టం ప్రాకారేణ సమావృతమ్ |

కాంచనేన వికృష్టేన గృహోపవనముత్తమమ్ ||58.53||


స|| శోచతా మయా  కాంచనేన వికృష్టేన   ప్రాకారేణ సమావృతం ఉత్తమం గృహోపవనం దృష్టం ||


|| శ్లోకార్థములు||


శోచతా మయా - 

అలా అలోచనలో ఉన్న నాచేత 

కాంచనేన వికృష్టేన ప్రాకారేణ సమావృతం - 

బంగారపు ప్రాకారములు చే చుట్టబడి వున్న

ఉత్తమం గృహోపవనం దృష్టం - 

ఉత్తమమైన ఉపగృహమును చూడబడెను.


||శ్లోకతాత్పర్యము||


’అలా అలోచనలో ఉన్న నాచేత, బంగారపు ప్రాకారములు కల ఉత్తమమైన ఉపగృహము చూడబడెను’.  ||58.53||


||శ్లోకము 58.54|| 


సప్రాకార మవప్లుత్య పశ్యామి బహుపాదపమ్ |

అశోకవనికామధ్యే శింశుపాపాదపోమహాన్ ||58.54||

తమారుహ్య చ పశ్యామి కాంచనం కదళీవనమ్ |


స|| స ప్రాకారం అవప్లుత్య బహుపాదపం పశ్యామి | అశోకవనికా మధ్యే మహాన్ శింశుపా పాదపః | తం ఆరుహ్య కాంచనం కదలీవనం పశ్యామి ||


రామ టీకాలో - స దృష్టోపవనోఽహం బహవః పాదపాః యత్ సమీపే  తం ప్రాకారమవప్లుత్య అశోకవనికా మధ్యే యో మహాన్ శింశుపా పాదపః తం ఆరుహ్య కాంచన వర్ణ విశిష్ట కదలీవనం పశ్యామి అపశ్యమ్ ।


|| శ్లోకార్థములు||


స ప్రాకారం అవప్లుత్య - అ ప్రాకారము దాటి

బహుపాదపం  అశోకవనికా మధ్యే - 

అనేక వృక్షములుకల అశోకవనిక మధ్యలో

మహాన్ శింశుపా పాదపః పశ్యామి - 

మహత్తరమైన శింశుపా వృక్షము చూచితిని

 తం ఆరుహ్య కాంచనం కదలీవనం పశ్యామి - 

అది ఎక్కి బంగారపు కదళీ వనము చూచితిని


||శ్లోకతాత్పర్యము||


 ’అ ప్రాకారము దాటి, అనేక వృక్షములు కల ఆ అశోకవనిక మధ్యలో ఒక మహత్తరమైన శింశుపా వృక్షము చూచితిని. అది ఎక్కి బంగారపు కదళీ వనము చూచితిని’. ||58.54||


||శ్లోకము 58.55,56,57|| 


 అదూరే శింశుపావృక్షాత్ పశ్యామి వరవర్ణినీమ్ ||58.55||

శ్యామాం కమలపత్రాక్షీ ముపవాసకృశాననామ్ |


తదేకవాసస్సంవీతాం రజోధ్వస్త శిరోరుహామ్ ||58.56||

శోకసన్తాప దీనాంగీం సీతాం భర్తృహితే స్థితామ్ |


రాక్షసీభిర్విరూపాభిః క్రూరాభి రభిసంవృతామ్ ||58.57||

మాంసశోణిత భక్షాభిః వ్యాఘ్రీభిర్హరిణీమివ |


స||  శింశుపావృక్షాత్ అదూరాత్ వరవర్ణినీం శ్యామాం కమలపత్రాక్షీం ఉపవాసకృశాననాం తదేక వాసః సంవీతాం రజోధ్వస్త శిరోరుహాం శోకసంతాప దీనాంగీం భర్తృ హితే స్థితాం విరూపాభిః క్రూరాభిః మాంసశోణిత భక్షాభిః రాక్షసీభిః వ్యాఘ్రభీః హరిణీం ఇవ అభిసంవృతాం సీతాం పశ్యామి||


గోవిన్దరాజ టీకాలో- శింశుపావృక్షాత్ శింశుపా వృక్షస్య । శ్యామాం యౌవనమధ్యస్థామ్ తదేకవాసః సంవీతాం యేన వాససా హృతా తేనైకవాససా సంవీతాం యద్వా తేన తత్కాల దృష్టేన పూర్వ దృష్టేన ఏకేన వాససా సంవీతామ్ వేపాన్తర నిస్స్పృహామ్ ఇత్యర్థః । మానసికత్వ కాయికత్వ భేదేన శోకసంతాపయోః భేదః॥  


|| శ్లోకార్థములు||


శింశుపావృక్షాత్ అదూరాత్ - 

శింశుపా వృక్షమునకు దగ్గరే 

వరవర్ణినీం శ్యామాం - 

ఆకర్షణీయమైన, మంచి వర్ణముకల

కమలపత్రాక్షీం ఉపవాసకృశాననాం - 

కలువరేకులవంటి కళ్ళుగలఉపవాసములచే కృశించిన శరీరము కల

తదేక వాసః సంవీతాం - 

ఒకే గుడ్డను ధరించిన

రజోధ్వస్త శిరోరుహాం - 

ధూళితోకప్పబడిన శిరోజములతోనున్న

శోకసంతాప దీనాంగీం - 

శోకసంతాపములలో ములిగివున్న

భర్తృ హితే స్థితాం - భర్త హితమే కోరుకొను 

విరూపాభిః క్రూరాభిః -

 కౄరులు వికృత రూపము గలవారు

మాంసశోణిత భక్షాభిః రాక్షసీభిః - 

రక్తమాంసభక్షకులు అయిన రాక్షసస్త్రీలచేత 

వ్యాఘ్రభీః అభిసంవృతాం హరిణీం ఇవ - 

ఆడపులులు చుట్టుముట్టబడిన లేడి వలెనున్న ,

సీతాం పశ్యామి - సీతను చూచితిని


||శ్లోకతాత్పర్యము||


’శింశుపా వృక్షమునకు దగ్గరే ఆకర్షణీయమైన, మంచి వర్ణముకల, కలువరేకులవంటి కళ్ళుగల, ఉపవాసములచే కృశించిన శరీరము కల, ఒకే గుడ్డను ధరించిన, ధూళితోకప్పబడిన శిరోజములతోనున్న, శోకసంతాపములలో ములిగివున్న, కౄరులు వికృత రూపము గలవారు, రక్త మాంసభక్షకులు చేత, ఆడపులులు చుట్టుముట్టబడిన లేడి వలెనున్న, సీతను చూచితిని’. ||58.55,56,57||


||శ్లోకము 58.58|| 


 సా మయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః ||58.58||

ఏకవేణీధరా దీనా భర్తృచిన్తాపరాయణా|

భూమిశయ్యా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే ||58.59||

రావణాత్ వినివృతార్థా మర్తవ్యకృతనిశ్చయా |

కథంచిన్ మృగశాబాక్షీ తూర్ణమాసాదితా మయా ||58.60||


స|| ముముర్ముహుః తర్జ్యమానా ఏకవేణీ ధరా దీనా భర్తృ చిన్తాపరాయణా భూమిశయ్యా వివర్ణాంగీ హిమాగమే పద్మినీమ్ ఇవ రావణాత్  వినివృతార్థం మర్తవ్య కృతనిశ్చయా  సా మయా రాక్షసీ మధ్యే అసాదితా మృగశాబాక్షీ మయా కథం చిత్ తూర్ణం ఆసాదితా ||


|| శ్లోకార్థములు||


ముముర్ముహుః తర్జ్యమానా - 

ప్రతి క్షణము భయపెట్టబడుచున్న

ఏకవేణీ ధరా దీనా - 

ఒకేజడవేసికుని ఉన్న

భర్తృ చిన్తాపరాయణా - 

భర్తను గురించే అలోచనలో ఉన్న

భూమిశయ్యా వివర్ణాంగీ - 

భూమి మీద పడుకొని వివర్ణ వదనము కల

హిమాగమే పద్మినీమ్ ఇవ -

 మంచుపడిన పద్మము వలెనున్న

రావణాత్  వినివృతార్థం - 

రావణునిపై అసహ్యభావముతో 

మర్తవ్య కృతనిశ్చయా - 

మరణించుటకు నిశ్చయము చేసికొనివున్న 

రాక్షసీ మధ్యే మృగశాబాక్షీ -  

రాక్షసస్త్రీల మధ్య ఆడలేడి వంటి చూపులు గల 

సా మయా కథంచిత్ తూర్ణం ఆసాదితా - 

ఆమెను ఎలాగో చివరికి చూడకలిగితిని


||శ్లోకతాత్పర్యము||


’ప్రతి క్షణము భయపెట్టబడుచున్న, ఒకే జడ వేసుకుని ఉన్న, భర్తను గురించే అలోచనలో ఉన్న, భూమి మీద పడుకొనివున్న, వివర్ణ వదనము కల, మంచుపడిన పద్మము వలెనున్న , రావణునిపై అసహ్యభావముతో మరణించుటకు నిశ్చయము చేసికొనివున్న, రాక్షసస్త్రీల మధ్య ఆడలేడి వంటి చూపులు గల ఆమెను ఎలాగో చివరికి చూడకలిగితిని’. ||58.58,59,60||


||శ్లోకము 58.61|| 


తాం దృష్ట్వా తాదృశీం నారీం రామపత్నీం యశస్వినీమ్ |

తత్రైవ శింశుపావృక్షే పశ్యన్నహమవస్థితః ||58.61||


స|| అహం తాదృశీమ్ నారీం యశస్వినీమ్ తాం రామపత్నీం దృష్ట్వా తత్ర శింశుపా వృక్షే అవస్థితః||


|| శ్లోకార్థములు||


అహం తాదృశీమ్ నారీం యశస్వినీమ్ - 

నేను అలాంటి యశోవంతురాలైన స్త్రీని

తాం రామపత్నీం దృష్ట్వా- 

ఆ రామ పత్నిని చూచి

తత్ర శింశుపా వృక్షే అవస్థితః-

 ఆ శింశుపా వృక్షములోనే ఉంటిని


||శ్లోకతాత్పర్యము||


’నేను అలాంటి యశోవంతురాలైన, స్త్రీని,  రామ పత్నిని చూచి ఆ శింశుపా వృక్షములోనే ఉంటిని’. ||58.61||


 ||శ్లోకము 58.62|| 


 తతో హలహలాశబ్దం కాఞ్చీనూపురమిశ్రితమ్ |

శ్రుణోమ్యధిక గమ్భీరం రావణస్య నివేశనే ||58.62||


స|| తతః రావణస్య నివేశనే కాచినూపుర మిశ్రితం అధిక గంభీరం హలహలాశబ్దం శృణోమి ||


|| శ్లోకార్థములు||


తతః రావణస్య నివేశనే -

 అప్పుడు రావణాంతఃపురము నుండి

కాచినూపుర మిశ్రితం - 

వడ్డాణాలకున్న మువ్వల, కాలి అందెల సవ్వడులతో కలిసిన,

అధిక గంభీరం హలహలాశబ్దం - 

పెద్ద గంభీరమైన కోలాహల శబ్దము

శృణోమి- విన్నాను.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు రావణాంతఃపురము నుండి వడ్డాణాలకున్న మువ్వల, కాలి అందెల సవ్వడులతో కలిసిన, పెద్ద గంభీరమైన కోలాహలం విన్నాను’. ||58.62|| 


||శ్లోకము 58.63|| 


తతోఽహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రతిసంహరన్ |

అహం తు శింశుపావృక్షే పక్షీవ గహనే స్థితః ||58.63||


స|| తతః అహం పరమోద్విగ్నః స్వం రూపం ప్రత్యసంహరన్ అహం తు గహనే శింశుపావృక్షే పక్షీవ స్థితః ||


రామ టీకాలో - ప్రత్యసంహరన్ సూక్ష్మం అకరవమ్ |


|| శ్లోకార్థములు||


తతః అహం పరమోద్విగ్నః - 

అప్పుడు కలవరపడి నేను 

స్వం రూపం ప్రత్యసంహరన్ - 

నా స్వరూపమును దాచుకుంటూ

అహం తు గహనే శింశుపావృక్షే -

 నేను శింశుపా వృక్షములోనే

పక్షీవ స్థితః - పక్షి వలె ఉండిపోతిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు కలవరపడి నేను వళ్ళు కుదుచ్చుకొని, శింశుపా వృక్షములోనే పక్షి వలె ఉండిపోయాను’. ||58.63|| 


||శ్లోకము 58.64|| 


తతో రావణ దారాశ్చ రావణశ్చ మహాబలః |

తం దేశం సమనుప్రాప్తా యత్ర సీతాఽభవత్ స్థితా ||58.64||


స|| తతః మహాబలః రావణః రావణశ్చ దారాః చ  యత్ర సీతా  స్థితా అభవత్ తం దేశం సమనుప్రాప్తాః ||


|| శ్లోకార్థములు||


తతః మహాబలః రావణః - అప్పుడు మహాబలుడైన రావణుడు

రావణశ్చ దారాః చ  - రావణుని భార్యలతో కూడా 

యత్ర సీతా  స్థితా అభవత్ - ఎక్కడ సీత కూర్చుని ఉన్నదో 

తం దేశం సమనుప్రాప్తాః - ఆ ప్రదేశమునకు వచ్చెను.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు మహాబలుడైన రావణుడు తన భార్యలతో సహా,  సీత ఉన్న ఆ ప్రదేశమునకు వచ్చెను’. ||58.64||


||శ్లోకము 58.65|| 


  తం దృష్ట్వాఽథ వరారోహా సీతా రక్షోగణేశ్వరమ్ |

సంకుచ్యోరూస్తనౌ పీనౌ బాహూభ్యాం పరిరభ్య చ ||58.65||


స|| అథ వరారోహా సీతా రక్షోగణేశ్వరం తం దృష్ట్వా ఊరు బాహుభ్యాం  సంకుచ్య పీనౌ స్తనౌ పరిరభ్యచ ||


|| శ్లోకార్థములు||


అథ వరారోహా సీతా - 

అప్పుడు ఉత్తమురాలైన సీత

రక్షోగణేశ్వరం తం దృష్ట్వా - 

ఆ రాక్షస గణములకు అధిపతి అయిన వానిని చూచి

ఊరు బాహుభ్యాం సంకుచ్య - 

తన బాహువులను భుజములను ముడుచుకొని

పీనౌ స్తనౌ పరిరభ్యచ - 

తన స్తనములను దాచుకొనెను


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు ఉత్తమురాలైన సీత, ఆ రాక్షస గణములకు అధిపతి అయిన వానిని చూచి, తన బాహువులను భుజములను ముడుచుకొని, తన స్తనములను దాచుకొనెను’. ||58.65||


||శ్లోకము 58.66|| 


విత్రస్తాం పరమోద్విగ్నాం వీక్షమాణాం తతస్తతః |

త్రాణాం కించిదపశ్యన్తీం వేపమానాం తపస్వినీమ్ ||58.66||


స|| విత్రస్తామ్ పరమోద్విగ్నాం తతః తతః వీక్షమానాం కించిత్ త్రాణాం అపశ్యన్తీం వేపమానాం తపస్వినీం ||


రామటీకాలో - కంచిత్ త్రాణాం త్రాణకారకమ్ అపశ్యన్తీం అతయేవ  విత్రస్తామ్ అతయేవ పరమోద్విగ్నాం అతయేవ ఇతః తతః వీక్ష్య మాణాం  తాం సీతాం రావణః ఉవాచ |


|| శ్లోకార్థములు||


విత్రస్తామ్ పరమోద్విగ్నాం - 

భయముతో వణికిపోతున్న, పరమ దుఃఖములో ఉన్న

తతః తతః వీక్షమానాం - 

అటూ ఇటూ చూచుచూ 

కించిత్ త్రాణాం అపశ్యన్తీం  - 

తనను రక్షించువారు కనపడక

వేపమానాం తపస్వినీం - 

వణికిపోతూవున్నఉన్న తపస్విని 


||శ్లోకతాత్పర్యము||


’భయముతో వణికిపోతున్న, అటూ ఇటూ చూచుచూ తనను రక్షించువారు కనపడక వణికిపోతూవున్న తపస్విని, పరమ దుఃఖములో ఉన్నది’. ||58.66||


||శ్లోకము 58.67|| 


తామువాచ దశగ్రీవః సీతాం పరమదుఃఖితా |

అవాక్శిరాః ప్రపతితో బహుమన్యస్వ మామితి ||58.67||


స|| పరమదుఃఖితాం తాం సీతాం దశగ్రీవః అవాక్శిరాః ప్రతీతం మామ్ బహుమన్యస్వ ఇతి ఉవాచ || 


గోవిన్దరాజ టీకాలో - అవాక్శిరాః అవనత మూర్ధా ప్రపతితః భూమావితి శేషః |


రామటీకాలో - అవాక్‍శిరాః సన్ ప్రయతితో దశగ్రీవం మాం బహు అధిక సేవాకర్తృత్వేన అధికం మన్యస్వ |


|| శ్లోకార్థములు||


 పరమదుఃఖితాం తాం సీతాం - 

పరమ దుఃఖములో వున్న సీతను

దశగ్రీవః అవాక్శిరాః ప్రతీతం - 

దశకంఠుడు తన తలవంచి

 ప్రతీతం మామ్- నన్ను నమ్ముము

బహుమన్యస్వ ఇతి ఉవాచ- 

అంగీకరించుము అని చెప్పెను.


