||సుందరకాండ ||

|| ఇదవ సర్గ శ్లోకార్థ తాత్పర్యముతో||

|| Sarga 5 || with Slokas and meanings in Telugu


|| Om tat sat ||

సుందరకాండ.
అథ పంచమ స్సర్గః
శ్లోకార్థ తాత్పర్యాలతో

ఐదవ సర్గలో ముఖ్యముగా వినేది హనుమంతుని అన్వేషణ గురించి. హనుమంతుడు లంకలో ప్రవేశిస్తున్నప్పుడు చంద్రుడు తన సహస్ర కిరణములతో కాంతిని వెదజల్లుతూ హనుమంతునికి సాచివ్యము చేస్తున్నట్లు వున్నాడా అని కవి చెప్పడము విన్నాము. హనుమ లంకలో చేరి, లంకిణిని జయించి, రావణ భవనములో ప్రవేశించాడు అని కూడా విన్నాము. అప్పటికి చంద్రుడు ఆకాశ మధ్యములో చేరాడు. అదే మాటతో ఐదవ సర్గ ప్రాంభము అవుతుంది. చక్కటి చంద్రుని వెన్నెలలాగా, ఈ సర్గలో వాల్మీకి శ్లోకాలు ఎంతో సునిసితమైన సరళి లో అతి మధురముగా వినపడతాయి.

ఇంకొక మాట. మొదటి సర్గలోని మొదటి శ్లోకములో విన్నది, సుందరకాండలో సీతాన్వేషణే ముముక్షువులయొక్క ఆత్మాన్వేషణ అని. అదే సుందరకాండలో అంతరార్ధము అని కూడా విన్నాము. అ విధముగా అంటే ఆత్మాన్వేషణ అనే భావము తో చూస్తే ఈ సర్గలో చూడవలసిన విషయాలు కొన్ని ఉన్నాయి. అవి చంద్రుని వర్ణనలో వస్తాయి. వాటి విశ్లేషణ కూడా ఈ సర్గలో చూస్తాము.

ఇక ఐదవ సర్గలో శ్లోకార్థములు.

॥శ్లోకము 5.01॥

శ్లో|| తతస్స మధ్యంగత మంశుమన్తమ్
జ్యోత్స్నావితానం మహదుద్వమన్తమ్|
దదర్శ ధీమాన్దివి భానుమన్తమ్
గోష్ఠే వృషం మత్తమివ భ్రమన్తమ్||5.01||

స|| తతః సః ధీమాన్ మధ్యం గతం అంశుమంతం ఉద్యమంతం మహత్ జ్యోత్స్నావితానమ్ దివి భానుమంతం గోష్ఠే భ్రమంతం వృషమివ దదర్శ||

॥శ్లోకార్థములు॥

తతః సః ధీమాన్ - అప్పుడు ఆ ధీమంతుడు
మధ్యం గతం - ఆకాశ మధ్యభాగములో చేరి
దివి భానుమంతం - ఆకాశములో వున్న సూర్యునివలె
మహత్ జ్యోత్స్నావితానమ్ ఉద్యమంతం-
మహత్తరమైన కాంతులను విరజిమ్ముచూ
గోష్ఠే భ్రమంతం వృషమివ-
గోశాలలో మదమెక్కిన ఆంబోతు వలె నున్న
అంశుమంతం దదర్శ - చంద్రుని చూసెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆప్పుడు ఆ ధీమంతుడు ఆకాశములో మధ్యభాగము చేరి,ఆకాశములో వున్న సూర్యునివలె మహత్తరమైన కాంతులను విరజిమ్ముచూ, గోశాలలో మదమెక్కిన ఆంబోతులాగా ఉన్న చంద్రుని చూశెను".॥5.01॥

రామ తిలక టీకాలో శ్లోక తాత్పర్యము సంస్కృతములోనే విడమరిచి ముఖ్యమైన పదములు వాటి అర్థము రాస్తారు. అదే మన అనువాదమునకు రహదారి. ఇక రామ తిలక టీకాలో చెప్పబడిన మాట - 'తతః అన్తఃపుర ప్రవేశానన్తరం ధీమాన్ సః హనుమాన్ మధ్యం తారాగణమన్తః గతం ప్రాప్తం, భానుమన్తం సూర్యమివ జ్యోత్స్నావితానం చన్ద్రికా విస్తారం భువి ఉద్వమన్తం గోష్ఠే భ్రమన్తం వృషమివ అంశుమన్తం చన్ద్రమసం దదర్శ'॥ - శ్లోకార్థము దీనికి అనుగుణముగా చెప్పబడినది.

॥శ్లోకము 5.02॥

శ్లో|| లోకస్య పాపాని వినాశయన్తమ్
మహోదధిం చాపి సమేధయన్తమ్|
భూతాని సర్వాణి విరాజయన్తమ్
దదర్శ శీతాంశుమథాభియాన్తమ్||5.02||

స|| అథ అభియాన్తం లోకస్య పాపాని వినాశయన్తం మహోదద్ధిం సమేధయంతం చాపి సర్వాణి భూతాని విరాజయన్తం శీతాంశుం దదర్శ||

॥శ్లోకార్థములు॥

లోకస్య పాపాని వినాశయన్తం -
లోకములో పాపాలని నాశనము చేయుటకా అన్నట్లు
మహోదద్ధిం సమేధయంతం-
మహా సాగరమును ఉప్పొంగించడానికా అన్నట్లు
సర్వాణి భూతాని విరాజయన్తం -
సమస్త సమస్త భూతములను విరాజమానము చేస్తున్నాడా అన్నట్లు
అథ అభియాన్తం శీతాంశుం దదర్శ -
ఆ ముందుకు పోవుచున్న చంద్రుని చూచెను.

॥శ్లోకతాత్పర్యము॥

"హనుమంతుడు ముందుకు పోతూ లోకములో పాపాలని నాశనము చేయుటకా అన్నట్లు , మహా సాగరమును ఉప్పొంగించడానికా అన్నట్లు, సమస్త జీవులను విరాజమానము చేస్తున్నాడా అన్నట్లు కాంతులను విరజిమ్ముచున్న చంద్రుని చూచెను".॥5.01॥

ఇక్కడ ఇంకో ధ్వని. హనుమంతుని లంకా ప్రవేశము చంద్రోదయములో అయింది. హనుమ అన్వేషణలో రావణానంతః పురము చేరేసరికి మధ్యరాత్రి అయినది అన్నమాట

॥శ్లోకము 5.03॥

యా భాతి లక్ష్మీర్భువిమన్దరస్థా
తదా ప్రదోషేశు చ సాగరస్థా|
తథైవ తోయేషు చపుష్కరస్థా
రరాజ సా చారునిశాకరస్థా ||5.03||

స|| భువి యా మందరస్థా లక్ష్మీః భాతి తథా ప్రదోషేషు సాగరస్థా తథా తోయేషు పుష్కరస్థా సా చారునిశాకరస్థా దదర్శ||

రామతిలకలో - భువి పృథివ్యాం మధ్యే యా లక్ష్మీ మన్దరస్థా సతీ యథా భాతి ప్రకాశతే, ప్రదోషేషు చ సాగరస్థా యా యథా ప్రకాశతే, తోయేషు చ పుషకరస్థా సతీ యా యథా ప్రకాశతే , సా చారునిరాకరస్థా సతీ తథైవ రరాజ||

