||సుందరకాండ ||

||ఏభై తొమ్మిదవ సర్గ శ్లోకార్థతాత్పర్యతత్త్వదీపికతో||

|| Sarga 59 || with Slokas and meanings in Telugu

                                                       ||ఓమ్ తత్ సత్||


||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.

అథ  శ్లోకార్థ తత్త్వదీపికా సహిత

ఏకోనషష్టితమస్సర్గః||


- "తత్సర్వం ఉపపద్యతామ్"- 



"తత్సర్వం ఉపపద్యతామ్" అంటే "అదంతా చేయబడుగాక"; ఇది ఏబది తొమ్మిదవ సర్గలో హనుమంతుని చివరి మాట.


మరి ముందు ఏబది ఎనిమిదవ సర్గలో కూడా ,హనుమ లంకలో జరిగిన కథ అంతా చెప్పి చివరిలో, ’యన్ అకృతం శేషం’ - అంటే చేయబడవలసినది ఏమన్నా మిగిలి వుంటే( శేషం) అది చేయబడుగాక అని చెప్పాడు కదా. ఇప్పుడు మళ్ళీ చెప్పడములో విశేషము ఏమిటి అనిపించవచ్చు. తను చెప్పిన మాట మరచిపోయి, మళ్ళీ చెపుతున్నాడా అని కూడా అనిపించవచ్చు.


రైట్ హానరబల్ వి యస్ శ్రీనివాస శాస్రిగారు ఒక గొప్ప సంస్కృత పండితుడు, గొప్ప రామభక్తుడు. ఆయన మద్రాసు  సంస్కృత ఎకాడమీ ఆధ్వర్యములో రామాయణము మీదా రామాయణములోని ముఖ్య పాత్రల మీద 1944 లో, అంగ్ల భాషలో, చాలా ఉపన్యాసాలు ఇచ్చారు. రామాయణము మీద భక్తివున్నవారు, లేనివారు కూడా అవి వినతగినవి. ఆయన రామాయణ ఉపన్యాసముల పుస్తకము చదవతగినది. ఆయన ఉపన్యాసాలలో హనుమంతుడు ఎంత గొప్పవాడో , హనుమంతుడుది ఎంత కీలకమైన పాత్రో, హనుమకి సీతమ్మవారి పై ఎంతభక్తో, అని  అవన్నీ చెపుతూ హనుమంతుడికి మతిమరుపు ఎక్కువ అని ప్రతిపాదించి, దానికి కావలసిన సంఘటనలను విశదీకరిస్తాడు కూడా. ఈ సర్గ చదువుతూంటే అది నిజమే నేమో అనిపిస్తుంది 


ఈ సర్గ మొదటి శ్లోకము, ’ఏతదాఖ్యాయ తత్ సర్వం’ , అన్నమాటతో మొదలు అవుతుంది. ’ఏతదాఖ్యాయ తత్ సర్వం’ అంటే, లంకలో జరిగినది అంతా చాలా విశదము గా చెప్పి అని. అంతాచెప్పి, మీరు ఏమి చేయాలో అది ఆలోచించండి అని కూడా చెప్పి, తరువాత ’భూయః సముపచక్రామ’,  అంటే మళ్ళీ మాట్లాడడము మొదలెట్టాడు అని. నూట అరవై శ్లోకాలలో  ఏక ధాటిగా లంకావృత్తాంతము అంతా చెప్పినా ఇంకా ఏదో వుంది అన్నమాట.  


అంటే హనుమ మనస్సులో ఏదో మెదలుతూ వున్నదన్నమాట.


ఏబది ఎనిమిదవ సర్గలో జరిగిన కథ అంతా చెప్పాడు. కాని తన మనస్సులో వున్నమాట చెప్పలేదు. ఈ సర్గలో అది మనము వింటాము.


సీతాదేవి పాతివ్రత్యము చూసిన హనుమ, ఆవిడ పాతివ్రత్యానికి అమ్ముడు పోయాడు. హనుమ చెప్పడములో, సీతాదేవి తనశక్తితో రావణాసురుని దహించ వేయగలదు. రావణ వధ నిశ్చయమే. రాముని ద్వారా రావణ వధ నిమిత్తమాత్రమే అని.


ఇది అంతా చెప్పి , ’రాముని దగ్గరకు సీతమ్మని కూడా తీసుకు వెళ్ళితే మంచిది’, అది ఆలోచిద్దాము అంటాడు. అదే హనుమ మనస్సులో మెదలుతున్నమాట.


సీతమ్మ చివరిమాటగా చెప్పినది, ’తత్ తస్య సదృశం’, అంటే రాములవారే వచ్చి స్వయముగా సీతను తీసుకు పోవడము ఆయనకు తగిన కార్యము, అని. ఆ మాట  సీతమ్మ పదే పదే చెప్పిన మాట. కాని ఇక్కడ, ’సీతమ్మని కూడా తీసుకు వెళ్ళితే మంచిది’, అని అన్నప్పుడు, హనుమ సీతమ్మ మాటని పూర్తిగా మరిచి పోయాడన్నమాట. అది ఒక విశేషము.


ఈ సర్గలో ఇంకో విశేషము గమినించ వలసినది. ఇక్కడ హనుమ అంటాడు. ’శీలమాసాద్య సీతాయాః’, - అంటే  సీతమ్మ శీలము పాతివ్రత్యము చూచి, తన మనస్సు భక్తితో నిండి పోయినది అని.


అన్వేషణ మొదలు పెట్టినప్పుడు, వానరులకు రాజ్యము పట్టముగట్టిన రాముడి భార్యను వెదకడానికి బయలు దేరుతారు వానరులు. అది వాళ్ళ ఒప్పందములో చేసుకున్న ప్రతిజ్ఞ. 


మొదటిసారి  అశోకవనములో సీతమ్మను చూచి, ఇలాంటి సీతను విడిచి ఎలా ఉండగలుగుతున్నాడని ఆశ్చర్యపోయి, రాముడి మీద గౌరవము పెరుగుతుంది హనుమకి.


సీతమ్మ కష్టాలు చూస్తూ , ’దీనోవా రాజ్యహీనో వా యోమే భర్తా సమే గురుః’ అని,  ’అనన్య దైవత్వమియం క్షమా చ’  అని , సీతమ్మ  అన్న మాటలు విని, సీతమ్మ మీద గౌరవము పెరుగుతుంది.  సీతమ్మ పాతివ్రత్యము గురించి హనుమ మాటలలో వింటాము


ఆ గౌరవము పరిపూర్ణమై, భక్తిలోకి మారి, హనుమ మనస్సు సీతమ్మ పై భక్తితో నిండిపోయినది.  రామకార్యార్థము సీతమ్మని వెదక బయలుదేరిన హనుమ లో సీతమ్మపై భక్తి పరిపూర్ణత పొందడము సుందరకాండలో ఒక ముఖ్యాంశము.