||శ్లోకతాత్పర్యము||


’పరమ దుఃఖములో వున్న సీతను, దశకంఠుడు తన తలవంచి,  "ఓ సీతా నన్ను నమ్మి అంగీకరించుము", అని చెప్పెను.’ ||58.67||


||శ్లోకము 58.68|| 


యదిచేత్త్వం తు దర్పానామాం నాభినన్దసి గర్వితే |

ద్వౌమాసానన్తరం సీతే పాస్యామి రుధిరం తవ ||58.68||


స|| గర్వితే సీతే త్వం దర్పాత్ మమ న అభినన్దసి యది చేత్ ద్వౌ మాసౌ తవ రుధిర పశ్యామి ||


|| శ్లోకార్థములు||


గర్వితే సీతే -

 గర్వము కల సీతా

త్వం దర్పాత్ మమ - 

నీ దర్పముతో నన్ను

న అభినన్దసి యది చేత్ -

 ఒకవేళ నిరాకరించినచో

ద్వౌ మాసౌ తవ రుధిర పశ్యామి- 

రెండుమాసముల తరువాత నీ రక్తము చూచెదను


||శ్లోకతాత్పర్యము||


"గర్వముతో నన్నునిరాకరిస్తే, ఓ సీతా, రెండుమాసముల తరువాత నీ రక్తము చూచెదను" అని.’ ||58.68||


||శ్లోకము 58.69|| 


  ఏతత్చ్రుత్వా వచస్తస్య రావణస్య దురాత్మనః |

ఉవాచ పరమకృద్ధా సీతా వచనముత్తమమ్ ||58.69||


సా|| దురాత్మనః తస్య రావణస్య వచః శ్రుత్వా పరమకృద్ధా సీతా ఉత్తమం వచనం ఉవాచ ||


|| శ్లోకార్థములు||


దురాత్మనః తస్య రావణస్య వచః శ్రుత్వా - 

దురాత్ముడైన ఆ రావణుని  యొక్క మాటలను విని 

పరమకృద్ధా సీతా - పరమ కోపముతో సీత 

ఉత్తమం వచనం ఉవాచ- ఉత్తమమైన మాటలను చెప్పెను


||శ్లోకతాత్పర్యము||


’దురాత్ముడైన ఆ రావణుని  యొక్క మాటలను విని పరమ కోపముతో సీత ఉత్తమమైన మాటలను చెప్పెను’. ||58.69||


||శ్లోకము 58.70|| 


రాక్షసాధమ రామస్య భార్యామమిత తేజసః |

ఇక్ష్వాకుకులనాథస్య స్నుషాం దశరథస్య చ ||58.70||

అవాచ్యం వదతో జిహ్వా కథం న పతితా తవ |


స|| రాక్షసాధమ అమిత తేజసః రామస్య భార్యాం ఇక్ష్వాకుకుల నాథస్య దశరథస్య స్నుషాం చ అవాచ్యం వదతః తవ జిహ్వా కథం న పతితా ||


|| శ్లోకార్థములు||


రాక్షసాధమ - ఓ రాక్షసాధమా

అమిత తేజసః రామస్య భార్యాం - 

అమిత తేజసముకల రాముని భార్యను

ఇక్ష్వాకుకుల నాథస్య దశరథస్య స్నుషాం చ - 

ఇక్ష్వాకుకుల నాథుడైన దశరథుని కోడలిని అగు నాతో

అవాచ్యం వదతః - 

మాటలాడతగని మాటలు మాట్లాడిన

తవ జిహ్వా కథం న పతితా - 

నీ నాలిక ఎలా ముక్కలు కాలేదు? 


||శ్లోకతాత్పర్యము||


 "ఓ రాక్షసాధమా, అమిత తేజసముకల రాముని భార్యను, ఇక్ష్వాకుకుల నాథుడైన దశరథుని కోడలిని అగు నాతో, మాటలాడ తగని మాటలు మాట్లాడిన నీ నాలిక ఎలా ముక్కలు కాలేదు?" ||58.70||


||శ్లోకము 58.71|| 


కించిద్వీర్యం తవానార్యం యో మాం భర్తురసన్నిధౌ ||58.71||

అపహృత్యాఽఽగతః పాప తేనాఽదృష్టో మహాత్మనా |


స|| న ఆర్య పాప యః భర్తుః అసన్నిధౌ మామ్ అపహృత్య మహాత్మనా తేన అదృష్టః ఆగతః తవ వీర్యం కించిత్ ||


|| శ్లోకార్థములు||


న ఆర్య పాప - అనార్యుడా !పాపుడా !

యః భర్తుః అసన్నిధౌ మామ్ అపహృత్య - 

భర్త లేని సమయములో నన్ను అపహరించిన,

మహాత్మనా తేన అదృష్టః ఆగతః - 

మహాత్ముడైన ఆయన చూడకుండా వచ్చిన

తవ వీర్యం కించిత్- 

నీ వీరత్వము ఎలాంటిది? 


||శ్లోకతాత్పర్యము||


"అనార్యుడా, పాపుడా ! భర్త లేని సమయములో నన్ను అపహరించి, మహాత్ముడైన ఆయన చూడకుండా వచ్చిన, నీ వీరత్వము ఎలాంటిది? " ||58.71||


||శ్లోకము 58.72|| 


న త్వం రామస్య సదృశో దాస్యేఽప్యస్య న యుజ్యసే ||58.72||

యజ్ఞీయః సత్యవాదీ చ రణశ్లాఘీ చ రాఘవః |


స|| త్వం రామస్య సదృశః  న | అస్య దాస్యే అపి న యుజ్యసే | రాఘవః యజ్ఞీయః | సత్యవాదీ | రణశ్లాఘీ చ ||


|| శ్లోకార్థములు||


త్వం రామస్య సదృశః న - 

నీవు రామునితో సమానము కావు

అస్య దాస్యే అపి న యుజ్యసే - 

అయన కి దాసుడవు గా కూడా తగవు

రాఘవః యజ్ఞీయః - 

రాఘవుడు యాగములు చేసినవాడు

సత్యవాదీ రణశ్లాఘీ చ - 

సత్యము పలుకువాడు. యుద్ధములో జయింపబడనివాడు


||శ్లోకతాత్పర్యము||


"నీవు రామునితో సమానము కావు. అయన కి దాసుడవు గా కూడా తగవు. రాఘవుడు యాగములు చేసినవాడు. సత్యము పలుకువాడు. యుద్ధములో జయింపబడనివాడు." ||58.72|| 


||శ్లోకము 58.73|| 


 జానక్యా పరుషం వాక్యమేవ ముక్తో దశాననః ||58.73||

జజ్వాల సహసా కోపా చ్చితాస్థ ఇవపావకః |


స|| జానక్యాః ఏవం పరుషం వాక్యం ఉక్తః దశాననః సహసా చితాస్థః పావకః ఇవ కోపాత్ జజ్వాల ||  


|| శ్లోకార్థములు||


జానక్యాః ఏవం పరుషం వాక్యం ఉక్తః - 

జానకిచేత ఈ విధమైన పరుషవాక్యములు చెప్పబడినవాడై

దశాననః సహసా - 

అ దశాననుడు  వెంటనే

చితాస్థః పావకః ఇవ కోపాత్ జజ్వాల- 

చితిలో లేచిన అగ్నివలే కోపముతో మండిపడెను.


||శ్లోకతాత్పర్యము||


’జానకిచేత ఈ విధమైన పరుషవాక్యములు చెప్పబడినవాడై అ దశాననుడు చితిలో లేచిన అగ్నివలే కోపముతో మండిపడెను’. ||58.73||


||శ్లోకము 58.74|| 


వివృత్య నయనే క్రూరే ముష్టిముద్యమ దక్షిణమ్ ||58.74||

మైథిలీం హన్తుమారబ్దః స్త్రీభిర్హాహాకృతం తదా |


స|| కౄరే నయనే వివృత్య దక్షిణం ముష్టిం ఉద్యమ్య మైథిలీం హన్తుం ఆరబ్ధః తదా స్త్రీభిః హాహాకృతం ||


|| శ్లోకార్థములు||


కౄరే నయనే వివృత్య - 

కౄరమైన కళ్ళు తిప్పుతూ

దక్షిణం ముష్టిం ఉద్యమ్య - 

ఎడమ చేతిని ఎత్తి 

మైథిలీం హన్తుం ఆరబ్ధః - 

జానకిని కోట్టడానికి తయారు అయినప్పుడు

తదా స్త్రీభిః హాహాకృతం - 

ఆ స్త్రీలు హాహాకారములు చేసిరి


||శ్లోకతాత్పర్యము||


"ఆ రావణుడు కౄరమైన కళ్ళు తిప్పుతూ, ఎడమ చేతిని ఎత్తి జానకిని కోట్టడానికి తయారు అయినప్పుడు, ఆ స్త్రీలు హాహాకారములు చేసిరి."||58.74||


||శ్లోకము 58.75|| 


స్త్రీణాం మధ్యాత్ సముత్పత్య తస్య భార్యా దురాత్మనః ||58.75||

వరా మండోదరీ నామ తయా చ ప్రతిషేదితః |


స|| దురాత్మనః తస్య భార్యా మండోదరీ నామ వరా స్త్రీణాం మధ్యాత్ సముత్పత్య తయా సః ప్రతిషేధితః ||


రామ టీకాలో - స్త్రీణాం ఇతి| తస్య రావణస్య మన్దోదరీ నామ యా వరా భార్యా స్త్రీణాం మధ్యాత్ సముత్పత్య స రావణః మధురాం వానీం ఉక్తః అతఏవ ప్రతిషేధితః |


|| శ్లోకార్థములు||


దురాత్మనః తస్య భార్యా - 

దురాత్ముడైన అతని భార్య

మండోదరీ నామ - 

మండోదరీ అను పేరుగలది

వరస్త్రీణాం మధ్యాత్ సముత్పత్య - 

ఆ వరస్త్రీల మధ్యలో నుంచి లేచివచ్చి

తయా ప్రతిషేధితః - అతనిని ఆపెను.


||శ్లోకతాత్పర్యము||


"దురాత్ముడైన అతని భార్య మండోదరీ అను పేరుగలది. ఆ స్త్రీల మధ్యలో నుంచి లేచివచ్చి అతనిని ఆపెను." ||58.75||


మంచి మాటలతో ఆపెను అని భావము.


మొదటి సర్గలో ధాన్యమాలినీ అని చెప్పబడినది. ఇక్కడ మండోదరీ అని చెప్పబడినది. మండోదరికి ఇంకో నామము  ధాన్యమాలినియా అని  తిలక టీకాలో.


||శ్లోకము 58.76|| 


ఉక్తశ్చ మధురాం వాణీం తయా స మదనార్దితః ||58.76||

సీతాయా తవ కిం కా ర్యం మహేన్ద్రసమవిక్రమః |


స|| మదనార్దితః సః తయా మధురాం వాణీం ఉక్తశ్చ | మహేన్ద్రసమవిక్రమః సీతయా తవ కింకార్యం ||


|| శ్లోకార్థములు||


మదనార్దితః సః - 

మదముతో వీగుచున్న అతనితో

తయా మధురాం వాణీం ఉక్తశ్చ - 

ఆమెచేత మధురమైన మాటలు చెప్పబడెను

మహేన్ద్రసమవిక్రమః - 

మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడా

సీతయా తవ కింకార్యం- 

సీతతో నీకేమి పని?


||శ్లోకతాత్పర్యము||


’మదముతో వీగుచున్న అతనితో ఆమె మధురమైన మాటలతో మాట్లాడెను. "మహేంద్రునితో సమానమైన పరాక్రమము కలవాడా, సీతతో నీకేమి పని?" 


||శ్లోకము 58.77|| 


దేవగన్ధర్వకన్యాభిః యక్షకన్యాభి రేవ చ ||58.77||

సార్థం ప్రభో రమస్వేహ సీతయా కిం కరిష్యసి |


స|| ప్రభో దేవగన్ధర్వకన్యాభిః యక్షకన్యాభిరేవ చ సార్ధం ఇహ రమస్వ| సీతయా కిం కరిష్యసి||


|| శ్లోకార్థములు||


ప్రభో దేవగన్ధర్వకన్యాభిః -

 ఓ ప్రభో దేవ గంధర్వ కన్యలతో 

యక్షకన్యాభిరేవ చ - 

యక్షకన్యలతో కూడా

సార్ధం ఇహ రమస్వ- 

యధేచ్ఛగా ఇక్కడ రమించుము

సీతయా కిం కరిష్యసి - 

సీతతో ఏమి చేస్తావు?


||శ్లోకతాత్పర్యము||


"ఓ ప్రభో దేవ గంధర్వ కన్యలతో యక్షకన్యలతో యధేచ్ఛగా రమించుము. సీతతో ఏమి చేస్తావు?" ||58.77||


||శ్లోకము 58.78|| 


 తతస్తాభిః సమేతాభిర్నారీభిః స మహాబలః ||58.78||

ప్రసాద్య సహసా నీతో భవనం స్వం నిశాచరః |


స|| తత్ః మహాబలః సః నిశాచరః సమేతాభిః తాభిః నారీభిః ప్రసాద్య సహసా స్వం భవనం నీతః ||


|| శ్లోకార్థములు||


తత్ః మహాబలః సః నిశాచరః - 

అప్పుడు ఆ మహాబలుడు అగు నిశాచరుడు

సమేతాభిః తాభిః నారీభిః ప్రసాద్య - 

కలిసివున్న ఆ స్త్రీలందరిచేత ప్రసన్నుడుగా చేసికొనబడి

సహసా స్వం భవనం నీతః-  

తొందరగా తన భవనమునకు తీసుకుపోబడెను


||శ్లోకతాత్పర్యము||


'అప్పుడు ఆ మహాబలుడు అగు నిశాచరుడు, కలిసివున్న ఆ స్త్రీలందరిచేత ప్రసన్నుడుగా చేసికొనబడి, తన భవనమునకు తీసుకుపోబడెను.’


||శ్లోకము 58.79|| 


యాతే తస్మిన్ దశగ్రీవే రాక్షస్యో వికృతాననః ||58.79||

సీతాం నిర్భర్త్సయామాసుః వాక్యైః క్రూరైః సుదారుణైః |


స|| తస్మిన్ దశగ్రీవే యాతే వికృతాననః రాక్షస్యః కౄరైః సుదారుణైః వాక్యైః సీతాం నిర్భర్త్సయామాసుః ||


|| శ్లోకార్థములు||


తస్మిన్ దశగ్రీవే యాతే - 

ఆ దశగ్రీవుడు వెళ్ళగానే 

వికృతాననః రాక్షస్యః - 

కౄరమైన కళ్ళు గల ఆ రాక్షస స్త్రీలు

కౄరైః సుదారుణైః వాక్యైః - 

కౄరమైన దారుణమైన మాటలతో

సీతాం నిర్భర్త్సయామాసుః- 

సీతమ్మను  భయపెట్టసాగిరి


||శ్లోకతాత్పర్యము||


’ఆ దశగ్రీవుడు వెళ్ళగానే కౄరమైన ఆ రాక్షస స్త్రీలు దారుణమైన మాటలతో సీతను భయపెట్టసాగిరి’. ||58.79||


||శ్లోకము 58.80|| 


తృణవద్భాషితం తాసాం గణయామాస జానకీ ||58.80||

గర్జితం చ తదా తాసాం సీతాం ప్రాప్య నిరర్థకమ్ |


స|| జానకీ తాసాం భాషితం తృణవత్ గణయామాస | తదా తాసాం గర్జితాం సీతాం ప్రాప్య నిరర్థకం ||


రామ టీకాలో - తాసాం రాక్షసీనాం భాషితం జానకీ తృణవత్ గణయామాస  అత ఏవ తాసాం గర్జితం సీతాం ప్రాప్య నిరర్థకం అభవత్ ఇతి శేషః।


|| శ్లోకార్థములు||


జానకీ తాసాం భాషితం -

 జానకి వాళ్ళ చేత వెప్పబడిన మాటలను

తృణవత్ గణయామాస - 

గడ్డిపోచవలె గణించెను

తదా తాసాం గర్జితాం ప్రాప్య -

 అపుడు వారి గర్జనలుకూడా 

సీతాం నిరర్థకం- 

సీతపై నిరర్థకము ఆయెను


||శ్లోకతాత్పర్యము||


’జానకి వారిచేత చెప్పబడిన మాటలు గడ్డిపఱకల వలె పరిగణించెను. అప్పుడు వారి గర్జనలు నిరర్థకమైనవి’. ||58.80||


||శ్లోకము 58.81|| 


వృథాగర్జిత నిశ్చేష్టా రాక్షస్యః పిశితాశనాః ||58.81||

రావణాయ శశంసుస్తాః సీతాఽధ్యవసితం మహత్ |


స|| పిశితాశనాః తాః రాక్షస్యః వృధాగర్జితనిశ్చేష్టాః మహత్ తత్ సీతాద్యవసితమ్ రావణాయ శశంసుః ||