॥శ్లోకార్థములు॥

భువి యా మందరస్థా లక్ష్మీః భాతి -
భువిలోని మందరపర్వతము మీద ఉన్న లక్ష్మి లాంటి
తథా ప్రదోషేషు సాగరస్థా -
ప్రదోషకాలములో సాగరములో వున్న ప్రకాశములాంటి
తథైవ తోయేషు చపుష్కరస్థా-
అలాగే తామరాకుపై వున్నజలములో ని ప్రకాశములాంటి
రరాజ సా చారునిశాకరస్థా - అలాంటి ప్రకాశముతోనే చంద్రుడు శోభిల్లెను

॥శ్లోకతాత్పర్యము॥

"భువిలోని మందరపర్వతము మీద ఉన్న లక్ష్మి లాగ, సాగరములో ప్రదోషకాలములో ఉన్న ప్రకాశములాగ, తామరాకుమీద ఉన్న జలములోని ఎట్టి ప్రకాశము ఉందో అట్టి ప్రకాశమే చంద్రుని లో ఉజ్వలముగా కనపడుతున్నది."॥5.03॥

॥శ్లోకము 5.04॥

శ్లో|| హంసోయథా రాజత పఞ్జరస్థః
సింహో యథా మందరకందరస్థః|
వీరో యథా గర్విత కుఞ్జరస్థః
చంద్రోఽపి బభ్రాజ తథాంబరస్థః||5.04||

స||యథా రాజతపంజరస్థాః హంసః యథా మందరకన్దరస్థః సింహః యథా గర్విత కుంజరస్థః వీరః తథా అంబరస్థః చంద్రః అపి భభ్రాజ ||

॥శ్లోకార్థములు॥

యథా రాజతపంజరస్థాః హంసః -
రజత పంజరములో నున్న హంస లాగ
యథా మందరకన్దరస్థః సింహః -
మందర పర్వతములోని గుహలలో వున్న సింహము లాగ
యథా గర్విత కుంజరస్థః వీరః -
గర్వముతో ఏనుగపై నున్న వీరుడు లాగ
తథా అంబరస్థః చంద్రః అపి భభ్రాజ
ఆకాశములో నున్న చంద్రుడు కూడా విరాజిల్లెను

॥శ్లోకతాత్పర్యము॥

"రజత పంజరములో నున్న హంస లాగ, మందర పర్వతములోని గుహలలో వున్న సింహము లాగ, గర్వముతో ఏనుగపై నున్న వీరుడు లాగ, ఆకాశములో నున్న చంద్రుడు కూడా విరాజిల్లెను."॥5.04॥

॥శ్లోకము 5.05॥

స్థితః కకుద్మానివ తీక్ష్ణ శృఙ్గో
మహాచలశ్వేత ఇవోచ్ఛశృఙ్గః|
హస్తీవ జాంబూనద బద్ధశృఙ్గో
రరాజ చంద్రః పరిపూర్ణశృఙ్గః||5.05||

స|| పరిపూర్ణ శృంగః చంద్రః తీక్ష్ణశృంగః స్థితః కకుద్మానివ, శ్వేతః ఉచ్చశృంగః మహాచలః (ఇవ) జామ్బూనద బద్ధశృంగః హస్తి ఇవ రరాజ||

॥శ్లోకార్థములు॥

తీక్ష్ణశృంగః స్థితః కకుద్మానివ -
వాడికొమ్ములున్నవృషభము లాగా
శ్వేతః ఉచ్చశృంగః మహాచలః (ఇవ) -
మహోన్నత శిఖరాలున్న తెల్లని మహా పర్వతములాగా
జామ్బూనద బద్ధశృంగః హస్తి ఇవ -
బంగారపు పూతతో కూడిన తొడుగులు కల దంతములు వున్న ఏనుగు లాగా
పరిపూర్ణ శృంగః చంద్రః రరాజ -
పరిపూర్ణకళలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు.

॥శ్లోకతాత్పర్యము॥

"వాడికొమ్ములున్న వృషభము లాగా, మహోన్నత శిఖరాలున్న తెల్లని మహా పర్వతములాగా, బంగారపు పూతతో కూడిన తొడుగులు కల దంతములు వున్న ఏనుగు లాగా, పరిపూర్ణకళలతో చంద్రుడు ప్రకాశిస్తున్నాడు."॥5.05॥

॥శ్లోకము 5.06॥

వినష్ట శీతాంబుతుషార పఙ్కో
మహాగ్రహగ్రాహ వినష్ఠ పఙ్కః|
ప్రకాశ లక్ష్మ్యాశ్రయనిర్మలాఙ్కో
రరాజ చంద్రో భగవాన్ శశాఙ్కః ||5.06||

స||వినష్ట శీతాంబు తుషారపంకః మహాగ్రహాగ్రాహ వినష్ట పంకః ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంకః శశాంకః భగవాన్ చంద్రః రరాజ||

॥శ్లోకార్థములు॥

వినష్ట శీతాంబు తుషారపంకః -
మంచు తుంపరలమాలిన్యము తొలగి పోయిమెరుస్తున్న తుషారబిందువులాగ
మహాగ్రహాగ్రాహ వినష్ట పంకః -
మహాగ్రహముల వలనకలిగిన మాలిన్యముతొలగి ప్రకాశించువారిలాగ
ప్రకాశ లక్ష్మ్యాశ్రయ నిర్మలాంకః - గొప్పకాంతితో స్పష్టముగానున్న మచ్చ కల
భగవాన్ చంద్రః రరాజ - చంద్ర భగవానుడు ప్రకాశించుచున్నాడు

॥శ్లోకతాత్పర్యము॥

"మంచు తుంపరలమాలిన్యము తొలగి పోయిమెరుస్తున్న తుషారబిందువులాగ, మహాగ్రహముల వలనకలిగిన మాలిన్యముతొలగి ప్రకాశించువారిలాగ, గొప్పకాంతితో స్పష్టముగానున్న మచ్చ కల చంద్రభగవానుడు ప్రకాశిస్తున్నాడు."॥5.06॥

ఇక్కడ చంద్రుడికి 'భగవాన్ చన్ద్రః' అని చెప్పడమైనది. రెండవ సర్గలో చంద్రుడు సాచివ్యము చేస్తున్నాడా అన్నట్లు కాంతి కిరణములను ప్రసారించాడు అని వింటాము. మనకు ఎప్పుడైన అడగకుండా సహాయం లభిస్తే అలా సహాయము అందించినవాడిని భగవంతుడిలా వచ్చాడు అనకోవడము అరుదు కాదు. ఇక్కడ వాల్మీకి అదే విధముగా చంద్రుడిని వర్ణిస్తున్నాడు.