ఇక ఈ సర్గలో శ్లోకాలు అర్థ తాత్పర్యాలతో.


||శ్లోకము 59.01||


 ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః |

భూయః సముపచక్రామ వచనం వక్తు ముత్తరమ్ ||59.01||


స|| హనుమాన్ మారుతాత్మజః ఏతత్ సర్వం ఆఖ్యాయ భూయః ఉత్తరం వచనం వక్తుం సముపచక్రమే ||


||శ్లోకార్థములు||


హనుమాన్ మారుతాత్మజః -  

మారుతాత్మజుడైన హనుమంతుడు                                                                                                                                                            

 ఏతత్ సర్వం ఆఖ్యాయ - 

జరిగిన వృత్తాంతము అంతా చెప్పి 

భూయః ఉత్తరం వచనం  - 

మళ్ళీ ఇంకా మాటలను 

 వక్తుం సముపచక్రమే - 

చెప్పుటకు మొదలెట్టెను


||శ్లోక తాత్పర్యము||


మారుతాత్మజుడైన హనుమంతుడు అలాగ ( జరిగిన వృత్తాంతము) అంతా చెప్పి, మళ్ళీ ఇలా చెప్పసాగెను. ||59.01||


అంటే ఇప్పటిదాకా , జరిగిన వృత్తాంతము యథా తథముగా చెప్పాడు. ఇప్పుడు తనలో జరిగిన మార్పు, తన ఆలోచన చెపుతున్నాడు హనుమ.


||శ్లోకము 59.02||


సఫలో రాఘవోద్యోగః సుగ్రీవస్య చ సంభ్రమః |

శీలమాసాద్య సీతాయా మమ చ ప్రవణం మనః ||59.02||


స|| రాఘవోద్యోగః సుగ్రీవస్య సంభ్రమః సఫలః |  సీతాయాః శీలం ఆసాద్య  మమ మనశ్చ ప్రవణం ||


రామ టీకాలో - సీతాయాః శీలం సద్ వ్రతం పాతివ్రత్యమాసాద్య  దృష్ట్వా రాఘవోద్యోగాదేః సాఫల్య జ్ఞానేన మమ మనః ప్రీణితం తుష్టమ్।మమ చ ప్రవ్రణం మనః ఇతి పాఠేప్రవ్రణం సంతోషప్రవ్రణం ఇత్యర్థః। 


||శ్లోకార్థములు||


రాఘవోద్యోగః - 

రాఘవుని కార్యము

సుగ్రీవస్య సంభ్రమః సఫలః -

 సుగ్రీవుని ప్రయత్నములు సఫలము అయినాయి

సీతాయాః శీలం ఆసాద్య  - 

సీతాదేవి యొక్క శీలము చూచి

మమ మనశ్చ ప్రవణం -  

నా మనస్సు భక్తితో నిండిపోయెను


||శ్లోక తాత్పర్యము||


’రాఘవుని కార్యము, సుగ్రీవుని ప్రయత్నములు సఫలము అయినాయి. సీతాదేవి యొక్క శీలము చూచి నా మనస్సు భక్తితో నిండిపోయెను’. ||59.02||


||శ్లోకము 59.03||


తపసా ధారయేల్లోకాన్ క్రుద్ధో వా నిర్దహేదపి |

సర్వధాతి ప్రవృద్ధోఽసౌ రావణో రాక్షసాధిపః ||59.03||

తస్య తాం స్పృశతో గాత్రం తపసా న వినాశితమ్ |


స||అసౌ రాక్షసాధిపః తపసా ధారయేల్లోకాన్। వా కృద్ధః నిర్దహేత్ అపి ।  సర్వథా అతిప్రవృద్ధః ||తస్య గాత్రం తామ్ స్పృశతః  తపసా న వినాశితం |


రామటీకాలో - తాం సీతాం స్పృశతః అపహరణాయ స్పర్శ్వం కుర్వతః యస్య రావణయ గాత్రం పాణిః తపసా సీతాతపోబలేన న వినాశితుం సః అసౌ రావణః సర్వథా సర్వప్రకారేణ అతిప్రకారేణ అతిప్రకృష్టః ప్రతిభాతి ఇతి శేషః , ఏతేనేదం మహదాశ్చర్యం ఇతి సూచితం ॥


||శ్లోకార్థములు||


అసౌ రాక్షసాధిపః - ఈ రాక్షసాధపుడు

తపసా లోకాన్ ధారయేత్ - 

తపోశక్తిచే లోకములను ధరించగలవాడు

వా కృద్ధః నిర్దహేత్ అపి -

 కృద్ధుడైనచో దహించగలడు కూడా

సర్వథా అతిప్రవృద్ధః - 

అన్నివిధములుగా మహాతపస్సంపన్నుడు

తస్య గాత్రం తామ్ స్పృశతః -  

అమె గాత్రమునులను అతను స్పృశించినప్పటికీ

తపసా న వినాశితం - 

తన తపోబలముతో అతడు నశింపబడలేదు


||శ్లోక తాత్పర్యము|| 


’ఆ రాక్షసాధిపుడు తపోశక్తిచే లోకములను ధరించగలవాడు; కృద్ధుడైనచో దహించగలడు కూడా; అన్నివిధములుగా మహాతపస్సంపన్నుడు. అమె గాత్రమునులను అతను స్పృశించినప్పటికీ తన తపోబలముతో అతడు నశింపబడలేదు’. ||59.03||


నిజానికి  రావణుడు, తండ్రి మాటను జవదాటిన, సోదరుడు కుబేరుని లంకానగరము పుష్పక విమానము స్వాధీనపరచుకున్న, ధూర్తుడు. కాని పదివేల సంవత్సరాలు తన పది శిరములను అగ్నిలో ఆహుతిచేస్తూ, తన ఇన్ద్రియములను అదుపులో వుంచుకొని  ఘోర తపస్సుచేసినవాడు. అట్టివాడు కనుకనే సీతమ్మను అశ్లీలముగా స్పృశించినప్పటికీ నశించిపోలేదు అని హనుమ భావము.


అయితే మరి సీతా పాతివ్రత్య శీలము, వాడిముందు  దుర్బలమా అని అనుమానం వస్తుందేమో అని ,  ’నతదగ్నిశిఖా’, ఆంటూ సీతమ్మ గురించి మళ్ళీ చెపుతాడు.


||శ్లోకము 59.04||


న తదగ్నిశిఖా కుర్యాత్ 

సంస్పృష్టా పాణినా సతీ||59.04||

జనకస్యాత్మజా కుర్యాత్  

యత్క్రోధ కలుషీకృతా|


స|| సంస్పృష్టా పాణినా సతీ తత్ అగ్నిశిఖా నకుర్యాత్ ।  క్రోధకలుషీకృతా జనకస్య ఆత్మజా అ కుర్యాత్ || 


తిలకటీకాలో - నైతావతాసీతా శీలం దుర్బలం ఇతి శంకయా నేతి। యత్ కృద్ధా సీతా కుర్యాత్ తత్స్పృష్టాఽగ్నిశిఖా అపి న కుర్యాత్ । ఇయం తు భర్తుః పరాక్రమకీర్తయే నాద్యాపి కృధ్యతీతి భావః। అకృద్దాయా అపి స్పర్శమాత్రేణ ప్రాప్తో నాశస్తు రావణ  తపసా నివారితా ఇతి ధ్యేయమ్।  


గోవిన్దరాజ టీకాలో -తర్హి సీతా శీలం దుర్బలమస్మాకం కిముపకరిష్యతి ఇత్యాహ - నేతి। సీతాశీలమేవ బలీయస్త్వాదుపకరిష్యతి ఇత్యర్థః। క్రోథ కలుషీకృతేతి వచనాత్ భర్తుముఖేన వైరనిర్యాతనం  వీర పత్నీ ధర్మః। అన్యథా మహాలాఘవం భర్తురిత్యద్యాపి పారతన్త్ర్యపాలనాయ తాద్రుక్ క్రోధాకరణాత్ రావణో జీవతీతి గమ్యతే। ఏతదేవ ఉక్తం ప్రాక్ - అసన్దేశాత్తు రామస్య తపశ్చానుపాలనాత్ । న త్వాం కుర్మి దశగ్రీవ భస్మ భస్మార్హ తేజసా ఇతి। 


||శ్లోకార్థములు||


సంస్పృష్టా పాణినా సతీ - 

క్రోధముతో మండిపోతున్న జనకుని కూతురు ( ఏమి చేయగలదో)