గోవిన్దరాజ టీకాలో- వృధాగర్జితనిశ్చేష్టాః వృథా గర్జితేన  నిర్వ్యాపారాః।


|| శ్లోకార్థములు||


పిశితాశనాః తాః రాక్షస్యః - 

మాంస భక్షకులు అయిన ఆ రాక్షసస్త్రీలు

వృధాగర్జితనిశ్చేష్టాః - 

తమ గర్జనలు నిరరర్ధకము కావడముతో

మహత్ తత్ సీతాద్యవసితమ్ -

ఆ సీత యొక్క మహత్తరమైన నిశ్చయమును

రావణాయ శశంసుః-

 రావణునికి తెలియచేసిరి


||శ్లోకతాత్పర్యము||


’మాంస భక్షకులు అయిన ఆ రాక్షసస్త్రీలు తమ గర్జనలు నిరరర్ధకము కావడముతో ఏమి చేయడమో తెలియనివారై, ఆ సీత యొక్క మహత్తరమైన నిశ్చయమును రావణునికి తెలియచేసిరి’. ||58.81||


||శ్లోకము 58.82|| 


తతస్తాః సహితా సర్వా విహతాశా నిరుద్యమాః ||58.82||

పరిక్షిప్య సమన్తాత్ తాం నిద్రావశముపాగతాః |


స||తతః సర్వాః సహితాః  విహత ఆశాః నిరుద్యమాః తాం సమన్తాత్ నిద్రావసమ్ ఉపాగతాః||


రామ టీకాలో - విహతాశాః రావణానుకూల్యం అస్మాభిరవశ్యం  సంపాద్యం ఇతి తాసాం ఆశా, అత ఏవ తత్ విషయే నిరుద్యమాః |


|| శ్లోకార్థములు||


తతః సర్వాః సహితాః - పిమ్మట వాళ్ళందరూ

విహత ఆశాః నిరుద్యమాః- ఆశ పోయినవారై నిస్పృహతో

తాం సమన్తాత్ - వారందరూ కలిసి

నిద్రావశమ్ ఉపాగతాః - నిద్రావశము అయిరి


||శ్లోకతాత్పర్యము||


’పిమ్మట వాళ్ళందరూ ఆశ పోయినవారై నిస్పృహతో నిద్రావశము అయిరి. ||58.82||


||శ్లోకము 58.83|| 


  తాసుచైవ ప్రసుప్తాసు సీతా భర్తృహితే రతా ||58.83||

విలప్య కరుణం దీనా ప్రశుశోచ సుదుఃఖితా |


స|| తాసు ప్రసుప్తాసు భర్తృహితే రతా సీతా దీనా కరుణం విలప్య సుదుఃఖితా ప్రశుశోచ ||


|| శ్లోకార్థములు||


తాసు ప్రసుప్తాసు - 

వారు నిద్రలో ఉండగా

భర్తృహితే రతా సీతా - 

ఎల్లప్పుడూ భర్త హితము కోరు సీత

దీనా కరుణం విలప్య - 

దీనముగా  కారుణ్యముతో విలపిస్తూ

సుదుఃఖితా ప్రశుశోచ- 

చాలా దుఃఖములో వుండెను


||శ్లోకతాత్పర్యము||


’వారు నిద్రలో ఉండగా ఎల్లప్పుడూ భర్త హితము కోరు అతి దుఃఖములో ఉన్న సీత, దీనముగా  జాలిగొలుపునట్లు విలపించెను’. ||58.83||


||శ్లోకము 58.84,85|| 


తాసాం మధ్యాత్ సముత్థాయ త్రిజటా వాక్యమబ్రవీత్ ||58.84||

ఆత్మానం ఖాదత క్షిప్రం న సీతా వినశిష్యతి |

జనకస్యాత్మజా సాధ్వీ స్నుషా దశరథస్య చ ||58.85||


స|| తాసాం మధ్యాత్ సుముత్థాయ త్రిజటా వాక్యం అబ్రవీత్| క్షిప్రం ఆత్మానం ఖాదత || జనకస్య ఆత్మజా సాధ్వీ దశరథస్య స్నుషా సీతా న వినశిష్యతి ||


రామటీకాలో- త్రిజటా అబ్రవీత్ - ఆత్మానం ఖాదత జనకస్యాత్మజాం న ఖాదత ఏతేన సీతాయాః  వినాశ అభావః రాక్షసీనాం ఆసన్న వినాశశ్చ సూచితః |


|| శ్లోకార్థములు||


తాసాం మధ్యాత్ సుముత్థాయ -

 అప్పుడు వారి మధ్యలో నుంచి లేచి

త్రిజటా వాక్యం అబ్రవీత్ -

 త్రిజట ఈ మాటలు చెప్పెను

క్షిప్రం ఆత్మానం ఖాదత - 

మీరు  మిమ్మలనే తినుకొనుడు.

జనకస్య ఆత్మజా సాధ్వీ - 

జనకుని కూతురు సాధ్వి

దశరథస్య స్నుషా సీతా - 

దశరథుని కోడలు అగు సీత

న వినశిష్యతి - నాశనము కాదు


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు వారి మధ్యలో నుంచి లేచి త్రిజట ఈ మాటలు చెప్పెను. ’’మీరు  మిమ్మలనే తినుకొనుడు. జనకుని కూతురు, దశరథుని కోడలు అగు సీత నాశనము కాదు". ||58.84,85||


||శ్లోకము 58.86|| 


స్వప్నో హ్యద్య మయా దృష్టో దారుణో రోమహర్షణః |

రక్షసాం చ వినాశాయ భర్తురస్యా జయాయ చ ||58.86||


స|| అద్య మయా దారుణః రోహహర్షణః స్వప్నః దృష్టా | అస్య భర్తుః జయాయ రక్షసాం వినాశాయ చ || 


|| శ్లోకార్థములు||


అద్య మయా దారుణః - 

ఇప్పుడు నేను దారుణమైన

రోహహర్షణః స్వప్నః దృష్టా -

 రోమహర్షణము కలిగించు స్వప్నము చూచితిని

అస్య భర్తుః జయాయ - 

ఈమె భర్త జయము

రక్షసాం వినాశాయ చ - 

రాక్షసుల వినాశము ( సూచించునది)


||శ్లోకతాత్పర్యము||


"ఇప్పుడు నేను దారుణమైన, రోమహర్షణము కలిగించు, ఈమె భర్త జయము, రాక్షసుల వినాశము కల స్వప్నమును చూచితిని." ||58.86||


||శ్లోకము 58.87|| 


అలమస్మాత్ పరిత్రాతుం రాఘవాద్రాక్షసీగణం |

అభిచాయామ వైదేహీ మే తద్ది మమరోచతే ||58.87||


స|| అస్మాత్ రాఘవాత్ రాక్షసీగణం పరిత్రాతుం అలం వైదేహీం అభియాచామ | ఏతత్ మమ రోచతే హి ||


|| శ్లోకార్థములు||


రాఘవాత్ -  ఆ రాఘవుని నుంచి

అస్మాత్  రాక్షసీగణం పరిత్రాతుం - 

మనలను రాక్షస స్త్రీల గణమును రక్షించుటకు

అలం వైదేహీం అభియాచామ -

ఈ వైదేహిని ప్రార్ధించతగును

ఏతత్ మమ రోచతే హి- 

అదే సముచితమని నాకు తోచుచున్నది


||శ్లోకతాత్పర్యము||


"ఆ రాఘవుని నుంచి ఈ రాక్షస స్త్రీల గణమును రక్షించుటకు  వైదేహిని ప్రార్ధించెదము. అదే సముచితమని నాకు తోచుచున్నది", అని’ ||58.87||


||శ్లోకము 58.88|| 


 యస్యా హ్యేనం విధః స్వప్నో దుఃఖితాయాః ప్రదృశ్యతే |

సా దుఃఖైర్వివిధైర్ముక్తా సుఖమాప్నొత్యనుత్తమమ్ ||58.88||


స|| యస్యాః దుఃఖితాయాః ఏవం విధః స్వప్నః ప్రదృశ్యతే సా వివిధైః దుఃఖైః విముక్తా అనుత్తమం సుఖం ఆప్నోతి | 


|| శ్లోకార్థములు||


యస్యాః దుఃఖితాయాః - 

ఎవరైతే దుఃఖములో ఉండి

ఏవం విధః స్వప్నః ప్రదృశ్యతే -

 ఈ విధమైన స్వప్నమును చూచెదరో 

సా వివిధైః దుఃఖైః విముక్తా - 

వారు వివిధ రకములైన దుఃఖములను బాసి 

అనుత్తమం సుఖం ఆప్నోతి - 

అత్యంత సుఖసౌఖ్యములను పొందుదురు.


||శ్లోకతాత్పర్యము||


"ఎవరైతే దుఃఖములో ఉండి ఈ విధమైన స్వప్నమును చూచెదరో వారు వివిధ రకములైన దుఃఖములను బాసి అత్యంత సుఖసౌఖ్యములను పొందుదురు." ||58.88||


||శ్లోకము 58.89|| 


ప్రణిపాతా ప్రసన్నా హి మైథిలీ జనకాత్మజా |

తతస్సా హ్రీమతీ బాలా భర్తుర్విజయహర్షితా ||58.89||

అవోచత్ యది తత్ తథ్యం భవేయం శరణం హి వః |


స|| జనకాత్మజా మైథిలీ ప్రణిపాత ప్రసన్నా హి || తతః సా హ్రీమతీ బాలా సా భర్తుః విజయహర్షితా అవోచత్ | తత్ తథ్యం యది వః శరణం భవేయం ||


|| శ్లోకార్థములు||


జనకాత్మజా మైథిలీ ప్రణిపాత - 

జనకాత్మజ అయిన సీత నమస్కరింపబడి

ప్రసన్నా హి - ప్రసన్నురాలు అగును

తతః సా హ్రీమతీ బాలా - 

అప్పుడు సహజముగా సిగ్గుకల ఆ సీత

సా భర్తుః విజయహర్షితా అవోచత్ - 

భర్త విజయము గురించి విని, హర్షముతో ఇట్లు పలికెను.

తత్ తథ్యం యది వః శరణం భవేయం - 

అది తథ్యము అయితే మీకు శరణు ఇచ్చెదను


||శ్లోకతాత్పర్యము||


"జనకాత్మజ అయిన సీత నమస్కరింపబడిన మాత్రమే ప్రసన్నురాలు అగును", అని. అప్పుడు సహజముగా సిగ్గుకల ఆ సీత, భర్త విజయము గురించి విని, హర్షముతో ఇట్లు పలికెను. "అది తథ్యము అయితే మీకు శరణు ఇచ్చెదను" అని.’ ||58.89|| 


||శ్లోకము 58.90|| 


 తాం చాహం తాదృశీం దృష్ట్వా సీతాయా దారుణాం దశామ్ ||58.90||

చిన్తయామాస విక్రాన్తో న చ మే నిర్వృతం మనః |


స|| అహం  సీతాయాః తాదృశీం తామ్ దశాం దృష్ట్వా చిన్తయామాస | విక్రాన్తఃమేమనః న నిర్వృతమ్ ||


|| శ్లోకార్థములు||


అహం  సీతాయాః తాదృశీం - నేను సీత యొక్క అట్టి 

తామ్ దశాం దృష్ట్వా చిన్తయామాస - ఆ దశను చూచి అలోచనలో పడితిని

విక్రాన్తః మేమనః న నిర్వృతమ్ - విక్రాంతుడనైన నా మనస్సు కుదుటపడలేదు.


 ||శ్లోకతాత్పర్యము||


’నేను సీత యొక్క ఆ దశను చూచి అలోచనలో పడితిని. విక్రాంతుడనైన నా మనస్సు కుదుటపడలేదు’. ||58.90||


||శ్లోకము 58.91|| 


సంభాషణార్థం చ మయా జానక్యాశ్చిన్తితో విధిః ||58.91||

ఇక్ష్వాకూణాం హి వంశస్తు తతో మమ పురస్కృతః |


స|| మయా జానక్యాః సంభాషణార్థం విధి చిన్తితః తతః ఇక్ష్వాకూణాం వంశస్తు మమ పురస్కృతః ||


రామటీకాలో - జానక్యాః సంభాషణార్థే విధిరూపాయో మయా చిన్తితః  అత ఏవ పుర్స్కృతః సర్వైః అగ్రే ఉక్తః ఇక్ష్వాకుకులవంశః మమ మయా స్తుతః॥ 


|| శ్లోకార్థములు||


మయా జానక్యాః సంభాషణార్థం - 

నేను జానకితో సంభాషణ చేయుటకు

 విధి చిన్తితః - మార్గము ఆలోచించి

తతః ఇక్ష్వాకూణాం వంశస్తు - 

అప్పుడు ఇక్ష్వాకుకుల  వంశము 

మమ పురస్కృతః- నాచేత  ప్రశంసింప బడినది  


||శ్లోకతాత్పర్యము||


’నేను జానకితో సంభాషణ చేయు విధానముగురించి అలోచించి, అప్పుడు ఇక్ష్వాకుకుల వంశము నాచేత  ప్రశంసింప బడినది’. ||58.91|| 


||శ్లోకము 58.92|| 


 శ్రుత్వా తు గదితాం వాచం రాజర్షి గణపూజితామ్ ||58.92||

ప్రత్యభాషత మాం దేవీభాష్పైః పిహితలోచనా |


స|| దేవీ రాజర్షిగణపూజితామ్ గదితాం వాచం శ్రుత్వా పిహితలోచనః మామ్ ప్రత్యభాషత || 


|| శ్లోకార్థములు||


దేవీ రాజర్షిగణపూజితామ్ - 

ఆ దేవి రాజర్షి గణములను పూజించుచూ

గదితాం వాచం శ్రుత్వా - 

చెప్పబడిన  మాటలను విని

పిహితలోచనః మామ్ ప్రత్యభాషత- 

నీళ్ళతో నిండిన కళ్ళతో, నాతో మాట్లాడెను


||శ్లోకతాత్పర్యము||


’ఆ దేవి, రాజర్షి గణములను పూజించుచూ చెప్పిన  (నా) మాటలను విని, నీళ్ళతో నిండిన కళ్ళతో, నాతో మాట్లాడెను’. ||58.92||


||శ్లోకము 58.93|| 


కస్త్వం కేన కథం చేహ ప్రాప్తో వానరపుంగవ ||58.93||

కాచ రామేణ తే ప్రీతిః తన్మే శంసితుమర్హసి |


స॥వానరపుంగవ త్వం కః | కేన కథం ఇహ ప్రాప్తః| తే రామేణ ప్రీతిః కా | తత్ శంసితుం అర్హసి ||


|| శ్లోకార్థములు||


వానరపుంగవ త్వం కః -

 ఓ వానరపుంగవా నీవెవరవు

కేన కథం ఇహ ప్రాప్తః - 

ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చితివి

తే రామేణ ప్రీతిః కా - 

నీకు రామునితో అభిమానము ఎట్లు కలిగెను

తత్ శంసితుం అర్హసి- 

అది నాకు చెప్పుటకు తగును


||శ్లోకతాత్పర్యము||


"ఓ వానరపుంగవా, నీవెవరవు. ఎక్కడినుంచి ఇక్కడికి వచ్చితివి. నీకు రామునితో అభిమానము ఎట్లు కలిగెను. అది నాకు చెప్పుటకు తగును", అని’. ||58.93||


||శ్లోకము 58.94,95|| 


తస్యాస్తద్వచనం శ్రుత్వా హ్యహ మప్యబ్రువం వచః ||58.94||

దేవి రామస్య భర్తుస్తే సహాయో భీమవిక్రమః |

సుగ్రీవో నామ విక్రాన్తో వానరేన్ద్రో మహాబలః ||58.95||


స|| తస్యాః తత్ వచనం శ్రుత్వా అహం అపి వచః అబ్రువన్ ॥ దేవి భర్తుః సహాయః మహాబలః భీమవిక్రమః సుగ్రీవో నామ విక్రాన్తః వానరేంద్రః | 


|| శ్లోకార్థములు||


తస్యాః తత్ వచనం శ్రుత్వా - 

ఆమె యొక్క ఆ మాటలను విని

అహం అపి వచః అబ్రువన్ - 

నేను కూడా ఇట్లు పలికితిని

దేవి భర్తుః సహాయః మహాబలః -

 దేవీ నీ భర్తకు సహాయుడు మహాబలుడు

భీమవిక్రమః సుగ్రీవో నామ - 

భయంకరమైన పరాక్రమము గల  సుగ్రీవుడను పేరుగల

విక్రాన్తః వానరేంద్రః - 

విక్రాంతుడు వానర రాజు


||శ్లోకతాత్పర్యము||


’ఆమె యొక్క ఆ మాటలను విని నేను కూడా ఇట్లు పలికితిని. "ఓ దేవీ సుగ్రీవుడను పేరుగల విక్రాంతుడు, వానరేంద్రుడు, నీ భర్తకు సహాయుడు." ||58.94,95||


||శ్లోకము 58.96|| 


తస్యమాం విద్ధి భృత్యం త్వం హనుమన్త మిహాఽఽగతమ్ |

భర్త్రాఽహం ప్రేషితః తుభ్యం రామేణాఽక్లిష్టకర్మణః ||58.96||


స|| ఇహ ఆగతం మామ్ తస్య భృత్యం త్వం విద్ధి | అహం భర్త్రా అక్లిష్టకర్మణా రామేణ తుభ్యం ప్రేషితః ||


|| శ్లోకార్థములు||


ఇహ ఆగతం మామ్ -

 ఇక్కడికి వచ్చిన నన్ను

తస్య భృత్యం త్వం విద్ధి - 

అయనకి భృత్యుడను అని తెలిసికొనుము

అహం భర్త్రా అక్లిష్టకర్మణా రామేణ -

 నేను క్లిష్ఠమైన కార్యములు సాధించగల నీ భర్త

రామేణ తుభ్యం ప్రేషితః- 

రామునిచేత నీ కొఱకై పంపబడినవాడను


||శ్లోకతాత్పర్యము||


"ఇక్కడికి వచ్చిన నన్ను అయనకి భృత్యుడను అని తెలిసికొనుము. నేను క్లిష్ఠమైన కార్యములు సాధించగల నీ భర్త రామునిచేత, నీ కొఱకై పంపబడినవాడను." ||58.96||


||శ్లోకము 58.97|| 


ఇదం చ పురుషవ్యాఘ్రః శ్రీమాన్ దాశరథిః స్వయమ్ | 

అంగుళీయ మభిజ్ఞాన మదాత్ తుభ్యం యశస్విని ||58.97||


స|| యశస్విని పురుషవ్యాఘ్రః  శ్రీమాన్ దాశరథిః స్వయం అంగుళీయం తుభ్యం అభిజ్ఞానం ఆదాత్ ||


|| శ్లోకార్థములు||


యశస్విని పురుషవ్యాఘ్రః  శ్రీమాన్ దాశరథిః - 

ఓ యశస్వినీ ! పురుషోత్తముడు దాశరథి 

స్వయం అంగుళీయం - 

స్వయముగా  ఈ అంగుళీయమును

తుభ్యం అభిజ్ఞానం ఆదాత్-

 నీ కొఱకై గుర్తుగా ఇచ్చెను


||శ్లోకతాత్పర్యము||


"ఓ యశస్వినీ, పురుషోత్తముడూ దాశరథి స్వయముగా నీ కొఱకై ఈ అంగుళీయమును గుర్తుగా ఇచ్చెను." ||58.97||


||శ్లోకము 58.98|| 


తదిచ్ఛామి త్వయాఽఽజ్ఞప్తం దేవి కింకరవాణ్యహమ్ |

రామలక్ష్మణయోః పార్శ్వం నయామి త్వాం కిముత్తరమ్ ||58.98||


స|| దేవి తత్ త్వయా ఆజ్ఞప్తం ఇచ్ఛామి | అహం కిం కరవాణి | త్వాం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి | ఉత్తరం కిం ||


తిలక టీకాలో - త్వయాఽఽజ్ఞప్తం త్వత్కర్తుకం ఆజ్ఞాపనమ్ |

రామ టీకాలో - త్వయాఽఽజ్ఞప్తం తదుత్తరం కిం, కించిత్ కరవాణీత్యహం ఇఛ్ఛామి |


|| శ్లోకార్థములు||


దేవి తత్ త్వయా ఆజ్ఞప్తం ఇచ్ఛామి - 

ఓ దేవి నీచేత ఆజ్ఞాపింపబడుటకు కోరుచున్నాను

అహం కిం కరవాణి - నేను ఇప్పుడు ఏమి చెయవలెను? 