॥శ్లోకము 5.07॥

శిలాతలం ప్రాప్య యథా మృగేన్ద్రో
మహారణం ప్రాప్య యథా గజేన్ద్రః|
రాజ్యం సమాసాద్య యథా నరేన్ద్రః
తథాప్రకాశో విరరాజ చంద్రః||5.07||

స|| శిలాతలం ప్రాప్య యథా మృగేన్ద్రః మహారణం ప్రాప్య యథా గజేన్ద్రః రాజ్యం సమాసాద్య యథా నరేణ్ద్రః తథా ప్రకాశః చంద్రః రరాజ||

॥శ్లోకార్థములు॥

శిలాతలం ప్రాప్య యథా మృగేన్ద్రః -
శిలాతలము పైకెక్కిన మృగరాజము లాగ
మహారణం ప్రాప్య యథా గజేన్ద్రః -
మహారణ్యము లో ప్రవేశించిన గజరాజు లాగా
రాజ్యం సమాసాద్య యథా నరేన్ద్రః -
రాజ్యాన్ని తిరిగి సంపాదించిన రాజు లాగా
తథాప్రకాశో విరరాజ చంద్రః -
అదే విధముగా చంద్రుడు ప్రకాశించుచున్నాడు.

॥శ్లోకతాత్పర్యము॥

"శిలాతలము పైకెక్కిన మృగరాజము లాగ, మహారణ్యము లో ప్రవేశించిన పొందిన గజరాజు లాగా, రాజ్యాన్ని తిరిగి సంపాదించిన రాజు లాగా చంద్రుడు ప్రకాశించుచున్నాడు." ॥5.07॥

॥శ్లోకము 5.08॥

ప్రకాశ చన్ద్రోదయ నష్ఠదోషః
ప్రవృత్తరక్షః పిశితాశదోషః|
రామాభిరామేరితిచిత్తదోషః
స్వర్గ ప్రకాశో భగవాన్ ప్రదోషః||5.08||

స|| యదా భగవాన్ ప్రదోషః స్వర్గప్రకాశః తదా చంద్రోదయ ప్రకాశాత్ (తిమిర) దోషః నష్టః ప్రవృత్త రక్షః పిశితాశదోషః రామాభిరామేరితి చిత్త దోషః (భవతి)||

గోవిందరాజులవారు తమ టీకాలో - ప్రకాశ చన్ద్రస్యౌదయేన నష్టః తిమిరం యస్మిన్ సః; ప్రవృద్ధాః రక్షసాం పిశితాశానాం చ దోషః సంచారరూపో యస్మిన్ సః; తథా రామాభిః అభిరామైః కాన్తైశ్చఈరితః త్యక్తః చిత్త దోషః కోపాభిమాన రూపః యస్మిన్; స్వర్గప్రకాశః స్వర్గతుల్యః తద్వదానన్దావహ ఇత్యర్థః | చంద్రోదయ ప్రకాశము వలన పోయే దోషముల గురించి.

॥శ్లోకార్థములు॥

చంద్రోదయ ప్రకాశాత్ (తిమిర) దోషః నష్టః-
చంద్రోదయముతో చీకటి నశించిపోయెను
ప్రవృత్తరక్షః పిశితాశదోషః -
మాంసభక్షకుల కౄరకర్మలు ఆగిపోయెను
రామాభిరామేరితిచిత్తదోషః -
ప్రియురాళ్ళు తమతమకోపాలని వదిలేసి ప్రియులతో కలిపోయిరి
భగవాన్ ప్రదోషః స్వర్గప్రకాశః - స్వర్గమును ప్రకాశింపచేసిన భవత్స్వరూపమైన ప్రదోష కాలము

॥శ్లోకతాత్పర్యము॥

"ప్రదోషకాలములో స్వర్గ ములను ప్రకాశింపచేసిన చంద్రుని యొక్క ఉదయముతో చీకటి నశించిపోయెను, మాంసభక్షకుల కౄరకర్మలు ఆగిపోయెను, ప్రియురాళ్ళు తమతమకోపాలని వదిలేసి ప్రియులతో కలిపోయిరి." ॥5.08॥

ఇక్కడ చీకటిని నశింపచేయగలగడముతో, రాక్షసుల కౄరభావనలు ఆపగలగడముతో, స్త్రీలలో కోపము ఆపగలగడముతో ' భగవాన్' అన్న ప్రత్యయము కుదురు తుంది అంటారు రామ తిలక టీకాలో

ఈ సర్గలోనే ఆరవ శ్లోకములో చంద్రవర్ణన చేస్తూ చంద్రుని "భగవాన్ శశాంకః" అని అంటాడు వాల్మీకి.
అలాగే ఇక్కడ శ్లోకములో " భగవాన్ ప్రదోషః" అని రాత్రికి భగవాన్ అనే పదము వాడడము అయింది.

అంటే సీతాన్వేషణకు సాయ పడేటట్టుగా చంద్ర కిరణాలతో కాంతి విరజిల్లి సాయపడుతున్నచంద్రుడు 'భగవానుడు'.

ఏ జ్ఞానము భగవంతుని ఆత్మను గోచరింపచేయునో ఆ జ్ఞానము పవిత్రము. ఏ జ్ఞానము లౌకిక విషయములను ప్రదర్శించునో ఆ జ్ఞానము అజ్ఞానము హీనమైనది. ఇక్కడ సీతాన్వేషణకి సాయపడు చంద్రుడు 'భగవానుడు'.

అలాగే ఏ రాత్రి ఏ జన్మము ఆత్మాన్వేషణకు ఉపయోగపడునో, ఆ రాత్రి ఆ జన్మము, 'భగవత్ స్వరూపము'. ఆ రాత్రి పూజ్యము. భగవాన్ ప్రదోషః అనడములో అదే భావము అని అంటారు అప్పలాచార్యులు గారు తమ తత్త్వ దీపికలో.

॥శ్లోకము 5.09॥

తంత్రీస్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః
స్వపయంతి నార్యః పతిభిః సువృత్తా|
నక్తాంచరా శ్చాపి తథా ప్రవృత్తా
నిహర్తు మత్యద్భుతరౌద్రవృత్తాః||5.09||

స|| తంత్రీ స్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః | సువృతాః నార్యః పతిభిః స్వపన్తి| నక్తం చరాః అత్యత్భుత రౌద్రవృత్తాః అపి విహర్తుం ప్రవృత్తాః||

॥శ్లోకార్థములు॥

తంత్రీ స్వనాః కర్ణసుఖాః ప్రవృత్తాః-
తంత్రీవాద్యములు చెవులకు సుఖమునిస్తున్నాయి
సువృతాః నార్యః పతిభిః స్వపన్తి -
పవిత్రులగు సతీమణులు భర్తతో శయినిస్తున్నారు
నక్తం చరాః అత్యత్భుత రౌద్రవృత్తాః అపి-
చీకట్లలో రౌద్ర వృత్తితో తిరిగే రాక్షసులు కూడా
విహర్తుం ప్రవృత్తాః - విహారము చేస్తున్నారు

॥శ్లోకతాత్పర్యము॥

"తంత్రీవాద్యములు చెవులకు సుఖమునిస్తున్నాయి. పవిత్రులగు సతీమణులు భర్తతో శయినిస్తున్నారు, చీకట్లలో రౌద్ర వృత్తితో తిరిగే రాక్షసులు కూడా విహరిస్తున్నారు." ॥5.09॥

॥శ్లోకము 5.10॥

శ్లో|| మత్తప్రమత్తాని సమాకులాని రథాశ్వభద్రాసన సంకులాని|
వీరశ్రియాచాపి సమాకులాని దదర్శ ధీమాన్ స కపిః కులాని||5.10||