తత్ అగ్నిశిఖా నకుర్యాత్  - 

అది అగ్నిశిఖలు చేయలేవు

క్రోధకలుషీకృతా -క్రోధముతో నిండిన

జనకస్య ఆత్మజా అ కుర్యాత్  - 

జనకుని కూతురు అది చేయదు


||శ్లోక తాత్పర్యము||


’క్రోధముతో మండిపోతున్న జనకుని కూతురు ఏ పని చేయగలదో అది అగ్నిజ్వాలలు కూడా చేయలేవు. క్రోధముతో నిండిన జనకుని కూతురు అది చేయదు’. ||59.04||


అంటే సీతమ్మ ఏమి చేయగలదో అది అగ్నికూడా చేయలేదు. కాని అంత శక్తిమంతురాలైనా సీతమ్మ కూడా, రాముని ఆజ్ఞ లేకుండా రావణుని నాశనము చేయదు. ఈ మాట సీత రావణుల సంభాషణలో సీత ద్వారా , ’అసన్దేశాత్ రామస్య’, అని చెప్పగా విన్నమాటే. రాముని వద్దనుంచి సందేశము లేకపోవడము వలన నిన్ను నాశనము చేయలేదు అన్నట్లు చెప్పిన మాటలే అవి.


ఇక్కడ రావణుని తపో బలమును పొగడుతూ వున్నట్లు వున్న మాటలతో మనకి ఇంకో ధ్వని కూడా వినిపిస్తుంది. రాముడు అన్ని విధాల ధర్మమార్గములో వెళ్ళు వాడు. రావణుడు అతి తపోబల సంపన్నుడు. కాని తన తపో బలము ధర్మ మార్గములో పోవడము కన్నా తనకి ప్రియము కలిగించు మార్గములో పోతాడు. ఈ మార్గములు యముడు నచికేతుడికి కథోపనిషత్తులో చెప్పిన ’శ్రేయము ప్రేయము’ అనబడే రెండు మార్గములే. ప్రియము కలిగించు మార్గలో పోవు వాడికి, అంటే రావణుడికి,  అధోగతి సర్వనాశనము అని ధ్వని.


||శ్లోకము 59.05,06||


జామ్బవత్ప్రముఖాన్ సర్వాననుజ్ఞాస్య మహాహరీన్ ||59.05||

అస్మిన్నేవం గతే కార్యే భవతాం చ నివేదితే |

న్యాయం స్మ సహవైదేహ్యా ద్రష్టుం తౌ పార్థివాత్మజౌ ||59.06||


స|| భవతామ్ నివేదితే అస్మిన్ కార్యే ఏవం గతే జాంబవత్ ప్రముఖాన్  మహాహరీన్ సమనుజ్ఞాయ వైదేహ్యా సహ తౌ పార్థివాత్మజౌ ద్రష్టుం న్యాయం స్మ ||


రామ టీకాలో - ఏవమ్ అనేన ప్రకారేణ గతే సిద్ధింప్రాప్తే అస్మిన్ కార్యే భవాన్ సమీపే నివేదితే సతి జామ్బవత్ ప్రముఖాన్ కపీన్ అనుజ్ఞాప్య,  తదాజ్ఞాం గృహీత్వా ఇత్యర్థః , వైదేహ్యాసహ పార్థివాత్మజౌ ద్రష్ఠుం న్యాయ్యం  అస్మాకం ఇతి శేషః।


గోవిన్దరాజ టీకాలో- ఏవం స్థితే యుష్మత్ అనుమత్యా భృత్యవిజయః అపి స్వామిన్ ఏవైతి  కృత్వా సీతారామపదావలమ్బాత్ అహమేవ రావణం నిర్జిత్య సీతాపురస్కరేణైవ రాఘవో ద్రక్ష్యామి ఇత్యాహ।


||శ్లోకార్థములు||


భవతామ్ నివేదితే - మీకు చెప్పడిన 

అస్మిన్ కార్యే ఏవం గతే - 

ఆ కార్యము అలా జరిగినది

జాంబవత్ ప్రముఖాన్  -

 జాంబవతుడు తదితర ప్రముఖులు 

మహాహరీన్ సమనుజ్ఞాయ - 

మహావానరుల అనుజ్ఞతో

వైదేహ్యా సహ - వైదేహిని తీసుకొని

 తౌ పార్థివాత్మజౌ ద్రష్టుం న్యాయం - 

ఆ రాముని చూడుట న్యాయము


||శ్లోక తాత్పర్యము||


"మీకు చెప్పబడిన కార్యము అలా జరిగినది. జాంబవదాది ప్రముఖుల అనుమతితో  ఇప్పుడు మనము వైదేహి సమేతముగా రామలక్ష్మణుల దర్శనము చేయుట సముచితము అని భావిస్తున్నాను."||59.05,06||


ఇదే రామటీకాలో చెప్పబడినది. ఈ మాట చెప్పడములో హనుమ సీతమ్మకోరిక సీతమ్మ పదే పదే  చెప్పిన మాట పూర్తిగా మరచిపోయినట్లు వున్నది.


||శ్లోకము 59.07||


అహమేకోఽపి పర్యాప్తః సరాక్షసగణాం పురీ |

తాం లంకాం తరసా హన్తుం రావణం చ మహాబలమ్ ||59.07||


స|| అహ ఏకః అపి సరాక్షసగణాం తాం లంకాపురీం మహాబలం రావణం చ తరసా హన్తుం పర్యాప్తః||


||శ్లోకార్థములు||


అహ ఏకః అపి - నేను ఒక్కడినే 

సరాక్షసగణాం తాం లంకాపురీం - 

రాక్షసబలములతో కూడిన లంకాపురమును

మహాబలం రావణం చ - 

మహాబలుడైన రావణుని కూడా

తరసా హన్తుం పర్యాప్తః - 

త్వరగా హతమార్చుటకు చాలును


||శ్లోక తాత్పర్యము||


’నేను ఒక్కడినే రాక్షసబలములతో కూడిన లంకాపురమును ( జయించుటకు), మహాబలుడైన రావణుని కూడా త్వరగా హతమార్చుటకు చాలును’. ||59.07||


||శ్లోకము 59.08||


కిం పునస్సహితో వీరైర్బలవద్భిః కృతాత్మభిః |

కృతాస్త్రైః  ప్లవగైః శూరైః భవద్భిర్విజయైషిభిః ||59.08||


స|| బలవద్భిః కృతాత్మభిః కృతాస్త్రైః శూరైః విజయైషిభిః ప్లవగైః భవద్భిః సహితః కిం పునః || 


||శ్లోకార్థములు||


బలవద్భిః కృతాత్మభిః - 

బలవంతులు నిశ్చయమనస్కులు

కృతాస్త్రైః శూరైః - 

శస్త్రాస్త్ర ప్రయోగములో కుశలురు శూరులు

విజయైషిభిః ప్లవగైః - 

విజయకాంక్షకలవారు  

ప్లవగైః భవద్భిః సహితః -

 వానరులు మీఅందరితో కలిసితే

కిం పునః - చెప్పవలసినదేమి


||శ్లోక తాత్పర్యము||


’బలవంతులు విజయకాంక్షగల నిశ్చయమైన మనస్సుగలవారు ఆకాశములో ఎగరకలవారు, మీ అందరితో కూడితే ఇక చెప్పవలసినదేమి?’ ||59.08||


||శ్లోకము 59.09||


అహం తు రావణం యుద్ధే ససైన్యం సపురస్సరమ్ |

సహపుత్త్రం వధిష్యామి సహోదరయుతం యుధి ||59.09||


స|| అహం తు యుద్ధే ససైన్యం సపురస్సరం సహపుత్త్రం సహోదరయుతం రావణం వధిష్యామి ||


||శ్లోకార్థములు||


అహం తు యుద్ధే - నేను యుద్ధములో

ససైన్యం సపురస్సరం సహపుత్త్రం - 

అతని సైన్యముతో సహా , పుత్రులతో సహా. పురముతో 

 సహోదరయుతం రావణం వధిష్యామి - సహోదరులతో సహా రావణుని వధించగలను.