త్వాం రామలక్ష్మణయోః పార్శ్వం నయామి - 

నిన్ను రామలక్ష్మణుల దగ్గఱకు తీసుకు వెళ్ళగలను

ఉత్తరం కిం- నీ సమాధానము ఏమి?


||శ్లోకతాత్పర్యము||


"ఓ దేవి నన్ను ఆజ్ఞాపింప  కోరుచున్నాను. నేను ఇప్పుడు ఏమి చెయవలెను?  నిన్ను రామలక్ష్మణుల దగ్గఱకు తీసుకు వెళ్ళగలను. నీ సమాధానము ఏమి?" అని.  


||శ్లోకము 58.99|| 


ఏతత్ శ్రుత్వా విదిత్వా చ సీతా జనకనన్దినీ |

అహ రావణ ముత్సాద్య రాఘవో మాం నయత్వితి ||58.99||


స|| జనకనందినీ సీతా ఏతత్ శ్రుత్వా విదిత్వా చ రాఘవః రావణం ఉత్సాద్య మాం  నయతు ఇతి ఆహ ||


|| శ్లోకార్థములు||


జనకనందినీ సీతా ఏతత్ శ్రుత్వా - 

జనకనందినీ సీతమ్మ అది విని 

విదిత్వా చ - తెలిసికొని 

రాఘవః రావణం ఉత్సాద్య - 

రాఘవుడు రావణుని సంహరించి

మాం నయతు ఇతి ఆహ -  

నన్ను తీసుకుపోతగును అని చెప్పెను


||శ్లోకతాత్పర్యము||


’జనకనందినీ  సీత ఆ మాట విని , "రాఘవుడు, రావణుని సంహరించి నన్ను తీసుకుపోతగును", అని’. ||58.99||


||శ్లోకము 58.100|| 


ప్రణమ్య శిరసా దేవీ మహమార్యా మనిన్దితామ్ |

రాఘవస్య మనోహ్లాద అభిజ్ఞానం మయాచిషమ్ ||58.100||


స|| అహం అర్యాం అనిందితాం దేవీం శిరసా ప్రణమ్య రాఘవస్య మనోహ్లాద అభిజ్ఞానం అయాచిషం ||


|| శ్లోకార్థములు||


అహం అర్యాం అనిందితాం - 

అప్పుడు నేను ఆర్యురాలైన నిందలేని

దేవీం శిరసా ప్రణమ్య - 

ఆ దేవికి శిరస్సుతో నమస్కరించి

రాఘవస్య మనోహ్లాద అభిజ్ఞానం-

 రాఘవుని మనస్సుకు అహ్లాదకరమైన గుర్తును 

 అయాచిషం - 

కావలెను అని ప్రార్థించితిని.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను ఆర్యురాలైన నిందలేని, ఆ దేవికి శిరస్సుతో నమస్కరించి, రాఘవుని మనస్సుకు అహ్లాదకరమైన గుర్తును కావలెను అని ప్రార్థించితిని’. ||58.100||


||శ్లోకము 58.101|| 


 అథ మామబ్రవీత్ సీతా గృహ్యతామయముత్తమః |

మణిర్యేన మహాబాహూ రామస్త్వాం బహుమన్యతే ||58.101||


స|| అథ సీతా మాం అబ్రవీత్ | ఉత్తమః అయం మణిః గృహ్యతామ్ యేన మహాబాహుః రామః త్వాం బహుమన్యతే ||


|| శ్లోకార్థములు||


అథ సీతా మాం అబ్రవీత్ - 

అప్పుడు సీత నా తో ఇట్లు పలికెను

ఉత్తమః అయం మణిః గృహ్యతామ్ - 

ఉత్తమమైన ఈ మణిని తీసుకొనుము

యేన మహాబాహుః రామః త్వాం బహుమన్యతే - 

దీనితో నీ పై రామునికి అత్యంత ఆదరాభిమానములు కలుగును


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు సీత నా తో ఇట్లు పలికెను. "ఉత్తమమైన ఈ మణిని తీసుకొనుము. దీనితో నీ పై రామునికి అత్యంత ఆదరాభిమానములు కలుగును". ||58.101||


ఇక్కడ హనుమ తన భాషణలో , సీతమ్మ రాములవారి కోసము చెప్పిన కాక వృత్తాంతము. మణితిలక వృత్తాంతము చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు అంటే , అవి రామునికి మాత్రమే చెప్పవలసిన విషయములు కనక అని కొందరి ఆలోచన. హనుమ కూడా రాములవారికి చేసిన నివేదనలో  ఈ రెండు విషయాలు చెపుతాడు.


||శ్లోకము 58.102|| 


ఇత్యుక్త్వాతు వరారోహా మణిప్రవరమద్భుతమ్ |

ప్రాయచ్ఛత్ పరమోద్విగ్నా వాచా మాం సందిదేశ హ ||58.102||


స|| వరారోహా ఇతి ఉక్త్వా అద్భుతం మణిప్రవరం ప్రాయచ్ఛత్ | పరమోద్విగ్నః మామ్ వాచా సన్దిదేశ చ||


తిలక టీకాలో - సందిదేశ। కాకవృత్తాంతం తిలక కరణం చ రామమాత్రైకవేద్యం కథయామాస ఇత్యర్థః।


|| శ్లోకార్థములు||


వరారోహా ఇతి ఉక్త్వా - 

ఆ ఉత్తమురాలు ఇలాచెప్పి

అద్భుతం మణిప్రవరం ప్రాయచ్ఛత్ - 

అద్భుతమైన మణిని ప్రసాదించెను

పరమోద్విగ్నః మామ్ వాచా సన్దిదేశ చ - 

అతి దుఃఖముతో అమె తన సందేశము కూడా ఇచ్చెను.


||శ్లోకతాత్పర్యము||


’ఆ ఉత్తమురాలు ఇలాచెప్పి అద్భుతమైన మణిని ప్రసాదించెను.  అతి దుఃఖముతో అమె తన సందేశము కూడా ఇచ్చెను’. ||58.102|| 


ఇచ్చిన సందేశము కాక వృత్తాంతము మణితిలక కథ, అవి రామునికే చెప్పవలసిన విషయములు అని గోవిన్దరాజుల వారివ్యాఖ్యలో. అలాగే రామతిలక వ్యాఖ్యలో కూడా చూస్తాము.


||శ్లోకము 58.103|| 


తతస్తస్యై ప్రణమ్యాహం రాజపుత్య్రై సమాహితః |

ప్రదక్షిణం పరిక్రామ మిహాభ్యుద్గతమానసః ||58.103||


స|| తతః అహమ్ తస్యై రాజపుత్ర్యై ప్రణమ్య సమాహితః ఇహ అభ్యుదాగమన మానసః ప్రదక్షిణం పరిక్రామమ్ ||


|| శ్లోకార్థములు||


 తతః అహమ్ తస్యై రాజపుత్ర్యై ప్రణమ్య - 

అప్పుడు ఆ రాజపుత్రికకు నమస్కరించి

సమాహితః ఇహ అభ్యుదాగమన మానసః - 

ఇక్కడికి తిరిగివచ్చు మనస్సుకలవాడనై 

 ప్రదక్షిణం పరిక్రామమ్ - ప్రదక్షిణము చేసితిని.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు ఆ రాజపుత్రికకు నమస్కరించి, ఇక్కడికి తిరిగివచ్చు మనస్సు కలవాడనై  ఆమెకు ప్రదక్షిణము చేసితిని’. ||58.102||


||శ్లోకము 58.104|| 


  ఉక్తోఽహం పునరేవేదం నిశ్చిత్య మనసా తయా |

హనుమాన్మమ వృత్తానం వక్తు మర్హసి రాఘవే ||58.104||


స|| అహమ్ తయా మనసా నిశ్చిత్య ఇదం పునరేవ ఉక్తః | హనుమాన్ రాఘవే మమ  వృత్తాంతం వక్తుం అర్హసి||



|| శ్లోకార్థములు||


తయా మనసా నిశ్చిత్య- 

మరల చింతించిన ఆమె చేత

అహమ్ ఇదం పునరేవ ఉక్తః - 

నేను ఇట్లు చెప్పబడితిని

హనుమాన్ రాఘవే మమ - 

ఓ హనుమా ! రాఘవునకు నా  

వృత్తాంతం వక్తుం అర్హసి - 

వృత్తాంతము చెప్పుటకు తగినవాడవు


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు తన మస్సులో మరల చింతించిన ఆమె చేత ఇట్లు చెప్పబడితిని. "ఓ హనుమా, రాఘవునకు నా వృత్తాంతము చెప్పుటకు తగినవాడవు.". ||58.104|| 


||శ్లోకము 58.105|| 


యథాశ్రుత్వైవ న చిరాత్తావుభౌ రామలక్ష్మణౌ |

సుగ్రీవసహితౌ వీరా వుపేయాతాం తథా కురు ||58.105||


స|| వీరౌ తౌ రామలక్ష్మణౌ ఉభౌ శ్రుత్వైవ సుగ్రీవసహితౌ అ చిరాత్ యథా ఉపేయాతాం తథా కురు ||


|| శ్లోకార్థములు||


వీరౌ తౌ రామలక్ష్మణౌ ఉభౌ- 

వీరులైన వారిద్దరూ రామలక్ష్మణులు 

 శ్రుత్వైవ సుగ్రీవసహితౌ అ చిరాత్ - 

(నీ మాటలు)  విన్నవెంటనే సుగ్రీవునితో కూడా కొద్దికాలములో 

యథా ఉపేయాతాం తథా కురు - 

ఎలా వచ్చెదరో అలా చేయుము


||శ్లోకతాత్పర్యము||


"వీరులైన వారిద్దరూ ( నీ మాటలు)  విన్నవెంటనే సుగ్రీవునితో అచిరకాలములో ఎలా వచ్చెదరో అలా చేయుము." ||58.105|| 


||శ్లోకము 58.106|| 


యదన్యథా భవేదేతత్  ద్వౌమాసౌ జీవితం మమ |

న మాం ద్రక్ష్యతి కాకుత్‍స్థోమ్రియే సాఽహమనాథవత్ ||58.106||


స|| యది అన్యథా భవేత్ మమ జీవితం ద్వౌమాసౌ (హి) | (యది) కాకుత్‍స్థః మామ్ నద్రక్ష్యతి (తదా) అహం అనాధవత్ మ్రియే ||


రామటీకాలో - యత్ యది అన్యథా విలమ్బో భవేత్ తర్హి మాం కాకుత్‍స్థో న ద్రక్ష్యతి | అత్ర హేతుః ద్వౌమాసేవ మమ జీవితం జీవనం అనన్తరం అనాథవత్ మ్రియే |


|| శ్లోకార్థములు||


యది అన్యథా భవేత్ -

 అది అలాకాకుండా అయినచో

మమ జీవితం ద్వౌమాసౌ (హి) - 

నా జీవిత కాలము రెండునెలలు మాత్రమే

(యది) కాకుత్‍స్థః మామ్ నద్రక్ష్యతి - 

ఆ కాకుత్‍స్థుడు నన్ను రక్షించకపోతే 

(తదా) అహం అనాధవత్ మ్రియే -

 నేను అనాధవలె మరణించెదను 


||శ్లోకతాత్పర్యము||


"అది అలాకాకుండా అయినచో, నా జీవితకాలము రెండునెలలు మాత్రమే. ఆ కాకుత్‍స్థుడు నన్ను రక్షించకపోతే నేను అనాధవలె మరణించెదను." ||58.106||


||శ్లోకము 58.107|| 


తచ్ఛ్రుత్వా కరుణం వాక్యం క్రోధో మామభ్యవర్తత|

ఉత్తరం చ మయా దృష్టం కార్యశేషమనంతరమ్||58.107||


స|| తత్ కరుణం వాక్యం శ్రుత్వా మామ్ క్రోధః అభ్యవర్తత | మయా  ఉత్తరం అనంతరం కార్యశేషం దృష్టమ్ చ||


|| శ్లోకార్థములు||


తత్ కరుణం వాక్యం శ్రుత్వా -

 కరుణతో కూడిన ఆ మాటలను విని

మామ్ క్రోధః అభ్యవర్తత - 

నాకు కోపము పెల్లుబిక్కెను

మయా  ఉత్తరం అనంతరం - 

నా చేత ఆ తరువాత మిగిలిన

కార్యశేషం దృష్టమ్ చ- 

మిగిలిన కార్యము అలోచించితిని 


||శ్లోకతాత్పర్యము||


’కరుణతో కూడిన ఆ మాటలను విని నాకు కోపము పెల్లుబిక్కెను. ఆ తరువాత మిగిలిన కార్యము అలోచించితిని’. ||58.107||


ఆ మిగిలిన కార్యము రావణుని తో సంభాషణ. 


||శ్లోకము 58.108|| 


తతోఽవర్ధత మే కాయస్తదా పర్వతసన్నిభః |

యుద్ధకాంక్షీ వనం తచ్చ వినాశయితుమారభే ||58.108||


స|| తతః యుద్ధకాంక్షీ మే కాయః తదా పర్వతసన్నిభః అవర్ధత| తత్ వనం వినాశయితుం ఆరభే ||


|| శ్లోకార్థములు||


తతః యుద్ధకాంక్షీ - 

అప్పుడు యుద్ధకాంక్ష కలవాడినై

మే కాయః తదా పర్వతసన్నిభః అవర్ధత - 

నా కాయము పర్వతముతో సమానముగా పెరిగితిని

తత్ వనం వినాశయితుం ఆరభే- 

ఆ ( అశోక)వనము నాశము చేయుట అరంభించితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు యుద్ధకాంక్ష కలవాడినై, నా కాయము పర్వతముతో సమానముగా పెంచితిని. అప్పుడు ఆ ( అశోక)వనము నాశము చేయుట అరంభించితిని’. ||58.108||


||శ్లోకము 58.109|| 


తద్భగ్నం వనషణ్డం తు భ్రాన్తత్రస్త మృగద్విజమ్ |

ప్రతిబుద్ధా నిరీక్షన్తే రాక్షస్యా వికృతాననః ||58.109||


స|| వికృతాననః రాక్షస్యః ప్రతిబుద్ధాః భగ్నం భ్రాన్తః త్రస్తమృగద్విజం  తత్ వనషణ్డం నిరీక్షన్తే ||


|| శ్లోకార్థములు||


వికృతాననః రాక్షస్యః - 

అప్పుడు వికృతమైన స్వరూపము గల అ రాక్షసస్త్రీలు 

ప్రతిబుద్ధాః భగ్నం - 

మేల్కొని భగ్నము చేయబడుతున్న

భ్రాన్తః త్రస్త మృగద్విజం  - 

భయభ్రాంతులతో బెదిరిన మృగములతో నిండిన

తత్ వనషణ్డం నిరీక్షన్తే- 

ఆ నాశనము చేయబడిన వనమును నిరీక్షించిరి


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు వికృతమైన స్వరూపము గల అ రాక్షసస్త్రీలు మేల్కొని, భగ్నము చేయబడుతున్న, భయభ్రాంతులతో బెదిరిన మృగములతో నిండిన, ఆ వనమును నిరీక్షించిరి’. ||58.109||


||శ్లోకము 58.110|| 


 మాం చ దృష్ట్వా వనే తస్మిన్ సమాగమ్య తతస్తతః |

తాః సమభ్యాఽఽగతాః క్షిప్రం రావణాయచ చక్షిరే ||58.110||


స|| తతస్తతః సమాగమ్య తస్మిన్ వనే మామ్ దృష్ట్వా క్షిప్రం సమభ్యాగతః రావణాయ ఆచచక్షిరే ||


|| శ్లోకార్థములు||


తతస్తతః సమాగమ్య - అప్పుడు అక్కడ గుమిగూడి

తస్మిన్ వనే మామ్ దృష్ట్వా - ఆ వనములో నన్ను చూచి

క్షిప్రం సమభ్యాగతః -  వెంటనే అర్థము చేసికొని

రావణాయ ఆచచక్షిరే -

రావణునివద్దకు పోయి సమాచారము అందచేసిరి


||శ్లోకతాత్పర్యము||


’అక్కడ గుమిగూడి, ఆ వనములో నన్ను కూడా చూచి, అర్థము చేసికొని, వెంటనే రావణుని వద్దకు పోయి సమాచారము అందచేసిరి’. ||58.110||


