||సుందరకాండ ||

||ఎభై తొమ్మిదవ సర్గ తెలుగులో||

 

||ఓమ్ తత్ సత్||
శ్లో|| ఏతదాఖ్యాయ తత్సర్వం హనుమాన్ మారుతాత్మజః|
భూయః సముపచక్రామ వచనం వక్తు ముత్తరమ్||1||
స|| హనుమాన్ మారుతాత్మజః ఏతత్ సర్వం ఆఖ్యాయ భూయః ఉత్తరం వచనం వక్తుం సముపచక్రమే||
తా|| మారుతాత్మజుడైన హనుమంతుడు అలాగ ( జరిగిన వృత్తాంతము) అంతా చెప్పి మళ్ళీ ఇలా చెప్పసాగెను
||ఓమ్ తత్ సత్||

సుందరకాండ.
అథ ఏకోనషష్టితమస్సర్గః||

మారుతాత్మజుడైన హనుమంతుడు అలాగ లంకలో జరిగిన వృత్తాంతము అంతా చెప్పి, మళ్ళీ ఇలా చెప్పసాగెను.

'రాఘవుని కార్యము సుగ్రీవుని ప్రయత్నములు సఫలము అయినాయి. సీతాదేవి యొక్క శీలము చూచి నా మనస్సు భక్తితో నిండిపోయెను. ఆ రాక్షసాధిపుడు మహాతపస్సంపన్నుడు. తన తపస్సుతో లోకములను దహించివేయగలవాడు. ఆమెను స్పృశించినప్పటికీ తనతపోశక్తి వలననే అతడు నాశనము అవలేదు. క్రోధముతో మండిపోతున్న జనకుని కూతురు ఏ పని చేయగలదో, అది అగ్నిజ్వాలలు కూడా చేయలేవు. కాని ఆమె రాముని అనుమతిలేనిదే ఏ పనీ చేయదు. జాంబవదాది ప్రముఖుల అనుమతితో ఇప్పటి వరకు జరిగిన వృత్తాంతము నివేదించితిని. ఇప్పుడు మనము వైదేహి సమేతముగా రామలక్ష్మణుల దర్శనము చేయుట సముచితము అని భావిస్తున్నాను'.

'నేను ఒక్కడినే రాక్షసబలములతో కూడిన లంకాపురమును రావణుని కూడా నాశనము చేయగలను. బలవంతులు, విజయకాంక్షగల నిశ్చయమైన మనస్సుగలవారు, ఆకాశములో ఎగరకలవారు, మీ అందరితో కూడితే ఇక చెప్పవలసినదేమి? నేను యుద్ధములో రావణుని అతని సైన్యముతో సహా, పుత్రులతో సహా, సహోదరులతో సహా వధించగలను. ఇంద్రజిత్తు చే ప్రయోగింపబడిన బ్రహ్మస్త్రము, ఇంద్రుడు రుద్రుడు వాయువు వరుణు దేవుల అస్త్రములు చూచుటకు కష్టమైనప్పటికీ, యుద్దములో ఆ రాక్షసులందరినీ జయించి వధించెదను. మీ ఆజ్ఞతో నా పరాక్రమము తో వారిని బంధించెదను. యుద్ధములో నా చేత ప్రయోగింపబడిన నిరంతరమైన శిలావృష్టి తో దేవతలు కూడా హతులు అవుతారు. అ రాక్షసుల సంగతి చెప్పనేల'.

'సాగరము తన అవధి దాటవచ్చు. మందర పర్వతము చలించవచ్చు. కాని యుద్ధములో జాంబవంతుని ఎవరూ చలింపచేయలేరు. వీరుడైన వాలి సుతుడు ఒక్కడే, ఆ రాక్షస సమూహములన్నిటినీ వినాశము చేయుటకు చాలును. పనసుని, నీలుని ఊరువేగమునకు మందర పర్వతము కూడా చూర్ణమై పోవును. ఇంక యుద్ధములో రాక్షసుల సంగతి చెప్పనేల. దేవాసుర గంధర్వ ఊరగ పక్షులలో, ఎవరు మందుడు ద్వివిదులతో ప్రతి యుద్ధము చేయగలరు? ఈ అశ్వినీ పుత్రులిద్దరూ వానర శ్రేష్ఠులు, మహబలశాలురు. వీరికి ఎదురుగా పోరాడగలవారు నాకు కనపడుటలేదు. వీరు పితామహుని వరముతో ఉత్సాహము కలవారు. ఈ వానరసత్తములిద్దరూ అమృతము తాగినవారు. పూర్వము బ్రహ్మదేవుడు అశ్వినీ దేవతలను సంతృప్తి పరచుటకు వీరు ఎవరిచేతులో చావు లేకుండునట్లు వరము పొందిరి. ఆ వరముచేత మదించినవారై ఆ వానరసత్తముల్లిద్దరూ దేవతాసైన్యములను జయించి అమృతను సేవించితిరి. కృద్ధులైన వీరిద్దరూ గుర్రాలు రథములు ఏనుగులు కల సైన్యములతో సహా లంకానగరమును నాశనము చేయగలరు. మిగిలిన వానరులందరూ అవసరమే లేదు'.