||శ్లోక తాత్పర్యము||


’నేను యుద్ధములో రావణుని అతని సైన్యముతో సహా, పుత్రులతో సహా, సహోదరులతో సహా వధించగలను’. ||59.09||


||శ్లోకము 59.10||


బ్రాహ్మమైన్ద్రం  చ రౌద్రం చ వాయువ్యం వారుణం తథా |

యది శక్రజితోఽస్త్రాణి దుర్నిరీక్షాణి సంయుగే ||59.10||

తాన్యహం విధమిష్యామి హనిష్యామి చ రాక్షసాన్ |


స|| బ్రహ్మం ఇన్ద్రం చ రౌద్రం చ వాయవ్యం తథావారుణం శక్రజితః అస్త్రాణి దుర్నిరీక్షాణి యది తాని సంయుగే వధిష్యామి రాక్షసాన్  హనిష్యామి చ ||


||శ్లోకార్థములు||


బ్రహ్మం ఇన్ద్రం చ రౌద్రం చ - 

బ్రహ్మస్త్రము, ఇంద్రుడు, రుద్రుడు

వాయవ్యం తథావారుణం - 

వాయువు వరుణు దేవుల అస్త్రములు

యది శక్రజితః తాని  - 

ఒక వేళ ఇన్ద్రజిత్తు ఆ  

దుర్నిరీక్షాణి అస్త్రాణి సంయుగే  -

 చూడశక్యము కాని అస్త్రములతో యుద్ధము చేసిననూ

రాక్షసాన్ వధిష్యామి హనిష్యామి చ - 

రాక్షసులను చంపెదను నాశనము చేసెదను


||శ్లోక తాత్పర్యము||


’ఇంద్రజిత్తు చే ప్రయోగింపబడిన బ్రహ్మస్త్రము, ఇంద్రుడు రుద్రుడు వాయువు వరుణు దేవుల అస్త్రములు చూచుటకు కష్టమైనప్పటికీ, యుద్దములో ఆ రాక్షసులందరినీ జయించి వధించెదను’. ||59.10||


హనుమకు బ్రహ్మద్వారా ఆ వరము వుంది. హనుమకున్న శాపము , తన శక్తి తనకు ఎవరో చెప్పేదాకా గుర్తురాదు అని. కిష్కిన్ధకాండలో ఒంటరిగా కూర్చుని ఉన్న హనుమకు జాంబవంతుడు తన పూర్వవ వృత్తాంతము చెప్పి, తన శక్తిని గుర్తు చేస్తాడు. దాటలేని సముద్రము చూసి, నిరాశాసముద్రములో వున్న వానరులందరి ఆశలు ఉద్దరించగల శక్తి , హనుమలోనే ఉన్నది అని జాంబవంతుడు హనుమని ప్రోత్సహిస్తాడు. అప్పటితో హనుమ శాప విమోచన అయిపోయిందన్నమాట.  సుందరకాండలో సుందరుని సముద్ర లంఘనముతో,  సుందరుని అసలు స్వరూపము చూస్తున్నాము అన్నమాట.


||శ్లోకము 59.11,12||


భవతామభ్యనుజ్ఞాతో విక్రమో మే రుణద్ధితమ్ ||59.11||

మయాఽతులా విసృష్టా హి శైలవృష్టిర్నిరన్తరా |

దేవానపి రణే హన్యాత్ కిం పునః తాన్ నిశాచరాన్ ||59.12||


స|| భవతామ్ అభ్యనుజ్ఞాతః మే విక్రమః తం రుణాద్ధి| మయా విసృష్టా అతులా నిరన్తరా శైలవృష్టిః రణే దేవాన్ అపి హన్యాత్ | తాన్ నిశాచరాన్ కిం పునః ||


గోవిన్దరాజ టీకాలో - అభ్యనుజ్ఞాతః  అభ్యనుజ్ఞానాత్  మే విక్రమః తం రావణమ్ రుణద్ధి హన్తీత్యర్థః |


||శ్లోకార్థములు||


భవతామ్ అభ్యనుజ్ఞాతః -

 మీచేత ఆజ్ఞాపింపబడి

మే విక్రమః తం రుణాద్ధి -

 నా పరాక్రమము తో వానిని బంధించెదను

మయా విసృష్టా -

 నా చేత ప్రయోగింపబడిన 

అతులా నిరన్తరా శైలవృష్టిః - 

నిరంతరమైన శిలావృష్టి తో

రణే దేవాన్ అపి హన్యాత్ - 

యుద్ధములో దేవతలు కూడా హతులు అవుతారు

తాన్ నిశాచరాన్ కిం పునః -  

అ రాక్షసుల సంగతి చెప్పనేల


||శ్లోక తాత్పర్యము||


’మీచేత ఆజ్ఞాపింపబడి నా పరాక్రమము తో వానిని బంధించెదను. నా చేత ప్రయోగింపబడిన నిరంతరమైన శిలావృష్టి తో యుద్ధములో దేవతలు కూడా హతులు అవుతారు. అ రాక్షసుల సంగతి చెప్పనేల’.  ||59.11,12||


||శ్లోకము 59.13||


సాగరోఽప్యతియాద్వేలాం మన్దరః ప్రచలేదపి |

న జామ్బవన్తం సమరే కమ్పయే దరివాహినీ ||59.13||


స|| సాగరం వేలాం అతియాదపి మన్దరః ప్రచలేదపి సమరే అరివాహిని జామ్బవతం న కమ్పయేత్ ||


తిలక టీకా లో - ఇదానీం సర్వేఽపి భవన్తః తత్ వధే సమర్థా ఇత్యాహ  సాగరోఽపి ఇత్యాది||


||శ్లోకార్థములు||


సాగరం వేలాం అతియాదపి - 

సాగరము తన అవధి దాటవచ్చు

మన్దరః ప్రచలేదపి - 

మందర పర్వతము చలించవచ్చు

సమరే అరివాహిని -

 యుద్ధములో శత్రువుల బలములు

జామ్బవతం న కమ్పయేత్ -

జాంబవంతుని చలింపచేయలేదు


||శ్లోక తాత్పర్యము||


’సాగరము తన అవధి దాటవచ్చు. మందర పర్వతము చలించవచ్చు. కాని యుద్ధములో జాంబవంతుని ఎవరూ చలింపచేయలేరు’. ||59.13||


ఇక హనుమ మిగిలిన వానరుల ప్రతిభగురించి చెపుతాడు.