స|| ధీమాన్ వీరః హనుమాన్ సః శ్రియా సమాకులాని కులాని మత్తప్రమత్తాని చ రథాశ్వభద్రాసన సంకులాని అపి దదర్శ||

॥శ్లోకార్థములు॥

సః శ్రియా సమాకులాని కులాని -
శ్రియముతో కూడిన వారి ఇళ్ళలో
మత్తప్రమత్తాని చ - మత్తమెక్కిన వారిని
రథాశ్వభద్రాసన సంకులాని అపి -
రథములు అశ్వములు ఏనుగులు మంచి ఆసనములు గలవారిని
ధీమాన్ వీరః హనుమాన్ దదర్శ -
ధీమంతుడు వీరుడు అయిన హనుమంతుడు చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"ధీమంతుడు వీరుడు అయిన హనుమంతుడు శ్రియముతో కూడిన వారి ఇళ్ళలో మత్తమెక్కిన వారిని, రథములు అశ్వములు ఏనుగులు మంచి ఆసనములు గలవారిని చూచెను." ॥5.10॥

॥శ్లోకము 5.11॥

పరస్పరం చాధికమాక్షిపన్తి
భుజాంశ్చ పీనానధిక్షిపన్తి|
మత్త ప్రలాపానధివిక్షిపన్తి
మత్తాని చాన్యోన్యమధిక్షిపన్తి||5.11||

స|| (తే) పరస్పరం అధికం అక్షిపన్తి | పీనాన్ భుజాన్ చ అధికం క్షిపన్తి | మత్తప్రలాపాన్ అధి విక్షిపన్తి | మత్తాని అన్యోన్యం అధిక్షిపన్తి చ||

॥శ్లోకార్థములు॥

పరస్పరం అధికం అక్షిపన్తి -
పరస్పరము అధిక్షేపించుకుంటూ
పీనాన్ భుజాన్ చ అధికం క్షిపన్తి -
భుజములు ఎగరవేసుకుంటూ
మత్తప్రలాపాన్ అధి విక్షిపన్తి -
మత్తించిన ప్రేలాపములలో నున్న వారినీ
మత్తాని అన్యోన్యం అధిక్షిపన్తి చ-
మత్తముతో పరస్పరము ఆక్షేపించుకొనుచున్నవారినీ(చూచెను)

॥శ్లోకతాత్పర్యము॥

"పరస్పరము అధిక్షేపించుకుంటూ వున్నవారిని, భుజములు ఎగరవేసుకుంటూ, మత్తించిన ప్రేలాపములలో నున్న వారినీ, మత్తముతో పరస్పరము ఆక్షేపించుకొనుచున్నవారినీ చూచెను."॥5.11॥

॥శ్లోకము 5.12॥

రక్షాంసి వక్షాంసి చ విక్షిపన్తి గాత్రాణి కాన్తాసు చ విక్షిపన్తి |
రూపాణి చిత్రాణి చ విక్షిపన్తి ధృఢాని చాపాని చ విక్షిపన్తి||12||

స|| (తే) వక్షాంసి విక్షిపన్తి కాన్తాసు గాత్రాణి విక్షిపన్తి చ | రక్షాంసి దృఢాని చాపాని విక్షిపన్తి | చిత్రాణి రూపాణి విక్షిపన్తి చ||

॥శ్లోకార్థములు॥

రక్షాంసి - రాక్షసులలో (కొందరు)
వక్షాంసి విక్షిపన్తి -
వక్షములు పెద్దగాచేసుకుంటూ
కాన్తాసు గాత్రాణి విక్షిపన్తి చ -
కాంతల మీద పడుచున్నారు,
దృఢాని చాపాని విక్షిపన్తి -
ధృఢమైన ధనస్సులను పట్టుకొనివున్నారు
చిత్రాణి రూపాణి విక్షిపన్తి చ -
చిత్రమైన రూపములను ప్రదర్శిస్తున్నారు

॥శ్లోకతాత్పర్యము॥

" రాక్షసులలో కొందరు తమ వక్షములు పెద్దగాచేసుకుంటూ కాంతల మీద పడుచున్నారు. ధృఢమైన ధనస్సులను పట్టుకొనివున్నవారు. చిత్రమైన రూపములను ప్రదర్శిస్తున్నారు." ॥5.12॥

॥శ్లోకము 5.13॥

దదర్శ కాన్తాశ్చ సమాలభంత్యః
తథాపరాః తత్ర పునః స్వపన్త్యః|
సురూపవక్త్రాశ్చ తథా హసంత్యః
క్రుద్ధాః పరాశ్చాపి వినిశ్ర్వసంత్యః||5.13||

స|| సమాలభంత్యః కాన్తాః చ తత్ర అపరాః పునః స్వపన్త్యః| తే సురూప వక్త్రాః చ| తథా హసంత్యః క్రుద్ధాః చ|| అపరాః వినిః శ్వసంత్యః||

॥శ్లోకార్థములు॥

సమాలభంత్యః కాన్తాః చ -
కాంతలు కొందరు చందనానులేపనము చేసినవారు
తత్ర అపరాః పునః స్వపన్త్యః -
కొందరు నిద్రించుచున్నవారు
తే సురూప వక్త్రాః చ -
మంచి రూపము ముఖము కలవారు
తథా హసంత్యః క్రుద్ధాః చ -
నవ్వుతూ ఉన్నవారు, కోపముతో ఉన్నవారు
అపరాః వినిః శ్వసంత్యః -
ఇంకొందరు నిట్టూర్పులు విడుస్తున్నవారు వున్నారు

॥శ్లోకతాత్పర్యము॥

తా|| కాంతలు కొందరు చందనానులేపనము చేసినవారు, కొందరు నిద్రించుచున్నవారు మంచి రూపము ముఖము కలవారు నవ్వుతూ ఉన్నవారు, కోపముతో ఉన్నవారు, ఇంకొంతమంది నిట్టూర్పులు విడుస్తున్నవారు వున్నారు

॥శ్లోకము 5.14॥

మహాగజైశ్చాపి తథా నదద్భిః
సుపూజితైశ్చాపి తథా సుసద్భిః|
రరాజ వీరైశ్చ వినిశ్ర్వసద్భిః
హ్రదోభుజఙ్గై రివ నిశ్ర్వసద్భిః||5.14||

స|| తథా నదద్భిః మహగజైః సుపూజితైః చ , వినిఃశ్ర్వసద్భిః వీరైః చ హ్రదో నిఃశ్వ్రసద్భిః భుజంగైరివ రరాజ||

॥ శ్లోకార్థములు॥

తథా నదద్భిః మహగజైః -
ఘీంకరించుచున్న మహాగజములతోనూ
సుపూజితైశ్చాపి తథా సుసద్భిః -
పూజనీయులైనవారితో మహాపురుషులతోనూ
వినిఃశ్ర్వసద్భిః వీరైః -
దీర్ఘనిశ్వాసములు విడుస్తున్న వీరులతో
హ్రదో నిఃశ్వ్రసద్భిః భుజంగైరివ రరాజ -
బుసలు కొట్టుచున్న సర్పములుకల మడుగు వలె రాజిల్లు చుండెను