హనుమంతుడు మరల చెప్పసాగెను.

' నాచేత లంకానగరము పూర్తిగాధ్వంసము చేయబడి భస్మము చేయబడినది. "మహాబలవంతుడైన రామునకు జయము. మహాబలుడగు లక్ష్మణునికి జయము. రాఘవుని పాలనలో ఉన్న సుగ్రీవునకు జయము. వాయుపుత్రుడనైన నేను కోసలరాజు రాఘవుని దాసుడను. హనుమాన్ అని పేరు గలవాడను' అని అన్ని చోటలా చాటించితిని.

'దురాత్ముడైన రావణుని అశోకవనిక మధ్యలో శింశుపావృక్షము క్రింద ఆ సాధ్వి రాక్షస స్త్రీలచేత చుట్టబడి, శోకసంతాపములతో నిండినదై మేఘములతో కప్పబడిన చంద్రుని వలె వున్నది. బలదర్పము తో విర్రవీగుతున్న రావణుని గురించి ఆలోచించకుండా, ఆమె కరుణమైన స్థితిలో ఉన్నది. పతివ్రత, సుందరమైన కటిప్రదేశము కలది, నిర్బంధములో ఉన్నది, అగు ఆ వైదేహి మనస్సులో రామునే ధ్యానిస్తూ, పౌలోమికి ఇంద్రునిమీద అనురాగమున్నట్లు ఇతర ధ్యాస లేకుండా రామునిపై మనస్సుగలది అయి వున్నది. ఒకటే వస్త్రము ధరించి, ధూళిచేత కప్పబడి , శోకసంతాపములతో దీనముగా వున్న ఆమె భర్త హితమునే కోరుకొనుచున్నది. ఆ విధముగా విరూపులైన రాక్షసస్త్రీల బంధములో మళ్ళీ మళ్ళీ భయపెట్టబడుతూ, దీనమైన ఆమె భర్తపై చింతనలోమునిగియుండి నేలపై పడుకొని , మంచుతో కప్పబడిన పద్మము వలెనున్నది. రావణుని నుండి విముఖతతో మరణించుటకు నిశ్చయించుకున్న, రాక్షస స్త్రీల మధ్యనున్న సీతను చూచితిని. లేడిపిల్ల కనులవంటి కనులు గల ఆమెకి, ఎలాగో విశ్వాసము కలిగించితిని. సంభాషణ చేసిన పిమ్మట, ఆన్నివిషయములు విడమరిచి తెలిసికొని, రామసుగ్రీవుల మైత్రి గురించి విని ఆమె ప్రీతిని పొందెను.

హనుమంతుడు ఇంకా చెప్పసాగెను.

' అపరాధముచేసిన ఆ దశకంఠుడు ఇంకనూ చంపబడలేదు అంటే, దాని కారణము ఆమె యొక్క నియమపాలనా, భర్తపై నున్న అచంచల భక్తియే. రాముడు రావణవధకు నిమిత్త మాత్రుడు. ప్రకృతిరీత్యా సన్నని నడుము కల వియోగ దుఃఖమువలన కృశించిపోయి, వేదాధ్యయనము చేసిన వాని వలె మరీ సన్నబడిపోయినది. ఆ మహానుభావురాలు ఈ విధముగా శోకములో మునిగిఉన్నది. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము మనందరము అలోచించవలెను'. అని

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండలో ఎభై తొమ్మిదవ సర్గ సమాప్తము.


||ఓమ్ తత్ సత్||
శ్లో|| ఏవమాస్తే మహాభాగా సీతా శోకపరాయణా|
యదత్ర ప్రతికర్తవ్యంతత్ సర్వం ఉపపద్యతామ్||36||
స|| మహాభాగా సీతా అస్తే ఏవం శోకపరాయణా | అత్ర యత్ ప్రతికర్తవ్యం తత్ సర్వం ఉపపద్యతామ్||
తా|| ఆ మహానుభావురాలు ఈ విధముగా శోకములో మునిగిఉన్నది. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యము మనందరము అలోచించవలెను.
||ఓమ్ తత్ సత్||