||శ్లోకము 58.111|| 


రాజన్ వనమిదం దుర్గం తవ భగ్నం దురాత్మనా |

వానరేణ హ్యవిజ్ఞాయ తవ వీర్యం మహాబల ||58.111||


స|| మహాబల రాజన్ దురాత్మనా వానరేణ తవ వీర్యం అవిజ్ఞాయ తవ దుర్గం ఇదం వనం భగ్నం ||


|| శ్లోకార్థములు||


మహాబల రాజన్ - ఓ మహారాజ 

తవ వీర్యం అవిజ్ఞాయ - నీ పరాక్రమము తెలియని 

దురాత్మనా వానరేణ - దురాత్ముడైన వానరుని చేత 

ఇదం తవ దుర్గం  వనం భగ్నం -

   దుర్గమమైన వనము భగ్నము చేయబడినది


||శ్లోకతాత్పర్యము||


"ఓ మహారాజ, నీ పరాక్రమము తెలియని దురాత్ముడైన వానరుని చేత, ఈ దుర్గములోని నీ వనము భగ్నము చేయబడినది." ||58.111|| 


||శ్లోకము 58.112|| 


దుర్బుద్ధేస్తస్య రాజేన్ద్ర తవ విప్రియకారిణః |

వధమాజ్ఞాపయ క్షిప్రం యథాఽసౌ విలయం ప్రజేత్ ||58.112||


స|| రాజేన్ద్ర తవ విప్రియకారిణః దుర్బుద్ధేః తస్య వధం ఆజ్ఞాపయ అసౌ విలయం వ్రజేత్ ||


|| శ్లోకార్థములు||


రాజేన్ద్ర తవ విప్రియకారిణః - 

ఓ రాజేంద్ర ! నీకు అపకారము తలపెట్టిన

దుర్బుద్ధేః తస్య వధం ఆజ్ఞాపయ - 

ఆ దుర్బుద్ధి యొక్క వధకు ఆజ్ఞ ఇమ్ము

అసౌ విలయం వ్రజేత్ - 

వానిని తక్షణమే వధించ తగును


||శ్లోకతాత్పర్యము||


"ఓ రాజేంద్ర,  నీకు అపకారము తలపెట్టిన ఆ దుర్బుద్ధి యొక్క వధకు ఆజ్ఞ ఇమ్ము. వానిని తక్షణమే వధించ తగును".  ||58.112||


||శ్లోకము 58.113|| 


 తచ్ఛ్రుత్వా రాక్షసేన్ద్రేణ విసృష్టా భృశదుర్జయాః|

రాక్షసాః కింకరా నామ రావణస్య మనోఽనుగాః||58.113||


స|| తత్ శ్రుత్వా రాక్షసేన్ద్రేణ భృశ దుర్జయాః రావణస్య మనోనుగాః కింకరా నామ రాక్షసాః విస్రుష్టాః ||


రామ టీకాలో - విస్రుష్టాః ప్రేషితాః |


|| శ్లోకార్థములు||


తత్ శ్రుత్వా రాక్షసేన్ద్రేణ - 

అది విని ఆ రాక్షసేంద్రునిచేత 

భృశ దుర్జయాః - దుర్జయులైన భృత్యులు

కింకరా నామ రాక్షసాః విస్రుష్టాః-

 కింకరులు అను పేరుగల రాక్షసులను పంపబడిరి

రావణస్య మనోనుగాః -  

రావణుని మనస్సు తెలిసినవారు


||శ్లోకతాత్పర్యము||


’అది విని ఆ రాక్షసేంద్రుడు కింకరులు అను పేరుగల దుర్జయులైన భృత్యులను పంపెను. వారు రావణుని మనస్సు తెలిసినవారు’. ||58.113||


||శ్లోకము 58.114|| 


తేషామశీతి సాహస్రం శూలముద్గరపాణినామ్ |

మయా తస్మిన్ వనోద్దేశే పరిఘేణ నిషూదితమ్ ||58.114||


స|| తస్మిన్ వనోద్దేశే శూలముద్గరపాణినామ్ అశీతి సాహస్రం మయా పరిఘేణ నిషూదితం || 


|| శ్లోకార్థములు||


తస్మిన్ వనోద్దేశే - ఆ వనములో

శూలముద్గరపాణినామ్ - 

శూలములు ఉద్గరములు చేతితో పుచ్చుకొని వచ్చిన

అశీతి సాహస్రం - ఎనభైవేలమందిని

మయా పరిఘేణ నిషూదితం - 

నాచేత ఇనుపగుదియతో హతమార్చబడిరి.


||శ్లోకతాత్పర్యము||


’ఆ వనములో, శూలములు ఉద్గరములు చేతితో పుచ్చుకొని వచ్చిన ఎనభైవేలమంది, నా చేత  ఒక ఇనుపగుదియతో హతమార్చబడిరి’.  ||58.114||


||శ్లోకము 58.115|| 


తేశాం తు హతశేషా యే తే గత్వా లఘువిక్రమాః |

నిహతం చ మహత్ సైన్యం రావణాయాచచక్షిరే ||58.115||


స|| తేషాం యే హతశేషాః తే లఘువిక్రమాః గత్వా మహత్ సైన్యం నిహతం రావణాయ ఆచచక్షిరే ||


|| శ్లోకార్థములు||


తేషాం యే హతశేషాః -

 అప్పుడు వారిలో చావకుండా మిగిలినవారు

తే లఘువిక్రమాః గత్వా - 

పరాక్రమము లేనివారు వెళ్ళి,

మహత్ సైన్యం నిహతం - 

మహత్తరమైన సైన్యము హతమార్చబడినది

రావణాయ ఆచచక్షిరే - 

రావణుని కి చెప్పిరి.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు చావకుండా మిగిలినవారు, పరాక్రమము లేనివారు వెళ్ళి, ఆ మహత్తరమైన సైన్యము హతమార్చబడినది అని రావణుని కి చెప్పిరి’. ||58.115||


||శ్లోకము 58.116|| 


 తతో మే బుద్ధిరుత్పన్నా చైత్య ప్రాసాదమాక్రమమ్ |

తత్రస్థాన్ రాక్షసాన్ హత్వా శతం స్తమ్భేన వైపునః ||58.116||

లలామ భూతో లంకాయాః స వైవిధ్వంసితో మయా |


స|| తతః మే బుద్ధిః ఉత్పన్నా చైత్యప్రాసాదం ఆక్రమం స్తంభేన తత్రస్థాన్ శతమ్ రాక్షసాన్ హత్వా పునః మయా లంకాయాః లలామభూతః సః విధ్వంసితః ||


రామ టీకాలో - లంకాయాః లలామభూతం అలంకారభూతః చైత్యప్రాసాదమ్|


|| శ్లోకార్థములు||


తతః మే బుద్ధిః ఉత్పన్నా - 

అప్పుడు నాకు ఒక బుద్ధి పుట్టెను

చైత్యప్రాసాదం ఆక్రమం - 

చైత్య ప్రాసాదమును ఆక్రమించుటకు 

స్తంభేన తత్రస్థాన్ శతమ్ రాక్షసాన్ హత్వా - 

ఒక స్తంభముతో అక్కడవున్న వంద రాక్షసులను చంపి 

పునః మయా లంకాయాః - 

మళ్ళీ నా చేత లంకానగరమునకు

లలామభూతః సః విధ్వంసితః- 

అలంకారప్రాయమైన అ ప్రాసాదము ధ్వంసము చేయబడినది 


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నాకు చైత్య ప్రాసాదమును ఆక్రమించుటకు బుద్ధి పుట్టెను. ( చైత్య ప్రాసాదములో) ఒక స్తంభముతో అక్కడ వున్న వంద రాక్షసులను చంపి,  లంకానగరమునకు అలంకారప్రాయమైన అ ప్రాసాదము ధ్వంసము చేయబడినది’. ||58.116||


||శ్లోకము 58.117|| 


  తతః ప్రహస్తస్య సుతం జంబుమాలినమాదిశత్ ||58.117||

రాక్షసైర్బహుభిః సార్థం ఘోరరూప భయానకైః |


స|| తతః ఘోరరూపైః భయానకైః బహుభిః రాక్షసైః సార్ధం ప్రహస్తస్య సుతం జమ్బుమాలినమ్ ఆదిశత్ ||


|| శ్లోకార్థములు||


తతః ఘోరరూపైః భయానకైః -

 అప్పుడు ఘోరమైన రూపముకల భయము కలిగించు

బహుభిః రాక్షసైః సార్ధం-

 అనేక రాక్షసులతో కలిసి

ప్రహస్తస్య సుతం - 

ప్రహస్తుని పుత్రుడు

జమ్బుమాలినమ్ ఆదిశత్ - 

జంబుమాలి అదేశింపబడెను


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు ఘోరమైన రూపముకల, భయము కలిగించు ప్రహస్తుని పుత్రుడు జంబుమాలి, అనేక రాక్షసులతో కలిసి హనుమని బందించుటకు అదేశింపబడెను’. ||58.117||


||శ్లోకము 58.118|| 


తం మహాబలసంపన్నం రాక్షసం రణకోవిదమ్ ||58.118||

పరిఘేణాతి ఘోరేణ సూదయామి సహానుగం |


స|| మహాబలసంపన్నం రణకోవిదం సహానుగం తం రాక్షసం ఘోరేణ పరిఘేణ సూదయామి ||


|| శ్లోకార్థములు||


మహాబలసంపన్నం -

 అప్పుడు మహాబలము కలవారు

రణకోవిదం  - రణకోవిదులు 

సహానుగం తం రాక్షసం - 

అనుచరులతో కూడిన ఆ రాక్షసులను 

ఘోరేణ పరిఘేణ సూదయామి - 

ఘోరమైన ఇనుప పరిఘతో హతమార్చితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు మహాబలముకలవారు, రణకోవిదులు అగు, అనుచరులతో కూడిన ఆ రాక్షసులను, ఘోరమైన ఇనుప పరిఘతో హతమార్చితిని’. ||58.118|| 


||శ్లోకము 58.119|| 


 తచ్ఛ్రుత్వా రాక్షసేంద్రస్తు మంత్రిపుత్త్రాన్ మహాబలాన్ ||58.119||

పదాతి బలసంపన్నాన్ ప్రేషయామాస రావణః |


స|| తత్ శ్రుత్వా రాక్షసేన్ద్రః మహాబలాన్ పదాతిబలసంపన్నాన్ మన్త్రిపుత్త్రాన్ రావణః ప్రేషయామాస||


|| శ్లోకార్థములు||


తత్ శ్రుత్వా రావణః రాక్షసేన్ద్రః - 

అది విని ఆ రాక్షసేంద్రుడు  అయిన రావణుడు

మహాబలాన్ పదాతిబలసంపన్నాన్ - 

పాదరక్షకుల బలగములతో కూడిన

మన్త్రిపుత్త్రాన్ ప్రేషయామాస - 

మంత్రిపుత్రులను పంపించెను


||శ్లోకతాత్పర్యము||


’అది విని ఆ రాక్షసేంద్రుడు , పాదరక్షకుల బలగములతో కూడిన, మహాబలము కల మంత్రిపుత్రులను, రావణుడు పంపించెను’. ||58.119||


||శ్లోకము 58.120|| 


పరిఘేణైవ తాన్ సర్వాన్ నయామి యమసాదనమ్ ||58.120||

మంత్రిపుత్త్రాన్ హతాన్ శ్రుత్వా సమరే లఘువిక్రమాన్ |

పంచ సేనాగ్రగాన్ శూరాన్ ప్రేషయామాస రావణః ||58.121||


స|| తాన్ సర్వాన్ పరిఘేణైవ యమసాదనం నయామి | రావణః మన్త్రిపుత్త్రాన్ హతాన్ శ్రుత్వా లఘువిక్రమాన్ పంచ సేనాగ్రగాన్ సమరే ప్రేషయామాస ||


రామ టీకాలో - లఘువిక్రమాన్ శీఘ్ర విక్రమకారిణః మన్త్రిపుత్రాన్ హతాన్ శ్రుత్వా  సేనాగ్రగాన్ పంచ ప్రేషయామాస।


|| శ్లోకార్థములు||


తాన్ సర్వాన్ పరిఘేణైవ - 

వారిని అందరిని ఆ పరిఘతో

యమసాదనం నయామి - 

యమసాదనమునకు పంపితిని

రావణః మన్త్రిపుత్త్రాన్ హతాన్ శ్రుత్వా - 

రావణుడు ఆ మంత్రిపుత్రులు హతమార్చబడిరని విని

లఘువిక్రమాన్ పంచ సేనాగ్రగాన్ - 

శీఘ్రముగా విజయము సాధించగల ఐదుమంది అగ్ర సేనానాయుకులను

సమరే ప్రేషయామాస - 

యుద్ధమునకు పంపెను


||శ్లోకతాత్పర్యము||


’వారిని అందరిని, ఆ పరిఘతో యమసాదనమునకు పంపితిని. రావణుడు ఆ మంత్రిపుత్రులు హతమార్చబడిరని విని, శీఘ్రముగా విజయము సాధించగల ఐదుమంది అగ్ర సేనానాయుకులను యుద్ధమునకు పంపెను’. ||58.120,121||


||శ్లోకము 58.122|| 


తానహం సహసైన్యాన్ వై సర్వానేవాభ్యసూదయమ్ |

తతః పునర్దశగ్రీవః పుత్త్రమక్షం మహాబలమ్ ||58.122||

బహుభీ రాక్షసైస్సార్థం ప్రేషయామాస రావణః |


స|| అహం సహసైన్యాన్ తాన్ సర్వాన్ అభ్యసూదయమ్| తతః దశగ్రీవః  రావణః మహాబలం పుత్రం అక్షం బహుభిః రాక్షసైః సార్ధం ప్రేషయామాస ||


|| శ్లోకార్థములు||


అహం సహసైన్యాన్ - 

నేను  సైన్యములతో సహా

తాన్ సర్వాన్ అభ్యసూదయమ్ - 

వారిని అందరిని హతమార్చితిని

తతః దశగ్రీవః  రావణః - 

అప్పుడు ఆ దశగ్రీవుడు రావణుడు 

మహాబలం పుత్రం అక్షం - 

మహాబలుడైన తన పుత్రుడు అక్షకుమారుని

బహుభిః రాక్షసైః సార్ధం ప్రేషయామాస-

 అనేకమంది రాక్షసులతో కలిపి పంపెను


||శ్లోకతాత్పర్యము||


’నేను  సైన్యములతో సహా వారిని అందరిని హతమార్చితిని. అప్పుడు ఆ దశగ్రీవుడు రావణుడు మహాబలము కల, తన పుత్రుడు అక్షకుమారుని అనేకమంది రాక్షసులతో కలిపి పంపెను’. ||58.123||


||శ్లోకము 58.123, 124|| 


తం తు మన్డోదరీపుత్త్రం కుమారం రణపణ్డితమ్ ||58.123||

సహసా ఖం సముత్క్రాన్తం పాదయోశ్చ గృహీతవాన్ |

చర్మాసినం శతగుణం భ్రామయిత్వా వ్యపేషయమ్ ||58.124||


స|| రణపణ్డితం మన్దోదరీ పుత్త్రం ఖమ్ ఉత్క్రాంతం చర్మాసినం కుమారం సహసా పాదయోః గృహీతవాన్ | శతగుణం భ్రామయిత్వా వ్యపేషయమ్ ||


|| శ్లోకార్థములు||


రణపణ్డితం మన్దోదరీ పుత్త్రం -

 రణ విద్యలో పండితుడైన ఆ మండోదరీ పుత్రుని

ఖమ్ ఉత్క్రాంతం కుమారం -

 ఆకాశములోకి లేచిన ఆ కుమారుని

సహసా పాదయోః చర్మాసినం గృహీతవాన్ - 

వెంటనే పాదములు ఒడిసి పట్టుకొంటిని

శతగుణం భ్రామయిత్వా వ్యపేషయమ్ - 

వందసార్లు గిరగిరాతిప్పి నేలపై కొడితిని


||శ్లోకతాత్పర్యము||


’రణ విద్యలో పండితుడైన , ఆకాశములోకి లేచిన ఆ కుమారుని, ఆ మండోదరీ పుత్రుని  పాదములు ఒడిసి పట్టుకొని, వందసార్లు గిరగిరాతిప్పి నేలపై కొడితిని’. ||58.123,124||


||శ్లోకము 58.125|| 


  తం అక్షమాగతమ్ భగ్నం నిశమ్య స దశాననః |

తత ఇన్ద్రజితం నామ ద్వితీయం రావణస్సుతమ్ ||58.125||

వ్యాదిదేశ సుసంక్రుద్ధో బలినం యుద్ధదుర్మదమ్ |


స|| దశాననః రావణః ఆగతం అక్షం భగ్నం నిశమ్య సుసంకృద్ధః  | తతః బలినం యుద్ధదుర్మదమ్ ఇన్ద్రజితం నామ ద్వితీయం సుతం వ్యాదిదేశ ||


|| శ్లోకార్థములు||


 దశాననః రావణః - దశాననుడు రావణుడు

ఆగతం అక్షం భగ్నం నిశమ్య - 

వచ్చిన అక్షకుమారుడు హతమార్చబడెను అని విని

సుసంకృద్ధః - అత్యంత క్రోధముతో 

తతః బలినం యుద్ధదుర్మదమ్ - 

అప్పుడు బలవంతుడు యుద్ధోనమత్తుడు అయిన

ఇన్ద్రజితం నామ ద్వితీయం సుతం - 

ఇంద్రజిత్తుడను పేరుగల రెండవ కుమారుని 

వ్యాదిదేశ - పంపెను


||శ్లోకతాత్పర్యము||


’దశాననుడు రావణుడు,  అక్షకుమారుడు హతమార్చబడెను అని విని క్రోధుడయ్యెను. అప్పుడు బలవంతుడు యుద్ధోనమత్తుడు అయిన ఇంద్రజిత్తుడను పేరుగల రెండవ కుమారుని కి అదేశమిచ్చెను’. ||58.125||