॥శ్లోకతాత్పర్యము॥

"ఆ నగరము ఘీంకరించుచున్న మహాగజములతోనూ, పూజనీయులైనవారితో మహాపురుషులతోనూ ప్రకాశించుచున్నది. దీర్ఘనిశ్వాసములు విడుస్తున్న వీరులతో బుసలు కొట్టుచున్న సర్పములుకల మడుగు వలె రాజిల్లు చుండెను." ॥5.14॥

గోవిన్దరాజా తమ టీకాలో- వినిఃశ్వసద్భిః వీరైః - యుద్ధయోగ్యవీర అలాభాత్ వీరైః అంటారు. అంటే యుద్దము చేయ కోరికగల వీరులు , యుద్ధము కు అవకాశము లేకపోవడము వలన నిట్టుర్పులు విడిస్తున్నారు అని భావము

॥శ్లోకము 5.15॥

బుద్ధి ప్రధానాన్ రుచిరాభిదానాన్
సంశ్రద్ధధానాన్ జగతః ప్రధానాన్|
నానావిధాన్ రుచిరాభిదానాన్
దదర్శ తస్యాం పురియాతుధానాన్||5.15||

స|| తస్యామ్ పురీమ్ జగతః ప్రధానాన్ బుద్ధిప్రధానాన్ రుచిరాభిదానాన్ సంశ్రద్ధధానాన్ నానా విధానాన్ రుచిరాభిధానాన్ యాతుధానాన్ దదర్శ||

॥శ్లోకార్థములు॥

బుద్ధిప్రధానాన్ రుచిరాభిదానాన్ -
బుద్ధిమంతులను మనోహరముగా మాట్లాడు వారును
సంశ్రద్ధధానాన్ నానా విధానాన్ జగతః ప్రధానాన్ -
శ్రద్ధకలవారిని అనేక విధములుగా జగత్తులో ప్రధానులను
రుచిరాభిధానాన్ యాతుధానాన్ దదర్శ-
మంచి నామధేయములతో వున్న రాక్షసులను
తస్యామ్ పురీమ్ దదర్శ - ఆ నగరములో చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"బుద్ధిమంతులను మనోహరముగా మాట్లాడు వారును, శ్రద్ధకలవారిని అనేక విధములుగా జగత్తులో ప్రధానులను, మంచి నామధేయములతో వున్న రాక్షసులను ఆ నగరములో చూచెను." ॥5.15॥

రామ తిలక టీకాలో- బుద్ధిప్రధానాన్ అతిబుద్ధిమతః; రుచిరాభిదానాన్ శోభనవచనాన్; సంశ్రద్ధదానాన్ గురువాక్యాదౌ విశ్వాసయుక్తాన్ ; జగతః ఇతస్తతో గచ్ఛతః నానావిధాన్ యేషామ్ తాన్ ; రుచిరాభిదానాన్ శోభననామ యుక్తాన్ ; ప్రధానాన్ యాతుధానాన్ తస్యాం లంకాయాం దదర్శ॥ ఇక్కడ అర్థ తాత్పర్యాలు దీనికి అనుగుణముగా వున్నాయి

॥శ్లోకము 5.16॥

ననన్ద దృష్ట్వా స చ తాన్ సురూపాన్
నానాగుణానాత్మగుణానురూపాన్ |
విద్యోతమానాన్ స తదానురూపాన్
దదర్శ కాంశ్చిచ్చపునర్విరూపాన్||5.16||

స|| సః సురూపాన్ నానాగుణాన్ ఆత్మగుణానురూపాం విద్యోతమానాన్ తాన్ దృష్ట్వా సః ననంద | తదా కశ్చిత్ విరూపాన్ అనురూపాన్ చ దదర్శ ||

॥శ్లోకార్థములు॥

సురూపాన్ నానాగుణాన్ - మంచిరూపము గుణములతో
ఆత్మగుణానురూపాం విద్యోతమానాన్-
తమగుణములకు అనుగణముగా ప్రవర్తిస్తున్న
తాన్ దృష్ట్వా సః ననంద - వారిని చూచి ఆనందపడెను
తదా కశ్చిత్ విరూపాన్ - అలాగే కొంతమంది వికృతరూపముగల
అనురూపాన్ చ దదర్శ - వారి రూపానుసారము ప్రవృత్తులుకల వారిని చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

" హనుమంతుడు మంచిరూపము గుణములతో తమగుణములకు అనుగణముగా ప్రవర్తిస్తున్న వారిని చూచి ఆనందపడెను. అలాగే కొంతమంది వికృతరూపముగల వారి రూపానుసారము ప్రవృత్తులుకల వారిని చూచెను." ॥5.16॥

॥శ్లోకము 5.17॥

తతో వరార్హాః సువిశుద్ధభావాః
తేషాం ప్రియః తత్ర మహానుభావాః|
ప్రియేషు పానేషు చ సక్తభావా
దదర్శ తారా ఇవ సుప్రభావాః||5.17||

స|| తతః తత్ర వరార్హాః విశుద్ధభావాః మహానుభావాః ప్రియేషు పానేషు సక్తభావాః సుప్రభావాః చ దదర్శ| తేషాం తారా ఇవ స్త్రియః దదర్శ||

॥ శ్లోకార్థములు॥

తతః తత్ర వరార్హాః -
అప్పుడు అక్కడ శ్రేష్టమైన ఆభరణములతో ఉత్తమోత్తమ రూపము గలవారిని,
విశుద్ధభావాః -
శుద్ధమైన అంతఃకరణము కలవారిని
మహానుభావాః -
మహా పతివ్రతలను
ప్రియేషు పానేషు సక్తభావాః చ దదర్శ-
ప్రియులయందు పానమునందు ఆసక్తి కలవారిని చూచెను
తేషాం తారా ఇవ స్త్రియః దదర్శ-
వారిలో తారలవలె ప్రకాశిస్తున్నవారిని కూడా చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"అప్పుడు అక్కడ శ్రేష్టమైన ఆభరణములతో ఉత్తమోత్తమ రూపము గలవారిని, శుద్ధమైన అంతఃకరణము కలవారిని, గొప్ప పతివ్రతలను, ప్రియులయందు పానమునందు ఆసక్తి కలవారిని చూచెను. వారిలో తారలవలె ప్రకాశిస్తున్నవారిని కూడా చూచెను." ॥5.17॥

స్త్రీలలో మహానుభావాః అంటే - మహానుభావాః పాతివ్రత్య రూపమహప్రభావాః;

॥శ్లోకము 5.18॥

శ్రియాజ్వలంతీ స్త్రపయోప గుఢా
యథా విహఙ్గాః రమణోపగూఢాః |
దదర్శ కాశ్చిత్ప్రమదోపగూఢాః
యథా విహఙ్గాః కుసుమోపగూఢాః ||5.18||

స|| నిశీథకాలే ఉపగూఢాః శ్రియా జ్వలంతీః త్రపయా తథైవ రమణోపగూఢాః కాశ్చిత్ కుసుమోపగూఢాః ప్రమదోపగూఢః విహంగాః యథా (స్త్రియః) దదర్శ||