||శ్లోకము 59.14||


సర్వరాక్షస సంఘానాం రాక్షసా యే చ పూర్వకా |

అలమేకో వినాశాయ వీరో వాలిసుతః కపిః ||59.14||


స|| వీరః వాలిసుతః కపిః ఏకః సర్వరాక్షసంఘానాం పూర్వకాః యే వినాశాయ అలమ్ ||


తిలక టీకాలో - యే చ పూర్వజా రాక్షసాః తేషాం నాశాయై ఏకోపి సమర్థః ఇతి అన్వయః ||


||శ్లోకార్థములు||


వీరః వాలిసుతః కపిః ఏకః - 

వీరుడైన వాలి సుతుడు ఒక్కడే 

సర్వరాక్షసంఘానాం పూర్వకాః - 

ఆ రాక్షస సమూహములన్నిటినీ 

యే వినాశాయ అలమ్ - 

వినాశము చేయుటకు చాలును


||శ్లోక తాత్పర్యము||


’వీరుడైన వాలి సుతుడు ఒక్కడే ఆ రాక్షస సమూహములన్నిటినీ వినాశము చేయుటకు చాలును’. ||59.14||


"||శ్లోకము 59.15||


పనస స్యోరువేగేన నీలస్య చ మహాత్మనః |

మన్దరోఽప్యవసీర్యేత కిం పునర్యుధి రాక్షసాః ||59.15||


స|| పనసస్య మహాత్మనః నీలస్య ఊరువేగేన మన్దరో అపి అవశీర్యతే | యుధి రాక్షసాః కిమ్ పునః || 


||శ్లోకార్థములు||


పనసస్య మహాత్మనః నీలస్య - 

పనసుని,  మహాత్ముడైన నీలుని 

ఊరువేగేన మన్దరో అపి అవశీర్యతే - 

ఊరువేగమునకు మందర పర్వతము కూడా చూర్ణమై పోవును

యుధి రాక్షసాః కిమ్ పునః - 

యుద్ధములో రాక్షసులగురించి చెప్పనేల


||శ్లోక తాత్పర్యము||


’పనసుని,  నీలుని ఊరువేగమునకు మందర పర్వతము కూడా చూర్ణమై పోవును. యుద్ధములో రాక్షసులగురించి చెప్పనేల’. ||59.15||


||శ్లోకము 59.16||


స దేవాసుర యక్షేషు గన్ధర్వోరగ పక్షిసు |

మైన్దస్య ప్రతియోద్ధారం శంసత ద్వివిదస్య వా ||59.16||


స|| సదేవాసుర యక్షేషు గన్ధర్వోరగపక్షిషు మైన్దస్య ద్వివిదస్య ప్రతియోద్ధారం శంసత ||


||శ్లోకార్థములు||


సదేవాసుర యక్షేషు - దేవాసుర యక్షులలో

గన్ధర్వోరగపక్షిషు - గంధర్వ ఊరగ పక్షులలో 

మైన్దస్య ద్వివిదస్య - మైందుడు ద్వివిదులతో

ప్రతియోద్ధారం శంసత - 

ప్రతి యుద్ధము చేయగలరు ఎవరు చెప్పుము?


||శ్లోక తాత్పర్యము||


’ఇంక యుద్ధములో రాక్షసుల సంగతి చెప్పనేల.  దేవాసుర గంధర్వ ఊరగ పక్షులలో ఎవరు మైందుడు ద్వివిదులతో ప్రతి యుద్ధము చేయగలరు?’  ||59.16||


||శ్లోకము 59.17||


అశ్విపుత్రౌ మహాభాగౌ వేతౌ ప్లవగసత్తమౌ |

ఏతయోః ప్రతియోద్ధారం న పశ్యామి రణాజిరే ||59.17||


స|| అశ్విపుత్రౌ ఏతౌ మహాభాగౌ ప్లవగసత్తమౌ రణాజిరే ఏతయోః ప్రతియోద్ధారం న పశ్యామి ||


||శ్లోకార్థములు||


అశ్విపుత్రౌ ఏతౌ మహాభాగౌ ప్లవగసత్తమౌ - 

ఈ అశ్వినీ పుత్రులిద్దరూ వానర శ్రేష్ఠులు, మహబలశాలురు

రణాజిరే ఏతయోః ప్రతియోద్ధారం - 

రణములో వీరికి ఎదురుగా పోరాడగలవారు 

న పశ్యామి - నాకు కనపడుటలేదు


||శ్లోక తాత్పర్యము||


’ఈ అశ్వినీ పుత్రులిద్దరూ వానర శ్రేష్ఠులు, మహబలశాలురు.  వీరికి ఎదురుగా పోరాడగలవారు నాకు కనపడుటలేదు’. ||59.17||


||శ్లోకము 59.18||


పితామహవరోత్సేకాత్ పరమం దర్పమాస్థితౌ |

అమృతప్రాశనా వేతౌ సర్వవానర సత్తమౌ ||59.18||


స||  పితామహవరోత్సేకాత్  పరమం దర్పం ఆస్థితౌ ఏతౌ సర్వ వానరసత్తమౌ అమృతపాశనా ||


||శ్లోకార్థములు||


పితామహవరోత్సేకాత్  - 

పితామహుని వరము కలవారు

పరమం దర్పం ఆస్థితౌ - 

అతి గర్వము కలవారు

ఏతౌ సర్వ వానరసత్తమౌ - 

ఇద్దరు వానర సత్తములు 

అమృతపాశనౌ - 

అమృతము తాగిన వారు>


||శ్లోక తాత్పర్యము||


’వీరు పితామహుని వరముతో ఉత్సాహము కలవారు. ఈ వానరసత్తములిద్దరూ  అమృతము తాగినవారు’. ||59.18||


||శ్లోకము 59.19||


అశ్వినోర్మాననార్థం హి సర్వలోకపితామహః |

సర్వావధ్యత్వమతులం అనయోర్దత్తవాన్పురా ||59.19||


స|| పురా సర్వలోకపితామహః అశ్వినోః  మానార్థం అనయోః అతులం సర్వ అవధ్వత్వం దత్తవాన్ ||


||శ్లోకార్థములు||


పురా సర్వలోకపితామహః - 

పూర్వము బ్రహ్మదేవుడు

అశ్వినోః  మానార్థం - 

అశ్వినీ దేవతలను సంతృప్తి పరచుటకు

అనయోః అతులం సర్వ అవధ్వత్వం- 

వీరు ఎవరిచేతులో చావు లేకుండునట్లు

దత్తవాన్ - వరము ఇవ్వబడినది.