||శ్లోకము 58.126|| 


  తచ్చాప్యహం బలం సర్వం తం చ రాక్షసపుంగవమ్ ||58.126||

నష్టౌజసం రణే కృత్వా పరం హర్షముపాగమమ్ |


స|| అహమ్ సర్వం తత్ బలం చ తం రాక్షసపుంగవం రణే నష్టౌజసం కృత్వా పరం హర్షం ఉపాగమమ్ ||


|| శ్లోకార్థములు||


తత్ రాక్షసపుంగవం సర్వం బలం చ -

 ఆ రాక్షసపుంగవుని సమస్త బలములను

రణే తం నష్టౌజసం కృత్వా - 

యుద్ధములో నష్టము చేసి 

అహమ్ పరం హర్షం ఉపాగమమ్- 

అమితానందము పొందితిని


||శ్లోకతాత్పర్యము||


’నేను ఆ రాక్షసపుంగవుని సమస్త బలములను యుద్ధములో నష్టము చేసి అమితానందము పొందితిని’. ||58.126||


||శ్లోకము 58.127|| 


మహతాఽపి మహాబాహుః ప్రత్యయేన మహాబలః ||58.127||

ప్రేషితో రావణే నైవ సహవీరైర్మదోత్కటైః |


స|| మహాబాహుః మహాబలః మదోత్కటైః వీరై సహ రావణేనైవ మహతా ప్రత్యయేన ప్రేషితః ||


తిలక టీకాలో - మహతా ప్రత్యయేన విశ్వాసేన।


|| శ్లోకార్థములు||


మహాబాహుః మహాబలః - 

మహాబాహువులు కల మహాబలము కల 

మదోత్కటైః వీరై సహ -

 మదమెక్కిన వీరులతో సహా

రావణేనైవ మహతా ప్రత్యయేన -

 రావణుడు గొప్ప విశ్వాసముతో 

ప్రేషితః- పంపెను


||శ్లోకతాత్పర్యము||


’మదోన్మత్తుడైన, మహాబలము కల  రావణునిచేత, యుద్ధమునకై మహాబాహువులు కలవాడు (ఇంద్రజిత్తు) పంపబడెను’. ||58.127||  


||శ్లోకము 58.128|| 


  సోఽవిషహ్యం హి మాం బుద్ధ్వా స్వం బలం చావమర్దితమ్||58.128||

బ్రాహ్మేణాస్త్రేణ స తు మాం ప్రాబధ్నాచ్చాతివేగితః|


స|| సః మాం అవిషహ్యం బుద్ధ్వా స్వం బలం చ అవమర్దితం స తు అతివేగితః  మామ్ బ్రహ్మేణ అస్త్రేణ ప్రబధ్నాత్ ||


రామ టీకాలో-  మహతా ప్రత్యయేన విశ్వాసేన వీరైః సహ ప్రహితః ప్రేషితః స ఏష ఇన్ద్రజిత్  స్వ సైన్యం అవమర్దితం బుద్ధ్వా అతఏవ మమవిష్యహ్యం బుద్ధ్వా బన్ధ్తుం ఇచ్ఛతి ఇతి శేషః।


|| శ్లోకార్థములు||


సః మాం అవిషహ్యం బుద్ధ్వా - 

ఆ మహాబలుడు నన్ను వధింపడము కాదని గ్రహించి

స్వం బలం చ అవమర్దితం - 

తన బలగములు నాశనమగుట గ్రహించి,

స తు అతివేగితః  - అతి వేగముతో

మామ్ బ్రహ్మేణ అస్త్రేణ ప్రబధ్నాత్- 

నన్ను బ్రహ్మ అస్త్రముతో బంధించెను


||శ్లోకతాత్పర్యము||


’ఆ మహాబలుడు ( ఇంద్రజిత్తు) నన్ను వధింపడము కాదని గ్రహించి, తన సైన్యములు నాశనమగుట గ్రహించి, అతి వేగముతో నన్ను బ్రహ్మ అస్త్రముతో బంధించెను’. ||58.128 ||


||శ్లోకము 58.129|| 


రజ్జుభిశ్చాపి బధ్నన్తి తతో మాం తత్ర రాక్షసాః ||58.129||

రావణస్య సమీపం చ గృహీత్వా మాముపానయన్ |


స|| తతః తత్ర రాక్షసాః మామ్ రజ్జుభిః అభిభధ్నన్తి | మామ్ గృహీత్వా రావణస్య సమీపం ఉపానయన్ ||


|| శ్లోకార్థములు||


తతః తత్ర రాక్షసాః -

 అప్పుడు అక్కడ వున్న రాక్షసులు

మామ్ రజ్జుభిః అభిభధ్నన్తి - 

నన్ను తాళ్లతో బంధించిరి

మామ్ గృహీత్వా - నన్ను పట్టుకొని  

రావణస్య సమీపం ఉపానయన్ - 

రావణుని సమీపమునకు తీసుకొని పోయిరి.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు అక్కడ వున్న రాక్షసులు నన్ను తాళ్లతో బంధించిరి. నన్ను పట్టుకొని రావణుని సమీపమునకు తీసుకొని పోయిరి’. ||58.129||


||శ్లోకము 58.130|| 


దృష్ట్వా సంభాషితశ్చాహం రావణేన దురాత్మనా ||58.130||

పృష్టశ్చ లంకాగమనం రాక్షసానాం చ తం వధమ్ |


స|| అహం దురాత్మనా రావణేన దృష్ట్వా సంభాషితః చ | లంకాగమనం రాక్షసానాం తం వధం పృష్టశ్చ ||


|| శ్లోకార్థములు||


దృష్ట్వా దురాత్మనా రావణేన  - 

నేను ఆ దురాత్ముడైన రావణుని చూచి 

అహం సంభాషితః చ -

 అతనితో సంభాషణ చేసితిని 

లంకాగమనం - లంకాగమనము 

రాక్షసానాం తం వధం పృష్టశ్చ- 

రాక్షసవధలను గురించి అడగబడితిని


||శ్లోకతాత్పర్యము||


’నేను ఆ దురాత్ముడైన రావణుని చేత చూడబడి, అతనితో సంభాషణ చేసితిని . నా లంకాగమనము గురించి,  రాక్షసవధలను గురించి అడగబడితిని’. ||58.130||


||శ్లోకము 58.131|| 


తత్సర్వం చ మయా తత్ర సీతార్థమితి జల్పితమ్ ||58.131||

అస్యాహం దర్శనాకాంక్షీ ప్రాప్తః తద్భవనం విభో |


స|| తత్ సర్వం సీతార్థం ఇతో మయా తత్ర జల్పితం  విభో | అస్యాః దర్శనకాంక్షీ త్వద్భవనం ప్రాప్తః | 




|| శ్లోకార్థములు||


విభో తత్ సర్వం సీతార్థం - 

ఓ ప్రభో అది అంతా సీతకొఱకై

మయా తత్ర జల్పితం - 

నా చేత భగ్నము చేయబడినది,

అస్యాః దర్శనకాంక్షీ - 

ఆమె దర్శన కాంక్షతో

ఇతో  త్వద్భవనం ప్రాప్తః- 

ఇక్కడ నీ భవనమునకు వచ్చితిని


||శ్లోకతాత్పర్యము||


"ఓ ప్రభో అది అంతా సీతకొఱకై భగ్నము చేయబడినది, ఆమె దర్శన కాంక్షతో నీ భవనమునకు వచ్చితిని." ||58.131||


||శ్లోకము 58.132|| 


మారుతస్యౌరసః పుత్త్రో వానరో హనుమానహమ్||58.132||

రామదూతం చ మాం విద్ధి సుగ్రీవ సచివం కపిమ్|

సోఽహం దూత్యేన రామస్య త్వత్సకాశ మిహాగతః||58.133||


స||అహం మారుతస్య ఔరసః పుత్త్రః వానరః హనుమాన్ || కపిం మాం రామదూతం సుగ్రీవ సచివం విద్ధి| అహం రామస్య దూత్యేన త్వత్ సకాసం ఇహ ఆగతః||


|| శ్లోకార్థములు||


అహం మారుతస్య ఔరసః పుత్త్రః- 

నేను మారుతి ఔరసపుత్రుని.

వానరః హనుమాన్ - 

వానరుడను హనుమంతుడను

కపిం మాం రామదూతం -

 వానరుడనైన నన్ను రామదూత గా 

సుగ్రీవ సచివం విద్ధి - 

సుగ్రీవుని భృత్యునిగా తెలిసికొమ్ము

అహం రామస్య దూత్యేన - 

నేను రామ దూత్యముతో 

త్వత్ సకాసం ఇహ ఆగతః- 

నీ కొఱకై ఇక్కడకు వచ్చితిని


||శ్లోకతాత్పర్యము||


"నేను మారుతి ఔరసపుత్రుని. వానరుడను హనుమంతుడను. వానరుడనైన నన్ను రామదూత గా సుగ్రీవుని భృత్యునిగా తెలిసికొమ్ము. నేను రామ దూత్యముతో నీ కొఱకై వచ్చితిని". ||58.132,133||


||శ్లోకము 58.134|| 


సుగ్రీవశ్చ మహాతేజాః స త్వాం కుశలమబ్రవీత్|

ధర్మార్థకామసహితం హితం పథ్య మువాచ చ||58.134||


స|| మహాతేజాః సుగ్రీవః త్వాం కుశలం అబ్రవీత్ || ధర్మార్థ సహితం హితం పథ్యం ఉవాచ హ||


|| శ్లోకార్థములు||


మహాతేజాః సుగ్రీవః - 

మహాతేజోమయుడైన సుగ్రీవుడు

త్వాం కుశలం అబ్రవీత్ - 

నీ కుశలములు అడిగెను

ధర్మార్థ సహితం హితం పథ్యం - 

ధర్మార్థసహితమైన హితకరమైన ఈ మాటలను

ఉవాచ హ - చెప్పెను కూడా


||శ్లోకతాత్పర్యము||


"మహాతేజోమయుడైన సుగ్రీవుడు, నీ కుశలములు అడిగెను. అతడు ధర్మార్థసహితమైన హితకరమైన ఈ మాటలను చెప్పెను కూడా." ||58.134||


||శ్లోకము 58.135|| 


వసతో ఋష్యమూకే మే పర్వత విపులద్రుమే |

రాఘవో రణవిక్రాన్తో మిత్రత్వం సముపాగతః ||58.135||


స|| విపులద్రుమే ఋష్యమూకే వసతః మే  రణవిక్రాన్తః రాఘవః మిత్రత్వం ఉపాగతః||


|| శ్లోకార్థములు||


విపులద్రుమే ఋష్యమూకే వసతః మే- 

విస్తారమైన వృక్షములతో కూడిన ఋష్యమూక పర్వతముపై నివసిస్తూ

రణవిక్రాన్తః రాఘవః -

 రణములో పండితుడైన రాఘవుని

మిత్రత్వం ఉపాగతః- 

మిత్రత్వము పొందితిని


||శ్లోకతాత్పర్యము||


"విస్తారమైన వృక్షములతో కూడిన ఋష్యమూక పర్వతముపై నివసిస్తూ రణములో పండితుడైన రాఘవుని మిత్రత్వము పొందితిని".||58.135||


||శ్లోకము 58.136|| 


  తేన మే కథితం రాజ్ఞా భార్యా మే రక్షసా హృతా |

తత్ర సాహాయ్య మస్మాకం కార్యం సర్వాత్మనా త్వయా ||58.136||


స|| రాజ్ఞా తేన మే కథితం | మే భార్యా రక్షసా హృతా | తత్ర త్వయా సర్వాత్మనా అస్మాకం సాహాయ్యం కార్యం ||


|| శ్లోకార్థములు||


రాజ్ఞా తేన మే కథితం  -

 ఓ రాజా అతడునాకు ఈవిధముగా చెప్పెను

మే భార్యా రక్షసా హృతా - 

నా భార్య రాక్షసులచేత అపహరింపబడినది

తత్ర త్వయా సర్వాత్మనా - 

అక్కడ అన్నివిధములుగా 

అస్మాకం సాహాయ్యం కార్యం - 

మాకు సహాయము కావలెను


||శ్లోకతాత్పర్యము||


"ఓ రాజా అతడు నాకు ఈవిధముగా చెప్పెను. ’నా భార్య రాక్షసులచేత అపహరింపబడినది. అక్కడ అన్ని విధములుగా మాకు సహాయము కావలెను’. అని" ||58.136||


||శ్లోకము 58.137|| 


మయా చ కథితం తస్మై వాలినశ్చ వధం ప్రతి |

తత్ర సహాయ్య హేతోర్మే సమయం కర్తుమర్హసి ||58.137||


స|| మయా చ వాలినః వధం ప్రతి తస్మై కథితం | తత్ర సహాయ్యహేతోః సమయం కర్తుం అర్హసి ||


తిలక టీకాలో - సమయం ప్రతిజ్ఞాం।


|| శ్లోకార్థములు||


మయా చ వాలినః - 

అప్పుడు నేను వాలి 

వధం ప్రతి తస్మై కథితం- 

వధ గురించి అయనకు చెప్పితిని

తత్ర సహాయ్యహేతోః - 

అచట నాకు సహాయము కొఱకు

సమయం కర్తుం అర్హసి - 

ఒప్పందము చేయ తగును


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను వాలి వధగురించి అయనకు చెప్పితిని. అచట నాకు సహాయము కొఱకు ఒప్పందము చేయ తగును అని’. ||58.137||


ఇవి సుగ్రీవుడు రామునితో వాలి గురించి, వాలి వలన కోల్పోయిన రాజ్యము గురించి  చెప్పిన మాటలు.


||శ్లోకము 58.138|| 


వాలినా హృతరాజ్యేన సుగ్రీవేణ మహాప్రభుః |

చక్రేఽగ్ని సాక్షికం సఖ్యం రాఘవః సహలక్ష్మణః ||58.138||


స|| మహాప్రభుః సహ లక్ష్మనః రాఘవః వాలినా హృతరాజ్యేన సుగ్రీవేణ అగ్నిసాక్షికం సఖ్యం చక్రే ||


|| శ్లోకార్థములు||


మహాప్రభుః రాఘవః సహ లక్ష్మణః - 

మహాప్రభువైన రాఘవుడు లక్ష్మణునితో కలిసి

వాలినా హృత రాజ్యేన సుగ్రీవేణ - 

వాలిచేత రాజ్యము కోల్పోయిన సుగ్రీవునితో 

అగ్నిసాక్షికం సఖ్యం చక్రే- 

అగ్ని సాక్షిగా స్నేహము చేసెను


||శ్లోకతాత్పర్యము||


"వాలిచేత రాజ్యము కోల్పోయిన మహాప్రభువు సుగ్రీవుడు , రామ లక్ష్మణులతో అగ్ని సాక్షిగా స్నేహము చేసెను".  ||58.138||


||శ్లోకము 58.139|| 


తేన వాలినముత్పాట్య శరేణైకేన సంయుగే |

వానరాణాం మహారాజః కృతః స ప్లవతాం ప్రభుః ||58.139||


స|| తేన సంయుగే ఏకేన శరణే వాలినం ఉత్పాట్య ప్లవతాం ప్రభుః సః వానరాణామ్ మహారాజః కృతః ||


|| శ్లోకార్థములు||


తేన సంయుగే - అప్పుడు యుద్ధములో

ఏకేన శరణేవాలినం ఉత్పాట్య -

 ఒకే బాణముతో వాలిని వధించి

సః వానరాణామ్ మహారాజః కృతః - 

అతడు వానరుల మహారాజుగా చేయబడెను


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు యుద్ధములో ఒకే బాణముతో  వానరుల ప్రభువు వాలిని వధించిన పిమ్మట, సుగ్రీవుడు వానరుల మహారాజుగా చేయబడెను’. ||58.139||


వాలి గురించి రావణునికి తెలుసు. రావణుని జయించిన వారి ఇద్దరు ఒకడు వాలి , రెండవవాడు కార్త వీర్యార్జునుడు. ఈ రెండు వృత్తాంతములు ఉత్తరకాండలో వస్తాయి.


||శ్లోకము 58.140|| 


తస్యసాహయ్యమస్మాభిః కార్యం సర్వాత్మనా త్విహ |

తేన ప్రస్థాపితః తుభ్యం సమీప మిహ ధర్మతః ||58.140||


స|| ఇహ అస్మాభిః సర్వాత్మనా తస్య సహాయ్యం కార్యం | తేన తుభ్యం సమీపం ధర్మతః ప్రస్థాపితః ||


తిలక టీకాలో- తస్య రామసాహాయ్యం అస్మాభిః కార్యం అతః తేన మయా తుభ్యం తవ సమీపం ఇతః ప్రస్థాపితః దూత ఇతి శేషః।


|| శ్లోకార్థములు||


ఇహ అస్మాభిః సర్వాత్మనా -

 అప్పుడు మేముకూడా అన్నివిధములుగా

తస్య సహాయ్యం కార్యం -

 అయనకు సహయము చేయవలెను

ధర్మతః ప్రస్థాపితః- అందువలన ధర్మము ననుసరించి 

తేన తుభ్యం సమీపం - 

అతనిచేత నీ దగ్గఱకు 

ధర్మతః ప్రస్థాపితః- 

అందువలన ధర్మము ననుసరించి పంపితిని 


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు మేముకూడా అన్నివిధములుగా అయనకు సహయము చేయవలెను. అందువలన ధర్మము ననుసరించి నీ దగ్గఱకు ఇతనిని పంపితిని’. ||58.140||


ఇవన్నీ సుగ్రీవుని మాటలు లాగా హనుమ చెపుతున్నాడు రావణునికి.