॥శ్లోక తాత్పర్యము॥

నిశీథకాలే ఉపగూఢాః -
రాత్రిసమయములో ప్రియులకౌగిళ్ళలో
త్రపయా శ్రియా జ్వలంతీః -
సిగ్గుతో కాంతివంతముగా ప్రకాశిస్తూ (వున్నవారిని)
తథైవ రమణోపగూఢాః కుసుమోపగూఢాః కాశ్చిత్ -
అలాగే పుష్పములతో అలంకరింపబడి కౌగిళ్ళలో మునిగివున్న కొందరు
ప్రమదోపగూఢాః విహంగాః యథా దదర్శ -
సంతోషములోమునిగివున్న విహంగములవలెకనపడిరి

॥శ్లోకతాత్పర్యము॥

"రాత్రిసమయములో ప్రియులకౌగిళ్ళలో సిగ్గుతో కాంతివంతముగా ప్రకాశిస్తూ వున్నవారిని, పుష్పములతో అలంకరింపబడి ప్రియుల కౌగిలింతలలో మునిగివున్న కొందరు, సంతోషములో మునిగి వున్న విహంగముల వలె కనపడిరి." ॥5.18॥

రామ తిలక టీకాలో - రూపాది సంపత్యా జ్వలన్తీః ప్రకాశమానాః; త్రపయా లజ్జాయా ఉపగూఢాః; రమణోపగూఢాః పత్యాలింగతాః అత ఏవ ప్రమదోపగూఢాః; ఇతి; అని చెప్పబడినది.

॥శ్లోకము 5.19॥

అన్యాః పునర్హత్మ్యతలోపవిష్టాః
తత్ర ప్రియాఙ్కేషు సుఖోపవిష్టాః |
భర్తుః ప్రియా ధర్మ పరా నివిష్టా
దదర్శ ధీమాన్మదనాభి విష్టాః||5.19||

స|| ధీమాన్ ( హనుమాన్) హర్మ్యతలోపవిష్టాః ప్రియాంగేషు సుఖోపవిష్టాః ప్రియాః మదనాభివిష్టాః అన్యాః భర్తుః ధర్మపరాః నివిష్టాః దదర్శ||

॥శ్లోకార్థములు॥

హర్మ్యతలోపవిష్టాః ప్రియాంగేషు సుఖోపవిష్టాః -
మేడల పైభాగాలలో ప్రియుల ఒడిలో సుఖముగా కూర్చుని ఉన్నవారు
ప్రియాః మదనాభివిష్టాః -
రతిక్రీడలలో మునిగి ఉన్న ప్రియులు,
అన్యాః భర్తుః నివిష్టాః ధర్మపరాః -
ఇంకొందరు ధర్మపరమైన భర్త ప్రేమలో మునిగియున్నవారిని
దదర్శ- చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"కొందరు స్త్రీలు మేడల పైభాగాలలో ప్రియుల ఒడిలో సుఖముగా కూర్చుని ఉన్నారు. మరికొందరు స్త్రీలు కామావేశములో రతిక్రీడలలో మునిగి ఉన్నారు. ఇంకొందరు ధర్మపరమైన భర్త ప్రేమలో మునిగియున్నవారిని హనుమ చూచెను." ॥5.19॥

॥శ్లోకము 5.20॥

అపావృతాః కాఞ్చనరాజివర్ణాః
కాశ్చిత్పరార్థ్యాః తపనీయవర్ణాః|
పునశ్చ కాశ్చిచ్చశలక్ష్మవర్ణాః
కాంత ప్రహీణా రుచిరాఙ్గవర్ణాః||5.20||

స|| అపావృతాః కాంచనరాజివర్ణాః కాశ్చిత్ పరార్థ్యాః తపనీయవర్ణాః పునశ్చ కాశ్చిత్ కాన్తప్రహీణాః శశలక్ష్మవర్ణాః కాశ్చిత్ రుచిరాంగ వర్ణాః (దదర్శ)||

॥శ్లోకార్థములు॥

అపావృతాః కాంచనరాజివర్ణాః -
వస్త్ర విహీనులై బంగారు తీగెల వన్నెలో ఉన్నవారు
కాశ్చిత్ పరార్థ్యాః తపనీయవర్ణాః -
అత్యంత ఆనందము అందించగల మరికొందరు పుటం పెట్టిన బంగారు వర్ణంలో ఉన్నారు
పునశ్చ కాశ్చిత్ కాన్తప్రహీణాః శశలక్ష్మవర్ణాః -
వియోగములో వున్న మరి కొందరు చంద్రునిలో మచ్చరంగువలె వర్ణము కలవారు ఉన్నారు.
కాశ్చిత్ రుచిరాంగ వర్ణాః -
మరికొందరు అందమైన వర్ణకాంతి కలవారు వున్నారు

॥శ్లోకతాత్పర్యము॥

"కొందరు స్త్రీలు వస్త్ర విహీనులై బంగారు తీగెల వన్నెలో ఉన్నారు. అత్యంత ఆనందము అందించగల స్త్రీలు మరికొందరు పుటం పెట్టిన బంగారు వర్ణంలో ఉన్నారు. వియోగములో వున్న మరి కొందరు చంద్రుని లో మచ్చరంగువలె వర్ణము కలవారు ఉన్నారు. మరికొందరు అందమైన వర్ణకాంతి కలవారు వున్నారు." ॥5.20॥

రామ తిలక లో - అపావృతాః కాన్తప్రహీణాః పతిరహితాః అతఏవ కాంచనరాజివర్ణాః సువర్ణ రేఖా సదృశీః; పరార్థ్యా అత్యుత్తమాః తపనీయ వర్ణాః సువర్ణసదృశవర్ణవిశిష్ఠాః ఇతి|


॥శ్లోకము 5.21॥

తతః ప్రియాన్ప్రాప్య మనోభిరామాః
సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః|
గృహేషు హృష్టాః పరమాభిరామాః
హరిప్రవీరః స దదర్శ రామాః||5.21||

స|| హరిప్రవీరః తతః గృహేషు ప్రియాన్ ప్రాప్య మనోభిరామాః సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్యరామాః పరమాభిరామాః హృష్టాః సః దదర్శ ||

॥శ్లోకార్థములు॥

ప్రియాన్ ప్రాప్య మనోభిరామాః -
ప్రియుని పొంది పొంగి పోయిన మనస్సు కలవారిని
సుప్రీతియుక్తాః ప్రసమీక్ష్య రామాః -
పూర్తిగా ప్రీతి పొందిన వారిని, చూచుటకు అందముగా వున్నవారిని
పరమాభిరామాః హృష్టాః -
అతి సంతోషముతో అందముగా వున్నవారిని
సః హరిప్రవీరః తతః గృహేషు దదర్శ -
ఆ హరిప్రవీరుడు ఆ గృహములలో చూచెను

॥శ్లోకతాత్పర్యము॥

"అక్కడ గృహములలో ప్రియుని పొంది పొంగి పోయిన మనస్సు కలవారిని, పూర్తిగా ప్రీతి పొందిన వారిని, చూచుటకు అందముగా వున్నవారిని, సంతోషములో మునిగి వున్నవారిని హనుమ చూచెను." ॥5.21॥

॥శ్లోకము 5.22॥

చన్ద్రప్రకాశశ్చ హి వక్త్రమాలాః
వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః|
విభూషణానాంచ దదర్శ మాలాః
శతహ్రదానామివ చారుమాలాః||5.22||