||శ్లోక తాత్పర్యము||


’పూర్వము బ్రహ్మదేవుడు అశ్వినీ దేవతలను సంతృప్తి పరచుటకు వీరు ఎవరిచేతులో చావు లేకుండునట్లు వరము పొందిరి’. ||59.19||


||శ్లోకము 59.20||


వరోత్సేకేన మత్తౌ చ ప్రమథ్య మహతీమ్ చమూమ్ |

సురాణామమృతం వీరౌ పీతవన్తౌ ప్లవంగమౌ ||59.20||


స||  వరోత్సేకేన మత్తౌ చ వీరౌ ప్లవంగమౌ సురాణాం మహతీం చమూం ప్రమథ్య అమృతం పీతవన్తౌ || 


||శ్లోకార్థములు||


వరోత్సేకేన మత్తౌ చ - 

ఆ వరముచేత మదించినవారై

వీరౌ ప్లవంగమౌ - 

ఆ వానరసత్తములు  ఇద్దరూ

సురాణాం మహతీం చమూం ప్రమథ్య - 

మహత్తరమైన దేవతాసైన్యములను జయించి

అమృతం పీతవన్తౌ- 

అమృతను సేవించితిరి


||శ్లోక తాత్పర్యము||


’ఆ వరముచేత మదించినవారై,  ఆ వానరసత్తములు ఇద్దరూ దేవతాసైన్యములను జయించి అమృతను సేవించితిరి’. ||59.20|| 


||శ్లోకము 59.21||


ఏతావేవ హి సంక్రుద్ధౌ సవాజిరథకుంజరామ్ |

లంకాం నాశయితుం శక్తా సర్వే తిష్ఠన్తు వానరాః ||59.21||


స|| సంకృద్ధౌ ఏతావేవ సవాజిరథకుంజరాం లంకాం నాసయితుం శక్తౌ | సర్వే వానరాః తిష్టన్తు ||


||శ్లోకార్థములు||


సంకృద్ధౌ ఏతావేవ - కృద్ధులైన వీరిద్దరూ

సవాజిరథకుంజరాం లంకాం - 

గుర్రాలు రథములు ఏనుగులు కల సైన్యములతో సహా లంకానగరమును

నాశయితుం శక్తౌ  - 

నాశనము చేయుటకు శక్తి కలవారు.

సర్వే వానరాః తిష్టన్తు -

 వానరులందరూ అక్కరనే లేదు


||శ్లోక తాత్పర్యము||


’కృద్ధులైన వీరిద్దరూ, గుర్రాలు రథములు ఏనుగులు కల సైన్యములతో సహా లంకా నగరమును నాశనము చేయగలరు. మిగిలిన వానరులందరూ అవసరమే లేదు’. ||59.21||


||శ్లోకము 59.22||


 మయైవ నిహతా లంకా దగ్ధా భస్మీకృతా పునః |

రాజమార్గేషు సర్వత్ర నామ విశ్రావితం మయా ||59.22||


స|| లంకా మయైవ నిహతా పునః భస్మీకృతా రాజమార్గేషు సర్వత్ర మయా నామ విశ్రావితం ||


||శ్లోకార్థములు||


లంకా మయైవ నిహతా - 

నా చేత ధ్వంసము చేయబడి

పునః భస్మీకృతా - 

పూర్తిగా భస్మము చేయబడినది

రాజమార్గేషు సర్వత్ర -

 రాజమార్గములలో అన్నిచోటలా 

మయా నామ విశ్రావితం - 

నా పేరు చాటబడినది 


||శ్లోక తాత్పర్యము||


’నా చేత లంకానగరము పూర్తిగాధ్వంసము చేయబడి, భస్మము చేయబడినది. రాజమార్గములలో అన్నిచోటలా నా పేరు చాటించ బడినది’. ||59.22||


||శ్లోకము 59.23||


జయత్యతి బలో రామో లక్ష్మణస్య మహాబలః |

రాజా జయతి సుగ్రీవో రాఘవేణాధిపాలితః ||59.23||


స|| అతిబలః రామః జయతి | మహాబలః లక్ష్మణః చ | రాఘవేణ అభిపాలితః రాజా సుగ్రీవః జయతి | 


||శ్లోకార్థములు||


అతిబలః రామః జయతి - 

మహాబలవంతుడైన రామునకు జయము

మహాబలః లక్ష్మణః చ - 

మహాబలుడగు లక్ష్మణునికి జయము

రాఘవేణ అభిపాలితః - 

రాఘవుని పాలనలో ఉన్న

రాజా సుగ్రీవః జయతి - 

రాజు సుగ్రీవునకు జయము


||శ్లోక తాత్పర్యము||


’మహాబలవంతుడైన రామునకు జయము. మహాబలుడగు లక్ష్మణునికి జయము. రాఘవుని పాలనలో ఉన్న రాజు  సుగ్రీవునకు జయము’. ||59.23|| 


ఇది లంకలో హనుమ చేసిన జయఘోష. జయమంత్రములోమొదటి శ్లోకము.


||శ్లోకము 59.24||


అహం కోసలరాజస్య దాసః పవనసంభవః |

హనుమానితి  సర్వత్ర నామ విశ్రావితం మయా ||59.24||


స|| అహం పవనసంభవః  హనుమాన్ నామ అహం కోసలరాజస్య దాసః| ఇతి మయా విశ్రావితమ్ ||


||శ్లోకార్థములు||


అహం పవనసంభవః  హనుమాన్ నామ - 

నేను వాయుపుత్రుడను హనుమంతుడను పేరు గలవాడను

కోసలరాజస్య దాసః - 

కోసలరాజుయొక్క దాసుడను

ఇతి విశ్రావితమ్ -

 అని చాటబడినది 


||శ్లోక తాత్పర్యము||


’నేను వాయుపుత్రుడను, కోసలరాజు రాఘవుని దాసుడను, హనుమాన్ అని పేరు గలవాడను, అని అన్ని చోటలా చాటింప బడినది’. ||59.24||


||శ్లోకము 59.25,26||


అశోకవనికా మధ్యే రావణస్య దురాత్మనః |

అధస్తాచ్ఛింశుపావృక్షే సాధ్వీ కరుణమాస్థితా ||59.25||

రాక్షసీభి పరివృతా శోకసన్తాపకర్శితా |

మేఘలేఖాపరివృతా చన్ద్రలేఖేవ నిష్ప్రభా ||59.26||

అచిన్తయన్తీ వైదేహీ రావణం బలదర్పితమ్ |


స|| దురాత్మనః రావణస్య అశోకవనికామధ్యే శింశుపావృక్షే అధస్తాత్ సాధ్వీ రాక్షసీభిః పరివృతా శోకసంతాప కర్శితా మేఘలేఖాపరివృతా చంద్ర లేఖం ఇవ నిష్ప్రభా బలదర్పితం రావణం అచిన్తయన్తీ వైదేహీ కరుణం ఆస్థితా ||


రామ టీకాలో - అశోకేతి| రాక్షసీభిః పరివృతా అతఏవ మేఘరేఖయా పరివృతయా అఛ్ఛాదితా చన్ద్రరేఖేవ నిష్ప్రభా రావణం అచిన్తయన్తీమ్ అగణయన్తీ సర్వాత్మనా రామం అనురక్తా  అతఏవ పురన్దరే పౌలోమివ రామేణ రామాతి స్మరణేన యుక్తేన శేషః అతఏవ అనన్య చిన్తా  రాక్షసీ మధ్యే ముర్ముహుః తర్జమానా ప్రమదానాం అవనమతిరక్షా యస్మిన్  పురుషాగమ్యే ఇత్యర్థః , రావణస్య అశోకవనికా మధ్యే శింశుపామూలే అధస్తాత్ నిమ్నదేశే రాక్షసీభిః అవష్టభ్యా నిరుద్ధా  జానకీ మయాదృష్టా |


||శ్లోకార్థములు||


దురాత్మనః రావణస్య - 

దురాత్ముడైన రావణుని

అశోకవనికామధ్యే శింశుపావృక్షే అధస్తాత్ - 

అశోకవనిక మధ్యలో శింశుపావృక్షము క్రింద

రాక్షసీభిః పరివృతా - 

రాక్షస స్త్రీలచేత చుట్టబడి

శోకసంతాప కర్శితా -

 శోకసంతాపములతో నిండినదై

మేఘలేఖాపరివృతా చంద్ర లేఖం ఇవ నిష్ప్రభా - 

మేఘములతో కప్పబడిన చంద్రుని వలె వున్నకాంతి విహీనమై యున్న

బలదర్పితం రావణం అచిన్తయన్తీ - 

బలదర్పము తో విర్రవీగుతున్న రావణుని గురించి ఆలోచించకుండా వున్న

సాధ్వీ వైదేహీ కరుణం ఆస్థితా -

 ఆ సాధ్వి కరుణమైన స్థితిలో ఉన్నది.