||శ్లోకము 58.141|| 


క్షిప్రమానీయతాం సీతా దీయతాం రాఘవాయ చ |

యావన్నహరయో వీరా విధమన్తి బలం తవ ||58.141||


స|| వీరాః హరయః  తవ బలం యావత్ న విధమన్తి (తావత్)  సీతా క్షిప్రం ఆనీయతాం రాఘవాయ దీయతాం |


రామ టీకాలో - హరయో వానరాః యావత్  తే బలం న విధమన్తి , తావదేవ రాఘవస్య సీతా ఆనీయతాం దీయతాం చ ।


|| శ్లోకార్థములు||


వీరాః హరయః - 

వానర వీరులు 

యావత్  తవ బలం న విధమన్తి - 

నీ బలములను నాశనము చేయక ముందు 

(సీతా క్షిప్రం ఆనీయతాం రాఘవాయ దీయతాం- 

సీతమ్మను అతి త్వరలో తీసుకొని రాఘవునుకి అప్పగించబడుగాక 


||శ్లోకతాత్పర్యము||


"వీరులైన వానరులు నీ బలములను నాశనము చేయకముందే, సీతాదేవిని వెంటనే అప్పగించుము." ||58.141||


||శ్లోకము 58.142|| 


వానరాణాం ప్రభావో హి న కేన విదితః పురా |

దేవతానాం సకాశం చ యే గచ్చన్తి నిమన్త్రితాః ||58.142||


స|| యే నిమన్త్రితాః దేవతానాం సంకాశం గచ్ఛన్తి పురా వానరాణామ్ ప్రభావః కేన నవిదితః ||


రామటీకాలో - నన్వితి బలవతో మే వానరాః కిం కరిష్యన్తీ ఇతి ఆహ- న వానరాణాం ఇతి। నిమన్త్రితాః ప్రబలస్వరిపుఘాతాయ దేవైః ఆహుతాః యే వానరాః దేవతానాం సకాసం సమీపం గచ్ఛన్తి తేషాం వానరాణాం అయం ప్రభావః కేన సాధారణేన్ జనేన న విదితః కించ స్వర్గోఽపి  న విదితో విదిత ఏవ


తిలక టీకాలో - వానరాణామితి। ఏవం చ లంకానాశనే వానరా అసమర్థా న ఇతి మన్తవ్యం ఇతి భావః।


|| శ్లోకార్థములు||


పురా దేవతానాం సకాశం - 

ఏవరు పూర్వకాలములో దేవతలకొఱకై 

యే నిమన్త్రితాః గచ్ఛన్తి - 

నియంత్రించ బడి వెళ్ళిన

వానరాణామ్ ప్రభావః కేన నవిదితః- 

వానరుల  యొక్క ప్రభావము ఎవరికి తెలియదు


||శ్లోకతాత్పర్యము||


" దేవతల చేత నిమంత్రులై, వారికి యుద్ధములో తోడ్పడిన వానరుల గురించి ఎవరికి తెలియదు?." ||58.142|| 


ఈ వానరులకేమి తెలుసు అనుంటాడేమో అని ఇక్కడ వానరుల దేవతల సంబంధము చెప్పడమైనది. వానరులు దేవతలకు కూడా తోడ్పడినవారు అని. రాక్షసులను తప్పక నాశనము చేయగల శక్తి కలవారు  అని భావన.


||శ్లోకము 58.143|| 


 ఇతి వానరరాజః త్వామాహేత్యభిహితో మయా |

మామైక్షత తతః క్రుద్ధః చక్షుసా ప్రదహన్నివ ||58.143||


స|| ఇతి వానరాజః త్వాం ఆహ ఇతి మయా అభిహితః | తతః కృద్ధః చక్షుషా ప్రదహన్నివ మామ్ ఏక్షత ||


|| శ్లోకార్థములు||


ఇతి వానరాజః త్వాం ఆహ - 

ఈ విధముగా వానర రాజు నీతో చెప్పమని

ఇతి మయా అభిహితః -

 నాకు అదేశమిచ్చెను

తతః కృద్ధః చక్షుషా - 

అప్పుడు రావణుడు కోపముతో కళ్లతోనే 

ప్రదహన్నివ మామ్ ఏక్షత - 

దహించునా అన్నట్లు నన్ను చూచెను


||శ్లోకతాత్పర్యము||


"ఈ విధముగా వానర రాజు నీతో ఇట్లు చెప్పమని నాకు అదేశమిచ్చెను", అని. అప్పుడు రావణుడు కోపముతో కళ్లతోనే నన్ను దహించునా అన్నట్లు నన్ను చూచెను’.||58.143||


ఇదంతా  హనుమ వానర రాజు మాటలలో చెప్పాడు.


||శ్లోకము 58.143|| 


తేన వధ్యోఽహమాజ్ఞప్తో రక్షసా రౌద్రకర్మణా |

మత్ప్రభావం అవిజ్ఞాయ రావణేన దురాత్మనా ||58.144||


స|| రౌద్రకర్మణా రక్షసా దురాత్మనా తేన రావణేన మత్ప్రభావం అవిజ్ఞాయ అహం వధ్యః ఆజ్ఞాపతః||


|| శ్లోకార్థములు||


రౌద్రకర్మణా రక్షసా దురాత్మనా - 

కౄరకర్మలు చేయు దురాత్ముడైనా ఆ రాక్షస రాజు

తేన రావణేన మత్ప్రభావం అవిజ్ఞాయ-

 ఆ రావణుడు నా ప్రభావము తెసికొనకుండా

 అహం వధ్యఃఆజ్ఞాపతః- 

నన్ను చంపమని ఆజ్ఞాపించెను.


||శ్లోకతాత్పర్యము||


"కౄరకర్మలు చేయు దురాత్ముడైన ఆ రాక్షస రాజు, నా ప్రభావము తెసికొనకుండా నన్ను చంపమని ఆజ్ఞాపించెను." ||58.144||


||శ్లోకము 58.145|| 


తతో విభీషణో నామ తస్య భ్రాతా మహామతిః |

తేన రాక్షరాజోఽసౌ యాచితో మమకారణాత్ ||58.145||


స|| తతః తస్య భ్రాతా మహామతిః విభీషణః మమకారణాత్ తేన  రాక్షసరాజః యాచితః||


|| శ్లోకార్థములు||


తతః తస్య భ్రాతా - 

అప్పుడు అతని తమ్ముడు

మహామతిః విభీషణః - 

మహా బుద్ధిమంతుడు విభీషణుడు

మమకారణాత్ తేన - నా కోసము

రాక్షసరాజః యాచితః-

 రాక్షస ప్రార్థించెను


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు అతని తమ్ముడు మహా బుద్ధిమంతుడు విభీషణుడు, నా కోసమే ఆ రాక్షసరాజుని ప్రార్థించెను.’ ||58.145||


||శ్లోకము 58.146|| 


నైవం రాక్షసశార్దూల త్యజతా మేష నిశ్చయః |

రాజశాస్త్రవ్యపేతో హి మార్గః సంసేవ్యతే త్వయా ||58.146||


స|| రాక్షస శార్దూల  ఏవం న ఏషః నిశ్చయః త్యజతామ్ | రాజశాస్త్రవ్యపేతః మార్గః త్వయా సంసేవ్యతే హి ||  


|| శ్లోకార్థములు||


రాక్షస శార్దూల - ఓ రాక్షసశార్దూలా   

ఏవం న ఏషః నిశ్చయః త్యజతామ్  - 

ఈ విధమైన నిర్ణయము తప్పక వదలవలెను

రాజశాస్త్రవ్యపేతః మార్గః త్వయా సంసేవ్యతే హి - 

నీవు పట్టిన మార్గము రాజశాస్త్రము ప్రకారము కాదు

 

||శ్లోకతాత్పర్యము||


"ఓ రాక్షసోత్తమా! అలాంటి నిర్ణయము తప్పక వదలవలెను. నీవు పట్టిన మార్గము రాజశాస్త్రము ప్రకారము కాదు."||58.146||


||శ్లోకము 58.147|| 


దూతవధ్యా న దృష్టా హి రాజశాస్త్రేషు రాక్షస |

దూతేన వేదితవ్యం చ యథార్థం హితవాదినా ||58.147||


స|| తతః రాక్షస రాజశాస్త్రేషు దూతవధ్యా అ దృష్టా హి | హితవాదినా దూతేన యధార్థం వేదితవ్యం ||


|| శ్లోకార్థములు||


తతః రాక్షస - ఓ రాక్షసరాజా 

రాజశాస్త్రేషు దూతవధ్యా అ దృష్టా హి -

 రాజశాస్త్రము ప్రకారము దూతను వధించ రాదు

హితవాదినా దూతేన - 

హితము కోరి వచ్చు దూతలు 

యధార్థం వేదితవ్యం- 

యదార్థము  చెప్పవలెను


||శ్లోకతాత్పర్యము||


"ఓ రాక్షసరాజా రాజశాస్త్రము ప్రకారము దూతను వధించ రాదు. హితము కోరి వచ్చు దూతలు యదార్థము  చెప్పవలెను". ||58.147||


||శ్లోకము 58.148|| 


సుమహత్యపరాధేఽపి దూతస్యాతులవిక్రమ |

విరూపకరణం దృష్టం న వధోఽస్తీతి శాస్త్రతః ||58.148||


స|| హే అతులవిక్రమః సుమహతి అపరాధః అపి దూతస్య విరూపకరణం దృష్టం శాస్త్రతః వధః నాస్తి||


రామటీకాలో - దూతస్య అపరాధే సుమహత్ అపి విరూపకరణం దృష్టం వధో న దృష్టః ఇతి।


|| శ్లోకార్థములు||


హే అతులవిక్రమః - 

ఓ పరాక్రమవంతుడా 

సుమహతి అపరాధః అపి - 

ఎంత పెద్ద అపరాధము చేసిననా కూడా దూత

దూతస్య విరూపకరణం దృష్టం - 

దూత యొక్క అంగవిరూపము కలిగించడము శాస్త్రములో చూడబడినది

శాస్త్రతః వధః నాస్తి- 

శాస్త్రములో వధించుట లేదు


||శ్లోకతాత్పర్యము||


"ఓ పరాక్రమవంతుడా ఎంత పెద్ద అపరాధము చేసిననా కూడా దూత యొక్క అంగవిరూపము కలిగించడము శాస్త్రములో చూడబడినది. కాని వధ ఎక్కడా లేదు. " ||58.148||


||శ్లోకము 58.149|| 


విభీషణేనైవ ముక్తో రావణః సందిదేశ తాన్ |

రాక్షసానేత దేవాస్య లాంగూలం దహ్యతామితి ||58.149|


స|| విభీషణేన ఏవం ఉక్తః రావణః అస్య ఏతత్ లాంగూలం దహ్యతాం ఇతి తాన్ రాక్షసాన్ సన్దిదేశ ||


|| శ్లోకార్థములు||


విభీషణేన ఏవం ఉక్తః - 

విభీషణుని చేత ఈ విధముగా చెప్పబడిన

రావణః అస్య ఏతత్ లాంగూలం దహ్యతాం - 

రావణుడు అతని లాంగూలము దహించమని

ఇతి తాన్ రాక్షసాన్ సన్దిదేశ - 

ఆ రాక్షసులకు ఆదేశమిచ్చెను.


||శ్లోకతాత్పర్యము||


’విభీషణుని చేత ఈ విధముగా చెప్పబడిన రావణుడు అతని లాంగూలము దహించమని ఆ రాక్షసులకు ఆదేశమిచ్చెను’. ||58.149||


||శ్లోకము 58.150|| 


  తతస్తస్య వచశ్శ్రుత్వా మమ పుచ్చం సమన్తతః |

వేష్టితం శణవల్కైశ్చ జీర్ణైః కార్పాసజైః పటైః ||58.150||


స|| తతః తస్య వచః శ్రుత్వా మమ పుచ్ఛం సమన్తతః శణవల్కైః జీర్ణైః కార్పాసజైః పటైః వేష్టితం || 


|| శ్లోకార్థములు||


తతః తస్య వచః శ్రుత్వా -

 అప్పుడు ఆయన మాటలు విని

మమ పుచ్ఛం సమన్తతః - 

నా తోక అంతా

శణవల్కైః జీర్ణైః కార్పాసజైః పటైః- 

నారబట్టలూ జీర్ణించిన గుడ్డపీలికల తో .

వేష్టితం - కట్టబడినది


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు ఆయన మాటలు వినిన రాక్షసుల చేత, నా తోక అంతా నార బట్టలూ గుడ్డపీలికల తో కట్టబడినది’. ||58.150||


||శ్లోకము 58.151|| 


రాక్షసాః సిద్ధసన్నాహాః తతస్తే చణ్డవిక్రమాః | 

తదాఽదహ్యన్త మే పుచ్చం నిఘ్నన్తః కాష్ఠముష్టిభిః ||58.151||

బద్ధస్య బహుభిః పాశైర్యన్త్రితస్య చ రాక్షసైః |


స|| తతః సిద్ధసన్నాహాః చణ్డవిక్రమాః రాక్షసాః కాష్ఠముష్టిభిః నిఘ్నన్తః బహుభిః పాశైః బద్దస్య రాక్షసైః యన్త్రితస్య మే పుచ్ఛం తదా అదహ్యత || 


|| శ్లోకార్థములు||


తతః సిద్ధసన్నాహాః - 

అప్పుడు సిద్ధ  సన్నాహములు చేసి

చణ్డవిక్రమాః రాక్షసాః - 

ఆ కౄర విక్రమముగల ఆ రాక్షసులు

కాష్ఠముష్టిభిః నిఘ్నన్తః -

 కర్రలతో నన్ను కొట్టుతూ 

బహుభిః పాశైః బద్దస్య రాక్షసైః - 

రాక్షసులచే అనేక తాళ్ళతో కట్టబడిన

యన్త్రితస్య మే పుచ్ఛం తదా అదహ్యత -

 లాలాంగూలము అప్పుడు దహింపబడెను


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు సిద్ధ  సన్నాహములు చేసి, ఆ కౄర విక్రమముగల ఆ రాక్షసులు, కర్రలతో నన్ను కొట్టుతూ, అనేక పాశములతో కట్టి, నా తోకకు నిప్పంటించిరి’. ||58.151||


||శ్లోకము 58.152|| 


తతస్తే రాక్షసా శ్శూరా బద్ధం మామగ్నిసంవృతమ్ ||58.152||

అఘోషయన్ రాజమార్గే నగరద్వారమాగతాః |


స|| తతః శూరాః రాక్షసాః బద్ధం అగ్నిసంవృతం మామ్ రాజమార్గే అఘోషయన్ నగరద్వారం ఆగతాః


’అప్పుడు ఆ శూరులూ రాక్షసులూ నగర ద్వారము వద్దకు నన్ను తీసుకుపోయి రాజవీథులలో ఘోషణ చేసిరి’. ||58.152||


|| శ్లోకార్థములు||


తతః శూరాః రాక్షసాః - 

అప్పుడు ఆ రాక్షస శూరులు

బద్ధం అగ్నిసంవృతం మామ్ - 

బంధింపబడి , అగ్నితో చుట్టబడి యున్న నన్ను

రాజమార్గే అఘోషయన్ - 

రాజమార్గములలో ఘోషించుచూ

నగరద్వారం ఆగతాః - 

నగర ద్వారము చేరిరి


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడూ ఆ శూరులూ రాక్షసులూ రాజమార్గములలో చాటించుచూ, బంధింపబడి , అగ్నితో చుట్టబడి యున్న నన్ను( తీసుకొని), నగర ద్వారము వద్దకు చేరిరి’. ||58.152||


||శ్లోకము 58.153,154|| 


  తతోఽహం సుమహద్రూపం సంక్షిప్య పునరాత్మనః ||58.153||

విమోచయిత్వా తం బద్ధం ప్రకృతిస్థః స్థితః పునః |

ఆయసం పరిఘం గృహ్య తాని రక్షాంస్యసూదయమ్ ||58.154||


స|| తతః అహం ఆత్మనః సుమహత్ రూపం పునః సంక్షిప్య తం బంధం విమోచయిత్వా పునః ప్రకృతిస్థః స్థితః ఆయసమ్ పరిఘం గృహ్య తాని రక్షాంసి అసూదయమ్ ||


|| శ్లోకార్థములు||


తతః అహం -అప్పుడు నేను

ఆత్మనః సుమహత్ రూపం పునః సంక్షిప్త్య - 

నా యొక్క మహత్ రూపమును మరల చిన్నది గా చేసి

 తం బంధం విమోచయిత్వా -

 ఆ బంధములనుంచి విడివడి

పునః ప్రకృతిస్థః స్థితః ఆయసమ్ పరిఘం - 

నా ప్రకృతి రూపము లోకి మారితిని.

ఆయసమ్ పరిఘం గృహ్య -  

ఆ ఇనుము తో చేయబడిన పరిఘను తీసుకొని                  

 తాని రక్షాంసి అసూదయమ్ - 

 ఆ రాక్షసులను హతమార్చితిని.