స|| చంద్రప్రకాశాః వక్త్రమాలాశ్ఛ వక్రాక్షిపక్ష్మాశ్చసునేత్రమాలాః శతహ్రదానామ్ చారుమాలాః విభూషణానామ్ మాలాః చ ||

॥శ్లోకార్థములు॥

చన్ద్రప్రకాశశ్చ హి వక్త్రమాలాః -
చంద్రుని వలె ప్రకాశిస్తున్న ముఖాల వరుసలు
వక్రాక్షిపక్ష్మాశ్చ సునేత్రమాలాః -
వంకరగా వున్న కనురెప్పలగల అందమైన నేత్ర పంక్తులు
శతహ్రదానాం మాలా ఇవ -
మెరపుల యొక్క మాలలవలె
విభూషణానాం చ చారుమాలాః -
భూషణ అలంకారాల వరుసలు
దదర్శ - చూసెను

॥శ్లోకతాత్పర్యము॥

"చంద్రుని వలె ప్రకాశిస్తున్న ముఖాల వరుసలు, వంకరగా వున్న కనురెప్పలగల అందమైన నేత్ర పంక్తులు, మెరపుల యొక్క మాలలవలె నున్న అలంకారాల వరుసలు, అక్కడ హనుమకు కనిపించాయి." ॥5.22॥

॥శ్లోకము 5.23॥

నత్వేవ సీతాం పరమాభిజాతామ్
పథిస్థితే రాజకులే ప్రజాతామ్|
లతాం ప్రపుల్లామివ సాధుజాతామ్
దదర్శ తన్వీం మనసాభిజాతామ్||5.23||

స|| (పరంతు) రాజకులే ప్రజాతామ్ పరమాభిజాతామ్ సాధు జాతాం మనసాభిజాతామ్ ప్రఫుల్లాం లతాం ఇవ తన్వీం పథి స్థితే సీతాం న దదర్శ||

॥శ్లోకార్థములు॥

పథి స్థితే రాజకులే ప్రజాతామ్ -
ధర్మ మార్గములో వుండి రాజకులములో జన్మించిన
పరమాభిజాతామ్ - సౌందర్యవతి అయిన
సాధు జాతాం - సురూపము కలిగిన
మనసాభిజాతామ్ - సంకల్పమాత్రముచేతనే జనించిన
ప్రఫుల్లాం లతాం ఇవ తన్వీం - బాగుగా ఎదిగి విరాజిల్లు పూదీగ మల్లె కోమలశరీరము కల
సీతాం న దదర్శ - సీతా దేవి కానరాలేదు

॥శ్లోకతాత్పర్యము॥

"ధర్మమార్గములో వుండి రాజకులములో జన్మించిన, సౌందర్యవతి అయిన, సురూపము కలిగిన, సంకల్పమాత్రముచేతనే జనించిన, బాగుగా ఎదిగి విరాజిల్లు పూదీగ మల్లె కోమలశరీరము కల సీతా దేవి కానరాలేదు." ॥5.23॥

గోవిన్దరాజ టీకాలో - పరమాభిజాతామ్ అత్యన్తాభిరామమ్ ; సాధుజాతాం సురూపామ్; మనసాభిజాతామ్ అయోనిజాం ఇత్యర్థః - అంటారు.

రామ తిలక టీకాలో - మనసాభిజాతామ్ - మనసా పరమాత్మ సంకల్ప మాత్రేణ; పథి స్థితే - పథి సనాతన ధర్మ మార్గే స్థితే; అంటారు

॥శ్లోకము 5.24॥

సనాతనే వర్త్మని సన్నివిష్టామ్
రామేక్షణాం తాం మదనాభివిష్టామ్|
భర్తుర్మనః శ్రీమదనుప్రవిష్టామ్
స్త్రీభ్యో వరాభ్యశ్చ సదా విశిష్టామ్||5.24||

స|| సనాతనే వర్త్మని సన్నివిష్టాం రామేక్షణాం శ్రీమత్ భర్తుః మనః మదనాభివిష్టాం వరాభ్యః స్త్రీభ్యశ్చ అనుప్రవిష్టాం విశిష్టాం తాం న దదర్శ||

॥శ్లోకార్థములు॥

సనాతనే వర్త్మని సన్నివిష్టాం -
ప్రాచీనమైన పాతివ్రత్య ధర్మమున నిరతురాలు
రామేక్షణాం - రామునియందే దృష్టి కల,
శ్రీమత్ భర్తుః మనః అనుప్రవిష్టాం -
రాముని హృదయములో స్థిరముగా నిలిచియున్న ,
వరాభ్యః స్త్రీభ్యశ్చ విశిష్టాం - స్త్రీలలో శ్రేష్ఠులలో ఉత్తమురాలైన
మదనాభివిష్టాం - ప్రియుని వియోగములో దైన్య స్థితిలో వున్న
తాం న దదర్శ - ఆమెను చూడలేదు

॥శ్లోకతాత్పర్యము॥

"ప్రాచీనమైన పాతివ్రత్య ధర్మమున నిరతురాలు, రామునియందే దృష్టి కల, రాముని హృదయములో స్థిరముగా నిలిచియున్న, ప్రియుని వియోగములో దైన్య స్థితిలో వున్న, శ్రేష్ఠులలో ఉత్తమురాలైన సీత మాత్రము కానరాలేదు." ॥5.24॥

రామ తిలక టీకాలో - మదనాభివిష్టాం - మదన వియోగే ప్రాప్త దైన్యే అభివిష్ఠాం ఇతి| అంటే ప్రియుని వియోగములో దైన్య స్థితిలో వున్నఅమె అని.

॥శ్లోకము 5.25॥

ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం
పురా వరార్హోత్తమ నిష్కకంఠీమ్|
సుజాతపక్ష్మామభిరక్తకంఠీమ్
వనే ప్రవృత్తామివ నీలకంఠీమ్||5.25||

స|| ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం పురా వరార్హోత్తమ నిష్కకంఠీం సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం వనే అప్రవృత్తాం నీలకంఠీం ఇవ తన్వీం (తాం న దదర్శ)

ఉష్ణార్దితాం సానుసృతాస్రకంఠీం -
విరహతాపము చే పీడితురాలై నిరంతరము కంఠములో భాష్పములు కలది
పురా వరార్హోత్తమ నిష్కకంఠీం -
పూర్వము కంఠమున అమూల్యమైన నిష్క్రము అనబడు ఆభరణము ధరించినది,
సుజాత పక్ష్మాం అభిరక్త కంఠీం -
అందముగావున్న కనురెప్పలు కలది, మధురమైన కంఠస్వరము కలది,
వనే అప్రవృత్తాం నీలకంఠీం ఇవ -
వనములో నాట్యము చేయని ఆడు నెమలి వలెనున్న

॥శ్లోకతాత్పర్యము॥

"విరహతాపము చే పీడితురాలై నిరంతరము కంఠములో భాష్పములు కలది, పూర్వము కంఠమున అమూల్యమైన నిష్క్రము అనబడు ఆభరణము ధరించినది, అందముగావున్న కనురెప్పలు కలది, మధురమైన కంఠస్వరము కలది, వనములో నాట్యము చేయని ఆడు నెమలి వలెనున్న సీత మాత్రము కాన రాలేదు." ॥5.25॥