||శ్లోక తాత్పర్యము||


’దురాత్ముడైన రావణుని అశోకవనిక మధ్యలో శింశుపావృక్షము క్రింద రాక్ష రాక్షస స్త్రీలచేత చుట్టబడి, శోకసంతాపములతో నిండినదై, మేఘములతో కప్పబడిన చంద్రుని వలె వున్న, బలదర్పము తో విర్రవీగుతున్న రావణుని గురించి ఆలోచించకుండా వున్న,  ఆ సాధ్వి కరుణమైన స్థితిలో ఉన్నది’. ||59.25,26||


||శ్లోకము 59.27,28||


పతివ్రతా చ సుశ్రోణీ అవష్టబ్ధా చ జానకీ ||59.27||

అనురక్తా హి వైదేహీ రామం సర్వాత్మనా శుభా |

అనన్యచిత్తా రామే చ పౌలోమీవ పురన్దరే ||59.28||


స|| పతివ్రతా సుశ్రోణీ జానకీ అవష్టబ్ధా శుభా వైదేహీ సర్వాత్మనా రామం అనురక్తా పురన్దరే పౌలోమి ఇవ రామే అనన్యచిత్తా (అస్తి) ||


గొవిన్దరాజులవారి టీకాలో - పతివ్రతా చేత్యాది| పౌలోమివ పురన్దర ఇతి నహుషనిర్బన్ధ ఇతి భావః |  - అంటే నహుషునిచేత నిర్బధింపబడిన  పౌలోమికి పురన్దరునిపై అని భావము



||శ్లోకార్థములు||


పతివ్రతా సుశ్రోణీ జానకీ - 

పతివ్రత, సుందరమైన కటిప్రదేశము కల జానకి

అవష్టబ్ధా శుభా వైదేహీ - 

బంధించబడిన పతివ్రత వైదేహి

సర్వాత్మనా రామం అనురక్తా - మనస్సులో రామునిపైనే అనురక్తి కలదై 

పురన్దరే పౌలోమి ఇవ - 

ఇంద్రునియందు పౌలోమి వలె 

రామే అనన్యచిత్తా (అస్తి) - 

ఇతర ధ్యాస లేకుండా రామునిపై మనస్సుగలది అయి వున్నది.


||శ్లోక తాత్పర్యము||


’పతివ్రత, సుందరమైన కటిప్రదేశము కలది, నిర్బంధములో ఉన్నది అగు  ఆ వైదేహి, మనస్సులో రామునే ధ్యానిస్తూ,  పౌలోమికి ఇంద్రునిమీద అనురాగమున్నట్లు  ఇతర ధ్యాస లేకుండా రామునిపై మనస్సుగలది అయి వున్నది’. ||59.27,28||  


||శ్లోకము 59.29||


తదేకవాసః సంవీతా రజోధ్వస్తా తథైవ చ |

శోకసన్తాప దీనాంగీ సీతా భర్తృహితే రతా ||59.29||


స|| తదేకవాససంవీతా రజొధ్వస్థా శోకసంతాపదీనాంగీ తథైవ చ సీతా భర్తృహితే రతా ||


||శ్లోకార్థములు||


తదేకవాససంవీతా రజొధ్వస్థా - 

ఒకటే వస్త్రము ధరించి, ధూళిచేత కప్పబడివున్న

శోకసంతాపదీనాంగీ - 

శోకసంతాపములతో దీనముగా వున్న

తథైవ చ  సీతా భర్తృహితే రతా - 

అలాగే భర్త హితమునే కోరుకొనుచున్నది


||శ్లోక తాత్పర్యము||


’ఒకటే వస్త్రము ధరించి, ధూళిచేత కప్పబడి , శోకసంతాపములతో దీనముగా వున్న ఆమె, భర్త హితమునే కోరుకొనుచున్నది’. ||59.29||


||శ్లోకము 59.30,31||


సా మయా రాక్షసీ మధ్యే తర్జ్యమానా ముహుర్ముహుః |

రాక్షసీభిర్విరూపాభిః దృష్టా హి ప్రమదావనే ||59.30||

ఏకవేణీధరా దీనా భర్తృచిన్తాపరాయణా |

అథశ్శయా వివర్ణాంగీ పద్మినీవ హిమాగమే ||59.31||

రావణాద్వినివృత్తార్థా మర్తవ్యకృత నిశ్చయా |


స|| విరూపాభిః రాక్షసీభిః ముహుర్ముహుః తర్జ్యమానా ,దీనా భర్తృచిన్తాపరాయణా అథః శయ్యా , హిమాగమే పద్మినీమివ వివర్ణాంగీ, రావణాత్ వినివృత్తార్థా, మర్తవ్యకృతనిశ్చయా సా మయా రాక్షసీమధ్యే ప్రమదావనే దృష్టా ||


||శ్లోకార్థములు||


విరూపాభిః రాక్షసీభిః - 

విరూపులైన రాక్షసస్త్రీలచేత

ముహుర్ముహుః తర్జ్యమానా - 

మళ్ళీ మళ్ళీ భయపెట్టబడుతూ

దీనా భర్తృచిన్తాపరాయణా - 

భర్తపై చింతనలోమునిగియుండి

అథః శయ్యా - నేలపై పడుకొని

హిమాగమే పద్మినీమివ వివర్ణాంగీ - 

మంచుతో కప్పబడిన పద్మము వలె వివర్ణవదనముతో ఉన్న, 

రావణాత్ వినివృత్తార్థా -

రావణుని నుండి విముఖతతో

మర్తవ్యకృతనిశ్చయా - 

మరణించుటకు నిశ్చయించుకున్న 

సా మయా రాక్షసీమధ్యే ప్రమదావనే దృష్టా - 

ఆమె నాచేత రాక్షస స్త్రీల మధ్యలో ప్రమదావనములో చూడబడినది


||శ్లోక తాత్పర్యము||


’విరూపులైన రాక్షసస్త్రీల బంధములో, మళ్ళీ మళ్ళీ భయపెట్టబడుతూ, దీనమైన ఆమె భర్తపై చింతనలోమునిగియుండి నేలపై పడుకొని , మంచుతో కప్పబడిన పద్మము వలెనున్న, రావణుని నుండి విముఖతతో మరణించుటకు నిశ్చయించుకున్న , రాక్షస స్త్రీల మధ్యనున్న సీతను చూచితిని’. ||59.30,31||


||శ్లోకము 59.32,33||


కథంచిన్ మృగశాబాక్షీ విశ్వాస ముపపాదితా ||59.32||

తతః సంభాషితా చైవ సర్వమర్థం చ దర్శితా |

రామసుగ్రీవ సఖ్యం చ శ్రుత్వా ప్రీతిముపాగతా ||59.33||


స||మృగశాబాక్షీ కథంచిత్ ఉపపాదితా తతః సంభాషితా సర్వం అర్థం చ దర్శితా రామసుగ్రీవసఖ్యం చ శ్రుత్వా ప్రీతిం ఉపాగతా ||