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను నా యొక్క మహత్ రూపమును మరల చిన్నది గా చేసి, ఆ బంధములనుంచి విడివడి, నా ప్రకృతి రూపముతో పరిఘను పట్టుకొని, ఆ రాక్షసులను హతమార్చితిని’. ||58.153,154||


||శ్లోకము 58.155|| 


తతస్తన్నగరద్వారం వేగే నాప్లుతవానహమ్ |

పుచ్ఛేన చ ప్రదీప్తేన తాం పురీం సాట్టగోపురామ్ ||58.155||

దహామ్యహమసంభ్రాన్తో యుగాన్తాగ్నిరివ ప్రజాః |


స|| తతః అహం వేగేన తత్ నగరద్వారం అసంభ్రాన్తః ఆప్లుతవాన్ | అహం  యుగాన్తాగ్నిః ఇవ ప్రజాః ఇవ సాట్టప్రాకార గోపురం తాం పురీం ప్రదీప్తేన పుచ్చేన దహామి ||


|| శ్లోకార్థములు||


తతః అహం వేగేన తత్ నగరద్వారం- 

అప్పుడు నేను వేగముగా 

 నగరద్వారం అసంభ్రాన్తః ఆప్లుతవాన్ - 

ఆ నగరద్వారమును ఎక్కితిని

అహం  యుగాన్తాగ్నిః ఇవ ప్రజాః ఇవ - 

నేను యుగాన్తములో కాలాగ్ని వలె

 సాట్టప్రాకార గోపురం తాం పురీం - 

సాట్టప్రాకారములతో గోపురములతో కూడిన ఆ నగరమును

 ప్రదీప్తేన పుచ్చేన దహామి - మండుచున్న లాంగూలముతో దహించితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను వేగముగా ఆ నగరద్వారమును ఎక్కితిని. అప్పుడు  కాలాగ్ని జనులను దహించిన రీతిలో, సాట్టప్రాకారములతో గోపురములతో కూడిన ఆ నగరమును, నేను మండుతున్న తోకతో దగ్ధము చేసితిని’. ||58.155||


||శ్లోకము 58.156|| 


వినష్టా జానకీ వ్యక్తం న హ్యదగ్ధః ప్రదృశ్యతే ||58.156||

లంకాయాం కశ్చిదుద్దేశః సర్వా భస్మీకృతా పురీ |


స|| వ్యక్తం జానకీ వినష్టా లంకాయాం కశ్చిత్ ఉద్దేశః అదగ్ధః న ప్రదృశ్యతే | సర్వా పురీ భస్మీకృతా ||


రామటీకాలో - వినష్టేతి। యతః పురీ లంకా మయా భస్మీకృతా , అతఏవ లంకాయాః కశ్చి దుద్దేశః అదగ్ధో నదృశ్యతే అతఏవ జానకీ వినష్టా।


|| శ్లోకార్థములు||

 

సర్వా పురీ భస్మీకృతా- 

ఆ నగరమంతయూ భస్మము చేయబడినది

లంకాయాం కశ్చిత్ ఉద్దేశః అదగ్ధః  - 

లంకలో ఒక్కటి కూడా  దహింపబడని ప్రదేశము

న ప్రదృశ్యతే - 

కనపడుట లేదు

వ్యక్తం జానకీ వినష్టా  - 

జానకి నష్టపోయెనేమో అని వ్యక్తముఅగుచునది


||శ్లోకతాత్పర్యము||


’ఆ నగరమంతయూ భస్మము చేయబడినది, లంకలో  దహింపబడని ప్రదేశము ఒక్కటి కూడా కనపడుట లేదు. జానకి కూడా నష్టపోయెనేమో అని’. ||58.156||


||శ్లోకము 58.157|| 


దహతా చ మయా లంకాం దగ్ధా సీతా న సంశయమ్ ||58.157||

రామస్యహి మహత్కార్యం మయేదం వితథీకృతమ్ |


స|| మయా లంకాం దహతా చ | సీతా దగ్ధా సంశయం న || మయా ఇదం రామస్య మహత్ కార్యం వితధీకృతం || 


రామటీకాలో- మయా సీతా దగ్ధా అత ఏవ రామస్య కార్యం మయా విఫలీకృతం ఇతి శోకసమావిష్టోఽహం చిన్తాం ఉపాగతః॥


|| శ్లోకార్థములు||


మయా లంకాం దహతా చ - 

నా చేత లంక దహనము చేయబడినది

సీతా దగ్ధా సంశయం న - 

సీత సంశయము లేకుండా దహించబడినది

మయా ఇదం రామస్య మహత్ కార్యం వితధీకృతం- 

నా చేత ఈ రామునియొక్క మహత్తరమైన కార్యము నాశనము చేయబడినది


||శ్లోకతాత్పర్యము||


’నా చేత లంకా దహనము చేయబడినది. సీత తప్పకుండా దహించబడినది. నా చేత ఈ రామునియొక్క మహత్తరమైన కార్యము నాశనము చేయబడినది’. ||58.157||


||శ్లోకము 58.158,159|| 

 

 ఇతి శోకసమావిష్టః చిన్తామహముపాగతః ||58.158||

అథాహం వాచ మశ్రౌషం చారణానాం శుభాక్షరామ్ |

జానకీ న చ దగ్ధేతి విస్మయోదన్త భాషిణామ్ ||58.159||


స|| ఇతి శోకసమావిష్టః అహం చిన్తాం ఉపాగతః| అథ అహం జానకీ న చ దగ్ధా ఇతి విస్మయోదన్తభాషనం చారణానాం శుభాక్షరం వాచం అశ్రౌషం ||


|| శ్లోకార్థములు||


ఇతి శోకసమావిష్టః -

 ఈ విధముగా శోకములో మునిగి పోయి

అహం చిన్తాం ఉపాగతః - 

నేను చింతనలో పడితిని

అథ అహం జానకీ న చ దగ్ధా ఇతి - 

అప్పుడు నేను "సీత దగ్ధము కాలేదు" అని

 విస్మయోదన్త భాషిణామ్ - 

విస్మయముతో చెప్పబడిన

చారణానాం శుభాక్షరం వాచం అశ్రౌషం- 

చారణుల శుభకరమైన మాటలు వింటిని


||శ్లోకతాత్పర్యము||


’ఈ విధముగా శోకములో మునిగి పోయి నేను చింతనలో పడితిని. అప్పుడు నేను, "సీత దగ్ధము కాలేదు" అన్న చారణుల శుభాక్షరములకూడిన మాటలను వింటిని’. ||58.158,159||


||శ్లోకము 58.160|| 


తతో మే బుద్ధిరుత్పన్న శ్రుత్వా తామద్భుతాం గిరమ్ |

అదగ్ధా జానకీత్యేవం నిమిత్తైశ్చోపలక్షితా ||58.160||


స|| అద్భుతాం తాం గిరం శ్రుత్వా తతః జానకీ అదగ్ధా ఇత్యేవం మే బుద్ధిః ఉత్పన్నా నిమిత్తైశ్చ ఉపలక్షితా ||


గోవిన్దరాజ టీకాలో- నిమిత్తైశ్చోపలక్షితా - శకునాదిభిశ్చ సీతా నదగ్ధేతి జ్ఞాతేతి అర్థః।


|| శ్లోకార్థములు||


తతః జానకీ అదగ్ధా ఇత్యేవం - 

అప్పుడు జానకీ దగ్ధము కాలేదు అని

అద్భుతాం తాం గిరం శ్రుత్వా- 

అద్భుతమైన ఆ మాటలు విని

మే బుద్ధిః ఉత్పన్నా - నా మదిలో తట్టినది

నిమిత్తైశ్చ ఉపలక్షితా - 

శుభశకునములతో తెలిసికోంటిని


||శ్లోకతాత్పర్యము||


"అద్భుతము జానకి దగ్ధము కాలేదు” అన్నఆ మాటలను విని, పూర్వపు శుభశకునములతో ఆమె దహింపబడలేదని నిశ్చయమునకు వచ్చితిని’. ||58.160|| 


||శ్లోకము 58.161|| 


దీప్యమానే తు లాంగూలే నమాం దహతి పావకః |

హృదయం చ ప్రహృష్టం మే వాతాః సురభిగన్దినః ||58.161||


స|| లాంగూలే దీప్యమానే పావకః మామ్ న దహతి | మే హృదయం ప్రహృష్టం వాతాః సురభిగన్ధినః ||


|| శ్లోకార్థములు||


లాంగూలే దీప్యమానే - 

లాంగూలము నకు నిప్పంటించబడినప్పటికీ

పావకః మామ్ న దహతి - 

అగ్ని నన్ను దహించలేదు

మే హృదయం ప్రహృష్టం - 

నా హృదయము ఆనందభరితమై యున్నది

వాతాః సురభిగన్ధినః- 

వాయువులు సువాసనభరితమై యున్నవి


||శ్లోకతాత్పర్యము||


’లాంగూలము నకు నిప్పంటించబడినప్పటికీ అగ్ని నన్ను దహించలేదు. నా హృదయము ఆనందభరితమై యున్నది. వాయువులు సువాసనభరితమై యున్నవి’.  ||58.161||


||శ్లోకము 58.162|| 


తైర్నిమిత్తైశ్చ దృష్టార్థైః కారణైశ్చ మహాగుణైః |

ఋషివాక్యైశ్చ సిద్దార్థైరభవం హృష్టమానసః ||58.162||


స|| నిమిత్తైః దృష్టార్థైః  మహాగుణైః  కారణైశ్చ ఋషివాక్యైశ్చ సిద్ధార్థైః తైః హృష్టమానసః అభవం ||


గోవిన్దరాజ టీకాలో - దృష్టార్థైః దష్టఫలైః నిమిత్తైః శకునైః కారణైః నేత్ర స్ఫురాణాదిభః । మహాగుణైః ఫలవ్యాప్తైః ।


|| శ్లోకార్థములు||


నిమిత్తైః దృష్టార్థైః  - 

ముందు కనపడిన శకునములతో

మహాగుణైః  కారణైశ్చ - 

మహాగుణములతో కారణములతో

ఋషివాక్యైశ్చ సిద్ధార్థైః తైః - 

ఋషివాక్యములతో సిద్ధులవాక్యములతో

హృష్టమానసః అభవం-  

మనస్సులో ఆనందభరితుడనైతిని


||శ్లోకతాత్పర్యము||


’ముందు కనపడిన శకునములతో, ఋషివాక్యములతో, సిద్ధులవాక్యములతో, సఫలములైన కారణములచేత, నేను మనస్సులో ఆనందభరితుడనైతిని’. ||58.162||


||శ్లోకము 58.163|| 


పునర్దృష్ట్వా చ వైదేహీం విసృష్టశ్చతయా పునః |

తతః పర్వతమాసాద్య తత్రారిష్టమహం పునః ||58.163||

ప్రతిప్లవనమారేభే యుష్మద్దర్శన కాంక్షయా |


స|| వైదేహీం పునః దృష్ట్వా తయా విసృష్టశ్చ తతః పునః అహం అరిష్టం పర్వతం ఆసాద్య యుష్మత్ దర్శన కాంక్షయా ప్రతిప్లవనం ఆరభే ||


|| శ్లోకార్థములు||


వైదేహీం పునః దృష్ట్వా - 

వైదైహిని మరల చూచి

తయా విసృష్టశ్చ - 

ఆమె అనుమతి తీసుకొని

తతః పునః ఆహం అరిష్టం పర్వతం ఆసాద్య - 

నేను మరల అరిష్ట పర్వతము చేరి

యుష్మత్ దర్శన కాంక్షయా - 

మీ అందరి దర్శన కాంక్షతో

ప్రతిప్లవనం ఆరభే - 

తిరిగి ప్రయాణమునకు ఎగురుట ప్రారంభించితిని


||శ్లోకతాత్పర్యము||


’వైదైహిని మరల చూచి, ఆమె అనుమతి తీసుకొని, నేను మరల అరిష్ట పర్వతము చేరి, మీ అందరి దర్శన కాంక్షతో తిరిగి ప్రయాణమునకు ఎగురుట ప్రారంభించితిని’. ||58.163||


||శ్లోకము 58.164|| 


తతః పవనచన్ద్రార్క సిద్ధగంధర్వ సేవితమ్ ||58.164||

పన్థానమహమాక్రమ్య భవతో దృష్టవానిహ |


స|| తతః అహం పవన చన్ద్రార్క సిద్ధ గన్ధర్వసేవితం  పన్దానం ఆశ్రిత్య ఇహ భవతః ద్రష్టువాన్ ||


|| శ్లోకార్థములు||


తతః అహం - అప్పుడు నేను 

పవన చన్ద్రార్క సిద్ధ గన్ధర్వసేవితం - 

వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులుసంచరించు

పన్దానం ఆశ్రిత్య - మార్గము ఆశ్రయించి 

ఇహ భవతః ద్రష్టువాన్ - 

ఇక్కడ మిమ్మలనందరినీ చూచితిని


||శ్లోకతాత్పర్యము||


’అప్పుడు నేను వాయువు సూర్యచంద్రులు సిద్ధులు గంధర్వులు సంచరించే గగన మార్గములో పయనించి, ఇక్కడ మిమ్మలనందరినీ చూచితిని’. ||58.164||


||శ్లోకము 58.165|| 


రాఘవస్య ప్రభావేన భవతాం చైవ తేజసా ||58.165||

సుగ్రీవస్య చ కార్యార్థం మయా సర్వమనుష్ఠితమ్ |


స|| రాఘవస్య ప్రభావేణ భవతాం తేజసా చైవ సుగ్రీవస్య కార్యార్థం చ మయా సర్వం అనుష్టితామ్ ||


|| శ్లోకార్థములు||


రాఘవస్య ప్రభావేణ -

 రాఘవుని ప్రభావము చేత

భవతాం తేజసా చైవ -

 మీ ఉత్సాహముతో 

సుగ్రీవస్య కార్యార్థం చ -

 సుగ్రీవుని కార్యము సాధించుటకు

మయా సర్వం అనుష్టితామ్- 

నాచేత సమస్తమూ చేయబడినది


||శ్లోకతాత్పర్యము||


’రాఘవుని ప్రభావము చేత, మీ ఉత్సాహముతో, సుగ్రీవుని కార్యము సాధించబడినది’. ||58.165||


||శ్లోకము 58.167|| 


 ఏతత్సర్వం మయా తత్ర యథావదుపపాదితమ్ ||58.166||

అత్రయన్న కృతం శేషం తత్ సర్వం క్రియతామితి ||58.167|| 


స|| ఏతత్ సర్వం తత్ర మయా యథావత్ ఉపపాదితం అత్ర| యత్ నకృతం శేషం తత్ సర్వం క్రియతామ్||


రామ టీకాలో - తత్ర సాగరాదౌ జాతమ్ ఏతత్ సర్వం కర్మ మయా ఉపపాదితం , యత్ మయా న కృతం  అత వ శేషం అవశిష్టం తత్ సర్వం క్రియతాం ఇతి సేషః 


|| శ్లోకార్థములు||


ఏతత్ సర్వం - ఇది అంతా

తత్ర మయా యథావత్ ఉపపాదితం అత్ర -

నా చేత యథా తథముగా చెప్పబడినది.

అత్ర యత్ నకృతం శేషం - 

అక్కడ ఏది చేయబడని కార్యమో

తత్ సర్వం క్రియతామ్- 

అది అంతయు చేయబడుగాక 


||శ్లోకతాత్పర్యము||


’ఇది అంతా  నాచేత యథా తథముగా చెప్పబడినది. అక్కడ ఏది చేయబడని కార్యమో, అది అంతయు చేయబడుగాక’. ||58.166,67|| 


చివరి మాటగా హనుమ చెప్పినది ’రాఘవుని ప్రభావము చేత మీ ఉత్సాహముతో సుగ్రీవుని కార్యము సాధించబడినది. మిగిలిన చేయబడని కార్యము 

ఇంకా మనము చేయవలసిన కార్య శేషము గురించి చూడవలెను’ అని. 


ఈ మాటతో ఏభై ఎనిమిదివ సర్గ సమాప్తము. 


ఈ సర్గలో హనుమ ఏక ధాటిగా , ప్రణమ్య శిరసా దేవ్యై  అంటూ, ఆ దేవి నమస్కరించి  ఏడవ శ్లోకమునుంచి నూట అరవై శ్లోకాలలో లంకలో, జరిగిన వృత్తాంతము అంతా, తన మాటలలో వానరులందరికీ  వివరిస్తాడు. అలాగే ముప్పైఐదవ సర్గలో సీతమ్మకి విశ్వాసము కలిగించడానికి, దాదాపు ఎనభై శ్లోకాలలో రాముడి గుణములమీద ,అక్కడి దాకా జరిగిన వృత్తాంతము చెప్పుతాడు. ఈ రెండు సందర్భాలలో హనుమంతుడి చే చెప్పబడిన  ఈ కథనంలో మనకి తరచూ గుర్తువచ్చేది ప్రథమ సమాగమములో  హనుమ వాక్చాతుర్యము మీద రాముల వారు చెప్పిన మాట. బాలకాండలో విశ్వామిత్రుడు రాములవారికి చెప్పిన వంశ చరిత్రలు మినహాయిస్తే, రామాయణములో ఏ ఒక్క ముఖ్యపాత్ర గూడా ఇన్ని శ్లోకాలలో, ఇంత దీర్ఘముగా మాట్లాడిన సందర్భము లేదు. 


ఇదంతా హనుమ, ప్రథమ వచనములో,  తన మాటలలో చెప్పిన కథ.


జయమంత్రములో ’దాసోఽహం’,  అని వస్తుంది. ’దాసోఽహం’  అంటే కౌసలేంద్రుని దాసుడను నేను అంటూ, హనుమ మాటలలో వున్న జయమంత్రము మనము చదివితే , అప్పుడు మనము కూడా కౌసలేంద్రుని దాసులము అని ఉద్ఘాటించినట్లే అనిపించి, ఆ మంత్ర పఠనలో వున్న పఠిత్వము మనకు దక్కుతుంది. అది ఆ మంత్ర మహిమ.


అలాగే హనుమ తనమాటలలో చెప్పే ఈ కథ మనము చదివితే, మనము ఆ కథలో పాల్గొన్నట్టే అనిపిస్తుంది. అందుకనే కాబోలు పెద్దలు  యాభై ఎనిమిదవ సర్గ చదివితే సుందరకాండ చదివినట్లే అంటారు.


ఈ మాటతో  సిమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎభై ఎనిమిదవ సర్గ సమాప్తము.


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే అష్టపంచాశస్సర్గః ||


|| ఓమ్ తత్ సత్||