రామతిలక టీకాలో - ఉష్ణార్దితాం వియోగ జనిత తాప పీడితామ్; విరహతాపము చే పీడితురాలైన ఆమె అని

॥శ్లోకము 5.26॥

అవ్యక్త రేఖామివ చంద్ర రేఖామ్
పాంసుప్రదిగ్ధా మివ హేమరేఖామ్|
క్షతప్రరూఢా మివ బాణరేఖామ్
వాయుప్రభిన్నామివ మేఘ రేఖామ్||5.26||

స|| అవ్యక్త రేఖాం చంద్రరేఖామివ పాంసుప్రదిగ్ధాం హేమ రేఖాం ఇవ క్షతప్రరూఢాం బాణరేఖామివ వాయుప్రభిన్నాం మేఘరేఖామివ (స రామ పత్నీం న దదర్శ)

అవ్యక్త రేఖాం చంద్రరేఖామివ -
అస్పష్ఠమైన మైన చంద్ర రేఖవలె నున్న
పాంసుప్రదిగ్ధా మివ హేమరేఖామ్ -
కాంతి తరిగి దుమ్ము చే కప్పబడిన బంగారు కడ్డీవలె నున్న
క్షతప్రరూఢాం బాణరేఖామివ -
గాయమై అది మానిపోయినాదాని గుర్తుగా ఏర్పడిన రేఖవలె నున్న
వాయుప్రభిన్నాం మేఘరేఖామివ -
వాయువుచే చెదరుకొట్టబడిన మేఘములవలె నున్న

॥శ్లోకతాత్పర్యము॥

"అస్పష్ఠమైన మైన చంద్ర రేఖవలె నున్న, కాంతి తరిగి దుమ్ము చే కప్పబడిన బంగారు కడ్డీవలె నున్న, గాయమై అది మానిపోయినాదాని గుర్తుగా ఏర్పడిన రేఖవలె నున్న, వాయువుచే చెదరుకొట్టబడిన మేఘములవలె నున్న సీత మాత్రము హనుమకి కనపడలేదు." ॥5.26॥

॥శ్లోకము 5.27॥

సీతామపశ్యన్ మనుజేశ్వరస్య
రామస్య పత్నీం వదతాం వరస్య|
బభూవ దుఃఖాభిహతః శిరస్య
ప్లవఙ్గమో మంద ఇవా చిరస్య ||5.27||

స|| వదతాం వరస్య మనుజేశ్వరస్య రామస్య పత్నీం అచిరస్య అపశ్యన్ ప్లవంగమః దుఃఖాభిహితః చిరస్య మంద ఇవ బభూవ||

వదతాం వరస్య మనుజేశ్వరస్య -
యుక్తియుక్తముగా మాట్లాడుటలో నేర్పరి అయిన , మానవులకు రాజు అయిన
రామస్య పత్నీం అచిరస్య అపశ్యన్ -
రాముని యొక్క భార్యని చాలాసేపు వెదికినప్పటికీ కారాకపోవడము చేత
ప్లవంగమః దుఃఖాభిహితః - హనుమ అమిత దుఃఖముతో
చిరస్య మంద ఇవ బభూవ - మందబుద్ధి కలవాని వలె అయ్యెను

॥శ్లోకతాత్పర్యము॥

"యుక్తియుక్తముగా మాట్లాడుటలో నేర్పరి అయిన , మానవులకు రాజు అయిన, రాముని యొక్క భార్యని చాలాసేపు వెదికినప్పటికీ కారాకపోవడము చేత హనుమ అమిత దుఃఖముతో మందబుద్ధి కలవాని వలె అయ్యెను."॥5.27॥

ఇక్కడ అన్వేషణలో హనుమ చింతాక్రాంతుడయ్యాడన్నమాట. దీని వెనుక అంతరార్థము కొంచెము చూద్దాము

సుండరకాండలో మూడు భాగములు వున్నాయి.

- అన్వేషణము
- దర్శనము
- విరోధి నిరసము

హనుమ సీతమ్మను వెదుకును, దర్శించును. అమెకు విరోధులైన వారిని హతమార్చును.

అదేవిధముగా జీవుడు ఆత్మను వెదుకును, దర్శించును. ఆత్మనిరోధులగు పాపములను నశింపచేయును.

ఉపనిషత్తులలో ఒక మాట చెప్పబడినది. " సో అన్వేష్టవ్యః" - అంటే "సః అన్వేష్టవ్యః" - అంటే "అతడు అన్వేషింపతగినవాడు" అని

ఏవడు? ఆ భగవంతుడు అన్వేషింప తగిన వాడు. అంటే పరమాత్మగురించి అన్వేషింపవలెను అని. అలాగే , ఆత్మ కూడా "అన్వేష్టవ్యః" అంటే అన్వేషింప తగినది.

ఈ అన్వేషణలో హనుమంతుడు ముఖములు నేత్రములు ఆభరణములను చూస్తూ ఉన్నట్లుచెప్పడమైనది. భగవత్ప్రాప్తికి యోగ్యులగువారి ముఖములో సౌమ్యత కనపడును. సౌమ్యత ఉన్నప్పుడే అవగాహన ఎక్కువ అవుతుంది.
అత్మాన్వేషణ కుదురుతుంది.

కన్నులయందు భగవద్విషయము వినినప్పుడు వికసించుట కనపడును. కన్ను జ్ఞానమునకు సూచకము. ఆ జ్ఞానము భవద్విషయమై ఉన్నపుడు - అదే కంటికి అందము. ఈ శరీరానికి ఆభరణాలు శమదమాది గుణములు

ఈ మూడూ సౌమ్యత, భవద్విషయమైన జ్ఞానము, శమ దమాది గుణములు ఉన్నవారే ముముక్షువులుగా గురువులచేత స్వీకరింపబడతారు.

ఈ సర్గలో చివరి వాక్యములో, 'పవనాత్మజుడు దుఃఖముతో కొంతకాలము నిరాశా నిశ్పృహలకు లోనయ్యెను', అని వింటాము. హనుమ సీతాన్వేషణలో అందమైన సన్నివేశములు ఎన్నిటినో చూసెను. కాని అతని మనస్సుకి సుఖము కలగలేదు.
చివరికి ఆ సీత కనపడక పోవడముతో దుఃఖమే కలిగెను.

ఆత్మాన్వేషణలో కూడా అందమైన అనుభూతులను పొందిననూ, ఆ ఆత్మాన్వేషణలో వున్నవారు ఆనందములతో ఆగిపోరు. అత్మదర్శనము కాలేదే అని దుఃఖించుచుందురు. అదే హనుమంతుని దుఃఖము కూడా.

అదే మాట తో ఈ ఐదవ సర్గ సమాప్తము అవుతుంది.

ఇత్యార్షే శ్రీమద్రామాయణే ఆదికావ్యే వాల్మీకీయే
చతుర్వింశత్ సహస్రికాయాం సంహితాయామ్
శ్రీమత్సుందరకాండే పంచమస్సర్గః ||

ఈ విధముగా వాల్మీకి రామాయణములో సుందరకాండ లో ఐదవ సర్గ సమాప్తము.

||ఓమ్ తత్ సత్||

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 


||ఓమ్ తత్ సత్||