తిలక టీకాలో  - కథంచిదాదౌ తూష్ణీం రామకథా ప్రస్తావేన సర్వమర్థం రామసుగ్రీవ వృత్తాంతమ్ ||


రామ టీకాలో - సంభాషితా అతఏవ సర్వమర్థం ప్రకాశితా ప్రబుద్ధా సీతా రామసుగ్రీవ సఖ్యం శ్రుత్వా ప్రీతిముపాగతా ప్రాప్తా |


||శ్లోకార్థములు||


మృగశాబాక్షీ కథంచిత్ ఉపపాదితా - 

ఆ లేడి కనులవంటి కనులు గల ఆమెకి  ఎలాగో విశ్వాసము కలిగించి

తతః సంభాషితా - 

పిమ్మట సంభాషణ చేసి

సర్వం అర్థం చ దర్శితా - 

ఆన్నివిషయములు విడమరిచి చెప్పబడి 

రామసుగ్రీవసఖ్యం చ శ్రుత్వా - 

రామసుగ్రీవుల మైత్రి గురించి విని 

ప్రీతిం ఉపాగతా - ప్రీతిని పొందెను.


||శ్లోక తాత్పర్యము||


’ఆ లేడిపిల్ల కనుల వంటి కనులు గల ఆమెకి , ఎలాగో విశ్వాసము కలిగించి, పిమ్మట సంభాషణ చేసి, ఆన్నివిషయములు విడమరిచి చెప్పబడి, రామసుగ్రీవుల మైత్రి గురించి విని, ఆమె ప్రీతిని పొందెను’. ||59.32.33||


||శ్లోకము 59.34||


నియతః సముదాచారో భక్తిర్భర్తరి చోత్తమా |

యన్నహన్తి దశగ్రీవం స మహాత్మా కృతాగసమ్ ||59.34||

నిమిత్తమాత్రం రామస్తు వధే తస్య భవిష్యతి |


స|| మహాత్మా సా కృతాగసమ్ దశగ్రీవం న హన్తి ఇతి యత్  (తత్) నియతః సముదాచారః భర్తరి ఉత్తమా భక్తిః || రామస్తు తస్య వధే నిమిత్తమాత్రం భవిష్యతి ||  


గోవిన్దరాజ టీకాలో -  యన్ నహన్తీతి|| దశగ్రీవం న హన్తీతి యత్ తత్ర కారణమ్ స దశాననః మహాత్మా మహానుభావః । శాపనిబన్ధన దుర్మరణాభావాదితి భావః అతః తస్య వధే రామస్తు రామ ఏవ నిమిత్తమాత్రం భవిష్యతి తథా తస్యోత్కర్షాత్ సీతా తు నిమిత్తకారణం ఇతి శేషః । భర్త్రైవ వైర నిర్యాతనం వీరపత్నీధర్మః  అన్యథా భర్తుర్మహల్లాఘవమితి మనీషయా న స్వయం హన్తి న త్వసామర్థ్యాదితి భావః॥


||శ్లోకార్థములు||


కృతాగసమ్ దశగ్రీవం -

అపరాధముచేసిన ఆ దశకంఠుడు

మహాత్మా సా - మహాత్ముడైన అతడు

న హన్తి ఇతి యత్ - ఇంకను చంపబడలేదు అన్నమాట

(తత్)  నియతః సముదాచారః - 

(అది) అమె యొక్క నియమబద్ధమైన సదాచారబద్దమైన

భర్తరి ఉత్తమా భక్తిః - 

భర్తయందలి ఉత్తమమైన భక్తియే

రామస్తు తస్య వధే - 

రాముడు రావణవధకు

నిమిత్తమాత్రం భవిష్యతి - 

నిమిత్త మాత్రుడు మాత్రమే



||శ్లోక తాత్పర్యము||


’అపరాధముచేసిన ఆ దశకంఠుడు ఇంకనూ చంపబడలేదు అంటే దాని కారణము ఆమె యొక్క నియమపాలనా, భర్తపై నున్న అచంచల భక్తియే. రాముడు రావణవధకు నిమిత్త మాత్రుడు మాత్రమే’. ||59.34||


||శ్లోకము 59.35||


సా ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాత్ చ కర్శితా ||59.35||

ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుతాం గతా |


స|| ప్రకృత్యైవ తన్వంగీ తద్వియోగాత్ కర్శితా చ సా ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ తనుమతాం గతా | 


||శ్లోకార్థములు||


రామస్తు తస్య వధే - 

రాముడు రావణవధకు

నిమిత్తమాత్రం భవిష్యతి - 

నిమిత్త మాత్రుడు మాత్రమే

ప్రకృత్యైవ తన్వంగీ - 

ప్రకృతిరీత్యా సన్నని నడుము కల

తద్వియోగాత్ కర్శితా చ - 

వియోగ దుఃఖమువలన కృశించిపోయి

ప్రతిపత్పాఠశీలస్య విద్యేవ - 

వేదాధ్యయనము చేసిన వాని వలె

సా  తనుమతాం గతా - 

 అమె మరీ సన్నబడిపోయినది


||శ్లోక తాత్పర్యము||


’ప్రకృతిరీత్యా సన్నని నడుము కల ఆమె, వియోగ దుఃఖమువలన కృశించిపోయి, వేదాధ్యయనము చేసిన వాని వలె మరీ సన్నబడిపోయినది’. ||59.35||


||శ్లోకము 59.36||


 ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణా |

యదత్ర ప్రతికర్తవ్యంతత్ సర్వం ఉపపద్యతామ్ ||59.36||


స|| మహాభాగా సీతా అస్తే ఏవం శోకపరాయణా | అత్ర యత్ ప్రతికర్తవ్యం తత్ సర్వం ఉపపద్యతామ్ || 


||శ్లోకార్థములు||


మహాభాగా సీతా - 

ఆ మహానుభావురాలు సీత

అస్తే ఏవం శోకపరాయణా - 

ఈ విధముగా శోకములో మునిగిఉన్నది

అత్ర యత్ ప్రతికర్తవ్యం - 

ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము

తత్ సర్వం ఉపపద్యతామ్- 

అది మనందరము అలోచించవలెను


||శ్లోక తాత్పర్యము||


’ఆ మహానుభావురాలు ఈ విధముగా శోకములో మునిగిఉన్నది. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము మనందరము అలోచించవలెను’. ||59.36||


’అపరాధముచేసిన ఆ దశకంఠుడు ఇంకనూ చంపబడలేదు అంటే దాని కారణము ఆమె యొక్క నియమ పాలనా , భర్తపై నున్న అచంచల భక్తియే. రాముడు రావణవధకు నిమిత్త మాత్రుడు. ఆ మహానుభావురాలు ఈ విధముగా శోకములో మునిగి ఉన్నది. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము మనందరము ఆలోచించవలెను’.  అని అన్న హనుమ మాటలతో ఈ సర్గ సమాప్తము అవుతుంది.


సీతమ్మ కోరిక పూర్తిగా మరిచిపోయిన హనుమ, సీతమ్మని తీసుకు వెళ్ళుదాము అని చెప్పినా, చివరికి హనుమ, ఆ నిర్ణయము వానరముఖ్యుల మీద వదిలేస్తాడు.


ఈ విధముగా శ్రీమద్వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎభై తొమ్మిదవ సర్గ సమాప్తము


 ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే 

చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్

శ్రీమత్సుందరకాండే ఏకోనషష్టితమస్సర్గః ||

.


||ఓమ్ తత్ సత్||